
Karl Marx with Friedrich Engels
(20వ భాగం తరువాత…………..)
భారత వ్యవసాయంలో పెట్టుబడిదారీ విధానంపై ఒక నోట్ – పార్ట్ 21
–
పెట్టుబడిదారీ పూర్వ సంబంధాలలో అధిక వడ్డీ గురించి చర్చిస్తూ కారల్ మార్క్స్ ఇలా చెప్పారు:
“తన బాధితుడి నుండి అదనపు శ్రమను పిండుకోవడంతో సంతృప్తి చెందని అధిక వడ్డీదారుడు (usurer) అతని శ్రమ పరిస్ధితులనూ, భూమి,ఇల్లు మొ.న సాధనాలనూ కూడా క్రమ క్రమంగా స్వాధీనం చేసుకుంటాడు. ఆ విధంగా అతనిని స్వాయత్తం చేసుకునే కృషిలో నిరంతరాయంగా నిమగ్నమై ఉంటాడు. మరోవైపు అతని శ్రమ పరిస్ధితులను పూర్తిగా స్వాయత్తం చేసుకునే ఈ ప్రక్రియ, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం సాధించదలుచుకున్న ఫలితం కాకపోగా తన (పెట్టుబడిదారీ) నిష్క్రమణను సూచించేదిగా స్ధిరపడిపోయిన షరతు అన్న సంగతి మళ్ళీ విస్మరించబడుతోంది. వేతన-బానిస, సరిగ్గా నిజ బానిస వలెనే, తానున్న స్ధానం వలన -కనీసం ఒక ఉత్పత్తిదారుడి స్ధానం వలన- ఋణ బానిస కాజాలడు. అదే వేతన-బానిస ఒక వినియోగదారుడుగా రుణదాతకు బానిస కాగలడన్నది వాస్తవం. అధిక వడ్డీ పెట్టుబడి ఏ రూపంలో ఉత్పత్తి విధానాన్ని మార్చకుండానే ప్రత్యక్ష ఉత్పత్తిదారుల అదనపు విలువను అంతటినీ స్వాయత్తం చేసుకుంటుందో; దేనికైతే శ్రమ పరిస్ధితులకూ వాటికి సంబంధించిన చిన్న తరహా ఉత్పత్తులకూ ఉత్పత్తిదారుడే యజమానిగా ఉండటం అత్యవసర ముందస్తు షరతుగా ఉంటుందో; ఇతర మాటల్లో… దేనివల్ల అయితే పెట్టుబడి శ్రామికులను నేరుగా తన కింది వారుగా మార్చుకోజాలదో తద్వారా, కాబట్టి, పారిశ్రామిక పెట్టుబడిగా దానితో తలపడజాలదో, – ఆ అధిక వడ్డీ పెట్టుబడి ఉత్పత్తి విధానాన్ని శక్తివిహీనం కావిస్తుంది; ఉత్పాదక శక్తులను అభివృద్ధి చేయడానికి బదులు పక్షవాతానికి గురిచేస్తుంది; అదే సమయంలో పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం వలెనే శ్రామికులను ఫణంగా ఒడ్డుతూ సామాజిక శ్రమ ఉత్పాదకత అభివృద్ధి కాకుండా అడ్డుకునే నికృష్ట పరిస్ధితులను నిరంతరాయంగా కొనసాగేలా చేస్తుంది.” (Capital III, P 595-596)
“అధిక వడ్డీకి వ్యతిరేకంగా, ప్రతిచర్యగానే ఋణ వ్యవస్ధ అభివృద్ధి అవుతుంది.” (Capital III, P-600) అని కారల్ మార్క్స్ అన్నారు. పెట్టుబడిదారీ ఉత్పత్తి యొక్క వడ్డీ ఆధారిత పెట్టుబడికీ అధిక వడ్డీ పెట్టుబడికీ మధ్య తేడా, అది ఏ పరిస్ధితులలోనైతే పని చేస్తుందో ఆ పరిస్ధితుల మార్పు పైన ఆధారపడి ఉంటుందనీ, దరిమిలా ఋణదాతను ఎదుర్కొనే ఋణ గ్రహీత యొక్క మారిన స్వభావం పైనా ఆధారపడి ఉంటుందని చెప్పారు. “ఎక్కడైతే -తమ ఉత్పత్తి సాధనాలకు తామే యజమానులుగా ఉండే ఒక చిన్న రైతు, ఒక చేతివృత్తిదారు లాంటి పెట్టుబడిదారీ యేతర ఉత్పత్తిదారుల చేతా, స్వయం-ఉపాధిదారుల తరహా ఉత్పత్తిదారులను పోలి ఉండి తనకు తానే ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహించే పెట్టుబడిదారీ ఉత్పత్తిదారుల చేతా ఋణం గ్రహించబడుతుందో -అక్కడ వడ్డీ ఆధారిత పెట్టుబడి, అధిక వడ్డీ పెట్టుబడి స్వభావాన్ని నిలుపుకుంటుంది” (Capital III, P-600) అని మార్క్స్ చెప్పారు.
