పనామా పేపర్స్: పుతిన్ ఎందుకు కేంద్రం అయ్యాడు? -2


Panama Papers

(మొదటి భాగం తరువాత……….)

అసలు ఐ‌సి‌ఐ‌జే ఎక్కడిది? సంవత్సరం క్రితం వరకూ దీనిని గురించి తలచుకున్నవారు లేరు. 1997లో స్థాపించినట్లు చెబుతున్న దీని మాతృ సంస్థ సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటెగ్రిటీ (సి‌పి‌ఐ). సి‌పి‌ఐకి నిధులు సమకూర్చి పెడుతున్న వాళ్ళు ఎవరో తెలుసుకుంటే మొత్తం విషయంలో సగం అర్ధం అయిపోతుంది. యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్) మాజీ రాయబారి క్రెయిగ్ ముర్రే తన వెబ్ సైట్ లో ఇలా తెలిపాడు.

“మొస్సాక్ ఫన్సెకా సమాచారాన్ని వడ కట్టిన విధానం పశ్చిమ ప్రభుత్వాల ఎజెండాను నేరుగా అనుసరిస్తోంది. పశ్చిమ దేశాల భారీ కార్పొరేషన్లు లేదా పశ్చిమ దేశాల బిలియనీర్లు అనేకమంది మొస్సాక్ ఫన్సెకా కంపెనీకి క్లయింటులన్న సంగతిని తాము గుర్తించనట్లే ఈ పత్రికలు నటిస్తున్నాయి. ఎం‌ఎఫ్ కంపెనీకి అసలు వాళ్ళే ప్రధాన, పెద్ద కస్టమర్లు. లీక్ అయిన సమాచారంలో అత్యధిక భాగం రహస్యంగానే ఉంచుతామని హామీ ఇవ్వడానికి గార్డియన్ పత్రిక త్వరపడిపోయింది. దీన్ని బట్టి ఏమి గ్రహించవచ్చు? ఈ లీక్ ను గొప్పగా పేరు పెట్టిన, కానీ హాస్యాస్పదంగా స్ఫురించే ‘అంతర్జాతీయ పరిశోధనాత్మక విలేఖరుల సహసంస్ధ’ -ICIJ- గా నామకరణం చేసిన సంస్థ నిర్వహిస్తుండగా ఆ సంస్థను నిర్వహిస్తున్నది అమెరికాలో ప్రఖ్యాతి గాంచిన సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటెగ్రిటి. సి‌పి‌ఐ సంస్థ నిర్వాహకుల జాబితాను ఒకసారి చూడండి!

  • ఫోర్డ్ ఫౌండేషన్
  • కార్నిజీ ఎండోమెంట్
  • రాక్ ఫెల్లర్ ఫేమిలీ ఫండ్
  • డబల్యూ కే కెల్లాగ్ ఫౌండేషన్
  • ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ (జార్జి సోరోస్)
  • ప్యూ ఫౌండేషన్
  • పాకార్డ్ ఫౌండేషన్
  • ప్యూ ఛారిటబుల్ ట్రస్ట్

