భూసంస్కరణలు: జపాన్, ఇండియాల మధ్య తేడాలు -16


 Japan Agriculture

భారత వ్యవసాయరంగంలో మార్పులపై ఒక నోట్ – పార్ట్ 16

(15వ భాగం తరువాత……………..)

1947 అనంతర కాలంలో రాష్ట్రానికీ రాష్ట్రానికీ మధ్యా, ప్రాంతానికీ ప్రాంతానికీ మధ్యా వ్యత్యాసాలు ఉన్నాయి. తక్కువ వాణిజ్యీకరణ చెందిన ప్రాంతాలలో -ముందు చూసినట్లుగా- ప్రత్యక్ష ఉత్పత్తిదారుల నుండి మిగులు గుంజుకోవడంలో భూమిపై వ్యవసాయ కౌలు, వినియోగ రుణాలపై వడ్డీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మెరుగైన వాణిజ్యీకరణ జరిగిన ప్రాంతాల్లో ముడి సరుకులు, ఉత్పత్తుల వాణిజ్యం లతో సంబంధం కలిగిన అధిక వడ్డీ దోపిడీ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఇతర సమ్మిళత పద్ధతులు కూడా అమలులో ఉన్నాయి. ఏ పద్ధతిలోనైనా పరాన్నభుక్త వర్గాలు ప్రత్యక్ష ఉత్పత్తిదారుల నుండి మిగులు గుంజుకోవడానికే పని చేస్తుంటాయి. ఉత్పాదక శక్తులను విస్తరించడంలో వారికి ఏ ప్రయోజనమూ లేదు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో కొట్టవచ్చినట్లు కనపడేది ఏమిటంటే అధిక స్ధాయిలో  వాణిజ్యీకరణ జరిగిన ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా చోటు చేసుకోవడం. పంటలో ఎంత ఎక్కువ భాగం అమ్మకం లోకి వెళితే అంత ఎక్కువగా రుణగ్రస్తులు అవుతున్నారు. ఋణ గ్రస్తతకూ అధిక లేదా అధమ వ్యవసాయ అభివృద్ధికీ సానుకూల సంబంధం ఏమీ లేదు. సంపన్న పంజాబ్, హర్యానాలలో చూసినా సాపేక్షికంగా వెనుకబాటు వ్యవసాయం ఉన్న (ఉమ్మడి) ఏ‌పి, కర్ణాటకలలో చూసినా ఋణ గ్రస్తత, ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి.

పంట దిగుబడిలో అమ్మకంలోకి వెళ్ళే భాగం అఖిల భారత సగటు 57% ఉండగా ఈ రాష్ట్రాల్లో దానికంటే 69 నుండి 120 శాతం వరకు ఎక్కువ భాగం అమ్మకం లోకి వెళుతోంది. వలస పాలనలో రైతులు మిగులు పోగేయగలిగేవారు కాదు, అలాగని వ్యవసాయం నుండి బైటికి వెళ్ళే పరిస్ధితీ ఉండేది కాదు. ఇప్పుడు కూడా పరిస్ధితి అదే విధంగా ఉన్నది. ముందు భాగంలో చూసినట్లుగా మిగులులో ప్రధాన భాగం వ్యవసాయ ఉత్పాదక శక్తులను విస్తరించడానికి, చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పడానికి వినియోగం అయే బదులుగా అధిక వడ్డీలను ఆర్జించడానికీ, లగ్జరీలకు, అక్రమంగా కూడబెట్టడానికీ, స్పెక్యులేషన్ వ్యాపారాలకు, ఇతర వ్యాపారాలకు తరలివెళుతోంది.

వ్యాపార పెట్టుబడి, ఋణ పెట్టుబడి వ్యవసాయరంగంలోకి విస్తృతంగా చొచ్చుకు వెళ్లడాన్ని ఈ నేపధ్యంలో అర్ధం చేసుకోవాలి. వడ్డీల ద్వారా నేరుగా మిగులు గుంజుకోవడం, వినియోగం కోసం అప్పులు చేయడం రెండు విభిన్న అంశాలు. అయితే మిగులు సంగ్రహణలో ఒకే వర్గం ఇమిడి ఉన్నదా లేక రెండు విభిన్న వర్గాలు ఉన్నాయా అన్నది వేరే ప్రశ్న. కానీ వెనుకబాటు వ్యవసాయంలో ప్రత్యామ్న్యాయ మిగులు సంగ్రహణ రూపాలు ఉండే అవకాశాన్ని మనం గుర్తించాలి.

