పనామా పేపర్స్: అమెరికా ఫైనాన్స్ ప్రయోజనాలే లక్ష్యం -4


Safe haven

Safe haven

(3వ భాగం తరువాత………..)

అమెరికా ఫైనాన్స్ కంపెనీలే లబ్దిదారులు

ఒక నేరం జరిగినప్పుడు పోలీసులు లేదా నేర విచారణ సంస్థలు ఒక అంశంపై తప్పనిసరిగా దృష్టి పెడతాయి. ఆ నేరం వల్ల లబ్ది పొందేది ఎవరు? అని ప్రశ్నించుకుంటారు. ఆ ప్రశ్నకు సమాధానం దొరికితే నేర విచారణ అనేక కేసుల్లో పూర్తయి పోతుంది.

అనేకానేకానేక పరిణామాలు నిత్యం విడివిడిగా, జమిలిగా చోటు చేసుకునే ప్రపంచ కార్యరంగంలో చోటు చేసుకునే పరిణామాలకు కారణాలు కనిపెట్టడం మామూలు కంటికి కష్ట సాధ్యంగా తోస్తుంది. అనేక అంశాలు తానే కారణం అంటూ మన ముందుకు వస్తాయి; అంతలోనే అదృశ్యం అయిపోతూ ఉంటాయి. వైరుధ్యాల దృక్పథంతో చూసినప్పుడు చాలా వరకు స్పష్టత వస్తుంది. అప్పుడు కూడా కొన్ని సమాధానం దొరకని అంశాలు మిగిలిపోవచ్చు. అటువంటి సమయంలో ఇది ఎవరికి లాభం అన్న ప్రశ్న వేసుకుంటే అంతిమ సమాధానం దాపులకు చేరుకోవచ్చు. అయితే ఆ ప్రశ్న వేసుకునే ముందు ఘటనకు పూర్వ పరిణామాలపై సరైన అంచనా కలిగి ఉండడం తప్పనిసరి అవసరం. ఇటువంటి అంచనా వైరుధ్యాల దృష్టికే సాధ్యం అన్నది వేరే చెప్పనవసరం లేదు.

ఈ ప్రశ్న పనామా పేపర్స్ విషయమై వేసుకుంటే వెంటనే వచ్చే సమాధానం: అమెరికన్ బహుళజాతి ఫైనాన్స్ కంపెనీలు!

పనామా పేపర్స్ లీకేజి ఒకే ఒక గుప్త సందేశాన్ని పంపుతున్నాయి. “ఎవరైనా స్వదేశంలో పన్నులు ఎగవేయడానికి వీలుగా విదేశీ ఖాతాల్లో డబ్బు దాచుకొదలిస్తే, వాళ్ళు అవాంఛనీయ పబ్లిసిటీ, చట్టాల విచారణ నుండి భద్రంగా తప్పించుకోవాలంటే ఆ పని అమెరికా ప్రభుత్వానికి సన్నిహితులైన అమెరికన్ ఫైనాన్స్ కంపెనీల ద్వారా చేయడం మంచిది. అమెరికా గూఢచార సంస్థలు ఎన్‌ఎస్‌ఏ లేదా సి‌ఐ‌ఏ లు తేలికగా హ్యాకింగ్ చేయగల బ్రిటిష్, హాంగ్ కాంగ్ లేదా స్విస్ సంస్థలను ఆశ్రయిస్తే తగిన ఫలితం అనుభవిస్తారు” అని ఆ సందేశం సారాంశం.

