భారత వ్యవసాయంలో వర్తక పెట్టుబడి, అధిక వడ్డీ


New slavery

(19వ భాగం తరువాత….)

భారత వ్యవసాయ రంగంలో మార్పులపై ఒక నోట్ -పార్ట్ 20

D) భారత వ్యవసాయంలో వర్తక పెట్టుబడి, అధిక వడ్డీ

సరుకుల ఉత్పత్తి, వర్తక పెట్టుబడుల నుండి పెట్టుబడిదారీ ఉత్పత్తి, పారిశ్రామిక పెట్టుబడిలోకి జరిగే మార్పు సంక్లిష్టమైనది, సుదీర్ఘమైనది. ఇది అభివృద్ధి చెందిన దేశాల లోణూ, తక్కువ అబివృద్ధి చెందిన దేశాల లోనూ భిన్నమైన రూపాలు ధరిస్తుంది.

వర్తక పెట్టుబడి వలయం (circuit)నిర్మాణాత్మకంగా సాధారణ పెట్టుబడి వలయంతో పోల్చితే ఒకటిగానే ఉంటుంది. తేడా ఏమిటంటే సమాజం యొక్క మిగులు విలువను పారిశ్రామిక పెట్టుబడి అదనపు విలువ ద్వారా గుంజుకుంటుంది. అదే వర్తక పెట్టుబడి అయితే అసమాన మారకాల ద్వారా మాత్రమే మిగులు గుంజుకుంటుంది. మొత్తం మీద చూస్తే వర్తక పెట్టుబడి ఉనికికి అసమాన మారకం సాధారణ షరతుగా ఉంటుంది.

అసమాన మారకంలో శ్రామికుల పాత్ర ఉండవలసిన అవసరం లేదు. ఉత్పాదక పెట్టుబడిదారీ విధానంలో ఉత్పత్తి జరిగే స్ధలంలో అసమాన మారకం ప్రక్రియ స్ధానాన్ని ‘అదనపు విలువ ఉత్పత్తి’ ఆక్రమిస్తుంది. ఉత్పత్తి సాధనాలపై గుత్త యాజమాన్యం ఉన్నట్లయితే తగినంతగా లేబర్ మార్కెట్ అభివృద్ధి చెందని చోట కూడా ఇది జరగవచ్చు (Amit Bhaduri, P-6)

సాధారణంగా చలామణి పెట్టుబడి, ముఖ్యంగా వర్తక పెట్టుబడి అదనపు విలువ, లాభాలు గుంజుకోవడానికి అసమాన మారకంలో ప్రవేశిస్తుంది. పెట్టుబడిదారీ సమాజంలో చలామణి మరియు ఉత్పాదక పెట్టుబడి రెండూ ఒకే వర్గ నియంత్రణలో ఉంటాయి కనుక ఆ రెండింటి మధ్య మౌలికంగా వైరుధ్యం  ఉండదు. పెట్టుబడిదారీయేతర సమాజాల్లో పెట్టుబడి ఒక రంగంలోనే ఉంటుంది, మరే ఇతర రంగంలో ఉండదు కనుక వాటి మధ్య వైరుధ్యం తలెత్తుతుంది. చలామణి పెట్టుబడి, వర్తక పెట్టుబడిలు ఉనికిలో ఉండటానికి ఉత్పత్తి విధానంతో సంబంధం లేదు. (Capital II, P-110)

శ్రమ ప్రక్రియలలో వర్తక పెట్టుబడికి ఎటువంటి పాత్రా ఉండదు. అది ఎల్లప్పుడూ అసమాన మారకాల జరిపే వర్గంపై ఆధారపడి ఉంటుంది, ఆధారపడి తీరాలి కూడా. మరో ఉనికి దానికి లేదు. పెట్టుబడిదారీ సమాజంతో పోల్చితే పెట్టుబడిదారీయేతర సమాజాలలో వర్తక పెట్టుబడి చలామణి రంగంలో ఉనికిని కలిగి ఉండగా ఉత్పత్తి ప్రక్రియ పెట్టుబడియేతర రంగంలో ఉనికిని కలిగి ఉంటుంది. పెట్టుబడిదారీ సమాజంలో చలామణి మరియు ఉత్పత్తి రంగాల మధ్య నెలకొనే పోటీ, అదనపు విలువ ఒకే వర్గంలో పంపిణీ కావడానికి దారి తీస్తుంది. పెట్టుబడిదారీయేతర సమాజంలో దానితో గుణాత్మక వైరుధ్యం ఉన్నది.