వినియోగ రుణాలపై నిత్యకృత్యంగా ఆధారపడడం మొ.న వాటివల్ల ఏర్పడే మారకం సంబంధం మౌలికంగా బలవంతపు స్వభావం కలిగినది. అవి మార్కెట్ లో స్వచ్ఛందంగా పాల్గొనడం వల్ల తలెత్తవు. ఋణ యంత్రాంగం బలవంతం/ఒత్తిడి వల్ల తలెత్తుతాయి.

బలవంతపు వాణిజ్య సంబంధాల నెట్ వర్క్ కు దారి తీసే ఈ అసంకల్పిత మార్కెట్ భాగస్వామ్యం దాదాపు యావత్తు వ్యవసాయ మారకపు సంబంధాల వ్యాపితంగా పాకిపోయింది. చిన్న, బలహీన రైతాంగాన్ని బలవంతపు వాణిజ్యంలోకి ఒత్తిడి చేసే వర్గాలు మిగులు స్వాయత్తం చేసుకునే వర్గాలతో నిర్దిష్ట సంబంధాలు నెరుపుతున్నాయి. తద్వారా రైతులపై తమ పట్టును కొనసాగించగలుగుతున్నాయి. రైతాంగాన్ని ఒత్తిడి చేయడంలో ఈ రెండు వర్గాల పరస్పర ప్రయోజనాల బంధనం దోహదపడుతోంది. బలవంతపు వాణిజ్యం మరియు ఉత్పాదక సంచయంల మధ్యగల సంబంధం యొక్క స్వభావం రైతాంగ వర్గ సంబంధం చేత బలీయంగా ప్రభావితం అవుతుంది. రైతాంగ వర్గ సంబంధం పాత్ర బ్రెన్నర్ అవగానతో పోలి ఉంటుంది, “ఆంగ్లేయ వ్యవసాయ అభివృద్ధిలోని ప్రధాన అంశం: వ్యవసాయ మిగులును నిర్దిష్ట ఉత్పాదకతా వినియోగం కోసం వెచ్చించడం. ఈ వ్యవసాయ మిగులుకు గ్రామీణ వర్గ సంబంధాల ప్రత్యేక స్వభావం ప్రోత్సాహం అందజేస్తుంది.” (Robert Brenner: Agrarian Class Structure & Economic Development, P 518)

వ్యవసాయ ఉత్పత్తి స్ధాయి పెరుగుతున్నప్పుడే (వ్యవసాయ) మదుపు ఉత్పాదక పెట్టుబడిగా పరిగణించబడుతుంది. వ్యవసాయ ఉత్పత్తి పంపిణీలో, మదుపు వర్గాలకు అనుకున్న మొత్తం కంటే తక్కువ భాగం లేదా తగ్గుతూ పోయే భాగం అందే విధంగా మార్పులు జరిగినట్లయితే ఆ మదుపు అనుత్పాదక పెట్టుబడిగా పరిగణించబడుతుంది. ఆ విధంగా ఈ అవగాహన మదుపు చేసే వర్గాలు లాభపడేందుకే ఉద్దేశించబడి ఉంటుంది. వాణిజ్య పెట్టుబడి మరియు ఋణ పెట్టుబడులు పేద రైతులకు జారీ చేసే వినియోగ రుణాల రూపంలో ఇలాంటి అనుత్పాదక మదుపు ప్రధానంగా ఉనికిని కలిగి ఉంటుంది. వెనుకబాటు వ్యవసాయంలో ఋణ గ్రస్తత ద్వారా ప్రాధమిక సంచయం, భూమి మార్పిడి కంటే విస్తృతమైన ఆస్తి మార్పిడి ప్రక్రియ. కనుక వెనుకబాటు వ్యవసాయంలో బలవంతపు వాణిజ్యీకరణ ప్రాధమిక సంచయ ప్రక్రియ యొక్క నిర్దిష్ట రూపంగా ఆవిర్భవిస్తుంది. ఈ అంశం అమిత్ భాదురి (ఆర్ధికవేత్త, రచయిత, ఆర్ధిక విమర్శకులు, ప్రొఫెసర్, సామ్రాజ్యవాద వ్యతిరేక కార్యకర్త) వర్క్స్ లో వివరంగా చర్చించబడింది.