ఆధునిక వ్యవసాయం ఉన్నదని చెబుతున్న పంజాబ్ వ్యవసాయానికి సంబంధించి ఆసక్తికరమైన, గమనించదగిన విషయం ఏమిటి అంటే.., ఆ రాష్ట్రంలో పంపిణీ అయిన స్వల్పకాలిక రుణాలలో గణనీయమైన భాగం (61.31%) -అన్ని తరగతుల రైతుల లోనూ- ధాన్యం మార్కెట్లలోని కమిషన్ ఏజంట్ల (అర్హతియ) నుండి తీసుకున్నవే కావటం. రైతులలో కనీసం 63.85% మంది క్రమం తప్పకుండా వారి వద్ద అప్పులు తీసుకున్నారు (Shergill: 1998). ఇలా తీసుకున్న రుణాలలో 59% కేసులు అనుత్పాదక కార్యకలాపాల కోసం తీసుకున్నవేననీ, పేద రైతులలో అత్యధికంగా 71 శాతం అనుత్పాదక కార్యకలాపాల కోసం ఈ అప్పులు చేశారని సింగ్ తదితరుల (2005) అధ్యయనంలో తేలింది. ఋణబాధిత రైతు తప్పనిసరిగా మార్కెట్ కోసమే ఉత్పత్తి చేయవలసి ఉండగా తాను అప్పు చేసిన అర్హతియాలకే గానీ లేదా అర్హతియాల ద్వారా గానీ ఆ ఉత్పత్తిని అమ్ముకోవాల్సి వస్తోంది. అనిత గిల్ నిర్వహించిన అధ్యయనంలో పాల్గొన్న వారిలో పాటియాలా జిల్లాలో 84%, అమృత్ సర్ జిల్లాలో 51% కుటుంబాలు ఈ విధంగా అంతః బంధిత రుణాలకు బాధితులుగా ఉన్నారు. (Gill; 2004; 3746)
అనిత గిల్ అధ్యయనం ఇంకా ఇలా పేర్కొంది: “కమిషన్ ఏజెంటు’గా కొత్త రూపం ధరించిన ఋణ దాతలు మార్కెట్ లో ఆధిపత్యం వహిస్తున్నారని వారు ఋణ మార్కెట్ ను ఉత్పత్తి మార్కెట్ తో బంధిస్తున్నారని అధ్యయనంలో తేలింది. పంట దిగుబడిని కమిషన్ ఏజెంటుకే అమ్మాలన్న షరతు విధించబడుతుంది. ఆ షరతునే కోలేటరల్ సెక్యూరిటీగా అంగీకరిస్తూ ఋణ గ్రహీతలు రుణాలు తీసుకుంటారు. అలా కొల్లగొట్టిన పంట దిగుబడిని కమిషన్ ఏజెంట్లు తిరిగి ప్రభుత్వానికి అమ్ముతారు. పంట అమ్మకం ద్వారా జరిగే చెల్లింపులు కూడా కమిషన్ ఏజెంట్ల ద్వారానే జరుగుతుంది. కమిషన్ ఏజెంట్లు తమకు రావలసిన రుణాలను వడ్డితో సహా మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని వ్యవసాయదారులకు చెల్లిస్తారు. ఈ విధంగా పొలాన్ని నేరుగా కోలేటరల్ సెక్యూరిటీ (సహ బధ్రత) గా పెట్టాలని ఒత్తిడి చేయకుండా ఉండడం ద్వారా కమిషన్ ఏజెంట్లు సంస్ధాగత రుణదాతల కంటే మించిన ముందు చూపును కనబరుస్తారు. ఈ రుణాలపై వసూలు చేసే వడ్డీలు అధికంగా ఉంటాయి. కానీ సంస్ధాగత రుణాలు తగినంతగా అందుబాటులో లేకపోవడంతో వ్యవసాయదారులు వారికే తమ ఉత్పత్తులను అమ్ముకోక తప్పదు. పైగా వాణిజ్య బ్యాంకులు, కో-ఆపరేటివ్ బ్యాంకుల నుండి రుణాలు పొందాలంటే అలవికాని నియమ నిబంధనలను, ప్రక్రియలను పాటించవలసి వస్తుంది. సంస్కరణల చర్యలు, ముఖ్యంగా ప్రాధాన్యతా రంగానికి నిధులు కేటాయించేలా తీసుకున్న చర్యలు అగ్నికి ఆజ్యం పోసేలా