చర్చ: వ్యవసాయ కౌలు -18


Family labour

భారత వ్యవసాయ రంగంలో మార్పులపై ఒక నోట్ -పార్ట్ 18

(After 17th part…..)

B) వ్యవసాయ కౌలు

59వ రౌండ్ ఎన్‌ఎస్‌ఎస్ (నేషనల్ శాంపిల్ సర్వే) సర్వే ప్రకారం భారత వ్యవసాయంలో అమలులో ఉన్న వివిధ కౌలు నిబంధనలు ఇవీ:

  1. స్ధిర ధనం (Fixed Money)
  2. స్ధిర పంట ఉత్పత్తి (Fixed Produce)
  3. పంట ఉత్పత్తిలో ఒక వాటా (Share of Produce)
  4. సర్వీస్ కాంట్రాక్టు (Under service contract సేవకుడు/ఉద్యోగికి అతని  సేవలకు ప్రతిఫలంగా కొంత భూమి సాగు చేసుకొమ్మని ఇవ్వడం)
  5. పంట ఉత్పత్తిలో వాటా మరియు ఇతర నిబంధన/లు (For share of produce together with other term)
  6. అధిక వడ్డీ తనఖా (Under usufructuary mortgage)
  7. బంధుత్వ సంబంధాల రీత్యా షరతులు లేని కౌలు (From relations under no specific term)

“పెట్టుబడిదారీ భూమి అద్దె మూలం” (Genesis of Capitalist Ground-Rent) చాప్టర్ లో కారల్ మార్క్స్ ఇలా పేర్కొన్నారు.  “వాణిజ్యం, పట్టణ పరిశ్రమ, సాధారణ స్ధాయి సరుకుల ఉత్పత్తి తద్వారా డబ్బు చలామణీలు పరిగణించదగిన స్ధాయిలో అభివృద్ధి చెందాకనే వస్తు రూపేణా జరిగే వడ్డీ చెల్లింపులు మొదట అక్కడక్కడా ఆ తర్వాత జాతీయ స్ధాయి పరిమాణంలో డబ్బు రూపేణా జరిగే వడ్డీ చెల్లింపులుగా పరివర్తన చెందుతుంది.” (Capital III; 1984, P-797)

డబ్బు రూపేణా కౌలు చెల్లించడం గురించి చర్చిస్తూ మార్క్స్ ఇంకా ఇలా తెలిపారు “కౌలు, డబ్బు-వడ్డీ రూపాన్ని సంతరించుకున్న వెంటనే తద్వారా కౌలు చెల్లించే రైతు మరియు భూస్వామి మధ్య సంబంధం ఒక కాంట్రాక్టు ద్వారా కుదిరిన ఒప్పందంగా మారిపోతుంది -ఇటువంటి పరిణామం సాధారణంగా ప్రపంచ మార్కెట్టు, వాణిజ్యం, మాన్యుఫాక్చరింగ్ రంగం సాపేక్షికంగా నిర్ధిష్ట ఉన్నత స్ధాయికి అభివృద్ధి చెందినపుడే సాధ్యం అవుతుంది- భూములను పెట్టుబడిదారులకు లీజుకు ఇవ్వడం కూడా అనివార్యంగా తలెత్తుతుంది… ఈ రూపం సాధారణ నియమంగా మారడం అన్నది ఫ్యూడల్ ఉత్పత్తి విధానం పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలోకి పరివర్తన చెందే కాలంలో ప్రపంచ మార్కెట్ లో ఆధిపత్యం వహించే దేశాలలో మాత్రమే సాధ్యపడుతుంది. భూస్వాములకు, వాస్తవంగా భూములు దున్నేవారికి మధ్య పెట్టుబడిదారీ కౌలుదారు అడుగు పెట్టినప్పుడు పాత గ్రామీణ ఉత్పత్తి విధానం నుండి ఉద్భవించే సంబంధాలన్నీ చెల్లాచెదురవుతాయి. (Capital III; 1984, P-799)

భూస్వామ్య విధానం నుండి పెట్టుబడిదారీ విధానంలోకి పరివర్తన చెందే కాలంలో ప్రపంచ మార్కెట్ లో ఆధిపత్యం చెలాయించని ఇండియాలో కౌలు పరివర్తన పశ్చిమ దేశాలలో వలే జరగడం సాధ్యం కాకపోవచ్చు.

పంట ఉత్పత్తిలో వాటాను కౌలుగా చెల్లించే కమతాలు 40 శాతం, స్ధిర కౌలు (ధనం) కమతాలు 29.5 శాతం, స్ధిర పంట ఉత్పత్తి కౌలు కమతాలు 20 శాతం ఉన్నాయని 59వ రౌండ్ ఎన్‌ఎస్‌ఎస్ సర్వే వెల్లడి చేసింది. 1991-92 నుండి ‘పంటలో వాటా’ ను కౌలుగా చెల్లించే కమతాల భాగం (40%) లో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోంది. ఇతర నిబంధనలను ఫణంగా పెడుతూ ‘స్ధిర ధనం’, ‘స్ధిర పంట వాటా’ కౌలు పద్ధతులు పెరుగుతూ వచ్చాయి.

