కోల్డ్ వార్ వర్షన్ 2.0 లో కజకిస్తాన్ ఒక భాగం అయింది. రష్యా పొరుగు దేశం కజకిస్తాన్ లో సో-కాల్డ్ ప్రజాందోళనలు చెలరేగడంతో రష్యా వ్యతిరేక కోల్డ్ వార్ లో మరో ఫ్రంట్ ను అమెరికా తెరిచినట్లయింది. సిరియాను అస్తవ్యస్తం కావించి రష్యాను సిరియా యుద్ధంలో కూరుకుపోయేలా చేయడానికి శత విధాలుగా ప్రయత్నించి విఫలం అయిన అమెరికా మరో దుస్సాహసానికి ఒడిగడుతోంది.
మే 21 తేదీన కజకిస్తాన్ లో వివిధ నగరాలలో ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనలలో పాల్గొన్న వారి సంఖ్య కొన్ని డజన్ల లోపే ఉన్నప్పటికీ పశ్చిమ పత్రికలలో ఆందోళనలకు విస్తృత ప్రచారం లభించింది. దేశంలో అల్మటి (పాత రాజధాని) లాంటి పెద్ద నగరాలతో పాటు ఆస్తానా (కొత్త రాజధాని) లాంటి ఒక మాదిరి నగరాలలోనూ డజన్ల మంది ప్రదర్శనలు నిర్వహించారు.
ఆందోళనలు జరగడం ఏమంత కొత్త విషయం కాదు. ప్రజాందోళనలు ఒక సహజ సామాజిక, రాజకీయ ప్రక్రియ. తమ సమస్యలను ప్రభుత్వాలు గుర్తించేలా చేయడానికి ప్రజలకు ఆందోళనలు నిర్వహించడం తప్ప మరో మార్గం లేదు. కానీ ఈ కనీస ప్రజాస్వామిక హక్కులనే తమకు అనుకూలంగా మార్చుకుని ప్రభుత్వాలను కూల్చివేయడం అలవాటుగా చేసుకున్న పశ్చిమ దేశాల వలన ఆందోళనలను సైతం అనుమానించవలసిన దుస్ధితి దాపురించింది.
పూర్వ సోవియట్ రష్యాలో భాగమైన కజకిస్తాన్ 1990లో సోవియట్ రాజ్యాంగం మేరకు స్వతంత్రం ప్రకటించుకుంది. అయితే రష్యాకు మిత్ర రాజ్యంగా కొనసాగుతోంది. కామన్ వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ (సిఐఎస్) కూటమిలో భాగంగా రష్యాతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తోంది.
సిఐఎస్ ప్రాసంగికత కోల్పోయిన దరిమిలా యూరోపియన్ యూనియన్ కు పోటీగా వెలిసిన ‘యూరేసియన్ ఎకనమిక్ యూనియన్’ (ఈఈయూ) లో కజకిస్తాన్ వ్యవస్ధాపక సభ్య దేశం. నిజానికి ఈఈయూ ఏర్పాటు చేయాలన్న ఐడియా ఓ ప్రధమం కజకిస్తాన్ కే చెందుతుంది. ఈఈయూలో రష్యా, బెలారస్, కజకిస్తాన్ లు వ్యవస్ధాపక సభ్య దేశాలు కాగా ఆర్మీనియా, కిర్ఘిస్తాన్ లు తర్వాత చేరాయి.
కజకిస్తాన్ లో ప్రధాన మతం ఇస్లాం. ముస్లింల దేశమే అయినప్పటికీ జాతి, సంస్కృతుల పరంగా కజక్ ప్రజలు రష్యన్లకు సమీపంగా ఉంటారు. ఇరుగు పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు కొనసాగించడం ఏ దేశానికైనా అవసరం. అయితే భౌగోళిక రాజకీయాలలో ప్రపంచాధిపత్యం నిత్యం పాకులాడే పశ్చిమ రాజ్యాలు ఈ సహజ స్నేహ సంబంధాలకు ముప్పు తేవడం, దేశాలను అస్ధిరపరచడం చేస్తున్నాయి.
ముఖ్యంగా తమకు వ్యతిరేకంగా ఉన్న దేశాలలో సరికొత్త అలజడులు సృష్టించి ఆ అలజడులలో ఉగ్రవాద శక్తులను చొప్పించి, హింసాత్మక ఘటనలను ప్రేరేపించి, అంతిమంగా ప్రభుత్వాలను కూల్చివేస్తున్నాయి. కజకిస్తాన్ పశ్చిమ దేశాలకు వ్యతిరేకం ఏమీ కాదు. కానీ రష్యాతో స్నేహంగా ఉండడమే ఆ దేశం చేసిన పెద్ద తప్పు అయింది. శత్రువు మిత్రుడు కూడా శత్రువే మరి!
