ముగింపు: భారత వ్యవసాయంలో పెట్టుబడిదారీ విధానం -22


Mao Zedong during Long March

(21వ భాగం తరువాత………….)

భారత వ్యవసాయంలో పెట్టుబడిదారీ మార్పులపై ఒక నోట్ – పార్ట్ 22

చాప్టర్ VII

ఎక్కడ నిలబడి ఉన్నాం?

భారత వ్యవసాయానికి సంబంధించి ఈ లక్షణాలను పరిశీలించిన దరిమిలా మనం ఎక్కడ నిలబడి ఉన్నట్లు?

అంబికా ఘోష్ పేర్కొన్నట్లుగా “ఈ స్వయం పోషక రైతాంగ వ్యవసాయం విచ్ఛిన్నం ఫలితంగా ఏర్పడ్డ స్ధూల ప్రభావం ఏమిటంటే రైతాంగ ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నం కావటం; భూస్వామ్య విధానం లేదా ధనిక రైతాంగ ఆర్ధిక వ్యవస్ధ ఒక కొత్త రకం జాతి (species) గా వృద్ధి చెందటం; ఈ పరిస్ధితులు పెట్టుబడిదారీ వ్యవసాయం మొలకెత్తి వృద్ధి చెందటానికి కావలసిన సారవంతమైన నేలగా తయారు కావటం. ఉత్పత్తి విధానం (mode of production) ఇప్పటికీ తగినంతగా మార్పు చెందకపోవటంతో పూర్తి స్ధాయి పెట్టుబడిదారీ వ్యవసాయానికి బదులుగా సంకర (హైబ్రిడ్) రూపాలు ఉద్భవించాయి.” (Ambika Ghosh: Emerging Capitalism in Indian Agriculture, July 1988, P-363)

“సాంకేతిక విప్లవం ద్వారా ఈ అవక్షేప ఆటంకాలను (residual hindrances) తప్పింపజేస్తూ అచ్చమైన పెట్టుబడిదారీ తరహా వ్యవసాయం ఉద్భవించడానికి తయారుగా ఉన్నది.” (Ibid, P-363)

తన పుస్తకం “వ్యవసాయ ఆర్ధిక వ్యవస్ధలో ధోరణులు” (Trends in Agrarian Economy, 1989) లో పి సి జోషి ఇలా అంటారు, “వ్యవసాయ అభివృద్ధి కోసం చిన్న రైతాంగానికి బదులు ఉన్నత భూయజమానులను ప్రధాన శక్తిగా ఎంపిక చేసుకోవడం అంటే మరింత ఉత్పత్తి తీయగల రైతాంగ ఉత్పత్తి విధానానికి బదులుగా పరాన్నభుక్త పెట్టుబడిదారీ విధానాన్ని ఎంపిక చేసుకోవటమే.” (Page 111)

సూర్యకాంత్ మిశ్రా తన వ్యాసంలో ఇలా పేర్కొన్నారు, “అర్ధ భూస్వాములుగా ఉనికిలో ఉండటం నుండి పెట్టుబడిదారీ భూమి యజమానులుగా మారే పరివర్తన ఒకటి వారిలో చోటు చేసుకుంటున్నది. ఆ మార్పు ఎలాంటిది అంటే సదరు పరివర్తన కేవలం పాక్షికంగానే జరుగుతున్నది; మరీ ముఖ్యంగా ఈ గ్రామీణ ధనికవర్గం అచ్చంగా అటు ఫ్యూడల్ వర్గమూ కాదు, ఇటు పెట్టుబడిదారీ వర్గమూ కాదు. ఒకే వ్యక్తిలో పెట్టుబడిదారీ పూర్వ అంశాలు, పెట్టుబడిదారీ అంశాలు రెండూ ఉనికిలో ఉన్నట్లు గమనించగలం.” (P-344) ఆయన ఇంకా ఇలా చెప్పారు, “మొత్తంగా చూస్తే, పశ్చిమ బెంగాల్ లో నయా ధనికవర్గం పాత భూస్వామ్య వర్గం కంటే పెట్టుబడిదారీ రైతుతోనే ఎక్కువ సాపత్యం కలిగి ఉన్నాడు.” (S K Mishra: Agrarian Relations in Contemporary West Bengal and Tasks for the Left; P-346)

