చర్చ: ఉత్పత్తి సంబంధం – వేతన కూలీ శ్రమ -17


Agricultural labour

Agricultural labour

(16వ భాగం తరువాత……)

భారత వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ విధానం :  పార్ట్ –17

వ్యవసాయరంగంలో మార్పులను మరింత వివరంగా అర్ధం చేసుకునేందుకు కింది అంశాలను చర్చిద్దాం.

A) భారత వ్యవసాయం, భారత వ్యవసాయరంగం లలో ఉత్పత్తి సంబంధాలు, వేతన శ్రమ

లెనిన్ ఇలా చెప్పారు, “పెట్టుబడి అన్నది ప్రజల మధ్య గల ఒక సంబంధం, పోలికలో ఉన్న కేటగిరీలు అభివృద్ధికి సంబంధించి ఉన్నత స్ధాయిలో ఉన్నా లేదా కింది స్ధాయిలో ఉన్నా ఆ సంబంధం ఉన్నట్లుగానే కొనసాగుతుంది.” (Lenin: Capitalism in Agriculture (1899) –marxists.org/archive/lenin/cw/volume04.htm#1899-agriculture-index)

మార్క్స్ చెప్పిన “ఉత్పత్తి విధానం యొక్క మొత్తం స్వభావాన్ని పెట్టుబడి మరియు వేతన శ్రమల సంబంధం నిర్ణయిస్తుంది” అన్న అవగాహనకు ఇది వివరణ. (Capital III, Moscow, 1984, P 880)

“కారల్ మార్క్స్ సిద్ధాంతం ప్రకారం పెట్టుబడిదారీ విధానం అత్యవసర లక్షణాలు” అంటూ లెనిన్ కింది అంశాలను ఉటంకించారు.

(1) ఉత్పత్తి సాధారణ ఉత్పత్తి రూపంగా సరుకుల ఉత్పత్తి

(2) శ్రమ నుండి ఉత్పత్తి తీయడమే కాదు, శ్రమను కూడా ఉత్పత్తి చేయడం. అనగా, మానవ శ్రమ శక్తి సరుకు రూపాన్ని ధరించడం. శ్రమ శక్తి సరుకు రూపంలోకి మారడం ఏ స్ధాయి వరకు అభివృద్ధి చెందింది అన్నది పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి స్ధాయిని సూచిస్తుంది.

భారత వ్యవసాయ శ్రమ, దాని లక్షణాలలోకి వెళ్ళేముందు ఉత్పత్తి సంబంధాన్ని దాని సరైన సందర్భంలో అర్ధం చేసుకోవాల్సి ఉన్నది.

ప్రత్యక్ష ఉత్పత్తిదారుడి నుండి మిగులు స్వాయత్తం చేసుకునే నిర్ధిష్ట రూపం: దోపిడీ సంబంధం. రైతుబానిసత్వం (serfdom) లాగా అది ఒక సాధారణ రూపమే కానీ వస్తు రూపేణా లేదా శ్రమ రూపేణా చెల్లించే శిస్తు లాగా నిర్దిష్ట రూపం కాదు. అదే ఉత్పత్తి సంబంధం విషయానికి వస్తే అది నిర్దిష్ట చారిత్రక దశలో అభివృద్ధి చెందిన దోపిడీ రూపం. ఉత్పాదక శక్తులు నిర్దిష్ట స్ధాయికి అభివృద్ధి చెందిన దరిమిలా ప్రధానంగా నిర్దిష్ట ఆస్తి రూపాన్ని సంతరించుకుంది.

