పోలండ్ పాఠం: అమ్మ నాన్న, ఒక నాటో -కార్టూన్


Mom Dad and NATO

నాటో అంటే తెలిసిందేగా, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్! దీనికి అమెరికా నేత. నాటో కూటమిలో పేరుకు 28 సభ్య దేశాలు ఉన్నా, అమెరికా ఒక్కటే ఒకటి (1). మిగిలిన 27 దేశాలన్నీ ఆ ఒకటి పక్క సున్నాలే. అంటే ఏ రష్యాతో యుద్ధం అంటూ వస్తే బాంబులు అవీ తీసుకుని అమెరికా రావాలే తప్ప ఇతర దేశాలు రష్యా ముందు నిలవలేవు. 

1990ల ఆరంభంలో సోవియట్ రష్యా కూలిన తర్వాత రోజుల్లో అమెరికా, రష్యాల మధ్య అలిఖిత, ప్రకటిత ఒప్పందం ఒకటి కుదిరింది. దాని ప్రకారం అమెరికా నేతృత్వం లోని నాటో తూర్పుకు విస్తరించకూడదు. అనగా రష్యా ప్రయోజనాలను సైనికంగా దెబ్బ తీయకూడదు అని. ఆ మేరకు అమెరికా మాట ఇచ్చి కొన్నాళ్లు నిలుపుకుంది. కానీ పుతిన్ రాకతో ఒట్టు తీసి గట్టున పెట్టింది.

నాటో తూర్పుకు విస్తరించడం అంటే అప్పటి వరకు సోవియట్ రష్యా ప్రాపకంలో ఉన్న తూర్పు యూరప్ రాజ్యాలను నాటో మిలట్రీ కూటమిలో చేర్చుకోవడం. సోవియట్ రష్యా కూలిన అనంతరం మొదటి రష్యా అధ్యక్షుడుగా ఎన్నికయిన బోరిస్ యెల్టిసిన్, తన దేశంతో పశ్చిమ దేశాలు విచ్చలవిడిగా ఆడుకునే అవకాశం ఇచ్చాడు. (ఆ చీకటి రోజుల వల్లనే శక్తివంతమైన నాయకుడి కోసం రష్యన్ ప్రజలు ఎదురు చూసి పుతిన్ ని ఎన్నుకున్నారు. వారి ఆశలను పుతిన్ వమ్ము చేయలేదు. అది వేరే వ్యవహారం.)

పుతిన్ అధికారం చేపట్టిన నాటి నుండి రష్యాను శక్తివంతం చేయడం ప్రారంభించాడు. ఆర్ధికంగా సొంత కాళ్లపై నిలబడేలా చర్యలు తీసుకున్నాడు. పశ్చిమ రాజ్యాల ఆటలకు చెక్ పెట్టాడు. ఎన్‌జి‌ఓ ల ముసుగులో ఉన్న పశ్చిమ రాజకీయాల ప్రచారకులను దేశం నుండి తరిమేశాడు. పశ్చిమ రాజ్యాల ప్రాపంకంలో రెచ్చిపోతున్న మాఫియా సామ్రాజ్యాలను చాలా వరకు మట్టు పెట్టాడు. “మీ ప్రయోజనాలతో రాజీ పడేది లేదు. మా ప్రయోజనాలు మావి. వాటిని తాకట్టు పెట్టేది లేదు” అని స్పష్టంగా తన చర్యల ద్వారా, విధానాల ద్వారా తెగేసి చెప్పాడు.

ఇది సహజంగానే పశ్చిమ రాజ్యాలకు నచ్చలేదు. అప్పటి నుండి పుతిన్ వ్యతిరేక ప్రచారంతో పశ్చిమ కార్పొరేట్ మీడియా తరించని రోజంటూ లేదు. పుతిన్ ని ఓ మహా నియంతగా, రాక్షసుడిగా, ప్రజాస్వామ్య వ్యతిరేకిగా, రౌడీ-గూండా… ఇలా ఎన్ని వీలయితే అన్నీ పేర్లూ ఆయనకి తగిలించి ప్రచారం చేస్తూ ఉంటాయి. అయితే పుతిన్ ని రష్యా ప్రజలు వదులుకోలేదు. రెండు సార్లు అధ్యక్షుడుగా తర్వాత ప్రధాన మంత్రిగా ఆ తర్వాత మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇంకోసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్నా ఆశ్చర్యం లేదు.

