అక్రమ డబ్బు, పన్ను ఎగవేతలకు నూతన స్వర్గం అమెరికా! -3


The U.S., the new tax haven

(2వ భాగం తరువాత………….)

అక్రమ డబ్బుకు కొత్త స్వర్గం అమెరికా!

2008 ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం తర్వాతి రోజుల్లో అమెరికా, ఐరోపాలు జి20 ని ప్రధానంగా రంగంలోకి దించాయి. జి20 పేరుతో సంక్షోభం భారాన్ని బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) దేశాలపై నెట్టడానికి ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా చైనా వద్ద ఉన్న అపారమైన విదేశీ మారక ద్రవ్య నిల్వలు లక్ష్యంగా పెట్టుకుంది. (ఐతే చైనా ఆ బుట్టలో పడకపోవడం వేరే సంగతి). జి20 సమావేశాలు వరుసగా నిర్వహించిన పశ్చిమ రాజ్యాలు, ముఖ్యంగా అమెరికా విదేశీ ఖాతాల్లో నల్ల డబ్బు దాచేందుకు ప్రోత్సహించే దేశాలను ఒక లక్ష్యంగా పెట్టుకుంది. టాక్స్ హెవెన్ దేశాలు తమ కార్యకలాపాలను విరమించుకోవాలని కోరుతూ ఆ దిశలో జి20 వేదికగా తీర్మానాలు చేయించింది. టాక్స్ హెవెన్ దేశాలలో అక్రమ డబ్బు సొంతదారులలో అమెరికా సూపర్ ధనికులది ప్రధాన వాటా. కనుక టాక్స్ హెవెన్ దేశాలపై చర్యలు చేపడితే అది అమెరికా ఖాతాదారులకు కూడా నష్టం అవుతుంది. అయినప్పటికీ ఈ అంశాన్ని అమెరికా ఎందుకు ప్రధానం చేస్తున్నదో గ్రహించిన వారు అప్పట్లో చాలా తక్కువ మంది. టాక్స్ హెవెన్ దేశాలను టార్గెట్ చేయడం వెనుక అమెరికా లక్ష్యం: ప్రపంచంలోని నల్ల డబ్బుకు తానే నూతన స్వర్గంగా అవతరించడం!

బహుళజాతి కంపెనీలు అంతకంతకు ఎక్కువగా తమ కేంద్రీకరణను ఉత్పత్తి కార్యకలాపాల నుండి ద్రవ్య సేవల మీదికి మళ్లిస్తున్నాయి. సంవత్సరాల తరబడి ఉత్పత్తి కార్యకలాపాలు సాగే మాన్యుఫాక్చరింగ్ రంగం వారికి భారం అయింది. షేర్ మార్కెట్, సరుకుల ఫ్యూచర్స్ మార్కెట్, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్, కమర్షియల్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్ మొదలైన ద్రవ్య కంపెనీల ద్వారా స్పెక్యులేటివ్ కార్యకలాపాలు నిర్వహించడం మరింత లాభదాయకం అని పశ్చిమ బహుళజాతి కంపెనీలు భావిస్తున్నాయి. ద్రవ్య మార్కెట్ లో స్పెక్యులేషన్ల ద్వారా, షార్ట్ సెల్లింగ్ ద్వారా తక్షణ లాభాలు ఆర్జించడం మరింత ఆకర్షణీయంగా మారింది. ఈ నేపధ్యంలో ప్రపంచం లోని ద్రవ్య నిల్వలను అమెరికాకు ఆకర్షించడానికి అమెరికా దీర్ఘ కాలిక పధకాన్ని రచించింది.