తయారైనాయి. వాటి ఫలితం వ్యవసాయదారులు నిరంతరం దోపిడీకి గురి కావడం, చివరికి ఇక ఎంత మాత్రం అప్పుల భారం మోయలేని పరిస్ధితుల్లో బలవన్మరణాలకు పాల్పడటం జరుగుతోంది. పంజాబ్, వ్యవసాయంలో ఎంతో ప్రగతి సాధించిందని, అధికారికంగా నిర్దేశించిన ఋణ పంపిణీ లక్ష్యాలను చేరుకోవడమే కాకుండా అధిగమించడమూ జరిగిందని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అలాంటి ప్రాంతం లోనే పై విధంగా జరుగుతుంటే పేద రాష్ట్రాలలో పరిస్ధితిని అంచనా వేయడం అంత కష్టం కాదు. (Interlinked Agrarian Credit Markets in a Developing Economy: A Case Study of India’s Punjab; Punjab University, Patiala, 2003; P-21)
భారత గ్రామాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వడ్డీ వ్యాపారులలో (ఋణదాతలలో) అత్యధికులు, కారల్ మార్క్స్ వివరించిన తరహాలోనే ఋణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ వడ్డీ పెట్టుబడి, భారత దేశంలో ఉత్పత్తి విధానాన్ని శక్తి విహీనం కావిస్తోంది; ఉత్పాదక శక్తులను స్తంభింపజేస్తోంది.
1992-93లో వ్యవసాయ రంగంపై ప్రభుత్వ పెట్టుబడి (వ్యయం) జిడిపిలో 1.88% ఉండగా అది 2002-03 నాటికి 1.27% కి తగ్గిపోయింది. సంస్కరణల అమలుకు ముందు వ్యవసాయ రంగ జిడిపి వృద్ధి రేటు 3.2% నమోదు కాగా 2004-05 నాటికి 0.7% కి పడిపోయింది.
ఎస్‌ఏఎస్‌ఎఫ్ గణాంకాల ప్రకారం 49% రైతాంగం ఋణగ్రస్తమై ఉన్నది. ఎస్‌ఏఎస్‌ఎఫ్, ఏఐడిఐఎస్ నివేదికలను సంయుక్తంగా పరిగణించి పరిశీలిస్తే గ్రామీణ ప్రాంతాలలో సంస్ధాగత రుణాల వడ్డీ రేటు 15%గా ఉన్నట్లు తేలుతుంది. సంస్ధాగతేతర రుణాల వడ్డీ రేటు 30%, అంతకు మించి ఉన్నట్లు నివేదికలు తెలిపాయి. ఈ లెక్క ప్రకారం రైతాంగ రుణాలపై వడ్డీ చెల్లింపులు రు. 200 బిలియన్లు (1 బిలియన్ = 100 కోట్లు) కాగా ఋణ భారం రు 1.12 ట్రిలియన్లు (1 ట్రిలియన్ = 1 లక్ష కోట్లు). భారత దేశంలో గ్రామీణ రుణాలు, పంజాబ్ లో ఋణ గ్రస్తత మొ.న అంశాలపై ఈపిడబల్యూ పత్రికలో అచ్చయిన అధ్యయనాలు సంస్ధాగతేతర రుణాలు, సంస్ధాగత రుణాల కంటే రెట్టింపు ఉన్నట్లు తెలిపాయి. కనుక రైతాంగం మోస్తున్న మొత్తం ఋణ భారం రు. 1.95 ట్రిలియన్లు కాగా వడ్డీ భారం రు రు. 410 బిలియన్లు (సరాసరి వడ్డీ రేటు 21% ప్రకారం). 2002-03లో వ్యవసాయ రంగంలో స్ధూల పెట్టుబడి రు. 335.08 బిలియన్లు కాగా నికర పెట్టుబడి రు 78.74 బిలియన్లు. ముందు పేజీల్లో పేర్కొన్నట్లుగా వడ్డీ చెల్లింపులు వ్యవసాయంలో స్ధూల పెట్టుబడి కంటే అధికం కాగా నికర పెట్టుబడి కంటే 5 రెట్లు గమనించవచ్చు.
