అగస్టా ఛాపర్: సోనియాను ఇరికించే మాయోపాయం?


Agusta Westland Chopper

4 రాష్ట్రాల ఎన్నికలు జనానికి ముఖ్యంగా పత్రికల పాఠకులకు, చానెళ్ల వీక్షకులకు గడ్డు రోజులు తెచ్చి పెట్టాయి.

ఎన్నికల ప్రచారం అంటే ప్రజలు తమ ఎంపిక కోసం తమ ముందు ఏ యే అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవడం. ఇలాంటి అవకాశాలను ప్రజల ముందు ఉంచే పంధా నుండి రాజకీయ పార్టీలు ఎప్పుడో తప్పుకోవడం ఎన్నికల ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న అదనపు సమస్య.

ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడంలో వారి చేతుల్లో ఉన్న ఒక ప్రధాన సమస్య ‘అగస్టా వెస్ట్ ల్యాండ్ వి‌వి‌ఐ‌పి చాపర్ కుంభకోణం.’ ఇరు పక్షాలు పరస్పరం నిందించుకోగల విచిత్ర అవకాశం ఈ కుంభకోణం కల్పించింది.

బి‌జే‌పి ఆరోపణ కొత్తది కాదు. ప్రతిపక్షంలో ఉండగానే ఆ పార్టీకి అగస్టా అస్త్రం లభించింది. గమనార్హం ఏమిటంటే 2 సం.లు అధికారం చలాయించిన ఆ పార్టీ ఇన్నాళ్లూ దానిపై విచారణ జరపడం మాని ఇప్పుడు, పార్లమెంటు ఎన్నికల ముందు, రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పాత ఆరోపణలు సరికొత్తగా గుప్పిస్తూ గగ్గోలు పెట్టడం.

No red card

అగస్టా అవినీతి వల్ల దేశానికి, ప్రజలకు నష్టం జరిగిందని బి‌జే‌పి భావిస్తే అది నిజంగా చేయవలసింది: విచారణ వేగంగా పూర్తి చేసి దోషులు ఎవరో తేల్చడం. ముడుపులు అందుకున్నవారిలో సోనియా కూడా ఉన్నారని ఖచ్చితంగా చెబుతున్నారు కనక అదేదో విచారణలోనే తేల్చండి. వారి ‘గాంధీ ముక్త భారత్’ లక్ష్యం నెరవేరుతుంది; కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి; మోడి, అవినీతి వ్యతిరేక పోరాట వీరులూ అవుతారు.

బి‌జే‌పి ఆ పని ఎందుకు చేయదు?

కాంగ్రెస్ పార్టీయేమో ప్రతి సవాలు విసిరింది. దమ్ములుంటే సోనియాపైన కేసులు పెట్టుకొమ్మని తేల్చేసింది. అధికారం మీ చేతుల్లోనే ఉంది కదా అని గుర్తు చేసింది. అసలు సాక్షాలు ఉంటే ఈ రెండేళ్లు ఏం చేస్తున్నారు? అని నిలదీసింది. ఈ ప్రశ్నలకు బి‌జే‌పి నేతల నుండి గానీ, ప్రభుత్వం నుండి గానీ సమాధానం లేదు.

అగస్టా కంపెనీతో సంబంధాలను తెంచుకునే ప్రక్రియను తామే ప్రారంభించామని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. తాము ఆగస్టాను బ్లాక్ లిస్టులో పెడితే ఆ కంపెనీ నుండి మరిన్ని కొనుగోళ్ళు చేయడానికి మోడి ప్రభుత్వం నిర్ణయించిందని ఆరోపించింది. అగస్టా వి‌వి‌ఐ‌పి చాపర్ కాంట్రాక్టును తాము రద్దు చేయగా బి‌జే‌పి ప్రభుత్వం నావల్ యుటిలిటీ హెలికాప్టర్ కాంట్రాక్టును అదే కంపెనీతో కుదుర్చుకుందని కాంగ్రెస్ నేతలు వెల్లడి చేశారు. ఇది వాస్తవం కూడా.