రహస్యాలను అత్యంత కట్టుదిట్టంగా భద్రం చేయగల సంస్థగా పేరు పొందిన మొస్సాక్ ఫన్సెకా కంప్యూటర్లను హ్యాక్ చేయడం ద్వారా తన హ్యాకింగ్ పరిజ్ఞానం ఛేదించలేనిది లేనే లేదని అమెరికా చాటి చెప్పింది. అమెరికా కాకుండా ఇతర టాక్స్ హెవెన్ లలో డబ్బు దాచితే తన హ్యాకింగ్ కు గురి కావడం తథ్యం అని హెచ్చరించింది. ఫట్కా చట్టం ద్వారా అమెరికన్లు విదేశాలకు వెళ్లకుండా అప్పటికే నిరోధించింది. ఓ‌ఈ‌సి‌డి ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించడం ద్వారా అమెరికాలో ఖాతాల వివరాలు వెల్లడి కాబోవని ముందే ఖాయంగా హామీ ఇచ్చేసింది. హ్యాకింగ్ ద్వారా చచ్చినట్లు తన వద్దనే డబ్బు దాచుకోవాలని తీర్మానించి మరీ చెప్పింది.

పనామా పేపర్స్ పూర్వరంగాన్ని కూడా క్లుప్తంగా ప్రస్తావించుకుంటే మిస్సింగ్ లింకులు లేని సమగ్ర అవగాహనకు రాగలం. బ్రిటన్ లో ప్రస్తుతం బ్రెక్సిట్ ఫీవర్ వ్యాపించి ఉన్నది. గ్రీసు దేశం యూరో జోన్ నుండి బైటికి వెళ్లడాన్ని గ్రెక్సిట్ అన్నట్లే బ్రిటన్, యూరోపియన్ యూనియన్ నుండి బైటికి వెళ్లడాన్ని బ్రెక్సిట్ అంటున్నారు. (బ్రిటన్ యూరో జోన్ సభ్యురాలు కాదు. బ్రిటన్ కరెన్సీ ఇప్పటికీ పౌండ్ స్టెర్లింగే). యూరోపియన్ యూనియన్ లో ఆది నుండి యూరో జోన్ సెంటర్ (జర్మనీ – ఫ్రాన్స్) కూ, బ్రిటన్ కూ మధ్య వైరుధ్యాలు ఏర్పడి ఉన్నాయి. అందుకు కారణం ‘ద సిటీ’ ప్రయోజనాలే.

బ్రిటన్ సామ్రాజ్యవాద పాలకుల ప్రధాన బలం ‘ద సిటీ’ యే. ‘ద సిటీ’ బ్రిటన్ కు ఆర్ధికంగానే కాక వ్యూహాత్మకంగా కూడా పెద్ద అసెట్. ప్రపంచ ఫైనాన్స్ కార్యకలాపాలకు వాల్ స్ట్రీట్ కంటే మించిన కేంద్రం ‘ద సిటీ’. ఆయుధ బలగం వాల్ స్ట్రీట్ కు అదనపు బలం కావచ్చు గానీ ఫైనాన్స్ వరకు తీసుకుంటే అత్యధిక కార్యకలాపాలు ద సిటీ ద్వారా జరుగుతాయి. అలాంటి ‘ద సిటీ’ ఆధిపత్యం పోగొట్టుకోవడం బ్రిటిష్ పాలక వర్గాలకు ఇష్టం ఎందుకు ఉంటుంది? యూరో జోన్ లో చేరినట్లయితే సొంత కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ ను వదులుకుని యూరోను కరెన్సీగా చేపట్టాల్సి ఉంటుం ది. అలా చేస్తే ‘ద సిటీ’ ద్వారా చేకూరే ఫైనాన్స్ ఆధిపత్యాన్ని వదులుకుని జర్మనీ ఆధిపత్యానికి చోటివ్వడం అవుతుంది. ఈ కారణంతో యూరోపియన్ యూనియన్ సభ్యురాలు అయినప్పటికీ యూరో జోన్ నుండి బ్రిటన్ దూరంగా ఉంటూ వచ్చింది. ఈ కారణం వల్లనే బ్రిటన్ లో ఆది నుండి యూరో స్కెప్టిక్ లు (యూరో వల్ల ఒనగూరుతాయని చెప్పే లాభాల పట్ల అనుమాన దృక్పథంతో ఉండేవారు) గణనీయమైన శక్తిగా ఉంటూ వచ్చారు. వీళ్ళు తర తమ స్ధాయిల బలాలతో ప్రతి పార్టీలో ఉండడం ఒక విశేషం.