అందులో భాగంగా ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం దరిమిలా జి 20 వేదికను అడ్డం పెట్టుకుని టాక్స్ హెవెన్ దేశాలపై యుద్ధం ప్రకటించింది. ఆయా దేశాల్లో పన్నులు కట్టకుండా కూడబెట్టిన ద్రవ్య నిల్వలను తమ దేశంలో దాచుకోవడానికి అనుమతించే దేశాలే టాక్స్ హెవెన్ దేశాలు. ఈ దేశాల్లో పన్నులు కట్టనవసరం లేదు. తమ డబ్బు ఎక్కడినుండి వచ్చిందో కూడా చెప్పనవసరం లేదు. పైగా రహస్య బ్యాంకింగ్ సదుపాయాలు కల్పించబడతాయి. అసలు పేర్లు వెలుగులోకి రావు. పేర్లకు బదులు పేపర్ కంపెనీలు, రహస్య ఐ‌డిలు, పాస్ వర్డ్ లు, రహస్య కోడ్ లు మాత్రమే ఉంటాయి. ఈ సేవలకు ప్రతిఫలంగా వసూలు చేసే రుసుములే ఆ దేశాల ప్రధాన ఆదాయ వనరు. టాక్స్ హెవెన్ లను ఆకర్షణ కేంద్రాలకు బదులు వికర్షణ కేంద్రాలుగా మార్చి వాటి స్ధానాన్ని తాను ఆక్రమించడానికి అమెరికా పధకం రచించుకుంది.

తన లక్ష్యానికి అనుగుణంగా 2008 సంక్షోభం అనంతర కాలంలో అనేక చర్యలు చేపట్టింది. జి20 వేదికగా టాక్స్ హెవెన్ దేశాలపై యుద్ధం ప్రకటించడం వాటిల్లో ఒకటి. ఇందులో భాగంగా స్విట్జర్లాండ్ ను మొదటి లక్ష్యంగా చేసుకుంది. హెచ్‌ఎస్‌బి‌సి తదితర స్విస్ బ్యాంకుల నుండి రెండు విడతలుగా పలువురు భారతీయుల పేర్లు వెల్లడి కావడం కాకతాళీయంగా జరగలేదు. పశ్చిమ పత్రికలు ప్రచారం చేసినట్లుగా అది విజిల్ బ్లోయర్ల పని కాదు. అమెరికా గూఢచార సంస్థలు ఒక పద్ధతి ప్రకారం పని చేసి హ్యాకింగ్ చర్యల ద్వారా ఎంచుకున్న పేర్లను పత్రికలకు లీక్ చేశాయి. స్విస్ లీకేజిలో ఒక్క భారతీయుల పేర్లు మాత్రమే కాదు, చైనా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా తదితర ఎమర్జింగ్ దేశాల ధనికుల పేర్లు కూడా ఉన్నాయి. భారీ మొత్తంలో డబ్బు దాచిన వారి పేర్లు కాకుండా చిన్నా చితకా పేర్లు వెల్లడి చేసి ఒక భయపూరిత వాతావరణాన్ని సృష్టించడం లక్ష్యంగా పేర్లు వెల్లడి అయ్యేలా చూశారు. దానిని చూసి భారీ ఖాతాల వాళ్ళు భయపడి స్విస్ బ్యాంకులకు ప్రత్యామ్నాయం వెతుక్కోవాలి.

ఆర్ధిక సంక్షోభానికి కూడా స్విస్ బ్యాంకులు ఒక ముఖ్య కారణం అన్న ప్రచారాన్ని జి 20 వేదిక ద్వారా అమెరికా చేసింది. తన గూఢచార కంపెనీలను, ఇతర ద్రవ్య విచారణ సంస్థలను పురిగొల్పి స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచిన అమెరికన్ల పేర్ల జాబితాను తమకు ఇచ్చేలా స్విస్ బ్యాంకులపై ఒత్తిడి తెచ్చింది. ఆ జాబితా చేబూని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించి ద్రవ్య నిల్వలను అమెరికాకు తరలించేలా చర్యలు తీసుకుంది. ఇది పైకి చూసేందుకు నల్ల డబ్బు పై ప్రకటించిన యుద్ధంలా కనిపిస్తుంది. కానీ వాస్తవ లక్ష్యం నల్ల డబ్బుకు అమెరికాలోని వాల్ స్ట్రీట్ బ్యాంకులను ఆకర్షణీయంగా మలచడమే తప్ప వారి డబ్బును స్వాధీనం చేసుకోవడం కాదు. స్విస్ తదితర బ్యాంకుల నుండి డబ్బు వెనక్కి తెచ్చిన బడా బిలియనీర్ల పేర్లను అమెరికా వెల్లడి చేయకపోగా తానే వారికి తగిన రక్షణ సౌకర్యాలు కల్పించడం ప్రారంభించింది. వారి కోసం అనేక చట్టాలను కొత్తగా ప్రవేశ పెట్టింది.

