మళ్ళీ రేప్: ఒకినావాలో అమెరికా వ్యతిరేక ఆందోళనలు


జపాన్ దక్షిణ ద్వీప రాష్ట్రం ఒకినావాలో అమెరికా సైనికులు మరోసారి దురాగతానికి పాల్పడ్డారు. సాయంత్రం సమయంలో అమెరికా సైనిక స్ధావరం సమీపంలో వాకింగ్ కి వెళ్ళిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం ఆ మహిళను గొంతు పిసికి చంపేశారు.

మే 26-27 తేదీలలో టోక్యోలో G7 దేశాల సమావేశం జరగడానికి మూడు రోజుల ముందు జరిగిన ఈ దారుణానికి వ్యతిరేకంగా జపాన్ ప్రజలు ఆందోళనలను తీవ్రం చేశారు. ఒకినావా రాష్ట్రంలోను ఫుటెన్మా సైనిక స్ధావరాన్ని పూర్తిగా ఎత్తి వేయాలని కోరుతూ స్ధానిక ప్రజలు దాదాపు ప్రతి రోజూ ఆందోళనలు నిర్వహిస్తారు. మరోసారి అత్యాచారం, హత్యలకు పాల్పడిన నేపధ్యంలో ఒకినావా ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.

అత్యాచారం, హత్య ఘటనపై జపాన్ ప్రధాని షింజో అబే తీవ్ర అసంతృప్తి ప్రకటించాడు. అమెరికా సైనికుల అకృత్యాలకు అడ్డు కట్ట వేయాలని తాను వ్యక్తిగతంగా అమెరికా అధ్యక్షుడికి ఫోన్ చేసి చెప్పానని, తీవ్ర నిరసన వ్యక్తం చేశానని ఆయన ప్రకటించాడు. అయితే ఇలాంటి సముదాయింపులు జపాన్ నేతలకు మామూలేనని జపాన్ ప్రజలకు తెలుసు.

“నేను తీవ్రంగా దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇలాంటివి మళ్ళీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నేను అమెరికాను డిమాండ్ చేస్తున్నాను” అని షింజో అబే ప్రకటించాడు.

అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా హత్యకు గురయిన మహిళ కుటుంబానికి సానుభూతి ప్రకటించాడు. అయితే తమ సైనికుడి చర్యను ఖండిస్తున్నట్లు ఆయన ప్రకటించలేదు. మే 25 తేదీన బారక్ ఒబామా G7 సమావేశాల కోసం టోక్యో వచ్చాడు. జపాన్ ప్రధానితో ఆయన సానుభూతి వచనాలు చెప్పారని పత్రికలు తెలిపాయి.

ఒకినావా రాష్ట్ర గవర్నర్ నేతృత్వంలో రాష్ట్ర అసెంబ్లీ గట్టి చర్య ప్రకటించింది. అమెరికా స్ధావరాన్ని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ఒక తీర్మానం ఆమోదించింది. “అమెరికా మిలట్రీకి వ్యతిరేకంగా మేము మా తీవ్ర నిరసనను తెలియజేస్తున్నాము. ఈ కేసులో దోషులపై కఠిన చర్య తీసుకుంటాం. దర్యాప్తులో వెల్లడి అయిన వాస్తవాల మేరకు ఎలాంటి కనికరం లేకుండా దోషిని శిక్షిస్తాం” అని ఒకినావా గవర్నర్ తకేషి ఒనాగా ప్రకటించాడు.

అమెరికా మిలట్రీ, జపాన్ కేంద్ర ప్రభుత్వాలను ఉద్దేశిస్తూ రెండు తీర్మానాలను ఆమోదించామని ఒనాగా తెలిపాడు. జపాన్-అమెరికాల మధ్య అమలులో ఉన్న స్టేటస్ ఆఫ్ ఫోర్సెస్ అగ్రిమెంట్ ను వెంటనే సమీక్షించాలని కేంద్రాన్ని కోరామని తెలిపాడు. అసెంబ్లీలో జపనీస్ కమ్యూనిస్టు పార్టీ, సోషల్ డెమోక్రటిక్ పార్టీలు తీర్మానాలను ప్రవేశపెట్టగా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలుస్తోంది.

