ఈ‌యూ ఆధిపత్యం నిలువరించే ఆయుధం: రిఫరెండం


Dutch referendum

Dutch referendum

రిఫరెండం అంటే భారత పాలకవర్గాలకు ఎనలేని భయం. వారికి జనం అభిప్రాయాల పట్ల అస్సలు గౌరవం ఉండదు. జనం గొర్రెలు అని వారి నిశ్చితాభిప్రాయం. ఎన్నికల సమయంలో మాత్రమే వారికి జనం అభిప్రాయాలు కావాలి. అభిప్రాయాలూ అంటే అభిప్రాయాలు కాదు. ఓటు ద్వారా వ్యక్తం అయ్యే వారి ఆమోదం మాత్రమే కావాలి. ఆ ఓటు సంపాదించడానికి ఎన్ని జిత్తులు వేయాలో అన్నీ వేస్తారు. ఆనక వారిని నట్టేట్లో వదిలేసి పోతారు.

ఐరోపా దేశాల్లో అలా కాదు. రిఫరెండం ద్వారా ప్రజాభిప్రాయం కోరడానికి వారికీ ఇష్టం లేకపోయినా ప్రజల అభిప్రాయాలను అనుకూలంగా మార్చుకోగల మీడియా సాధనాలు వారి వద్ద ఉన్న నేపధ్యంలో మన పాలకుల కంటే కాస్త ధైర్యంతో రిఫరెండంలు నిర్వహించడానికి సిద్ధం అవుతుంటారు. పశ్చిమ దేశాల్లో ప్రధాన స్రవంతి మీడియా (చానెళ్లు, పత్రికలు) యావత్తు కార్పొరేట్ల వశంలో ఉండడంతో ప్రజల అభిప్రాయాలను తమకు కావలసినట్లు రూపొందించుకోవడం వారికి పెద్ద కష్టం కాదు.

బహుశా ఆ సులువు లేనందునే మన పాలకులకి రిఫరెండంల పట్ల భయాందోళనలు నెలకొని ఉండవచ్చు. 100 కోట్లు దాటిన జనాభా అభిప్రాయాలను మానిపులేట్ చేయడం, ఎంత మీడియా చేతుల్లో ఉన్నా, కష్టంతో కూడిన వ్యవహారం. ఆఫ్ కోర్స్! అచ్చమైన పెట్టుబడిదారీ వ్యవస్ధకీ, అటూ ఇటూ కానీ అర్ధ-వలస, అర్ధ-భూస్వామ్య వ్యవస్ధకీ మధ్య పాలకుల ప్రయోజనాల రీత్యా ప్రజలను అంచనా వేసే పద్ధతుల్లో తేడా ఉంటుందనుకోండి!

ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే యూరోపియన్ పాలకులు సిద్ధపడినంతగా ప్రజాభిప్రాయ సేకరణ జరపడానికి భారత పాలకులు సిద్ధపడరని చెప్పేందుకు. ఇటీవలి కాలంలో ఐరోపా దేశాలు వరస పెట్టి వివిధ అంశాల పైన రిఫరెండంలు నిర్వహిస్తున్నాయి. కాశ్మీర్ విలీనం విషయమై కాశ్మీరీ ప్రజల అభిప్రాయాలు సేకరిస్తామని హామీ ఇచ్చిన మహా గొప్ప ప్రజాస్వామ్య వాది ‘జవహర్ లాల్ నెహ్రూ’ ఆ హామీ నుండి వెనక్కి తగ్గడమే కాకుండా హామీని నెరవేర్చమన్నందుకు కాశ్మీరీల నేత షేక్ అబ్దుల్లా ను 17 యేళ్లకు పైగా జైల్లో పెట్టాడు. కేవలం ఒకే ఒక్క రిఫరెండం జరిపేందుకు మన వాళ్ళు జనానికి జల్ల కొడితే ఐరోపా దేశాలు వరసపెట్టి రిఫరెండంలు జరిపేస్తున్నాయి. ఆ తేడా గమనించాలని ఈ ఉపోద్ఘాతం.

విషయానికి వస్తే ఐరోపా దేశాలు ఇటీవల కాలంలో వరుసగా రిఫరెండంలు నిర్వహిస్తున్నాయి. దాదాపు ఒకటిన్నర సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 2014లో ఇంగ్లండ్ (యునైటెడ్ కింగ్ డం) ఒక రిఫరెండం నిర్వహించింది. “స్కాట్లాండ్ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నారా?” అన్న ఏకవాక్య తీర్మానం పైన వారు ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. స్కాట్లాండ్ భవితవ్యాన్ని తేల్చేది కనుక ఒక్క స్కాట్లాండ్ ప్రజల ఓటు మాత్రమే ఇందులో సేకరించారు. ఇందులో ‘నో’ కు 55.3% ఓట్లు రాగా, ‘యెస్’ కు 44.7% ఓట్లు వచ్చాయి. ఆ విధంగా “స్వతంత్రం అవసరం లేదు, యూ‌కే నుండి విడిపోవద్దు” అని మెజారిటీ స్కాట్లాండ్ ప్రజలు కోరుకున్నారు. ఈ ఓటింగ్ ను మేనిపులేట్ చేశారనీ, రిగ్గింగ్ చేసి ‘యెస్’ గెలవకుండా చూశారనీ ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ ఆరోపణలు బలహీనంగానే వినపడ్డాయి.

