పెట్టుబడిదారీ రైతు కోసం వెతుకులాట! -19


Indian peasant

(C) పెట్టుబడిదారీ రైతు కోసం అన్వేషణ

“వ్యవసాయంలో పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి పెట్టుబడిదారీ రైతు ప్రధానమైన, ఖచ్చితమైన సంకేతం” (Ranjit Sau: On the Essence and Manifestation of Capitalism in Indian Agriculture –Mode of Production Debate, edited by Utsa Patnaik– P-116)

పై పుస్తకంలో అశోక్ రుద్ర తన వ్యాసంలో పెట్టుబడిదారీ రైతుకు కొన్ని ప్రమాణాలను పేర్కొన్నారు. (Ibid, P-27)

(1) పెట్టుబడిదారీ రైతు తన భూమిని లీజుకి ఇవ్వడం కంటే తాను సొంతగా సాగు చేయడానికి మొగ్గు చూపుతాడు.

(2) కుటుంబీకుల శ్రమను వినియోగించడం కంటే వేతన కూలీల శ్రమను అత్యధిక నిష్పత్తిలో వినియోగించడానికి ప్రాధాన్యం ఇస్తాడు.

(3) వ్యవసాయ యంత్రాలను వినియోగించేందుకు ప్రయత్నిస్తాడు.

(4) మార్కెట్ దృక్పధంతో సాగు చేస్తాడు. అనగా తన ఉత్పత్తిలో ప్రధాన భాగాన్ని మార్కెట్ చేయడానికి ప్రాధాన్యం ఇస్తాడు.

(5) లాభార్జన దృక్పధాన్ని కలిగి ఉంటాడు. అనగా తన పెట్టుబడికి అధిక రేటు లాభాలను ఆర్జించే విధంగా తన ఉత్పత్తి కార్యకలాపాలను నిర్వహిస్తాడు.

1969-70 లో పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియలను గుర్తించే క్రమంలో పంజాబ్ లో 261 పెద్ద కమతాలను సర్వే చేసిన రుద్ర ఈ ప్రమాణాలను రూపొందించాడు. కానీ ఆయన “జరిగిన మార్పులు ప్రధానంగా ఉత్పత్తి సంబంధాలు మరియు వర్గ నిర్మాణంల పరిధిలో చోటు చేసుకున్న పరిమాణాత్మక మార్పులే” అని అభిప్రాయ పడ్డారు. (Ibid, P-57)

1969లో భారత దేశంలో 5 రాష్ట్రాలలోని 10 జిల్లాలలో విస్తరించిన 66 పెద్ద కమతాలను ఉత్స పట్నాయక్ సర్వే చేశారు. దరిమిలా తన రచన ‘Capitalist development in Agricultural’ (వ్యవసాయంలో పెట్టుబడిదారీ అభివృద్ధి) లో ఇలా పేర్కొన్నారు, “కొత్త పెట్టుబడిదారీ వర్గం అవతరిస్తోంది. ఈ లక్షణం, విస్తృతం అవుతున్న మార్కెట్ మరియు వ్యవసాయ లాభాదాయకత వృద్ధి చెందడం అనే శక్తుల చేత ప్రభావితం అవుతున్న ప్రతి ప్రాంతం లోనూ, వివిధ స్ధాయిలలోనే అయినప్పటికీ, సాధారణ అంశంగా ఉన్నది.” (Ibid, P-39)

ఆర్ ఎస్ రావు, రుద్రతో చర్చిస్తూ తాను రూపొందించిన శక్తివంతమైన ప్రమాణాలు/షరతులు ఇందుకు సరిగ్గా విరుద్ధమైన ఫలితాన్ని ఇచ్చాయని తెలిపారు. ఆయన పెట్టుబడిదారీ రైతులను సామాన్య పరిభాషలో నిర్వచించారు. “పెట్టుబడిదారీ రైతు, సరుకుల ఉత్పత్తి ప్రక్రియలో వేతన కూలీలను వినియోగిస్తూ తన మిగులులో గణనీయ మొత్తాన్ని పెట్టుబడిని పెంచుకోవడానికి గానీ, విస్తారం కావించడానికి గానీ వాణిజ్యం నిమిత్తం వినియోగిస్తాడు” అని పెట్టుబడిదారీ రైతును నిర్వచించారు. (In search of Capitalist Farmer, Ibid, P-33)