The U.S. assets in tax havens

The U.S. assets in tax havens -Click to enlarge

జనవరి 17, 2016 తేదీన ప్రఖ్యాత అమెరికన్ వాణిజ్య పత్రిక బ్లూమ్ బర్గ్ న్యూస్ ప్రచురించిన “The World’s Favourite New Tax Haven Is the United States” అనే వార్త అమెరికా చేపట్టిన పలు చర్యలలో కొన్నింటిని వెలుగులోకి తెచ్చింది. ఈ వార్త లక్ష్యం అమెరికా గురించి చెడ్డగా చెప్పడం కాదు. అమెరికా దృష్టిలో మంచి-చెడు అనే తేడా ఉండదు. పెట్టుబడికి అనుకూలంగా, అమెరికా సామ్రాజ్యానికి అనుకూలంగా ఏది చేసినా అదంతా మంచే. ఈ వార్త ద్వారా ప్రపంచ దేశాల్లోని నల్ల డబ్బు యజమానులకు ఒక సమాచారం ఇవ్వడం. ‘మీ డబ్బు ఇక అమెరికాలో దాచుకోవచ్చు. పనామా, స్విస్ లాంటి చోట్ల దాచుకుంటే లీకేజీల వల్ల బహిరంగం అయ్యే ప్రమాదం ఉన్నది. అదే అమెరికా అయితే ఆ భయాలు ఉండవు. మీ పేర్లు బైటికి వచ్చే చోట డబ్బు దాస్తారా లేక ఆ భయం లేని అమెరికాలో, ప్రపంచాధిపత్యం కలిగిన అమెరికాలో దాస్తారా!” అన్న సందేశాన్ని బ్లూమ్ బర్గ్ వార్త ద్వారా ప్రపంచ దేశాలలోని ధనికవర్గాలకు అమెరికా పంపింది.

బ్లూమ్ బర్గ్ వార్త ఇలా పేర్కొంది:

“దశాబ్దాలుగా రహస్య బ్యాంకు ఖాతాలకు ప్రపంచ రాజధానిగా స్విట్జర్లాండ్ కొనసాగింది. ఈ పరిస్ధితి ఇప్పుడు మారుతోంది. 2007లో యూ‌బి‌ఎస్ గ్రూపు బ్యాంకర్ బ్రాడ్లీ బిర్కెన్ ఫీల్డ్ అమెరికాకు సహాయం చేస్తూ తమ సంస్థ కార్యకలాపాలపై విజిల్ ఊదడంతో స్విస్ బ్యాంకులు తగిన మూల్యం చెల్లించాయి. యూ‌బి‌ఎస్ గ్రూపు, క్రెడిట్ సుశీ ఏ‌జి బ్యాంకు లతో సహా 80 స్విస్ బ్యాంకులు అమెరికాకు 5 బిలియన్లు అపరాధ రుసుముగా చెల్లించాయి.

“గత సెప్టెంబర్ (2015)లో రోత్ షీల్డ్ & కో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆండ్రూ పెన్నీ, శాన్-ఫ్రాన్-సిస్కో లో ఒక టాక్ షో ఇస్తూ ప్రపంచ ధనికులు పన్నులు ఎలా ఎగవేస్తున్నారో వివరించాడు. అతని సందేశం స్పష్టమే: మీ క్లయింటులు పన్నులు చెల్లించకుండా తమ ప్రభుత్వాల నుండి దాచిన ధనాన్ని భద్రంగా అమెరికాకు తరలించుకోవచ్చు! అని. కొందరు అమెరికాను కొత్త స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తున్నారు.”

ఈ విధంగా యేళ్ళ తరబడి అమెరికా డబ్బు దాచేందుకు సహకరిస్తున్న టాక్స్ హెవెన్ లపై యుద్ధం ప్రకటించిన అమెరికా తాజాగా పన్ను ఎగవేతదారులకు స్వర్గంగా మారేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. లండన్ లాయర్ల దగ్గరి నుండి స్విస్ ట్రస్ట్ కంపెనీల వరకు ఈ పనిలో దిగిపోయాయి. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, బహామాస్ లాంటి టాక్స్ హెవెన్ దేశాల నుండి ధనికుల డబ్బు అమెరికాలోని నెవాడా, వయోమింగ్ (సౌత్ డకోటా) లకు తరలించడంలో నిమగ్నం అయ్యారు.

