[ఈ వ్యాసం మొదట ప్రజా పంధా పక్ష పత్రికలో రెండు భాగాలుగా అచ్చయింది. బ్లాగ్ లో 4 భాగాలుగా ఇస్తున్నాను. -విశేఖర్]
*********
ఏప్రిల్ మొదటి వారంలో (4 తేదీ నుండి) ప్రపంచ పౌరులందరినీ ఆకట్టుకున్న వార్త ఒకటి పత్రికల్లో, ఛానెళ్లలో పతాక శీర్షికలను ఆక్రమించింది. దాదాపు ప్రతి దేశంలోనూ తమ పాలకుల అవినీతి, బంధు ప్రీతి, అధికార దుర్వినియోగాల పట్ల విసిగిపోయి ఉన్న ప్రజలకు కొత్తగా ఒక ‘అవినీతి వ్యతిరేక మెస్సయ్యా’ ప్రత్యక్షమయిన భావనను ఆ వార్త కలిగించింది. ‘ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ -ఐసిఐజే’ (అంతర్జాతీయ పరిశోధనాత్మక విలేఖరుల సహసంస్ధ) పేరుతో అనేక దేశాల నుండి వందలాది మంది విలేఖరులతో ఓ సంస్థ ఏర్పరిచారని విదేశీ ఖాతాల్లో నల్ల డబ్బు దాచిన ప్రముఖుల వివరాలపై ఈ సంస్థ పరిశోధనలు సాగిస్తున్నదని ఈ వార్త తెలియజేసింది. తాజాగా పనామా దేశంలోని మొస్సాక్ ఫన్సేకా అనే న్యాయ సలహా సంస్థలో పని చేసే ఉద్యోగి ఒకరు ఆ సంస్థ యొక్క కష్టమర్ల అంతర్గత సమాచారంతో కూడిన వివరాలను భారీ మొత్తంలో జర్మనీ లోని సూయిడోచి జైటంగ్ (Süddeutsche Zeitung జర్మన్ ఉచ్ఛారణ) పత్రికకు లీక్ చేశాడని పత్రికలు చెప్పాయి. సదరు పత్రాలను జల్లెడ పట్టి వివిధ దేశాల్లోని నల్లడబ్బు యాజమానుల పేర్లను వెల్లడి చేసే పని కోసం సూయిడోచి జైటంగ్, ఐసిఐజేతో జట్టు కట్టిందని చెప్పారు.
సూయిడోచి జైటంగ్ పత్రికను ఇక నుండి ఎస్‌జెడ్ అనీ, మొస్సాక్ ఫన్సెకాను ఎంఎఫ్ అనీ ప్రస్తావించుకుందాం. ఎస్‌జెడ్ వెబ్ సైట్ ప్రకారం ఇప్పటికి ఒక సంవత్సరం క్రితం ఒక అజ్ఞాత వ్యక్తి ఎస్‌జెడ్ ను సంప్రదించి ఎన్క్రిప్ట్ చేసిన అంతర్గత పత్రాలను (ఎంఎఫ్ కు చెందినవి) భారీ మొత్తంలో సమర్పించాడు. ఎన్క్రిప్ట్ చేసిన డాక్యుమెంట్స్ ని కంప్యూటర్ లో మామూలుగా తెరిచి చదవడం వీలు కాదు. ఒక ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ తో కోడింగ్ చేసి ఉంచుతారు గనుక సదరు కోడ్ ని ఛేదించితేనే వాటిని తెరిచి చదవడం వీలవుతుంది. ఎంఎఫ్ కంపెనీకి చెందిన అత్యంత రహస్య పత్రాలు కనుక అజ్ఞాత వ్యక్తి కంపెనీలో ఉన్నత స్ధాయి ఉద్యోగి అయి ఉంటాడని ఐఎస్‌ఐజే నమ్మబలికింది. పత్రాలు లీక్ చేసినందుకు ఎలాంటి ప్రతిఫలము కోరలేదని చెప్పింది. అనగా అవినీతిపరుల గుట్టు వెల్లడి చేయడమే లక్ష్యంగా లీకేజి జరిగిందని ఐసిఐజే చెప్పదలిచింది.