కానీ వర్తక పెట్టుబడి పోగుబడాలంటే సరుకుల ఉత్పత్తి విస్తృతం కావాలి. అది ఉత్పత్తి యొక్క సామాజిక నిర్మాణాన్ని భంగం కావిస్తుంది. అదే వర్తక పెట్టుబడి, మరోవైపు శ్రమ దోపిడీ సాగించే వర్గాలపై ఆధారపడి ఉంటుంది. సమాజం సాధారణ ఆర్ధిక అభివృద్ధిని సాధించడంలో వర్తక పెట్టుబడి పాత్ర ఎల్లప్పుడూ సందిగ్ధ పూరితంగానూ, వైరుధ్యపూరితంగానూ ఉంటుంది, “అయినప్పటికీ దాని (వర్తక పెట్టుబడి) అభివృద్ధి, ఒక ఉత్పత్తి విధానం నుండి మరొక ఉత్పత్తి విధానానికి జరిగే పరివర్తనను తానుగా ప్రోత్సహించడం (ప్రమోట్ చేయడం) లోనూ వివరించడం లోనూ సామర్ధ్యం లేనిదిగా ఉంటుంది”  (Capital III, P-327)

చారిత్రకంగా ఖచ్చితమైన పెట్టుబడిదారీ విధానానికి జరిగే పరివర్తనను వర్తక పెట్టుబడి ఎన్నడూ ప్రభావితం చేసింది లేదు. పైగా వర్తక పెట్టుబడే (merchant Capital), వ్యాపారం నిర్వహించే పెట్టుబడి (commercial capital); అది తాను కైవసం చేసుకునే అదనపు విలువను వ్యాపార విస్తరణకు ఉపయోగపెడుతుంది; ఉత్పత్తి రంగం నుండి మిగులు ఉత్పత్తిని హరించి వేస్తుంది; కనుక పెట్టుబడిదారీ విధానం పూర్తిగా అభివృద్ధి చెందకుండా ఆటంకపరుస్తుంది. వర్తకులు ఉత్పత్తిని విప్లవీకరించడం ద్వారా కాకుండా మార్కెట్లను నియంత్రించడం ద్వారా మాత్రమే లాభాలు సంపాదిస్తారు.

19వ శతాబ్దంలో అభివృద్ధి చెందిన దేశాలలో పారిశ్రామిక పెట్టుబడి నిలదొక్కుకున్నాక వర్తక పెట్టుబడి రెండు చారిత్రక రూపాలలో ఉనికిని కొనసాగించింది. అభివృద్ధి చెందని లేదా తక్కువ అభివృద్ధి చెందిన దేశాలలో స్వంతంత్రం గానూ, సామ్రాజ్యవాద పెట్టుబడికి ఏజెంటుగానూ ఉన్నది. వర్తక పెట్టుబడి (1) పత్తి మొ.న అత్యావశ్యకమైన, పరిత్యజించడానికి వీలు లేని ఉత్పత్తి మరియు సాధనాల వనరుల ప్రయోజనాలకు (2) వినియోగ సాధనాల చవక సరఫరా ప్రయోజనాలకు -ఆహారం విలువ ఎంత తక్కువ అయితే శ్రమ శక్తి విలువ, సామాజిక వేతనం అంత తక్కువ చెల్లించవచ్చు- (3) పారిశ్రామిక పెట్టుబడికి అవసరం ఐనా విస్తార మార్కెట్ ప్రయోజనాలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉంటుంది.