ఫోర్డ్ ఫౌండేషన్, సి‌ఐ‌ఏల మధ్య అవినాభావ సంబంధం ఈనాటిది కాదు. ఫోర్డ్ ఒక్కటే కాదు. పైన పేర్కొన్న ఏడు ధార్మిక సంస్థలూ సి‌ఐ‌ఏ తో కలిసి అమెరికా తన ఏకచ్ఛత్రాధిపత్యాన్ని కోల్పోకుండా వివిధ ధింక్ ట్యాంక్ ల పేరుతో, పరిశోధనల పేరుతో నిత్యం కుట్రలకు పధక రచన చేస్తుంటాయి. ఇండియాలో స్వాతంత్రం వచ్చినట్లు చెబుతున్నప్పటి నుండీ గూఢచర్యం నిర్వహిస్తున్న చరిత్ర ఫోర్డ్ ఫౌండేషన్ సొంతం. అరబ్ ICIJవసంతంలో భాగంగా ఈజిప్టు, ట్యునీషియా, లిబియాల్లోని సో కాల్డ్ తిరుగుబాట్లకు, ఉద్యమాలకు నిధులు గుప్పించిన వారిలో అమెరికా బిలియనీర్ జార్జి సోరోస్ ముఖ్యుడు. గతంలో వరల్డ్ సోషల్ ఫోరం పేరుతో వార్షిక జాతరలకు నిధులు సమకూర్చినదీ ఆయనే. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నీడన వివిధ ఉద్యమ ఎన్‌జి‌ఓలు ఈజిప్టు ప్రజల తిరుగుబాటులో నేరుగా పాత్ర వహించాయి. యుగోస్లావియా ముక్కలు చెక్కలు కావడానికి దారి తీసిన జాతి వైరాలకు, ఉద్యమాలకు కార్నిజీ, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ లు నిధులు సమకూర్చాయి. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాలలో పని చేస్తున్న వేలాది ఎన్‌జి‌ఓలు రాక్ ఫెల్లర్, డబల్యు కే కెల్లాగ్ ఫౌండేషన్ల కింద పని చేస్తున్నాయి. తమ ఏలుబడిలోని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తలెత్తే నిరసనలను వామ పక్ష ఉద్యమాల కిందికి వెళ్లకుండా తామే ఒడిసి పట్టుకుని నియంత్రణలో ఉంచుకోవడం ఈ ఎన్‌జి‌ఓల ప్రధాన కర్తవ్యం.

ప్యూ ఫౌండేషన్ విషయానికి వస్తే అది ప్యూ కుటుంబానికి చెందిన సన్ ఆయిల్ కంపెనీ (సునోకో) స్థాపించినది. అమెరికాలో అతిపెద్ద గ్యాస్ పంపిణీ కంపెనీల్లో ఒకటి సునోకో. కెనడాలో పెట్రో-కెనడాగా కార్యకలాపాలు నిర్వర్తించే ప్యూ కుటుంబం ఫ్యూ ఛారిటబుల్ ట్రస్ట్ కింద ఫ్యూ ఫౌండేషన్ ను నిర్వహిస్తోంది. స్వేచ్ఛా మార్కెట్ సిద్ధాంతాలను ప్రచారం చేయడం ఫ్యూ ట్రస్ట్, ఫౌండేషన్ల ప్రకటిత లక్ష్యం అంటే ఆశ్చర్య పోకూడదు. బ్యూరోక్రసీ మహా చెడ్డది అని ప్యూ నిశ్చితాభిప్రాయం. ఈ ఐడియాలజీతో ప్రపంచ వ్యాపితంగా అనేక ఎన్‌జి‌ఓలకు నిధులు ఇస్తూ నిర్వహిస్తోంది. తాజాగా ఐ‌సి‌ఐ‌జేలో భాగస్వామ్యం వహిస్తోంది.

ఐ‌సి‌ఐ‌జే సంస్థ మళ్ళీ ఓ‌సి‌సి‌ఆర్‌పిలో ఒక భాగస్వామ్య సంస్థ. ఓ‌సి‌సి‌ఆర్‌పి అంటే Organized Crime and Corruption Reporting Project (సంఘటిత నేరాలు అవినీతి నివేదనా ప్రాజెక్ట్). తూర్పు యూరప్, కాకసస్ (యూరప్, ఆసియా సరిహద్దు ప్రాంతం) మధ్య ఆసియా, సెంట్రల్ అమెరికా దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టుకు అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (USAID) ద్వారా అమెరికా ప్రభుత్వమే నేరుగా నిధులు అందిస్తోంది. ఓ పక్క సి‌పి‌ఐ ద్వారా అమెరికా బిలియనీర్లు మరియు వాళ్ళ ధార్మిక సంస్థలు, మరో పక్క అమెరికా ప్రభుత్వమే నేరుగా నిధులు, సహాయం అందిస్తున్న ఐ‌సి‌ఐ‌జే, మొస్సాక్ ఫన్సెకా కంపెనీ కంప్యూటర్లను హ్యాక్ చేసి (అక్రమంగా జొరబడి) ఆ కంపెనీ క్లయింటుల సమాచారాన్ని భారీ మొత్తంలో దొంగిలించిందని గ్రహించడంలో ఇక ఎవరికీ అనుమానం అవసరం లేదు. కాగా, పశ్చిమ కార్పొరేట్ మీడియా ఈ సమాచారంలో ఎంపిక చేసుకున్న భాగాలను ప్రచురిస్తూ అలా చేయడం వెనుక రహస్య అజెండా ఉందని చాటుతోంది.