రోమన్ సామ్రాజ్యం మొదటి శతాబ్దంలో దక్షిణ గాల్ లో కుండల తయారీ పరిశ్రమ (pottery) లో వేతన శ్రమ ఉన్నట్లు కనుగొనబడింది. (పెట్టుబడిదారీ పూర్వ రూపాలలో కూడా వేతన శ్రమ ఉన్నదని రచయిత సూచిస్తున్నారు. -అను) కనుక వేతన శ్రమ ఉనికిలో ఉన్నదా లేదా అన్నదాని బట్టి పెట్టుబడిని నిర్వచించలేము. ఎందుకంటే నిర్దిష్ట చారిత్రక పరిస్ధితులలో మాత్రమే వేతన శ్రమ పెట్టుబడి సంబంధంగా పరివర్తన చెందినది.

కారల్ మార్క్స్ ప్రకారం పెట్టుబడిదారీ ఉత్పత్తి, కింది లక్షణాలను కలిగి ఉంటుంది.

(1) సరుకు, దాని (పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం) ఉత్పత్తుల యొక్క ఆధిపత్య (dominant) మరియు నిర్ణయాత్మక లక్షణం.

(2) స్వేచ్ఛా వేతన శ్రామికుడి ఉనికి; శ్రమ సాధారణ రూపంగా ఆవిర్భవించడం దానికి షరతు.

“పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం సహజ ఉత్పత్తులను మాత్రమే ఉత్పత్తి చేసి ఊరుకోదు; ఆ ఉత్పత్తులు ఉత్పత్తి అయ్యే ఉత్పత్తి సంబంధాన్ని కూడా పునరుత్పత్తి చేస్తుంది” అని కారల్ మార్క్స్ స్పష్టం చేశారు. (Capital III, Moscow, 1984, P879)

దీని అర్ధం ఏమిటంటే పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి వేతన శ్రమపై ఆధారపడి కార్యకలాపాలు నిర్వహించడం అవసరమే గానీ సరిపోయిన (sufficient) షరతు కాదు అని.

స్వేచ్ఛా వేతన శ్రామికుడు, విస్తారిత ఉత్పత్తి అన్నవి రెండు ముఖ్యమైన, వివరంగా అధ్యయనం చేయవలసిన అంశాలు.

రంజిత్ సాహు తన వ్యాసం ‘భారత వ్యవసాయంలో పెట్టుబడిదారీ విధానం’ లో సరిగ్గానే, ఇలా చెప్పారు, “రష్యాకు సంబంధించి నిర్దిష్ట చారిత్రక పరిస్ధితులకు మార్క్స్ ప్రతిపాదిత పెట్టుబడిదారీ విధాన సిద్ధాంతాన్ని వర్తింపజెసేందుకు లెనిన్ ప్రయత్నించారు. అక్కడ వేతన శ్రమ కొనుగోలు మరియు ఉపాధి కల్పన అన్నది ప్రధానంగా అదనపు విలువ, మరియు పునః మదుపు (reinvestment)ల కోసం జరిగింది. అయితే భారత దేశంలో నిర్దిష్ట చారిత్రక దశలో వేతన శ్రామిక ఉపాధిని, అదనపు విలువ మరియు (పెట్టుబడి) సంచయంల కోసం వెచ్చించబడిందా లేదా అన్నది ఒక ప్రశ్న. భారత దేశానికి సంబంధించిన స్పష్టమైన (concrete) డేటా ద్వారా మాత్రమే ఈ ప్రశ్నకు సమాధానం రాబట్టగలం. అంతే తప్ప లెనిన్ రష్యా విషయం లోనో, అమెరికా లేదా జర్మనీ లేదా మరో ఐరోపా దేశం విషయంలోనో నిర్దిష్ట కాలానికి సంబంధించి అలా చెప్పారు కాబట్టి దాన్ని తెచ్చి ఇక్కడ వర్తింపజేస్తూ సమాధానం రాబట్టలేము.” [On the Essence and Manifestation of Capitalism in Indian Agriculture (Mode of Production Debate –Edited by Utsa Patnaik), OUP, 1990, P-113]