భారత వ్యవసాయంలో ప్రభుత్వం అండతో సాగుతున్న సామ్రాజ్యవాద చొరబాటు, ఇండియాలో ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ యంత్రాలు, అధిక దిగుబడి రకం (హెచ్‌వైవి) విత్తనాలు మొ.న ముడి సరుకుల రూపంలో పారిశ్రామిక పెట్టుబడికి విస్తారమైన మార్కెట్ ను సృష్టించింది. ఆహార సంక్షోభం, అధమ దిగుబడుల సమస్యలను ఏదో విధంగా గట్టెక్కించడంతో పాటు శ్రమ శక్తి విలువ లేదా సామాజిక వేతనాన్ని దిగువ స్ధాయిలో కొనసాగించడానికి దోహదం చేసింది. గ్రామీణ భారతంలో ఉనికిలో ఉన్న వ్యవసాయ ఆర్ధిక నిర్మాణంలో మౌలికంగా ఎలాంటి మార్పులు చేయకుండానే భూస్వామి-వ్యాపారి-వడ్డీ వ్యాపారి (రుణ దాత) సంబంధం పునాదిగా సామ్రాజ్యవాద పెట్టుబడికి అనువుగా ఆయా శక్తుల నూతన పొందిక రూపు దిద్దుకునేందుకు దోహదం చేసింది. సంస్కరణల దరిమిలా వాణిజ్యీకరణతో కూడిన వ్యవసాయ విధానం, ఉనికిలో ఉన్న ఆహార బధ్రతను విచ్ఛిన్నం చేస్తున్నది. సామ్రాజ్యవాద ఏజెంటుగా పని చేస్తున్న వర్తక పెట్టుబడి ప్రపంచ ధాన్యాగారాన్ని నియంత్రించటంలో, ఉత్పత్తి సాధనాలను (పత్తి మొ.వి) చవక ధరలకు సరఫరా చేయడంలో వారికి (సామ్రాజ్యవాదులకు) సహాయం చేస్తున్నది. గ్రామీణ వ్యవసాయం రంగం నుండి అదనపు విలువను కొల్లగొట్టి మెట్రోపాలిటన్ నగరాలకు తరలించటంలో సహాయం చేయడం ద్వారా మరణ శయ్యపై ఉన్న పెట్టుబడిదారీ విధానానికి సహకారం అందిస్తోంది. సామ్రాజ్యవాద సంక్షోభ కాలంలో భారత దేశం లోని పెట్టుబడిదారీ పూర్వ శక్తులు ఫైనాన్స్ పెట్టుబడికి ఈ విధంగా సేవ చేస్తున్నాయి. డబల్యూటిఓ విధానాలు ఇండియాలో అప్పటికే బలహీనపడిన కుటీర పరిశ్రమలను, మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమను నాశనం చేస్తున్నాయి. “ఏ సాంకేతిక విప్లవమూ అవక్షేప అవరోధాలను తప్పించలేవు.”
గత 4 దశాబ్దాలుగా నికర విత్తుబడి విస్తీర్ణంలో మార్పు సంభవించలేదు. సగటు కమతం పరిమాణం 1961-62లో 2.63 హెక్టార్లు ఉండగా 1991-92 నాటికి 1.34 హెక్టార్లకు పడిపోయింది. శ్రామిక శక్తిలో 57 శాతం ఇప్పటికీ వ్యవసాయంలోని ఉన్నది; తలసరి కూలీకి పొలం పరిమాణం పడిపోవడంతో తలసరి కూలీ ఆదాయం కూడా పడిపోతున్నది; తలసరి హెక్టార్ దిగుబడి స్తంభించిపోయింది. వ్యాపార షరతులు (terms of trade) క్షీణించాయి. (వ్యాపార షరతులు – 1996-97 నుండి 2003-04 వరకు జరిగిన కాలంలో వ్యవసాయేతర ధరలతో పోల్చితే వ్యవసాయ ధరలు 1.7% తగ్గిపోయాయి.