అమెరికా ఈ పని ఎందుకు చేసినట్లు? ఈ వెల్లడి వెనుక ఉన్న రహస్య అజెండా ఏమిటి? ఆ అజెండాలో అమెరికాకు ఒనగూరే లాభం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకుంటే కుట్ర పూర్తి స్వభావం అర్ధం అవుతుంది.

రెండు లక్ష్యాలు

కెనడాకు చెందిన గ్లోబల్ రీసెర్చ్ సంస్థ ప్రకారం ఎంపిక చేసిన వివరాలను మాత్రమే ప్రచురించడం వెనుక రెండు లక్ష్యాలు ఉన్నాయి.

1. అమెరికా సామ్రాజ్య శత్రువుల పైన బురద జల్లడం. ప్రస్తుతం అమెరికా జైత్రయాత్రకు రష్యా అధ్యక్షుడు పుతిన్, సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ లు ప్రబల శత్రువులుగా అవతరించారు. అమెరికా, ఐరోపా పత్రికలు ప్రధానంగా వీరిద్దరినే లక్ష్యం చేసుకుని పనామా పేపర్స్ చుట్టూ కధలు అల్లి ప్రచురిస్తున్నాయి.

2. పనామా పేపర్స్ డేటా బేస్ లోని ఇతర ముఖ్యమైన పేర్లను దాచి ఉంచడం. తద్వారా అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా అవసరం అయినప్పుడు ప్రత్యర్థులుగా మారగల వ్యక్తుల, సంస్ధల పేర్లను ప్రచురించే అవకాశాన్ని అట్టే పెట్టుకున్నారు. ఆ విధంగా దాచి ఉంచిన డేటాను ఒక సమగ్ర బ్లాక్ మెయిలింగ్ అస్త్రంగా ప్రయోగించే అవకాశం ఏర్పరచుకున్నారు.

మిత్రులపై మౌనం, శత్రువులపై బురద

పనామా పేపర్స్ లో అనేకమంది ప్రముఖుల పేర్లు వెల్లడి అయ్యాయి. బ్రిటన్ ప్రధాని కామెరూన్ తండ్రి ఇయాన్ డొనాల్డ్ కామెరాన్, మాజీ ప్రధాని మార్గరెట్ ధాచర్ కుమారుడు మార్క్ ధాచర్, ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పొరొషెంకో, ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ కొడుకు ఆల్-ముబారక్, అర్జెంటీనా ప్రస్తుత ప్రధాని మౌరిషియో మక్రి, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, సౌదీ రాజు సల్మాన్, అజర్ బైజాన్ అధ్యక్షుడు ఇల్షామ్ అలీయెవ్ కుటుంబ సభ్యులు, స్పెయిన్ మాజీ రాజు జువాన్ కార్లోస్ సోదరి, చైనా అధ్యక్షుడు గ్జి జెన్ పింగ్ షడ్రకుడు, మాజీ ప్రధాని లీ పెంగ్ కుమార్తె, ఐస్ లాండ్ ప్రధాని సిగ్మందర్ డేవిడ్ గన్లాగ్సన్, ఆర్ధిక మంత్రి బ్జార్ణి బెనెడిక్ట్ సన్, హోమ్ మంత్రి ఒలోఫ్ నోరల్, పాలక పార్టీ (ప్రోగ్రెసివ్ పార్టీ) అధ్యక్షుడు ఒలోఫ్ హోరల్, ఫిఫా (క్రికెట్ కు ఐ‌సి‌సి ఎలాగో ఫుట్ బాల్ కు ఎఫ్‌ఐ‌ఎఫ్ఎ అలాగ) ఎథిక్స్ కమిటీ సభ్యులు, ఫుట్ బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ (ప్రస్తుతం ఈయన వరల్డ్ నెంబర్ వన్ గా వెలుగొందుతున్నాడు), యూ‌ఏ‌ఈ అధ్యక్షుడు, అబుదాబి ఎమిర్ ఖలీఫా బిన్ జయేద్, కటార్ మాజీ అమీర్ హమద్ బిన్ ఖలీఫా అల్ ధాని, జార్జియా మాజీ ప్రధాని బిద్జినా ఇవానిష్విల్లి, ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కొని, జోర్డాన్ మాజీ ప్రధాని అలీ అబు ఆల్-రాఘెబ్, పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో, ఇండియాలో లోక్ సత్తా పార్టీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు అనురాగ్ కేజ్రీవాల్, … మొ.న పేర్లు పనామా పేపర్స్ ద్వారా వెల్లడి అయ్యాయి.