కాగా అగస్టా ఒప్పందం మధ్యవర్తిగా బి‌జే‌పి గుర్తించిన మైఖేల్, ది హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడి చేసిన సమాచారం బి‌జే‌పి ప్రభుత్వ నేత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి మాయోపాయాన్ని వెలుగులోకి తెచ్చింది.

ఏప్రిల్ 27 తేదీన ది హిందు ప్రచురించిన ఇంటర్వ్యూలో క్రిస్టియన్ మైఖేల్ ఇలా తెలిపాడు.

“గత సంవత్సరం నేను ఫెన్ మెక్కానికా-అగాస్టా వెస్ట్ లాండ్ కంపెనీతో చర్చల్లో ఉన్నాను. వి‌వి‌ఐ‌పి చాపర్ ఒప్పందానికీ ఆ చర్చలకూ అసలు సంబంధమే లేదు. వాళ్ళు నాకు డబ్బు చెల్లించవలసిన ఎక్విప్ మెంట్ ని ఎక్కడ నిల్వ చేయాలి.. తదితర అంశాలపై చర్చిస్తున్నాం. నేను వాళ్లపై కోర్టుకు వెళ్ళాక నేను కోరుతున్న మొత్తంలో మొదటగా చెల్లించవలసిన మొత్తం మీద ఒప్పందం కుదిరింది. రెండో మొత్తాన్ని సెటిల్ చేసుకునే ప్రక్రియలో మేమున్నాం.

“అప్పుడు వాళ్ళ లాయర్లు అకస్మాత్తుగా అన్నారు, ‘మనం ఒక మొత్తాన్ని అంగీకరించినా మేము ఆ ఒప్పందం నుండి బైటికి వచ్చేస్తున్నాం’ అని. ఆ విషయమై నాతో మాట్లాడేందుకు ఇక ఎంత మాత్రం సుముఖంగా లేరు. ఆగస్టు-సెప్టెంబరు 2015 నాటి సంగతి ఇది. మేమంతా చాలా ఆశ్చర్యపోయాం. ఏం జరిగిందో తెలుసుకొమ్మని నేను మా లీగల్ బృందాన్ని కోరాను. వాళ్ళు “న్యూయార్క్ లో ఒక సమావేశం జరిగింది” అని చెప్పారు.

“దానితో న్యూయార్క్ లో అసలు ఏం జరిగిందో తెలుసుకొమ్మని నాకు తెలిసిన వారందరినీ పురమాయించాను. నాకు మూడు విభిన్న వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం “భారత ప్రధాన మంత్రి, ఇటాలియన్ ప్రధాన మంత్రిల మధ్య ఐక్యరాజ్య సమితిలో అదాటున (బ్రష్-బై) సమావేశం జరిగింది. ఆ సమావేశంలో అత్యంత ముఖ్యాయిన అంశం చర్చకు వచ్చింది. ఇటాలియన్ మెరైన్ల కేసు సెటిల్ చేయడంలో సహాయం చేస్తామని భారత ప్రధాన మంత్రి నుండి ఆఫర్ వచ్చింది. దానికి ప్రతిఫలంగా వి‌వి‌ఐ‌పి చాపర్ డీల్ లో గాంధీలను ఇరికిస్తూ (implicating) ఏదో ఒక సాక్షం తమకు ఇవ్వాలని ఆయన కోరారు. నన్ను వారి (గాంధీలు) సహాయకారి (conduit) గా ఆరోపించినట్లు కనిపిస్తోంది. ఇది చాలా దూరం వెళ్లిందని నేను అనుకున్నా.”

ఇటలీ, భారత ప్రధాన మంత్రుల మధ్య సమావేశం జరిగిందన్న విషయాన్ని బి‌జే‌పి తిరస్కరిస్తోంది. అలాంటి సమావేశం ఏదీ జరగలేదని కొట్టిపారేస్తోంది. ఈ నేపధ్యంలో ది హిందు మైఖేల్ ను గుచ్చి గుచ్చి అడిగింది, “ఆ సమావేశం జరిగిందనడానికి మీ దగ్గర ఉన్న సాక్షం ఏమిటి?” అని. అందుకు మైఖేల్ ఇలా సమాధానం ఇచ్చాడు.