ఎస్‌జెడ్ వెబ్ సైట్ ప్రకారం పనామా పేపర్స్ లో 214,000 షెల్/పేపర్ కంపెనీల కార్యకలాపాలు దాగి ఉన్నాయి. ఇవి మొస్సాక్ ఫన్సెకా కంపెనీకి చెందిన 14,000 మంది క్లయింటుల (వ్యక్తులు, సంస్థలు) కు చెందిన కంపెనీలు. 300,000 ఖాతాల లావాదేవీలు ఇందులో ఇమిడి ఉన్నాయి. పనామా పేపర్ల మొత్తం పరిమాణం కంప్యూటర్ స్టోరేజీ లెక్కల్లో చూస్తే 2.6 టెర్రా బైట్లకు సమానం. దీన్ని సాధారణ దృష్టితో అర్ధం చేసుకోవాలంటే: ఒక సిడిలో 700 మెగా బైట్ల డేటా నిక్షిప్తం చేయవచ్చు. అనగా పనామా పేపర్స్ ని సిడిలలోకి ఎక్కిస్తే గనక అది 3,715 సిడిలకు సరిపోతుంది. లేదా డివిడిలో 4.7 గిగా బైట్ల డేటా నిక్షిప్తం చేయొచ్చు. అనగా పనామా పేపర్స్ ని డివిడి ల కిందికి మార్చితే 554 డివిడిలు అవుతాయి. 1977 నుండి 2015 డిసెంబర్ వరకు ఎంఎఫ్ కంపెనీ నిర్వహించిన ఖాతాదారుల వివరాలు పనామా పేపర్స్ లో నిక్షిప్తమై ఉన్నాయి. ఏప్రిల్ నెలలో ఐసిఐజే, దాని భాగస్వాములు అంతా కలిసి విడుదల చేసిన వివరాలు 2.6 టెర్రా బైట్లలో భాగంగా ఇసుక రేణువుతో సమానం. మిగిలిన డేటాను ఎందుకు విడుదల చేయలేదు? కనీసం ఇతరులు పరిశీలించడానికి వీలుగా అందుబాటులో ఎందుకు ఉంచలేదు?
ఇంతకీ ఎంఎఫ్ కంపెనీ అంతర్గత పత్రాలకు అంత విలువ ఎందుకు? ఎందుకంటే విదేశీ (ఆఫ్ షోర్) కంపెనీలకు సంబంధించి అది ప్రపంచంలోనే నాలుగవ అతి పెద్ద న్యాయ సలహా సంస్థ కావడం వల్ల. ఆఫ్ షోర్ కంపెనీలు అంటే మామూలువి కావు. వివిధ దేశాలలో అక్రమంగా సంపాదించిన, పన్నులు ఎగవేసిన నల్ల డబ్బును ట్యాక్స్ హెవెన్ బ్యాంకుల్లో రహస్యంగా దాచి పెట్టడానికి వినియోగించే పేపర్ కంపెనీలు. ఈ కంపెనీలు పేపర్ మీద మాత్రమే ఉంటాయి తప్ప వాస్తవంగా ఉనికిలో ఉండవు. పేరు పొందిన ప్రతి కంపెనీ, వ్యక్తీ, సంస్థా ఇలాంటి కంపెనీల మాటున తమ డబ్బును పన్నులు కట్టనవసరం లేని విదేశీ బ్యాంకుల్లో దాచి పెడతాయి. ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో వారు చెప్పనవసరం లేదు. డబ్బుకి అసలు యజమాని అయిన వ్యక్తి లేదా సంస్థ పేరుకు బదులుగా పేపర్ కంపెనీలను కవర్ గా వినియోగిస్తారు. కనీసం రెండు, మూడు పేపర్ కంపెనీలను పొరలు పొరలుగా అసలు పేరు పైన పేర్చడం ద్వారా అసలు యజమాని పేరును దాచి పెట్టి ఉంచుతారు. అనగా ఒక పేపర్ కంపెనీ యజమానిగా మరో పేపర్ కంపెనీ ఉంటుంది. అందులో మరో రెండు మూడు పేపర్ కంపెనీలకు వాటాలు ఉండవచ్చు. ఎంత డబ్బు పెడితే అన్ని పొరలతో రహస్యాన్ని కప్పి పెట్టే సౌలభ్యం అందుబాటులో ఉంచుతారు. ఈ పేపర్ కంపెనీల మధ్యలో అసలు యజమానులు ఎక్కడో దాగి ఉంటారు. ఫలానా కంపెనీ యజమాని/కంట్రోలింగ్ షేర్ హోల్డర్/సిఈఓ ఫలానా అసలు వ్యక్తి అన్న నిజాన్ని మళ్ళీ వివిధ ఐడి ప్రూఫ్ ల కింద దాచి ఉంచుతారు. ఎవరన్నా వీటిని ఆడిట్ చేయడానికి పూనుకుంటే పేపర్ కంపెనీలు కనిపిస్తాయి గాని అసలు యజమానులు కనిపించరు.
