
Photo: New Indian Express
నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అథిపతి పొరపాటునో గ్రహపాటునో ఒక నిజం కక్కేశారు. “పఠాన్ కోట్ దాడి వెనుక పాక్ హస్తం లేదు” అని న్యూస్18 ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దాడి వెనుక పాక్ ప్రభుత్వం గానీ పాక్ ప్రభుత్వ ఏజెన్సీలు గానీ కుమ్మక్కు అయినట్లు తమ వద్ద ఎటువంటి సాక్షాలు లేవుఅని ఎన్ ఐ ఎ డైరెక్టర్ శరత్ కుమార్ స్పష్టం చేశారు.
ఎన్ ఐ ఎ వెల్లడి కేంద్రం లోని బిజెపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేసిందది. పఠాన్ కోట దాడి కారణం గానే ఇరుదేశాల చర్చలను కేంద్రం రద్దు చేసింది. దాడిని చూపిస్తూ మోరల్ హై గ్రౌండ్ మీద నిలబడి పాక్ ప్రభుత్వానికి లెక్చర్లు దంచుతోంది. ఎన్ ఐ ఏ అత్యున్నత అథికారి వెల్లడి కేంద్రం వైఖరి వాస్తవాలపై ఆధారపడినది కాదని స్పష్టం చేసింది.
“పఠాన్ కోట్ దాడి నిర్వహణలో జైష్ లేదా అఝర్ మసూద్ లేదా మసూద్ సహాయకులకు పాక్ ప్రభుత్వం లేదా ప్రభుత్వ ఏఛన్సీల హస్తం ఉన్నట్లుగా ఇప్పటివరకూ ఏ విధమైన సాక్షాలు లభించ లేదు.” అని శరత్ కుమార్ చెప్పారు.
అయితే టెర్రరిస్టు దాడిలో మసూద్/జైష్ పాత్రను ఎన్ ఐ ఎ అధిపతి నిరాకరించ లేదు. పైగా త్వరలోనే మసూద్ పైనా , జైష్-ఎ-అహ్మద్ పైనా కేసు నమోదు చేస్తామని ఇంటర్వ్యూ అనంతరం ఇచ్చిన ప్రకటనలో తెలిపారు.
ఇంటర్వ్యూ అనంతరం పాక్ విదేశీ శాఖ అధికారులు ఉత్సాహం వ్యక్తం చేశారు. తాము ముందే చెప్పామంటూ ట్విటర్ లో గుర్తు చేశారు. “ఎన్ ఐ ఎ ప్రకటన పాకిస్తాన్ ఎంతో కాలంగా చెపుతూన్న అంశాలను రుజువు చేసింది. పరస్పర శాంతియుత సహజీవనం స్ఫూర్తితో కూడిన విధానాన్ని మేము పాటిస్తున్నాము. దాడి విషయంలో సంయుక్త దర్యాప్తుబృందం ఏర్పాటు చేయడం దానికి రుజువు” అని ఇండియాలో పాక్ ఎంబసి ప్రతినిధి ట్వీట్ చేశారు.
పాక్ ట్వీట్ దరిమిలా వారి ఉత్సాహంపై నీళ్ళు జల్లే ప్రయత్నం జరిగింది. అఝర్ మసూద్, ఆయన సోదరునిపై అభియోగాలు మోపుతున్నట్లు కూడా తాను చెప్పానని గుర్తు చేశారు.
సంఝౌతా ఎక్స్ ప్రెస్ పేలుడు హిందూ టెర్రరిస్టుల పనే
ఎన్ఐఎ ఉన్నత అధికారి మరో ముఖ్యమైన విషయం చెప్పారు. సంఝౌతా ఎక్స్ ప్రెస్ పేలుడు విషయంలో గత ప్రభుత్వం హయాంలో కనుగొన్న అంశాలను మార్చ వలసిన అవసరం ఎందుకు వచ్చింది అన్న ప్రశ్నకు స్పందించారు. “2007లో సంఝౌతా ఎక్స్ ప్రెస్ పై బాంబులు పేల్చిన కేసులో స్వామి అసీమానంద, తదితర హిందూ టెర్రరిస్టులే దోషులు. ఆ విషయంలో ఎలాంటి మార్పులు జరగలేదు” అని కుండ బద్దలు కొట్టారు.
ఎన్ఐఎ ఛీఫ్ చెబుతున్న విషయం నిజానికి బిజెపి ఇటీవల మొదలు పెట్టిన వాదనలకు బద్ధ విరుద్ధం. స్వామి అసీమానంద తదితర హిందూ సంస్థలు ఏ తప్పూ చేయలేదనీ, యుపిఎ ప్రభుత్వం కుట్రలు పన్ని హిందువులపై టెర్రరిస్టు ముద్ర వేశారనీ ఆర్ఎస్ఎస్ పరివారం ఆరోపించారు. ముస్లిం టెర్రరిజాన్ని తక్కువ చేసి చూపేందుకు కాంగ్రెస్ లాంటి కుహనా సెక్యులరిస్టులు చేసిన కుట్రల ఫలితమే అసీమానంద, స్వామిని ప్రజ్ఞా ఠాకూర్ లపై కేసులని వాదించారు. ఎన్ఐఎ సైతం వీలున్న చోటల్లా కేసులను నీరు గార్చుతూ వచ్చింది.
ఎన్ఐఎ అధికారి తాజాగా చెప్పిన అంశాలు బిజెపి వాదనలకు విరుద్ధం. అయినా గానీ ఎన్ఐఎ అధికారి అంత ధైర్యంగా కేంద్రం అభిలాషకు విరుద్ధంగా ఎలా మాట్లాడ గలిగారు, ఇది కూడా, రానున్న ఎన్నికల రీత్యా, బిజెపి/కేంద్రం ఎత్తుగడ కాకపోతే?