“ఆ సమావేశం జరిగిందా లేదా అన్న ప్రశ్నకు సమాధానం వెతకడం చాలా సులభం. అది జరగడమే కాకుండా చాలా సమయం కొనసాగింది కూడా. ఎంత ‘చాలా’ సమయం అంటే వారు తమ ఇతర సమావేశాలను రీ షెడ్యూల్ చేసుకోవలసి వచ్చింది. ఇటలీ ప్రధాన మంత్రితో సుదీర్ఘ సమయం పాటు సమావేశం జరగడం వల్ల మీతో సమావేశాలు రీ షెడ్యూల్ చేయాల్సి వస్తోంది అని (భారత) రాయబార అధికారులు వాళ్ళతో (ఎవరితో సమావేశాలనైతే రీషెడ్యూల్ చేశారో వారితో) చెప్పారు. అధికారులు ఆ పొరపాటు చేశారు. సమావేశం జరిగిందని రుజువైతే వారు ఏం చర్చించుకున్నారో స్పష్టం అయినట్లే…

“నాకు అందిన సమాచారం ప్రకారం కొందరు యూరోపియన్ నేతలతో జరగవలసిన సమావేశాలను రీ షెడ్యూల్ చేశారు. ఆ నేతలు ఏ దేశాల వాళ్ళు అన్నది తెలుసుకోవాల్సిన విషయం. ఈ రీ షెడ్యూలింగ్ వల్ల వారి (ఇండియా, ఇటలీ ప్రధానులు) సమావేశంపైన భారీ వెలుగు ప్రసరించింది. ఇండియా, ఇటలీల మధ్య సంబంధాలు మెరుగుపడడానికి ప్రస్తుతం ఉన్న ప్రధాన అడ్డంకి మెరైన్ల సమస్య. కనుక ఇటలీ ప్రధాని కార్యాలయంలో ఈ సమావేశానికి సంబంధించిన రికార్డులు తప్పనిసరిగా ఉంటాయి… సెప్టెంబర్ 24 తేదీ లేదా 25 తేదీన ఈ సమావేశం జరిగింది.”

గాంధీలకు (ముఖ్యంగా సోనియా గాంధీ) వ్యతిరేకంగా సాక్షం ఇవ్వాలని ఇటలీ ప్రభుత్వం నుండి మిమ్మల్ని ఎవరైనా అడిగారా అని కూడా ది హిందు ప్రశ్నించింది. దానికి మైఖేల్ “సరిగ్గా జరిగింది అదే. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాకు ఆఫర్ ఇచ్చారు. అలాంటి సాక్షం ఇస్తే నాకు చెల్లింపులు ఏమీ లేకపోయినా జైలు శిక్ష పడకుండా చూస్తామని ఆఫర్ ఇచ్చారు. కానీ నేను అలాంటి తప్పుడు ఆరోపణలకు ఒప్పుకోలు ఏమీ ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే అది నిజం కాదు గనుక” అని వివరించారు.

భారత విదేశీ మంత్రిత్వ శాఖ ఇలాంటి సమావేశం జరిగిందన్న సంగతిని స్పష్టంగా నిరాకరించడం లేదు. సమావేశం సమాచారం తమ వద్ద లేదు గనుక తాము వ్యాఖ్యానించబోము అని మాత్రమే చెబుతోంది. స్పష్టంగా ఒక ప్రకటన జారీ చేయడానికి పూనుకోవడం లేదు. దానితో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.

సోనియాను ఇరికించడానికి మాయోపాయం పన్నినట్లు ఆరోపణలు రావడం ఒక అంశం కాగా, మరో అంశం ఆరోపణలు వచ్చిన ఆగస్టా కంపెనితోనే మరో హెలికాప్టర్ ఒప్పందానికి మోడి ప్రభుత్వం ఆమోదం తెలపడం.

ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ పత్రిక ప్రకారం 2 బిలియన్ డాలర్ల ఖరీదు చేసే 100 లైట్ యుటిలిటీ హెలికాప్టర్ లను అగస్టా వెస్ట్ ల్యాండ్ (ఫిన్ మెక్కానికా అనుబంధ కంపెనీ) తోనే మోడి ప్రభుత్వం ఒప్పందానికి వచ్చింది. $2 బిలియన్లు అంటే దాదాపు రు 13,200 కోట్లకు సమానం.