ఈ నేపధ్యంలో రష్యా ను బూచిగా చూపిస్తూ, ముఖ్యంగా పుతిన్ ని చూపిస్తూ అమెరికా నాటోను తూర్పుకు విస్తరించడం ప్రారంభించింది. ప్రతి చిన్న దేశాన్నీ అదిరించి బెదిరించి నాటోలో చేర్చుకుంది. మొదట ఈ‌యూలో చేర్చడం, ఆ తర్వాత నాటోలో చేర్చుకోవడం. రష్యా పొరుగునే ఉన్న బాల్టిక్ రిపబ్లిక్స్ (లాత్వియా, లిధుయేనియా, ఎస్తోనియా) ని కూడా చేర్చుకున్నారు.

1999లో పోలండ్ దేశం నాటో కూటమిలో చేరింది. దానికి ఆ దేశ పాలకులు చెప్పిన కారణం రష్యా భయం. రష్యా భయాన్ని చూపుతూ తాజాగా ఏకంగా మిలట్రీ స్ధావరమే పెట్టుకొమ్మని దేశ మంత్రులు పిలుపులు ఇస్తున్నారు. క్రమం తప్పకుండా అమెరికాతో కలిపి యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తూ రష్యాను చికాకు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

నిజానికి రష్యా వల్ల పోలండ్ కు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ప్రమాదం అంటూ వస్తే గిస్తే అమెరికా/నాటో వల్లనే రావాలి. అమెరికా కౌగిలి దృత రాష్ట్ర కౌగిలితో సమానం. అది కౌగిలి కి పిలిస్తే, ప్రేమతో అనుకుని దగ్గరకు వెళ్తాం. ఒకసారి కౌగిలి లోకి వెళ్ళడం అంటూ జరిగితే ఇక బయట పడేది ఉండదు. ఆ కౌగిలి బలానికి మన ఎముకలు ఫెళ ఫెళా విరిగి చావటమే మిగులుతుంది.

అమెరికాతో స్నేహం/కౌగిలి అంటే కొరివితో తల గోక్కోవడం. అమెరికాతో స్నేహం అంటే అమెరికా బహుళజాతి కంపెనీలకు దేశాన్ని బార్లా తెరిచి పెట్టడం. ఆ బహుళజాతి కంపెనీలకు జాలి, కరుణ, దయ లాంటివి ఏమీ ఉండవు. ఏ దేశంతో స్నేహం చేస్తే, ఆ దేశాన్ని గుల్ల గుల్ల చేస్తాయి. లాటిన్ అమెరికా దేశాలు అందుకు చక్కటి రుజువు. దశాబ్దాల పాటు అమెరికా దోపిడీ, అణచివేత, కుట్రలు అన్నీ పడి పడి, తిరగబడి పోరాడి ఛావేజ్, ఇవా మొరేల్స్, లూలా డి సిల్వా, కృశ్చనర్, కొర్రియా లాంటి నాయకులను ఎన్నుకుని ఇప్పుడిప్పుడే కాస్త సేద తీరుతున్నాయి.

తూర్పు యూరప్ దేశాలు ప్రస్తుతం కొత్త బిచ్చగాడిలా అమెరికాతో స్నేహం చేస్తున్నాయి. ఈ‌యూ సభ్య దేశాలుగా చేరి నాటో తీర్ధం పుచ్చుకుంటున్నాయి. ఆనక అమెరికాతో కలిసి యుద్ధ విన్యాసాలు చేస్తున్నాయి.