జీరో హెడ్జ్ అనే మీడియా సంస్థ పనామా లీక్ ను ఇలా అభివర్ణించింది: “ఇంత వరకు కనీ వినీ ఎరుగని స్ధాయిలో ఆఫ్ షోర్ ప్రపంచం లోపలి దృశ్యాన్ని -రోజు వారీగా, సంవత్సరం వారీగా, దశాబ్దాల వారీగా- విప్పి చూసేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ప్రపంచ ఫైనాన్షియల్ వ్యవస్థ గుండా చీకటి డబ్బు ఎలా ప్రవహిస్తుందో, అది జాతీయ ట్రెజరీల పన్నుల వసూళ్లను ఊడబెరికే నేరమయ కార్యకలాపాలను ఎలా పెంచి పోషిస్తుందో చూపిస్తుంది.” వివిధ పత్రికల ప్రకారం ఆఫ్రికా వజ్రాల వ్యాపారంలో అంతర్జాతీయ ఆర్ట్ మార్కెట్ లో వేళ్ళు దూర్చింది. ఒక ప్యాలస్ నింపడానికి సరిపడా రాయల్టీని మధ్య ప్రాచ్యం కంపెనీల నుండి ఆర్జించింది. మొరాకో రాజు మహమ్మద్ VI, సౌదీ రాజు కింగ్ సల్మాన్ లు లగ్జరీ పడవల్లో సముద్ర యానం చేయడానికి సహకరించింది. ఐస్ లాండ్ 2010లో ఋణ సంక్షోభంలో ఉన్న కాలంలో ఆ దేశ ప్రధాని గన్లాగ్సన్, ఆయన భార్య బ్యాంకుల్లో రహస్య ఖాతాల్లో డబ్బు దాచారు. ఈ వెల్లడితో ఆయన రాజీనామా చేయవలసి వచ్చింది.
కనుక పనామా పేపర్లలో దాగి ఉన్నవి మామాలు వివరాలు కావు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు, కంపెనీలు చేసుకున్న అక్రమ ఒప్పందాలు, చీకటి ఒప్పందాలు, మనీ లాండరింగ్ ఆపరేషన్ల వివరాలు, పేరు పొందిన బడా బహుళజాతి బ్యాంకులు క్లయింటులకు అందజేసే రహస్య పన్ను ఎగవేత పధకాలు.. ఈ గుట్టుమట్లన్నీ పనామా పేపర్స్ లో దాగి ఉన్నాయి. అథ్లెట్లు, వివిధ రంగాలలోని సెలబ్రిటీలు, ప్రపంచ నేతలు, రాజకీయ నాయకులు, వారి బంధువుల అక్రమ సంపాదన వివరాలూ ఉన్నాయి. ఆయా వ్యక్తులు మరియు సంస్థల అసలు గుర్తింపును పట్టిచ్చే కాంట్రాక్టులు, రహస్య ఈ-మెయిళ్ళు, బ్యాంకు రికార్డులు, ఆస్తుల పత్రాలు, పాస్ పోర్ట్ కాపీలు సైతం పనామా పత్రాల్లో నిక్షిప్తమై ఉన్నాయి.
విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు తెరవడం, విదేశీ బ్యాంకుల్లో సేఫ్టీ డిపాజిట్ బాక్స్ లు నెలకొల్పడం, విదేశీ ట్రస్టు ఏర్పాటు చేయడం, విదేశాలలో కార్పొరేషన్లు/కంపెనీలు స్థాపించడం… నల్ల డబ్బు తరలించడంలో ఇవి కొన్ని ముఖ్యమైన పద్ధతులు. స్విట్జర్లాండ్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, చానెల్ ఐలాండ్స్, లీష్టెన్ స్టీన్, కుక్ ఐలాండ్స్, పనామా, సీషెల్స్, హాంగ్ కాంగ్, బహమాస్, సెయింట్ కిట్స్, కేమన్ ఐలాండ్స్, యాంగ్విల్లా, బెర్ముడా, మాంట్సెర్రాట్, టర్క్స్ అండ్ సైకోస్ ఐలాండ్స్ మొ.న చిన్న, ద్వీప దేశాలు రహస్య ఖాతాల బ్యాంకులకు నిలయాలు. స్విట్జర్లాండ్, హాంగ్ కాంగ్ లాంటి దేశాలు తప్ప మిగిలిన దేశాలన్నీ ద్వీప దేశాలు. అవి వ్యవసాయం, పరిశ్రమలు లాంటి విస్తారమైన కార్యకలాపాలతో కూడిన ఆర్ధిక వ్యవస్థలు కావు. పదుల వేల నుండి కొన్ని లక్షల వరకు జనాభా మాత్రమే కలిగిన ఈ దేశాలు ప్రధానంగా సామ్రాజ్యవాదుల ప్రాపకంలో ఉనికిని కలిగి ఉంటాయి. కార్పొరేట్ కంపెనీలు, ధనిక వర్గాలకు ద్రవ్య సేవలు అందించడమే ఈ దేశాలకు ప్రధాన ఆదాయ వనరు. సామ్రాజ్యవాద దేశాల ఆజ్ఞలకు బద్ధులై నడుచుకునే ఈ దేశాలు స్వతంత్రంగా, ముఖ్యంగా అమెరికా-ఐరోపాల ప్రయోజనాలకు విరుద్ధంగా నల్ల డబ్బు దాచి పెట్టడం సాధ్యం కాదు. ఆ శక్తి వాటికి లేదు. వాస్తవం ఏమిటంటే సామ్రాజ్యవాద బహుళజాతి గుత్త కంపెనీల చీకటి ఫైనాన్స్ సామ్రాజ్యాలకు ఫైనాన్స్ మజిలీలుగా ఈ దేశాలను సామ్రాజ్యవాదులే మలుచుకున్నారు. కనుక ఈ కార్యకలాపాలను లీక్ చేయడం సామ్రాజ్యవాదులకే నష్టకరం. సామ్రాజ్యవాదులకు నష్టంగా పరిణమించే ఐసిఐజే పరిశోధనను వాషింగ్టన్ నుండే పనిచేసేటట్లుగా అమెరికా పనిగట్టుకుని ఎందుకు అనుమతించినట్లు? ఇది ముఖ్యమైన ప్రశ్న. పనామా పేపర్స్ పరిశోధనలో ఒక్క అమెరికా వ్యక్తి గానీ కంపెనీ గానీ వెల్లడి కాకపోవడం ఈ సందర్భంగా గమనించాలి.
