ఇదిగో డిగ్రీ పట్టా -బి‌జే‌పి; అబ్బే ఫేక్ -ఏ‌ఏ‌పి


Sha, Jaitley display certificates

Sha, Jaitley display certificates

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి బి‌ఏ పట్టా వ్యవహారం రసకందాయంలో పడింది. బి‌జే‌పి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీలు ప్రత్యేకంగా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి ‘ఇవిగో ప్రధాని పట్టాలు’ అని ప్రదర్శించారు. ఏ‌ఏ‌పి నేత కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అయితే ఏ‌ఏ‌పి వెనక్కి తగ్గలేదు. అమిత్ షా, అరుణ్ జైట్లీల విలేఖరుల సమావేశం ముగిసిన నిమిషాల లోనే తానూ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. పట్టాలలో ఉన్న లొసుగులను ఎత్తి చూపారు. మోడి బి‌ఏ, ఎం‌ఏ పట్టాలు ఫోర్జరీ అని పునరుద్ఖాటించారు. ఫోర్జరీ పత్రాలు చూపిస్తున్న ప్రధాని, బి‌జే‌పి నేతలు దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

విలేఖరుల సమావేశంలో అమిత్ షా, అరుణ్ జైట్లీలు ఒకింత గంభీర ప్రసంగాలు చేశారు. ప్రజా రాజకీయాలను ఏ‌ఏ‌పి దిగజార్చిందని అమిత్ షా ఆరోపించారు. ప్రధాన మంత్రి డిగ్రీ పట్టాల విషయమై తాము విలేఖరుల సమావేశం పెట్టవలసి రావడమే ‘రాజకీయాలను దిగజార్చడం’గా ఆయన వాపోయారు.

“ప్రధాన మంత్రి విద్యార్హతల స్ధాయిని స్పష్టం చేయడానికి మేము విలేఖరుల సమావేశం పెట్టవలసి రావడం దురదృష్టకరం” అని అమిత్ షా బాధపడ్డారు.

“ఏ‌ఏ‌పి చేసిన నిరాధార ఆరోపణల వలన ప్రజా రాజకీయాలు (public discourse) అధమ స్ధాయికి దిగజారాయి” అని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మరో రకంగా బాధపడ్డారు. “రాజకీయ సాహసిక వాదం, సుపరిపాలనకు ప్రత్యామ్నాయంగా ముందుకు తెస్తున్నారు” అని వాపోయారు.

ఈ సందర్భంగా మీడియాకు వారు హితోపదేశం చేశారు. ఇలాంటి ఆరోపణలకు ప్రచారం కల్పించవద్దని హితవు పలికారు. వారికి వ్యతిరేకంగా పరిణమించే ఏ వార్తకూ మీడియా ప్రచారం కల్పించకూడదన్నమాట!

ఓ వైపు ప్రధాన మంత్రి డిగ్రీ పట్టాల గురించి వివరణ ఇవ్వవలసి రావడం అంటేనే “ప్రజా రాజకీయాలను దిగజార్చడం’ గా అభివర్ణిస్తూనే మరో వైపు ఏ‌ఏ‌పి నేతల డిగ్రీ పట్టాలను ప్రస్తావించారు అరుణ్ జైట్లీ. “ఏ‌ఏ‌పి నేతలు ఫేక్ డిగ్రీలు కలిగి ఉన్నారు. అలాంటి పార్టీ ఈ ఆరోపణలు చేయడం ఏమిటి?” అని ఆయన ప్రశ్నించారు.

ప్రధాన మంత్రి డిగ్రీ పట్టాపై వివరణ ఇవ్వడం ‘ప్రజా రాజకీయాలను దిగజార్చడం’ అయినప్పుడు ఏ‌ఏ‌పి మంత్రుల డిగ్రీ పట్టాలను ప్రస్తావించడం ‘ప్రజా రాజకీయాలను దిగజార్చడం’ కాకుండా ఎలా పోతుంది? ఏ‌ఏ‌పి నేతలు దిగజారారన్న ఆరోపణకు అంగీకరిస్తే ఆ దిగజారుడు కార్యక్రమంలో అమిత్ షా, అరుణ్ జైట్లీ లు కూడా ఉన్నారన్నది నిర్వివాదాంశం.

