బ్రిటన్ + ఎగ్జిట్ = బ్రెగ్జిట్
యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ బైటికి వెళ్లిపోవడాన్ని బ్రెక్సిట్ అంటున్నారు.
యూరోపియన్ యూనియన్ నుండి మరిన్ని రాయితీలు పొందే లక్ష్యంతో బ్రిటన్ ప్రధాని కామెరాన్ నిర్వహిస్తున్న రిఫరెండం కాస్తా నిజంగానే ఈయూ ఎగ్జిట్ వైపుకు తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది.
ఇప్పటి వరకు జరిగిన ఒపీనియన్ పోల్స్ అన్నింటి లోనూ ‘ఇన్’ (ఈయూలోనే కొనసాగుదాం) శిబిరానికే అధిక ఆదరణ ఉన్నట్లు చెబుతూ వచ్చాయి.
కానీ సోమవారం జరిగిన ఒక పోలింగు లో మొట్ట మొదటి సారిగా ‘అవుట్’ (ఈయూ బైటికి వెళ్లిపోదాం) శిబిరం పై చేయి సాధించింది.
సోమవారం నాడు వాస్తవంగా మూడు సంస్ధలు విడివిడిగా సర్వేలు జరిపాయి. వాటిలో ఒకటి మాత్రమే ‘అవుట్’ కు మెజారిటీ ఉన్నట్లు ఫలితాలు వచ్చాయి. మిగిలిన రెండు పోల్స్ లో ‘ఇన్’ కే మెజారిటీ ఉన్నట్లు తెలిపాయి.
అయినా గానీ ‘అవుట్’ కు మెజారిటీ రావడం ఇది మొదటిసారి కనుక ప్రజల అభిప్రాయంలో మార్పు వస్తున్నట్లుగా దానిని పరిగణిస్తున్నారు.
అభిప్రాయాలు చెప్పిన వారిలో 41 శాతం మంది ‘అవుట్’ పక్షాన నిలవగా, ‘ఇన్’ పక్షాన 38 శాతం మంది నిలిచారని సర్వే సంస్ధ తెలిపింది. గతంలో ఇదే సంస్ధ జరిపిన సర్వేలో ‘అవుట్’ కు 36 శాతం ఓటు వేయగా, ‘ఇన్’ కు 39 శాతం ఓటు వేశారు.
అనగా ‘అవుట్’ ఓటర్లు 5 పర్సెంటేజీ పాయింట్లు పెరిగితే ‘ఇన్’ ఓటర్లు 1 పాయింటు తగ్గిపోయారు.
“ఇప్పటి వరకూ ఎటూ నిర్ణయించుకోని ఓటర్లు ‘లీవ్’ శిబిరం వైపుకు వస్తున్నట్లుగా ఈ పోల్ సూచిస్తోంది. అయినా, తర్వాత జరిగే పోల్ వరకు వేచి చూడవలసి ఉంది. అప్పుడే ఇది ఒక ట్రెండ్ గా జరిగిన మార్పో లేక యధాలాపంగా వచ్చిన తేడానో తెలుస్తుంది” అని టిఎన్‌ఎస్ యూ.కే. సంస్ధ లో సామాజిక రాజకీయ విభాగం అధిపతి లూక్ టేలర్ చెప్పారు.
“గత ఫిబ్రవరి నుండి జరుగుతూ వచ్చిన పోల్స్ లో ‘లీవ్’ పై చేయి సాధించడం ఇది మొదటిసారి. అయితే ఇప్పటికీ పోటీ నువ్వా నేనా అన్నట్లుగానే ఉంది. అనేకమంది తాము ఎటు వైపో ఇంకా నిర్ణయించుకోలేదు” అని లూక్ చెప్పారు.