గత ఏప్రిల్ నెలలోనే కజకిస్తాన్ లో ప్రజలు ఆందోళనలకు దిగారు. అయితే ఈ ఆందోళనలు నకిలీ కాదు. అసలైనవి. దేశంలోని విస్తారమైన భూభాగాలను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం చేసిన నిర్ణయానికి ప్రజలు స్పందించారు. ప్రజల ఆందోళనల అనంతరం అధ్యక్షుడు నూర్సుల్తాన్ నజర్బయెవ్ పార్లమెంటు నిర్ణయాన్ని తన వీటో అధికారంతో రద్దు చేశాడు.
వివాదాస్పద నిర్ణయం రద్దు తర్వాత కూడా మే నెలలో మరోసారి ఆందోళనలు జరగడం ఒకింత ఆశ్చర్యానికి కారణం అయింది. ఆందోనకారుల ఇళ్లను, కార్యాలయాలను పోలీసులు తనిఖీ చేశాక కొన్ని విషయాలు వెల్లడి అయ్యాయి. పెద్ద సంఖ్యలో మాలటోవ్ కాక్టెయిళ్ళు (పెట్రోల్ బాంబులు), గ్యాస్ సిలిండర్లు, ఇనప రాడ్లు ఆందోళనకారులు నిలవ చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆందోళనలు బయలుదేరిన స్ధలాల్లో కూడా పోలీసులు వీటిని కనుగొన్నారు.
ఇదే తరహా హింసాత్మక సాధనాలు, ఆయుధాలను ఉక్రెయిన్ ఆందోళనలలోనూ ప్రయోగించారు. ఉక్రెయిన్ లో వారాల తరబడి సాగిన ఆందోళనల అనంతరం ప్రజలు మెజారిటీతో ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చివేశారు. అమెరికా నుండి జాన్ మెక్ కెయిన్ లాంటి యుద్ధోన్మాద సెనేటర్లు, అమెరికా విదేశీ శాఖ ఉప మంత్రి విక్టోరియా నూలంద్ లాంటి వారు స్వయంగా ఉక్రెయిన్ కు వచ్చి ఆందోళనకారులకు ఆహార పొట్లాలు పంచి పెట్టి మరీ ప్రోత్సహించారు.
- Protests -April 25
- Protests -April 24
- President Nursultan Nazarbayev
- Protests -May 21
- Kazakhstan -Heart of Eurasia
- Kazakhstan -Center of Oil & Gas trade
- Central Asia
- Kazakhstan -Mother of Nomadic people
వారి కుట్రల ఫలితంగా ప్రజా ప్రభుత్వం స్ధానంలో నాజీ గ్రూపులు, పశ్చిమ అనుకూల ముఖ్యంగా అమెరికా అనుకూల టెర్రరిస్టు గ్రూపులు అధికారం చేపట్టాయి. ఎన్నికల్లో నెగ్గిన ప్రభుత్వం ఈయూతో అసోసియేషన్ అగ్రిమెంట్ కు నిరాకరించగా కుట్రలతో అధికారం చేపట్టిన పోరోషెంకో ప్రభుత్వం అర్జెంటుగా అసోసియేషన్ అగ్రిమెంట్ పై సంతకం చేసింది.
అదే తరహా ఆయుధాలు, హింసా ప్రయోగాలకు కజకిస్తాన్ ఆందోళనకారుల వద్ద లభించడంతో ఆందోళనల వెనుక ఎవరు ఉన్నది స్పష్టం అయింది. రష్యాకు పొరుగునే ఉన్న మధ్య ఆసియా రాజ్యం కజకిస్తాన్ ను అస్ధిరం చేసేందుకు పశ్చిమ రాజ్యాలు కుట్రలు ప్రారంభించాయని అర్ధం అయింది.
ఈ నేపధ్యంలో కజకిస్తాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. చట్ట విరుద్ధంగా అల్లర్లు రేగడానికి కారకులపై చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంది. మే 20 తేదీన పెట్రోల్ బాంబులు, రాడ్లు, గ్యాస్ సిలిండర్లు సమీకరించినందుకు దేశవ్యాపిత తనిఖీలు నిర్వహించి 40 మందిని అరెస్ట్ చేసింది. దరిమిలా పశ్చిమ పత్రికలు గగ్గోలు పెట్టాయి. శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించిన ఆందోళనకారులపై ఉక్కు పాదం మోపుతున్నారని ఆరోపించాయి. నజర్బయేవ్ నియంతృత్వం అంటూ చిలవలు పలవలుగా కధలు అల్లి ప్రచారంలో పెట్టాయి. ప్రకటించిన 40 మంది మాత్రమే కాకుండా అనేక వందల మందిని నిర్బంధించారని వార్తలు ప్రచురించాయి. తద్వారా ఆందోళనల వెనుక ఉన్నది పశ్చిమ దేశాలే అన్న సంగతి ధృవీకరించాయి.