2008 ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం, ఐరోపా ఋణ సంక్షోభంల దరిమిలా ఐస్ లాండ్ ప్రభుత్వం అప్పులు చెల్లించలేక దివాళా తీసింది. దేశంలో తీవ్ర అలజడి చెలరేగింది. అలాంటి సమయంలో ప్రధాని సిగ్ముందర్, ఆయన కేబినెట్ లోని సగం మంది సభ్యులు విదేశీ ఖాతాలకు డబ్బు తరలించారని పనామా పేపర్స్ వెల్లడి చేశాయి. ఈ వెల్లడితో మళ్ళీ ప్రజాగ్రహం కట్టలు తెంచుకోవడంతో ఆయన రాజీనామా చేయక తప్పలేదు. కానీ ఈ వ్యవహారం పశ్చిమ పత్రికల్లో పతాక శీర్షికలకు నోచుకోలేదు. ఉక్రెయిన్ లో మాజీ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ అవినీతికి వ్యతిరేకంగా అని చెబుతూ పశ్చిమ రాజ్యాలు నాజీ తీవ్రవాద సంస్థలను ప్రోత్సహించి హింసాత్మక అల్లర్లు రెచ్చగొట్టి తమ అనుకూలుడు పెట్రో పొరొషెంకోను గద్దెపై కూర్చోబెట్టారు. దానికి వ్యతిరేకంగా తూర్పు ఉక్రెయిన్ ప్రజలు సాయుధ తిరుగుబాటు చేశారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. దేశంలో తీవ్ర అంతర్యుద్ధం జరుగుతుండగానే బిలియన్ల కొద్దీ డబ్బును పొరోషెంకో దేశం దాటించినట్లు పనామా పేపర్స్ వెల్లడి చేశాయి. పొరోషెంకో ప్రభుత్వం విదేశీ ఖాతాలపై చర్యలు తీసుకుంటామని చెబుతున్న కాలంలోనే 11.6 బిలియన్ డాలర్లు ఆఫ్ షోర్ ఖాతాలకు తరలి వెళ్లిందని పనామా పేపర్స్ లో వెల్లడి అయింది. అయితే ఉక్రెయిన్ లో తమ తరపున రష్యాతో తలపడుతున్న పోరోషెంకో అవినీతి పశ్చిమ మీడియాకు వార్తగా కనపడలేదు.

