‘కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు’ అని సామెత.
‘కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది’ ఇది కూడా సామెతే.
2014 సాధారణ ఎన్నికల్లో మొదటి సారి సంపూర్ణ మెజారిటీతో బిజేపిని అధికారంలోకి తెచ్చే వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి మొదటి సామెతలో లబ్ది పొందారు.
అధికారం చేపట్టాక మోడి దశ తిరిగినట్లే పరిణామాలు జరుగుతున్నాయి. 28 సీట్లు గెలిచిన ఢిల్లీ అసెంబ్లీలో రెండంటే రెండే సీట్లు దక్కించుకుని అతి చిన్న ఏఏపి పార్టీ చేతుల్లో చావు దెబ్బ తిన్నారా! అధికారం గ్యారంటీ అనుకున్న బీహార్ లో నితీష్-లాలూ ల చేతుల్లో భంగపడ్డారా! హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేలు పెట్టి కెలికి తాము ‘దళిత వ్యతిరేకులం’ అని ధృవపరుచుకున్నారా!
జేఎన్‌యూ లో చొరబడి ఖలీద్-అనిర్బన్-కన్హైయ్యా ల ముందు నైతికంగా భంగపడ్డారా! విద్యార్ధులను గెలవ లేక వైస్ ఛాన్సలర్ ని అడ్డం పెట్టుకుని విద్యార్ధులను రస్టికేట్ చేసి ప్రగతి నిరోధకులం అని చాటుకున్నారా! ఇప్పుడు కేరళ ఎన్నికల ప్రచారానికి వెళ్ళి “PoMoneModi” అని మొఖాన గుద్దినట్లు చెప్పించుకుంటున్నారు.
తమ రాష్ట్రాన్ని ‘God’s own country’ అని కేరళీయులు చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి రాష్ట్రాన్ని సోమాలియాతో పోల్చడమే కాకుండా ‘సోమాలియా కంటే ఘోరం’ అని అభివర్ణిస్తే ఈ ప్రజలు మాత్రం సహిస్తారు?
“కేరళలో నిరుద్యోగ రేటు జాతీయ సగటు కంటే కనీసం మూడు రెట్లు ఉన్నది. కేరళ షెడ్యూల్డ్ తెగల ప్రజల్లో పసి పిల్లల మరణాలు సోమాలియా కంటే ఘోరంగా జరుగుతున్నాయి” అని ప్రధాని నరేంద్ర మోడి కేరళ ఎన్నికల ప్రచారంలో వాపోయారు.
ఈ మాటలు కేరళ ప్రజలకు మింగుడు పడలేదు. కేరళను సోమాలియా కంటే తక్కువ స్ధాయిలో చూడడం వారి ప్రతిష్టని దెబ్బ తీయడంగా భావించారు. నిజానికి దేశంలో అత్యధిక విద్యావంతమైన రాష్ట్రంగా కేరళకు అనేక యేళ్లుగా ప్రతిష్ట ఉన్నది. ఇతర మానవాభివృద్ధి సూచికల్లో కూడా కేరళ ఉన్నత స్ధానాల్లో ఉన్నది. కేరళ ఆర్ధిక వృద్ధి జాతీయ సగటు కంటే ఎక్కువ. మానవ వనరుల అభివృద్ధ్లో గత అయిదేళ్లుగా ఉన్నత స్ధానంలో ఉన్నది.
అలాంటిది మోడి కోడిగుడ్డుకు ఈకలు పీకినట్లు ఎక్కడో చిన్న అంశాన్ని తవ్వి తీసి రాష్ట్రాన్ని అవమానించడం తగదని వాళ్ళు భావించారు. సోమాలియాతో పోల్చడం అంటే ఇన్నాళ్లూ విద్యావంతమైన రాష్ట్రంగా పొగడ్తలు అందుకున్న రాష్ట్రాన్ని సోమాలియాతో పోల్చడం, పైగా సోమాలియా కంటే ఘోరం అనడం, అక్కడికి గుజరాత్ ఏదో విరగదీస్తున్నట్లు, వారికి సుతరామూ నచ్చలేదు.