వచ్చే జూన్ 23 తేదీన బ్రిటన్ మరో రిఫరెండం నిర్వహించబోతోంది. దీనిని క్లుప్తంగా ‘బ్రెక్సిట్ రిఫరెండం’ అంటున్నారు. యూరోపియన్ యూనియన్ లో సభ్య దేశంగా బ్రిటన్ (UK) కొనసాగాలా లేదా అని ఈ రిఫరెండం ద్వారా ప్రజలను కోరుతున్నారు. బ్రిటన్ లో మొదటి నుండీ యూరోస్కెప్టిక్ లు గణనీయ సంఖ్యలో ఉన్నారు. స్కెప్టిక్ లు అంటే అనుమానించేవారు అని అర్ధం. యూరోస్కెప్టిక్ లు అంటే ఈ‌యూ సభ్యత్వం బ్రిటన్ ప్రయోజనాలకు ఉపయోగం అన్న అభిప్రాయాన్ని అనుమానించేవారు అని అర్ధం. యూరో జోన్ లో బ్రిటన్ చేరకపోవడానికి వాళ్ళు ఒక కారణం.

‘వాల్ స్ట్రీట్’ కంటే ముందు ‘ద సిటీ ఆఫ్ లండన్’ (క్లుప్తంగా ‘ద సిటీ’ అంటారు) ప్రపంచ ద్రవ్య కేంద్రం (Finance Center) గా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ వాల్ స్ట్రీట్ కంటే ‘ద సిటీ’ ఒక మెట్టు పైనే ఉంటుందని ఆర్ధిక, వాణిజ్య పండితులు భావిస్తారు. ప్రపంచంలో మొట్టమొదటి, అతిపెద్ద ఫైనాన్స్ సెంటర్ గా ‘ద సిటీ’ ప్రయోజనాలను పోగొట్టుకోవడం బ్రిటన్ కు ఇష్టం లేదు.  తమ కరెన్సీ ‘పౌండ్ స్టెర్లింగ్’ ను వదులుకుని ‘యూరో’ ను స్వీకరించడానికి బ్రిటన్ నిరాకరించడానికి ప్రధాన కారణం ఇదే. సొంత కరెన్సీని వదులుకుని యూరో లో ప్రవేశించడం అంటే జర్మనీ, ఫ్రాన్స్ ల ఆధిపత్యానికి దారి ఇచ్చినట్లే. యూరోస్కెప్టిక్ లు ప్రధానంగా ‘ద సిటీ’ ప్రయోజనాభిలాషులు.

భారత బడా దళారీ పారిశ్రామికవేత్తల్లో ఒకరయిన విజయ్ మాల్యా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? బ్రిటన్ లోనే కదూ….! యెస్,  మీరు ఊహించింది నిజమే. ‘ద సిటీ’ ద్రవ్య కేంద్రంగా ఉండడానికీ మాల్యా బ్రిటన్ లో శరణు తీసుకోవడానికీ సంబంధం ఉన్నది. ‘ద సిటీ’, తమ కష్టమర్ల ప్రయోజనాలను తాకట్టు పెట్టబోదు, అది అవతలి సార్వభౌమ దేశ ప్రయోజనాలకు విరుద్ధమే అయినా సరే, అని మాల్యా ఉందంతం ద్వారా బ్రిటన్ లోకానికి చాటి చెప్పింది. అలాగే మాల్యా కూడా ఏ అమెరికాకో, జర్మనీ, జపాన్ లకో కాకుండా బ్రిటన్ కు చెక్కేయడానికి కారణం కూడా ‘బ్రిటన్ అయితే పూర్తి రక్షణ కల్పిస్తుంది’ అని తెలుసు గనకనే.

మాల్యా ఆశించినట్లే లేదా ఊహించినట్లే, మన Enforcement Directorate (ఈ‌డి) కోరినట్లుగా మాల్యాని వెనక్కి పంపేందుకు (deportation) బ్రిటన్ నిరాకరించింది. కావాలంటే Extradite చేస్తాం అని చెప్పేసింది. Extradition అంటే నేరస్ధుల అప్పగింత. Deportation అంటే పంపించివేయడం. దేశంలో చోటు లేకుండా తన్ని తగలేయడం.

సాధారణంగా ఒక వ్యక్తి (విదేశీయుడు) తమ దేశంలో ఉండడం ఇష్టం లేకపోతే ఆ దేశ ప్రభుత్వం దేశంలో అడుగు పెట్టకుండా నిషేధిస్తుంది. తమకు అసౌకర్యం కలిగించే వ్యక్తి ఎవరైనా దేశంలో అడుగుపెడుతున్నట్లు తెలిస్తే విమానాశ్రయంలోనే అడ్డుకుని వెనక్కి పంపేస్తుంది. ఇలాంటి దానిని deportation అంటారు. కానీ మాల్యా, ఇంగ్లండ్ కు కావలసిన వాడే గానీ (ఆయన డబ్బు, ఆస్తులు కావలసినవి కనుక) ఇబ్బంది కలిగించేవాడు కాదు.

