అమెరికా హెచ్చరికలకు చైనా ఘాటుగా బదులు ఇచ్చింది. రక్షణ కార్యదర్శి (మన రక్షణ మంత్రికి సమానం) ఎష్టన్ కార్టర్ చేసిన వ్యాఖ్యలు కోల్డ్ వార్ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని, కోల్డ్ వార్ మెంటాలిటీ నుండి బైటికి వస్తే మంచిదని హెచ్చరించింది. అమెరికా మిలట్రీ అధికారులు డైరెక్ట్ చేసే హాలీవుడ్ కోల్డ్ వార్ సినిమాలో తాము ఎలాంటి పాత్ర పోషించబోమని అపహాస్యం చేసింది.
“కార్టర్ వ్యాఖ్యలు అమెరికా స్టీరియోటైప్ ఆలోచనా విధానాన్ని, అమెరికా ఆధిపత్య భావనని నగ్నంగా ఆరబోశాయి” అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్ యింగ్ స్పష్టం చేసింది. “నిజానికి అమెరికాలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు భౌతికంగా 21వ శతాబ్దంలోనే ఉన్నా, వారి మెదడు మాత్రం ఇంకా కోల్డ్ వార్ యుగం లోనే ఉండిపోయింది” అని చున్ యింగ్ అపహాస్యం చేసింది.
చున్ యింగ్ ప్రతిస్పందనకు కారణం యూఎస్ నావల్ అకాడమీ అధికారుల సమావేశంలో కార్టర్ చేసిన వ్యాఖ్యలు. దక్షిణ చైనా సముద్రంలో తన మిలటరీ విస్తరణ ద్వారా చైనా ‘ఒంటరితనపు మహా గోడ’ ను నిర్మించుకుంటోంది అని ఆయన వ్యాఖ్యానించాడు.
“చైనా తన చర్యల ద్వారా తానే స్వయంగా ఒంటరితనపు మహా గోడను (Great Wall of self-isolation) నిర్మించుకుంటోంది. ఆ ప్రాంతం లోని దేశాలు –(అమెరికా) మిత్ర రాజ్యాలు, (అమెరికా) భాగస్వాములు, అలీన దేశాలు- అన్నీ బహిరంగంగా, ప్రైవేటుగా అత్యున్నత స్ధానాల్లో తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి” అని ఎష్టన్ కార్టర్ తన ప్రసంగంలో పేర్కొన్నాడు.
“వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్ చర్యలు అమెరికాకు ఆందోళన కలిగిస్తున్నాయి. సముద్రంలో చైనా తీసుకుంటున్న చర్యలు ప్రాధమిక సూత్రాలను సవాలు చేస్తున్నాయి. మనం మరో దిక్కుకు చూస్తూ నిలబడ లేము” అని ఎష్టన్ కార్టర్ అసలు సంగతి చెప్పాడు.
ఇంతకీ దక్షిణ చైనా సముద్రంలో చైనా తీసుకుంటున్న చర్యలు ఏమిటి? వాస్తవంగా అయితే ఏమీ లేవు. దక్షిణ చైనా సముద్రంలో నివాస యోగ్యం కాని కొన్ని దీవులు ఉన్నాయి. వూడీ ఐలాండ్స్, స్పార్ట్ లీ ఐలాండ్స్, పారాసేల్ ఐలాండ్స్ మొ.వి వాటిలో కొన్ని ఆ దీవులు తమవే అని చైనా ఎప్పటి నుండో చెబుతోంది.
దక్షిణ చైనా సముద్రం అనేక దేశాలకు తీరాలను ఇస్తోంది. తైవాన్, ఫిలిప్పైన్స్, మలేషియా, ఇండోనేషియా, వియత్నాం దేశాలు సముద్రం చుట్టూ ఉన్నాయి. సహజంగా ఇవి కూడా సముద్రంలో కొంతవరకు తమకు చెందిన ప్రాంతంగా చెబుతున్నాయి.
