ఉత్తరఖండ్ నుండి పాఠాలు -ది హిందు ఎడ్..


Coup leader, Ex CM (Congress) -Vijay Bahuguna

Coup leader, Ex CM (Congress) -Vijay Bahuguna

[Lessons from Uttarakhand శీర్షికన ఈ రోజు ప్రచురితం అయిన ది హిందు ఎడిటోరియల్ కు యధాతధ అనువాదం]

********

తొమ్మిది మంది కాంగ్రెస్ శాసన సభ్యులు విశ్వాస పరీక్షలో పాల్గొనకుండా సుప్రీం కోర్టు నిషేధం విధించిన దరిమిలా ఉత్తర ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్, అసెంబ్లీ పరీక్షలో నెగ్గడం ముందుగానే ఖాయం అయింది. మిగిలిన 27 మంది అనుయాయులు, ఆరుగురు సభ్యుల కూటమిల ఓట్లు ఆయన పరీక్షలో గెలిపించాయి. సుప్రీం కోర్టు ధృవీకరించిన ఈ ఫలితం, కాంగ్రెస్ లోని అంతర్గత అసమ్మతిని సొమ్ము చేసుకొని వైరి పక్షం నుండి దూకిన సభ్యుల నేతృత్వంలో గానీ స్వపక్షం నేతృత్వంలో గానీ ప్రభుత్వం నెలకొల్పడానికి భారతీయ జనతాపార్టీ తలపెట్టిన రాజకీయ దుస్సాహసానికి ముగింపు పలికింది. మార్చ్ లో విశ్వాస పరీక్ష జరగవలసి ఉండగానే ఆ పార్టీ నేతృత్వం లోని ప్రభుత్వం హడావుడిగా రాష్ట్రపతి పాలన విధించినప్పటినుండే తమ చర్య న్యాయబద్ధమైనదేనని న్యాయవ్యవస్ధను ఒప్పించలేకపోయింది. వారి పధకానికి రెండు న్యాయ సూత్రాలు ఆటంకంగా నిలిచాయి: ఫిరాయింపుపై ఉన్న నిషేధం, ప్రభుత్వ మెజారిటీని నిర్ధారించడంలో ‘ఫ్లోర్ టెస్ట్’ కు ఉన్న ప్రాధాన్యం. తమ నాయకత్వంతో విభేదించడానికి సభ్యులకు ఉన్న హక్కు ఎలాంటిదైనప్పటికీ ఇప్పటి చట్టం ప్రకారం దానిపై ఫిరాయింపు వ్యతిరేక నిబంధన పరిమితి విధించింది. ఉత్తర ఖండ్ లో ద్రవ్య బిల్లు ఆమోదం కోసం చర్యలు తీసుకోవడానికి ముందే రాష్ట్ర అసెంబ్లీలోని మెజారిటీ సభ్యులు -బి‌జే‌పి, కాంగ్రెస్ తిరుగుబాటు సభ్యులు కలిసి- ఓట్లను (మెజారిటీ-మైనారిటీలుగా) విభజించాలని రాతపూర్వకంగా కోరడంతో పరిస్ధితి సంక్లిష్టంగా మారింది. సభలో రావత్ మెజారిటీ కోల్పోయారన్న నిజం తప్పించరానిదే అయినప్పటికీ సదరు పరిణామాల నుండి తలెత్తిన గుణపాఠం ఏమిటంటే ఒక అనౌచిత్యం (సభ్యులను అనర్హులుగా చేయడంలో స్పీకర్ కి ఉన్న అధికారాలపై ఆధారపడి అధికారంలో కొనసాగడం) మరొక చట్ట విరుద్ధతను (ప్రభుత్వాన్ని కూలదొసే ప్రయత్నాలు విఫలం అయ్యాక రాష్ట్రపతి పాలన విధించడం) న్యాయబద్ధం చేయజాలదు.

రావత్ విషయానికి వస్తే, మద్దతు కోసం కొంతమంది ఎం‌ఎల్‌ఏలకు ఆయన లంచం ఇవ్వజూపారని చూపే ‘స్టింగ్ ఆపరేషన్’ పైన విచారణ చేయడంలో ముందుకు వెళ్లడానికే సి‌బి‌ఐ నిర్ణయించిన పక్షంలో ఇప్పటికీ ప్రాసిక్యూషన్ ఎదుర్కోవలసి ఉంటుంది. కాంగ్రెస్ తిరుగుబాటు ఎం‌ఎల్‌ఏలపై వేసిన అనర్హత వేటు విషయంలో సుప్రీం కోర్టు ఇదమిద్ధమైన అవగాహనకు ఇంకా రావలసి ఉన్నందున ఆయన ప్రభుత్వ పునరుద్ధరణ సైతం న్యాయ సవాళ్ళకు అతీతం ఏమీ కాదు. విస్తృత స్ధాయిలో ఉత్తర ఖండ్ సంక్షోభం పని చేస్తున్న ప్రజాస్వామ్య వ్యవస్ధకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తింది: సభలో మెజారిటీ కోల్పోయిన ముఖ్యమంత్రులు అధికారంలో కొనసాగడానికి ఫిరాయింపు వ్యతిరేక చట్టాన్ని ఆశ్రయించాలా? ఒక ప్రభుత్వం తన మెజారిటీ నిర్వహణకు అసౌకర్యంగా మారిన ఎం‌ఎల్‌ఏలను అనర్హులను చేయడం ఆమోదనీయమేనా? ఈ పరిస్ధితిని తిరగేసి చూస్తే, శాసన సభలో ఒక పార్టీ బలంలో భాగంగా ఉన్న ఒక వంతుమంది ప్రతిపక్షం ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు అనుమతించవచ్చా? బొమ్మై తీర్పు నిర్దేశించినట్లుగా ‘ప్రభుత్వ మెజారిటీని ఫ్లోర్ టెస్ట్ మాత్రమే నిర్ణయించాలి’ అన్న సూత్రం కొనసాగవలసిందే. కాగా ఫిరాయింపు అంశంలో స్పీకర్ కు పరిమితిలేని అధికారాలు కట్టబెట్టిన అంశాలపై పునరాలోచన చేయవలసిన సమయం వచ్చింది, ముఖ్యంగా అటువంటి ఆదేశాలు విశ్వాస పరీక్షను నేరుగా ప్రభావితం చేసేటప్పుడు. బి‌జే‌పి తాను ఎదుర్కొన్న తాజా అవమానం ద్వారా మళ్ళీ కనుగొన్నట్లుగా, బొమ్మై తీర్పు కేంద్ర ప్రభుత్వం మంత్రాంగాల నుండి రాష్ట్ర ప్రభుత్వాలకు చాలా వరకు రక్షణ కల్పించింది. కానీ రాజకీయ చట్రం వ్యాపితంగా పాలక పార్టీలు ఫిరాయింపు వ్యతిరేక చట్టాన్ని దుర్వినియోగం చేయడం పెరుగుతున్న పరిస్ధితి, పధక రచన సాగించే రాష్ట్ర ప్రభుత్వాల నుండి అసెంబ్లీలను కాపాడేందుకు కూడా ఒక భీమా రక్షణ అవసరం అని సూచిస్తోంది.