పైగా 1905 విప్లవం అనంతరం రష్యాలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధిపై తన అవగాహనాలను సమీక్షించుకున్నారు. ఆయన ఇలా పేర్కొన్నారు, “అభివృద్ధి దిశను మనం సరిగానే నిర్వచించుకున్నప్పటికీ ఆ అభివృద్ధి ఏ దశ (moment) లో ఉన్నదన్న అంశాన్ని సరిగా నిర్వచించలేకపోయాము. రష్యాలో భూస్వామ్య వ్యవసాయం, రైతు సాగు రెండింటిలో  పెట్టుబడిదారీ వ్యవసాయ అంశాలు పూర్తి రూపం సంతరించుకున్నాయని మనం అంచనా వేశాము. దీని నుండి  శక్తివంతమైన రైతు బూర్జువా ఆవిర్భవించినట్లుగా కనిపించింది. కనుకనే ‘రైతాంగ వ్యవసాయ విప్లవం’ తేవడంలో సామర్ధ్యం చూపలేకపోయాము.”  (Lenin Collected Works, Vol 13 P-291)

V I Lenin

V I Lenin

“ఆ తప్పు కార్యక్రమం వ్యవసాయంలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి స్ధాయిని అతిగా అంచనా వేయడం వల్ల జరిగినది తప్ప రైతాంగ వ్యవసాయక విప్లవ “భయం” వల్ల జరిగినది కాదు. అప్పటికి రైతాంగ బానిసత్వం కొనసాగింపు/ఉనికి కొద్ది మాత్రంలోనే ఉన్నట్లు మనకు అగుపించింది.  మరోవైపు రైతుల కేటాయింపుల పైనా, భూస్వాముల ఎస్టేట్ల పైనా పెట్టుబడిదారీ వ్యవసాయం పరిపక్వదశకు చేరుకుని వేళ్లూనుకున్నట్లుగా మనకు కనిపించింది. 1905 నాటి విప్లవం ఆ తప్పును బైటికి తీసింది. అభివృద్ధి దిశకు సంబంధించిన అంచనాను మనం నిర్వచించినట్లుగానే ఉన్నదని ధ్రువపరిచింది. (Lenin Collected Works; Vol 3; P 291-292)

ఈ నేపధ్యం నుండి భారత దేశంలో వ్యవసాయ శ్రమను (కూలీని) విశ్లేషించాలి. 

పూర్తి కాలపు వ్యవసాయ కూలీల ఉనికి మరియు వృద్ధి పెద్ద మొత్తంలో జరిగిందని (1921లో 21.3% ఉండగా 1931 లో 31.2% కి పెరిగింది) ఉత్స పట్నాయక్ పేర్కొన్నారు. కానీ పూర్తిగా స్వేచ్చా వేతన శ్రమపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్న బడా భూమి యజమానులను పెట్టుబడిదారుడిగా ఆమె పరిగణించలేదు; ఎందుకంటే వ్యవసాయంలో పెట్టుబడిదారీ సంబంధానికి అది తగినంత (sufficient) షరతు కాదు కనుక.  

పెట్టుబడిదారీ వ్యవస్ధకు వేతన శ్రమను తగినంత షరతుగా భావిస్తూ ఎస్ సి గుప్త, జి కొటోవ్ స్కీ లు 1953-54లో 6% – 7% కుటుంబాలు, 25% – 30% భూ విస్తీర్ణం పెట్టుబడిదారీ వ్యవసాయ కార్యకలాపాల కింద ఉన్నట్లు అంచనా వేశారు. ఇదే అంశాన్ని పెట్టుబడిదారీ వ్యవస్ధకు ప్రమాణంగా అంగీకరిస్తే గనక 1920ల నాటి బ్రిటిష్ ఇండియాలో కూడా పెట్టుబడిదారీ వ్యవస్ధ ఉన్నట్లే.