బ్రిటిష్ ప్రధాని కామెరాన్ తండ్రి ఇయాన్ కామెరాన్ (ఇటీవల చనిపోయాడు) రహస్య ఖాతాకు లబ్దిదారు సహజంగా ఆయన కుమారుడే. కానీ బ్రిటిష్ పత్రికలు ఈ వ్యవహారాన్ని కార్పెట్ కిందకు నేట్టేందుకు శ్రమిస్తున్నాయి. ఏ విలేఖరి అన్నా ప్రశ్నిస్తే అడ్డంగా సమాధానం ఇస్తున్నారు. “ఇది ప్రైవేటు వ్యవహారం. మేము ప్రభుత్వం పని పైన కేంద్రీకరించాం. 2012 లోనే మేము సమాధానం ఇచ్చేసాము. ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏమీ లేదు” అని కామెరాన్ ప్రతినిధి ఓ విలేఖరుల సమావేశంలో సమాధానం చెప్పి తప్పుకున్నాడు. జోక్ ఏమిటంటే ‘ప్రధాని త్వరలో అవినీతి వ్యతిరేక కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు, పనామాతో కలిసి సీరియస్ పని మొదలు పెడతారు’ అంటూ కామెరాన్ కార్యాలయం ప్రకటన విడుదల చేయడం. ప్రధాన బ్రిటిష్ పత్రికలు కామెరాన్ ఖాతాల లోతుల్లోకి వెళ్ళేందుకు ప్రయత్నించలేదు. తమ ప్రధాని రహస్య ఖాతాలకు ఏ విధంగా లబ్దిదారుడూ విశ్లేషణ చేయలేదు. తమ మాజీ ప్రధాని, ఉక్కు మహిళ ధాచర్ కుమారుడి ఖాతాల గురించి తలచుకోను కూడా లేదు. పుతిన్, బషర్ లపై మాత్రం రోజుకో కధ విడుదల చేస్తున్నాయి. జర్మనీ విషయానికి వస్తే ఆ దేశానికి చెందిన 173 కంపెనీలు, 53 మంది క్లయింటులు, 251 మంది షేర్ హోల్డర్లు ఎం‌ఎఫ్ సేవలను వినియోగించుకున్నారని ఎస్‌జెడ్ పత్రిక చెప్పింది గానీ వాళ్ళ పేర్లు మాత్రం వెల్లడి చేయలేదు. సౌదీ రాజు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రష్యా చమురు, గ్యాస్ ఆదాయాన్ని తగ్గించేందుకు అమెరికాతో కుమ్మక్కై భారీగా చమురు ఉత్పత్తి చేయడం ద్వారా ప్రపంచ చమురు ధరలు పడిపోయేలా చేసిన వ్యక్తి సౌదీ రాజు. ఆయన వద్ద డబ్బు ఎంతగా మూలుగుతోందంటే చమురు ధరల తగ్గుదల వల్ల తనకే నష్టం అయినా లెక్క చేయలేనంతగా. సౌదీ అరేబియా క్రూర నియంత ఐనప్పటికీ అమెరికా అండదండలు ఆయనకు పుష్కలంగా లభిస్తాయి. కనుక ఆయన ఎంత డబ్బు ఆఫ్ షోర్ ఖాతాల్లో దాచాడో విశ్లేషించే వారు లేరు. ఆయనకు రహస్య ఖాతాలు ఉండడం నిజానికి ఎవరినీ ఆశర్యపరచలేదు.

ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ప్రత్యర్థులుగా అమెరికాకు ప్రస్తుతం చెమటలు పట్టిస్తున్న నేతలు పుతిన్ (రష్యా), బషర్ (సిరియా) లు. పనామా పేపర్స్ ఆధారం చేసుకుని వీరిద్దరి పైనే అమెరికా, ఐరోపా మీడియా కంపెనీలు ప్రధానంగా దాడి చేస్తోంది. ఇతర ప్రముఖ ప్రపంచ నేతలు, ప్రభుత్వాల నేతల పేర్లు కూడా వెల్లడి అయినప్పటికీ వీరద్దరినే టార్గెట్ చేసుకుని స్టోరీలు అల్లుతున్నారు. ‘పనామా పేపర్స్’ గురించి ఏ వార్త రాసినా పుతిన్ ఫోటోను ఫీచర్ ఫోటోగా ముద్రిస్తున్నారు. నిజం ఏమిటంటే పుతిన్, బషర్ ల పేర్లు పనామా పేపర్స్ లో అస్సలు లేవు. కనీసం వారి కుటుంబ సభ్యుల పేర్లు కూడా లేవు. వారికి ‘అత్యంత దగ్గరి స్నేహితులు’ అని పశ్చిమ మీడియా డిసైడ్ చేసిన వాళ్ళ పేర్లు మాత్రమే ఉన్నాయి. అంటే తన స్నేహితుల ధన రాశుల్ని కూడా యథేచ్ఛగా ఖర్చు పెట్టేసే సువర్ణావకాశం పుతిన్, అస్సాద్ లకు పశ్చిమ మీడియా అంటగట్టింది.