సాపత్యం? ఐనిస్టీన్ తో సాపత్యం ఉన్నంత మాత్రాన ఎవరన్నా ఐనిస్టీన్ కాగలరా? తమ సైద్ధాంతీక దివాళాకోరుతునాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయోగించిన పదం కాదా ఇది! మరి ఫైనాన్స్ పెట్టుబడితో వారికి గల సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వదిలేశారు.

“సంకర”, “పరాన్న భుక్త”, “సాపత్యం” లాంటి పద ప్రయోగాల ద్వారా వీరు తమ సైద్ధాంతిక వైరుధ్యాలను మరుగు పరుస్తున్నారు; నిర్మాణం, క్రమత్వం (pattern), సామ్రాజ్యవాద యుగంలో పెట్టుబడిదారీయేతర దేశంలో పెట్టుబడిదారీ యేతర సంబంధాలు ఆధిపత్యం వహించే వ్యవసాయంలో చోటు చేసుకుంటున్న మార్పుల ప్రక్రియ… ఈ అంశాలపై తమ అవగాహనా లేమిని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు; ఫైనాన్స్ పెట్టుబడి ఏజెంటుగా ‘చలామణి’ పెట్టుబడి నిర్వహిస్తున్న పాత్రను విస్మరిస్తున్నారు.

వలస పూర్వపు రోజుల నుండి ఇప్పటివరకు భారత వ్యవసాయ ఆర్ధిక వ్యవస్ధలో వచ్చిన పరిణామాలను అధ్యయనం చేస్తే, వ్యవసాయ సంబంధాలలో ముఖ్యమైన మార్పులు వచ్చాయనడంలో సందేహం లేదని అర్ధం అవుతుంది. ఉదాహరణకు వ్యవసాయ వాణిజ్యం గుర్తించదగిన రీతిలో అభివృద్ధి చెందింది. వ్యవసాయంలో, ముఖ్యంగా 1970లు 80లలో, కొంత మేరకు పెట్టుబడిదారీ సంబంధాలు వృద్ధి చెందాయి. అయితే చలామణి సంబంధాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటూ పెట్టుబడిదారీ సంబంధం అభివృద్ధి అయినట్లు పొరపాటుగా భావించడం గతం లోనూ అనేకసార్లు జరిగింది. వ్యవసాయంలో సామ్రాజ్యవాద చొరబాటును సులభతరం చేసేందుకు 1970లలో భారత రాజ్యం ప్రణాళికలు, బ్యాంకింగ్ వ్యవస్ధ ద్వారా వ్యవసాయ రంగంలో కొన్ని మౌలిక వసతులను అభివృద్ధి చేసింది. బడా భూస్వామ్య వర్గానికి నష్టం కలగకుండానే, ఆ రోజులలో గ్రామీణ, పట్టణ భారతాలు రెండింటా వర్గ ఘర్షణలకు ఊతం ఇస్తున్న ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు బడా బూర్జువాలకు తోడ్పాటు అందజేసింది. ఈ ప్రక్రియలో ఉప ఉత్పత్తి (by-product) గా మాత్రమే వ్యవసాయంలో పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాల వృద్ధికి కాస్త ఊతం లభించింది. అయితే ఏ అధిక వడ్డీ పెట్టుబడి అయితే వ్యవసాయంలో పెట్టుబడిదారీ పూర్వ సంబంధాలను బద్దలు కొట్టి పెట్టుబడిదారీ సంబంధాలు అభివృద్ధి చేయడంలో ఒక ముఖ్యాంశంగా ఉంటుందో ఆ గ్రామీణ ఋణ పంపిణీని ఇది బలహీనం కావించింది. సమకాలీన ఆర్ధికవేత్తల్లో అనేకులు ఈ పరిణామాన్ని విస్మరించనప్పటికీ, వ్యవసాయంలో పెట్టుబడిదారీ సంబంధం అభివృద్ధి పరిమితులనూ మరియు వైఫల్యాలను -ముఖ్యంగా లెనిన్ చర్చించిన దేశీయ మార్కెట్ కు సంబంధించి-గుర్తించడంలో విఫలం అయ్యారు. ఈ తిరుగు ప్రయాణం ప్రక్రియను వ్యవస్ధాగత సర్దుబాటు కార్యక్రమం మరింత వేగవంతం కావించింది. ప్రైవేటు ఋణ వితరణ పెట్టుబడికి ప్రోత్సాహం ఇస్తూ వ్యవసాయంలో నిలిచిపోయిన పెట్టుబడిదారీ సంబంధాల వృద్ధికి అవరోధాలు కల్పిస్తూ అభివృద్ధి నిరోధక విధానాలను అమలు చేశారు. ఈ నాటి భారత వ్యవసాయంలో శ్రమ రూపం కూడా నిర్ణయాత్మక స్వేచ్ఛా వేతన శ్రమ రూపంలో లేదు. భారత వ్యవసాయాన్ని సరిగ్గా అధ్యయనం చేస్తే అందులో పెట్టుబడిదారీ సంబంధాల వృద్ధి ప్రధాన ధోరణిగా గానీ, పెరుగుతున్న ధోరణిగా గానీ లేదు.