కానీ వాస్తవం ఏమిటి? డిగ్రీ పట్టాలపై చర్చ లేవనెత్తడం దానికదే దిగజారుడు కాబోదు. పరీక్షలకు హాజరు కాకుండా, బి‌ఏ, ఎం‌ఏ సబ్జెక్టులు వాస్తవంగా చదవకుండా అవి ఉన్నట్లు చెప్పుకోవడమే అసలు దిగజారుడుతనం. అలాంటి దిగజారుడు పనికి ప్రధాన మంత్రి పూనుకున్నారా లేదా అన్నదే ఇప్పటి చర్చ.

ప్రధాన మంత్రి విద్యార్హతల గురించి గత సం. నుండే చర్చోపచర్చలు, వాదోపవాదాలు సాగుతున్నాయి. సంవత్సర కాలం నుండి చర్చ జరుగుతున్నప్పటికీ తన డిగ్రీ, పి‌జి పట్టాలపై వివరణ ఇవ్వడానికి ప్రధాన మంత్రి పూనుకోలేదు. ఇతర ప్రధాన సమస్యలను మౌనంతో దాటవేసినట్లుగానే తన పట్టాలపై రేగుతున్న రగడను కూడా మౌనంతో చంపివేయాలని ఆయన భావించినట్లు కనిపించింది.

కానీ ఏ‌ఏ‌పి ఢిల్లీ మంత్రుల పట్టాలపై వివాదం చెలరేగినపుడు బి‌జే‌పి, కాంగ్రెస్ నేతలు చేసిన యాగీ అంతా ఇంతా కాదు. లోకం తలకిందులు అయినట్లే నానా రచ్చా చేశారు. ఆరోపణలకు ఏ‌ఏ‌పి ఎలా స్పందించాలో అలాగే స్పందించింది. వెంటనే ఆరోపణలు వచ్చిన మంత్రులను పదవి నుండి తప్పించింది. ఆనక విచారణకు ఆదేశించింది. ఇప్పటికీ ఆయనకు పదవి ఇవ్వలేదు.

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు పెద్ద ఎత్తున రంగం లోకి దిగి తోమర్ కార్యాలయంపై దాడి చేసి ఆయనను అరెస్టు చేశారు. తోమర్ ను వెంటబెట్టుకుని వెళ్ళి ఆయన ఎక్కడెక్కడ పరీక్షలు రాసిందీ చూపాలని కోరారు. ఆయనకు బెయిల్ ఇవ్వడానికి మేజిస్ట్రేట్ కోర్టు “ఇది తీవ్రమైన నేరం” అంటూ నిరాకరించింది.

జితేంద్ర సింగ్ తోమర్ ఒకటిన్నర నెలల పాటు జైలులో గడిపారు. ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసినప్పుడల్లా ఢిల్లీ పోలీసులు తీవ్ర వాదనలతో వ్యతిరేకించారు. నెలన్నర రోజుల తర్వాత ఢిల్లీ అడిషనల్ సెషన్స్ జడ్జి ముందు బెయిల్ దరఖాస్తు వచ్చినపుడు కూడా అంతే స్ధాయిలో దానిని పోలీసులు వ్యతిరేకించారు. వివిధ షరతులతో కూడిన బెయిల్ ను అడిషనల్ సెషన్స్ కోర్టు మంజూరు చేసింది.

డిగ్రీ ఫెక్ సర్టిఫికేట్ కేసులో బెయిల్ ఇవ్వకపోవడం సాధారణంగా జరగదు. అయినప్పటికీ తోమర్ కు బెయిల్ ఇవ్వడానికి కింది కోర్టు నిరాకరించడం బట్టి వారిపై ఒత్తిడి ఏ విధంగా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.

తోమర్ విషయంలో ఇంత యాగీ చేసిన బి‌జే‌పి ఇప్పుడు తగుదునమ్మా అంటూ ‘ప్రజా రాజకీయాలను దిగజార్చుతున్నారు’ అంటూ వాపోవడం విచిత్రం. తోమర్ విషయంలో ఆయా యూనివర్సిటీలు, ఢిల్లీ పోలీసులు చురుకుగా స్పందించారు. ఆరోపణలు వచ్చిన తొడనే సమాచారాన్ని పత్రికలకు పోలీసు అధికారులకు వెల్లడి చేశారు.

ఇదే విచారణ, ఇదే స్పందన మోడీ విషయంలో ఎందుకు కొరవడింది? అసలు విచారణ దాకా అవసరం లేకుండానే, నిజంగా డిగ్రీ పి‌జి పూర్తి చేసినట్లయితే, స్వయంగా ముందుకు వచ్చి తన ఒరిజినల్ సర్టిఫికెట్లను ప్రధాన మంత్రి పత్రికలకు ఇవ్వవలసి ఉండగా అందుకు విరుద్ధంగా సంవత్సర కాలం నుండి కాలయాపన చేస్తూ వచ్చారు.