పుతిన్ స్నేహితుల ఖాతాల నుండి పుతిన్ కుటుంబం లబ్ది పొందింది అని బ్రిటిష్ పత్రిక ద గార్డియన్ (ఇంకా అనేక పశ్చిమ పత్రికలు) విశ్లేషించింది. కానీ అందుకు ఆధారం ఏమిటో చూపలేదు. పనామా పేపర్స్ లో వెల్లడి అయిన రష్యన్లు అంతర్జాతీయ వ్యాపారులు. ఉదాహరణకి సెర్గీ రోల్డుగినా ఆయుధ ఫ్యాక్టరీ యజమాని. విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే మీడియా కంపెనీలు కూడా ఆయన సొంతం. అక్రమ లావాదేవీలు, కాంట్రాక్టులతో ఈ కంపెనీలు సొంతం చేసుకున్నాడని, పుతిన్ కి ఇందులో భాగస్వామ్యం ఉన్నదని పశ్చిమ మీడియా కోడై కూస్తోంది. అయితే రష్యన్ మీడియా సెర్గీ ఖాతాలు చట్టబద్ధం అని చెబుతూ సంబంధిత పత్రాలు విడుదల చేసింది. పుతిన్ తో స్నేహానికి ముందే సెర్గీ పెద్ద వ్యాపారి అని తెలిపాయి. ఒకవేళ సెర్గీకి రహస్య ఖాతాలు ఉన్నాయని అనుకున్నా వాటికీ పుతిన్ కూ సాక్షాలు లేని సంబంధం కలపడం బొత్తిగా అతకని విషయం. ‘పుతిన్ కు రహస్య ఖాతాలు ఉండవు, ఆయన నిజాయితీపరుడు’ అని ఎవరూ భావించనవసరం లేదు. కానీ అందుకు సాక్షాలు లేకుండానే పెద్ద ఎత్తున బురద జల్లడం వెనుక లక్ష్యం ఏమిటన్నది తప్పనిసరిగా పరిశీలించాలి.

రష్యా అధ్యక్షుడి పత్రిక ప్రతినిధి పెష్కోవ్ ఇలా పేర్కొన్నాడు: “ఈ తప్పుడు సమాచారం ప్రధాన లక్ష్యం మా అధ్యక్షుడు. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడడం, మరో రెండేళ్లకు అధ్యక్ష ఎన్నికలు జరగనుండడంతో ఈ దుష్ప్రచారానికి తెర లేపారు. విదేశాల్లో పుటినోఫోబియా ఎంత తీవ్ర స్థాయికి చేరిందంటే రష్యా గురించి కాస్తంత మంచిగా చెప్పడం పెద్ద పాపంగా మారింది. కానీ ‘చెడ్డ మాటలు చెప్పడం చాలా అవసరం. చాలా చాలా చెడ్డ విషయాలు (రష్యా గురించి) చెప్పాలి. చెప్పడానికి చెడ్డ విషయాలు ఏమీ లేకపోతే వాటిని మనమే సృష్టించాలి’ ఇదీ వారి ధోరణి.”

పుతిన్, అస్సాద్ లు ఎందుకు లక్ష్యం అయ్యారు?

సామ్రాజ్యవాద ఆర్ధిక సంక్షోభం మరింత లోతుగా విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రపంచ వనరులపై పక్కా నియంత్రణ అమెరికాకు అవసరం అయింది. దరిమిలా మధ్య ప్రాచ్యంలో చమురు వనరులపై పూర్తి ఆధిపత్యం సాధించి తన వ్యతిరేకులను పూర్తిగా నిర్మూలించడానికి కంకణం కట్టుకుంది. అందులో భాగంగా అరబ్ వసంతం పేరుతో ఈజిప్టు, ట్యునీషియాలలో ప్రజల ఆగ్రహ జ్వాలలు తమకు వ్యతిరేకం కాక మునుపే తమ చేతుల్లోకి తీసుకుని ఎటువంటి ఫలితం తేలకుండా మొద్దుబార్చడంలో అమెరికా సఫలం అయింది. ముఖ్యంగా లిబియాలో సెక్యులర్ పాలకుడు గడాఫీ పశ్చిమ రాజ్యాలతో సంధికి ప్రయత్నించడం కూడా అమెరికా వాంఛలకు సరితూగలేదు. తిరుగుబాటు పేరుతో ఆల్-ఖైదా ఉగ్రవాదులకు సహాయ, సహకారాలు అందించి లిబియాలో ప్రవేశపెట్టింది. ఐరాస భద్రతా సమితి చేత తీర్మానం చేయించుకుని లిబియాపై నో-ఫ్లై జోన్ అమలు చేయించింది. అదే అవకాశంగా అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లు తమ యుద్ధ విమానాలతో లిబియాపై దాడి చేసి ఆ దేశాన్ని సర్వనాశనం చేశాయి. అంతిమంగా గడాఫిని చంపేశాయి. ఇస్లామిక్ గ్రూపుల మధ్య ఇప్పుడు లిబియా కుక్కలు చింపిన విస్తరి అయింది. లిబియా ప్రజలు తమలో తాము కొట్టుకుంటుండగా అక్కడి చమురు నిల్వలు అమెరికా కంపెనీల వశం అయ్యాయి.

