
Juncker and Putin
అమెరికా, యూరోపియన్ యూనియన్ ల మధ్య లుకలుకలు మెల్లగానే అయినా పెరుగుతున్నాయి. రష్యా నగరం సెయింట్ పీటర్స్ బర్గ్ లో ప్రతి యేటా జరిగే “సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఫోరం” (SPIEF) సమావేశాలకు ఈ యేడు యూరోపియన్ కమిషన్ (ఈసి) అధ్యక్షుడు జీన్-క్లాడ్ జంకర్ హాజరు కానున్నాడు. ఆయన రష్యా వెళ్లడానికి అమెరికా అభ్యంతరం చెబుతోంది.
ఒక పక్క రష్యాపై అమెరికా-ఈయూల ఆర్ధిక, వాణిజ్య ఆంక్షలు కొనసాగుతుండగా రష్యా జరిపే ఆర్ధిక సదస్సుకు ఈసి అధ్యక్షుడు ఎలా హాజరు అవుతారని అమెరికా ప్రశ్నిస్తోంది. ఈసి అధ్యక్షుడు రష్యా సదస్సుకు వెళితే అది రష్యా అధ్యక్షుడు పుతిన్ కు మరింత విశ్వసనీయత సమకూర్చడమేనని అమెరికా భావిస్తోంది. అయితే అమెరికా అభ్యంతరాలను జీన్-క్లాడ్ జంకర్ లక్ష్య పెట్టడం లేదు. తాను రష్యా వెళుతున్నానని తెగేసి చెబుతున్నాడు.
జూన్ 16 తేదీ నుండి 18 తేదీ వరకు రష్యా పూర్వ రాజధాని నగరం సెయింట్ పీటర్స్ బర్గ్ లో SPIEF వార్షిక సమావేశాలు జరుగుతాయి. అమెరికా నేతృత్వంలో ప్రధానంగా పశ్చిమ దేశాల కనుసన్నల్లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం (WEF) సమావేశాలకు పోటీగా SPIEF సమావేశాలను పుతిన్ నిర్వహిస్తున్నారని అమెరికా తదితర పశ్చిమ దేశాల నిశ్చితాభిప్రాయం. కావచ్చు కూడా. అలాగని రష్యా-ఈయూల ఆర్ధిక ప్రయోజనాలను ఆటంకపరిచే హక్కు అమెరికాకు లేదన్నది స్పష్టమే.
జీన్-క్లాడ్ జంకర్ కూడా అదే చెబుతున్నారు. రష్యా-ఈయూ సంబంధాలను నిర్దేశించే అధికారం అమెరికాకు లేదని ఆయన వివిధ సందర్భాల్లో కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. లక్సెంబర్గ్ కు ప్రధాన మంత్రిగా పని చేసిన జంకర్, రష్యాపై ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాడు. ఇటలీ, హంగేరి లాంటి దేశాలు సైతం ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతున్నాయి. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఆంక్షలకు వ్యతిరేకం అయినా అమెరికా ఆదేశాలను ధిక్కరించే సాహసం ఆమెకు లేదు. (ఈయూ నాయక దేశం జర్మనీయే.)
- Jean-Claude Juncker
- Trinity Bridge in St. Petersburg
- St Petersburg
- Saint Petersburg locator
అమెరికా పత్రిక పోలిటికో ప్రకారం జంకర్ రష్యా ఆర్ధిక సదస్సుకు వెళ్ళడం పట్ల అమెరికా తీవ్ర అసహనంగా ఉన్నది. జంకర్ రష్యా ప్రయాణం పుతిన్ ను శక్తివంతం చేస్తుందని అమెరికా భయపడుతోందని పత్రిక తెలిపింది. జులై నెలలో అమెరికా-ఈయూ ఆంక్షలను పొడిగించడమా లేక ఎత్తివేయడమా అన్నది నిర్ణయించాల్సి ఉన్నది. అంతకు ముందే SPIEF సమావేశాలు జరుగుతాయి. జంకర్ హాజరు ఆంక్షల నిర్ణయంపై ప్రభావం పడవేస్తుందని అమెరికా భావిస్తోందని పోలిటికో తెలిపింది.
పుతిన్ ను ఒక నియంతగా, రాకాసిగా పశ్చిమ పత్రికలు ప్రచారం చేస్తాయి. క్రిమియాను దురాక్రమించాడని చెబుతాయి. తూర్పు ఉక్రెయిన్ ప్రజలను రెచ్చగొట్టి వారి చేత ప్రభుత్వంపై తిరుగుబాటు చేయిస్తున్నాడని ఆరోపిస్తాయి. రష్యా దేశంలో ప్రజాస్వామ్యం లేదని నమ్ముతాయి. అందరినీ నమ్మమంటాయి. సిరియాలో బషర్ నియంతృత్వ ప్రభుత్వానికి అండదండలు ఇస్తున్నాడని చెబుతాయి.
