హంద్వారా (కాశ్మీర్) అమ్మాయి ఎట్టకేలకు నోరు విప్పింది. పోలీసులే తన చేత బలవంతంగా అబద్ధం చెప్పించారని చెప్పింది. పోలీసులు ప్రచారం చేసుకున్న వీడియోలో తాను చెప్పినది నిజం కాదని వెల్లడి చేసింది.
పోలీసులు చెప్పమన్నట్లు వీడియోలో చెప్పానని తెలిపింది. ఆ వీడియో రికార్డు చేసిన జిల్లా ఎస్‌పిని వీడియోను ఎవరికి చూపవద్దని కోరానని, కానీ అదే వీడియోను ఉపయోగించి తనపై దుష్ప్రచారం చేశారని తెలిపింది. తన కూతురును నిర్బంధంలో ఉంచుకుని ఆమె చేత అబద్ధం చెప్పించారని ఆమె తల్లి దండ్రులు చెప్పిందే చివరికి నిజమైంది.
ఏప్రిల్ 12 తేదీన హంద్వారా పట్టణంలో సైనిక పికెట్ వద్ద ఒక స్ధానిక అమ్మాయిని సైనికుడొకరు లైంగికంగా వేధించారన్న వార్త గుప్పుమంది. దరిమిలా ప్రజలు ఆగ్రహంతో ఆందోళన చేపట్టారు. యువకులు, యువతులు పెద్ద ఎత్తున పాఠశాలలు, కాలేజీలు బహిష్కరించి ఆర్మీకి వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించారు. వివిధ జిల్లాల్లో ప్రజలు ఎక్కడికక్కడ ఆందోళనలు, హర్తాళ్ లు చేపట్టారు.
పోలీసులు, సైనికులు ప్రజల ప్రదర్శనలపై ఉక్కు పాదం మోపారు. ఆందోళనకారులపై హింస ప్రయోగించారు. లాఠీ చార్జి చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. అనేక చోట్ల కాల్పులు జరిపారు. రెండు వారాల పాటు కొనసాగిన ఈ ఆందోళనలు, కాల్పుల ఫలితంగా 5గురు కాశ్మీరీ యువకులు ప్రాణాలు కోల్పోయారు.
వారిలో ఒకరు క్రికెట్ అద్భుతంగా ఆడే యువకుడు కూడా ఉన్నారని పత్రికలు నివేదించాయి. అతని మొఖం పైనే బులెట్ తగిలిందని, బులెట్ తలలోకి వెళ్లడంతో చనిపోయాడని యువకుడి స్నేహితులు తెలిపారు. వాస్తవానికి అతను ఆందోళనల్లో పాల్గొనలేదని రోడ్డు పక్కన నిలబడి చూస్తుండగా కాల్పులకు బలయ్యాడని తెలిపారు.
తలకు బులెట్ తగలడం బట్టి నేరుగా చంపే ఉద్దేశ్యంతోనే కాల్చినట్లు స్పష్టం అవుతోంది. ఆందోళనకారులపై కాల్పులు జరిపేటప్పుడు మోకాలి కిందనే కాల్చాలని చట్టాలు చెబుతున్నప్పటికీ వాటిని ఉల్లంఘించడమే పోలీసులకు, ముఖ్యంగా కాశ్మీర్ లో పోలీసులకు, సైనికులకు ఎక్కువ ఇష్టం.
సంఘటన జరిగిన వెంటనే బాలికను పోలీసులు అరెస్టు చేశారు. అవును, అరెస్టే. నేరం చేసిన వ్యక్తిని కాకుండా నేరానికి గురైన బాధితురాలిని అరెస్టు చేసి వేధించడం భారత భద్రతా వ్యవస్ధల ప్రత్యేకత. బాలికను విడుదల చేయించడానికి సాయం కోరుతూ ఆమె తండ్రి హక్కుల సంఘాన్ని ఆశ్రయించాడు.
ఆ రోజు రాత్రి అర్ధ రాత్రి దాటాక తండ్రిని స్టేషన్ కు పిలిపించి మాయం చేశారు. ఆ బాలిక బంధువైన మరొక మహిళనూ అరెస్టు చేశారు. ముగ్గురినీ ఒక చోట ఉంచకుండా స్టేషన్లు తిప్పుతూ పోయారు. బాలిక తండ్రిని అరెస్టు చేసిన సంగతి పోలీసులు చెప్పలేదు. హక్కుల సంస్ధలు చెబితేగానీ వారి అరెస్టు సంగతి లోకానికి తెలియలేదు.
