ఆర్మీ మందుగుండు డిపోలో పేలుడు, 17గురు సైనికులు ఆహుతి


మహారాష్ట్రలో భారత రక్షణ బలగాల ఆయుధాలకు మందుగుండు సరఫరా చేసే అతి పెద్ద మందుగుండు డిపోలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంగా చెబుతున్న దుర్ఘటనలో 17 మంది సైనికులు దుర్మరణం చెందారని పత్రికలు తెలిపాయి. మరణాల సంఖ్య 20 కి పెరిగిందని కొన్ని పత్రికలు చెప్పాయి. ప్రధాన మంత్రి యధావిధిగా ‘ట్విట్టర్’ ద్వారా తన ఆందోళన ప్రకటించారు. తన ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయని తెలిపారు.

మృతులలో ఇద్దరు అధికారులు కాగా 15 మంది డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్ కు (DSC) చెందిన సైనికులని ది హిందు తెలిపింది. దేశవ్యాపితంగా మందుగుండు నిలవ చేసేందుకు ఉద్దేశించిన డిపోలలో రక్షణ ఏర్పాట్లను డి‌ఎస్‌సి బలగాలు పర్యవేక్షిస్తాయి. 19 మంది తీవ్ర గాయాలతి ఆసుపత్రిలో చేర్చారని అధికారులు తెలిపారు. తీవ్ర గాయాల రీత్యా మృతుల సంఖ్య పెరగవచ్చని భావిస్తున్నారు.

మృతుల సంఖ్య 20 అని ఇండియా టుడే పత్రిక తెలిపింది. ఫస్ట్ పోస్ట్ పత్రిక కూడా 20 మంది మరణించారని నివేదించింది. మరిన్ని పేలుళ్లు సంభవించవచ్చన్న అంచనాతో సమీప గ్రామాల ప్రజలను ఖాళీ చేయించారు. మూడు గ్రామాలను ఖాళీ చేయించారని ది హిందు, ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఇండియా టుడే లు చెప్పగా 5 గ్రామాలను ఖాళీ చేయించారని డెయిలీ మెయిల్ (బ్రిటిష్ పత్రిక) తెలిపింది.

నాగపూర్ కు 150 కి.మీ దూరంలోని పులగావ్ పట్టణం శివార్లలో నెలకొల్పిన మందుగుండు గిడ్డంగిలో మే 31 తెల్లవారు ఝాము గం 1:30 ని.లు – గం 2:00 ని.లు మధ్య భారీ పేలుడు సంభవించిందని మహారాష్ట్ర పోలీసు అధికారులు చెప్పారు. పేలుడు జరిగిన గంట సేపటికి అగ్నిమాపక బలగాలు అక్కడికి చేరుకుని శ్రమించాయని చెప్పారు. 6 గంటల పాటు శ్రమించాక మంటలు అదుపులోకి వచ్చాయని, పూర్తిగా అదుపు చేశారని వివిధ అధికారులను ఉటంకిస్తూ పత్రికలు తెలిపాయి.

అయితే జిల్లా కలెక్టర్ స్వల్ప స్ధాయి మంటలు కొనసాగుతున్నాయని చెప్పారు. “చిన్నపాటి మంటలు ఇంకా కొనసాగు తున్నప్పటికీ మరింత నష్టం జరిగే అవకాశం లేదు. సెంట్రల్ అమ్యూనిషన్ డిపో (సి‌ఏ‌డి) కు చుట్టు పక్కల ఉన్న 5 గ్రామాల నుండి ప్రజలను వెంటనే ఖాళీ చేయించాము. అయితే మంటలు అదుపులోకి వచ్చాక గ్రామస్ధులు వెనక్కి రావడానికి అనుమతి ఇచ్చాము. వారిని వారి ఇళ్లకు చేర్చాము” అని వార్ధా జిల్లా కలెక్టర్ శైలేష్ నావల్ చెప్పారని ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ పత్రిక తెలిపింది.

నాగపూర్ అగ్నిమాపక విభాగం అధికారి రమేశ్ బర్దే ఇలా చెప్పారు, “ఉదయం గం. 1:30 ని. ప్రాంతంలో మంటలు చెలరేగాయి. సమీపంలోని ఫైర్ ఇంజన్లు గం. 2:30 ని. కల్లా అక్కడికి చేరుకున్నాయి. ఉదయం గం 6:15 ని. కల్లా మంటలను అదుపు చేశారు. 10 ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పడంలో కృషి చేశాయి.”