స్ధానికంగా, మధ్య ఆసియాలో, రష్యా పొరుగు ప్రాంతంలో భద్రతా పరంగా కజకిస్తాన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇసిస్ బలగాలు ఆసియాకు విస్తరించకుండా అడ్డుకోవడంలో రష్యా-కజకిస్తాన్ ల ఉమ్మడి బలగాలు చివరి రక్షణ దుర్గంగా ప్రస్తుతం నిలబడి ఉన్నాయి. కజకిస్తాన్ లో స్ధిరత్వం చెదిరిపోతే అది మొత్తం మధ్య ఆసియా ప్రాంతానికి తీవ్ర హాని కలిగిస్తుంది. ఇసిస్ లాంటి ఉగ్రవాద సంస్ధలు ఆసియా లోతులకు చొచ్చుకు వెళ్ళే వీలు కలుగుతుంది. తద్వారా అమెరికా, పశ్చిమ రాజ్యాల దుష్ట పన్నాగాలు విస్తరించడానికి అవకాశం దొరుకుతుంది.
మధ్య ఆసియాలో చైనాకు కూడా విస్తృత ప్రయోజనాలు ఉన్నాయి. చైనా చమురు, సహజ వాయువు నిల్వల అన్వేషణ, అభివృద్ధిలో చైనా భాగస్వామ్యం వహిస్తోంది. రోడ్లు, రైలు, వంతెనలు, టెలీ కమ్యూనికేషన్స్ లాంటి మౌలిక వసతుల నిర్మాణాలలో భాగం పంచుకుంటోంది. పరస్పర వాణిజ్య ప్రయోజనాలకు ఇతోధికంగా దోహదం చేస్తోంది. కజకిస్తాన్ అస్ధిరత్వం వల్ల ఈ ప్రయోజనాలకు ఆటంకం కలుగుతుంది. అమెరికాకు కావలసిందే అదే.
మధ్య ఆసియా రాజ్యాలలో సిఐఎస్ మాజీ సభ్య దేశాలలో వివిధ రంగుల విప్లవాల పేరుతో అల్లర్లకు ప్రాణం పోసిన చరిత్ర అమెరికాకు ఉన్నది. జార్జియాను రెచ్చగొట్టి రష్యన్ రిపబ్లిక్కులను దురాక్రమించేందుకు దారితీసిన పరిణామాలకు అమెరికాయే కారణం. జార్జియాలో రష్యా అనుకూల ప్రభుత్వాన్ని గులాబీ విప్లవం పేరుతో కూల్చివేసిన చరిత్ర అమెరికా సొంతం. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని ఆరెంజ్ విప్లవం పేరుతో కూల్చివేసింది అమెరికాయే.
ఇదే తరహాలో కజకిస్తాన్ లోని నజర్బయెవ్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు అమెరికా కుట్రలు పన్నుతోంది. నజర్బయెవ్ విధానాల వల్ల తక్కువగా లబ్ది పొందుతున్న దోపిడీ వర్గాలు అమెరికా ప్రయత్నాలకు సహకారం అందిస్తున్నాయి. కజకిస్తాన్ ఫైనాన్స్, ఖనిజ వనరుల పంపకంలో అసంతృప్తిగా ఉన్న కొన్ని సెక్షన్ లు ప్రధానంగా అమెరికాకు సహకరిస్తున్నాయి. సమీప భవిష్యత్తులో పంపకంలో భాగం పెంచుకునే లక్ష్యంతో, అమెరికా సహకారంతో, ఆందోళనలను ప్రేరేపిస్తున్న ఈ వర్గాలు దీర్ఘ కాలంలో ప్రభుత్వం కూల్చివేసి సంపదలను పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకునే లక్ష్యంతో పని చేస్తున్నాయి. ఇలాంటి వర్గాలనే అమెరికా చేరదీసి, ప్రభుత్వాలు కూల్చివేసిన అనంతరం పూర్తిగా తమ చెప్పు చేతల్లోకి దేశాలను తీసుకుంటాయి.
ఈ ప్రయత్నాలను కజకిస్తాన్ ప్రజలు, ప్రభుత్వం ఆదిలోనే నిర్ణయాత్మకంగా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉన్నది.