ఏ‌ఏ‌పి నేతలు స్వయంగా గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీ లకు వెళ్ళినప్పటికీ వారికి మోడి పట్టా కాపీలను యూనివర్సిటీలు ఇవ్వలేదు. అనేక ఆర్‌టి‌ఐ దరఖాస్తులను అవి తిరస్కరించాయి. సమాచార కమిషనర్, మోడి రోల్ నెంబర్, ఇతర వివరాలను అరవింద్ కేజ్రీవాల్ కు ఇవ్వాలని యూనివర్శిటీలకు ఆదేశాలు ఇచ్చింది. సదరు ఆదేశాల కాపీలు యూనివర్శిటీలకు అందినప్పటికీ ‘అందలేదు’ అని ఢిల్లీ యూనివర్సిటీ అధికారులు అబద్ధం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు.

ఆ తర్వాత సి‌ఐ‌సి ఆదేశాలు అందాయని అంగీకరించి కూడా మోడి డిగ్రీ కాపీ ఇవ్వలేదు. ఆయన పట్టా తమకు కనిపించడం లేదనీ ఆయన రోల్ నెంబర్ చెబితే ఇస్తామని చెబుతూ ఏ‌ఏ‌పి నేతలను వెనక్కి తిప్పి పంపారు.

ఇది జరుగుతుండగానే ఇంటర్నెట్ లో మోడి డిగ్రీ, పి‌జి పట్టాల కాపీలు ప్రత్యక్షం అయ్యాయి. ఆ కాపీలనే ఈ రోజు అమిత్ షా, అరుణ్ జైట్లీలు విలేఖరులకు ప్రదర్శించారు. వారు ప్రదర్శించిన కాపీలను డి‌ఎన్‌ఏ (డెయిలీ న్యూస్ అండ్ అనాలసిస్) వెబ్ సైట్ లో ప్రచురించింది. వాటిని చూస్తే గత వారం రోజులుగా ఇంటర్నెట్ లో ఉన్న పత్రాలనే బి‌జే‌పి, ప్రభుత్వ నేతలు విలేఖరులకు వెల్లడించినట్లు స్పష్టం అవుతుంది.

Modi BA & MA

ఈ పత్రాలలో ప్రధానంగా రెండు లొసుగులను ఏ‌ఏ‌పి నేతలు ఎత్తి చూపారు. అవి:

1. పేరులో తేడా. BA పట్టాలో మోడి పేరు ‘నరేందర్ దామోదర్ దాస్ మోడి’ అని ఉండగా పి‌జి పట్టాలో ‘నరేంద్ర దామోదర్ దాస్ మోడి’ అని ఉన్నది.

ఒకవేళ పేరు మార్చుకుంటే అందుకు సంబంధించిన అఫిడవిట్ లను వెల్లడి చేయాలని ఏ‌ఏ‌పి నేతలు డిమాండ్ చేశారు.

2. బి‌ఏ పత్తాకు సంబంధించి మార్కుల పత్రంలో ఉన్న సంవత్సరం, పట్టాపై ఉన్న సంవత్సరం వేరు వేరుగా ఉన్నాయి.

ఈ నేపధ్యంలో అమిత్ షా, అరుణ్ జైట్లీలు ప్రదర్శించిన డిగ్రీ, పి‌జి పట్టాలు ఫోర్జరీ, బూటకం అన్న ఆరోపణకు ఏ‌ఏ‌పి నేతలు కట్టుబడి ఉన్నారు.

ప్రజా పాలన దిగజారుడు

ప్రజా పాలన దిగజార్చడానికి వస్తే ఆ పని ఇప్పుడు కాదు ఎప్పుడో జరిగిపోయింది. కాంగ్రెస్, బి‌జే‌పి లు రాజకీయాలను ఏ నాడో అత్యంత నీచస్ధాయికి దిగజార్చాయి.