వ్యవసాయ రంగానికి ఆవల ఉపాధి అవకాశాలు కొరవడటంతో రైతులు వివిధ పరాన్న భూక్తులకు (భూస్వాములు, అధిక వడ్డీ వ్యాపారులు, అధికారులు, ముడిసరుకులు & ఉత్పత్తుల వ్యాపారులు, ప్రైవేటు కార్పొరేటు రంగం) కట్టివేయబడినారు. పరాన్న భుక్త వర్గాలు రైతులపై ఆధారపడి బతుకుతూ రైతుల అదనపు విలువను గుంజుకుంటున్నారు. వాణిజ్యీకరణ పెరిగే కొందీ ఋణ బంధనాలు మరింత బలపడుతున్నాయి. పంట దిగుబడిలో ఎంత ఎక్కువ భాగం అమకం లోకి వెళితే అంత ఎక్కువగా ఋణ గ్రస్తమ్ అవుతున్నారు.
మొత్తం వినియోగ ఖర్చులో ఆహార వాటా (ఎంగెల్స్ కోఫీషియెంట్) నూ, దేశం మొత్తంలోని ఆహార వినియోగంలో దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి ముడి ఆహార సరుకుల వాటాను పరిగణనలోకి తీసుకున్నట్లయితే, బలవంతపు వాణిజ్యీకరణ మరియు అప్పుల ఊబిల వలన -సంస్కరణల కాలంలో జపాన్ వ్యవసాయ అనుభవంతో పోల్చితే- విరుద్ధ ఫలితం రావడానికి అత్యధిక అవకాశం ఉన్నది.
భారత వ్యవసాయ ఆర్ధిక వ్యవస్ధలో మిగులు స్వాయత్తం చేసుకుంటున్న వర్గం, రెండు వేరు వేరు వర్గాలుగా ఉనికిలో ఉన్నది. (a) (పెట్టుబడి) సంచయాన్ని వృద్ధి చేయడంలో నిమగ్నం అయిన వ్యవసాయదారుల వర్గం (b) బలవంతపు వాణిజ్యాన్ని రుద్దుతున్న మరొక వర్గం. 1993-94, 2004-05 మధ్య కాలంలో గ్రామీణ అసమానతలు పెరగడానికి కారణం ప్రధానంగా వ్యవసాయ మరియు వ్యవసాయేతర వర్గాల మధ్య పెరిగిన అసమానతలేనని వకుళాభరణం (2010) అధ్యయనం తెలిపింది. ఈ కాలంలో తమను తాము సంపన్నవంతం చేసుకున్న వర్గాలు ఎవరూ అంటే: గ్రామీణ వృత్తిదారులు, వడ్డీ వ్యాపారులు (moneylenders), వ్యవసాయం జోలికి పోని భూస్వాములు.
మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో వృద్ధి లేనప్పటికీ ఎలాంటి ఎదుగూ బొదుగూ లేని (లేక తగ్గిన) వ్యవసాయ ఉత్పత్తి పంపిణీని కేవలం పెట్టుబడి మదుపు వర్గానికి అనుకూలంగా మార్చటం మాత్రమే జరిగితే, ఆ వర్గం లబ్ది పొందినప్పటికీ, అలాంటి మదుపును అనుత్పాదక మదుపుగా పరిగణిస్తారు. (Amit Bhaduri: The Economic Structure of Backward Agriculture, 1983, P-112)
వర్తకుడు మరియు ఋణదాతల వర్గం యొక్క అనుత్పాదక పెట్టుబడి మదుపు ప్రధానంగా వినియోగ రుణాల రూపం ధరిస్తుంది. (Ibid)
రుణగ్రస్తత పని చేసే విధానం (మెకానిజం), కేవలం భూమిని మార్చే ఆస్తుల మార్పిడి కంటే మరింత విస్తృతమైన ప్రక్రియ.
మిగులు గుంజుకోవడం; వర్తక పెట్టుబడి, అధిక వడ్డీ, బడా భూస్వాములు మరియు ఫైనాన్స్ పెట్టుబడిల సంబంధంలతో కూడిన ప్రస్తుత దృశ్యం లెనిన్ వివరించిన వ్యవసాయరంగ పెట్టుబడిదారీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నది.
(ముగింపు వచ్చే భాగంలో….)