ఆహార కొరత నెలకొన్న ద్రవ్యోల్బణ ఆర్ధిక వ్యవస్ధలలో వస్తు రూపేణా చెల్లింపులు పునర్దర్శనం ఇవ్వడమో లేదా శ్రామికుల బేరమాడే శక్తి ఒత్తిడి వల్ల తాత్కాలికంగా బలీయం కావడమో జరుగుతుందని, అయితే అది పెట్టుబడిదారీ పూర్వ సంబంధం కాకపోగా నిర్దిష్ట పరిస్ధితుల్లో జరిగే పెట్టుబడిదారీ వృద్ధి అని కూడా ఆర్ ఎస్ శర్మ తెలిపారు.

“Escaping Capitalist Reality” (పెట్టుబడిదారీ వాస్తవికత నుండి పలాయనం) లో ఆండ్రీ గండర్ ఫ్రాంక్ ఇలా వాదించారు, “విస్తరించబడిన పునరుత్పత్తి మరియు పెట్టుబడి సంచయంలు పెట్టుబడిదారీ విధానానికి ప్రమాణం కావడమూ, మిగులును తిరిగి వ్యవసాయంలోనే లేదా అదే భౌగోళిక ప్రాంతంలోనే మదుపు చేయడం… ఈ రెండు ఒకటి కాదని వాదించారు. దీనికి స్పందిస్తూ రంజిత్ సాహు ఇలా వాదించారు, “నిజం! పెట్టుబడిదారీ రైతు అదే కమతం లోనో లేదా వ్యవసాయం లోనే మిగులును మదుపు చేయనవసరం లేదు; అలాగే పెట్టుబడి సంచయం కూడా భారతదేశపు భౌగోళిక సరిహద్దుల లోపలనే జరగనవసరం లేదు. అయితే, ఇక్కడ విషయం ఏమిటంటే పెట్టుబడిదారీ రైతు లేకుండా వ్యవసాయ పెట్టుబడిదారుడు ఉండడం అసాధ్యం. భారతదేశంలో మిగులును కొల్లగొట్టే భారతీయ జమీందారు గానీ బ్రిటిష్ వలస పాలకుడు గానీ ఇండియాలో వేతన కూలీల చేత వ్యవసాయ సరుకులను ఉత్పత్తి చేయించనంతవరకూ ఇండియాలో పెట్టుబడిదారీ రైతు కాజాలడు” (Ibid, P-116)

సమకాలీన రష్యాలో వ్యవసాయంలో జరుగుతున్న మార్పులను చర్చిస్తూ లెనిన్ ఇలా పేర్కొన్నారు: మొదటి కొత్త రకం, గ్రామీణ బూర్జువా లేదా ధనిక (well-to-do) రైతాంగం. వాణిజ్య వ్యవసాయాన్ని దాని వివిధ రూపాలలో నిర్వహించే స్వతంత్ర రైతులు కూడా వీరిలో కలిసి ఉంటారు. తర్వాత రకం వాణిజ్య మరియు పారిశ్రామిక సంస్ధల యజమానులు, వాణిజ్య సంస్ధల ప్రొప్రయిటర్లు మొ. వాళ్ళు. వాణిజ్య వ్యవసాయం, పారిశ్రామిక సంస్ధలను కలుపుతూ ఉద్భవించేది “పరిశ్రమలు, వ్యవసాయంల సంయోగం” రకం. ఇది ఈ రైతాంగానికి ప్రత్యేకమైనది (peculiar). ఈ ధనిక రైతాంగం నుండే ఒక పెట్టుబడిదారీ రైతు వర్గం సృష్టించబడుతుంది.” (V I Lenin: The Development of Capitalism in Russia, Chapter II, Conclusions)

ఈ రైతాంగ బూర్జువాల గురించి లెనిన్ ఇలా మదింపు చేశారు, “రైతాంగ వ్యవసాయం కూడిక-మొత్తంలోనూ, రైతాంగానికి చెందిన ఉత్పత్తి సాధనాల పరిమాణం మొత్తం లోనూ, రైతాంగం పండించే మొత్తం ఉత్పత్తి లోనూ నిస్సందేహంగా ఈ బూర్జువా రైతులదే ఆధిపత్యం. సమకాలీన గ్రామీణ ప్రాంతంలో వారే యజమానులు (masters).” (Ibid)