బాలికను కస్టడీలో పెట్టుకున్న పోలీసులు ఆమె మాట్లాడిందని చెబుతూ వీడియోను పత్రికలకు విడుదల చేశారు. ఆ వీడియోలో ఆమె స్ధానిక యువకులు తన బ్యాగ్ ను దొంగిలించారని, తనను ఏ సైనికుడూ వేధించలేదని చెబుతున్నట్లుగా ఉన్నది. కానీ బాలికను మాత్రం పోలీసులు విడుదల చేయలేదు.
పోలీసులు తమ కస్టడీలో ఉన్న బాలిక చేత తమకు కావలసిన మాటలు చెప్పించి ఆ వీడియోను బహిరంగంగా విడుదల చేయడం మరో వివాదం అయింది. ఆమె వీడియో మాటలను కాశ్మీరీలు ఎవరూ నమ్మలేదు. మైనర్ బాలికను నిర్బంధించడమే కాకుండా వీడియో రికార్డు చేసి బహిరంగం చేయడం చట్ట విరుద్ధం అని న్యాయ నిపుణులు విమర్శించారు. ఏ చట్టం ప్రకారం నిర్బంధితురాలి మాటల్ని రికార్డు చేసి పత్రికలకు విడుదల చేశారో చెప్పాలని నిలదీశారు.
హక్కుల సంస్ధ కోర్టును ఆశ్రయించడంతో బాలికను హాజరుపరచాలని రాష్ట్ర హై కోర్టు పోలీసులను ఆదేశించింది. ఆ తర్వాత ఏమయిందో గానీ బాలిక విషయమై పత్రికల నుండి సమాచారం అందలేదు. మేజిస్ట్రేట్ వద్ద బాలికను హాజరు పరిచారని, వీడియోలో చెప్పిన కధనాన్నే మేజిస్ట్రేట్ కూ ఆమె చెప్పిందని తర్వాత ఎప్పుడో పత్రికలు చెప్పాయి. పత్రికలకు ఆ సంగతి చెప్పింది కూడా పోలీసులే కావడం గమనార్హం.
అసలు బాలిక, ఆమె తండ్రి, బంధువు ఏరి అని అడిగితే వాళ్ళు తమ కస్టడీలోనే ఉన్నారని పోలీసులు చెప్పారు. అరెస్టు ఎందుకు అని అడిగితే ‘ప్రివెంటివ్ డిటెన్షన్’ (పిడి యాక్ట్) అని బదులిచ్చారు. పెద్ద పెద్ద నేరస్ధులు, దొంగలు, గూండాలు, సంఘ విచ్ఛిన్నకర శక్తులు, ఉగ్రవాదులు… వీళ్ళంతా ఏదన్నా ఘోరం చేయబోతున్నట్లు ముందస్తు సమాచారం అందితే ప్రయోగించేది పిడి యాక్ట్. ముందస్తుగా నిర్బంధం లోకి తీసుకోవడం ద్వారా నేరం జరగకుండా అడ్డుకోవడం చట్టం లక్ష్యం. ఈ చట్టం కిందకు 16 యేళ్ళ బాలికను, అందునా ఒక నేరానికి బాధిరాలైన బాలికను ఎలా అరెస్టు చేయగలరు? ఈ ప్రశ్న అడిగిన పత్రిక ఒక్కటంటే ఒక్కటి లేదు, ‘పిడి యాక్ట్ కింద నిర్బంధించారు’ అని నివేదించడం తప్ప.