1974 వరకు పారాసెల్ ద్వీపాలలో కొన్ని చైనా ఆధీనంలో, మరికొన్ని దక్షిణ వియత్నాం ఆధీనంలో ఉండేవి. 1974లో ఇరు దేశాల మధ్య స్వల్ప స్ధాయి ఘర్షణ జరిగింది. వియత్నాం వెనక్కి తగ్గడంతో ఆ ద్వీపాలన్నీ చైనా ఆధీనంలోకి వచ్చేశాయి. ఆ తర్వాత ఉత్తర, దక్షిణ వియత్నాంలు ఐక్యమై వియత్నాం ఏర్పడింది. వియత్నాం ఐక్యం అయిన తర్వాత రోజుల్లో ఎన్నడూ 1974 ఘర్షణ గురించి గానీ, ద్వీపాల గురించి గానీ మాట్లాడ లేదు.
కానీ దక్షిణ వియత్నాం నుండి పారిపోయి అమెరికాలో స్ధిరపడిన ధనికులు 1974 ఘర్షణను దేశభక్తియుత యుద్ధంగా చెబుతూ ఘర్షణలో మరణించిన ఓడ కెప్టెన్ ను మృత వీరుడుగా గుర్తించాలని, ద్వీపాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రకటనలు గుప్పించేవారు. వారి ప్రతినిధులుగా వియత్నాంలో ఉన్న ఒకరూ అరా కూడా ఈ డిమాండ్స్ లేవనెత్తినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు.
- South China Sea dispute
- Islets
- The U.S. agression
- UNCLOS
- Philippines waters
- Chinese built city on Paracel Islands
ఈ మధ్య కాలంలో వియత్నాం రాజకీయ నాయకుల అవినీతి పట్ల ప్రజల్లో అసంతృప్తి పెల్లుబుకింది. ప్రభుత్వ వ్యతిరేకత హెచ్చింది. ఆందోళనలు జరుగుతున్నాయి. మరోవైపు చైనా ఎదుగుదలను భరించలేని అమెరికా వియత్నాంను ఎగదోస్తూ వచ్చింది.
ఈ నేపధ్యంలో వియత్నాం నేతలు, ప్రభుత్వం 1974 ఘర్షణ గురించి తామే మాట్లాడుతున్నారు. ద్వీపాలలో కొన్ని తమవే అని వాదిస్తున్నారు. తద్వారా ఒకవైపు దేశీయంగా ప్రజల దృష్టిని మళ్లించడానికి కృషి చేస్తున్నారు. మరోవైపు అమెరికా ఒత్తిడిలను అమలు చేస్తున్నారు. కానీ చైనాతో ఘర్షణ పడైనా ద్వీపాలు దక్కించుకోవాలన్న ఉద్దేశాలు వారికి ఉన్నట్లు సూచనలు లేవు.
ఆ విధంగా చైనాను నిలువరించెందుకు అమెరికా పన్నిన వ్యూహంలో వియత్నాం ఒక పావుగా మారింది.
UNCLOS (ఐరాస సముద్ర చట్టం) ప్రకారం బ్రూనె, ఫిలిప్పైన్స్, మలేషియా, తైవాన్ ఇండోనేషియా దేశాలకు కూడా దక్షిణ చైనా సముద్రం వనరుల్లో వాటా దక్కాలి. అందులో సందేహం లేదు. కానీ ఈ వివాదాన్ని స్ధానిక/ప్రాంతీయ దేశాలు చర్చించుకుని పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే వివాదం లోకి అమెరికా చొరబడడంతో పరిష్కారానికి అవకాశాలు పూర్తిగా మూసుకునిపోయాయి. ఎందుకంటే అమెరికాకు కావలసింది వివాదాలు రగలడమే గాని చల్లారడం కాదు. వివాదం ఎంత తీవ్రంగా రగిలితే జోక్యం చేసుకోవడానికి అంత ఎక్కువ అవకాశం ఉన్నదని అమెరికా భావిస్తుంది. ఆ పేరుతో ఆయుధాలు అమ్ముకుంటుంది. నౌకలు, ఫైటర్ జెట్లు మొ.వి అమ్ముకుంటుంది.