Extradition అంటే రెండు దేశాల మధ్య ‘నేరస్ధుల అప్పగింత ఒప్పందం’ ఉన్నపుడు ఒక నేరస్ధుడిని లేదా నేరం చేశారని భావిస్తున్నవారిని ఒక దేశం మరో దేశానికి అప్పగించడం. ఇది సుదీర్ఘ ప్రక్రియ. రెండు దేశాల ప్రభుత్వాలు, న్యాయ స్ధానాలు మల్లగుల్లాలు పడుతూ ఉంటాయి. నేరానికి సంబంధించిన పత్రాలు, సాక్షాలు అన్నీ ఇవ్వాలని, రుజువు చేయమనీ… ఇలా అవతలి దేశం కోరవచ్చు.

Extradition కి వ్యతిరేకంగా సదరు వ్యక్తి ఆ దేశంలో, ముఖ్యంగా బ్రిటన్ లో అక్కడి న్యాయస్ధానాలను ఆశ్రయించవచ్చు. కింది కోర్టు నుండి పై కోర్టు వరకూ పిటిషన్ లు వేస్తూ పోవచ్చు. “నన్ను అప్పగిస్తే సరైన న్యాయం దక్కదు. నా మానవ హక్కులు మంట గలుస్తాయి. నన్ను వేధిస్తారు” అని విన్నవించుకోవచ్చు. ఆయన వాదనని నమ్మితే extradite చేయడానికి బ్రిటన్ ప్రభుత్వం నిరాకరించవచ్చు. వివిధ అంతర్జాతీయ ఒప్పందాలు, చట్టాలు అలాంటి వ్యక్తులకు వారికి మద్దతు వచ్చే ప్రభుత్వాలకు మద్దతు వస్తాయి కూడా. మాల్యా వ్యవహారం బట్టి ‘ద సిటీ’ వ్యవహారాన్ని, దాని ప్రయోజనాలను మచ్చుకు అర్ధం చేసుకోవచ్చు.

ఈ నేపధ్యంలో తమ ఫైనాన్స్ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం బ్రిటన్ జూన్ 23 రిఫరెండం ను ఒక ఆయుధంగా ప్రయోగిస్తోంది. బ్రిటన్  పాలకవర్గాలలో ఒక బలమైన సెక్షన్ కు ఈ‌యూ నుండి విడిపోవడం ఇష్టం లేదు. కానీ వారు కూడా రిఫరెండం జరపడాన్ని వ్యతిరేకించలేదు. వారికి కావలసింది ఈ‌యూ నుండి విడిపోవడం కాదు. రిఫరెండం ద్వారా ఈ‌యూ ని హెచ్చరించడం వారి ప్రయోజనం. “మా దేశంలో ఈ‌యూ నుండి బైటికి రావాలని కోరేవారు బలంగా ఉన్నారు. మీరు మా పైన అట్టే ఒత్తిడి తెస్తే బైటికి వెళ్లడానికి కూడా వెనకాడం” అని వారు ఈ‌యూ ని హెచ్చరించదలిచారు.

ఈ హెచ్చరిక ఎందుకంటే ఈ‌యూ అంతకంతకూ అధికంగా సభ్య దేశాలపై పెత్తనం చేయడం పెరిగిపోయింది. ఈ‌యూ అంటే ప్రధానంగా జర్మనీ, ఫ్రాన్స్ లు. బెల్జియం, ఇటలీ లు కూడా. ఇతర సభ్య దేశాలు జర్మనీ, ఫ్రాన్స్ అదుపాజ్ఞలకు లోబడి ఉంటాయి. ముఖ్యంగా జర్మనీ ఈ‌యూ కూటమికి ప్రధాన నేత. యూరోపియన్ యూనియన్, యూరో జోన్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, యూరోపియన్ పార్లమెంట్, యూరోపియన్ కమిషన్… ఈ సంస్ధల ద్వారా జర్మనీ బహుళజాతి కంపెనీలు ఈ‌యూ దేశాలపై పెత్తనం చేస్తున్నాయి. యూరో జోన్, ఈ‌సి‌బి లకు ఆర్ధిక వనరులను ఎక్కువగా అందిస్తున్నది జర్మనీ కంపెనీలు, బ్యాంకులే. అందువలన జర్మనీ పెత్తనం చెల్లుబాటు అవుతుంది.

ఈ పెత్తనాన్ని ఇష్టం లేని దేశాలు వివిధ పద్ధతుల ద్వారా ప్రతిఘటన ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అటువంటి ప్రతిఘటనలో ఒక భాగం రిఫరెండంలు నిర్వహించడం. ఈ‌యూ సభ్యత్వంపై రిఫరెండం నిర్వహించడం అంటే అది నేరుగా జర్మనీని సవాలు చేయడం.

యూరప్ ఋణ  సంక్షోభం దరిమిలా వివిధ ఋణ పీడిత దేశాలకు బెయిలౌట్లు ఇవ్వడంలో జర్మనీది ప్రధాన వాటా. దానిని అడ్డం పెట్టుకుని అత్యంత కఠినమైన పొదుపు విధానాలు అమలు చేసేలా జర్మనీ యూరో జోన్ సభ్య దేశాలపై ఒత్తిడి తెచ్చింది. ఇవి ఎంత కఠినం అంటే చివరికి ఐ‌ఎం‌ఎఫ్ కూడా కొన్ని సందర్భాల్లో ఈ విధానాలను విమర్శించేంతగా. ఐ‌ఎం‌ఎఫ్ అంటేనే ప్రపంచ కాబూలీవాలా. రుణాలు ఇచ్చి ఆ పేరుతో ప్రయివేటీకరణ, సరళీకరణ లాంటి కఠిన షరతులు అమలు చేయించి వివిధ దేశాల ఆర్ధిక వ్యవస్ధలను పశ్చిమ దేశాలకు కట్టిపడేసే సంస్ధ ఐ‌ఎం‌ఎఫ్. అటువంటి ఐ‌ఎం‌ఎఫ్ కూడా విమర్శించిన విధానాలను జర్మనీ పట్టుబట్టి ఈ‌యూ సభ్య దేశాలచేత అమలు చేయించింది, చేయిస్తోంది.