ఓ సైనికుడొచ్చి లైంగికంగా వేధిస్తాడు. సగం చచ్చి, భయాందోళనలో ఉన్న ఆ బాలికనే పోలీసులు అరెస్టు చేస్తారు. కూతురిని విడుదల చేయమని కోరవచ్చిన తండ్రినీ అరెస్టు చేస్తారు. తండ్రీ కూతుళ్ల క్షేమ సమాచారం కనుక్కోవడానికి వెళ్తే మహిళ ఐన బంధువునూ అరెస్టు చేస్తారు. అరెస్టు ఎందుకు అంటే, పిడి యాక్ట్ అంటారు. ఆ బాలికను బెదిరించి, తిట్టి, కొట్టిన పోలీసులే బాలిక స్టేట్ మెంట్ ని రికార్డు చేసి పత్రికలకు ఇస్తారు. ఆ పోలీసులే బాలికను మేజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్తారు. పోలీసుల మధ్యలోనే ఆమె మేజిస్ట్రేట్ కు సాక్షం ఇస్తుంది. మేజిస్ట్రేట్ దగ్గర ఫలానా సాక్షం ఇచ్చింది అని పత్రికలకు చెప్పేదీ పోలీసులే. మొదటి నుండి చివరి దాకా పోలీసులే కధ నడిపిస్తారు. దానినే నమ్మాలని జనాన్ని, భారత జనాన్ని కోరతారు. మనం నమ్మేస్తాం.
అసలు జరిగిందేమిటో తెలియాలంటే ఆ బాలికే స్వయంగా మాట్లాడాలి. ఆ అవకాశం ఇప్పటి వరకూ రాలేదు. ఆమెను అన్ని రకాలుగా అదిరించి, బెదిరించి ఇక ఫర్వాలేదు అని నమ్మి విడుదల చేసిన తర్వాతనే బాలికకు, లోకానికి జరిగిందేమిటో తెలుసుకునే అవకాశం లభించింది.
తనను ఏ పోలీసు స్టేషన్ లోనూ స్ధిరంగా ఉంచలేదని, అనేక పోలీసు స్టేషన్లు చుట్టూ తిప్పుతూ పోయారని విలేఖరులకు ఆ బాలిక ఈ రోజు తెలిపింది. జరిగింది జరిగినట్లు చెప్పకుండా ఉండడానికి తనను తీవ్రంగా బెదిరించారని తెలిపింది. కొందరు పోలీసులు తనను కొట్టారని, ఒక పోలీసు తనపై ఉమ్మి వేశారని వెల్లడించింది.
“నేను వాష్ రూమ్ నుండి బైటికి వచ్చినపుడు ఒక సైనిక వ్యక్తి బలవంతంగా నా చేయి పట్టుకున్నాడు. అతని పట్టు నుండి ఎలాగో బలంగా ప్రయత్నించి విడిపించుకుని అక్కడి నుండి బైటికి పరుగెత్తాను. ఆ వ్యక్తి యూనిఫారంలో ఉన్నాడు. ఆ తర్వాత నన్ను పోలీసులు పట్టుకుని స్టేషన్ కు తీసుకెళ్లారు” అని బాలిక విలేఖరులకు తెలిపింది.
“వాళ్ళు నన్ను తిడుతూనే ఉన్నారు. నేనేమో ఏడుస్తూ ఉన్నాను. ప్రతి సారీ ఎవరో ఒకరు (పోలీసు) రావడం, నన్ను తిట్టడం చేస్తూనే ఉన్నారు. ఒక పోలీసు, ఆయన పేరు మొహిసిన్, నా పైన ఉమ్మి వేశాడు.
“ఎవరికీ నిజం చెప్పవద్దని పోలీసులు నన్ను బెదిరించారు. నా చెంపలు వాయించారు. జరిగిన సంఘటన గురించి ఎవరికైనా చెప్పావా, అని హెచ్చరించారు. తర్వాత ఈ ప్రాంత ఎస్‌పి వచ్చాడు. నా స్టేట్ మెంట్ రికార్డ్ చేసుకుంటానని అన్నాడు. రికార్డు చెయ్యొద్దని నేను బతిమాలాను. వీడియో ఎవరికీ ఇవ్వద్దని కోరాను. ఆ వీడియోలో చెప్పిందంతా వాళ్ళు నా చేత బలవంతంగా చెప్పించారు. నేను ఒంటరిగా ఉన్నాను మరి. ఆ వీడియో రికార్డ్ చేసినప్పుడు ఎవరూ నా దగ్గర లేరు. మా కుటుంబ సభ్యులు కూడా ఎవరూ లేరు” అని బాలిక చెప్పిందని ఇండియా టుడే తెలిపింది.