ఇదే వ్యూహాన్ని సిరియాలో అమలు చేసేందుకు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లు కుట్ర పన్నాయి. ఆరంభంలో ఆల్-నూస్రా, ఫ్రీ సిరియన్ ఆర్మీ లకూ అనంతరం ఇసిస్ కూ ఆయుధాలు అందజేసాయి. వారికి టర్కీ, జోర్డాన్ లలో శిక్షణ ఇచ్చారు. ఐదేళ్ల నుండి అన్ని రకాలుగా ఆ దేశాన్ని చుట్టుముట్టి నాశనం చేస్తున్నారు. కానీ ఆ దేశంపై నో-ఫ్లై జోన్ అమలు చేయడానికి పశ్చిమ రాజ్యాలు ప్రయత్నించిన ప్రతిసారీ రష్యా, చైనాలు వీటో ప్రయోగించి అడ్డుకున్నాయి. ముఖ్యంగా రష్యా అండవలన సిరియా అధ్యక్షుడు అస్సాద్ ను కూల్చివేయాలన్న అమెరికా, పశ్చిమ రాజ్యాల లక్ష్యం నెరవేరలేదు. సిరియా పొరుగు రాజ్యాలు టర్కీ, సౌదీ అరేబియా, కతార్, యూ‌ఏ‌ఈ, జోర్డాన్ తలా ఒక చెయ్యి వేసి ధన, ఆయుధ, భౌతిక సాయం అందించినప్పటికీ కేవలం రష్యా, ఇరాన్, హిజ్బోల్లా (లెబనాన్) లనుండి అందిన స్థిరమైన మద్దతు వల్ల అమెరికా కుట్రలు పారడం లేదు.

పైగా 2015 జులై వరకూ సిరియాలో ఇసిస్ తదితర కిరాయి మూకలది పై చేయి ఉన్న నేపధ్యంలో రష్యా స్వయంగా రంగంలోకి దిగి ఇసిస్ సేనలను చీల్చి చెండాడింది. ఇందుకు ఇసిస్ కు వ్యతిరేకంగా ఐరాస చేసిన తీర్మానాలనే ఉపయోగించుకుంది. ఇసిస్ వ్యతిరేక యుద్ధం పేరుతో స్వయంగా సిరియాలో సైనికులను దించాలని అమెరికా కుట్ర చేసింది. అమెరికా రంగంలో దిగడానికి ముందే సరిగ్గా అదే ఎత్తుగడతో రష్యా తన సైన్యాలను దించి సిరియా యుద్ధాన్ని అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ కు అనుకూలంగా మార్చివేసింది. రష్యా వైమానిక దాడుల అండతో ఇసిస్ ఆధీనంలోని అనేక కీలక ప్రాంతాలను ప్రభుత్వం కైవసం చేసుకుంది. అతి పెద్ద నగరం అలెప్పోలో ఒక భాగాన్ని స్వాధీనం చేసుకున్న ఇసిస్ శ్రేణులను చుట్టుముట్టింది. ఇసిస్ రాజధాని ఆల్-రక్కాకు సరఫరాలు అందకుండా అష్ట దిగ్బంధనం కావించింది. రష్యా జోక్యాన్ని సాకుగా చూపుతూ టర్కీ, అమెరికాలు కూడా సైన్యాలు దించడానికి పూనుకుంటున్న సమయంలో పుటిన్ హఠాత్తుగా ఉపసంహరణ ప్రకటించాడు. ఉపసంహరణ పేరుతో కాసిని విమానాలు, సైనికులు వెనక్కి తీసుకున్నప్పటికీ మెజారిటీ సైన్యాలు, యుద్ధ సామాగ్రిని సిరియాలోనే ఉంచి ఇసిస్ పై ప్రయోగిస్తున్నాడు. పుతిన్ ఎత్తుగడలు అమెరికా, పశ్చిమ రాజ్యాలను పూర్తిగా నిరుత్తరులగా మార్చివేశాయి. ఇసిస్ పురోగమిస్తున్నంత వరకు చర్చలకు అమెరికా ససేమిరా అంగీకరించలేదు. సిరియాను సైనికంగా సంపూర్ణంగా తన వైపు తిప్పుకోడానికి ఇసిస్ పై నమ్మకం పెట్టుకుంది. కానీ రష్యా జోక్యంతో సిరియా యుద్ధం ప్రతికూలం కావడం అమెరికాకు బొత్తిగా మింగుడు పడడం లేదు. చివరికి సెనేట్ లో గూఢచార కమిటీ అధిపతి డెవిన్ నూనెజ్ “మాస్కో ఎత్తుగడలను పసిగట్టడంలో పూర్తిగా విఫలం అవుతున్నాము. సెప్టెంబర్ 11, 2001 తర్వాత అమెరికా ఇంటలిజెన్స్ వర్గాల భారీ వైఫల్యం ఇది” అని బహిరంగంగా అంగీకరించవలసిన పరిస్ధితి ఏర్పడింది. మరోవైపు గద్దె దిగాలని తమ మద్దతు దారులకు కూడా అధికారం పంచి పెట్టాలని దౌత్యం ద్వారా అమెరికా చేసిన ప్రయత్నాలను బషర్ అస్సాద్ మొదలంటా తిరస్కరించాడు.