జర్మనీ షరతుల్లో ఒకటి సభ్య దేశాలు తమ సార్వభౌమత్వంలో ఒక పార్శ్వాన్ని వదులుకోవాలని డిమాండ్ చేయడం. ఆయా దేశాలు రూపొందించే బడ్జెట్ లు ఎలా ఉండాలో నిర్దేశించే అధికారం ఈ‌యూ సంస్ధలకు ఇవ్వాలని జర్మనీ డిమాండ్ చేసి అమలు చేయిస్తోంది. గ్రీసు బడ్జెట్ ఇప్పుడు పూర్తిగా జర్మనీ లేదా ఈ‌సి‌బి చేతుల్లో ఉన్నది. బడ్జెట్ రూపకల్పనను ఇతరుల చేతుల్లో పెట్టడం అంటే పరాధీనం అయినట్లే లెక్క.

యూరోపియన్ ఇంటెగ్రేషన్ లో భాగంగా, గ్రీసు అంత కాకపోయినా ఒక వంతు మేరకు సార్వభౌమత్వం వదులుకుని ఈ‌సి‌బి చేతుల్లో పెట్టాలని జర్మనీ కోరుతోంది. ఈ ప్రక్రియ ఇప్పటికే అమలు అవుతోంది కూడా. యూరోపియన్ పార్లమెంటు ద్వారా వివిధ రాజకీయ కార్యకలాపాలు సభ్య దేశాలపై రుద్దబడుతున్నాయి. ఈ‌సి‌బి ద్వారా సభ్య దేశాల ఆర్ధిక విధానాలను నిర్దేశిస్తున్నారు. ఈ విధానాల ఫలితంగా సభ్య దేశాల ఆర్ధిక, ద్రవ్య వనరులు ప్రధానంగా జర్మనీ బహుళజాతి కంపెనీల పరం అవుతున్నాయి. కోల్డ్ వార్ నేపధ్యంలో ‘సంక్షేమ రాజ్యాలు’గా ఐరోపా దేశాలు అమలు చేసిన ప్రభుత్వరంగ కంపెనీలను ఒక్కొక్కటిగా ప్రైవేటీకరించేందుకు యూరోపియన్ వ్యవస్ధలను ప్రయోగిస్తున్నారు.

ఈ‌యూ సభ్య దేశాలకు జర్మనీ ద్వారా అందివచ్చే ద్రవ్య, ఆర్ధిక వనరులు కావాలి. అలాగని జర్మనీ పెత్తనాన్ని భరించలేకపోతున్నాయి. దేశీయ రాజకీయ, ఆర్ధిక వ్యవస్ధలను ఈ‌సి, ఈ‌సి‌బి, ఈ‌యూ ల వశం కావడం సహించ లేకపోతున్నాయి. ఈ వ్యతిరేకత దృష్ట్యా జర్మనీకి బలహీనంగానే అయినా ప్రతిఘటన ఇచ్చేందుకుక్ ప్రయత్నిస్తున్నాయి. అందుకు రిఫరెండం ను ఒక రాజకీయ సాధనంగా ఎంచుకున్నాయి.

పైన చెప్పినట్లు బ్రిటన్ ఇప్పటికె 2 రిఫరెండంలు జరిపింది. ఏప్రిల్ నెలలో హాలండ్ ఒక రిఫరెండం నిర్వహించింది. ఉక్రెయిన్ తో యూరోపియన్ యూనియన్ ‘అసోసియేషన్ అగ్రిమెంట్’ చేసుకోవాలా వద్దా అని కోరుతూ జరిపిన ఈ రిఫరెండంలో డచ్ ప్రజలు పెద్ద ఎత్తున ‘నో’ అని చెప్పారు. 64% ప్రజలు ఉక్రెయిన్ తో ఒప్పందం చేసుకోరాదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ తో కుదిరిన ‘అసోసియేషన్ అగ్రిమెంట్’ ను ఇప్పటికే ఇతర ఈ‌యూ దేశాలు ఆమోదించాయి. హాలండ్ ప్రధాని కూడా ఒప్పందం పై సంతకం చేశాడు. ఒప్పందం అమలు కావాలంటే సభ్య దేశాల పార్లమెంటులు ఆమోదించాలి. దానికి ముందుగా హాలండ్ ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని కోరింది.