షిమబుకురో పేరు గల ఒకినావా యువతి (20 సం.లు) ఏప్రిల్ 29 నుండి కనిపించకుండా అదృశ్యం అయింది. ఆమె అదృశ్యం కావడానికి కొద్ది సేపటి క్రితమే తనకు పాఠ్య సందేశం (ఎస్‌ఎం‌ఎస్) పంపిందని ఆమె  బాయ్ ఫ్రెండ్ పోలీసులకు చెప్పాడు. తాను వాకింగ్ కి బైటికి వెళ్తున్నట్లు మెసేజ్ లో చెప్పిందని కానీ ఆ తర్వాత నుండి తన వద్ద నుండి ఎలాంటి సమాచారం లేదని చెప్పాడు.

జపాన్ మహిళ (20 సం.) అత్యాచారాన్ని పురస్కరించుకుని ఒకినావా పోలీసులు ఒక అమెరికా మెరైన్ ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రకారం అరెస్ట్ అయిన వ్యక్తి పేరు కెన్నెత్ ఫ్రాంక్లిన్ (32 సం.లు). ఆయన ప్రస్తుతం సర్వీస్ లో లేనప్పటికీ జపాన్ లో మెరైన్ గా పని చేసిన వ్యక్తియే. ప్రస్తుతం సైనిక స్ధావరం అనుబంధంగా ఉండే కార్యాలయంలో సివిల్ డ్యూటీలో పని చేస్తున్నాడని టైమ్స్ తెలిపింది.

కెన్నెత్ ఫ్రాంక్లిన్ ను ఒకినావా పోలీసులు అరెస్టు చేయగలగడానికి కారణం ఆయన సివిల్ డ్యూటీలో ఉండడమే. అదే సైనిక విధుల్లో ఉన్నట్లయితే అతన్ని అరెస్ట్ చేసే అవకాశం, అధికారం జపాన్ పోలీసులకు ఉండదు. జపాన్-అమెరికాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అమెరికా సైనికులు జపాన్ లో ఎలాంటి నేరానికి పాల్పడినప్పటికీ జపాన్ పోలీసులు అరెస్టు చేయడానికి వీలు లేదు. అరెస్టు చేసేందుకు స్ధావరం లోపలికి వెళ్ళేందుకు అనుమతి ఉండదు.

ఈ ఒప్పందం వల్లనే అమెరికా సైనికులు శిక్ష భయం లేకుండా యధేచ్చగా నేరాలకు పాల్పడుతున్నారు. అయినప్పటికీ సైనిక స్ధావరం ఎత్తివేయడానికి గానీ, కనీసం అక్కడి నుండి వేరే చోటికి కదిలించడానికి గానీ జపాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోయింది.

సైనికులు దుష్కార్యాలకు పాల్పడకుండా అడ్డుకునేందుకు అని చెబుతూ అమెరికా గతంలో వివిధ చర్యలు ప్రకటించింది. స్ధావరం వద్ద కర్ఫ్యూ విధిస్తున్నామని చెప్పింది. రాత్రి వేళల్లో సైనికులు స్ధావరం వదిలి వెళ్లకుండా నిషేధం విధిస్తున్నట్లు చెప్పింది. తాగడానికి రాత్రి పూట బైటికి వెళ్లకుండా నిషేధించామని ప్రకటించింది. అయినప్పటికీ అమెరికా సైనికుల దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

కెన్నెత్ ఫ్రాంక్లిన్ ను సి‌సి కెమెరా వీడియో ఫుటేజీ ద్వారా జపాన్ పోలీసులు పట్టుకున్నారు. ఆమె అదృశ్యం అయిన సమయంలో ఫ్రాంక్లిన్ కారు ఆమె ఇంటికి సమీపంలో ఉన్నట్లు వీడియో ద్వారా కనుగొన్నారు. ఆయన కారును పరీక్షించగా యువతికి చెందిన డి‌ఎన్‌ఏ అవశేషాలను కనుగొన్నారు. ఆ విధంగా కెన్నెత్ ను అరెస్ట్ చేశాక తానే నేరానికి పాల్పడినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఆమెపై అత్యాచారం జరిపి తర్వాత గొంతు పిసికి చంపేశానని, ఆమె మృత దేశాన్ని ఇంటికి దూరంగా ఉన్న గడ్డి మేటల మధ్య పారేశానని అంగీకరించాడని తెలిపారు.