ఈ సందర్భంగా జపాన్ వ్యవసాయం అనుబంధ ఉత్పత్తి విధానం నుండి పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలోకి మారిన క్రమాన్ని ప్రత్యేకించి పరిశిలీంచడం ఉపయోగకరం. ఇండియా వలె కాకుండా జపాన్ 1968 కల్లా పాత వర్గాల పొందికను విసిరికొట్టింది. పాత అనుబంధ ఉత్పత్తి విధానాన్ని రద్దు చేసింది. మీజీ పునరుద్ధరణ జపాన్, నూతన పంధాలో అభివృద్ధి చెందేందుకు మార్గం సుగమం చేసింది. మీజీ పునరుద్ధరణ వల్ల పెట్టుబడిదారీ పూర్వ “అనుబంధ” (tributory) స్ధితి నుండి సరుకుల ఉత్పత్తి, వాణిజ్యీకరణలు గణనీయంగా పురోగమించడం వీలు కలిగింది. జపాన్ ఏకీకృత రాజ్యంగా మార్చబడింది. పరాన్న భుక్త అర్ధ వలస పంధాను నిరోధించి దూకుడు కలిగిన పారిశ్రామిక పెట్టుబడిదారీ శక్తిగా ఆవిర్భవించేందుకు మీజీ పునరుద్ధరణ దోహదం చేసింది. జపాన్ వ్యవసాయ ఆర్ధిక వ్యవస్ధ స్వయం సమృద్ధ స్ధితి నుండి వాణిజ్య ఉత్పత్తి తీసే స్ధితికి అభివృద్ధి చెందింది. మొత్తం మీద చూస్తే వ్యవసాయ ఉత్పత్తిలో సగం లేదా దాదాపు 2/3 వంతు వరకు నేరుగా రైతుల ద్వారాలో లేదా పన్నుల రూపంలో వసూలు అయిన పంటల ద్వారానో మార్కెట్ లోకి ప్రవేశించింది. అనేక మంది రైతులు గ్రామీణ పారిశ్రామిక కార్యకలాపాలలో నిమగ్నం అయ్యారు.

మీజీ పునరుద్ధరణలో రాజ్యం అధికారాన్ని పునర్నిర్మాణం కావించారు. నూతన రాజ్య నాయకత్వం పాత అనుబంధ ఉత్పత్తి విధానం వెనుక నిలిచిన చట్టపరమైన, రాజకీయ మద్దతును ఒక పద్ధతి ప్రకారం నాశనం చేసింది. జపాన్ పెట్టుబడిదారీ పూర్వ వ్యవస్ధకు సంబంధించి రెండు లక్షణాలు ప్రత్యేకంగా పరిశీలించదగినవి. ఒకటి: సమురైలు షోగన్ ల కింద ఉన్న పాలనా ప్రాంతాలను పర్యవేక్షించి రక్షణ వ్యవహారాలు చూసిన యుద్ధ వర్గం. కానీ సమురైలు ఒక వర్గంగా భూమి ఆస్తులకు యజమానులుగా మారకుండా నిషేధించబడ్డారు. ఇండియాలోని మిలట్రీ అనుచరవర్గం ఇందుకు విరుద్ధం. రెండు: తోకుగవా బాకు హాన్ వ్యవస్ధ చట్రం పరిధిలోనే ఆర్ధిక జీవనం అప్పటికే వాణిజ్యీకరణ చెందడం విస్తారంగా జరిగిపోయింది. ఇది జపాన్ లో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందడానికి కావలసిన అత్యంత సానుకూల పునాదిని ఏర్పరిచింది.