ఆ విధంగా ఈజిప్టు, ట్యునీషియా, లిబియాల స్వాధీనం ద్వారా జైత్రయాత్ర సాగించిన అమెరికా, పశ్చిమ రాజ్యాలకు సిరియా వద్దకు వచ్చేసరికి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కుంటున్నాయి. పుతిన్, అస్సాద్ లు కొరకరాని కొయ్యలు అయ్యారు. ఈ నేపధ్యంలో సిరియాలో ప్రాక్సీ యుద్ధానికి కొనసాగింపుగా పుతిన్, అస్సాద్ లపై ప్రచార యుద్ధానికి అమెరికా తెర తీసింది. అయితే పుతిన్, అస్సాద్ లపై పశ్చిమ పత్రికల దుష్ప్రచారం ఈనాటిది కాదు. ఆల్-నూస్రా, ఇసిస్ లు రసాయన ఆయుధాలతో వేలాది మంది సిరియా పసి పిల్లలను, పౌరులను పొట్టన బెట్టుకోగా ఆ నెపాన్ని కూడా అస్సాద్ పైన రుద్దినప్పుడే ఆ ప్రచారాన్ని ప్రపంచం పూర్తిగా నమ్మలేదు. కనుక అమెరికాకు చెందిన ఏ ఒక్క పేరు వెల్లడి చేయని పనామా పేపర్స్ ప్రభావం పుతిన్, అస్సాద్ లపై ప్రభావం చూపే అవకాశం తక్కువే. పశ్చిమ రాజ్యాల జనం ఈ ప్రచారాన్ని నమ్మవచ్చు. ఇండియా లాంటి మూడో ప్రపంచ దేశాలలో మిడిమిడి జ్ఞానవంతులు నమ్మవచ్చు. కానీ అంతర్జాతీయ పరిశీలకులు, సిరియా, రష్యాల ప్రజలు ఈ ప్రచారాన్ని నమ్మెందుకు సిద్ధంగా లేరు. వారిని నమ్మించకుండా ఇలాంటి ప్రచారానికి విలువ శూన్యం. ఈ సంగతి అమెరికా, పశ్చిమ రాజ్యాలకూ, పశ్చిమ కార్పొరేట్ పత్రికలకు తెలియకుండా పోలేదు. అయినా వారి ప్రయత్నం వారు చేస్తారు. అయితే రష్యా సిరియాలపై, ముఖ్యంగా పుతిన్ పైన దుష్ప్రచారం పనామా పేపర్స్ లీకేజికి ఒక లక్ష్యమే గానీ అదే ప్రధాన లక్ష్యం కాదు. పుతిన్ వ్యతిరేక ప్రచారం ఒక బోనస్ మాత్రమే. దానికి మించిన లక్ష్యం మరొకటి ఉన్నది.

(………..సశేషం)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s