కాగా ఇటీవల కాలంలో UKIP (యునైటెడ్ కింగ్ డమ్ ఇండిపెండెంట్ పార్టీ) బలం పుంజుకుంది. 2004 యూరోపియన్ ఎన్నికల్లో బ్రిటన్ లో 3వ స్ధానంలో ఉన్న ఈ పార్టీ 2009 ఎన్నికల్లో 2వ స్ధానానికీ 2014 ఎన్నికల్లో మొదటి స్ధానానికి చేరుకుంది. మరోవైపు అధికార కన్సర్వేటివ్ పార్టీలో ఈ‌యూ నుండి బైటికి రావాలన్న ఒత్తిడులు పెరిగాయి. ఈ నేపధ్యంలో “మేము అధికారం లోకి వస్తే ఈ‌యూలో కొనసాగాలా లేక బైటికి రావాలా అన్న అంశంపై 2017 లోపు రిఫరెండం నిర్వహిస్తాం” అని 2015 సాధారణ ఎన్నికల్లో కామెరాన్ హామీ ఇచ్చాడు.

ఈ హామీ వాస్తవానికి ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని గ్రహించిన ఫలితం. తమ కష్టాలకు, ప్రభుత్వాలు అనుసరిస్తున్న పొదుపు విధానాలకు ఈ‌యూలో సభ్యత్వమే కారణం అని సాధారణ బ్రిటన్లు భావిస్తున్నారు. ఈ‌యూ సభ్యత్వం వల్ల ఈ‌యూ చట్టాలు, నిబంధనలకు లోబడి గ్రీసు లాంటి దివాళా తీసిన దేశాలకు నిధులు ఇవ్వాల్సి వస్తోందని భావిస్తున్నారు. యూరోపియన్ యూనియన్ పార్లమెంటు, ఈ‌సి‌బి (యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు), యూరోపియన్ కమిషన్ లాంటి సంస్థలు ఈ‌యూ సభ్య దేశాల ప్రభుత్వాలపై పెత్తనం చేస్తున్నదని, సభ్య దేశాల సార్వభౌమత్వాన్ని హరించివేస్తున్నదని ఇతర సభ్య దేశాలకు మల్లేనే బ్రిటన్ ప్రజలూ భావిస్తున్నారు. ప్రజల్లో నెలకొని ఉన్న ఈ ఆందోళనలను గ్రహించినందునే కామెరాన్ 2012లో తానే తిరస్కరించిన రిఫరెండం హామీని ఎన్నికల ముందు ఇచ్చాడు. ఆ బలంతోనే ఓట్లను కూడగట్టుకుని విజేతగా నిలిచాడు. తన హామీ మేరకు జూన్ 23, 2016 తేదీన రిఫరెండం తేదీగా ప్రకటించాడు. మంత్రుల ఒత్తిడి మేరకు ఈ ఓటింగులో స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే అవకాశం కూడా ఇచ్చాడు.