ఈ రిఫరెండం ద్వారా డచ్ ప్రభుత్వం జర్మనీ చెప్పినట్టల్లా జరగబోదన్న సందేశం పంపింది. డచ్ ప్రజల తీర్పు దరిమిలా ఉక్రెయిన్ ఒప్పందంలో మార్పులు చేయాలని హాలండ్ ప్రధాని కోరడం ప్రారంభించాడు. (ఈ ‘అసోసియేషన్ ఒప్పందం’ ను ఉక్రెయిన్ లోని గత ప్రభుత్వం తిరస్కరించింది. ఆ తిరస్కరణ వల్లనే ఉక్రెయిన్ లో హింసాత్మక చర్యలు జరిపి, నాజీ తీవ్రవాదులను రెచ్చగొట్టి కుట్ర చేసి ప్రభుత్వాన్ని కూలదోశారు. ఈ కుట్రకు అమెరికా పూర్తి సహాయ సహకారాలు అందించింది. -ఉక్రెయిన్ ని ఈ‌యూ లో చేర్చితే రష్యా పొరుగునే సైనిక స్ధావరాలు నెలకొల్పే అవకాశం అమెరికాకు వస్తుంది.) ఉక్రెయిన్ సంక్షోభానికి మూలకారణం అయిన ‘అసోసియేషన్ అగ్రిమెంట్’ ను డచ్ ప్రజలు తిరస్కరించడం మామూలు విషయం కాదు.

ఈ మే నెలలో తామూ ఒక రిఫరెండం నిర్వహిస్తామని హంగేరీ ప్రకటించింది. టర్కీ నుండి వచ్చి పడుతున్న శరణార్ధులను ఈ‌యూ సభ్య దేశాలన్నీ తప్పనిసరిగా పంచుకోవాలని జర్మనీ ప్రకటించింది. ఈ మేరకు సభ్య దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. కానీ ఈ ఒప్పందం పట్ల ఐరోపా దేశాల ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. హంగేరి ప్రభుత్వం మొదటి నుండీ జర్మనీ ప్రకటించిన శరణార్ధుల స్వీకరణను తిరస్కరిస్తూ వచ్చింది. ఈ అంశం పై రిఫరెండం నిర్వహిస్తామని ప్రకటించడం ద్వారా హంగేరి ప్రభుత్వం జర్మనీకి మరో సవాలు విసిరింది. జర్మనీ ఏకపక్షంగా శరణార్ధులను సభ్య దేశాలపై రుద్దడం తగదని చెప్పడం ద్వారా జర్మనీ ఆధిపత్యానికి ప్రతిఘటన ఇవ్వడం హంగేరి లక్ష్యం.

ఈ రిఫరెండంల అంశాలు వేరు వేరు అయినప్పటికీ వాటన్నింటికీ ఉన్న ఉమ్మడి స్వభావం ‘ఈ‌యూ ఇంటెగ్రేషన్’. ఈ‌యూ సభ్య దేశాలను రాజకీయంగా, ఆర్ధికంగా ఒకే పాలనా ప్రాంతంగా మార్చి శక్తివంతమైన అధికార కేంద్రంగా అవతరించాలని జర్మనీ, ఫ్రాన్స్ లు భావిస్తున్నాయి.

ఇందులో అమెరికాకు ఒక వైపు ప్రయోజనాలు మరోవైపు సమస్యలూ ఉన్నాయి. ఐరోపా దేశాలు ఒక్కటై ప్రత్యామ్నాయ ధృవంగా పోటీ రావడం అమెరికాకు ఇష్టం లేదు. అదే సమయంలో ఐరోపాతో మాట్లాడాలంటే ఒకే వ్యవస్ధతో మాట్లాడేటట్లుగా ఉండాలి. ఐరోపా లోని ప్రతి దేశంతోనూ విడివిడిగా చర్చలు చేయవలసిన పరిస్ధితి అమెరికాకు ఇష్టం లేదు. తన ప్రయోజనాల కోసం ఈ‌యూ ఒకటిగా ఉండాలి. కానీ అది తన ఆధిపత్యానికి సమస్య కాకూడదు. TPP, TTIP వాణిజ్య ఒప్పందాల ద్వారా ఈ సమస్యను ఒక మేరకు అధిగమించే ప్రయత్నం అమెరికా చేస్తోంది. టి‌పి‌పి, టి‌టి‌ఐ‌పి లు ప్రధానంగా చైనా, రష్యా, బ్రిక్స్ కూటములకు వ్యతిరేకంగా, ప్రపంచాధిపత్యం కొనసాగింపుకు అమెరికా తలపెట్టిన ఒప్పందాలు. దానితో పాటు ఐరోపాను గుప్పిట పెట్టుకునే ప్రయోజనాన్ని కూడా అమెరికా సాధిస్తోంది.

అమెరికా సంగతి ప్రస్తుతానికి వదిలేద్దాం. ఐరోపా రిఫరెండంల విషయానికి వస్తే అవి ప్రధానంగా బ్రసెల్స్ నుండి (బ్రసెల్స్ బెల్జియం రాజధాని. ఈ‌పి, ఈ‌సి‌బి, ఈ‌యూ, ఈ‌సి ల కేంద్ర కార్యాలయాలు ఇక్కడి నుండే నడుస్తాయి. కనుక ఈ‌యూను ఉమ్మడి గా చెప్పడానికి బ్రసెల్స్ అనడం కద్దు. ఇండియా ప్రభుత్వాన్ని ‘న్యూ ఢిల్లీ’ అని ప్రస్తావించినట్లే ఐరోపా -ఈ‌యూ-ప్రభుత్వాన్ని ‘బ్రసెల్స్’ అని ప్రస్తావిస్తారు) రాయితీలు పొందడానికి ఉద్దేశించినవి. జర్మనీ పెత్తనం నుండి సడలింపులు పొందడానికి లక్ష్యంగా చేసుకున్నవి.