“మహారాష్ట్ర, పులగావ్ వద్ద సెంట్రల్ ఆమ్యూనిషన్ డిపోలో మంటలకు ప్రాణాలు నష్టపోవడం బాధ కలిగిస్తోంది. నా ఆలోచనలు బాధితులతో ఉన్నాయి.” అని ఒక ట్వీట్ లో ప్రధాని నరేంద్ర మోడి పేర్కొన్నారు. “గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను. ఆర్‌ఎం మనోహర పరికర్ ఘటనా స్ధలిని సందర్శించి పరిస్ధితిని సమీక్షించాలని కోరాను” అని మరో ట్వీట్ లో ప్రధాని పేర్కొన్నారు.

ప్రమాదానికి కారణం ఏమిటో ఇంకా వెల్లడి కాలేదు. విచారణ కోసం కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ నియమించామని ఆర్మీ ప్రకటించింది. పేలుడు వెనుక విద్రోహ కార్యకలాపాలు ఉండవచ్చన్న అభిప్రాయాన్ని సైనికాధికారులు కొట్టివేయటం లేదని ఇండియా టుడే తెలిపింది. అనగా విద్రోహం కూడా కారణం కావచ్చని అనుమానిస్తున్నట్లే.

పేలుడు వల్ల తలెత్తిన ప్రధాన మంటలను ఆర్పివేసినప్పటికీ సెకండరీ పేలుళ్లు, మంటలు రేగవచ్చని ఒక ఆర్మీ అధికారిని ఉటంకిస్తూ ఇండియా టుడే తెలిపింది. ఉదయం ఆరుంపావుకి పూర్తిగా అదుపు చేశామని అగ్నిమాపక అధికారులు చెప్పినప్పటికీ ఉదయం 10 గంటలకు కూడా పేలుళ్లు వినిపిస్తూనే ఉన్నాయని గ్రామస్తులు చెప్పారు. దుర్ఘటన స్ధలాన్ని సందర్శించటానికి భద్రతా బలగాలు ఎవరినీ అనుమతించటం లేదు. సెకండరీ పేలుళ్ళ వల్లనే మంటలు వ్యాపించాయని పత్రిక తెలిపింది.

పేలుడులో ఏయే మందుగుండు ధ్వంసం అయింది చెప్పటానికి బలగాలు నిరాకరించాయని ఏ‌బి‌సి న్యూస్ (ఆస్ట్రేలియా బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్) తెలిపింది. ఒక్క ఆర్మీయే కాకుండా నౌకా బలగం, వాయు బలగం వినియోగించే వివిధ ఆయుధాల మందుగుండు సామాగ్రి కూడా పులగావ్ గిడ్డంగిలో నిలవ చేస్తారని ది హిందు తెలిపింది.

పులగావ్ గిడ్డంగి దేశంలోనే కాకుండా ప్రపంచం లోనే అతి పెద్ద మందుగుండు గిడ్డంగి అని ది హిందు చెబుతోంది. అయితే ఈ అభిప్రాయాన్ని ఇతర పత్రికలు ఏవీ చెప్పలేదు. దేశంలోని పెద్ద గిడ్డంగుల్లో ఒకటి అనే ఇతర పత్రికలు చెప్పాయి. ఆసియాలో రెండవ అతి పెద్ద గిడ్డంగి అని ఎన్‌డి‌టి‌వి తెలిపింది. ఆయుధాలు మందుగుండు మొదట ఈ గిడ్డంగికే వస్తాయని ఇక్కడి నుండి దేశంలోని ఇతర గిడ్డంగులకు పంపిణీ జరుగుతుందని ఫస్ట్ పోస్ట్ తెలిపింది.

మరణించిన అధికారులు, ఇతర సిబ్బంది ముఖ్యమైన ఆయుధాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో మరణించారని ఎన్‌డి‌టి‌వి తెలిపింది. ఎన్‌డి‌టి‌వి ప్రకారం ఈ గిడ్డంగిలో ఏ‌కే-47 మందుగుండు, బ్రహ్మోస్ మిసైళ్ళ మందుగుండు కూడా ఉన్నాయి. కీలకమైన మందుగుండును మంటల నుండి తప్పించడానికి అధికారులు అటువైపు పరుగెత్తడంతో వారు పేలుళ్ళ బారిన పడ్డారని చానెల్ తెలిపింది. గాయపడిన వారిలో గిడ్డంగి కమాండింగ్ ఆఫీసర్ కూడా ఉన్నారని తెలుస్తోంది.

ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్, రక్షణ మంత్రి మనోహర పరికర్ సంఘటన స్ధలిని సందర్శించారు. “నష్టాన్ని అంచనా వేసేందుకు చర్యలు సాగుతున్నాయి. ఆర్మీ విచారణకు ఆదేశించింది” అని లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్ సింగ్ చెప్పారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s