కామెరాన్ తన ఓటు ఈ‌యూలో కొనసాగడానికే అని ప్రకటించాడు. ఈ‌యూలో కొనసాగడం వల్ల లబ్ది పొందుతున్న వర్గాల ప్రయోజనాలకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ఆయన మాటలు చెబుతున్నాయి. నిజానికి ‘ద సిటీ’ ప్రయోజనాలు ఈ‌యూ లో కొనసాగడం వల్లే ఎక్కువగా నెరవేరుతాయి. ఒక వైపు యూరో జోన్ బైట ఉండడం, అమెరికాతో సన్నిహితంగా మెలగడం ద్వారా ఈ‌యూ కోర్ రాజ్యాల నుండి మెరుగైన వ్యాపార లాభాలను ఆర్జించడం, మరో వైపు ఈ‌యూ సభ్యత్వం ద్వారా కేంద్రీకృత ఉమ్మడి బేరసరాల శక్తిలో తగిన భాగం పొందడం బ్రిటన్ అనుసరిస్తున్న ఎత్తుగడ. ఈ బ్రిటన్ ద్వంద్వ విధానం ద్వారా అమెరికా సైతం లాభం పొందింది. ఇరాన్ పై ఆంక్షలు విధించాలన్నా, లిబియా, సిరియాలపై ప్రత్యక్ష, పరోక్ష యుద్ధాలకు నిధులు పొందాలన్నా, ఉక్రెయిన్ గేమ్ లో రష్యా వ్యతిరేక ఆంక్షలు విధించాలన్నా అమెరికాకు ఐరోపా నుండి మద్దతు లభించేలా చేయడంలో బ్రిటన్ కీలక పాత్ర పోషించింది. కానీ మారుతున్న పరిస్ధితుల్లో జర్మనీ నేతృత్వంలో బలం పుంజుకుంటున్న ఐరోపా, బలహీన పడుతున్న అమెరికాకు సవాలుగా మారుతోందని అమెరికా అనుమానిస్తోంది.

అది నిజమేనా అన్నట్లుగా బ్రిటన్ సైతం అమెరికా ఆదేశాలను కొన్నింటిని తిరస్కరిస్తోంది. ఉదాహరణకు చైనా తాను సొంతంగా స్థాపించిన ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు (ఏ‌ఐ‌ఐ‌బి) లో సభ్యత్వం కోసం బ్రిటన్ తో సహా ఐరోపా రాజ్యాలు ఉరుకులు పరుగులు తీసాయి. ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలో మౌలిక నిర్మాణాలకు ఫైనాన్స్ వనరులు సమకూర్చే ఉద్దేశ్యంతో ఈ బ్యాంకును చైనా నెలకొల్పింది. ఈ ఫైనాన్స్ ద్వారా ఆసియా-పసిఫిక్ లో దేశాలపై ఆర్ధికంగా పట్టు సాధించడం చైనా లక్ష్యం. ఇందులో సభ్యత్వం అంటే చైనా పై చేయి సాధించడానికి ఏదో మేరకు అంగీకరించినట్లే. తరువాత పరిణామాలు ఎటువైపన్నా దారి తీయవచ్చు గాక! ఏ‌ఐ‌ఐ‌బిలో చేరవద్దని అమెరికా బ్రిటన్ బహిరంగంగానే హెచ్చరించింది. ఐనా బ్రిటన్ వినలేదు. అమెరికా హెచ్చరికలను పెడచెవిన పెట్టి ఏ‌ఐ‌ఐ‌బి వ్యవస్ధాపక సభ్య దేశంగా చేరుతున్నట్లు ప్రకటించింది.

ఆ వెంటనే జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ లు కూడా ఏ‌ఐ‌ఐ‌బిలో చేరుతున్నట్లు ప్రకటించాయి. మరో మినీ ఫైనాన్స్ సెంటర్ లక్సెంబర్గ్ సైతం దరఖాస్తు చేసుకుంది. సరిగ్గా సం. క్రితం జరిగిన ఈ పరిణామాలు అమెరికాకు దౌత్యపరంగా తగిలిన గట్టి దెబ్బ. తన ‘ప్రత్యేకతత్వం’ (exceptionalism) గురించి పదే పదే చెప్పుకునే అమెరికాకు ఇది మొఖం మీదే చాచి కొట్టినట్లు ఎదురైన పరిణామం. అమెరికా ఆధిపత్యం లోని ప్రపంచ బ్యాంకుకు పోటీగానే ఏ‌ఐ‌ఐ‌బి స్థాపన జరిగిందన్నది బహిరంగ రహస్యం. అంతకు సం. మునుపే న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ (బ్రిక్స్ బ్యాంక్), కంటింజెన్సీ రిజర్వ్ అరేంజ్ మెంట్ (సి‌ఆర్‌ఏ – ఐ‌ఎం‌ఎఫ్ కు పోటీఅని విశ్లేషించబడిన సంస్థ) లను బ్రిక్స్ కూటమి స్థాపించిన నేపధ్యంలో ఏ‌ఐ‌ఐ‌బి ఏర్పాటు అటు అమెరికాకు, ఇటు జపాన్ కు గట్టి సవాలు విసిరింది.