రైతాంగం మధ్య జరిగే విభజన పెట్టుబడిదారీ విధానానికి దేశీయ మార్కెట్ ను సమకూర్చుతుందని కా. లెనిన్ వివరించారు. కింది గ్రూపులో వినియోగ సరుకుల వ్యక్తిగత వినియోగం ద్వారా ఈ మార్కెట్ రూపకల్పన జరుగుతుంది; పెట్టుబడిదారీ రైతు అభివృద్ధి చెందితే ఉత్పత్తి సాధనాలకు పెరిగే డిమాండ్ (ఉత్పాదక వినియోగ మార్కెట్) ద్వారా మరొక మార్కెట్ సమకూరుతుంది. మొత్తం పెట్టుబడి ఏర్పాటులో స్ధూల దేశీయ వ్యవసాయ పెట్టుబడి సంచయం యొక్క నిష్పత్తిని లెక్కిస్తే అది ఇండియాలో 1970 ల దశాబ్దంలో దాదాపుగా స్తంభించిపోయింది. 1970-71లో అది 18 శాతానికి పెరిగింది. 1980-81 లో (మాన్యుఫాక్చరింగ్ నమోదు చేసిన 24% తో పోల్చితే) మొత్తంలో 19 శాతానికి పెరిగింది. పెట్టుబడి ఏర్పాటుకు సంబంధించి గ్రామీణ ప్రాంతంలో నమోదైన ఈ కొద్దిపాటి వృద్ధి, ఈ కాలంలో చోటు చేసుకున్న పెట్టుబడిదారీ సంబంధాల కొద్దిపాటి అభివృద్ధిని ప్రతిబింబిస్తుంది. (Class Analysis of Indian Agriculture, Googole Pages, Agri Articles) 1967-68 నుండి 1970-71 వరకు మధ్యంతర ఉత్పత్తి సరుకులు (ఎరువులు, పురుగు మందులు) పెద్ద మొత్తంలోనూ, వ్యవసాయ యంత్రాలు లాంటి ఉత్పత్తి సాధనాలు కొద్ది మొత్తంలోనూ దేశంలోకి దిగుమతి అయ్యాయి.

పెట్టుబడి సంచయంలో స్ధూల ధోరణులు (Broad trends in capital formation)

(Report of The Committee on Capital Formation in Agriculture; Directorate of Economics & Statistics; Dept. of Agriculture & Cooperation; Ministry of Agriculture, Govt. of India, New Delhi, March 2003)

ప్రస్తుతం (2001-02) 1993-94 ధరల ప్రాతిపదికన వ్యవసాయంలో స్ధూల స్ధిర పెట్టుబడి సంచయం (Gross Fixed Capital Formation in Agriculture) రు. 19880 కోట్లు. కాగా వ్యవసాయం కోసం స్ధూల స్ధిర పెట్టుబడి సంచయం (GFCF for Agriculture) రు 28830 కోట్లు. ‘వ్యవసాయం కోసం జి‌ఎఫ్‌సి‌ఎఫ్’ లో, ‘వ్యవసాయంలో జి‌ఎఫ్‌సి‌ఎఫ్’ వాటా కాలక్రమేణా తగ్గుతూ వస్తోంది. ఇది 1980-81 లో 79% ఉండగా 2001-02 నాటికి 69% కి పడిపోయింది.

[‘వ్యవసాయం కోసం జి‌ఎఫ్‌సి‌ఎఫ్’ అంటే నిర్దిష్ట కాలంలో, వ్యవసాయ రంగం వృద్ధి కోసం ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ కంపెనీలు అభివృద్ధి చేసే స్ధిర పెట్టుబడులు (Fixed Capital). ఉదా; కాలువలు, ఆనకట్టలు లాంటి నీటిపారుదల సౌకర్యాలు, వ్యవసాయ పరిశోధనలు, ఎరువుల పరిశ్రమలు మొ.వి. ‘వ్యవసాయంలో జి‌ఎఫ్‌సి‌ఎఫ్’ అంటే నిర్దిష్ట కాలంలో వ్యవసాయంలో  వ్యవసాయ ఉత్పత్తిదారుల ద్వారా చేర్చబడిన స్ధిర పెట్టుబడి. ఉదా: భూమి ఉత్పాదకత పెంచడానికి చేసిన పరికరాల కొనుగోళ్ళు మొ.వి. వీటిలో భూముల కొనుగోళ్ళు కలిసి ఉండవు. ఉత్పత్తి పరికరాల అరుగుదలను లెక్కలోకి తీసుకోరు. -అను]

