ఆవు పూజ భారతీయ ప్రాచీన సంస్కృతిగా చెప్పడం వాస్తవ విరుద్ధం అని భారత బడా పారిశ్రామిక కుటుంబాల్లో ఒకటయిన గాడ్రెజ్ అధినేత ఆది గాడ్రెజ్ స్పష్టం చేశారు. గో వధ, ఆవు మాంసం లపై నిషేధం వలన భారత ఆర్ధిక వ్యవస్ధకు నష్టం వాటిల్లుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
“(మోడి ప్రవేశ పెట్టిన) కొన్ని విధానాలు భారత ఆర్ధిక వృద్ధికి నష్టం కలగజేస్తున్నాయి. ఉదాహరణకి కొన్ని రాష్ట్రాల్లో ఆవు మాంసంపై విధించిన నిషేధం.” అని ఆయన అన్నారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికను ఉటంకిస్తూ వెబ్ పత్రిక స్క్రోల్ తెలిపింది.
“ఇది వ్యవసాయం పైనా, గ్రామీణ అభివృద్ధి పైనా స్పష్టమైన ప్రభావం చూపిస్తోంది. ఎందుకంటే ఈ అదనపు ఆవులన్నింటినీ ఏం చేసుకోవాలి?” అని గాడ్రెజ్ ప్రశ్నించారు.
“అది వాణిజ్యాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. ఎందుకంటే అనేకమంది రైతులకు ఇది మంచి ఆదాయ వనరు. కనుక అది ఆర్ధిక వ్యవస్ధపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది” అని ఆది గాడ్రెజ్ చెప్పారు.
మద్యపాన నిషేధం కూడా ఆర్ధిక వ్యవస్ధకు చేటు తెస్తోందని ఆది గాడ్రెజ్ వ్యాఖ్యానించారు.
“వేద కాలంలో భారతీయులు ఆవు మాంసం తిన్నారు. మన మతంలో ఆవు మాంసం తినడానికి వ్యతిరేకంగా నిబంధనలు ఏమీ లేవు. కరువు పరిస్ధితుల నేపధ్యంలో అనేక యేళ్ళ క్రమంలో తలెత్తిన పరిణామం అది.
“ఆవులను చంపవద్దని వాటిని పిల్లలకు పాలు అందించడం కోసం భద్రం చేయాలని పెద్దలు చెప్పారు. అదే చివరికి మతపరమైన నమ్మకంగా స్ధిరపడిపోయింది. ఇది బొత్తిగా హాస్యాస్పదం. వేదిక్ ఇండియన్లు ఆవు మాంస భక్షకులు” అని ఆది గాడ్రెజ్ స్పష్టం చేశారు.
“కొన్ని అంశాలు ఉన్నాయి. మద్యపాన నిషేధం లాంటివి. ఎన్నికల్లో నెగ్గడానికి, మహిళల ఓట్లు కూడగట్టుకోవడానికి కొన్ని రాష్ట్రాలు మద్యపానం నిషేధిస్తున్నాయి. బీహార్ ప్రభుత్వం నిషేధాన్ని తెచ్చింది. కేరళ నిషేధాన్ని తెచ్చింది. ఈ నిషేధం ఆర్ధిక వ్యవస్ధకు చేటు.
“నిషేధం తాగుడును ఏమీ తగ్గించదు, కనుక సామాజిక నిర్మాణానికి చేటు తెస్తుంది. దాని వల్ల చెడ్డ మద్యం, ఆ తర్వాత మాఫియా రంగంలోకి వస్తాయి. ప్రపంచ వ్యాపితంగా నిషేధం విఫలం అయింది. అమెరికాలో విఫలం అయింది. ఇండియాలో కూడా నిషేధం ప్రయత్నించి విఫలం అయ్యాం” అని ఆది గాడ్రెజ్ విశ్లేషించారు.
4.1 బిలియన్ డాలర్ల (రమారమి రు. 27,000 కోట్లకు సమానం) విలువ కల గాడ్రెజ్ గ్రూపు పరిశ్రమల సమూహానికి ఛైర్మన్, ఆది గాడ్రెజ్. గో వధ నిషేధంపై గొంతు విప్పిన మొట్ట మొదటి పారిశ్రామికవేత్త బహుశా ఈయనే కావచ్చు.
వేద కాలంలో అగ్ర వర్ణాలు సైతం గో మాంసం భుజించిన సంగతి వేదాలను అధ్యయనం చేసిన అనేకమంది చరిత్రకారులు వివిధ సందర్భాల్లో వెల్లడి చేశారు. కనుక ఆది గాడ్రెజ్ చెప్పిన సంగతులు కొత్తవి ఏమీ కావు. కాకుంటే పారిశ్రామిక వర్గాల నుండి ఈ వాస్తవం వెల్లడి కావడం ఇదే మొదలు.