“బిగ్గరగా వినిపిస్తున్న ఆ పీల్చుడు శబ్దం ఎక్కడిదని? డబ్బు హడావుడిగా అమెరికా తరలిపోతున్న శబ్దమే అది!” అని బ్లూమ్ బర్గ్ వ్యాఖ్యానించడం బట్టి ద్రవ్య నిల్వలు ఎంత భారీ స్ధాయిలో చిన్న దేశాల నుండి అమెరికాకు తరలి పోతున్నవో అర్ధం చేసుకోవచ్చు. ఐరోపాలో శతాబ్దాలుగా ద్రవ్య కార్యకలాపాలు నిర్వహించిన రోత్ షీల్డ్ ఇప్పుడు నెవాడాలోని రెనో లో కొత్త కార్యాలయం తెరిచింది. బెర్ముడా నుండి ఆఫ్ షోర్ ఖాతాల సొమ్ము అమెరికాకు తరలించడంలో రోత్ షీల్డ్ నిండా మునిగి ఉంది. “ప్రపంచంలో అతి పెద్ద టాక్స్ హెవెన్ అమెరికాయే” అని ఇప్పుడు రూత్ షీల్డ్ ప్రచారం చేస్తోంది. అమెరికాలో నెలకున్న నిలకడతనం దృష్ట్యా ప్రపంచంలో ధనిక కుటుంబాలు తమ డబ్బు క్షేమంగా అమెరికాలో దాచుకోవచ్చని చెబుతోంది. లాటిన్ అమెరికా ధనికులకు సలహాలు ఇచ్చే జెనీవా (స్విస్) కంపెనీ ‘సిసా ట్రస్ట్ కో. ఎస్‌ఏ’ అమెరికా సౌత్ డకోటా రాష్ట్రంలో కార్యాలయం తెరవడానికి దరఖాస్తు చేసింది.

విదేశీ ట్రస్టు సేవలు అందించే అతిపెద్ద కంపెనీల్లో ఒకటయిన ‘ట్రీడెంట్ ట్రస్ట్ కొ’ కంపెనీ డజన్ల కొద్దీ ఖాతాలను స్విట్జర్లాండ్, గ్రాండ్ కేమన్ మొ.న దేశాల నుండి సౌత్ డకోటా లోని సియోక్స్ ఫాల్స్ కు తరలించింది. జి 20 రూపొందించిన నిబంధనల మేరకు గత జనవరి లోపు ఈ ఖాతాలు తమ వివరాలు వెల్లడి చేయాల్సి ఉన్నది. దాని నుండి తప్పించుకోవడానికి వాటిని అమెరికాకు తరలించారు. అనగా జి 20 నిబంధనల మేరకు అమెరికా చేసిన కొత్త చట్టాలు స్విస్ లో దాచుకోవడానికి వ్యతిరేకం కాగా అమెరికాలో దాయడాన్ని ప్రోత్సహించాయన్నమాట! 2010లో అమెరికా చేసిన ఫట్కా చట్టం (Foreign Account Tax Comliance Act) ప్రకారం విదేశాల్లో డబ్బు దాచుకున్న అమెరికన్ల వివరాలను ఆ దేశాలు తప్పనిసరిగా అమెరికాలోని ఐ‌ఆర్‌ఎస్ (ఇంటర్నల్ రెవిన్యూ సర్వీస్) కు సమాచారం ఇవ్వాలి. లేనట్లయితే స్విట్జర్లాండ్ తరహాలో భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. విదేశాలకు వర్తింప జేస్తూ అమెరికా చట్టం చేయడం, దానిని విదేశాలు విధిగా పాటించడం!