మద్రాస్ (ఆంధ్ర, మైసూర్, ట్రావంకోర్, కొచ్చిన్ లతో కలుపుకుని) రాష్ట్రంలో వ్యవసాయ కూలీలపై 1952 లో జరిపిన అధ్యయనం, 124 గ్రామాలలో సగం కుటుంబాలు వ్యవసాయ కూలీలుగా ఉన్నట్లు తేల్చింది. దీనిని ప్రస్తావిస్తూ డేనియల్, అలైస్ ధార్నర్ లు ‘అనుబంధ కూలీల సంఖ్యను తీవ్రంగా తక్కువ అంచనా వేశారు’ అని వ్యాఖ్యానించారు.

పట్టిక: ఇండియాలో జనాభా, వ్యవసాయ కూలీల వృద్ధి

S No సం. మొత్తం జనాభా (మిలియన్లు) వార్షిక చక్ర వృద్ధి రేటు గ్రామీణ జనాభా సాగు
దారులు
వ్యవసాయ కూలీలు ఇతర కూలీలు మొత్తం కూలీలు
1 1951 361.1 1.25 298.6 (82.7%) 69.9 (49.9%) 27.3 (19.5%) 42.8 (40.6%) 140.0 (100%)
2 1961 439.2 1.96 360.3 (82.0%) 99.6 (52.8%) 31.5 (16.7%) 57.6 (30.5%) 188.7 (100%)
3 1971 548.2 2.22 439.0 (80.1%) 78.2 (43.4%) 47.5 (26.3%) 54.7 (30.3%) 180.4 (100%)
4 1981 683.3 2.20 523.9 (76.7%) 92.5 (37.8%) 55.5 (22.7%) 96.6 (39.5%) 244.6 (100%)
5 1991 846.3 2.14 628.7 (74.3%) 110.7 (35.2%) 74.6 (23.8%) 128.8 (41.0%) 314.1 (100%)
6 2001 1012.4 1.79
7 2006 1094.1 1.55

[బ్రాకెట్లలో అంకెలు మొత్తంలో శాతంగా చూడాలి. ]

(Source: Agricultural Statistics at a Glance – 2000, Directorate of Economics & Statistics, Ministry of Agriculture, Govt of India, New Delhi, April 2000)

వ్యవసాయ శ్రామికుల్లో వేతన కూలీల భాగం గత మూడు దశాబ్దాలుగా స్తంభించిపోయింది. వ్యవసాయకంగా అభివృద్ధి చెందినట్లు భావించే పంజాబ్ లో కూడా వేతన కూలీల భాగం గణనీయంగా తగ్గిపోయింది. 1992లో వారి భాగం 23.82 శాతం ఉండగా 2001లో అది 16.30 శాతానికి తగ్గిపోయింది. (S S Jodhka – Beyond Crises: Rethinking Contemporary Punjab Agriculture; GAPS Series Working Paper 4, 1990, P – 40)

గ్రామీణ కూలీలపై జరిగిన అధ్యయనాల ప్రధాన అంశాలు:

1. సాధారణ లక్షణాలు

All-India

Items 1st Rural labour Enquiry 1963-65 2nd Rural labour Enquiry 1974-75 3rd Rural labour Enquiry 1977-78 4th Rural labour Enquiry 1983 5th Rural labour Enquiry 1987-88 6th Rural labour Enquiry 1993-94 7th Rural labour Enquiry 1999-2000 8th Rural labour Enquiry 2004-05
1 2 3 4 5 6 7 8 9
1 గ్రామీణ కుటుంబాల అంచనా (మిలియన్) 70.4 82.1 95.7 100.5 108.4 119.5 137.1 150.2
2 గ్రామీణ కుటుంబాల్లో కూలీ కుటుంబాలు 25.4 30.3 36.8 37.3 39.7 38.3 40.2 36.7
3 గ్రామీణ కుటుంబాల్లో వ్య. కూలీ కుటుంబాలు 21.8 25.3 29.9 30.7 30.7 30.3 32.2 25.8
4 కుటుంబ సగటు సైజు ALH 4.5 4.8 4.7 4.6 4.6 4.4 4.6 4.5
RLH 4.5 4.8 4.7 4.6 4.6 4.5 4.7 4.6
5 సగటు వేతన దారులు ALH 2.0 2.2 1.8 1.9 1.4 1.7 1.8 1.8
RLH 2.0 2.2 1.7 1.8 1.3 1.6 1.7 1.7