ది హిందు బాలికను ఉటంకిస్తూ ఇలా తెలిపింది. “మోహిసిన్ నన్ను బూతులు తిట్టాడు. నాపై ఉమ్మి వేశాడు. తర్వాత జిలానీ సాహెబ్ (ఎస్‌పి) నా స్టేట్ మెంట్ తీసుకున్నాడు. దాన్ని బహిరంగం చేయనని హామీ ఇచ్చాడు. దానితో నేను ఆర్మీ వ్యక్తులను ఎవరినీ తప్పు పట్టకుండా స్టేట్ మెంట్ ఇచ్చాను. కానీ ఆయన దానిని ఎలా సర్క్యులేట్ చేస్తారు? ఆయన నా పరువు, ప్రతిష్టను ఫణంగా పెట్టారు. కేవలం సైనికులకు సహాయం చేసేందుకే ఇదంతా చేశారాయన” అని బాలిక తెలిపింది.
21 రోజుల పాటు బాలికను, ఆమె తండ్రిని పోలీసులు నిర్బంధం లో ఉంచుకున్నారని పత్రికలు చెబుతున్నాయి. కానీ “బాలిక, ఆమె తండ్రి, ఆమె పిన్ని తమకు ఇష్టం ఐన చోటుకు స్వేచ్ఛగా వెళ్లవచ్చు” అని మే 12 తేదీన J&K హై కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత మాత్రమే వారు విలేఖరుల ముందు వాస్తవంగా జరిగింది ఏమిటో చెప్పగలిగారు. జమ్ము & కాశ్మీర్ హై కోర్టులో విచారణ విషయాలను ఏ భారత పత్రికా ఇవ్వలేదు. కాశ్మీర్ పత్రిక ‘గ్రేట్ కాశ్మీర్’ వెబ్ సైట్ ను వెతికి పట్టుకుని, సంబంధిత వార్త కోసం వెతికి చూస్తే గానీ ఈ సమాచారం తెలియలేదు.
ఈ రోజు బాలిక, ఆమె తండ్రి పత్రికల ముందుకు రావడానికి కూడా పెద్ద పోరాటమే చేయవలసి వచ్చింది. హక్కుల సంఘాలు, రాష్ట్ర బార్ అసోసియేషన్, ఇతర ప్రజా సంఘాలు సంయుక్తంగా కృషి చేయగా చేయగా, ఆ తర్వాత మాత్రమే వారికి విముక్తి లభించింది. అరెస్టు చేసిన కొద్ది రోజుల తర్వాత నుండి ముగ్గురిని రహస్య ప్రదేశంలో ఒక ఇంటిలో ఉంచారని కాశ్మీర్ పత్రికల ద్వారా తెలిసింది.
వారా ఇంటిలో పోలీసు దిగ్బంధనంలో ఉండగానే పోలీసులు పలు కాకమ్మ కధలు వినిపిస్తూ వచ్చారు. బాలిక తమ ‘రక్షణ నిర్బంధం’ (protective custody) లో ఉన్నదని చెప్పారు. ఎవరి నుండి రక్షణ అన్నదీ వారు ఎప్పుడూ చెప్పలేదు. అసలు తమకు రక్షణ కావాలని వారు ఎప్పుడు కోరారో ఎలా కోరారో ఎవరికీ సమాచారం లేదు. హక్కుల సంఘం (JKCCS) సహాయంతో బాలిక తల్లి ఎక్కింది గడప, దిగింది గడపగా తిరుగుతూ ఉంటేనే గాని వారిని హై కోర్టు ముందు పోలీసులు హాజరు పరచలేదు.

Handwara girl
రహస్య ప్రదేశం నుండి తప్పించుకోవడానికి బాలిక ఒకటి రెండు సార్లు ప్రయత్నించినా పోలీసులు ఆమెను అడ్డుకున్నారని తెలుస్తోంది. ఒక పక్క వారి కోసం బాలిక తల్లి, హక్కుల సంఘం కోర్టు మెట్లు ఎక్కి దిగుతూ ఉండగా మరో పక్క పోలీసులు హై కోర్టుకు కూడా తమ ‘రక్షణ కస్టడి’లో ఉన్నట్లే చెబుతూ వచ్చారు. పైగా బాలిక తండ్రే తమకు, తన కుమార్తెకు రక్షణ కావాలని కోరారనీ అందుకే రక్షణ ఇచ్చామని కోర్టుకు చెప్పారు.