కానీ ఈ తరహాలో చేసిన అంతర్జాతీయ చట్టాన్ని ఆమోదించడానికి అమెరికా తిరస్కరించడం గమనించవలసిన విషయం. అమెరికా చేసిన ఫట్కా చట్టం స్ఫూర్తిగా OECD (Organisation for Economic Cooperation and Development) తన సభ్య దేశాలతో పాటు తమ సభ్య దేశాలతో వ్యాపారం చేసే ఇతర దేశాలకు వర్తించే విధంగా ఒక నిబంధనావళితో కూడిన ఒప్పందం రూపొందించింది. ఫట్కా కంటే మించిన కఠిన నిబంధనలు ఇందులో ఉన్నాయని వినికిడి. దీని ప్రకారం విదేశీ బ్యాంకు ఖాతాల్లో, ట్రస్టుల్లో, ఇతర పెట్టుబడి వాహకాలలో అంతర్జాతీయ కస్టమర్లు డబ్బు దాచుకుంటే ఆ వివరాలను ఆయా దేశాలు తప్పనిసరిగా కస్టమర్ల దేశాలకు సమాచారం ఇవ్వాలి. ఈ ఒప్పందంపై సంతకం చేసేందుకు అమెరికా నిరాకరించింది. అంతర్జాతీయ చట్టాలను ఆమోదించేలా ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చి లొంగ దీయడం, ఆ చట్టాన్ని తాను ఆమోదించకపోవడం అమెరికా అనుసరించే ఒక ఎత్తుగడ. తద్వారా తన ఆధిపత్య ప్రయోజనాలను అమెరికా నెరవేర్చుకుంటుంది. ఇదే తరహాలో ఓ‌ఈ‌సి‌డి చట్టాన్ని అమెరికా తిరస్కరించింది. తన ఫట్కా చట్టం చాలు అని చెబుతుంది. కానీ ఫట్కా చట్టం అమెరికాలో దాచిన విదేశీ ఖాతాలకు వర్తించదన్న సంగతి గురించి ఏమీ మాట్లాడదు.

ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటూ అమెరికా కంపెనీలు అగ్రెసివ్ గా ప్రచారం చేసుకుంటున్నాయి. బోస్టన్ కు చెందిన ద్రవ్య సలహా కంపెనీ బోల్టన్ గ్లోబల్ కేపిటల్ ఇటీవల ప్రచారంలో పెట్టిన పత్రం/పోస్టర్ ఇలా పేర్కొంటుంది: “మెక్సికోలోని ఒక సంపన్నుడు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ లోని కంపెనీని వినియోగిస్తూ అమెరికా బ్యాంకులో డబ్బు దాచాడు. ఫలితంగా బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ ప్రభుత్వానికి కంపెనీ పేరు మాత్రమే వెళ్తుంది. ఆ ఖాతా యజమాని పేరును మెక్సికన్ ప్రభుత్వంతో పంచుకోవడం ఎప్పటికీ జరగదు.” జి20 వేదికగా అమెరికా ప్రవచించిన నీతి బోధలకు ఇది పచ్చి వ్యతిరేకం. ఐనా ఐరోపా దేశాలు అమెరికాను నిలదీయడానికి బదులు ఓ‌ఈ‌సి‌డి చట్టంపై అమెరికా సంతకం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. అమెరికా నిరాకరణ తమ వ్యాపార వృద్ధికి బాగా తోడ్పడుతోందని బోల్టన్ కంపెనీ సి‌ఈ‌ఓ బ్లూమ్ బర్గ్ తో మాట్లాడుతూ చెప్పడం విశేషం. ఓ‌ఈ‌సి‌డి చట్టాన్ని ఆమోదించాలని అమెరికా ట్రెజరీ ప్రతిపాదించగా కాంగ్రెస్ దానిని తిప్పికొట్టింది. అటు ఆమోదించినట్లూ ఉండాలి, ఇటు తిరస్కరించినట్లూ ఉండాలి. అంతిమంగా ముల్లె అంతా తన ఒడిలోకే చేరాలి.