మరింత విశ్లేషణ లోకి వెళ్ళేముందు ఒక సంగతి గుర్తించాలి. డబ్బు లేదా ఆస్తులను విదేశాలకు తరలించడం దానికదే నేరం కాదు. పన్నులు చెల్లించని డబ్బును రహస్యంగా తరలించడమే నేరం. అనగా ప్రభుత్వాల, ఆదాయ చట్టాల కన్నుగప్పి తరలించడమే నేరం. కనుక విదేశీ ఖాతాలలో డబ్బు ఉన్నంతనే అది నల్ల డబ్బు కానవసరం లేదు. స్వదేశాల్లో నేర సామ్రాజ్యాల నుండి తమ సొమ్ము కాపాడుకునేందుకు అనేక ధనిక కుటుంబాలు విదేశాల్లో ఆస్తులు కొంటున్నాయి. ప్రభుత్వాలు నియంత్రించే పెట్టుబడి నియంత్రణల నుండి తప్పించుకోడానికి పన్నులు చెల్లించి ఆస్తులు తరలించడం, కంపెనీల విదేశీ కార్యకలాపాల కోసం డబ్బు తరలించడం చట్టబద్ధమే. రెండుకు పైగా దేశాల్లో విస్తరించి ఉండే కంపెనీల విలీనం & స్వాధీనం, దివాళా పిటిషన్లు, ఎస్టేట్ ప్లానింగ్, వ్యక్తిగత భద్రత, పెట్టుబడుల పునర్నిర్మాణం మరియు సమీకరణల కోసం నిధుల నిర్వహణ మొ.న కార్యకలాపాల కోసం విదేశీ ఖాతాలు నిర్వహించడం చట్టబద్ధం. అయితే ఇలాంటి చట్టబద్ధమైన తరలింపులు అక్రమ తరలింపులతో పోల్చితే చాలా తక్కువ. నిజానికి ఈ చట్టబద్ధ కార్యకాలాపాల మాటున చట్ట విరుద్ధ కార్యకలాపాలు నిర్వహించడమే అసలు సంగతి. చట్టబద్ధ నియమాలకు అనుగుణంగానే తమ ఆఫ్ షోర్ కార్యకలాపాలు రిజిష్టర్ అయ్యాయని బిగ్ బి (అమితాబ్ బచ్చన్) ప్రకటించడం ఈ నేపధ్యంలో చూడవచ్చు. పనామా పేపర్స్ పేరుతో వాషింగ్టన్ నుండి నడిచే ఐసిఐజే సంస్థ విడుదల చేసిన జాబితాలో అమెరికన్ల పేర్లు లేకపోగా అమెరికా వ్యతిరేక వ్యక్తులు, దేశాల నేతల పేర్లు ప్రధానంగా చోటు చేసుకోవడం గమనించి తీరాలి.
మొస్సాక్ ఫన్సెకా
జర్మన్ లాయర్ జుర్గెన్ మొస్సాక్, పనామా లాయర్ రామన్ ఫన్సెకా.. వీరు ఇరువురు స్థాపించిన సంస్థ మొస్సాక్ ఫన్సెకా. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా వీళ్ళ తండ్రులు జర్మనీ నుండి పారిపోయి పనామాలో సెటిల్ అయ్యారు. అంతర్జాతీయ స్ధాయిలో న్యాయ సలహా సేవలు అందించడం ఈ సంస్థ వ్యాపారం. పైన చెప్పిన చట్ట బద్ధ కార్యకాలాపాలు అన్నింటికీ న్యాయ ప్రక్రియలు అనివార్యంగా తోడై ఉంటాయి. ప్రపంచ వ్యాపార చట్టాలకు అనుగుణంగా వ్యాపారాలు జరగాలి కనుక ప్రపంచ చట్టాలకు (ద్వైపాక్షిక, బహుళ పక్ష ఒప్పందాలకు) అనుకూలమా, సానుకూలమా అన్నది క్లయింటుల తరపున న్యాయ సలహా సంస్థలు నిర్ణయిస్తాయి. అలాగే ఆయా దేశాల చట్టాలను, ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించకుండా డబ్బు తరలించే ప్రక్రియ జరిగిందని రుజువు చేసుకోవడంలో న్యాయ సలహా సంస్థల అవసరం ఉంటుంది. అయితే ఇదంతా ఖాతాదారులు బహిరంగంగా ఉన్నప్పుడు కూడా అవసరమే. రహస్య ఖాతాలు నిర్వహించడానికి సోర్స్ దేశాల చట్టాలతో పాటు టాక్స్ ఎగవేత దేశాల చట్టాలు కూడా తెలిసి ఉండాలి.
