ఈజిప్టు విమానం ఒకటి మధ్యధరా సముద్రంపై ప్రయాణిస్తుండగా అదృశ్యం అయింది. ప్యారిస్ నుండి ఈజిప్టు రాజధాని కైరోకు తిరిగి వస్తుండగా దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రయాణానికి ముందు విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశామనీ, యాంత్రిక వైఫల్యం కారణం కావడానికి అవకాశాలు దాదాపు లేవని ఈజిప్టు ప్రభుత్వం, ఈజిప్టుఎయిర్ విమానయాన సంస్ధ ప్రకటించాయి.
యాంత్రిక లోపం కంటే ఉగ్రవాద చర్యే ప్రమాదానికి కారణం అయి ఉండవచ్చని ఈజిప్టు ప్రభుత్వం చెబుతోంది. ఎయిర్ బస్ కంపెనీ తయారీ అయిన విమానం మోడల్ A320 అని తెలుస్తోంది. విమానం నెంబర్: EgyptAir Flight MS804. 66 మంది ప్రయాణిస్తున్న విమానంలో 10 మంది సిబ్బంది కాగా మిగిలిన 56 మంది ప్రయాణీకులని పత్రికల ద్వారా తెలుస్తున్నది.
కాగా విమానం ఈజిప్టుకు చెందిన వాయుతలంలోకి ప్రవేశించిన తర్వాత కూలిపోయిందని గ్రీసు విమానయాన విభాగం ప్రకటించింది. విమానం హఠాత్తుగా దిశను మార్చుకున్నదని, అనంతరం వేగంగా కిందికి దిగి అనంతరం రాడార్ నుండి అదృశ్యం అయిందని గ్రీసు రక్షణ మంత్రి పానోస్ కామెనోస్ విలేఖరులకు చెప్పాడు.
స్ధానిక కాలమానం ప్రకారం తెల్లవారు ఝాము గం 2:27 ని.లు సమయంలో గ్రీకు గగనతల పరిమితులను దాటడానికి ముందు హెలెనిక్ సివిల్ ఏవియేషన్ ఆధారిటీ (గ్రీస్ ప్రభుత్వ విమానయాన నియంత్రణ సంస్ధ) ప్రయత్నించింది. వారికి విమానం నుండి స్పందన రాలేదు. రెండు నిమిషాల తర్వాత విమానం ఈజిప్టు గగనతలంలోకి ప్రవేశించిందని మరో 40 సెకన్లకు తమ రాడార్ నుండి విమానం అదృశ్యం అయిందని గ్రీసు సంస్ధ తెలిపింది.
“ఉదయం గం. 2:29 ని.లు దాటాక ఈజిప్టు గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే విమానం ఒక్కసారికి 90 డిగ్రీలు ఎడమ పక్కకు తిరిగింది. ఆ వెంటనే 360 డిగ్రీలు కుడివైపుకి తిరిగి 37,000 అడుగుల ఎత్తు నుండి 15,000 అడుగుల ఎత్తుకు ఒక్కసారిగా దూకింది. అనంతరం 10,000 అడుగుల ఎత్తుకు జారిపోయింది. ఆ తర్వాత రాడార్ నుండి మాయం అయింది” అని గ్రీసు రక్షణ మంత్రి కామెనోస్ విలేఖరులకు చెప్పాడు. తాము ఆకాశంలో పెద్ద మంటను చూశామని గ్రీసు మర్చెంట్ నేవీ విభాగం తెలిపింది.
విమానం ప్యారిస్ లో రాత్రి గం 11:09 ని. కు బయలుదేరింది. మూడున్నర గంటల ప్రయాణం తర్వాత కైరో చేరుకోవలసి ఉంది. 56 మంది విమాన ప్రయాణీకుల్లో 30 మంది ఈజిప్టు దేశీయులు కాగా 15 మంది ఫ్రెంచి, ఇద్దరు ఇరాకీలు ఉన్నారు. బ్రిటన్, బెల్జియం, కువైట్, సౌదీ అరేబియా, సూడాన్, చాద్, పోర్చుగల్, అల్జీరియా, కెనడా ల దేశీయులు ఒక్కొక్కరు ఉన్నారని ఈజిప్టు విమానయాన మంత్రి ఫాతి తెలిపాడు.
ఈజిప్టు విమాన ప్రమాదం ఉగ్రవాదుల పని కావడానికి ఎక్కువ అవకాశం ఉన్నదని రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్‌ఎస్‌బి) ప్రకటించిందని మిర్రర్ పత్రిక తెలిపింది. విమానం కూల్చివేత ఐఎస్‌ఐఎస్ (ఇసిస్) పనే అని అమెరికా ధృవీకరించిందని సిఎన్‌ఎన్ తెలిపింది. మధ్యధరా సముద్రంలో కొన్ని శిధిలాలు కనిపించాయని, క్రీట్ ద్వీపానికి 220 మైళ్ళ దూరంలో ఉన్న ఈ శిధిలాలు ఈజిప్టు విమానానివి అయి ఉండవచ్చని గ్రీసు అధికారులు ప్రకటించారు.
ఈజిప్టు, గ్రీసుల మిలట్రీ నౌకలు విమాన శిధిలాల కోసం వెతుకుతున్నాయి. ఉదయం గం 4:26 ని.ల ప్రాంతంలో విమానం కూలిందని భావిస్తున్న ప్రాంతం నుండి సహాయం కోసం అర్ధించే సంకేతం కనుగొన్నామని ఈజిప్టు ఎయిర్ సంస్ధ వైస్ ఛైర్మన్ అహ్మద్ ఆదెల్ చెప్పారు. దానితో కొంతమంది సజీవంగా ఉండి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ సంకేతం సముద్రంలో ఉన్న మరో నౌక నుండి వచ్చి ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు.
“తూర్పు మధ్యధరా సముద్రంలో నీటి ఉష్ణోగ్రత 200 C ఉంటుంది. ఎవరైనా జీవించి ఉన్నట్లయితే, వారు అనారోగ్యంతో ఉంటే గనక ఈ ఉష్ణోగ్రతల వద్ద 2 గం.ల నుండి 7 గం.ల వరకు వారిని సజీవంగా రక్షించే అవకాశం ఉన్నది. అదే ఆరోగ్యంతో ఉంటే 40 గంటల వరకు వారు బతికి ఉండే అవకాశం ఉన్నది. ఈ లోపు వారిని రక్షించాలి” అని సిఎన్‌ఎన్ మెటీరియాలజిస్టు పెద్రమ్ జవహెరి తెలిపారు.
ప్రయాణీకుల బంధువులు ప్యారిస్, కైరో విమానాశ్రయాల వద్ద తమ వారి సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు. కైరో విమానాశ్రయ అధికారులు తమకు ఏ సమాచారమూ ఇవ్వడం లేదని బంధువులు నిరసన తెలిపారు. తమను ఫోటోలు తీస్తున్న పత్రికా ఫోటోగ్రాఫర్ ల పట్ల ఆగ్రహం ప్రకటిస్తున్నారు. కొందరు అధికారులతో తగవు పడుతున్నారు.
“విమానాలు ఊరకనే ఆకాశం నుండి పడిపోవు. అది కూడా 37,000 అడుగుల ఎత్తు నుండి. విమానం క్రూయిజ్ దశలో (స్ధిరమైన ఎత్తులో ప్రయాణించే దశ) అత్యంత భద్రతతో ప్రయాణిస్తుందని గమనించాలి” అని విమానయాన నిపుణుడు ఒకరు చెప్పారని సిఎన్‌ఎన్ తెలిపింది.