రాష్ట్రాలకు కేంద్రం 81 వేల కోట్ల ఎగవేత!


Midday meal

Midday meal

రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో ఎగవేస్తున్న సంగతి వెలుగులోకి వచ్చింది. కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (సి‌ఏ‌జి) చేసిన పరిశోధనలో ఈ వాస్తవం వెల్లడి అయింది. ఈ పాపంలో కాంగ్రెస్, బి‌జే‌పిలు రెండూ భాగం పంచుకోగా కాంగ్రెస్ కంటే బి‌జే‌పి నాలుగు ఆకులు ఎక్కువే చదివిందని సి‌ఏ‌జి గణాంకాలు తెలియజేస్తున్నాయి.

1996-97, 1997-98, 2006-07, 2007-08, 2014-15 సంవత్సరాల కాలంలో రాష్ట్రాలకు ఇవ్వవలసిన మొత్తం కంటే తక్కువ మొత్తాన్ని కేంద్రం పంపిణీ చేసిందని సి‌ఏ‌జి తెలిపింది. 1996-97 లో ఇలా తక్కువ చెల్లించిన మొత్తం రు 423.34 కోట్లు కాగా అది బి‌జే‌పి ఏలుబడి లోకి వచ్చేసరికి అమాంతం రు 17,322.14 కోట్లకు పెరిగిపోయింది. మొత్తం మీద గత పదేళ్ళ కాలంలో రు 81,647.70 కోట్ల నిధులు రాష్ట్రాలకు పంపిణీ చేయకుండా నిలిపివేశారని సి‌ఏ‌జి తెలిపింది.

“రాష్ట్రాలకు మరిన్ని నిధులు ఇస్తున్నాం. అందుకోసం కొత్త చట్టం చేశాం” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అధికారం లోకి వచ్చిన కొత్తలో ప్రకటించారు. రాష్ట్రాలకు ఇచ్చే నిధులని 32 శాతం నుండి 42 శాతానికి పెంచామని ఆయన పదే పదే చెప్పుకున్నారు. కేంద్ర నిధులలో రాష్ట్రాల వాటా 10 శాతం పెంచడం ద్వారా తాము కాంగ్రెస్ కంటే ఎక్కువగా “సహకార సమాఖ్య” (కోఆపరేటివ్ ఫెడరలిజం) వ్యవస్ధకు కట్టుబడి ఉన్నామని ఆయన చాటారు.

అయితే వాస్తవం ఇందుకు విరుద్ధంగా ఉన్నది. మొదటగా గుర్తించవలసినది మోడి ప్రభుత్వం తనంత తానుగా రాష్ట్రాల వాటా పెంచలేదు. నిధుల్లో రాష్ట్రాల వాటా పెంచాలన్న నిర్ణయం యూ‌పి‌ఏ కాలంలో 2012లోనే జరిగింది. ఆ మేరకు 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల చేయగా ఆ సిఫారసులను మోడి ప్రభుత్వం ఆమోదిస్తూ రాష్ట్రాల వాటాను 32% నుండి 42 శాతానికి పెంచింది. ఈ పంపకం కేంద్రం యొక్క మొత్తం రెవిన్యూ ఆదాయ నిధుల నుండి జరగలేదు. కేవలం విభజనకు కేటాయించబడిన నిధులలో (divisible funds) వాటా మాత్రమే పెంచారు.

మరో అంశం ఏమిటంటే పలు వ్యయం ఖాతాలను కేంద్రం నుండి రాష్ట్రాలకు తరలించాలని ఫైనాన్స్ కమిషన్ సిఫారసు చేయటం. దాదాపు 30 ఖాతాలను కేంద్రం నుండి రాష్ట్రాలకు తరలించాలని కమిషన్ చెప్పింది. అనగా ఇంతవరకు కేంద్రం చేయవలసిన 30 రకాల ఖర్చులు ఇక నుండి రాష్ట్రాలు చేయవలసి ఉంటుంది. పెంచిన నిధులు అదనంగా అంటగట్టిన ఖాతాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసుకోవడం అన్నమాట!

కమిషన్ సిఫారసు చేసినట్లుగా 30 ఖాతాలు కాకుండా అంతకు తక్కువే రాష్ట్రాలకు తరలిస్తామని కేంద్రం చెప్పింది. అయినప్పటికీ కూడా నికరంగా చూస్తే రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేస్తున్న నిధులు వాస్తవంగా తగ్గిపోయాయనీ, కేంద్రం మరిన్ని అధికారాలు తన గుప్పెట్లో ఉంచుకునేలా నిధుల పంపిణీ పద్ధతులను మార్చివేసిందని కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సందస్సు పోయిన సంవత్సరం ఆరోపించింది. వారి ఆరోపణను కేంద్రం ముక్తసరిగా ఖండించడమే తప్ప ఇన్ని నిధులు ఎక్కువ ఇచ్చాం అని చెప్పలేకపోయింది.