విశాల దృష్టిలో చూస్తే 1980-81 నుండి 2001-02 కాలంలో ‘వ్యవసాయంలో’ మరియు ‘వ్యవసాయం కోసం’ స్ధూల స్ధిర పెట్టుబడి సంచయం (GFCF) ధోరణులు ఒకే విధంగా ఉంటూ వచ్చింది. జి‌డి‌పిలో నిష్పత్తి ప్రకారం చూస్తే ‘వ్యవసాయంలో జి‌ఎఫ్‌సి‌ఎఫ్’ వాటా 1980-81 లో 3.4 శాతం ఉండగా అది 2001-02 నాటికి 1.6 శాతానికి పడిపోయింది. అలాగే ‘వ్యవసాయం కోసం జి‌ఎఫ్‌సి‌ఎఫ్’ వాటా సైతం అదే కాలంలో సగానికి తగ్గిపోయింది. ఈ తగ్గుదల 1990ల కంటే 1980లలో ఎక్కువగా నమోదయింది. ఈ అంశాన్ని కింది పట్టికలో గమనించవచ్చు.

Gross Fixed Capital Formation in and for Agriculture at 1993-94 Prices (Rs. Cr)

  GFCF

% Share of GFCF in GDP

YEAR   GDP       In Agriculture     For Agriculture In Agriculture For Agriculture
1 2 3 4 5 6
1980-81 401128 13721 17279 3.4 4.3
1985-86 513990 13061 17656 2.5 3.4
1990-91 692871 15805 21560 2.3 3.1
1995-96 899563 16824 25283 1.9 2.8
2000-01 1198685 18364 27946 1.5 2.3
2001-02 1265429 19880 28830 1.6 2.3

జి‌డి‌పిలో వాటాగా చూసినప్పుడు ప్రభుత్వరంగ నుండి వస్తున్న ‘వ్యవసాయంలో జి‌ఎఫ్‌సి‌ఎఫ్’ వాటా, తగ్గుతూ వచ్చింది. ‘వ్యవసాయం కోసం జి‌ఎఫ్‌సి‌ఎఫ్’ వాటా విషయంలో కూడా ఇదే ధోరణి నెలకొంది. కనుక దీర్ఘకాలికంగా జి‌డి‌పి లో వ్యవసాయంలో పెట్టుబడి సంచయం మొత్తంగా చూసినా, ప్రభుత్వరంగ స్ధాయిలో చూసినా తగ్గిపోతూ వచ్చింది. నిజానికి జి‌డి‌పిలో ‘వ్యవసాయంలో జి‌ఎఫ్‌సి‌ఎఫ్’ మరియు “వ్యవసాయం కోసం జి‌ఎఫ్‌సి‌ఎఫ్’ రెండింటి వాటా ప్రభుత్వరంగంలో మరింత తీవ్రంగా తగ్గిపోతూ వచ్చింది. పై పట్టికతో పాటు కింది పట్టికను పరిశీలిస్తే ఆ సంగతి బోధపడుతుంది.

Gross Fixed Capital Formation in and for Agriculture at 1993-94 Prices (Public Sector) –Rs Cr.