ఇవన్నీ కాకుండా మరో ముఖ్యమైన అంశం ఒకటుంది. ఇది వింటే గనక మనకు నమ్మబుద్ధి కాదు. కానీ నిజం. ఏమిటి అంటే దక్షిణ చైనా సముద్రం పైన ‘మాకూ హక్కు ఉంది’ అని అమెరికా వాదిస్తోంది.
ప్రపంచ పటానికి అమెరికా ఆ చివర ఉంటే ఈ చివర దక్షిణ చైనా సముద్రం ఉంటుంది. అమెరికా, ద.చై.సముద్రంల మధ్య పసిఫిక్ మహా సముద్రం ఉన్నది. అలాంటి ద.చై.సముద్రంలో అమెరికాకు హక్కు ఉండటం ఎలా సాధ్యం?
అదే తమాషా! అమెరికా పెత్తనం, ఆధిపత్యం, గూండాయిజం అని ఊరకనే అనరు.
అమెరికా వాదన ఏమిటి అంటే: దక్షిణ చైనా సముద్రం గుండా అమెరికాకు సరుకులు రవాణా చేసే నౌకలు ప్రయాణిస్తాయి. కనుక ఈ సముద్రంలో అమెరికాకూ హక్కులు ఉన్నాయి. స్వేచ్ఛగా ప్రయాణం చేసే హక్కు, తమ సరుకు రవాణా నౌకలకు మిలట్రీ భద్రత కల్పించే హక్కు… ఇత్యాది హక్కులు ఉన్నాయని అమెరికా వాదన. ఆ పేరుతో ఐదారు సంవత్సరాలుగా, ఇటీవల ఇంకా ఎక్కువగా పనిగట్టుకుని మరీ విమాన వాహక నౌకలు, యుద్ధ నౌకలు, రక్షణ నౌకలు, గస్తీ నౌకలను ద.చై.సముద్రంలో తిప్పుతోంది.
నౌకలతోనే ఆగిపోలేదు. దక్షిణ చైనా సముద్రం పైన ఆకాశాన్ని కూడా యుద్ధ విమానాలతో, గూఢచార విమానాలతో, గస్తీ విమానాలతో నింపేస్తోంది. క్రమం తప్పకుండా యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తోంది. ఒకసారి ఫిలిప్పైన్స్ తో ఇంకోసారి వియత్నాంతో, మరోసారి జపాన్ తో విన్యాసాలు నిర్వహిస్తూ ఆ విన్యాసాల కోసం పెద్ద ఎత్తున యుద్ధ నౌకలు, ఆయుధ సామాగ్రి తరలిస్తోంది.
కాస్త బుర్ర బుద్ధీ ఉన్న వాడు ఎవడైనా ఈ చర్యలను ఈసడించుకుంటారు. అసహ్యించుకుంటారు. అమెరికా బైటి దేశాలలో అలాంటి ఈసడింపులు ఎన్నయినా లెక్కించదు. కానీ స్వదేశంలో జనం ఈసడిస్తే అది మొదటికే మోసం వస్తుంది. దేశీయంగా జనాల అభిప్రాయం అనుకూలంగా లేకపోతే ఈ తరహా విన్యాసాలకు సైన్యం ఎక్కడి నుండి వస్తారు? అందుకని తన విపరీత చర్యలకు ఏదో విధంగా తమ ప్రజల మద్దతును అమెరికా పోగు చేసుకుంటుంది.
అలా పోగు చేసుకునే ఎత్తులో ఒకటి అమెరికా ప్రత్యేకత గురించి అదే పనిగా జబ్బలు చరుచుకోవడం. ప్రపంచ శాంతిని కాపాడే బాధ్యత మనపైనే ఉన్నదని అమెరికా ప్రజలకు నచ్చజెప్పడం. మనం తప్ప ఇతర దేశాలన్నీ, ముఖ్యంగా అమెరికాకు పోటీ వస్తున్నాయని అమెరికా పాలకులు భావించే దేశాలన్నీ ప్రపంచ శాంతిని నాశనం చేస్తున్నాయని చెప్పడం. అలా చెప్పకపోతే ఆఫ్ఘన్ పై దురాక్రమణ దాడి చేయడానికి, ఇరాక్ ను ఆక్రమించడానికి, లిబియాను సర్వ నాశనం చేయడానికీ, సిరియాలో కిరాయి తిరుగుబాటు రెచ్చగొట్టడానికి… ఈ చర్యలన్నింటి కోసం ట్రిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేయటానికీ మద్దతు ఎలా వస్తుంది?