సమతా స్ధితిలో లేని, (బాహ్య ప్రభావాలకు అనువుగా) బహిరంగంగా ఉన్న ఏదేని చలనశీల వ్యవస్ధను అర్ధం చేసుకోవాలంటే ఆ వ్యవస్ధ గుణాన్ని (స్వభావాన్ని), క్రమం (pattern) నీ మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఒక వ్యవస్ధ మొత్తం చలన రూపాన్ని “ఫేజ్ పోర్ట్రయిట్’ గా పిలవొచ్చు. అందులోని పరామితిలు (parameters) నెమ్మదిగా మారుతున్నప్పుడు ఫేజ్ పోర్ట్రయిట్ నిర్మాణం చెదిరిపోకుండా నిలకడగా ఉంటుంది. అనగా నిర్మాణంలో జరిగే చిన్న మార్పులు ఫేజ్ పోర్ట్రయిట్ యొక్క మౌలిక స్వభావాన్ని మార్చకుండా నిలిపి ఉంచుతాయి. కానీ నిర్దిష్ట పరామితుల్లోని కొన్ని మార్పులు ఫేజ్ పోర్ట్రయిట్ మౌలిక స్వభావంలోనూ మార్పులు కలగజేయవచ్చు. ఆ మార్పుల క్రమంలో వ్యవస్ధ యొక్క నిర్మాణ పరమైన నిలకడతనాన్ని చెదరగొట్టే స్ధానం ఒకటి ఉంటుంది. మార్పులు క్రమం ఆ స్ధానాన్ని చేరినప్పుడు వ్యవస్ధ నిర్మాణం అస్ధిరమై మరో ప్రక్రియలోకి ప్రవేశిస్తుంది. ఈ స్ధానాన్ని ‘ద్విభాగ విభజన స్ధానం’ (bifurcation point) అవుతుంది. ఈ స్ధానం వద్ద వ్యవస్ధ అకస్మాత్తుగా నూతన రూపంలో ప్రత్యక్షం అవుతుంది.