సబర్మతి ఎక్స్ ప్రెస్ దహనానికి ప్రతీకారంగా ముస్లింలపై హత్యాకాండ సాగించడానికి ప్రోత్సహించినప్పుడు, గుజరాత్ హత్యాకాండలో నేరస్ధులపై చర్యలు తీసుకోవడానికి కోర్టుల్లో పోరాటం చేసిన తీస్తా సేతల్వాద్, ఐ‌పి‌ఎస్ అధికారి సంజీవ్  భట్ లపై ప్రతీకార చర్యలకు ఒడిగట్టినప్పుడు, అమిత్ షాపై నమోదైన బూటకపు ఎన్ కౌంటర్ కేసులను విచారణ ముగియక ముందే రద్దు చేయించుకున్నపుడు,

నలుగురు యువకులను బూటకపు ఎన్ కౌంటర్ లో చంపేసి వారిని పాక్ టెర్రరిస్టులుగా ముద్రవేసి ప్రచారం చేసినప్పుడు, ఢిల్లీ క్రికెట్ కుంభకోణంలో కోట్ల రూపాయలను పక్కదారి పట్టించినప్పుడు, వ్యాపం కుంభకోణం లాంటి అనేక కుంభకోణాలలో ఉన్న బి‌జే‌పి నాయకులపై ఎలాంటి చర్య తీసుకోనప్పుడూ, హిందూ సంస్ధల చేతనే ఉగ్రవాద దాడులు జరిపించి ఆ నెపంతో ముస్లిం యువకులను అన్యాయంగా అరెస్టు చేసి ఆరేళ్ళ పాటు జైలులో మగ్గేలా చేసినప్పుడు,

ఉత్తర ఖండ్ వరదల నుండి గుజరాత్ రాష్ట్రీయులు 15,000 మందిని తన విమానంలో మోడి కాపాడారని ప్రచారం చేసుకున్నప్పుడూ, గుజరాత్ లో ప్రజల భూములను, ప్రభుత్వ భూములను అత్యంత తక్కువ ఖరీదుకు బడా ధనిక వర్గాలకు, విదేశీ బహుళజాతి కంపెనీలకు పందెరమ్ పెట్టినప్పుడు…

జార్ఖండ్ రాష్ట్రంలో విలేఖరులు, హక్కుల కార్యకర్తలపై సాగుతున్న అరాచక, హంతక చర్యలకు మద్దతు ఇచ్చినపుడు, జే‌ఎన్‌యూ విద్యార్ధులు, ప్రొఫెసర్లపై సాక్షాత్తు కోర్టులలోనే లాయర్ గూండాలు దాడి చేసినా ఒక్క ముక్క మాట్లాడకుండా మౌనం దాల్చినపుడు, సాక్షాత్తు పార్లమెంటు లోనే దళిత విద్యార్ధులను జాతి వ్యతిరేకులుగా ముద్రవేసి హిందూత్వ విషం కక్కిన మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ ప్రసంగానికి ‘సత్యమేవ జయతే’ అంటూ మద్దతు ఇచ్చినపుడు..

దళిత విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నా అతని కుటుంబాన్ని పరామర్శించడానికి ఒక్క పలుకు పలకలేనప్పుడు…

ఎన్నిసార్లని చెప్పాలి? భారత ప్రజా రాజకీయాలను భ్రస్టు పట్టించింది కాంగ్రెస్, బి‌జే‌పి లే.

భ్రష్టు పట్టిన రాజకీయాలను కొన్ని పరిమితుల్లోనే అయినా కాస్తో, కూస్తో ప్రజల సమీపానికి తెచ్చిన పార్టీ ఏ‌ఏ‌పి పార్టీ. రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజల నుండి ప్రతినిధులను సేకరించి వారితో కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీల చర్చల ద్వారా తేలిన అంశాలతో ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకటించిన మొట్ట మొదటి పార్టీ ఏ‌ఏ‌పి.

రిలయన్స్ లాంటి బడా ధనిక స్వామ్య కుటుంబ కంపెనీ ఢిల్లీ విద్యుత్ పంపిణీలో పాల్పడుతున్న మోసాన్ని బైటపెట్టి కంపెనీ అధినేతపై అవినీతి విచారణకు ఆదేశించిన మొట్టమొదటి పార్టీ ఏ‌ఏ‌పి.

ఆ భయంతోనే ఢిల్లీ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ ఏ‌సి‌బి ని ఢిల్లీ ప్రభుత్వం నుండి లాక్కున్నది బి‌జే‌పి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం అవినీతిపై చర్యలు తీసుకుంటుందంటే నమ్మడం వెర్రిబాగులతనం.

కాగా అటువంటి పార్టీ  ఏ‌ఏ‌పి పై తమకు తగని వ్యాఖ్యానాలు చేయడం హాస్యాస్పదం.

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s