ఈ పనినే ప్రధానంగా మొస్సాక్ ఫన్సెకా లాంటి కంపెనీలు చేసి పెడతాయి. అనేక పేపర్ కంపెనీలను అక్కడి చట్టాలకు అనుగుణంగా అప్పటికే అవి నిర్వహిస్తూ ఉంటాయి. వాటిని నల్ల డబ్బు సొంతదారులకు అమ్ముకుంటాయి. అమ్మడమే కాకుండా రికార్డుల నిర్వహణ కూడా చేస్తాయి. ఖాతాదారు అక్కడికి వెళ్లకుండానే బోర్డు సమావేశాలు నిర్వహించినట్లు, వాటికి ఖాతాదారులు హాజరైనట్లు చూపెడతాయి. ఏమన్నా న్యాయ సమస్యలు వస్తే పరిష్కారం చేస్తాయి. అవసరం అయినప్పుడు డబ్బు విత్ డ్రా చేసి పెడతాయి. పూర్తిగా విత్ డ్రా అయ్యాక పేపర్ కంపెనీలను ఖాతాదారు పేరు కింద నుండి తప్పిస్తాయి. పనామా దేశంలోనే డబ్బు దాయవలసిన అవసరం లేదు. ఇతర ట్యాక్స్ హెవెన్ దేశాలలో దాచిన డబ్బుకు కూడా యజమానులుగా చూపే పేపర్ కంపెనీలను ఎంఎఫ్ లాంటి న్యాయ సలహా కంపెనీలు నిర్వహిస్తాయి. అనగా ఖాతాదారు ఒక దేశంలో పౌరసత్వం కలిగి ఉంటారు. అతని/ఆమె డబ్బు రెండో దేశంలోని బ్యాంక్ లోని రహస్య ఖాతాలో ఉంటుంది. ఆ ఖాతా యజమానిగా మూడో దేశంలోని పేపర్ కంపెనీని చూపుతారు. ఇలాంటి తప్పుడు పనులు చేసిపెట్టే న్యాయ సలహా కంపెనీలలో ప్రపపంచంలో కెల్లా నాలుగవ అతి పెద్ద కంపెనీ మొస్సాక్ ఫన్సెకా.
మరో కోణంలో చూస్తే, వ్యాపారం చేయడానికి షెల్ (ఖాళీ) కంపెనీలు లేదా పేపర్ కంపెనీలకు ఒక రిజిస్టర్డ్ ఏజెంటు అవసరం అవుతారు. ఆ ఏజెంటు తరచుగా అటార్నీ/అటార్నీ కంపెనీ అయి ఉంటారు. కంపెనీ స్థాపనకు సంబంధించిన కాగితాలను ఫైల్ చేయడం ఆ ఏజెంటు సంస్థ చూసుకుంటుంది. షెల్ కంపెనీ అడ్రస్ తరచుగా ఆ ఏజెంట్ కంపెనీయే అవుతుంది. కంపెనీకీ, అసలు యజమానికీ ఉన్న సంబంధాన్ని వెల్లడి చేయకుండా టాక్స్ హెవెన్ దేశాల చట్టాలు కాపలా కాస్తాయి. కంపెనీ లోపల కంపెనీ, ఆ కంపెనీ లోపల మరో కంపెనీ… ఇలా పొరలు పొరలుగా ఉండే కంపెనీలు ఒక రక్షణ కాగా ట్యాక్స్ హెవెన్ దేశాల రహస్య పరిరక్షణ చట్టాలు మరొక రక్షణ. ఇన్ని రక్షణల మధ్య నల్ల డబ్బు యాజమానుల సొమ్ము భద్రంగా ఉంచబడుతుంది. ఆర్ధిక సంక్షోభాలు పెచ్చరిల్లే కాలంలో ఈ ఖాతాల్లో డబ్బు అమాంతం పెరిగిపోతూ ఉంటుంది. పెట్టుబడిదారీ వ్యాపార సైకిల్ లో బూమ్ దశ వచ్చినపుడు నల్ల ఖాతాల నుండి డబ్బు విత్ డ్రా అవుతూ ఉంటుంది. లేదా నల్ల కంపెనీలు రద్దవుతూ ఉంటాయి.