ముఖ్యంగా విద్య, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, సానిటేషన్ రంగాలకు కేంద్రం నుండి వచ్చే నిధుల వాటా తగ్గిపోయిందని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు తర్వాత రోజుల్లో వెల్లడి చేశాయి. ఇండియాస్పెండ్ అనే పరిశోధన, అధ్యయన సంస్ధ ప్రకారం విద్యారంగం నిధులు 16% తగ్గిపోగా ఆరోగ్య శాఖ నిధులు 15% తగ్గిపోయాయి. 2015-16 నుండి 24 పధకాలకు సంబంధించిన రికరింగ్ ఖర్చులను చెల్లించడం కేంద్రం మానివేస్తుంది. వాటిని రాష్ట్రాలే చెల్లించాలి. నేషనల్ హెల్త్ మిషన్, ఐ‌సి‌డి‌ఎస్, జాతీయ రైతు పధకం, నేషనల్ మిషన్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్, గ్రామీణ తాగు నీటి పధకం, స్వచ్ఛ్ భారత్ అభియాన్, ఇందిరా ఆవాస్ యోజన, గ్రామీణ జీవనోపాధి మిషన్ మొ.న పధకాల సిబ్బందికి కేంద్రం వేతనాలు చెల్లించడం నిలిపివేసింది. ఈ నేపధ్యంలో ఈ పధకాలను కొనసాగించడం కంటే మూసివేయడానికే రాష్ట్రాలు మొగ్గు చూపుతాయని నిస్సందేహంగా భావించవచ్చు.

నిధుల పంపిణీ పెంపు పేరుతో పలు బాధ్యతలను తన భుజం మీది నుండి దించుకుని రాష్ట్రాల మీదికి నెట్టివేసిన మోడి ప్రభుత్వం, ఆ నిధులను కూడా సరిగ్గా ఇవ్వడం లేదని సి‌ఏ‌జి నివేదిక స్పష్టం చేస్తోంది. 2014-15 సం. తో పాటు పైన పేర్కొన్న ఇతర కాలాలకు గాను పన్నులు, సుంకాల ఆదాయం పంపిణీ విషయమై ఆడిట్ నిర్వహిస్తుండగా ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయని సి‌ఏ‌జి తెలిపింది. ఆర్టికల్ 279(1) ప్రకారం పన్నులు, సుంకాల పంపిణీని సక్రమమే సి‌ఏ‌జి సర్టిఫై చేయవలసి ఉన్నది. సక్రమమేనా కాదా అని పరిశీలిస్తున్న క్రమంలో కేంద్రం చేతివాటం వెలుగులోకి వచ్చింది.

1996 వరకు ఆదాయ పన్ను, కేంద్ర ఎక్సైజ్ పన్నులలో మాత్రమే వాటాలను రాష్ట్రాలకు ఇవ్వవలసి ఉండేది. 1996 లో చట్టానికి 80 సవరణలు చేయడం ద్వారా మరిన్ని ఖాతాల నిధులను పంపిణీ భాగంలో చేర్చారు. కార్పొరేట్ పన్ను, కస్టమ్స్ పన్ను, సేవల పన్ను, ఇతర కేంద్ర ఎక్సైజ్ పన్నులు ఈ విధంగా రాష్ట్రాలకు వాటా ఇవ్వవలసిన ఖాతాలలో కలిపారు. అయితే ఈ సవరణలకు సంబంధించి స్పష్టత లేదన్న కారణంతో అప్పటి నుండి పంపిణీపై ఆడిటింగ్ జరగలేదని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో 2009 తర్వాత ఎటువంటి సర్టిఫికేట్లు కాగ్ ఇవ్వలేదు.

1996-97 నుండి ఎక్సైజ్, కస్టమ్స్ పన్నుల పంపిణీకి, 1999-2000 నుండి పరోక్ష పన్నులకు, 2005-06 నుండి ప్రత్యక్ష పన్నులకు కాగ్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. అనగా తనిఖీ జరపలేదు. ప్రస్తుతం ఆడిటింగ్ నిర్వహించి నివేదిక వెలువరించిన దరిమిలా మొత్తం మీద 81,000 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపిణీ చేయవలసి ఉన్నది. కాగ్ నిర్ణయాన్ని కేంద్రం అమలు చేస్తుందా లేదా అన్నది ఇంకా తెలియలేదు. అమలు చేస్తే గనక పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ కు రు 7,000 కోట్ల వరకు అనుకోకుండా నిధులు వచ్చిపడతాయని తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలకు సైతం ఆ నిష్పత్తిలో నిధులు అందవచ్చు.

One thought on “రాష్ట్రాలకు కేంద్రం 81 వేల కోట్ల ఎగవేత!

  1. ఇండియాస్పెండ్ అనే పరిశోధన, అధ్యయన సంస్ధ ప్రకారం విద్యారంగం నిధులు 16% తగ్గిపోగా ఆరోగ్య శాఖ నిధులు 15% తగ్గిపోయాయి.
    విద్య(ఉమ్మడి జాబితాలోని అంశం),ఆరోగ్యం రంగాలు రాష్ట్రాల జాబితాలలోనివి అని చెప్పి కేంద్రం వాటినిదులను తగ్గించివేస్తూంది.
    ఏ ఏటికాయేడు నిదులను తగ్గించివేస్తూ ఉంటే సామాన్యులు వాటికై పెట్టే ఖర్చు పెరుగుతూ ఉంది.ఆ విధంగా సామాన్యులనుండి మరంత పిండుకొంటున్నారు.
    ఎప్పటిలాగానే ఈ యేడుకూడా విద్యాసంవత్సరం మొదట్లో ప్రభుత్వం విద్యారంగంలో కాగితాలకే పరిమితమైన వారిఘనకార్యాలను వల్లెవేయడం జరుగుతుంది.కానీ,వాత్సవం దానికి విరుద్ధంగా జరుగుతుంది(ప్రైవేటు విద్యాసంస్థలు విపరీతంగా ప్రచారంచేసుకొని,తల్లిదండ్రులను వలలో వేసుకొంటారు.దానికి ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించి విద్యారంగాన్ని బ్రష్టుపట్టించడం జరుగుతుంది).

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s