YEAR GDP GFCF in Agriculture GFCF for Agriculture % Share in GDP of GFCF in Agriculture % Share in GDP of GFCF for Agriculture

1

2

3

4

5

6

1980-81

401128

7358

9855

1.8

2.5

1985-86

513990

6005

9224

1.2

1.8

1990-91

692871

4871

8706

0.7

1.3

1995-96

899563

5318

9631

0.6

1.1

1999-00

1145442

4637

9902

0.4

0.9

 

మొత్తం స్ధూల స్ధిర పెట్టుబడి సంచయంలో ‘వ్యవసాయంలో జి‌ఎఫ్‌సి‌ఎఫ్’ వాటా ప్రస్తుతం 10 శాతం కంటే తక్కువే ఉన్నది. ఈ నిష్పత్తి 1980ల కాలంలో ఈ తగ్గుదల మరింత తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది. గత కొద్ది సంవత్సరాలుగా మొత్తం జి‌ఎఫ్‌సి‌ఎఫ్ లో ‘వ్యవసాయంలో జి‌ఎఫ్‌సి‌ఎఫ్’ వాటాలో కాస్త మెరుగుదల కనిపిస్తున్నప్పటికీ 1980ల ప్రారంభంతో పోల్చితే తక్కువగానే ఉన్నది. ‘వ్యవసాయం కోసం జి‌ఎఫ్‌సి‌ఎఫ్’ విషయంలో కూడా ఇదే తరహా ధోరణి వ్యక్తం అయింది.

ప్రస్తుతం 1993-94 ధరల ప్రకారం మొత్తం వ్యవసాయ పెట్టుబడి సంచయంలో ‘వ్యవసాయం కోసం జి‌ఎఫ్‌సి‌ఎఫ్ వాటా 12% గా ఉన్నది. అదే సమయంలో జి‌డి‌పిలో వ్యవసాయం వాటా 24% గా నమోదయింది. కనుక ఆర్ధిక వ్యవస్ధలో మొత్తం పెట్టుబడి సంచయంలో వ్యవసాయరంగం వాటాను పెంచవచ్చని స్పష్టం అవుతోంది. పబ్లిక్ సెక్టార్ విషయం తీసుకున్నా కూడా, మొత్తం ప్రభుత్వరంగ పెట్టుబడి సంచయంలో వ్యవసాయరంగం వాటా స్ధిరంగా తగ్గుతూ రావడం గమనార్హం.

ఈ నేపధ్యంలో వ్యవసాయ సమీక్ష గణాంకాలను పరీలిస్తే ఉత్పత్తి పునాది క్షీణిస్తూ వస్తోందని అర్ధం అవుతుంది:

(a) నికర విత్తుబడి విస్తీర్ణం

1990-91 లో 143 మిలియన్ హెక్టార్లు.

2003-04 లో 140 మిలియన్ హెక్టార్లు

(b) నీటిపారుదల విస్తీర్ణం

1999-2000 లో 57.1 మిలియన్ హెక్టార్లు

2003-2004 లో 55.1 మిలియన్ హెక్టార్లు

(c) 1993-94, 2003-04 మధ్య దశాబ్ద కాలంలో తలసరి కూలీకి విలువ చేర్పు వృద్ధి దాదాపు స్తంభించిపోయింది.

(d) 2004-05 లో తలసరి కూలీ విలువ చేర్పు, 1999-2000 నాటి విలువ చేర్పు కంటే తక్కువగా నమోదయింది.

(e) వ్యవసాయ జి‌డి‌పి (వ్యవసాయంలో ఉత్పత్తి విలువ నుండి ముడి సరుకుల విలువ తీసివేయగా వచ్చే మొత్తం) తగ్గుతూ వస్తోంది.

1980-1995 = 3.3 %

1995-2005 = 2.0 %

ఒక మాదిరి పెద్ద కమతాల రైతులు, పెద్ద కమతాల యజమానులు (భూమి, లేబర్, ఋణ, ఉత్పత్తి మార్కెట్లలో నియమ నిబంధనలు విధిస్తున్న వర్గాలు) మరియు వ్యవసాయేతర దోపిడి వర్గాలు (అధిక వడ్డీ ఋణ దాతలు, వ్యాపారులు) వ్యవసాయం నుండి మిగులు స్వాయత్తం చేసుకుంటున్నారని ఎస్‌ఏ‌ఎస్‌ఎఫ్ గణాంకాలు సూచిస్తున్నాయి.