కానీ ఉక్రెయిన్ లో ప్రజాస్వామ్య ఎన్నికల్లో అధికారం చేపట్టిన ప్రభుత్వాన్ని కూలదొసింది అమెరికాయే. నాజీ టెర్రరిస్టుల మద్దతుతో అమెరికా నిలబెట్టిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తూర్పు ఉక్రెయిన్ ప్రజలు తిరుగుబాటు చేశారు. వారిపై యుద్ధం చేయడానికి ఉక్రెయిన్ ప్రభుత్వానికి ఆయుధ సంపత్తిని అమెరికా సరఫరా చేస్తోంది. ఈ నేపధ్యంలో తూర్పు యూరప్ రాష్ట్రాలు లుహాన్స్క్, డోనెట్స్క్ ల ప్రజలు తామే రిఫరెండం నిర్వహించుకుని రష్యాలో కలవాలని నిర్ణయించుకున్నారు. కానీ పుతిన్/రష్యా వారి కోరికను మన్నించలేదు.
క్రిమియా ప్రజలు కూడా రిఫరెండం నిర్వహించారు. 98 శాతం పైగా ప్రజలు రష్యాలో కలవాలని ఓటు వేశారు. క్రిమియా ఒకప్పుడు రష్యా భూభాగం. [పాత సోవియెట్ అధ్యక్షుడు కృశ్చెవ్ (ఈయన ఉక్రెయిన్ కు చెందిన వ్యక్తి) క్రిమియాను ఉక్రెయిన్ రిపబ్లిక్ లో కలిపాడు.] ఆ కారణంతో క్రిమియా ప్రజల రిఫరెండంను పుతిన్ ప్రభుత్వం అంగీకరించింది. నల్ల సముద్రంలో అమెరికా ఘాతుకాలను నిలవరించాలంటే క్రిమియా ప్రజలకు రష్యాలో కలవడం తప్ప మరో మార్గం లేదు.
వాస్తవాలు ఇవి కాగా అమెరికా, ఐరోపా దేశాలు సరిగ్గా ఇందుకు విరుద్ధమైన అబద్ధాలను వాస్తవాలుగా ప్రచారం చేస్తాయి. అమెరికా పెత్తనాన్ని, రౌడీయిజాన్ని, ప్రపంచాధిపత్య దాహాన్ని ‘ప్రజాస్వామ్యం’ గా, ‘శాంతి’ గా ప్రచారం చేస్తూ తమ రక్షణ తాము చూసుకుంటున్న రష్యా, సిరియా, ఇరాన్, హిజ్బొల్లా (లెబనాన్) లను నియంతృత్వాలుగా, అశాంతి కారకులుగా, ఉగ్రవాదులుగా (హిజ్బొల్లా) ప్రచారం చేస్తున్నాయి.
అమెరికా బలవంతంతో ఈయూ, రష్యాపై విధించిన ఆంక్షలు ఈయూ దేశాలకు వినాశకరంగా పరిణమించాయి. కానీ అమెరికాను కాదనలేని లొంగుబాటులో ఆ దేశాలు ఉన్నాయి. లొంగుబాటులో ఉన్నప్పటికీ తమ తమ ప్రయోజనాల రీత్యా కొన్ని సభ్య దేశాలు ఆంక్షలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అమెరికా ఆధిపత్యంపై ఈయూ లో నెలకొన్న అభ్యంతరాలను, వ్యతిరేకతను ఇవి సూచిస్తాయి. అలాగని తమ వ్యతిరేకతను ఆచరణలో పెట్టలేని దుస్ధితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. వ్యతిరేకత క్రమ క్రమంగా పెరుగుతున్న పరిస్ధితి నుండే ఈసి అధ్యక్షుడు జీన్-క్లాడ్ జంకర్ బహిరంగంగా అమెరికా ఒత్తిడికి, ఆంక్షలకు వ్యతిరేకంగా ముందుకు వస్తున్నాడు. గొంతు విప్పింది జంకర్, హంగేరి, ఇటలీ లాంటి కొద్దిమంది నేతలే అయినప్పటికీ వారు ఈయూ లో విస్తృతంగా లోలోపల నెలకొన్న వ్యతిరేకతను మాత్రమే వ్యక్తం చేస్తున్నారు.
ఈయూ దాకా ఎందుకు? అమెరికా లోని పలు బహుళజాతి కంపెనీలు కూడా సెయింట్ పీటర్స్ బర్గ్ ఆర్ధిక సదస్సుకు హాజరవుతున్నాయి. గతంలో కూడా అమెరికా కంపెనీలు SPIEF కు వెళ్ళి వచ్చాయి. ఒప్పందాలు సైతం చేసుకున్నాయి. 2015లో జరిగిన SPiEF సమావేశాలకు హాజరైన బడా కంపెనీలలో కొన్ని: ప్రైస్ వాటర్ హౌస్ కూపర్ (PwC), బోస్టన్ కన్సల్టింగ్, ష్లుంబర్గర్, ఇంటెల్, ఎక్సాన్ మొబిల్ (ExxonMobil), బోయింగ్ మొ.వి.