పనామా పేపర్స్ ద్వారా ఈ కదలికలకు అడ్డుకట్ట వేయడానికి అమెరికా సాధనాలను సమకూర్చుకుంది. బ్రిటిష్ ఫైనాన్స్ సెంటర్ ద్వారా సేవలు పొందుతున్న అంతర్జాతీయ కస్టమర్లను తమ సొమ్ము ద సిటీ నుండి అమెరికాకు తరలించాలని సందేశం పంపినట్లు పైన చూశాం. అదే తరహాలో చైనా పంచన చేరడం ద్వారా తనకు జెల్ల కొట్టాలని తలపెడితే తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా ద సిటీ కి ‘పనామా పేపర్స్’ ద్వారా అమెరికా హెచ్చరిక పంపుతోంది. ద సిటీ ప్రాభవాన్ని క్షీణింపజేయడం అమెరికాకు స్వల్ప కాలికంగా నష్టకరమే. అయితే బహుళ ధృవ ప్రపంచ స్థిరపడుతున్న దశలో అమెరికా గట్టి ప్రతిఘటన ఇవ్వడానికి తన ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడానికి తగిన ఉపకరణాలను సమకూర్చుకుంటోంది. ఆ ఉపకరణాల్లో పనామా పేపర్స్ శక్తివంతమైనదిగా అమెరికాకు ఉపయోగపడనుంది. వ్యక్తిగత కస్టమర్లు, సంస్థాగత కస్టమర్లతో పాటు దేశాలను కూడా బ్లాక్ మెయిల్ చేసేందుకు ఆయుధాన్ని అమెరికా సమకూర్చుకుంది.

ఈ ఆయుధాన్ని విచ్చలవిడిగా అందరికీ తెలిసేట్లు అమెరికా ప్రయోగిస్తుందని భావించరాదు. ఆ అవసరం వస్తే అందుకు కూడా అమెరికా వెనుకాడదు. కానీ సమీప భవిష్యత్తులో బ్రిటన్, ఈ‌యూల ద్వారా నెరవేర్చుకోవాల్సిన ప్రయోజనాలు అమెరికాకు మిక్కిలిగానే ఉన్నాయి. కనుక బహిరంగ విచ్చలవిడి బ్లాక్ మెయిలింగ్ అమెరికాకే ఎదురు తిరుగుతుంది. తక్షణ, దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుంటూ ప్రతికూల పరిణామాలను సానుకూలంగా మార్చుకునే లక్ష్యంతో పనామా పేపర్స్ లోని గుట్టును అమెరికా ప్రయోగిస్తుంది. ఫలానా పరిణామం వెనుక పనామా పేపర్స్ పని చేశాయన్న సంగతే బైటపడక పోవచ్చు. కానీ చరిత్రలో ఎన్నడూ ఎరుగని రీతిలో ఎలాంటి ఖర్చుకు తావు లేని బ్రహ్మాండమైన ఆయుధాన్ని అమెరికా చేబూనిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పనామా పేపర్స్ లో ఇప్పటి వరకు వెల్లడి చేసిన వివరాల కంటే దాచి పెట్టిన వివరాలే అసలు సంగతి పట్టిస్తాయని పలువురు విశ్లేషకులు చెప్పడం ఈ నేపధ్యం లోనే. ఒక్క బ్రిటన్ మాత్రమే కాదు. పనామా పేపర్స్ లోని వివరాలను బట్టి ఇతర ఐరోపా రాజ్యాలను కూడా తన కనుసన్నల్లో ఉంచుకునే అవకాశాన్ని అమెరికా సమకూర్చుకుంది. అమెరికా చేతిలోని ఈ ఆయుధానికి విరుగుడుగా ఐరోపా రాజ్యాలు తీసుకోగల చర్యలు ఉన్నప్పటికీ అవి వెనువెంటనే సాధ్యం అయ్యేవి కావు. సాధ్యం అయే లోపు అమెరికా తన ప్రయోజనాలు సాధించుకునేందుకు ప్రయత్నిస్తుందనడంలో అనుమానం లేదు.