పైగా రెవిన్యూ, మానవ వనరులపై స్వతంత్ర నియంత్రణ సాధించకుండా సమురైలను నిరోధించారు. కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని సవాలు చేయడానికి జంకర్లు గానీ, బడా షావుకార్లు (బ్యారన్లు) గానీ లేరు. సమురైల ప్రయోజనాలు ఎస్టేట్ ల సేవలకు కాకుండా రాజ్య సేవలకు బంధించారు. రాజ్యం ప్రయోజనాలతోనే సమురైల ప్రయోజనాలు గుర్తింప పడడం, శక్తివంతమైన వాణిజ్య బూర్జువాల ఐక్యత, వివిధ పరిశ్రమలకు కావలసిన పునాది తోకుగవా కాలంలోనే తయారు కావడం… ఇవన్నీ కేంద్రీకృత పారిశ్రామికీకరణకు మార్గం ఏర్పరిచాయి.

1975-76లో జరిగిన భూమి శిస్తు రివిజన్ ద్వారా మార్కెట్ లో ప్రవేశించడానికి కావలసిన మిగులు సమీకరించబడింది. వరి ఉత్పత్తిలో 25 శాతం మొత్తాన్ని డబ్బు రూపంలో చెల్లించవలసిన భూమి శిస్తుగా నిర్ణయించారు. ఇవి భూమి యజమానులను పెట్టుబడిదారీ పూర్వ దోపిడి నుండి కాపాడాయి. అలాగే భూస్వాముల చేతుల్లో భూముల కేంద్రీకరణకు దోహదం చేసింది. చిన్న రైతులు శిస్తులు చెల్లించలేక భూములు కోల్పోయారు. తోకుగవా కాలం చివరన, మీజీ కాలంలో భూస్వాములు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంలో చురుకైన పాత్ర పోషించారు. ఇది అదే కాలంలో ఇండియాలో నెలకొన్న వ్యవసాయ దృశ్యానికి సరిగ్గా విభిన్నం.

జపాన్ వివిధ దశలలో, ముఖ్యంగా యుద్ధ కాలంలో దరిద్రం, ఆహార కొరత సమస్యలను ఎదుర్కొంది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఆరంభంలో మిత్ర పక్ష రాజ్యాల బలవంతం వల్లా, అనంతర కాలంలో స్వయంగానూ వ్యవసాయంలో పలు సంస్కరణలు అమలు చేసింది.

యుద్ధం అనంతం 1946లో జపాన్ ప్రభుత్వం వ్యవసాయంలో లేని భూస్వాముల (absentee landlords) భూములను స్వాధీనం చేసుకోవడానికి ఆదేశాలు ఇచ్చింది. భూ యాజమాన్యం కొనసాగిస్తున్న భూస్వాములపై 1 హెక్టార్ పరిమితి విధించి ఆ పైన భూములను స్వాధీనం చేసుకుంది. (హోక్కైడో -ఉత్తరం చివరన ఉన్న పెద్ద ద్వీపం- లో ఈ పరిమితి 4 హెక్టార్లు). అలా స్వాధీనం చేసుకున్న భూములను చట్టం చేసిన 2 సంవత్సరాల లోపు కౌలుదారులకు అమ్మడం పూర్తి చేసింది. 1947-50 కాలంలో నాలుగు సంవత్సరాల పాటు ప్రభుత్వం భూ సంస్కరణలను అమలు చేసింది. అదనపు భూములను కొనుగోలు చేసి కౌలుదారుల యాజమాన్యం కిందికి తరలించింది. కౌలుసాగులో ఉన్న భూమిలో దాదాపు 80 శాతం సంస్కరణల ద్వారా కౌలుదారులకు పంచింది.