భారత దేశంలో శక్తివంతమైన దళారీ పారిశ్రామిక కుటుంబాల్లో ఒకటయిన గాడ్రెజ్ బహిరంగంగా గొంతు విప్పవలసి రావడం బట్టే గో వధ నిషేధం వలన భారత విదేశీ వాణిజ్యానికి ఎంతగా నష్టం తెస్తున్నదో ఊహించవచ్చు.
గోవధ నిషేధం, మద్య నిషేధం ఒకటేనా?
మోడి పాలనలో రెండు అంశాలు ప్రధానంగా వాణిజ్యానికి నష్టంగా మారాయని ఆది గాడ్రెజ్ అభిప్రాయం. ఈ రెండింటికి ఆయన వేరు వేరు కారణాలు చెప్పారు. ఆ కారణాలను కాస్త దగ్గరగా పరిశీలిస్తే మనకొక వైరుధ్యం కనపడుతుంది.
గోవధ, ఆవు మాంసం లపై నిషేధం వల్ల రైతుల వ్యవసాయానికి నష్టం అనీ, వారి ఆర్ధిక వనరులను కొల్లగొట్టడం అనీ ఆయన కారణంగా చెప్పారు. దేశంలోని పౌరుల కుటుంబాల వ్యక్తిగత ఆర్ధిక వ్యవస్ధల మొత్తమే దేశ ఆర్ధిక వ్యవస్ధ.
తమకు అవసరం లేని ఆవులను, ఒట్టి పోయిన ఆవులను, అవసరార్ధం అమ్మదలిచిన ఆవులను అమ్ముకోవడానికి వీలు లేకుండా గోవధ నిషేధం అడ్డం పడుతోందని గాడ్రెజ్ చెబుతున్నారు.
ఆవులను పెద్ద ఎత్తున కబేళాలకు తరలించి, వధించి, విదేశీ మార్కెట్లకు ఎగుమతులు చేసేది పెద్ద పెద్ద కంపెనీలే. కానీ ఆ కంపెనీలు తమ మాంసం ఎగుమతులకు కావలసిన ఆవులు, ఎద్దులను రైతుల వద్ద నుండే సేకరించాలి. ఆ విధంగా మాంసం ఎగుమతులు – గో వధ – రైతుల నుండి ఆవులు, ఎద్దుల సేకరణ.. ఇవి మూడూ పరస్పరం సంబంధం కలిగినవి.
కనుక గోవధ నిషేధం అటు కంపెనీలతో పాటు రైతుల ఆదాయ వనరులకి కూడా చేటు తెస్తోంది. రైతులు తమ పశువులను అమ్ముకోవడంతో ప్రారంభమయిన ఒక ఆర్ధిక ప్రక్రియ multiplier effect ద్వారా అనేక రెట్లు హెచ్చింపు విలువను పొంది దేశ ఎగుమతి ఖాతాలో నిల్వలను పెంచుతుంది.
గోవధ అటు కంపెనీలకూ, ఇటు రైతులకూ అంతిమంగా దేశ ఆర్ధిక వ్యవస్ధకు నష్టకరం.
మధ్యపాన నిషేధానికి వస్తే గాడ్రెజ్ చెప్పిన కారణాలు: ఎన్నికల కోసం తెచ్చారని, ముఖ్యంగా మహిళల ఓట్ల కోసం అమలు చేస్తున్నారని.
నిజానికి ప్రధాని నరేంద్ర మోడి మధ్యపాన నిషేధంతో సంబంధం లేదు. ఆయన రాష్ట్రం గుజరాత్ లో అమలులో ఉన్న నిషేధం ఎప్పుడో 1950ల నుండి అమలు అవుతున్నది. ఎన్నడో నీరు గారింది. అది కూడా మోడి పాలనలో మరింతగా నీరు గార్చారన్న ఆరోపణాలూ ఉన్నాయి.
గాడ్రెజ్ చెప్పిన రెండు రాష్ట్రాలు బిజేపి పాలనలోనివి కావు. బీహార్ లో నితీష్ కుమార్ గత ఏప్రిల్ మొదటి వారం నుండి నిషేధాన్ని అమలు చేస్తున్నారు. ఈ రోజు ఆయన వారణాసి (ప్రధాని లోక్ సభ స్ధానం) వెళ్ళి దేశవ్యాపిత నిషేధం విధించాలని మోడికి సవాలు విసిరారు కూడా.