‘పనామా పేపర్స్’ లీక్ ను కొంతమంది వికీలీక్స్ తో పోల్చుతున్నారు. అది పొరబాటు పరిశీలన. వికీ లీక్స్ స్వతంత్ర సంస్థ. ఏ రాజ్యంతోనూ సంబంధం లేని సంస్థ. ప్రభుత్వాలు ముఖ్యంగా అమెరికా, ఐరోపా తదితర రాజ్యాలు గుట్టుగా సాగిస్తున్న మోసపూరిత వ్యాపారాలను, ప్రజలకోసం-ప్రజాస్వామ్యం కోసం అన్న ముసుగులో సాగిస్తున్న ఆధిపత్య విధానాలను ప్రజలకు వెల్లడి చేసి వారిని చురుకైన చర్యల వైపుకు ప్రేరేపించడం వికీ లీక్స్ లక్ష్యం. వ్యాసంలో పేర్కొన్నట్లుగా ఐ‌సి‌ఐ‌జే అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీల నిధులతో ఏర్పాటు చేసిన ప్రజా వ్యతిరేక సంస్థ. ఐ‌సి‌ఐ‌జే కీ వికీ లీక్స్ కీ అసలు పొంతనే లేదు.

జులియన్ ఆసాంజే లీక్ చేసిన వివరాల పర్యవసానంగా ఆయనను జూన్ 2012 నుండి గత నాలుగేళ్లుగా లండన్ లోని ఈక్వెడార్ ఎంబసీలో ఖైదు చేసిన అమెరికా, వాషింగ్టన్ నుండి లీక్ లను నిర్వహిస్తానంటే ఒప్పుతుందా, అది తన ప్రయోజనాల కోసం ఐతే తప్ప? అమెరికా గూఢచార సంస్థల అక్రమ హ్యాకింగ్ కార్యకలాపాలను వెల్లడి చేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ అమెరికా నుండి పారిపోయి రష్యాలో తలదాచుకోవలసి వచ్చింది. వికీ లీక్స్ లీకుల కంటే భారీ పరిమాణంలో పనామా పేపర్స్ ఉన్నాయని ఐ‌సి‌ఐ‌జే చెప్పుకుంటోంది. కానీ వికీ లీక్స్ తనకు అందిన పత్రాలు అన్నింటినీ సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచింది. ఐ‌సి‌ఐ‌జే అలా చేయలేదు. కనీసం భాగస్వామ్య మీడియా సంస్థలకు కూడా పూర్తి పత్రాలను ఇవ్వలేదు. ఎంపిక చేసిన పత్రాలను మాత్రమే ఇచ్చింది. తనకు అవసరమైన సున్నిత సమాచారాన్ని తన వద్దనే ఉంచుకుంది. నిజానికి పూర్తి పత్రాలు ఐ‌సి‌ఐ‌జే వద్ద ఉన్నాయని కూడా భావించలేము. ఎన్‌ఐ‌ఏ వద్దనో, సి‌ఐ‌ఏ వద్దనో అవి ఉంటాయి తప్ప ఐ‌సి‌ఐ‌జే వద్ద కాదు.

ఉపసంహారం:

అంతిమంగా గ్రహించవలసిన అంశాలు.