ఇది తక్కువ అభివృద్ధి చెందిన బలహీన దేశాలలో అణచివేత పరిస్ధితులకు దారి తీస్తుంది. వాణిజ్య పెట్టుబడి తన సొంత, స్వతంత్ర అభివృద్ధి కోసం సాధారణ ఆర్ధిక అభివృద్ధిని నిరోధిస్తూ మొత్తం ఆర్ధిక కార్యకలాపాలను విదేశీ ఆర్ధిక ప్రయోజనాల దిశలో పునర్వ్యవస్ధీకరిస్తుంది. ఈ మౌలిక అవగాహనను ఉపయోగించుకుంటూ వర్తక పెట్టుబడి, పారిశ్రామిక పెట్టుబడిల పట్ల లెనిన్ అవగాహనాలను పరిశీలిద్దాం.

“దరిమిలా రష్యాకు సంబంధించినంతవరకు సమాధానం చెప్పుకోవలసిన ప్రశ్న ఏమిటంటే: వర్తక మరియు అధిక వడ్డీ పెట్టుబడిలు పారిశ్రామిక పెట్టుబడితో సంబంధం కలిగి ఉన్నాయా? వర్తకం, అధిక వడ్డీలు పాత ఉత్పత్తి విధానాన్ని విచ్ఛిన్నం కావిస్తూ దాని స్ధానంలో పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్ని గానీ లేదా మరేదైనా ఉత్పత్తి విధానాలను గానీ ప్రవేశించేందుకు దోహదం చేస్తున్నాదా?” (V I Lenin: Development of Capitalism in Russia – Differentiation of Peasantry)

ఇండియా లాంటి దేశాలకు కూడా ఇదే ప్రశ్న వర్తిస్తుంది. (ఉనికిలో ఉన్న వ్యవస్ధ స్ధానంలో) పెట్టుబడిదారీ వ్యవస్ధ ప్రవేశిస్తున్నదా లేక మరేదైనా వ్యవస్ధలు ప్రవేశిస్తున్నాయా?

ఫ్యూడల్ ఉత్పత్తి విధానం నుండి జరిగే పరివర్తనను చర్చిస్తూ కారల్ మార్క్స్ ఈ సమస్యను చర్చించారు:

“ఫ్యూడల్ ఉత్పత్తి విధానం నుండి జరిగే పరివర్తన రెండు విధాలుగా చోటు చేసుకుంటుంది. సహజ వ్యవసాయకా దేశం వలె కాకుండా ఉత్పత్తి దారుడు, వర్తకుడు మరియు పెట్టుబడిదారుడు అవుతాడు… ఇది నిజంగా విప్లవకర పంధా. లేనట్లయితే వర్తకుడు ఉత్పత్తిపై నేరుగా పెత్తనం సాధిస్తాడు. చారిత్రకంగా ఇది ఎంత పై మెట్టు అయినప్పటికీ.. అది (వర్తక పెట్టుబడి) తనంతట తానుగా పాత ఉత్పత్తి విధానాన్ని కూలదోయదు. అందుకు బదులుగా దానిని ముందస్తు షరతుగా పరిరక్షించి కొనసాగించడానికి మొగ్గు చూపుతుంది.. ఈ వ్యవస్ధ… ప్రత్యక్ష ఉత్పత్తిదారుల పరిస్ధితిని క్షీణింపజేసి కేవలం వేతన కార్మికులుగా, విప్లవకారా కార్మికవర్గం (ప్రొలెటేరియట్) గా, మార్చుతుంది; వారి పరిస్ధితి పెట్టుబడి నేరుగా నియంత్రించే కార్మికుల కంటే హీనంగా ఉంటుంది. వారి అదనపు విలువను పాత ఉత్పత్తి విధానం ప్రాతిపదికన స్వాయత్తం చేసుకుంటుంది” (Karal Marx, Capital, Vol III; Chapter 20)