భూమి అద్దె (గ్రౌండ్ రెంట్) బూర్జువా వర్గం రెండందాల నష్టపోవడానికి కారణం అవుతుందని మనకు తెలిసిన విషయమే. ఒకటి: అదనపు విలువలో ఒక భాగం లాభాల రియలైజేషన్ లో పాల్గొనదు. రెండు: ఆహార కొరత నెలకొనెంతవరకు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు కనిష్ట లాభదాయకత గలిగిన భూ కమతాల ఉత్పత్తుల ధరల ప్రకారం జరుగుతాయి. సాధారణంగా పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం మెరుగైన రీతిలో అభివృద్ధి చెందడానికి భూమి అద్దె ఉనికి పెద్ద ఆటంకం అవుతుంది. అలాగే గ్రామాలలో పెట్టుబడిదారీ సంబంధాలు అభివృద్ధి చెందకుండా భూమి అద్దె ఆటంకపరుస్తుంది. వ్యవసాయంలో లేని భూ యజమానులు (absentee landlords) వసూలు చేసి కౌలు/భూమి అద్దె తిరిగి వ్యవసాయంలో మదుపు చేయడం జరగదు. ఆ మొత్తం వ్యవసాయం నుండి పూర్తిగా ఉపసంహరించబడుతుంది. అందువలన జపాన్ లో గ్రామాలలో కౌలును రద్దు చేయడం ద్వారా పెట్టుబడిదారీ వ్యవసాయం మెరుగైన రీతిలో అభివృద్ధి చెందడానికి సంస్కరణలు దోహదం చేశాయి.

ఈ సంస్కరణ కౌలుదారుల హక్కులను బలీయం చేశాయి. భూస్వాములు తిరిగి తలెత్తకుండా నిరోధించేందుకు 1952 భూ చట్టం భూమి యాజమాన్యానికి 3 హెక్టార్ల పరిమితి (హొక్కైడో లో 12 హెక్టార్లు) విధించింది. వ్యవసాయ సహకార సంస్ధలు (NOKYO) స్ధాపించారు. అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులు, ముడి సరుకులు, రుణాలు, భీమా వ్యాపారం… ఈ సహకార సంస్ధల ద్వారానే జరిగింది. గ్రామాలు, పట్టణాలలోని ప్రాంతీయ కార్యాలయాల ద్వారా కొ-ఆపరేటివ్ లు కార్యకలాపాలు నిర్వహించాయి. ఆహార ఉత్పత్తుల పంపిణీపై కో-ఆపరేటివ్ లు గుత్తస్వామ్యం వహించాయి. వరి ధాన్యం, ఎరువులలో 70 శాతం కో-ఆపరేటివ్ ల ద్వారా మార్కెట్ అయ్యాయి. తక్కువ వడ్డీలతో కూడిన సంస్ధాగత రుణాల మంజూరు ద్వారా వారి గుత్తస్వామ్య యాజమాన్యాన్ని మరింత శక్తివంతం చేశారు. ఐనప్పటికీ వ్యవసాయంలో జరిగిన వేగవంతమైన వృద్ధి కూడా పారిశ్రామిక రంగం వృద్ధితో పోటీ పడలేకపోయింది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల మధ్య అసమానతలు నెలకొన్నాయి. పట్టణ, గ్రామీణ జీవన స్ధాయిల మధ్య అంతరాలు కొనసాగాయి. కూలీలు వ్యవసాయ రంగం నుండి వలస వెళ్లడానికి దోహదం చేసింది. వీటిని నిరోధించడానికి 1961లో ‘వ్యవసాయ మౌలిక చట్టం’ (అగ్రికల్చర్ బేసిక్ లా) తెచ్చారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచే బాధ్యత ప్రభుత్వం పైనే మోపారు. 1960-68 కాలంలో సంబంధిత పారిశ్రామిక వేతనంతో పోల్చితే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు రెండింతలు పెరిగాయి. ఉత్పతిదారుకూ, దిగుమతి ధరలకు మధ్య వ్యత్యాసం 50 నుండి 120 శాతం వరకు పెరిగింది.