రిఫరెండంల నిర్వహణలో ఈ‌యూ సభ్య దేశాల లక్ష్యం ఏమైనప్పటికీ అవి మరో కోణంలో ఈ‌యూను ఏక శిలా సదృశంగా మార్చే జర్మనీ, ఫ్రాన్స్ ల లక్ష్యాన్ని బలహీనపరుస్తున్నాయి. కనీసం ఆ లక్ష్యాన్ని వాయిదా వేస్తున్నాయి. సభ్య దేశాల ప్రజలను వెంట తెచ్చుకుంటూ ఐరోపా ఆధిపత్య దేశాల ఏకపక్ష నిర్ణయాలను వాయిదా వేస్తున్నాయి. ఈ పరిస్ధితికి పురిగొల్పిన తక్షణ కారణం సిరియా శరణార్ధుల పేరుతో టర్కీ ద్వారా తరలించబడుతున్న లక్షలాది వలసీయులు. ఇలా లక్షల మంది ‘సిరియా సంక్షోభం’ పేరుతో ఐరోపా దేశాలకు హఠాత్తుగా ఎందుకు తరలి వస్తున్నారన్నది ఒక ప్రత్యేక సమస్య. అందుకు ప్రత్యేక విశ్లేషణ అవసరం. ప్రస్తుతానికి ‘యూరోపియన్ యూనియన్ ను ముఖ్యంగా జర్మనీని అస్ధిరం కావించే లక్ష్యంతో శరణార్ధులను ఒక పద్ధతి ప్రకారం టర్కీ నుండి పనిగట్టుకుని తరలిస్తున్నారని అందులోనూ అమెరికా హస్తం-టర్కీ ప్రోద్బలం ఉన్నదని’ అర్ధం చేసుకుంటే సరిపోతుంది.

బ్రిటన్, హాలండ్, హంగేరి దేశాలు జరిపిన, జరపనున్న రిఫరెండంల నేపధ్యంలో ఇతర ఐరోపా దేశాలలోని రాజకీయ పార్టీలు సైతం రిఫరెండం వాగ్దానాలు చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం ఇస్తే ఫలానా అంశం పై రిఫరెండం నిర్వహిస్తామని చెబుతున్నాయి. ఆ ‘ఫలానా’ అంశం తరచుగా ఈ‌యూ కు సంబంధించినదే అవుతుండడం కాకతాళీయం కాదు.

ఈ రిఫరెండంలు యూరోపియన్ యూనియన్ బ్యూరోక్రసీకి, ఈ‌యూ మరింతగా ఇంటగ్రేట్ కావడానికీ, జర్మనీ సామ్రాజ్యవాద లక్ష్యానికి అవరోధాలు అవుతున్నాయి.

 

12 thoughts on “ఈ‌యూ ఆధిపత్యం నిలువరించే ఆయుధం: రిఫరెండం

 1. 1.పెట్టుబడిదారీ వ్యవస్ధకీ, అటూ ఇటూ కానీ అర్ధ-వలస, అర్ధ-భూస్వామ్య వ్యవస్ధకీ మధ్య పాలకుల ప్రయోజనాల రీత్యా ప్రజలను అంచనా వేసే పద్ధతుల్లో తేడా ఉంటుందనుకోండి!
  2.కాశ్మీర్ విలీనం విషయమై కాశ్మీరీ ప్రజల అభిప్రాయాలు సేకరిస్తామని హామీ ఇచ్చిన మహా గొప్ప ప్రజాస్వామ్య వాది ‘జవహర్ లాల్ నెహ్రూ’ ఆ హామీ నుండి వెనక్కి తగ్గడమే కాకుండా హామీని నెరవేర్చమన్నందుకు కాశ్మీరీల నేత షేక్ అబ్దుల్లా ను 17 యేళ్లకు పైగా జైల్లో పెట్టాడు. కేవలం ఒకే ఒక్క రిఫరెండం జరిపేందుకు మన వాళ్ళు జనానికి జల్ల కొడితే ఐరోపా దేశాలు వరసపెట్టి రిఫరెండంలు జరిపేస్తున్నాయి.
  మొదటివాక్యం రెండోవాక్యాన్ని ఎంతవరకు సమర్ధిస్తుందో వివరిస్తారా?

 2. అటూ ఇటూ కానీ అర్ధ-వలస, అర్ధ-భూస్వామ్య వ్యవస్ధకు చెందిన భారత్ వంటి దేశాలలో ప్రజలను,పెట్టుబడీదారీ దేశాలలోని ప్రజలతో పోల్చితే వారిని మానుప్యులేట్ చేయడం తెలియదా(కష్టమా)?
  అందువలననే రిఫరెండం లాంటి నూతన ప్రజాస్వామ్య పద్ధతులను అమలు జరపడం/జరపడానికి వెనకడుగు వేస్తున్నారా?

  అటూ ఇటూ కానీ అర్ధ-వలస, అర్ధ-భూస్వామ్య వ్యవస్ధలకు,పెట్టుబడీదారీ దేశాలకు ఇంతతేడా ఎందుకు ఉంటుంది?