  1. పనామా పేపర్స్ పరిమిత, నియంత్రిత వెల్లడి అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం ఉద్దేశించినది
  2. అక్రమ నల్ల డబ్బుకు గమ్యంగా అమెరికాను ప్రమోట్ చేసుకోవడం ఈ పరిమిత వెల్లడికి ఉన్న లక్ష్యాల్లో ముఖ్య మైనది.
  3. ద సిటీ, వాల్ స్ట్రీట్ అనే రెండు ప్రపంచ ఫైనాన్స్ మత్త గజాల మధ్య వైరుధ్యాన్ని తమకు అనుకూలంగా పరిష్కరించుకోవడమే లక్ష్యంగా మొస్సాక్ ఫన్సెకా హ్యాకింగ్ కు అమెరికా గూఢచార సంస్థలు పాల్పడ్డాయి.
  4. అమెరికా ఏక ధృవ లక్ష్యానికి సవాలుగా పరిణమించిన పుతిన్, అస్సాద్ లను రాజకీయంగా అప్రతిష్ట తేవడమూ ఒక లక్ష్యమే.

పై 4 లక్ష్యాలలో 2వ, 3వ లక్ష్యాలు ప్రధానమైనవి. ఈ నిర్దిష్ట పరిణామంలో ప్రత్యేక స్వభావం కలిగినవి. 1వ లక్ష్యం సాధారణ స్వభావం కలిగినది. 4వ లక్ష్యం పరిమిత ప్రయోజనం మాత్రమే. అమెరికా, బ్రిటన్ వైరుధ్యాల నుండి దృష్టిని మళ్లించేందుకు అమెరికన్, బ్రిటిష్ పత్రికలు దీనిని ప్రముఖం చేశాయి. దీని వల్ల చేకూరే ప్రయోజనం అమెరికాకు చేదు కాదు. కనుక అమెరికా పత్రికలు కూడా పుతిన్ వ్యతిరేక ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. ముందు పేజీల్లో చెప్పినట్లుగా వెల్లడి చేసిన వివరాల కంటే దాచి పెట్టిన వివరాలే అసలు లక్ష్యాలను నెరవేర్చనున్నాయి.

ముగించే ముందు మరో విషయాన్ని చెప్పుకోవాలి. సామ్రాజ్యవాద వ్యవస్ధలో మనం జీవనం సాగిస్తున్నాం. మన జీవితంలో ప్రతి పరిణామమూ, మలుపు, అలవాటు, ఎంపిక, వినియోగం.. అన్నింటిలోనూ సామ్రాజ్యవాదుల వ్యాపార ప్రయోజనాలే ప్రభావితం చేస్తున్నాయి. చివరికి ప్రజా ఉద్యమాలను సైతం దాదాపు పూర్తిగా నియంత్రించే స్థాయికి సామ్రాజ్యవాదులు చేరిన నేపధ్యంలో మంచి పరిణామాలు జరుగుతున్నా అవి సామ్రాజ్యవాదుల జోక్యం లేకుండా జరగడం లేదు. దీని అర్ధం సామ్రాజ్యవాదుల వల్ల మంచి జరుగుతుందని కాదు. ప్రజా ఉద్యమాల వల్లా, ప్రజల ప్రతిఘటన వల్లా ప్రజలకు మేలు చేసే పరిణామాలు జరగాలి. కానీ అందుకు విరుద్ధంగా అవి కూడా సామ్రాజ్యవాదుల జోక్యంతోనే వారి ప్రయోజనాల నిమిత్తం జరిగే పరిణామాల వల్లనే చేకూరడం ఓ వింత పరిస్ధితి.