కారల్ మార్క్స్ పేర్కొన్నట్లుగా “పాత ఉత్పత్తి విధానాన్ని అవి (వ్యాపార మరియు వర్తక పెట్టుబడులు) ఎంత వరకు రద్దు చేస్తాయి అన్నది వాటి దృఢత్వం, అంతర్గత నిర్మాణాలపై ఆధారపడి ఉంటుంది. ఈ క్రమం ఎటువైపుకు దారి తీస్తుంది అన్నది వర్తకంపైన ఆధారపడి ఉండకపోగా పాత ఉత్పత్తి విధానం యొక్క స్వభావం పైనే ఆధారపడి ఉంటుంది. (Development of Capitalism in Russia – Differentiation of Peasantry; Chapter II)

లెనిన్ ఇంకా ఇలా పేర్కొన్నారు, “వర్తక పెట్టుబడి యొక్క స్వతంత్ర అభివృద్ధి అన్నది పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం అభివృద్ధి తీవ్రతకు విలోమానుపాతంలో ఉంటుంది” (Ibid). వర్తక మరియు అధిక వడ్డీ పెట్టుబడులు ఎంత ఎక్కువగా అభివృద్ధి చెందితే పారిశ్రామిక పెట్టుబడి అంత తక్కువగా అభివృద్ధి చెందుతుంది; అలాగే వర్తక, అధిక వడ్డీ పెట్టుబడులు ఎంత తక్కువ స్ధాయికి అభివృద్ధి చెందితే పారిశ్రామిక పెట్టుబడి అంత ఎక్కువ స్ధాయికి అభివృద్ధి చెందుతుంది.

వినియోగ రుణాలు, వ్యవసాయ ఆర్ధిక వ్యవస్ధలో వర్తక మరియు అధిక వడ్డీ పెట్టుబడుల విస్తృత చొరబాటు.. ఇవి వివిధ మార్కెట్లు మరియు కాలాల వ్యాపితంగా విస్తరించిన అంతః బంధిత (interlocked) మారకాలకు దారి తీస్తాయి. చిన్న రైతాంగంపై ఈ అంతః బంధిత మారకాలను బలవంతంగా రుద్దడంలో ప్రయోగించబడే వివిధ పద్ధతులే వాణిజ్యాన్ని బలవంతంగా రుద్దే పద్ధతినీ, వ్యవసాయంపై అది కలుగజేసే వివిధ ప్రభావాలను నిర్ణయిస్తాయి. (Amit Bhaduri: The Economic Structure of Backward Agriculture, P-10) అటువంటి బలవంతపు వాణీజ్యీకరణా నెట్ వర్కు మొత్తం వ్యవసాయ మారక సంబంధాలు అన్నింటా విస్తరిస్తుంది.

భారత వ్యవసాయం లోని వర్తక మరియు అధిక వడ్డీ పెట్టుబడుల నిర్దిష్ట లక్షణం విషయానికి వస్తే, 1954లో ప్రభుత్వ ఋణ సంస్ధలు భారత దేశ గ్రామీణ ఋణ అవసరాలలో 9% మాత్రమే తీర్చాయని ‘ఆల్ ఇండియా రూరల్ క్రెడిట్ సర్వే (AIRCS)కనుగొన్న సంగతిని పరిగణనలోకి తీసుకోవాలి. వడ్డీ వ్యాపాఉర్లు, నాయకులు, ధనిక భూస్వాములు… వీరంతా గ్రామీణ రుణాల్లో 75 శాతం తీర్చినట్లు ఈ సర్వేలో కనుగొన్నారు. (Rural Credit in 20th Century India – An Overview of History and Perspective –EPW, APR 2007). కో-ఆపరేటివ్ ల వాటా 5% ఉండగా 1971 నాటికి 20% కి పెరిగింది. AIRCS గణాంకాలు 1951లో గ్రామీణ రుణాల్లో బ్యాంకుల వాటా 1%కు తక్కువే ఉన్నట్లు తెలిపాయి. 1971 నాటికి బ్యాంకుల వాటా 2.4% మించలేదు.