ALH = Agricultural Labour Households (వ్యవసాయ కూలీ కుటుంబాలు); RLH = Rural Labour Households (గ్రామీణ కూలీ కుటుంబాలు)

వ్యవసాయ సాగుదారుల నిష్పత్తి 64.3% (1983 అనంతర కాలంలో) ‘యాస్పెక్ట్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ’ లో పేర్కొన్నారు. వ్యాపార పరిస్ధితులు వ్యవసాయ సాగుకు వ్యతిరేకంగా మారడంతో సాగుదారులు బైటి కూలీలకు బదులు కుటుంబ సభ్యులనే కూలీలుగా వినియోగించడం ద్వారా ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నించారు. వ్యవసాయదారుల నిష్పత్తి పెరుగుదలకు ఇది కారణం అయి ఉంటుంది. 2000-2005 కాలంలో వ్యవసాయ కూలీ ఆదాయం స్తంభనకు గురయింది. వేతన కూలిలో పెరుగుదల సంభవిస్తే అది కాస్తా పని దినాలు తగ్గిపోవడం వల్ల రద్దయిపోయింది.

తన రచన “అధిక పని మరియు అధమ వినియోగం” (Over Work & Under Consumption) లో కారల్ కాట్స్కీ ఇలా పేర్కొన్నారు: “పెద్ద వాటికి వ్యతిరేకంగా చిన్న కమతాలకు రెండే రెండు ప్రధాన ఆయుధాలు ఉన్నాయి. మొదటిది, భారీ మొత్తంలో శ్రమ, తమ సాగుదారుల రక్షణ.. వేతన కూలీలకు విరుద్ధంగా వీరు తమ కోసమే శ్రమ చేస్తారు. రెండవది, వేతన కూలీ కంటే చిన్న స్వతంత్ర రైతు పొదుపు ఎక్కువ. (The Agrarian Question, Karl Kautsky -Vol I P-110)

Small Farmer

Small Farmer

“ఉత్పత్తిదారుల తక్షణ వినియోగానికి మించి మార్కెట్ కోసం శ్రమ చేయడం ఆరంభం అయినప్పుడే అధిక (అదనపు) శ్రమ మొదలవుతుంది. మార్కెట్ పోటీ ఈ క్రమాన్ని తీవ్రం చేసేలా ఒత్తిడి తెస్తుంది. పని సమయాన్ని పొడిగించడం ద్వారా పోటీ పడడం, సాంకేతిక వెనుకబాటుతనం రెండూ చెట్టాపట్టాలు వేసుకుని సాగుతాయి. మొదటిది రెండవ దానిని పుట్టిస్తుంది. అలాగే రెండవది మొదటిదానిని పుట్టిస్తుంది.” (Ibid; P-111)

“అయితే, కుటుంబ సభ్యులను వీలయినంత పిన్న వయసులో, సాధ్యమైనంత ఉత్పాదకతా సామర్ధ్యంతో  శ్రమకు ఉపయోగపెట్టే ప్రక్రియ, ఉన్నత స్ధాయి జ్ఞానానికి చేరుకోవడంలో ఎదురయే కదల్చ వీలులేని ఆటంకానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.” (Ibid; P-111)