స్ధిర డబ్బును కౌలుగా చెల్లించే పద్ధతిని పెట్టుబడిదారీ భూమి అద్దె తో సమానం చేసి చూడరాదు. ఎందుకంటే “డబ్బు అద్దె మరియు పెట్టుబడిదారీ భూమి-అద్దెల మధ్య ఖచ్చితమైన తేడాను తప్పనిసరిగా గుర్తించాలి. పెట్టుబడిదారీ భూమి-అద్దె వ్యవసాయంలో పెట్టుబడిదారులు మరియు వేతన కార్మికులు ఉనికిలో ఉన్నట్లు భావిస్తుంది; డబ్బు అద్దె (స్ధిర మొత్తంలో చెల్లించే డబ్బు కౌలు) ఆధారిత రైతులు ఉనికిలో ఉన్నట్లు పరిగణిస్తుంది.” (Lenin Collected Works; Vol 03; Chapter II: The Differentiation of the Peasaantry – Development of Capitalism in Russia; Notes 4)

పెట్టుబడిదారీ అద్దెను లెనిన్ ఇలా వివరించారు “అదనపు విలువలో ఉపాధి కల్పనాదారుల (పెట్టుబడిదారుల) లాభాన్ని తీసివేయగా మిగిలిన భాగమే అది (పెట్టుబడిదారీ అద్దె); కాగా రైతు, భూమి యజమానికి అదనపు విలువగా చెల్లించేదాని మొత్తం ఖరీదే డబ్బు కౌలు.” (Ibid)

కనుక డబ్బు రూపంలో చెల్లించే స్ధిర కౌలు/అద్దె ను మరింత విశ్లేషించడం అవసరం.

అయితే పెద్ద కమతాలకు సంబంధించి అత్యధికంగా ఉనికిలో ఉన్న సాధారణ కౌలు రూపం -స్ధిర ఉత్పత్తి వాటా.  ఈ స్ధిర ఉత్పత్తి వాటా అనేక చోట్ల బలవంతపు వానిజ్యీకరణకు సంబంధించిన అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అది పెట్టుబడిదారీ సంబంధాన్ని ఎంత మాత్రం ప్రతిబింబించదు. పైగా 16 శాతం కౌలు కమతాలలో నిబంధనలు ఏమిటో రికార్డు కాలేదు. నమోదు కానీ కేటగిరీతో సహా ‘ఇతరములు’ కేటగిరీ కింద 32 శాతం కమతాలు ఉన్నట్లు సర్వే తెలిపింది.

పంజాబ్ (దేశంలో 2 శాతం భూభాగం) & హర్యానాలో 70 శాతం పైగా కమతాలు ‘స్ధిర డబ్బు’ కౌలు పద్ధతి కింద ఉన్నది. ఒక్క పంజాబ్ వరకు తీసుకుంటే ‘స్ధిర డబ్బు’ పద్ధతి 79 శాతంగా నమోదయింది. కానీ ఒరిస్సాలో 73 శాతం పైగా ‘పంటలో వాటా’ (sharecropping) పద్ధతి కింద సాగు అవుతుండగా జార్ఖండ్ తో సహా బీహార్ లో 67 శాతం, అస్సాంలో 55 శాతం, పశ్చిమ బెంగాల్ లో 35%-40% వరకు కమతాలు ‘పంటలో వాటా’ కింద సాగు అవుతున్నాయి. గుజరాత్, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ తో సహా ఇతర దక్షిణాది రాష్ట్రాలలో ‘పంటలో స్ధిర వాటా’ పద్ధతి అధికంగా అమలులో ఉన్నది.

భారత వ్యవసాయంలో ఇంతవరకు కౌలు యొక్క ప్రధాన రూపం కారల్ మార్క్స్ వివరించిన పెట్టుబడిదారీ భూమి అద్దె రూపంతో ఏకీభవించడం లేదు. దానికి బదులుగా పరివర్తన రూపంలోని అద్దెగా ఉన్నట్లు కనిపిస్తోంది. “ఒకవైపు పంట కౌలు దారు (sharecropper పద్ధతిలో కౌలు సాగు చేసే రైతు) తన సొంత శ్రమను వెచ్చించినా సరే లేదా ఇతరుల (కూలీల) శ్రమను వెచ్చించినా సరే, పంట ఉత్పత్తిలో ఒక భాగాన్ని, ఒక శ్రామికుడి (కూలీ)గా కాకుండా శ్రమ సాధనాలలోని ఒక వాటాకు యజమానిగా మాత్రమే సొంతం చేసుకుంటాడు. మరో వైపు భూమి యజమాని కేవలం భూమిపై యాజమాన్యం ద్వారా మాత్రమే కాకుండా పెట్టుబడిని రుణంగా ఇచ్చిన వాడిగా కూడా పంటలో ఒక భాగాన్ని సొంతం చేసుకుంటాడు.” (Capital III, 1984, P-803)

