
Sarbananda Sonowal with PM Modi in Guwahati
అస్సాంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. సర్బానంద సోనోవాల్ నేతృత్వంలో బిజేపి మొదటి సారిగా అస్సాంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనేకమంది కేబినెట్ మంత్రులతో సహా ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కూడా కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇంతవరకు ఈ వార్తలో విశేషం ఏమీ లేదు. ప్రధాన మంత్రి ప్రసంగంలో దొర్లిన కొన్ని మాటలే అసలు విశేషం.
“స్వతంత్రం అనంతరం గతంలో ఏ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినా కూడా, ప్రతి ప్రభుత్వమూ తనదైన మార్గంలో దేశానికి మంచి చేయడానికే కృషి చేసింది. కాబట్టి (గతంలో) ఏ మంచి అయితే జరిగిందో దానిని ముందుకు తీసుకు పోతాం. ఏవైతే లోపాలు జరిగాయో వాటన్నింటినీ వేగంగా సవరిస్తాము” అని ప్రధాని తన ప్రసంగంలో చెప్పారు. (వక్కాణింపు నాది. -విశేఖర్)
విశేషం ఏమిటో గుర్తించారా? ప్రధాన మంత్రి ఇటీవలి కాలంలో అనలేదు. ఏకంగా 68 యేళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. 1947 ఆగస్టు 15 వరకు వెళ్ళిపోయి సర్టిఫికేట్ ఇచ్చేశారు. (అబ్బే, డిగ్రీ/పిజి సర్టిఫికేట్ కాదు లెండి!)
గత 68 సం.ల కాలంలో ఏ ప్రభుత్వం పాలించినా సాధ్యమైనంతవరకు ప్రజలకు మంచే చేశాయి గానీ చెడ్డ చేయలేదని సర్టిఫికేట్ ఇచ్చారు. అనగా కాంగ్రెస్ ప్రభుత్వాలు మంచి చేయడానికి శాయశక్తులా కృషి చేశాయని మెచ్చుకున్నారు.
కాకపోతే కొన్ని పొరపాట్లు ఎవరికైనా తప్పవు. పని చేసేవాడే పొరపాట్లు చేస్తారు గానీ, పని చేయని వాడు పొరపాట్లు చేయలేడు కదా. ఇప్పుడు ఉన్నవారు ఆ పొరపాట్లు సవరించి, జరిగిన మంచిని ముందుకు తీసుకుపోవాలి. అంతే తప్ప ఒకటే ధోరణిలో గత వీరులను ఆడిపోసుకుంటామా?
కానీ అధికారం చేపట్టిన నాటి నుండి నిన్నటి వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చెప్పిన మాటలు ఇవేనా? అధికారం చేపట్టి 2 యేళ్ళు అయింది. 2 యేళ్ళ వరకూ ఎందుకు? మూడు నెలల క్రితం పార్లమెంటులో ప్రధాన మంత్రి ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి!
“కాంగ్రెస్ పార్టీ 60 యేళ్లలో పేదలకు సహాయం చేసినట్లయితే పేదలు ఇంకా కష్టాలు ఎదుర్కొంటూ ఉండేవారు కాదు… మీరు (కాంగ్రెస్) 60 సం.లు దేశాన్ని నడిపారు, ఫలితం ఏమిటీ అంటే మేము టాయిలెట్లు నిర్మించాం, మీరాపని చేయలేదు.
“మీరు దారిద్రాన్ని లోతుగా పాతారు. ఎంత లోతుగా అంటే దానిని పెకిలించడం చాలా కష్టం.”
ఇవి మార్చి 3 తేదీన ప్రధాని పార్లమెంటులో చెప్పిన మాటలు.
“నేను పదే పదే కొన్ని మాటలు వింటుంటాను, ‘MNREGA (గ్రామీణ ఉపాధి హామీ పధకం) ని ప్రభుత్వం చేయబోతున్నదనో, లేక ఇప్పటికే రద్దు చేసేసింది అనో. అనేక విషయాల్లో నాకు అనుభవం లేదని మీకు అనుమానం అని నాకు తెలుసు.
“కానీ నాకు రాజకీయంగా నిశిత దృష్టి ఉందని మీరు అంగీకరిస్తారని భావిస్తున్నాను. నా సునిశిత దృష్టి నాకు ఏమి చెబుతున్నదంటే MNREGA ను రద్దు చేయొద్దు అని. నేను అలాంటి తప్పు చేయను. ఎందుకంటే MNREGA పధకం మీ వైఫల్యాలకు ఒక సజీవ స్మారక చిహ్నం.
“స్వాతంత్రం వచ్చి 60 యేళ్ళు గడిచాక కూడా నేలలో గుంటలు తవ్వటానికి జనాన్ని పంపించాల్సిన దుస్ధితి. కాబట్టి నేను దీనిని వైభవంగా, ఆడంబరంగా జరుపుతాను. మీరు తవ్వుతున్న గుంటలు మీ పాపాల కోసమే అని ప్రపంచానికి చెబుతాను” ఇవి ఫిబ్రవరి 27 తేదీన ప్రధాని పార్లమెంటులో చెప్పిన మాటలు.
అంతేనా? “కాంగ్రెస్ ముక్త్ భారత్” అని కూడా ప్రధాని నరేంద్ర మోడీ, బిజేపి పిలుపు ఇచ్చారు.
60 యేళ్ళ పాటు పాపాలు చేసిన కాంగ్రెస్, 60 యేళ్ళ పాటు పేదలకు ఏమీ సాయం చేయని కాంగ్రెస్, పెకలించలేనంత లోతులకు దారిద్రాన్ని పాతిన కాంగ్రెస్, అకస్మాత్తుగా ‘సాధ్యమైనంతగా జనానికి మంచి చేసేందుకు కృషి చేసిన’ పార్టీ ఎలా అయింది? ఎప్పుడు అయింది? ఎందుకు అయింది?
ఇది ఏ చీకటి ఒప్పందాల ఫలితం?