లీక్ కాదు హ్యాకింగ్!
ఇలాంటి కంపెనీలు కొద్ది మంది ఉన్నత వర్గాలకు సేవలు చేస్తాయి కనుక ప్రచారం ఉండదు. వార్తల్లో కనపడవు. పనామా పేపర్స్ లీకేజి తరహాలో ఉద్దేశ్య పూర్వకంగా ఘటనలు జరిగినప్పుడే వీటి గురించి జనానికి తెలుస్తుంది. ఎంఎఫ్ లో పని చేసే ఒక ఉద్యోగి విజిల్ బ్లోయర్ గా మారి నల్ల డబ్బు వెలికి తీసే గొప్ప లక్ష్యంతో పనామా పత్రాలను ఎస్‌జెడ్ పత్రికకు లీక్ చేశాడని కదా ఐసిఐజే చెప్పడం! కానీ రెండు రోజుల తర్వాత అది అబద్ధం అని మొస్సాక్ ఫన్సెకా ప్రకటించింది. బైటి దేశాల నుండి తమ కంప్యూటర్లను హ్యాక్ చేసి ఫైళ్లను దొంగిలించారు తప్పితే తమ ఉద్యోగి ఎవరూ పత్రాలను లీక్ చేయలేదని ప్రకటించింది. హ్యాకింగ్ గురించి పనామా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ అంతర్గత విచారణ ఫలితాలను సాక్షాలుగా పోలీసులకు అందజేసింది.
ఇది లీకేజి కాదని, హ్యాకింగ్ అనీ స్వతంత్ర పరిశోధకులు అప్పటికే అనుమానాలు వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన ఒక్క వ్యక్తి గానీ సంస్థ గానీ అక్రమార్కుల జాబితాలో లేకపోవడం, లీక్ చేసిన వ్యక్తి గురించిన ఆనవాళ్ళు ఏవీ బైటికి రాకవడం, లీకుదారుడు ఎలాంటి ప్రతిఫలమూ కోరలేదని చెప్పడం.. ఇవన్నీ నిజాయితీగా లీక్ జరిగిందనడానికి వ్యతిరేకంగా ఉన్నాయని అమెరికా నుండి పని చేస్తున్న ఐసిఐజే గానీ లేదా అమెరికా గూఢచార సంస్థలు సిఐఏ, ఎన్‌ఎస్‌ఏ లాంటివి గానీ హ్యాక్ చేసి వివరాలు దొంగిలించి ఉండవచ్చని వారు అనుమానించారు. ఆ అనుమానాలను మొస్సాక్ ఫన్సెకా ప్రకటన ధ్రువపరిచింది. నిజానికి మొస్సాక్ ఫన్సెకా అక్రమ డబ్బును దాచి పెట్టేందుకు సహాయం చేస్తున్న సంగతి, అసలు ఆ సంస్థ ప్రధాన వ్యాపారం అదేననీ వెల్లడిస్తూ కూడా ఒకటి రెండు సం.ల క్రితం కెన్ సిల్వర్ స్టీన్ లాంటి కొందరు స్వతంత్ర విలేఖరులు వైస్ పత్రికలో వెల్లడి చేశారు. కానీ ప్రధాన స్రవంతిలోని పశ్చిమ కార్పొరేట్ పత్రికలు దానిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఐసిఐజే కార్యాన్ని మాత్రం అదో పెద్ద మహా యజ్ఞంలా ప్రచారం చేసి పెడుతున్నాయి.