నిర్మాణం (structure), క్రమం (pattern), ప్రక్రియ (process)… ఈ మూడు ఒకదానితో ఒకటి విడదీయలేని సంబంధం కలిగిన ప్రమాణాలు (criteria).  క్రమం, నిర్మాణంల మధ్య ప్రక్రియ లంకెగా పని చేస్తుంది. ఏదేని వ్యవస్ధ క్రమం అయినా రూపధారణ జరిగే కార్యకలాపమే, ప్రక్రియ. ఏదేని వ్యవస్ధ అత్యవసర లక్షణాలను ఆ వ్యవస్ధలోని ఏయే అంశాల మధ్య సంబంధాలు నిర్ధారిస్తాయో ఆ సంబంధాల సమగ్రాకృతియే, క్రమం. వ్యవస్ధ క్రమానికి భౌతిక రూపం ఇచ్చేది, నిర్మాణం. ఒక వ్యవస్ధ ఏ నిర్దిష్ట సమయంలోనైనా ‘ద్విభాగ విభజన స్ధానం’ నుండి ఏ పంధాలో కదులుతుంది అన్నది ఆ వ్యవస్ధ చరిత్ర (అంతర్గత లక్షణాల) పైనా, బాహ్య పరిస్ధితుల పైనా ఆధారపడి ఉంటుంది. ఆధునిక విజ్ఞానం లోని ఈ సంక్లిష్ట వ్యవస్ధ అవగాహనను కారల్ మార్క్స్, ఉత్పత్తి విధానంలో మార్పులపై అవగాహన అందిస్తూ తన రచనల్లో పునరుల్లేఖించారు.

Nepal women guerillas

Nepal women guerillas

ప్రస్తుతం సామ్రాజ్యవాదం, వ్యవసాయ ఆర్ధిక వ్యవస్ధను నయావలస పరివర్తనవైపుకి లాగుతోంది. దేశీయ మిత్రవర్గాలతో కుమ్మక్కయిన ఫైనాన్స్ పెట్టుబడి, ఆ మిత్రుల సహకారంతో వ్యవసాయ ఉత్పత్తిపై అంతకంతకూ ఎక్కువగా ఆధిపత్యం వహిస్తోంది. ఆ క్రమంలో సామ్రాజ్యవాద పెట్టుబడి సంచయ ప్రక్రియకు సేవ చేసే వెనుకబాటు దోపిడి పద్ధతిని మరింత శక్తివంతం కావిస్తోంది. హరిత విప్లవ ఆరాధకులు దీనిని చూడటంలో విఫలం అవుతున్నారు. పెట్టుబడిదారీ విధానంలో కనిపించే లేబర్ మార్కెట్ లోని అసమాన మారకాన్ని విస్మరిస్తున్నారు. అలాగే అంతః బంధిత (interlocked) మార్కెట్ లేదా నిర్బంధ మార్కెట్ (captive market) లోని అసమాన మారకాన్ని గుర్తించటానికి నిరాకరిస్తున్నారు. రష్యాలో చూసినట్లుగా దేశీయ మార్కెట్ స్వతంత్రంగా అభివృద్ధి చెందడం లేదు. ప్రస్తుత సామ్రాజ్యవాద యుగంలో అటువంటి పరిణామాలను ఆశించలేమని కొందరు వాదించవచ్చు. అలాగయితే వ్యవసాయ రంగంలోనూ అలాంటి పరివర్తనను ఆశించరాదు. ఆధునిక ఐరోపాలో జరిగినట్లుగా పెట్టుబడిదారీ విధానం తన యధాతధ రూపంలో పాత ఉత్పత్తి విధానాన్ని త్రోసిరాజనడానికి ‘చారిత్రక అభివృద్ధి దశ మరియు ఉనికిలో ఉన్న పరిస్ధితులూ’ అనుమతించవు. (Capital III; P-594) కారల్ మార్క్స్ మహద్గ్రంధం కేపిటల్ నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఇవి.