పోలాండ్ పాలకులు ప్రస్తుతం నాటో పిచ్చిలో తలమునకలై ఉన్నారు. వారి నాటో పిచ్చి ఎంతవరకు వెళ్లింది అంటే నాటో గురించి స్కూల్ లో పిల్లలకు పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు. స్కూల్ కరికులంలో ఒక సబ్జెక్ట్ గా చేర్చి ప్రత్యేకంగా క్లాసులు నిర్వహిస్తున్నారు. అమెరికాతో కలిసి యుద్ధ విన్యాసాలు ఎందుకు చేయాలో నచ్చజెబుతున్నారు. దేశంలో అమెరికా/నాటో సైనిక స్ధావరం ఎందుకు అవసరమో బోధిస్తున్నారు.

వారానికి కనీసం 4 గంటల పాటు నాటో పాఠాలు చెప్పాలని పోలండ్ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కొంతమంది పిల్లలు బహిరంగంగానే అడుగుతున్నారట, ఒక మిలట్రీ కూటమి గురించి ఇంతగా బాది చెప్పాలా అని. నాటో సభ్య దేశంగా ఉండడం వరకు ఓ కే గానీ ఇలా క్లాసుల్లోకి కూడా చొరబడాలా అని వారి బాధ.

పోలాండ్ లో అమెరికా శాశ్వతంగా సైనిక స్ధావరం ఏర్పాటు చేస్తే దాని పరిణామాలు ప్రజలకు వేరే విధంగా ఎదుర్కోవలసి ఉంటుంది. ఆ బాధ ఏమిటో ఇప్పటికే జపాన్ ప్రజలు భరిస్తున్నారు. జపాన్ లో ఒకినావా లోని సైనిక స్ధావరాన్ని తొలగించాలని జపాన్ ప్రజలు ప్రతి యెడూ నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఓటమి దరిమిలా జపాన్ పై రుద్దబడిన ఆ సైనిక స్ధావరంలోని అమెరికా సైనికులు అనేకసార్లు జపాన్ యువతులపై అత్యాచారాలకు పాల్పడ్డారు. అనేకమంది యువతులు తమపై జరిగిన అఘాయిత్యాల గురించి పైకి చెప్పకుండా జపాన్ పాలకులు అణచి ఉంచారని కూడా నివేదికలు వెలువడ్డాయి.

ఇలాంటి స్నేహాన్ని పోలండ్ తన ప్రజలకు, స్కూల్ పిల్లలకు ఎంత అవసరమో బలవంతంగా ఎక్కించాలని ప్రయత్నిస్తోంది. మునుముందు రష్యా, అమెరికాల మధ్య చెలరేగబోయే ఘర్షణలకు సైతం పోలాండ్ ప్రజలు బాధితులుగా మిగలవలసి వస్తుంది.

ఈ కార్టూన్ల ను స్పుత్నిక్ న్యూస్, రియా నొవొస్త్ తదితర పత్రికలు ప్రచురించాయి.

2 thoughts on “పోలండ్ పాఠం: అమ్మ నాన్న, ఒక నాటో -కార్టూన్

  1. ఈ అంశానికి శీర్షిక బాగుంది సర్,”అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి” లాగా “అమ్మ నాన్న ఓ నాటో”.
    అయితే అమ్మ,నాన్న లకు ఇవ్వగలిగే స్థాయిలో నాటోని చేర్చడమే ఒకింత ఆశ్చర్యంగా ఉంది.
    అంటే పోలాండ్ నాటోకి ఎంతగా విలువిస్తుందో ఈ కార్టూన్ ద్వారా తెలుస్తుంది.
    అయితే,1 పక్కన కుడివైపు సున్నాలుంటే దానివిలువ పెరుగుతుంది,అదే ఎడమవైపు సున్నాలుంటే దానివిలువ 1(ఎటువంటిమార్పు ఉండదు).

  2. ఆ సినిమా పేరు గుర్తుకు రాక తన్నుకులాడాను. నిజానికి కార్టూన్ చూసి ఈ శీర్షిక పెట్టాను. కానీ శీర్షిక పెడుతున్నపుడు ఇలాంటి సినిమా ఏదో ఉండాలే అని గుర్తుకు వచ్చి, పూర్తిగా గుర్తు తెచ్చుకోడానికి ట్రై చేశాను. కానీ ఎంతకీ గుర్తుకు రాలేదు. ఆ ఖాళీ మీరు పూర్తి చేశారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s