ఫలితంగా మోడీకి వ్యతిరేకంగా ట్విట్టర్ లో, ఫేస్ బుక్ లో విమర్శల వరద పారింది. గుజరాత్ గురించిన హేళనలు వెల్లువెత్తాయి. “పో కొడుకా, మోడీ” అని అర్ధం వచ్చేటట్లుగా #PoMoneModi హేండిల్ తో మోడి ప్రచారాన్ని తిరస్కరిస్తున్నారు. Po Mone అన్నది కేరళలో ఒక హిట్ సినిమా పేరు. దాని అర్ధం “go back son” అని. దానిని మోడికి వర్తింప జేస్తూ ‘ఇక చాల్లే పో బిడ్డా’ అన్నట్లుగా ట్విట్టర్ హ్యాండిల్ తయారు చేశారు.
గుజరాత్ లో ఆడపిల్లల పౌష్టికాహార లోపాన్ని ఎత్తి చూపిస్తూ ప్రధాన మంత్రిని హేళన చేసేందుకు సైతం వెనుదీయలేదు. గుజరాత్ లో బాలికల్లో పౌష్టికాహార లోపాన్ని ప్రశ్నించిన ఒక అమెరికా విలేఖరికి సమాధానం ఇస్తూ మోడీ ఆడ పిల్లలు అందం పట్ల ఉన్న ఆసక్తితో పాలు తాగడం మానేస్తున్నారని, తల్లి దండ్రుల మాటలు పెడచెవిన పెడుతున్నారని అందువల్లనే ఆడ పిల్లల్లో పౌష్టికాహార లోపం ఎక్కువగా ఉన్నదని సమాధానం ఇచ్చారు. ఆ సమాధానానికి విలేఖరి మరి మాట్లాడలేకపోయారు.
ఈ ఘటనను మోడీకి కేరళీయులు గుర్తు చేశారు. గుజరాత్ ఆడ పిల్లలకు పోషకాహారం ఇవ్వలేని వ్యక్తి కేరళ గిరిజనులకు ఇస్తారా అని ప్రశ్నించారు.
ట్విట్టర్ తిరుగుబాటు
‘నన్ను జనం ఎలా చూస్తారు?’ అని ప్రశ్నించుకుంటూ తన ఫోటోను ఇచ్చిన ఓ ట్విట్టర్ ఖాతాదారు ‘మోడి నన్ను ఎలా చూస్తారు?’ అని ప్రశ్నిస్తూ ఒక సోమాలియా యువకుడి ఫోటోను ప్రచురించారు.
ఇంకో ఖాతాదారు “కేరళ ఇండియాకు గర్వకారణం. మెరుగైన స్త్రీ, పురుష నిష్పత్తి, అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రం #PoMoneModi” అని వ్యాఖ్యానించారు.
“తన కంట్రీ (రాష్ట్రం అని భావం) గురించే ఏదేదో చెప్పిన మోడీకి కేరళను సోమాలియాతో పోల్చడం మోడీకి విషయం కాదు. #PoMoneModi” అని మరొకరు వ్యాఖ్యానించారు.
తన డిగ్రీ గురించి ‘హామ్ ఫట్’ అంటూ మేజిక్ చేయబోతున్న మోడిని ఉద్దేశిస్తూ అరుణ్ జైట్లీ “మీ వద్ద అసలైన కాలేజీ డిగ్రీ ఉన్నదని చెప్పడానికి అది సరిపోదనుకుంటాను” అని వ్యాఖ్యానిస్తున్న కార్టూన్ ని మరొక వ్యక్తి కార్టూన్ పోస్ట్ చేశారు. #PoMoneModi అనడం మర్చిపోలేదు.
“ప్రియమైన నరేంద్ర మోడి, ఇటాలియన్ మెరైన్లను ఏ జైలులో ఉంచారో మీ తదుపరి ప్రసంగంలో కేరళ ప్రజలకు చెప్పండి. #PoMoneModi” అని మరో వ్యక్తి కోరారు. ఇటాలియన్ మెరైన్ లలో ఒకరు గుండె నొప్పికి చికిత్స అంటూ వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదు. మరో మెరైన్ ని ఇటలీ ఎంబసీలో సకల మర్యాదలతో నివసిస్తున్నారు. ఇద్దరు భారతీయులను చంపిన ఇటలీ మెరైన్లను జైలులో పెట్టాలని మోడీ కూడా భావించలేదని ఆయన పరోక్షంగా గుర్తు చేశారు.