బ్రిటన్ తిరుగుబాటు

ఇప్పుడు ఒక ముఖ్యమైన ఆసక్తికరమైన పరిశీలన లోకి వెళ్తున్నాం. ఇలాంటి అమెరికా అనుకూల పరిస్ధితిని తిరస్కరించిన ఏకైక దేశం బ్రిటన్. బ్రిటన్ లో పన్ను ఎగవేస్తూ అమెరికాలో (లేదా విదేశాల్లో) డబ్బు దాచుకోవడం నేరంగా చేస్తూ బ్రిటన్ చట్టం చేసుకుంది. ఈ చట్టం లక్ష్యం అమెరికాయే. (అయితే ఈ చట్టాన్ని కూడా అమెరికా తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటోంది. బ్రిటన్ చట్టం వల్ల పేరు బైటపడుతుందని అమెరికాలో అయితే ఆ భయం ఉండదని ప్రచారం చేస్తున్నాయి. ఆ మేరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తున్నాయి.) ఐరోపాతో పాటు ఇతర ప్రాంతాల్లోని టాక్స్ హెవెన్ దేశాల నుండి ద్రవ్య నిల్వలు అమెరికాకు ప్రవహించేలా అమెరికా చర్యలు తీసుకుంటున్న నేపధ్యంలో బ్రిటన్ దానిని ప్రతిఘటించడానికే నిర్ణయించుకున్నది. వాల్ స్ట్రీట్ అవతరించడానికి ముందే బ్రిటన్ ప్రపంచ ద్రవ్య కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా వెలుగొందిన విషయం ఈ సందర్భంగా గమనంలో ఉంచుకోవాలి. అమెరికాలో వాల్ స్ట్రీట్ ఎలాగో బ్రిటన్ లో ‘ద సిటీ’ అలాగ.

లండన్ లో ప్రధాన, భారీ బహుళజాతి ద్రవ్య కంపెనీలు లండన్ లోని ఒక పరిమిత ప్రాంతంలో హెడ్ క్వార్టర్స్ ను కలిగి ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని వాణిజ్య కంపెనీలు ‘ద సిటీ’ గా పేర్కొంటాయి. అమెరికాలో వాల్ స్ట్రీట్ దినదిన ప్రవర్థమానం అవుతున్నప్పటికీ ‘ద సిటీ’ ప్రభ కోల్పోకుండా బ్రిటన్ జాగ్రత్త వహిస్తూ వచ్చింది. అందుకోసమే అమెరికాతో సన్నిహిత స్నేహ సంబంధాలను నిర్వహించింది. ఆ సంబంధాలను ఇరు దేశాలు ‘ప్రత్యేక సంబంధం’ (special relationship) గా అభివర్ణిస్తాయి. అలాంటి సంబంధాలు కూడా ఛిద్రం అయ్యే పరిస్ధితి ప్రస్తుతం నెలకొని ఉన్నది. అందుకు ప్రధాన కారణం అమెరికా అనుసరిస్తున్న దూకుడు ధోరణి అయినప్పటికీ సాధారణ ప్రజానీకం ఇరువురిలో ఎవరి పక్షమూ చేరవలసిన అవసరం లేదు. ఇరువురు కలిసి ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబియా, సిరియాలలో సృష్టించిన రక్తపాతం, వినాశనం, ధన-మాన-ప్రాణ నష్టం చరిత్రలో ఇప్పటి వరకూ జరిగిన ఏ దుర్ఘటనా పోటీ రాలేనిది. అలాంటి రెండు సామ్రాజ్యవాద ఫైనాన్స్ మత్త గజాలు పరస్పరం తలపడుతున్న ఒక సంధి దశకు ఆరంభంలో ప్రపంచం నిలబడి ఉన్నది. ప్రధానంగా ఈ దశను తెలియజేసేదే ‘పనామా పేపర్స్’ లీకేజి!