 3. “అచ్చమైన పెట్టుబడిదారీ వ్యవస్ధకీ, అటూ ఇటూ కానీ అర్ధ-వలస, అర్ధ-భూస్వామ్య వ్యవస్ధకీ మధ్య పాలకుల ప్రయోజనాల రీత్యా ప్రజలను అంచనా వేసే పద్ధతుల్లో తేడా ఉంటుందనుకోండి!”

  పెట్టుబడిదారీ వ్యవస్ధకూ, వెనుకబడిన అర్ధ-వలస, అర్ధ-భూస్వామ్య వ్యవస్ధకూ మధ్య పాలకుల ప్రయోజనాల్లో తేడా ఉంటుంది. వారి అవసరాలు కూడా వేరు వేరు. ఇక్కడి పాలకులు స్వతంత్రులు కారు. సామ్రాజ్యవాదులపై ఆధారపడి ఉంటారు. అక్కడి పాలకులు సామ్రాజ్యవాద అధిపతులు. కనుక ఇరువురి మధ్యా ప్రజలని ట్రీట్ చేసే పద్ధతిలో తేడా ఉంటుంది. ప్రజల అభివృద్ధి స్ధాయి కూడా ఇందులో పాత్ర పోషిస్తుంది.

  ఇంత తేడా ఎందుకంటే అక్కడ వ్యవస్ధ పునాది, ఇక్కడ వ్యవస్ధ పునాది వేరు వేరు గనక.

  రిఫరెండం నూతన ప్రజాస్వామ్య పద్ధతి కాదు. ప్రజాస్వామ్య ప్రక్రియల్లో అదొక భాగం. పెట్టుబడిదారీ దేశాలు అన్నింటి రాజ్యాంగాల్లో రిఫరెండం అవకాశం లేదు. కొన్నింటిలోనే ఉంది. ఆయా దేశాల రాజకీయ వ్యవస్ధల పరిణామ క్రమంలో ఏర్పడిన ప్రత్యేకతలు ‘రిఫరెండం’ నిర్వహణను సాధ్యం చేశాయి.

  సామాజిక వ్యవస్ధలు కొన్ని దశాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది.
  1. ఆదిమ కమ్యూనిస్టు వ్యవస్ధ
  2. ఫ్యూడల్ వ్యవస్ధ
  3. పెట్టుబడిదారీ వ్యవస్ధ
  4. సామ్యవాద వ్యవస్ధ

  ఒక దశ నుండి వేరొక వ్యవస్ధకు మారడం విప్లవాల వల్ల సాధ్య పడింది. భూస్వామ్య సమాజాలలో ప్రజాస్వామిక విప్లవాలు చెలరేగి పెట్టుబడిదారీ సమాజాలు ఏర్పడ్డాయి.

  ఇండియాలో ప్రజాస్వామిక విప్లవం చోటు చేసుకోలేదు. ఆ విప్లవం రాకుండా వలస పాలన అడ్డుకుంది.
  సమాజాలు ఒక్కో దశకు అభివృద్ధి చెందుతూ ఉంటేనే ప్రజలు, పాలకుల ఆలోచనలు, భావాలు కూడా సాపేక్షికంగా అభివృద్ధి చెందుతాయి.

  ప్రజల సాపేక్షిక అభివృద్ధి ఒక కోణంలో మీడియాకు వారిని దగ్గర చేస్తుంది. మీడియాకు వారు ఎంత దగ్గరైతే అంతగా మేనిపులేట్ చేయడం సాధ్యం అవుతుంది.

  వ్యవస్ధల అభివృద్ధి గురించి ‘మావో ధాట్ అంటే ఏమిటి?’ అన్న ఆర్టికల్ లో కాస్త చర్చించాను. వీలైతే చూడండి.

  http://wp.me/p1kSha-2Aa
  http://wp.me/p1kSha-2Ah

 4. నెహ్రు-కాశ్మీర్ అంశంలో భారత రాజ్యాంగంలో “రెఫరెండం” అనే అంశమే లేకపోతే దానిని కాశ్మీర్ లో జరిపిస్తానని మాయమాటలు ఎలా చెప్పగలిగాడు? “రెఫరెండం” ని భారతరాజ్యాంగంలో చేర్చడానికి ఏమైనా కృషిచేశాడా? పోనీ కాశ్మీర్లో జరపవలసిన “రెఫరెండం”ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి తనవద్ద వనరులు(పత్రికలు మొ,,) లేవని గ్రహించడం వల్లనే కాశ్మీర్ అంశంలో తాను ఇచ్చిన మాటనుండి వెనక్కి తగ్గాడా? దీనికి సంబంధిచిన ఏవైనా వివరాలుంటే(విషయం) చెబుతారా?

 5. “నెహ్రు-కాశ్మీర్ అంశంలో భారత రాజ్యాంగంలో “రెఫరెండం” అనే అంశమే లేకపోతే దానిని కాశ్మీర్ లో జరిపిస్తానని మాయమాటలు ఎలా చెప్పగలిగాడు?”

  ఈ సంగతి నెహ్రూని అడగాలి. ఆయన లేరు గనక రాహుల్ ని అడగొచ్చేమో.

  ” “రెఫరెండం” ని భారతరాజ్యాంగంలో చేర్చడానికి ఏమైనా కృషిచేశాడా?”