“కేరళకు మోడి తరచుగా ఎగురుకుంటూ వస్తున్నారో మనకు ఇప్పుడు అర్ధం అయింది. కేరళ = సోమాలియా అంటే ట్రావెల్ లిస్ట్ లో మరొక దేశం చేరిందన్నమాట! #PoMoneModi” అని మరో వ్యక్తి వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి దేశాన్ని వదిలి పెట్టి తరచుగా విదేశాలకు ఎగిరి వెళ్లడాన్ని గుర్తు చేస్తూ కేరళ కూడా సోమాలియాగా మరో దేశంగా భావిస్తున్నందునే మోడి తరచుగా కేరళ ఎగిరి వస్తున్నారని ఈ వ్యాఖ్యాత భావన.
“భారత దేశం ఇప్పుడు కేరళ నమూనా పైనే ప్రధానంగా దృష్టి పెట్టాలి. గుజరాత్ వంక చూస్తే అత్యల్ప లింగ నిష్పత్తి, తక్కువ అక్షరాస్యతల వైపు చూస్తున్నట్లే. #PoMoneModi” అని మరో వ్యాఖ్యాత. మోడి ప్రధాని అయినప్పటి నుండి బిజేపి గుజరాత్ ను అభివృద్ధి నమూనాగా చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు కూడా బిజేపి గుజరాత్ అభివృద్ధిని నమూనాగా ప్రచారం చేసింది. అతి తక్కువ ధరలకు ప్రభుత్వ, రైతుల భూములను బడా కార్పొరేట్లకు కట్టబెట్టడం, కార్మిక చట్టాలను రద్దు చేయడం లాంటి విధానాల వల్ల ప్రజలు ఆదాయ వనరులు కోల్పోయి వారి ఆడ పిల్లలకు సరైన తిండి పెట్టలేని పరిస్ధితే దాపురిస్తుంది. గుజరాత్ నమూనా అంటే అదే.
“కేరళలో ప్రతి ఒక్కరికీ సరిపోయినంత తిండి ఉన్నది. గుజరాత్ లో నేమో పోషకాహార లోపాన్ని ఫ్యాషన్ ఎంపికల పైకి నెట్టివేస్తున్న పరిస్ధితి. #PoMoneModi” అని మరో వ్యాఖ్యాత వ్యాఖ్యానించారు. ఆయన తన పేరును Entire Brumby అని చెప్పడం విశేషం. మోడి ఎంఏ సర్టిఫికేట్ లో ‘Entire Political Science’ అని ఉండడాన్ని ఈ ట్విట్టర్ కూతదారుడు ఎత్తి చూపిస్తున్నట్లున్నాడు.
“సోమాలియా మోడీ కి ‘Foot in the mouth’ మూమెంట్ #PoMoneModi” అని ఓ మహిళ వ్యాఖ్యానించింది.
“నువ్వు మా ఇంటికి వచ్చి, నన్నే అవమాన పరిచి, ఆ తర్వాత నా ఇంట్లోనే గది అద్దెకు ఇమ్మని అడుగుతావా? #PoMoneModi” అని మరొకరు పోస్ట్ చేశారు.
“ఈ క్లోన్ (జోకర్) కి ఉన్నది కుండీ మొక్కలకి ఉండే ఐక్యూ మాత్రమే. ఈయన అమెరికా వెళ్ళిపోయి ఒక మొటేల్ నడుపుకోవడం మంచిది. ఆయనకు ఉన్న అర్హతలకు అదే సరైనది. #PoMoneModi” అని ఒకరు పోస్ట్ చేశారు. మోడి విద్యార్హతలను ఈ వ్యాఖ్యాత పరోక్షంగా ప్రశ్నిస్తున్నారు.
For more interesting tweets, please see the figures or go for #PoMoneModi
ప్రధాని కుర్చీకి అవమానం
ఇవి కాకుండా కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాంది ప్రధానిని తీవ్రంగా తప్పు పడుతూ లేఖ రాశారు. ప్రధాని ఆధారాలు లేకుండా మాట్లాడారని తప్పు పట్టారు. ప్రధాన మంత్రి స్ధాయికి తగని వ్యాఖ్యలు చేశారని నిందించారు. “దేశంలో సోమాలియా లాంటి రాష్ట్రం ఒకటి ఉన్నదని చెప్పడం ప్రధాన మంత్రికి సిగ్గు కదా?” అని ఆయన ప్రశ్నించారు.
ప్రధాన మంత్రి పీఠాన్ని జవహర్ లాల్ నెహ్రూ, డా మన్మోహన్ సింగ్ లాంటి ఉద్దందులు అధిష్టించారు. మీరు వచ్చి ఆ పీఠాన్ని తీవ్రంగా దగజార్చి అవమానపరిచారని చెప్పడానికి బాధపడుతున్నారు” అని ఊమెన్ చాంది తన లేఖలో నిరసించారు.