నిజానికి ఇది వింత పరిస్ధితి కాదు. మహోపాధ్యాయుడు కారల్ మార్క్స్ చెప్పినట్లుగా మనిషి వినియోగించగల ప్రతి వస్తువునూ సరుకుగా పెట్టుబడి మార్చివేస్తుంది. అలాగే మహోపాధ్యాయుడు వి ఐ లెనిన్ చెప్పినట్లుగా ‘సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధం.’ ఈ యుద్ధాన్ని వివిధ దేశాల మధ్య యుద్ధంగా మాత్రమే పరిమితం చేసి అర్ధం చేసుకోరాదు. సామ్రాజ్యవాద ప్రభావిత జీవనంలో ప్రతి పరిణామమూ యుద్ధం నేపధ్యంలోనే సాధ్యం అవుతోంది. సమాచార హక్కు చట్టం ప్రజలకు ఉపయోగమే కానీ అది సామ్రాజ్యవాద లక్ష్యాలతోనే సాధ్యం అయింది. పాలనలో పారదర్శకత ప్రజలకు ఉపయోగమే. కానీ అదీ సామ్రాజ్యవాద ప్రయోజనాల వల్లనే సాధ్యపడుతోంది. ఇప్పుడేమో లండన్ సామ్రాజ్యవాదుల గుట్టు మట్లు మరో సామ్రాజ్యవాది తలచుకుంటేనే పరిమితంగానే అయినా బైటికి వచ్చాయి. లేకుంటే మొస్సాక్ ఫన్సెకా గురించి గతంలో చెప్పినవారు ఎవరు?

మరోవైపు ప్రజలు పొరాడి సాధించుకున్న హక్కులు ఒక్కొక్కటిగా అదృశ్యం అవుతున్నాయి. తప్పనిసరి సెలవు దినంగా ఉన్న మే డే రోజు ఇప్పుడు సెలవు దినం కాదు. కార్మికుల సంఘటిత హక్కు, బేరసారాల హక్కు పెద్దగా హడావుడి లేకుండానే అదృశ్యం అయ్యాయి. ప్రభుత్వరంగం ప్రైవేటీకరణకు అనుకూలంగా కార్మికవర్గ ప్రజలే వాదిస్తున్న విపత్కర పరిస్ధితి! మనం చూస్తుండగానే నీరు అమ్మకపు సరుకుగా మారిపోయింది. మనం చూస్తుండగానే దేశం లోని సెక్యులరిస్టు వాతావరణం కాస్తా హిందూ మతోన్మాద భావావేశాలతో నిండిపోతోంది. కాస్తో కూస్తూ సెక్యులర్ భావాలున్న జనం కూడా వివిధ మొహాల మాటున మోడి వెంటబడి కొట్టుకుపోవడం చూడవలసి వస్తోంది.

సామ్రాజ్యవాద సంక్షోభపు ఒత్తిడి వివిధ రూపాల్లో ప్రజా జీవనంలో ప్రతిఫలిస్తున్న ఫలితంగా సామాజిక, రాజకీయ, ఆర్ధిక రంగాల్లో ఛాందసవాదం, పునరుద్ధరణవాదం, యధాతధవాదం, వినియోగవాదం, విప్లవ ప్రతీఘాతుకత్వం కార్మికవర్గానికి సైతం ప్రమాదకర రీతిలో విస్తరిస్తున్నాయి. ఇదంతా సామ్రాజ్యవాదం ప్రజలపై రుద్దుతున్న యుద్ధం ఫలితమే. అడుగడుగునా పోరాటం చేయవలసిన స్థితిని ఎదుర్కుంటున్నాం. విప్లవకర ఆచరణను ప్రజలకు ప్రత్యామ్నాయంగా చూపవలసిన విప్లవ శ్రేణులు కూడా వివిధ ప్రతీఘాత, విప్లవ విరుద్ధ భావనలను తెలియకనే చేరదీస్తున్నారు. అందువల్ల మనతో మనమే కూడా పోరాటం చేయవలసిన అవసరం తరుముకు వచ్చింది. ఇది అనివార్యం కానవసరం లేదని విప్లవ శ్రేణులు రుజువు చేయవలసే ఉన్నది.

(…………అయిపోయింది)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s