భారత వ్యవసాయం హరిత విప్లవ దశలోకి నిర్ణయాత్మకంగా ప్రవేశించడంతో ధనిక రైతులకు ప్రైవేటు పెట్టుబడులను పంచి పెట్టేందుకు భారీ స్ధాయిలో ఋణ మద్దతు అవసరం అయింది. 1964లో బెర్నాల్ బెల్ మిషన్ ను ఇండియాకు పంపడం ద్వారా హరిత విప్లవంలో ప్రపంచ బ్యాంకు జోక్యం మొదలయింది. బెల్ మిషన్ చేసిన సిఫారసులు: భారత కరెన్సీ విలువను తగ్గించాలి; వాణిజ్య నియంత్రణలను సరళీకరించాలి; రసాయనాలు-పెట్టుబడుల వినియోగంపై ఎక్కువగా కేంద్రీకరించాలి. బ్యాంకుల జాతీయకరణ ఈ దిశలో వేసిన అడుగే. వడ్డీ రెట్లపై జాతీయ బ్యాంకులు పరిమితి విధించడం, బలహీన వర్గాలకు సరసమైన రేట్లకు రుణాలు పంపిణీ చేసే పధకాలు అమలు చేయడం 1974లోనే ప్రారంభం అయింది. 20 సం.ల బ్యాంకుల జాతీయకరణ ఫలితంగా 1951-61లో గ్రామీణ రుణాల్లో సగటున 75% వరకు ప్రైవేటు వడ్డీ వ్యాపారులే ఆక్రమించగా వారి నిష్పత్తి 1991 నాటికి 25% కంటే తక్కువకు చేరుకుందని లెక్కలు చెప్పుకున్నారు. (Rual Credit in 20th Century India – An Overview and Perspective –EPW APR 2007) కానీ 1990ల సంస్కరణల కాలం నుండి గ్రామీణ వడ్డీ వ్యాపారులు తిరిగి పుంజుకున్నారు. ఎంత పేదరికంలో మగ్గుతుంటే అంత తీవ్రంగా ఋణ వడ్డీ దోపిడీకి అందుబాటులో ఉంటారని ఎన్‌ఎస్‌ఎస్ 59వ రౌండ్ సర్వే గణాంకాలు వెల్లడి చేశాయి. వలస కాలం లోనూ అదే జరిగింది. ఆర్‌బి‌ఐ కి చెందిన సాంకేతిక గ్రూపు (టెక్నికల్ గ్రూప్) ఆగస్టు 2007లో దిగ్భ్రాంతికి గురిచేసే నివేదిక వెలువరించింది. “వడ్డీ వ్యాపారులను ప్రధాన స్రవంతిలోకి  తేవాలన్న ఆలోచన ప్రభుత్వం మరియు విధాన నిర్ణేతలను చాలా కాలం నుండి, కనీసం 1971 నుండి, వెంటాడుతోంది” అని వారి నివేదిక వెల్లడి చేసింది. దేశవాళీ బ్యాంకర్ల (వడ్డీ వ్యాపారులకు వాళ్ళు ఇచ్చిన భయానకమైన బిరుదు) విషయమై నియమించబడిన ఈ అధ్యయన గ్రూపు “ఈ దేశవాళీ బ్యాంకర్ల సేవలే అందుబాటులో లేకపోయినట్లయితే నిర్లక్ష్యం చేయబడిన అనేక విభాగాల ప్రజలు మరింతగా నిర్లక్ష్యానికి గురయ్యేవారు” అని వ్యాఖ్యానించింది.

Incidence, Amount and Source of Indebtedness by Size Class of Holdings: 2003

Source of indebtedness

2006, అక్టోబర్ 18 తేదీన 2వ వ్యవసాయ శిఖరాగ్ర సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇలా వ్యాఖ్యానించారు, “ఋణ రంగంలో మరింత ఆలోచనకు పూనుకుంటే.. రైతులకు ఏది అవసరం? తక్కువ వడ్డీ రేట్లా లేక సకారణమైన వడ్డీ రేట్లకు రుణాలు నమ్మకంగా అందుబాటులో ఉండటమా?”