“కన్నూర్ జిల్లాలో పెరవూర్ వద్ద ఒక పిల్లాడు చెత్త కుప్పల నుండి ఆహారం వెతికి తింటున్నాడని ఆ దృశ్యం మిమ్మల్ని కలిచివేసిందని మీరు చెప్పారు. అలాంటి ఘటనలు దేశంలో ఎక్కడ జరిగినా అవి నిజంగా జరిగాయా లేదా అని నిర్ధారించుకునే అవకాశం మీకు ఉన్నప్పటికీ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడారు.
తాము వెంటనే పోలీసుల చేత, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి విభాగం చేత దర్యాప్తు చేశాం. ప్రధాని చెప్పిన వేస్ట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ వద్దకు ఎవరూ ఆహారం కోసం వెళ్లరని, కాగితాలు తదితర వృధాలను ఏరుకోవడం కోసమే వెళ్తారని వారి దర్యాప్తులో తేలినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వృధా పదార్ధాలను అమ్ముకుని వారు హోటళ్ళలో ఆహారం కొని తింటారని వారు చెప్పారు.
“నిజాలు ఇలా ఉండగా అటువంటి పచ్చి అబద్ధాలు చెప్పడం వెనుక మీ లక్ష్యం ఏమిటి? చద్ది అన్నాన్ని కేరళలో ఏ ఒక్క పిల్లా/పిల్లాడు తినే అవసరం లేదని నేను చెప్పగలను. కేరళలో 25.02 లక్షల పాఠశాల విద్యార్ధులకు ఉచిత మధ్యాహ్న భోజనం ఇస్తున్నాం. రోజు మార్చి రోజు గుడ్డు, పాలు ఇస్తున్నాం. గత 5 యేళ్లుగా 94 లక్షల మందికి కిలో రు 1/- చొప్పున బియ్యం ఇస్తున్నాం. అలా చేసిన రెండో రాష్ట్రంగా ప్రతిష్ట అందుకున్నాం” అని ఊమెన్ చాంది తమ ఘనతను ఏకరువు పెట్టుకున్నారు.
ఇంతకీ చెత్త కుప్పల్లో వృధా పదార్ధాలు ఏరుకుని అమ్ముకోవడం ద్వారా హోటల్స్ నుండి తిండి కొనుక్కుని తినే పిల్లలు కూడా కేరళలో ఉన్నారని ఊమెన్ చాంది అంగీకరించారు. మధ్యాహ్న భోజనం పెడుతున్న చదువు మానుకుని తిండి కోసం వృధాలను ఏరుకోవలసిన అవసరం రావడం కూడా పిల్లలకు ఏమంత గొప్ప వ్యవహారం కాదు. అది కూడా ప్రభుత్వాల వైఫల్యమే. నిజానికి వేస్ట్ డంప్ నుండి ఆహారం వెతక్కపోవచ్చు గాన్నీ వాళ్ళు వెతుకుతున్న వృధా పదార్ధాలు కూడా ఆహారం కోసమే కావడం ఊమెన్ చాంది ప్రభుత్వానికి సిగ్గు చేటు కాకపోవడం ఆశ్చర్యకరం.
గుజరాత్ బాలికలు (వయసు వచ్చిన ఆడ పిల్లలు కాదు సుమా) అందం కోసం పాలు తాగడం మానేశారని చెప్పడం మోడీకి ఎంత సిగ్గు చేటో, వృధాలు ఏరుకొని వాటిని అమ్మి వచ్చిన డబ్బుతో హోటల్స్ లో అన్నం కొనుక్కుని తినడం కూడా ఊమెన్ చాందికి అంతే సిగ్గు చేటు!
వేస్ట్ డంప్ నుండి ఆహారం వెతక్కపోవచ్చు గాన్నీ వాళ్ళు వెతుకుతున్న వృధా పదార్ధాలు కూడా ఆహారం కోసమే కావడం ఊమెన్ చాంది ప్రభుత్వానికి సిగ్గు చేటు కాకపోవడం ఆశ్చర్యకరం-ఇక్కడ ఈ వాఖ్యంలో మోదీకి సమాధానం గా చూడడం వరకు ఒక అంశం అయితే,మధ్యాహ్న భోజనం ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది మరి ఉదయం,రాత్రి భోజనాల మాటేమిటి? ఆ కోణంలో బాలుడి అంశాన్ని చూడవచ్చు కదా!