  నా దగ్గర అలాంటి సమాచారం లేదు.

  “పోనీ కాశ్మీర్లో జరపవలసిన “రెఫరెండం”ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి తనవద్ద వనరులు(పత్రికలు మొ,,) లేవని గ్రహించడం వల్లనే కాశ్మీర్ అంశంలో తాను ఇచ్చిన మాటనుండి వెనక్కి తగ్గాడా? దీనికి సంబంధిచిన ఏవైనా వివరాలుంటే(విషయం) చెబుతారా?”

  అసలు విషయం వదిలేసి, కొసరు విషయాలను పట్టుకుని వేలాడుతూ వాటి మీద మీరే ఊహలు అల్లుకుని ఆ ఊహాల్ని వివరించమని నన్ను అడిగితే నాకెలా సాధ్యం చెప్పండి!

  ఇంతకీ నేను చూడమన్న లింకులు చూసారా?

 6. చూశాను,కానీ కాశ్మీర్ అంశంలో నిర్ధిష్టంగా రెఫరెండంకు సంభంధించిన సమాచారం దొరుకుతుందేమోనని ఓవెర్ ఎక్జైట్మెంట్ తో అడిగా అంతేగానీ విషయాన్ని పక్కదారి పట్టించాలని కాదు! సరే,ఇకపై ప్రధాన అంశానికి సంబంధించిన విషయాలను అడగాడానికి ప్రయత్నిస్తా!! ఓపికగా సమాచారం ఇస్తున్నదుకు ధన్యవాదాలు.

 7. చూసారా, గుడ్!

  ఆ ఆర్టికల్ లో మీకు అర్ధం అయిన విషయం ఏమిటో బ్రీఫ్ గా రాయండి. మీకు అర్ధమైన మేరకు విపులంగా రాసినా ఓ‌కే.

  ఇది నన్ను నేను పరీక్షించుకోడానికి, మిమ్మల్ని పరీక్షించడానికని అపార్ధం చేసుకోవద్దు.

 8. వ్యవస్థల తీరుతెన్నులగూర్చి మార్క్స్ వివరించినవిషయాలను,దానిని ఏవిధంగా ఉన్నతస్థికికి చేర్చవచ్చోనని సిద్ధాంతీకరించినదానిని,లెనిన్ ఆచరణలో చూపి,ఆ సిద్ధంతానికి చేర్పులు చేర్చితే,స్టాలిన్ దానిని ముందుకు తీసుకుపోయే క్రమంలో కష్టనష్టాలను ఎదుర్కొన్నాడు.

  అయితే వీరందరి ప్రధాన ఆలోచనలు వారుంటున్న పెట్టుబడీదారీవ్యవస్థలకు చెందితే,బారతదేశంలాంటి మూడో ప్రపంచదేశాలలో పూర్తీ పెట్టుబడీదారీ వ్యవస్థలకు మారకముందే కార్మిక,కర్షక వర్గాల అండతో వ్యవస్థల ఉన్నతీకరణను ఎలా పొందవచ్చో మావో,చేగువేరాల కృషి ద్వారా చెలుసుకోవచ్చు,మరీ ముఖ్యంగా మావో.

  ఆ క్రమంలో అశేష కర్షక,కార్మిక వర్గాలు తమదారిలో గల ముల్లను దాటుకొంటూ ఎలా ఉన్ముఖీకరణ చెందాలో మావో ఆలోచనలద్వారా తెలుసుకోవచ్చు.కార్మిక,కర్షక వర్గాలవారికి శతృవర్గాలేవో,మిత్రవర్గాలేవో గుర్తించడంలో మావో ఆలోచనలు తోడ్పడతాయని వివరణ!

 9. నూతన ప్రజాస్వామిక విప్లవంలో ప్రధానంగా మావో కృషిఉంది.మనదేశంలో శ్రామికులు ప్రధానంగా వ్యవసాయం దాని అనుబంధ రంగాలలో కేంద్రీక్రుతమైయున్నారు.కానీ,విప్లవకర శక్తులైన కార్మికులు మీగతా శ్రామికులకు నాయకత్వం వహించి,సామాజిక స్థితిగతులను మార్పుకు గురిచేసేటువంటి సంసిద్ధత వారిలో కనిపించడంలేదు.మనదేశ సామాజిక పరిస్థితులుకూడా భూస్వామ్య భావజాలంలోనే కొనసాగుతున్నాయి(ఉపరితల అంశం).ఆర్ధికపరమైన మార్పు పెద్దగా లేనందువల్ల బహుశా సామాజికస్థితిగతులు కూడా పెద్దగా మార్పుకు గురికాలేదనుకుంటా.
  ప్రధానవిషయానికివస్తే,దేశ శ్రాముకులలో ఐక్యతకు కృషి జరిగితే వారిసమస్యలపట్ల అందరూ సంఘటితమై శత్రువుపట్ల ఉమ్మడిగా పోరాటాలను నెరపగలరు,తద్వారా వారిని(ఆదిపత్యవర్గాలను) అదుపులో ఉంచగలరు/వారిమూలాలను పెకిలించగలరు.

  వారిలో ఐక్యతను పెంపొందిచడమెలాగన్నదే ప్రధానాంశంగా నాకు తోస్తుంటుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s