గత మార్చి నెలలోనే అత్యాచారం ఆరోపణలపై అమెరికా  మెరైన్  సైనికుడిని జపాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 24 సం.ల జస్టిన్ కాస్టెలనోస్ ఒక జపాన్ యువతిపై హోటల్ గదిలో అత్యాచారం చేసినట్లు ఆరోపించడంతో అతనిని అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా జపాన్ ప్రధాని, అమెరికా అధికారులు ఇదే తరహా ప్రకటనలు చేశారు. “ఇది జరగడం తీవ్రమైన విషయం. బాధాకరం. గట్టి చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరాం” అని జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా మిలట్రీ అధికారులు కూడా అదే తరహాలో ఆపాలజీ ప్రకటన చేశారు.

“వాళ్ళు 18, 19 సం.ల యువ మెరైన్ సైనికులు. వారు తమకు తెలియని ఇలాంటి సంస్కృతుల మధ్యకు తరలిస్తున్నారు. స్ధానిక సంస్కృతి వారికి అర్ధం కాదు. పైగా విపరీతంగా తాగుతూ ఉంటారు. అధునాతన ఆయుధాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. వాళ్ళు ఎలాంటి సమస్యలో ఉన్నా అమెరికా కాపాడుకుంటుంది. ఎందుకంటే బహిరంగ అవమానం వారు సహించలేరు. సాధ్యమైనంతగా కాపాడుకోవడానికే ప్రయత్నిస్తారు.

“ఒకినావా పరిధిలో ప్రజలు ఎప్పుడూ నిరసనలు చేస్తూనే ఉంటారు. పరిశోధనల్లో ఎప్పుడూ నిజాలు తేలవు. ఎందుకంటే నేరం చేసిన సైనికులు స్ధావరంలో దాక్కుంటారు. నేరం చేసిన వాళ్ళు స్ధావరంలో దాక్కుంటే వారిని అరెస్ట్ చేయడానికి లోపలికి వెళ్ళే అధికారం పోలీసు అధికారులకు లేదు. అమెరికా అధికారులు సంతృప్తి చెంది లోపలికి ఆహ్వానిస్తే గాని వెళ్లడానికి వీలు లేదు. వాళ్ళు అనుమతి ఇచ్చి లోపలికి వెళ్ళేలోపల కీలక సాక్షాలు మాయం అయిపోతాయి. ఈ అంశాలను జపాన్ ప్రభుత్వం కూడా తేలికగా విస్మరిస్తోంది” అని మానవ హక్కుల లాయర్ రేయాన్ డాసన్, స్పుత్నిక్ న్యూస్ తో మాట్లాడుతూ వివరించాడు.

జపాన్ ప్రభుత్వానికే ఆసక్తి లేనప్పుడు అమెరికా సైనికుల అకృత్యాలకు అంతు లేకపోవడంలో ఆశ్చర్యం లేదు.

 

2 thoughts on “మళ్ళీ రేప్: ఒకినావాలో అమెరికా వ్యతిరేక ఆందోళనలు

  1. //జపాన్ ప్రభుత్వానికే ఆసక్తి లేనప్పుడు అమెరికా సైనికుల అకృత్యాలకు అంతు లేకపోవడంలో ఆశ్చర్యం లేదు. //

    అవును మరి, వారి ఆసక్తి మొత్తం సైనిక ఒప్పందాల మీద, వాటినుండి వచ్చే లాభాల మీదేనాయే! ఆ లాభాల కోసం దేశ ప్రజల మాన ప్రాణాలు పణంగా పెట్టిన వారికి ఇదో లెక్కా! ఆ మాత్రపు కంటి తుడుపు చర్యలు తమ వ్యూహాలు ప్రజలకు అర్ధం కాకుండా ఉండేటందుకే గాని, ప్రజల మీద ఉన్న ప్రేమతో కాదు గదా!

  2. బాగా గుర్తు చేశారు తిరుపాలు గారు. నేను ఆర్టికల్ లో ఈ అంశాన్ని రాయడం మరిచాను. అమెరికా సైనిక స్ధావరాలు జపాన్ పాలకవర్గాలకు చాలా లాభం. అమెరికా తన స్ధావరాల కోసం పెద్ద మొత్తంలో డబ్బు చెల్లిస్తుంది. స్ధావరాలు కేంద్రంగా మద్యం తదితర వ్యాపారాలు భారీగా నడుస్తాయి. ఆ డబ్బు వదులుకోవడం స్ధానిక ధనిక వర్గాలకు ఇష్టం ఉండదు. స్ధావరాలపై వ్యతిరేకతను పక్కన పెట్టడానికి జపాన్ పాలక వర్గాలకు ఉన్న ఒక ముఖ్య కారణం ఇది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s