ప్రధాన మంత్రి మాటలను ప్రతిధ్వనింపజేస్తూ ఆర్‌బి‌ఐ టెక్నికల్ గ్రూపు (ఆగస్టు 2007) ఇలా ముక్తాయించింది, “శతాబ్ద కాలంగా విధాన నిర్ణేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ వడ్డీ వ్యాపారులకు ప్రత్యామ్నాయం కనుగొనలేని నేపధ్యంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తమ కార్యకలాపాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న వడ్డీ వ్యాపారుల ఉనికిని పరపతీకరించే  అవకాశాలను పరిశీలించేందుకు తగిన సంబద్ధత ఉన్నది.”

వడ్డీ వ్యాపారులకు సౌకర్యాలు కల్పించి, వారికి తగినన్ని నిధులు సమకూర్చే లక్ష్యంతో ఆర్‌బి‌ఐ గ్రూపు, వారిని రిక్రూట్ చేసుకునే దిశలో ఒక చట్టం ముసాయిదాను సిద్ధం చేసింది.

వాళ్ళు మిహిర్ షా హెచ్చరికలను (ఈ‌పి‌డబల్యూ, 14th Apr 2007) లక్ష్య పెట్టలేదు. ఆర్‌బి‌ఐ నియమించిన ‘జోల్ వర్కింగ్ గ్రూపు’ హెచ్చరికలను లక్ష్య పెట్టలేదు. ఋణ గ్రహీతలు అందజేసే ‘సహ రక్షణ’ (collateral security) లను గణనీయ మొత్తంలో తక్కువ చేసి విలువ కట్టగల శక్తివంతమైన స్ధానంలో ఋణ దాతలు ఉన్న నేపధ్యంలో, గ్రామీణ ఋణ గ్రహీతలు అందజేయగల ఆ ‘సహ రక్షణ’ లు ఏమిటీ అంటే, తాము పండించబోయే పంట, తాము చేయనున్న శ్రమ లేదా అప్పటికే ఆక్రమణలో ఉన్న తమ భూమిని సొంతం చేసుకునే హక్కు!

1990ల ఆరంభంలో ఆర్ధిక సంస్కరణలు ప్రారంభించినప్పటినుండీ రాజ్యం, వడ్డీ వ్యాపారులకు అందుబాటులో ఉన్న అవకాశాలను మరింతగా విస్తరిస్తోంది. ఋణ పెట్టుబడి సర్వే (Debt Investment Survey) ప్రకారం గ్రామీణ కూతుబాలు చెల్లించవలసిన రుణాలలో వడ్డీ వ్యాపారుల వాటా 1991-2002 కాలంలో 75 శాతం (17.51% నుండి 29.6 శాతంకు) వృద్ధి చెందింది. గ్రామీణ పేదలకు సంస్ధాగత రుణాల పంపిణీని నిలిపివేయడం ద్వారా ఈ ఫీట్ ను సాధించారు. (P Satish – Agricultural Credit in the Post Reform Era: EPW June 2007)

(……………సశేషం)

One thought on “భారత వ్యవసాయంలో వర్తక పెట్టుబడి, అధిక వడ్డీ

  1. లెనిన్ ఇంకా ఇలా పేర్కొన్నారు, “వర్తక పెట్టుబడి యొక్క స్వతంత్ర అభివృద్ధి అన్నది పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం అభివృద్ధి తీవ్రతకు విలోమానుపాతంలో ఉంటుంది” (ఈబిద్). వర్తక మరియు అధిక వడ్డీ పెట్టుబడులు ఎంత ఎక్కువగా అభివృద్ధి చెందితే పారిశ్రామిక పెట్టుబడి అంత తక్కువగా అభివృద్ధి చెందుతుంది;
    ఇది మనదేశ పరిస్థితికి అద్దంపడుతున్నట్లుగా ఉంది!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s