పనామా పేపర్స్ నుండి పుతిన్ వ్యతిరేక సమాచారం అని చెబుతున్న ఏ సమాచారమూ నిజానికి కొత్తగా వెల్లడి అయినది కాదు. పనామా పేపర్స్ లో పేరున్న పుతిన్ సన్నిహితులపైనా, కంపెనీలపైనా ఇప్పటికే అనేక విడతలుగా అమెరికా, ఐరోపాలు ఆంక్షలు విధించాయి. వారి విదేశీ కార్యకలాపాలను స్తంభింపజేసాయి. పుతిన్ తో సంబంధం అని చెప్పే ఏ సమాచారమూ ఆశ్చర్యచకితమూ కాదు, కొత్తది కాదు, పుతిన్ కు నష్టకరమూ కాదు. పుతిన్ కంపెనీల్లో 2 బిలియన్ డాలర్లు దాచారు అని చెప్పడమే గానీ అందుకు ఆధారాలు చూపడం లేదు. చూపిన ఆధారాల్లో అంత సొమ్ము లేదు. పుతిన్ సన్నిహితులుగా చెప్పిన వ్యక్తులు, సంస్థలపై పశ్చిమ దేశాలు ఇప్పటికే ఆంక్షలు అమలు చేస్తున్నందున రష్యా పన్నులు ఎగవేసి విదేశాల్లో దాచారన్న సమస్యే తలెత్తదు. నిజం చెప్పాలంటే వారి విదేశీ కార్యకలాపాలు పశ్చిమ ఆంక్షలు ధిక్కరించడానికి ఉద్దేశించినవి. కనుక రష్యా ఆర్ధిక వ్యవస్థకు మేలు చేసే ఫైనాన్స్ కార్యకలాపాలు. కనుక రష్యా ప్రభుత్వానికి ఈ కార్యకలాపాలు తెలియకుండా పోవడం అసాధ్యం. దాచి పెట్టడానికి కారణమే లేనప్పుడు తెలియకుండా ఎలా పోతుంది? పశ్చిమ ఆంక్షలను ఎదుర్కొని విదేశీ కార్యకలాపాలు నిర్వహించడానికి వీలు కల్పించే ఈ ఖాతాలకు ప్రభుత్వ మద్దతు ఉండి తీరుతుంది. కాకపోతే ఆ పేరుతో రష్యా వ్యతిరేక, పుతిన్ వ్యతిరేక ప్రచారం చేయడం ఒక్కటే అమెరికా సాధించిన ప్రయోజనం. పుతిన్ వ్యతిరేక ప్రచారం వల్ల అంతకు మించిన ప్రయోజనం లేదు.

కనుక పనామా పేపర్స్ లక్ష్యం పైకి పుతిన్/రష్యా, బషర్ లుగా కనిపిస్తున్నప్పటికీ ఆ లక్ష్యం కోసం ఈ స్థాయి శ్రమ, ప్రచారం యొక్క అవసరం కనిపించడం లేదు. అలాగే చైనా అధ్యక్షుడు, మాజీ ప్రధాని బంధువులు అంటూ వెల్లడి చేసిన ఖాతాల్లో పెద్దగా డబ్బు లేదు. చైనా వ్యతిరేక ప్రచారానికి ఉపయోగపడేటంత మొత్తం కాదది. కనుక అసలు టార్గెట్ రష్యా, చైనా, సిరియాల నేతలు అని చెప్పడం నమ్మశక్యంగా కనిపించడం లేదు. వాళ్ళు ఒక లక్ష్యం అయితే కావచ్చు గానీ ప్రధాన లక్ష్యం అయితే కాదు అని చెప్పవచ్చు.

మెజారిటీ ఖాతాలు ‘ద సిటీ’ పరిధి లోనివే

పనామా పేపర్స్ లో మొత్తం దాదాపు 300,000 రహస్య ఖాతాల లావాదేవీలు ఇమిడి ఉన్నాయని చెప్పుకున్నాం. ఇందులో మెజారిటీ బ్రిటిష్ సంబంధిత టాక్స్ హెవెన్ దేశాల్లో డబ్బు దాచుకున్నవేనని సౌత్ ఫ్రంట్ పత్రిక వెల్లడి చేయడం గమనించవలసిన విషయం. మొస్సాక్ ఫన్సెకా కంపెనీకి అనుబంధంగా ఉన్న కంపెనీలలో 1900 కు పైగా బ్రిటిష్ కంపెనీలే. అనగా బ్రిటన్, దాని అనుబంధ, ఉపగ్రహ దేశాలలో డబ్బు దాచుకున్న ఖాతాలకు బినామీ యజమానులుగా ఉన్న కంపెనీలు. వాటిలో అనేకం నిజ కంపెనీలూ ఉన్నాయి. ఇవి కాకుండా పనామా పేపర్స్ లో ఇమిడి ఉన్న కంపెనీలలో 2,000 కు పైగా హాంగ్ కాంగ్ ఆధారంగా పని చేస్తున్నవి. 1997 వరకు హాంగ్ కాంగ్ బ్రిటన్ వలసగా ఉన్న సంగతి గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత కూడా ‘ఒక దేశం, రెండు వ్యవస్ధలు’ సిద్ధాంతం కింద బ్రిటన్ పెట్టుబడి కొనసాగడానికి చైనా అనుమతించింది. ఇప్పుడయితే సిద్ధాంత బాదరబందీ అవసరమే లేదనుకోండి!