ప్రత్యూష్ చంద్ర లాంటి అనేకమంది స్కాలర్లు “గ్రామీణ భారతంలో పెద్ద మెజారిటీలో జనం వేతన కూలీపై ఆధారపడి బతుకుతున్నారు” (Capitalism, Labour & Politics in India) అని అభిప్రాయ పడ్డారు. “రైతాంగంలో అధికులు పార్ట్ టైమ్ గా లేదా సీజనల్ వేతన కూలీలుగా పెట్టుబడితో నేరుగా సంబంధం కలిగి ఉన్నారు” అని వ్యాఖ్యానించారు. ఈ కూలీ ఆదాయం ప్రధానంగా వ్యవసాయేతర గ్రామీణ కూలీ పనుల ద్వారా వస్తున్నదే గానీ వ్యవసాయ కమతంలో ఉపాధి ద్వారా వస్తున్నది కాదు. కనుక అది వ్యవసాయంలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధికి సూచిక కానవసరం లేదు.

గ్రామీణ భారతంలో ఉపాధిని విశాల ప్రాతిపదికన పరికిస్తే-

  స్వయం ఉపాధి రెగ్యులర్ వేతనం/ జీతాలు తక్షణ కూలీ (క్యాజువల్)
1993-94 58.0 6.4 35.6
1999-01 55.8 6.8 37.4
2004-05 60.2 7.1 32.8
2007-08 56.3 7.5 36.2
2009-10 54.2 7.3 38.6

(Recent developments in farm labour availability in India and reasons behind short supply –Akhil Asha & Bijoyata: Agricultural Economic Research Review, 2011, Issue 2011)

గ్రామీణ బెంగాల్ లో ఫీల్డ్ వర్క్ అధ్యయనం ద్వారా తయారు చేసిన నివేదిక ఇలా పేర్కొంది. “వేతన అడ్వాన్స్ లు తీసుకునే కూలీలలో అనేకమంది మార్కెట్ వేతన రేటు కంటే తక్కువ రేట్లను అంగీకరించవలసి వస్తుంది. ఈ కూలీలు మార్కెట్ లో అమలులో ఉన్నదాని కంటే ఎక్కువ గంటలు పని చేయాల్సి ఉంటుంది. దాని అర్ధం వారు మార్కెట్ వేతన రేటు కంటే తక్కువకు పని చేస్తున్నారని. (The Indian Journal of Labour Economics; Vol 53, No. 4; 2010 P 681-682)

“ఒరిస్సాలో జరిపిన ఫీల్డ్ సర్వే నివేదికలో మమతా స్వైన్ ఇలా ముక్తాయించారు “వడ్డీ రేట్లు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ అత్యధిక స్ధాయిలో ఉండడం వలన కౌలు సాగుదారులు, అనుబంధిత కూలీలు, వ్యవసాయ సేవకులు తీవ్ర స్ధాయి దోపిడీని ఎదుర్కొంటున్నారు. కూలీలకు చెల్లించే వేతనాలు చాలా తక్కువ. కూలీలకు ప్రభుత్వం ప్రకటించే కనీస వేతనాలను చెల్లించరు. పెట్టుబడిదారీ వ్యవసాయంలో కనిపించే స్వేచ్ఛా కూలీలతో పోల్చితే వివిధ బంధనాలకు కూలీలు బంధించబడి ఉన్న ఏర్పాట్లు పూర్తిగా భిన్నమైనవి.  ఉపాధికల్పనాదారునికీ ఉద్యోగికీ ఉండే సంబంధం బర్ధన్ భావించినట్లుగా ఒకరు లేకుండా మరొకరు లేని (సింబియాటిక్) సంబంధం ఏమీ కాదు. అది ఆధిపత్య మరియు ఆధారిత సంబంధాన్ని మాత్రమే పోలి ఉన్నది. ఇందులో భూమి యజమానిదే పై చేయి. పేద రైతు నుండి వివిధ పద్ధతుల్లో భూమి యజమాని వర్గం మిగులును గుంజుకుంటోంది.” (Rural Indebtedness and Usurious Interest Rates in Eastern India: Some Micro Evidence; Journal of Social & Economic Development, Jan-Jun 2001, P-142)

వ్యవసాయంలో పెట్టుబడిదారీ విధానానికి గల షరతుల్లో ఒకటి స్వేచ్ఛా వేతన కూలీ. కనుక వ్యవసాయంలో వేతన కూలీలో స్తంభన మరియు తగ్గుదల, కుటుంబ శ్రమ పెరుగుదల.. ఇవేవీ భారత వ్యవసాయరంగంలో పెట్టుబడిదారీ పరివర్తన పెరుగుదలకు సరిపోలేవీ కావు.