బ్రెగ్జిట్ ఇప్పుడు ఒక అంతర్జాతీయ హాట్ టాపిక్! మెజారిటీ బ్రిటన్ ప్రజలు పొరపాటున ఈయూ బైటికి వెళ్లాలని ఓటు వేశారంటే గనక అంతర్జాతీయంగా పరిమిత స్ధాయిలో పెను మార్పులు జరగడం ఖాయం. బ్రిటన్ ని ఉదాహరణగా తీసుకుంటూ ఇతర ఈయూ సభ్య దేశాలు కూడా క్రమంగా -కొన్ని సంవత్సరాల కాలంలో- ఈయూ నుండి గానీ యూరో జోన్ నుండి గానీ తప్పుకునే అవకాశం ఉన్నది.
ఇది అంతిమంగా ఐరోపా దేశాల పాలక వర్గాలు కలగన్న ‘ఐక్య యూరప్’ ను కనుమరుగు చేస్తుంది. జర్మనీ సామ్రాజ్యవాద ఆధిపత్యానికి బ్రేకులు పడతాయి. బ్రిటన్ నెమ్మదిగా చైనావైపుకు జరిగే అవకాశాలు మెరుగుపడతాయి. జర్మనీ నేతృత్వంలో కొన్ని దేశాలు వాణిజ్య పరంగా, రష్యాకు దగ్గరగా జరిగినా ఆశ్చర్యం లేదు. అంతర్జాతీయంగా అమెరికా, ఐరోపాలు ఇన్నాళ్ళు చెలాయిస్తూ వచ్చిన పెత్తనం బాగా బలహీనపడిపోతుంది. బహుళ ధృవ ప్రపంచానికి మార్గం మరింత విశాలం అవుతుంది.
ఆ భయంతోనే బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా ఐఎంఎఫ్ బ్రిటన్ ప్రజలను హెచ్చరిస్తోంది. బ్రెగ్జిట్ వల్ల యూకే మళ్ళీ ఆర్ధిక మాంద్యం లోకి జారిపోతుందని మూడు రోజుల క్రితం హెచ్చరించింది. ఈ హెచ్చరికలను ‘అవుట్’ శిబిరం తీవ్రంగా తప్పు పట్టింది. బ్రిటిష్ ప్రజలను బెదిరించి, భయపెట్టి ప్రభావితం చేయాలని ఐఎంఎఫ్ చూస్తోందని వారు ఆరోపించారు.
బ్రెగ్జిట్ వల్ల బ్రిటన్ ఎన్ని రకాలుగా నష్టపోయేదీ చెబుతూ ఐఎంఎఫ్ ఒక నివేదిక తయారు చేసినట్లు తెలుస్తోంది. ఆ నివేదికను ఐఎంఎఫ్ ఇంకా వెల్లడి చేయలేదు. రిఫరెండం తేదీకి వారం రోజుల ముందు దానిని విడుదల చేయాలని ఐఎంఎఫ్ భావిస్తోంది. తద్వారా చివరి నిమిషంలో ఓట్లను తారుమారు చేసేందుకు ఐఎంఎఫ్ సిద్ధం అవుతోంది.
అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా ‘ఇన్’ కు మద్దతుగా దాదాపు ప్రతి రోజూ ప్రకటనలు ఇస్తున్నాడు. మరోవైపు ఒబామా అనంతరం అమెరికా అధ్యక్షుడు కాగలడని భావిస్తున్న రిపబ్లికన్ పార్టీ పోటీదారు ‘డొనాల్డ్ ట్రంప్’ “బ్రిటన్ ఈయూ బైటికి వెళ్లిపోవడమే ఉత్తమం” అని ప్రకటించాడు.
గ్లోబలైజేషన్ నేపధ్యంలో జూన్ 23 తేదీ కోసం ఎదురు చూడవలసిన పరిస్ధితి భారత ప్రజలకూ వచ్చిపడింది.
అదే జరిగితే యూరోజోన్ కాస్తా జీరోజోన్ గా మారడం ఖాయం.అయితే,నాకో సందేహం ఇరుదేశాలూ పెట్టుబడీదారీ దేశాలైనప్పటికీ జర్మనీ వాణిజ్యపరంగా రష్యాకు దగ్గరవుతుందా?(మరీ అడ్వాన్స్ గా ఆలోచిస్తున్నానా?)
venezula sankshobam gurinchi konchem vivarinchandi