ఐసిఐజే
ఐసిఐజేలో ప్రపంచ వ్యాపితంగా విస్తరించిన 400కి పైగా విలేఖరులు, పత్రికలు సభ్యులు అని తెలుస్తున్నది. మెక్ క్లాచి, న్యూయార్క్ టైమ్స్ (అమెరికా), లె మాండే (ఫ్రాన్స్), గార్డియన్, బిబిసి (బ్రిటన్) ఏబిసి న్యూస్ (ఆస్ట్రేలియా), హారెట్జ్ (ఇజ్రాయెల్), క్యోడో న్యూస్ (జపాన్), ఎల్ ఎస్ప్రెసో (ఇటలీ) ఇండియన్ ఎక్స్ ప్రెస్ (ఇండియా), టొరొంటో స్టార్ (కెనడా) మొ.నా ప్రఖ్యాత పత్రికలు ఐసిఐజేతో జట్టు కట్టి పనామా పేపర్స్ విశ్లేషణలో నిమగ్నం అయ్యామని ప్రకటించాయి. ఐసిఐజేలో 40 శాతం సభ్యులు అమెరికా, పశ్చిమ యూరప్ లకు చెందిన విలేఖరులు సంస్ధలేనని విశ్లేషకుల ద్వారా తెలుస్తున్నది. తమకు 64 దేశాల నుండి సభ్యులు ఉన్నారని ఐసిఐజే తన వెబ్ సైట్ లో తెలిపింది. ఎస్‌జెడ్ నుండి ఇండియన్ ఎక్స్ ప్రెస్ వరకూ ఐసిఐజేతో సహకారం వహిస్తున్న పత్రికలన్నీ ఆయా దేశాలలోని ప్రభుత్వ, పాలక వ్యవస్థలకు గట్టి మద్దతుదారులు, గోయెంకా గ్రూపు పత్రికలు బిజేపికి మద్దతుదారులని తెలిసిన విషయమే.
ఈ పత్రికలు విదేశీ నల్ల డబ్బు ఖాతాలకు కొత్త కాదు. బహుళజాతి కంపెనీల అక్రమ కార్యకలాపాలను ఇవి ఏనాడూ ప్రశ్నించి ఎరగవు. అక్రమ ఖాతాదారులైన రాజకీయ నాయకులను, ధనికులను ఎదుర్కున్న చరిత్ర ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు లేదు. పైగా ఆ పత్రిక యజమానులే ధనిక స్వామ్య వ్యవస్ధలో భాగస్వాములు. అమెరికాలోని వాల్ స్ట్రీట్ కంపెనీలపై ఈగ వాలడానికి కూడా న్యూయార్క్ టైమ్స్, మెక్క్లాచి వార్తా సంస్థలు ఒప్పుకోవు. అమెరికా సాగించే దురాక్రమణ యుద్ధాలకు పూర్తి మద్దతుదారులు. 2008 ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం నేపధ్యంలో ట్రిలియన్ల కొద్దీ సొమ్మును ప్రైవేటు బహుళజాతి కంపెనీలకు ఉద్దీపన పధకాల కింద ఆప్పగించడానికి అనుకూలంగా వాదించిన పత్రికలు. ఇలాంటి పత్రికలు విదేశీ ఖాతాలలో నల్ల డబ్బు వెలికి తీయడానికి కృషి చేస్తాయంటే నమ్మడం ఒట్టి వెర్రిబాగులతనం.
(…………………సశేషం)
Hi Sekhar Garu, how are you? I have one doubt.
Sir,Indian express played an important role in exposing mighty Reliance group(Ramnadh Goenka vs Dhirubhai Ambani). So how can we understand this tussle. Can we conclude like Ramnadh goenka exposed Dhirubhai out of their ego clashes rather than National Interest.
Hi Praveen,
Fine, thank you.
Ambanis, Goenkas etc.., don’t have national interest. They only have business interests. They don’t care if their business interests are against to the national interests. To be factual, their business interests are subservient to MNCs of mainly western imperialist countries.
There may be some ego clashes here and there, but their egos do not interfere in business interests. Naturally, there will be contradictions between the interests of two business empires. Because one tries to appropriate total market at the cost of others. This is the main contraction that propels them to contradict each other. In this process, they even resort to sabotage activities on another.
Again they may collude with one another if that helps to further their business interests. Some times unity plays upper role and some other times rivalry plays upper role which solely depends upon their business interests.
You have to understand their rivalry in this background.