మొత్తం కమతాలలో 1 శాతం కంటే తక్కువ ఉన్న 10 హెక్టార్ల కమతం దారులు మాత్రమే మిగులు సంపాదిస్తున్నారని అఖిల భారత స్ధాయి గణాంకాలు సూచిస్తున్నాయి. పైగా “మిగులులో కేవలం 10.5 శాతం మాత్రమే ఉత్పాదక ఆస్తులలో మదుపు అవుతోంది. మిగులులో భారీ మొత్తం ఉత్పాదక ఆస్తుల కిందికి రావడం లేదు” (Aspects of Indian Economy, 44-46) అని కూడా గణాంకాలు సూచిస్తున్నాయి. రష్యాలో మొత్తం రైతాంగంలో 20% ధనిక రైతులు. 1908లో ప్రచురించిన తన ‘డవలప్ మెంట్ ఆఫ్ కేపిటలిజం ఇన్ రష్యా’ గ్రంధం రెండో ముద్రణలో లెనిన్ 1897 నాటి జనాభా గణాంకాలను ఉటంకిస్తూ “125.6 మిలియన్ల రష్యా జనాభాలో 3 మిలియన్లు భూస్వాములు, బడా బూర్జువాలు, 23.1 మిలియన్లు చిన్న తరహా ధనిక భూయజమానులు, 35.8 మిలియన్లు అతి పేద చిన్న తరహా భూ య్జనామానులు, 22 మిలియన్లు ప్రోలెటేరియట్ కార్మికవర్గ సభ్యులు, 41.7 మిలియన్లు అర్ధ-ప్రోలేటేరియన్ కార్మిక వర్గం” అని తెలిపారు.

ఇండియాలో ఇప్పటికీ చిన్న రైతాంగ వ్యవసాయానిదే ఆధిపత్య రూపం. పశు సంపద, పౌల్ట్రీ, వ్యవసాయ యంత్రాల వాటా తక్కువ. అది కూడా కొన్ని దశాబ్దాలుగా తగ్గుతూ వస్తోంది. రైతాంగంలో 4 శాతం మాత్రమే ఉన్న 4 హెక్టార్లు, అంతకు మించిన కమతాల రైతులు మాత్రమే వినియోగ ఖర్చులకు మించి సంపాదించగలుగుతున్నారు. ‘వినియోగ రుణాలు’, వ్యవసాయ ఆర్ధిక వ్యవస్ధలోకి విస్తృతంగా చొచ్చుకుపోయిన వాణిజ్య మరియు ఋణ పెట్టుబడులు.. ఇవన్నీ “అనేక మార్కెట్లు మరియు కాలాల వ్యాపితంగా విస్తృంచిన అంతః బంధిత మారకాలకు దారి తీస్తున్నాయి. చిన్న రైతులపై ఈ అంతఃసంబంధ మారకాలను బలవంతంగా రుద్దడంలో అవలంబించబడుతున్న వివిధ రకాల మార్గాలు బలవంతపు వాణిజ్యపు పద్ధతిని వ్యవసాయ ఆర్ధిక వ్యవస్ధపై కలిగే వివిధ ప్రభావాలను నిర్దేశిస్తున్నాయి.  అలాంటి బలవంతపు వాణిజ్యీకరణ మొత్తం వ్యవసాయ మారక సంబంధాలు అన్నింటా వ్యాపించి ఉన్నది.” (Ibid)

కనుక రైతాంగానికి చెందిన ఉత్పత్తి సాధనాల కూడిక మొత్తం పరిమాణంలోనూ, రైతాంగం ఉత్పత్తి చేసిన మొత్తం ఉత్పత్తి లోనూ వారి పలుకుబడి రీత్యా చూస్తే సమాలీన భారత గ్రామీణ ప్రాంతంలో రైతాంగ బూర్జువాలు ఆధిపత్య యాజమాన్యం కలిగి లేరు. (పెట్టుబడిదారీ) ‘కదలిక స్ధితి’ (moment) అటుంచి ఆ ‘ధోరణే’ (trend) ఇంకా ప్రారంభం కావలసి ఉంది. అశోక్ రుద్ర, ఉత్స పట్నాయక్ ల అధ్యయనం జరిగిన 40 సంవత్సరాలు గడిచాక కూడా భారత వ్యవసాయంలో పెట్టుబడిదారీ రైతుల ఆవిర్భావం ఇంకా ‘పరిమాణాత్మక స్ధాయి’ లోనే ఉండిపోయింది. అది ఇంకా భారత వ్యవసాయ ఉత్పత్తి సంబంధాలలో ఒక ధోరణిగా ఇంకా ఆరంభం కావలసే ఉన్నది. 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s