జపాన్ అనుభవాన్ని 1947 అనంతర ఇండియాతో పోల్చితే మనకు తేడా ఏమిటో అర్ధం అవుతుంది. 1956 నాటికల్లా దాదాపు రాష్ట్రాలన్నింటిలో జమీందారి రద్దు చట్టాలు వచ్చాయి. కానీ వాస్తవ పరిస్ధితి చట్టాలకు పూర్తి భిన్నంగా ఉన్నది. 82 శాతం కౌలు రైతులకు ఎలాంటి భద్రత లేదని 1961 జనాభా లెక్కలు చూపాయి. మొదటి, రెండవ ప్రణాళికా కాలాలు అంతటా కౌలు మొత్తం ఉత్పత్తుల మార్కెట్ ధరలో 50 శాతం వద్దనే కొనసాగింది. 60ల అనంతరం హరిత విప్లవం భూముల ధరలను, కౌలును పెంచివేసింది. పంజాబ్ లో ఇది 70 శాతం వరకు వెళ్లింది. 1970 చివరి నాటికి కేవలం 24 లక్షల ఎకరాలు మాత్రమే మిగులు భూములుగా ప్రకటించారు. ఇది ఇండియాలో మొత్తం సాగు భూమిలో 0.3 శాతం మాత్రమే. 1972లో భూగరిష్ట పరిమితి చట్టంలో మార్పులు చేశారు. కాగితాలపై ఎన్ని రాతలు రాసుకున్నా అధికారికంగా (వాస్తవంగా కాదు) పంపిణీ చేసిన భూములు 2 శాతం మాత్రమే. మొత్తం కౌలు సాగు కింద ఉన్న భూమిలో 70 శాతం మొత్తం కమతాలలో  7 శాతం కమతాల (యాజమానుల) కింద ఉన్నదని 59వ రౌండ్ నేషనల్ శాంపిల్ సర్వే తెలియజేసింది. పెద్ద, భారీ కమతాలలో తప్ప ఇతర అన్ని సైజుల కమతాలలోనూ కౌలు సాగు కమతాల యాజమాన్యం తగ్గుతోంది. అప్పటికీ కౌలు యాజమాన్యం 14 శాతం ఉండగా అది 1960-61 కంటే ఎక్కువ. గ్రామాల్లో అత్యున్నత స్ధాయిలోని 9.5 శాతం కుటుంబాలు 56.6 శాతం వ్యవసాయ విస్తీర్ణానికి యజమానులుగా ఉన్నారు. మిగిలిన 90.5 శాతం కుటుంబాల చేతుల్లో 43.4 శాతం భూ విస్తీర్ణం మాత్రమే ఉన్నది.

వ్యవసాయ ఆదాయం వినియోగ ఖర్చులకు సరిపోదని NSS నిర్వహించిన SASF సర్వే చూపింది. ఒక సగటు రైతు కుటుంబం తన వినియోగ ఖర్చులో 35 శాతం మాత్రమే వ్యవసాయం ద్వారా రాబట్టగలుగుతోంది. వ్యవసాయంపై ఖర్చులు, ఉపకరణాల అరుగుదల కూడా పరిగణిస్తే వ్యవసాయ ఆదాయం మరింత తగ్గిపోతుంది.

రైతు కుటుంబాలలో 88 శాతం లోటు వ్యవసాయాన్ని సాగిస్తున్నారని సర్వేలలో తేలింది. 4 హెక్టార్లకు ఎక్కువ విస్తీర్ణం కమతం గల రైతు కుటుంబాలు మాత్రమే తమ వినియోగ ఖర్చులకు పోను అదనపు ఆదాయం వ్యవసాయం నుండి పొందుతున్నారు. రైతుల చేతుల్లో పెట్టుబడి సంచయానికి సరిపడా మిగులు ఉండడం లేదని దరిమిలా వారు తమ వ్యవసాయ కార్యకలాపాలను విస్తరించలేని స్ధితిలో ఉన్నారని SASF సర్వే వివరాలు చెబుతున్నాయి. 10 హెక్టార్లకు పైబడిన కమతాల యజమానులు, వ్యవసాయేతర అధిక వడ్డీ వ్యాపారులు వ్యవసాయ మిగులును సొంతం చేసుకుంటున్నారు.

జపాన్, ఇండియా ఆర్ధిక వ్యవస్ధలు పరస్పరం వ్యతిరేక దిశల్లో అభివృద్ధి చెందడానికి కారణాలు ఏమిటో ఈ అంశాలు చక్కగా తెలియజేస్తున్నాయి.

(……………….సశేషం)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s