చట్టం ముందు అందరూ సమానులే అని రాజ్యాంగం చెబుతుంది.
ఆచరణ ఇందుకు పూర్తిగా భిన్నం అని రాజకీయ పార్టీల, నాయకుల రాజకీయ ఆచరణ రుజువు చేసింది.
ఏఏపి లాంటి జోరీగలు లేకపోతే ఈ ఆటలు ఇంకా కొనసాగుతాయి.
ఏఏపి ఆవిర్భావం కుళ్ళిపోయిన రాజకీయ పరిస్ధితుల నుండి పుట్టిన అనివార్యత!
రాజకీయ, సామాజిక, ప్రాకృతిక పరిస్ధితులు ఎల్లప్పుడూ ఒక సమతాస్ధితి (ఈక్విలిబ్రియమ్) కోసం అంతర్గతంగా కృషి చేస్తూ ఉంటాయి. సమతా స్ధితి తప్పినప్పుడు తిరిగి సమతా స్ధితి పొందడం కోసం వివిధ స్ధాయిల్లో వ్యవస్ధలను అభివృద్ధి చేసుకుంటుంది.
అన్నిరకాలుగా దిగజారిపోయిన బూర్జువా రాజకీయ వ్యవస్ధ, ప్రత్యామ్నాయ కార్మికవర్గ విప్లవాచరణ కొరవడిన నేపధ్యంలో తన పరిమితుల్లోనే తయారు చేసుకున్న ప్రత్యామ్నాయమే ఆం ఆద్మీ పార్టీ.
పాతుకుపోయిన అసమాన, ఆధిపత్య, అణచివేత వ్యవస్ధకు ఏఏపి లాంటి పార్టీలు జోరీగ గా పరిణమించడంలో ఆశ్చర్యం లేదు. దానినే అరవింద్ జైట్లీ లాంటి వారు అందంగా ‘రాజకీయ సాహసవాదం, సుపరిపాలనకు ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించడం’ గా విమర్శిస్తున్నారు.
ఎన్ని భాషాలంకార పరదాల మాటున దాచినా అబద్ధం నిజం కాజాలదు; దురాచారణ సదాచారణ కానేరదు; గడ్డి పువ్వు మల్లె పూవు గా మారదు.
ప్రజల ప్రయోజనాల రీత్యా, ఏఏపి ఆచరణ ఒక చారిత్రక అవసరం. పార్లమెంటరీ రాజకీయ వ్యవస్ధ బూటకత్వాన్ని వెల్లడి చేసేందుకు ఏఏపి, ఒక అస్త్రం కావాలి.
మరింత ఆచరణ -కనీసం సంపూర్ణ పాలనాధికారాలు కలిగిన ఒక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి పరీక్షలకు నిలిచే వరకూ అయినా- లేనిదే ఏఏపి పై అప్పుడే ఒక ముక్తాయింపు నిర్ణయానికి రాలేము.