పెట్టుబడిదారీ విధానంలో అదనపు విలువకు మూలాన్ని వివరించడంలో రికార్డో లేదా మార్క్స్ లు లేబర్ మార్కెట్ లో నెలకొన్న “అసమాన మారకం” పైన దృష్టి కేంద్రీకరించారు. కానీ ఇండియాలో వ్యవసాయ కూలీ మార్కెట్ లో చిన్న కమతాలకు సొంతదారులైన విస్తారమైన వ్యవసాయ కుటుంబాలు కూడా భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ‘తగినంత మొత్తంలో లేబర్ మార్కెట్ అభివృద్ధి చెంది ఉండాలి’ అన్న షరతు ‘ఉత్పత్తి సాధానాలపై గుత్తస్వామ్యం నెలకొని ఉందన్న ముందస్తు అంచనా కలిగి ఉంటుంది. ఉత్పత్తిరంగంలో కార్మిక దోపిడీయే పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధం లోని పూర్వ మూలాంశం.  కానీ ఇండియాలో రుణాల ఒత్తిడి కింద ఉన్న చిన్న రైతుల అసంకల్పిత మార్కెట్ జోక్యం వివిధ రూపాలలో నెలకొని ఉన్నది. ఇటువంటి బలవంతపు వాణిజ్యీకరణ నెట్ వర్క్, మొత్తం వ్యవసాయ మారకం సంబంధాల వ్యాపితంగా విస్తరించి ఉన్నది; ఈ సంబంధాల సారం ఏమిటి అంటే పరస్పర బంధనం (interlocked) లో ఉన్న మారకాల సమితులు (sets) అనేక మార్కెట్లు, కాలాల వ్యాపితంగా విస్తరించి ఉండడం. అంబికా ఘోష్ పేర్కొన్నట్లుగా “…వాణిజ్య రైతు లేదా వాణిజ్య భూస్వామి కూలీలతో వెనుకబాటు ద్రవ్యేతర సంబంధాలను కొనసాగిస్తూనే బైటి మార్కెట్లతో ఆధునిక సంబంధాన్ని నిర్వహిస్తున్నారు” (Ambica Ghosh: Emerging Capitalism in Indian Agriculture; P-278)

గత మూడు దశాబ్దాలలో వ్యవసాయరంగంలోని శ్రమశక్తి స్ధితిగతులు స్వేచ్ఛా వేతన కూలీ ఆవిర్భావానికి ఆమడ దూరంలోనే కొనసాగాయి. మార్కెట్ లో అసమాన శ్రమ మారకం సైతం కొనసాగుతూనే ఉంది. ఋణ గ్రహీతపై ఉండే వ్యక్తిగత అధికారం ఋణ చెల్లింపుల షరతులను నిర్దేశించగలదు. విలువ అంచనాలో కూడా ఋణ దాత ఆధిపత్యం ఉంటుంది కనుక ఋణ గ్రహీతలు అందజేసే సెక్యూరిటీల అంచనాలు చాలా తక్కువగా ఉంటాయి. ఋణ మార్కెట్లు ఒంటరిగా, వ్యక్తిగతంగా ఉండడంతో అది తీవ్రమైన అసమాన మారకానికి బలవంతపు వాణిజ్యీకరణకు దారి తీస్తోంది. పెట్టుబడిదారీ వ్యవసాయ ఉత్పత్తి సంబంధాలకు ఇది విరుద్ధం.

(……………సశేషం)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s