పరిణామాల ఫలితాన్ని నిర్ధారించే నిర్ణయాత్మక శక్తి వర్గ పోరాటం మాత్రమేనని వర్గాలుగా విభజించబడిన సమాజ పరిణామ చరిత్ర చాటి చెబుతోంది. సామ్రాజ్యవాద ఆర్ధిక వ్యవస్ధ చొరబాటుకు వీలుగా తెరుచుకుని ఉన్న సమకాలీన భారత సామాజికార్ధిక వ్యవస్ధలో ఒకవైపు కార్మికవర్గం, అర్ధ-ప్రోలెటేరియట్ వర్గం, విస్తారమైన రైతాంగ జనం, చిన్న-మధ్య తరహా పారిశ్రామికవేత్తలు నిలబడి ఉండగా మరోవైపు భూస్వాములు, సామ్రాజ్యవాదులతో మిలాఖత్ అయిన దేశీయ వర్తక మరియు విదేశీ పెట్టుబడి మిత్రవర్గాలు మోహరించి ఉన్నారు. ఈ లాగుడులో తాడు ప్రస్తుతం రెండో శిబిరం చేతుల్లోనే ఉన్నప్పటికీ భారత వ్యవసాయ రంగంలో వివిధ వర్గ ప్రయోజనాలు కలిగిన వివిధ వర్గ శక్తుల ప్రతిఘటనను నిరాకరించటానికి వీలు లేదు. తాడు లాగుడులో బలం తిరగబడితే అప్పుడు ‘ద్విభాగ విభజన స్ధానం’ చేరుకున్నట్లే. దరిమిలా జరిగే పరివర్తన సామ్రాజ్యవాద సంకెళ్ళను తెంచివేసి నూతన ప్రజాస్వామ్యం ద్వారా సామ్యవాద దిశలో నూతన వ్యవస్ధ స్ధాపన జరుగుతుంది. “మనకు కావలసింది రివిజనిస్టులు ఆశిస్తున్నట్లుగా సదుద్దేశంతో సాంకేతిక విప్లవం ద్వారా గుత్తస్వామ్య పెట్టుబడిదారీ విధానంలో సంస్కరణలు తేవడం కాదనీ, దాని స్ధానంలో పెట్టుబడి వైభవానికి బదులు ప్రజల సభ్యమైన, భద్రమైన గరిష్ట స్ధాయి సృజనశీలమైన జీవనోపాధి అవసరాలను తీర్చే ఆర్ధిక కార్యకలాపాలతో కూడిన వ్యవస్ధ కావాలి” అని నేటి సామ్రాజ్యవాద సంక్షోభం మనకు బోధిస్తోంది” (Paul M Sweazy & Harry Magdoff: Irreversible Crisis).

అది సామ్యవాద దిశలో విముక్తి కోసం, ప్రజాస్వామ్యం కోసం సాగే దీర్ఘకాలిక ప్రజా యుద్ధం!

మరో ప్రత్యామ్నాయం లేదు గాక లేదు!

(………….అయిపోయింది)

[పుస్తక రచయిత అమితభా చక్రబర్తి ఏ కారణం చేతనో ఐరోపా వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం అభివృద్ధి చెందిన క్రమాన్ని వివరించడానికి, విశ్లేషించడానికి పూనుకోలేదు. ఐరోపా వ్యవసాయరంగం పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం వైపుకు ఎలా పరివర్తన చెందిందన్న విషయమై మనకు అవగాహన లేనట్లయితే ‘భారత వ్యవసాయరంగంలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి’ కి సంబంధించినంత వరకు అమితభా పుస్తకం అసంపూర్తిగా ఉన్నట్లే అవుతుంది. లేదా ఈ పరిశీలనలో ఒక కోణంలో ఖాళీ మిగిలి ఉన్నట్లే అవుతుంది. ముఖ్యంగా జర్మనీలో జరిగినట్లు జంకర్ పంధాలో భారత దేశ వ్యవసాయ రంగం కూడా పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలోకి పరివర్తన చెందిందని లేదా చెందుతోందనీ వాదించే మేధావులు ఉన్న నేపధ్యంలో ఈ అవగాహన అవసరం. ఐరోపాలో వ్యవసాయరంగం పరిణామం గురించి సమాచారం లభ్యం అయ్యాక ప్రచురించే ప్రయత్నం చేస్తాను. పాఠకులు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాను. -విశేఖర్]

One thought on “ముగింపు: భారత వ్యవసాయంలో పెట్టుబడిదారీ విధానం -22

  1. very good. manchi krushi chesaru. deenini booklet ga teestaamu. meeru europe pettubadidari vedanam lekapovadam lopamga chepparu. veelunte mee maataga rasthe deeniki anubandamga vestaam – chittipati

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s