మరో ముఖ్యమైన సంగతి ఏమిటంటే UNCLOS చట్టాన్ని అమెరికా ఆమోదించలేదు. రిపబ్లికన్ పార్టీ ఒప్పుకోలేదు అని చెబుతుంటుంది గానీ అదంతా శుద్ధ అబద్ధం. ఆ చట్టాన్ని ఆమోదిస్తే దక్షిణ చైనా సముద్రం, మధ్యధరా సముద్రం (ఇరాక్, లిబియా, సిరియా), అరేబియా మహా సముద్రం (ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, యెమెన్), హిందూ మహా సముద్రం ( డిగోగార్షియా) లలో పాల్పడుతున్న దుష్ట చర్యలకు గాను అంతర్జాతీయ కేసులు ఎదుర్కోవలసి వస్తుంది. పలు చోట్ల దోషిగా నిలబడవలసి వస్తుంది. భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది.
UNCLOS (United Nations Convention on the Law of the Sea) ప్రకారం ఏ దేశానికైనా తమ తీరం నుండి సముద్రం లోపలికి 200 నాటికల్ మైళ్ళ వరకు ప్రత్యేక ఆర్ధిక హక్కులు ఉంటాయి. అనగా 200 నాటికల్ మైళ్ళ వరకు Exclusive Economic Zone ను దేశాలు కలిగి ఉంటాయి. దీని అర్ధం 200 నాటికల్ మైళ్ళ వరకు దేశం సొంతం అని కాదు. ఇతర దేశాల నౌకలు 24 నాటికల్ మైళ్ళ నుండి 200 నాటికల్ మైళ్ళ వరకు అంతర్జాతీయ సముద్ర జలాలే గానీ 200 మైళ్ళ లోపల ఆ దేశానికి మాత్రమే సముద్ర వనరులపై హక్కు ఉంటుంది. చేపలు, చమురు, సహజవాయువు లాంటి వనరులను సొంతం చేసుకునే హక్కు ఉంటుంది.
ఈ హక్కు ప్రకారం ద.చై.సముద్రంలో చైనా, తైవాన్, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, బ్రూనె దేశాలకు ఎంతో కొంత హక్కు సంక్రమిస్తుంది. చైనా తీరం ఎక్కువ కనుక చైనాకు ఎక్కువ వాటా దక్కవచ్చు, చైనా క్లైమ్ చేస్తున్నంత కాకపోయినా. ఈ దేశాలు చర్చించుకుని తమ వివాదాలను పరిష్కరించుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది.
కానీ అమెరికాకు మాత్రం ఎలాంటి హక్కు ఉండదు. అందుకే UNCLOS ని ఆమోదించలేదు.
ఎష్టన్ కార్టర్ చేసిన వ్యాఖ్యలను ఈ నేపధ్యం నుండి చూస్తే వాటి అర్ధం ఏమిటో బోధపడుతుంది. “మనం మరో దిక్కుకు చూస్తూ నిలబడలేము” అనడం ద్వారా అమెరికా మరిన్ని యుద్ధ నౌకలను ద.చై.సముద్రానికి తరలించబోతున్నదని కార్టర్ సూచిస్తున్నాడు. దానికి కావలసిన సమ్మతిని, చైనా వ్యతిరేక సెంటిమెంట్లు రెచ్చగొట్టడం ద్వారా, అమెరికా ప్రజల నుండి కోరుతున్నాడు.
చైనా ప్రతినిధి హువా చున్ యింగ్ కూడా అదే చెబుతున్నారు. “ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మరిన్ని అదనపు బలగాలను మోహరించే లక్ష్యంతో, ఆ లక్ష్యానికి సానుకూల ముసుగు తొడిగే ఉద్దేశంతో కార్టర్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నా రు” అని ఆమె స్పష్టం చేశారు.