[పరివర్తన రూపంలోని అద్దె అని కారల్ మార్క్స్ వివరించినది ఫ్రాన్స్, ఇటలీలలో ఒకటి రెండు రాష్ట్రాలలో 1830 ల నుండి అమలులోకి వచ్చిన షేర్ క్రాపింగ్ గురించి. మెటాయాజ్ పద్ధతిగా దీనిని పిలుస్తారు. ఈ పద్ధతిలో కౌలుదారుతో పాటు భూమి యజమాని కూడా చురుకుగా ఉత్పత్తి క్రమంలో పాల్గొంటాడు.

భూమి యజమాని ఉత్పత్తి సాధనాలు -పశువులు, విత్తనాలు, ఎరువులు మొ.వి- మొత్తాన్ని లేదా కొంత భాగాన్ని సరఫరా చేస్తాడు. కౌలు రైతు ఉత్పత్తి పరికరాలను సరఫరా చేస్తాడు. పశువులు, విత్తనాల వాటిలో ఒక భాగాన్ని కూడా కౌలు రైతు సరఫరా చేయవచ్చు. భూమి శిస్తు, ఇతర పన్నులను ఇద్దరూ నిర్దిష్ట వాటాలుగా గానీ, పూర్తిగా ఒకరు గానీ చెల్లిస్తారు.

పంటను కౌలుదారు, భూ యజమాని సాధారణంగా చెరి సగం పంచుకుంటారు. కొన్ని చోట్ల భూమి యజమాని వాటా 2/3 వంతు ఉండవచ్చు లేదా 1/3 వంతు కూడా ఉండవచ్చు. నేల ఉత్పాదకత, ఉత్పత్తి సాధనాల పంపకం తదితర పరిస్ధితులపై ఆధారపడి ఈ పంపకం వాటాలు నిర్ణయం అవుతాయి. (Theodora ఎన్ సైక్లోపీడియా నుండి)

ఇటువంటి sharecropping పద్ధతిని కౌలు ఒరిజినల్ రూపానికీ పెట్టుబడిదారీ అద్దె రూపానికీ మధ్య ఉన్న పరివర్తన అద్దె/కౌలు రూపంగా మార్క్స్ వివరించారు.

అయితే భారత దేశంలో అమలులో ఉన్న sharecropping, కారల్ మార్క్స్ వివరించిన మెటాయాజ్ sharecropping ఒకటి కాదు. భూమి యజమాని కూడా ఉత్పత్తి క్రమంలో చురుకుగా -సాగు కోసం కొంత పెట్టుబడి సమకూర్చడం, పశువులు, విత్తనాలు లాంటి ఉత్పత్తి సాధనాలలో ఒక వాటా సమకూర్చడం- పాల్గొనడం జరగడం లేదు. గతంలో కొంత వరకు ఇది ఉన్నప్పటికీ ఇప్పుడు దాదాపు అదృశ్యం అయింది. NSSO చెప్పిన sharecropping లక్షణాలు మెటాయాజ్ sharecropping లక్షణాలు ఒకటేనా అన్నది ధ్రువపరుచుకోకుండా ‘భారత వ్యవసాయంలో పరివర్తన రూపంలోని అద్దె ఉన్నట్లు కనిపిస్తోంది’ అని చెప్పడం సరికాదు.

NSSO సర్వే sharecropping లేదా share of produce ను ఇలా నిర్వచించింది.

“It may be noted here that leasehold under crop-sharing basis meant that the owner of land received a stipulated share of the produce but he did not participate in the work nor did he manage or direct or organize the agricultural operations on the plot of land which he had leased out.” ( NSS Report No. 491: Household Ownership Holdings in India, 2003)

తెలుగులో:

“ఇక్కడ ‘పంటలో వాటా’ -crop-sharing- ప్రాతిపదికన కౌలుకు ఇచ్చే పద్ధతిలో పంట ఉత్పత్తిలో నిర్దిష్ట వాటాను భూమి యజమాని సొంతం చేసుకోవడమే తప్ప అతను వ్యవసాయ పనిలో పాల్గొనడు; అతను తాను కౌలుకు ఇచ్చిన భూమిలో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహించడం గానీ నిర్దేశించడం గానీ ఏర్పాటు చేయడం గానీ చేయడు.”

ఈ నిర్వచనం ప్రకారం ఒరిస్సా, బీహార్, జార్ఖండ్, గుజరాత్, 4 దక్షిణ భారత రాష్ట్రాలలో అత్యధికంగా అమలులో ఉన్న sharecropping కౌలు విధానం, కారల్ మార్క్స్ చెప్పిన మెటాయాజ్ sharecropping కాదని స్పష్టం అవుతోంది. -అను]

(To be continued…….)

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s