గాడ్రెజ్ చెప్పిన రెండో రాష్ట్రం కేరళ. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. రాష్ట్ర ఎన్నికల సందర్భంగానే ఆయన నిషేధం ప్రకటించారు అనడంలో సందేహం లేదు. మళ్ళీ అధికారం వస్తే ఆ నిషేధాన్ని నీరు గార్చుతారు అనడం లోనూ సందేహం లేదు.
కానీ నిషేధం వల్ల మహిళల ఓట్లు ఎందుకు వస్తాయి? మధ్యపానం వల్ల తమ కుటుంబ ఆర్ధిక వ్యవస్ధ తలకిందులు అవుతున్న తమ సొంత అనుభవాల వల్లనే మహిళలు మధ్యపాన నిషేధం కోరుకుంటున్నారు.
మధ్యపాన నిషేధం వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాల వద్ద డబ్బులు మిగులుతాయి. ఆ డబ్బును వారు తమ వద్దనే పొదుపు చేసుకునే లగ్జరీని వారు కలిగి లేరు. మద్య నిషేధం ద్వారా మిగిలిన సొమ్మును వారు ఇంట్లో సరుకుల కోసం, పిల్లల చదువుల కోసం, కాస్త మంచి దుస్తుల కోసం ఖర్చు చేస్తారు. కొద్దో గొప్పో మిగిలితే పోస్ట్ ఆఫీస్ లోనో, బ్యాంక్ లోనో దాచి పెడతారు. కనుక మధ్య నిషేధం వల్ల కుటుంబాల వద్ద మిగిలే సొమ్ము మళ్ళీ అమ్మకం పన్ను రూపంలో, పొదుపు రూపంలో ప్రభుత్వానికే చేరుతుంది.
కానీ మద్య పానం వల్ల జరిగేది ఏమిటి? జనం ముఖ్యంగా పేద, మధ్య తరగతి పురుషులు తమ పరిమిత ఆదాయాలను తాగి తగలేస్తారు. వారి కుటుంబాలు అప్పుల పాలు అవుతాయి. వడ్డీలు చెల్లించలేక చతికిల పడతారు. పిల్లల చదువులు కొండెక్కుతాయి. పిల్లలు అల్లరి చిల్లరగా తిరుగుతారు. మహిళలపై మరింత భారం పడుతుంది. కుటుంబంలో అశాంతి రేగుతుంది. భార్యా, పిల్లలు కాస్త మర్యాదకరమైన బట్టకు నోచుకోరు.
ఇవన్నీ కాకుండా కోట్లాది పేద, మధ్య తరగతి కుటుంబాల ఆదాయం కొద్ది మంది మధ్యం డీలర్లు, షాపులు, కంపెనీల కుటుంబాల చేతుల్లోకి వెళ్లిపోతుంది. వాళ్ళు తమ ఆదాయ పన్నును చట్టాల ప్రకారం చెల్లించరు. పెద్ద మొత్తంలో నల్ల డబ్బు కూడబెడతారు. దానిని కాపాడుకోవడానికి రాజకీయ నాయకుల్ని మేపుతారు. లేదా తామే రాజకీయాల్లోకి దిగుతారు. మద్యం లాబీలు నడిపి ఎన్నికైన ప్రభుత్వాల్ని సైతం కూలగొడతారు. అక్రమ ప్రభుత్వాల్ని నిలబెడతారు.
మద్య పానం వల్ల ఆదాయ కేంద్రీకరణ పెరుగుతుంది. గాడ్రెజ్ లాంటి పెద్ద పెద్ద కుటుంబాల వద్ద డబ్బు రాశులు పెరుగుతాయి. అది దేశ ఆర్ధిక వ్యవస్ధలోకి పన్నుల రూపంలో ప్రవేశించకపోగా ప్రత్యామ్నాయ నల్ల డబ్బు ఆర్ధిక వ్యవస్ధ లోకి ప్రవేశిస్తుంది. ఖజానాకు ఏ మాత్రం లాభం చేకూర్చదు.
మద్య నిషేధం వల్ల ఆదాయం, వారి ఆదాయ పర్మితుల్లోనే అయినా, వికేంద్రీకరణ చెందుతుంది. కొనుగోళ్ళు పెరుగుతాయి. అమ్మకపు పన్ను వసూళ్లు పెరుగుతాయి. ఖజానా ఆ మేరకు వృద్ధి చెందుతుంది.
గోవధ నిషేధం చిన్న, పేద కుటుంబాలకు నష్టకరం కాగా మద్య నిషేధం పేద, చిన్న, మధ్య తరగతి కుటుంబాలకు లాభకరం. ఈ తేడాను గాడ్రెజ్ గుర్తించడు. ఆ అవసరం ఆయనకు లేదు. అందుకే రెంటినీ ఒకే గాటన కట్టి మాట్లాడుతున్నాడు.