2015 సమావేశాల్లో 2015 ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల్లో ఒక ముఖ్యమైనది -ఉక్రెయిన్ తో సంబంధం లేకుండా బాల్టిక్ సముద్రం మీదుగా ఐరోపా దేశాలకు గ్యాస్ సరఫరా చేసేందుకు ఉద్దేశించిన పైప్ లైన్ నిర్మాణం. నార్డ్ స్ట్రీమ్ – 2 గా పిలుస్తున్న ఈ పైప్ లైన్ ప్రాజెక్టులో 50 శాతం వాటా రష్యా గ్యాస్ కంపెనీ గాజ్ప్రోమ్ (Gazprom) ది కాగా మిగిలిన 50 శాతం వాటాను డచ్ కంపెనీ షెల్ (రాయల్ డచ్ షెల్), జర్మనీకి చెందిన EON మరియు BASF, ఆస్ట్రియాకు చెందిన OMV, ఫ్రాన్స్ కు చెందిన Engie లు పంచుకుంటున్నాయి. అమెరికా ఎంత వ్యతిరేకించినప్పటికీ 4.5 బిలియన్ డాలర్ల ఒప్పందాలను అది ఆపలేకపోయింది. ఈ సంవత్సరం ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో, వాటిలో అమెరికా, ఐరోపా కంపెనీల పాత్ర ఏమిటో పరిశీలించడం ఆసక్తికరం కాగలదు.
“వాణిజ్యం తనకు అవసరం అయిన దాన్ని చేసుకుపోతుంది. దేన్ని నిషేదిస్తారో అది జరిగిపోతుంది. మాకున్న సమాచారం ప్రకారం లీడింగ్ పెట్టుబడిదారులు రష్యా ఫోరంకు హాజరు అవుతున్నాయి. వాటిలో అమెరికా కంపెనీలూ ఉన్నాయి. ఫోరంను విస్మరించాలన్న విధానం విఫలం అయింది. ఆసక్తి ఉన్న కంపెనీలు ఎలాగూ హాజరవుతాయి. వాటిని ఎవరూ ఆపలేరు” అని అమెరికాలో రష్యా ఎంబసీ ప్రతినిధి గ్రిగొరి జాసిప్కిన్ వ్యాఖ్యానించడం విశేషం.
జంకర్, రష్యా ఫోరం కు హాజరు అవుతారని ఆయన ప్రతినిధి ధ్వురీకరించినట్లుగా పోలిటికో పత్రిక తెలిపింది. “ఈయూ-రష్యా ల మధ్య ప్రస్తుతం నెలకొన్న సంబంధాల స్వభావం నేపధ్యంలో సంబంధాల మెరుగుదల వల్ల ఒనగూరే ఫలితాలను రష్యా నేతలకు, ఈయూ లోని శ్రోతలకు తెలియజేప్పేందుకు తన సందర్శనను వినియోగించుకుంటారు” అని జంకర్ ప్రతినిధి చెప్పారని పోలిటికో తెలిపింది.
ఈయూ నుండి 2016 సదస్సుకు జంకర్ ఒక్కరే హాజరు అవుతున్నారని ఆయన కాకుండా ఈయూ నుండి హాజరయ్యే పెద్ద తలకాయలు ఎవరూ లేరని పోలిటికో చెబుతోంది. కానీ జంకర్ తో పాటు హంగేరి విదేశీ మంత్రి (పీటర్ జీజ్జర్టో), గ్రీసు టూరిజం మంత్రి (ఓల్గా), ఫ్రాన్స్ మాజీ విదేశీ మంత్రి (హ్యూబర్ట్ వెడ్రైన్), ఈయూ మాజీ ట్రేడ్ కమిషనర్ (ఈటర్ మాండెల్సన్) మొ.న ప్రముఖులు హాజరు అవుతున్నారని రష్యా టుడే పత్రిక చెప్పడం గమనార్హం. సెప్టెంబర్ 2015 నుండి ఫిబ్రవరి 2016 మధ్య కాలంలో ఈయూ దేశాల నుండి 19 సార్లు మంత్రులు, ప్రతినిధి బృందాలు రష్యా వెళ్ళి వచ్చారని పోలిటికో పత్రిక సైతం చెబుతోంది. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్స్ విదేశీ మంత్రి జీన్-మార్క్ ఐరాల్ట్ లు గత నెలలోనే మాస్కో వెళ్ళి పుతిన్ ని కలిసి వచ్చారు.
ఈ అంశాలన్నీ అమెరికా ఆంక్షలను, ఆదేశాలను, పెత్తనాన్ని ఈయూ దేశాలు అయిష్టంగా అమలు చేస్తున్నారని తెలియజేస్తున్నాయి. ఆంక్షలపై అయిష్టత నెలకొన్నాక వ్యాపార, వాణిజ్యాలు ఏదో ఒక దారి చూసుకుని తమ ప్రయోజనాలను నెరవేర్చుకుంటాయి. బహిరంగ వాణిజ్యానికి బదులు చాటు మాటుగా చేస్తాయి. ఈయూ కంపెనీలు ఇలాంటి చాటు మాటు మార్గాల్లో, ఆంక్షలకు విరుద్ధంగా, రష్యాతో ఇప్పటికే వాణిజ్యం చేస్తున్నా ఆశ్చర్యం లేదు.