విషయం ఏమిటంటే ఈ 2,000 కంపెనీలు బ్రిటన్ తో దగ్గరి సంబంధం ఉన్నవే. లేదా బ్రిటిష్ కంపెనీలకు అనుబంధ కంపెనీలు కావడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. ఈ కంపెనీల ప్రయోజనాల కోసం హాంగ్ కాంగ్ లో అడపా దడపా ‘ప్రజాస్వామ్య ఉద్యమాల’ పేరుతో ప్రదర్శనలు రెచ్చగొట్టడం బ్రిటన్ కు ఆనవాయితీ. బ్రిటిష్ ప్రయోజనాలతో ఘర్షణ తలెత్తినప్పుడల్లా ఆందోళనలకు బ్రిటన్ ఆజ్యం పోస్తుంది. ఈ అనుబంధ కంపెనీలలో పేరు పొందిన బ్యాంకులు, న్యాయ సలహా కంపెనీలు, కంపెనీ ఇన్-కార్పొరేటర్లు అనేకం ఉన్నాయి. ఇవన్నీ ద సిటీ లో ఫైనాన్స్ కార్యకలాపాలు సాగిస్తున్నవి. వీటి బినామీలను మొస్సాక్ ఫన్సెకా నిర్వహిస్తుండగా సదరు బినామీల గుట్టుమట్లను ఇప్పుడు లీక్ పేరుతో అమెరికా తన గుప్పెట్లో ఉంచుకుంది. స్విట్జర్లాండ్ ద్రవ్య కార్యకలాపాలతో సంబంధం ఉన్న బినామీలు పెద్ద మొత్తంలో కాకపోయినా గణనీయ సంఖ్యలో ఎం‌ఎఫ్ కింద ఉన్నాయి. కొందరు స్వతంత్ర పరిశోధకుల ప్రకారం 1200 వరకు స్విట్జర్లాండ్ కు చెందినవి ఎం‌ఎఫ్ జాబితాలో ఉన్నాయి. ఎం‌ఎఫ్ లో పేరున్న అమెరికా కంపెనీలు 400 మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. కనుక లీకేజి వలన ప్రధానంగా నష్టపోయేది బ్రిటన్ లేదా ‘ద సిటీ’.

కామెరాన్ తో పాటు అనేకమంది బ్రిటిష్ ఫైనాన్స్ పరిశ్రమ పెద్దలు & కంపెనీలు, రాజకీయ ప్రముఖులు, సీనియర్ ప్రభుత్వాధికారులు, కామెరాన్ సన్నిహిత మిత్రులు & బంధువులు, పార్లమెంటు సభ్యులు, వ్యాపార సంస్థల కార్య నిర్వాహక అధికారులు (సి‌ఈ‌ఓలు) పనామా పేపర్స్ జాబితాలో ఉన్నారు. ఈ కారణం చేతనే పనామా పేపర్స్ లీకేజి ఏ దేశంలో లేనంతగా బ్రిటన్ లో అతి పెద్ద వార్త అయింది. అయితే బ్రిటిష్ ప్రజల దృష్టిని మళ్లించడానికి బ్రిటన్ పత్రికలు పుతిన్, అస్సాద్, గ్జి జెన్ పింగ్ లపైననే ప్రధానంగా కేంద్రీకరించి వార్తలు గుప్పిస్తున్నాయి. ఆ మేరకు కొంతవరకు సఫలం అయినప్పటికీ దీర్ఘకాలికంగా చూస్తే బ్రిటన్ మరిన్ని పరిణామాలు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది.

(……………సశేషం)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s