4 రాష్ట్రాల (పుదుచ్చేరి మినహా) ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను దాదాపుగా ఖాయం చేశాయి. ఒక్క తమిళనాడులోనే అంచనాలు తారుమారు అయ్యాయి. అయితే ఏఐఏడిఎంకే మెజారిటీ బాగా తగ్గిపోయింది. మళ్ళీ జయలలిత అధికారంలోకి వస్తుందని రెండు సంస్ధల ఎగ్జిట్ పోల్స్ లో తెలిసినందున రెండు శిబిరాల మధ్యా పోటా పోటీ నెలకొంటుందని పరిశీలకులు భావించగా అదే నిజమైంది.
అస్సాంలో బిజేపి కొత్తగా, మొదటిసారిగా అధికారం సాధించింది. పశ్చిమ బెంగాల్ ను మమత బెనర్జీ నిలబెట్టుకోవడమే కాకుండా మెజారిటీ పెంచుకుంది, అది కూడా ఒంటరిగా పోటీ చేసి.
కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ విజయం సాధించగా గత యూడిఎఫ్ కంటే మెరుగైన మెజారిటీని అది పొందింది. తమిళనాడులో జయలలిత మొదటిసారిగా వరుసగా రెండోసారి అధికారం చేపట్టనున్నారు.
అస్సాంలో మూడు ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించి 15 యేళ్ళ పాటు అవిచ్ఛిన్నంగా పాలించిన కాంగ్రెస్ పార్టీ యాంటీ-ఇంకుంబెన్సీ ముందు నిలవలేకపోయింది. బిజేపి, నెగిటివ్ ఓట్లపై తేలుతూ సునాయాసంగా, అనాయాసంగా మెజారిటీ సాధించింది. బోడో పార్టీలతో కూటమి కట్టడం కూడా బిజేపికి లాభించింది.
CONG | 23 |
BJP | 64 |
AGP | 14 |
AIUDF | 12 |
INDPENDENT | 1 |
OTHERS | 2 |
పశ్చిమ బెంగాల్ లో లెఫ్ట్ ఫ్రంట్ ఘోరంగా చతికిలబడింది. కాంగ్రెస్ కంటే వెనకబడి మూడో స్ధానానికి దిగజారింది. ఒంటరిగా పోటీ చేస్తే ఎలా ఉండేదో గానీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ప్రజల్లో పలుచన అయింది.
ప్రజా పోరాటాలను గాలికి వదిలి పార్లమెంటరీ రాజకీయాల చుట్టూ పరిభ్రమిస్తున్న లెఫ్ట్ పార్టీలు తప్పించుకోలేని పరాభవం ఇది. బెంగాల్ లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు కాకుండా కాంగ్రెస్-లెఫ్ట్ ల అనైతిక పొత్తు వ్యతిరేక పవనాలు బలంగా వీచాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
TMC | 214 |
CPI | 1 |
CPI(M) | 24 |
RSP | 2 |
CONG | 44 |
JD(U) | 1 |
BJP | 3 |
INDPENDENTS | 1 |
బెంగాల్ ప్రజలు బహుశా లెఫ్ట్ పార్టీలు కనీస మాత్రంగా ఏం చేయాలో, ఏం చేయగూడదో ఫలితాల ద్వారా చెప్పి ఉండవచ్చు. ఎల్‌డిఎఫ్ అన్నదే ఒక కూటమి. ఆ కూటమి వెళ్ళి సెక్యులరిజం పేరుతో బడా భూస్వామ్య, బడా బూర్జువా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వామ పక్ష శ్రేణులకు సైతం నచ్చలేదని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మమత బెనర్జీ బిజేపి మిత్ర శిబిరంలో లేకపోవడం ఒక్కటే ప్రజాస్వామ్య ప్రియులకు స్వాంతన కలిగించే విషయం.
తమిళనాడు ప్రజలు డిఎంకే అవినీతి కుంభకోణాలను మర్చిపోయినట్లు లేదు. డిఎంకే అధినేత కుటుంబంలోని అంతర్గత కలహాలు బజారుకు ఎక్కిన తీరు, పార్టీల ఆధిపత్యం కోసం (అర) అన్నదమ్ముల మధ్యనే కుమ్ములాట నెలకొన్న తీరు, జయలలిత కురిపించిన ఉచిత పంపిణీల వాన.. ఇవన్నీ ఉమ్మడిగా ఏఐఏడిఎంకే పార్టీకి విజయాన్ని అందించాయి. బిజేపి, డిఎండికే (విజయకాంత్ పార్టీ) లు ఖాతాలు తెరవలేకపోయాయి.
AIADMK | 129 |
DMK | 90 |
CONGRESS | 10 |
PT | 1 |
PMK | 1 |
BJP | 0 |
DMDK | 0 |
తమిళనాడు అసెంబ్లీలో ఈసారి ప్రతిపక్షం బలం బాగా పెరిగింది. జయలలిత మెజారిటీ తగ్గినందున ఆమెకు అధికార నిర్వహణ ఇక నల్లేరుపై నడక కాబోదు. అయితే ఏ ఒక్క పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసి రెండోసారి వరుసగా అధికారం లోకి రావడం ఒక ఫీట్. తమిళనాట ఒకే పార్టీ వరుసగా రెండోసారి అధికారం లోకి రావడం 1984లో ఎంజిఆర్ తర్వాత ఇదే మొదటిసారి అని పత్రికలు, ఛానెళ్లు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో తమిళనాడులో అభిమానుల అమ్మ పూజ క్షీరాభిషేకాలై వెల్లువెత్తుతోంది.
కేరళలో ఊమెన్ చాందీ అధికారం చివరి రోజుల్లో ప్రవేశపెట్టిన మద్యపాన నిషేధం ప్రజలను పెద్దగా ఆకర్షించలేదు. ఎప్పటిలాగానే రివాల్వింగ్ డోర్ పని చేసింది. అనగా ఒక కూటమి తర్వాత మరొక కూటమి అధికారంలోకి రావడం కేరళలో అనాదిగా జరుగుతున్నదే. కనుక లెఫ్ట్ ఫ్రంట్ ప్రత్యేకంగా ప్రతిష్ట పొందడానికి ఏమీ లేదు. నెగటివ్ ఓటు కేరళలో పని చేసింది. రివాల్వింగ్ డోర్ ఫలితాలు ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకత ఫలితం.
CPI(M) | 57 |
CPI | 19 |
LDF Others | 8 |
CONGRESS | 22 |
IUML | 17 |
KEC(M) | 6 |
BJP | 1 |
INDEPENDENTS | 6 |
CONG | 14 |
DMK | 2 |
AIADMK | 4 |
INDPENDENT | 1 |
AINRC | 9 |