చివరికి మే 2 తేదీన బాలిక, ఆమె తండ్రిలను హై కోర్టు ముందు హాజరు పరిచారు. కోర్టులో ఆయన “నేను గానీ, నా కూతురు గానీ ఏ క్షణంలో కూడా రక్షణ కావాలని పోలీసులను కోరలేదు. మాకు పోలీసు రక్షణ అవసరం లేదు. పైగా నా కూతురిని చట్ట విరుద్ధంగా నిర్బంధం లోకి తీసుకున్నారు” అని అఫిడవిట్ సమర్పించారు. పోలీసులేమో “తండ్రి కోరిక మేరకే రక్షణ నిర్బంధం లో ఉంచాము” అని అఫిడవిట్ ఇచ్చారు. కోర్టు పోలీసులను నమ్మింది. బాలిక, తండ్రిల అఫిడవిట్ ను తిరస్కరించింది. తమను బలవంతంగా నిర్బంధించిన పోలీసులపై చర్య తీసుకోవాలని కోరిన తండ్రి పిటిషన్ ను తిరస్కరించింది.
ఆ తర్వాత ఏం జరిగిందో సమాచారం లభ్యం కాలేదు. కానీ అప్పటి నుండి వాళ్ళు ఇంటి వద్ద ఉన్నారనీ, పోలీసులు వారి ఇంటికి కాపలా కాసారని మాత్రం తెలుస్తున్నది. పోలీసుల కాపాలాను తప్పించుకోవడానికి ఆ బాలిక తండ్రి మళ్ళీ హై కోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. మాకు పోలీసుల రక్షణ అవసరం లేదని, ఇరుగు పొరుగు మాత్రమే తమకు రక్షణ ఇవ్వగలరని వేడుకోవలసి వచ్చింది. “అయితే మీరు మీ ఇష్టం అయిన చోటికి స్వేచ్ఛగా వెళ్లవచ్చు” అని హై కోర్టు ఉత్తర్వులు ఇచ్చాక గానీ ఈ రోజు వారు విలేఖరుల ముందుకు రావడం సాధ్యం కాలేదు.
ఏ నేరం చేయకపోయినప్పటికీ, పైగా ఒక నేరంలో స్వయంగా బాధితురాలు అయినప్పటికీ, స్త్రీని పూజించే ఈ ఖర్మ భూమిలో ఒక సాధారణ మైనర్ బాలిక అయినప్పటికీ, ఆ బాలికను -కోర్టులకు ఎలాంటి సమాధానమూ చెప్పుకోనవసరం లేకుండానే, బాలికే రక్షణ కోరిందని సాక్షాత్తు హై కోర్టు లోనే ధైర్యంగా బొంకుతూనే- పోలీసులు (అవును బాధితులకు రక్షణ కల్పించవలసిన రక్షక భటులు!) 21 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించవచ్చని హంద్వారా బాలిక ఉదంతం ఈ దేశ ప్రజలకు చెబుతోంది, కాదు కాదు, హెచ్చరిస్తోంది!
జమ్ము & కాశ్మీర్ రాష్ట్రంలో ప్రజలకు భద్రత ఇవ్వవలసిన పోలీసులు వాస్తవంగా ఎవరికి భద్రత ఇస్తున్నారో ఈ ఒక్క కేసు సరిపోతుంది. జమ్ము&కాశ్మీర్ రాష్ట్రంలో తిష్ట వేసిన అర మిలియన్ (5 లక్షలు) సైనికులు సాగిస్తున్న బృహత్కార్యం ఏమిటో మరో సారి చాటుతున్న కేసు ఇది. పోలీసులు, సైనికులు అనబడే ఈ భద్రతా బలగాలు వాస్తవానికి రక్షణ ఇస్తున్నది కాశ్మీర్ ప్రజలకు కాదు. వారిని రాచి రంపాన పెడుతున్న భారత పాలకవర్గాల ప్రయోజనాలకు మాత్రమే వారు రక్షణ ఇస్తున్నారు. కాశ్మీరీ వనరులను దోచుకు తినడమే భారత పాలకుల ప్రయోజనం. దానికి పాకిస్తాన్ అనీ, సరిహద్దు అనీ, చైనా అనీ చెబుతున్నవి సాకులు మాత్రమే. కాశ్మీరీలకు రక్షణ ఇవ్వలేని భద్రతా బలగాలు దేశానికి ఏ మాత్రం ఇవ్వగలరు?!