*********

[గొంగట్లో వెంట్రుకలు ఏరడం వల్ల ఫలితం ఏమిటో ఈ సంపాదకీయం తెలియజేస్తుంది.

9 మంది ఎం‌ఎల్‌ఏలు ఒక పార్టీ ప్రతినిధులుగా ఎన్నికైన వారు. వారు ఓం ప్రధమం ద్రవ్య బిల్లు ఆమోదంలో ప్రతిపక్షం వైపుకు దూకడం వల్లనే ఉత్తర ఖండ్ సంక్షోభం బద్దలయింది. ద్రవ్య బిల్లులోని అనేక అంశాలను అప్పటికే సభ ఆమోదించింది. వాటిపై చర్చలు జరగలేదు, ఓటింగూ (డివిజన్) కోరలేదు.  చివరి నిమిషంలో మిగిలి ఉన్న అంశాలను ఆమోదిస్తే ద్రవ్య బిల్లు ఆమోదం పూర్తవుతుంది అనగా డివిజన్ కోరడం వెనుక ఏ రాజకీయాలు పని చేశాయి. ఆ 9 మంది ఎం‌ఎల్‌ఏలు నిజంగా ద్రవ్య బిల్లు నచ్చకనే ప్రతిపక్షం వైపుకు వెళ్ళారా లేక బి‌జే‌పి మాయోపాయాలకు, కొనుగోళ్లకు లొంగి వెళ్ళారా? ఈ ప్రశ్నకు సమాధానం లేకుండా ఆ 9 మంది సభ్యుల హక్కుల గురించి మాట్లాడడం శుద్ధ దండగ వ్యవహారం.

కాంగ్రెస్ అసమ్మతి సభ్యులకు నాయకత్వం వహించింది మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ. విజయ్ బహుగుణను దించి హరీష్ రావత్ ను ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేతలు అధిష్టించారు. ఇక విజయ్ బహుగుణ, ఆయన అనుచరులు పదవీ వియోగ అసంతృప్తితో రగిలిపోయారు. సమయం చూసుకుని బి‌జే‌పి తో చేతులు కలిపారు. అధికారం తిరిగి చేజిక్కుంచుకోవడానికి పావులు కదిపారు. రాజ్యసభలో బలం పెంచుకోవడానికి చూస్తున్న బి‌జే‌పికి ఇది అందివచ్చిన అవకాశం.

ఇందులో ద్రవ్య బిల్లు లోని సానుకూల ప్రతికూలతలు గానీ, సభా సూత్రాలను గౌరవించడం గానీ, ప్రజల ప్రయోజనాలు గానీ ఏవీ లేవు. కేంద్రం లోని బి‌జే‌పి ప్రభుత్వం, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినట్లుగానే, రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసి తన ప్రభుత్వాలను ప్రతిష్టించే కార్యక్రమంలో నిమగ్నం అయి ఉన్నది. మొదటి అంకంలో అరుణాచల్ ప్రదేశ్ లో కానిచ్చి రెండో అంకాన్ని ఉత్తర ఖండ్ లో ఆరంభించారు. అప్పటికే అరుణాచల్ ప్రదేశ్ లో అనుభవం రీత్యా కాంగ్రెస్ జాగ్రత్త పడి తనకు అందుబాటులో ఉన్న అస్త్రాలను ప్రయోగించి గట్టు ఎక్కింది. కాంగ్రెస్ కంటే విభిన్నమైన పార్టీ అని చెప్పుకునే బి‌జే‌పి ఆ కాంగ్రెస్ రాసిన పుస్తకం నుండే ఒక్కో సూత్రాన్ని చేపడుతూ అమలు చేస్తూ వస్తోంది.

ఇలాంటి పార్టీల చర్యలతో నిండి పోయిన ‘విస్తృత రాజకీయ చట్రం’ దానికదే గొంగళి. ఆ గొంగళి తయారు కావడమే వెంట్రుకలతో తయారయింది. ఆ గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరడానికి పూనుకోవడం వల్ల నగుబాటు కావడమే మిగులుతుంది గానీ భలే లాజిక్కులు వెతికారన్న ప్రతిష్ట ఏమీ దక్కదు. ఈ సంపాదకీయం ఆ కోవలోనిదే. -విశేఖర్]

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s