వి‌వి‌ఐ‌పి చాపర్ కొనుగోళ్లకు వెచ్చించిన మొత్తం 3,700 కోట్లు మాత్రమే. మధ్యవర్తులకు లంచాలు చెల్లించారన్న ఆరోపణలు వచ్చిన దరిమిలా యూ‌పి‌ఏ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేసి చెల్లించిన మొత్తాన్ని తిరిగి రాబట్టుకుంది.

అలాంటి కంపెనీతో మళ్ళీ మరో ఒప్పందం, గతం కంటే భారీ మొత్తంతో కుదుర్చుకోవడం ఏమిటన్నది బి‌జే‌పి ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ దీనినే అవకాశంగా తీసుకుంటోంది. మధ్యవర్తులకు అవినీతి డబ్బు చెల్లించిన కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టె ప్రక్రియను తాము ప్రారంభించామని, ఆ ప్రక్రియను కొనసాగించే బదులు కొత్త ఒప్పందం బి‌జే‌పి కుదుర్చుకున్నదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణకు బి‌జే‌పి నుండి సరైన సమాధానం లేదు. ఛానెళ్ల చర్చల్లో కూడా బి‌జే‌పి నేతలు కప్పదాటు వ్యాఖ్యలతో తడబడుతున్నారే గానీ సమర్ధించుకోలేక పోతున్నారు.

నావల్ యుటిలిటీ హెలికాప్టర్ (ఎన్‌యూ‌హెచ్) కాంట్రాక్టు నౌకాదళం వినియోగానికి ఉద్దేశించినది. అప్పటికే ఆరోపణల్లో ఉన్న కంపెనీతో ఒప్పందానికి రావడానికి బి‌జే‌పికి ఉన్న కారణం ‘మేక్ ఇన్ ఇండియా’. నేవీ హెలికాప్టర్ ఒప్పందానికి మోడి ప్రభుత్వం ఒక షరతు విధించింది. దాని ప్రకారం ఆగస్టా వెస్ట్ ల్యాండ్ నుండి 100 హెలికాప్టర్ల డిజైన్ కు ఇండియా డబ్బు చెల్లిస్తుంది. ఆ హెలికాప్టర్ల తయారీ ఇండియాలోని భాగస్వామ్య కంపెనీల ద్వారా జరగాలి. తద్వారా ఇటలీ-బ్రిటన్ కంపెనీ ఇండియాలో హెలికాప్టర్లు తయారు చేసిన ఖ్యాతి దక్కించుకోవాలని మోడి ప్రభుత్వం తలపోసింది. అనగా ‘మేక్ ఇన్ ఇండియా’ కీర్తి కండూతి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీకి డిఫెన్స్ కాంట్రాక్టు ఇచ్చేందుకు మోడి ప్రభుత్వాన్ని ప్రోద్బలించింది.

ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ ప్రకారం AW-109 మోడల్ హెలికాప్టర్ల డిజైన్ ను అగస్టా వెస్ట్ లాండ్ / ఫిన్ మెక్కానికా సరఫరా చేస్తోంది. కాప్టర్ విడి భాగాలను కంపెనీ సరఫరా చేస్తుంది. వాటిని ఇండియాలో అసెంబుల్ చేయడానికి టాటా గ్రూప్, రిలయన్స్ డిఫెన్స్ అండ్ ఏరో స్పేస్, యాక్సిస్ ఏరో స్పేస్, భారత్ ఫోర్జ్, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, లార్సన్ టుబ్రో లతో కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఆ విధంగా భారత కంపెనీలు హెలికాప్టర్లను ఇండియాలో తయారు చేసినట్లు అవుతుంది. ఈ ఒప్పందాన్ని కూడా యూ‌పి‌ఏ ప్రభుత్వమే 2012లో ప్రారంభించింది. అయితే తయారు చేసిన హెలికాప్టర్ల సరఫరాకు యూ‌పి‌ఏ ప్రభుత్వం ఒప్పందం చేసుకోగా ఎన్‌డి‌ఏ ప్రభుత్వం దానిని రద్దు చేసి కొత్త షరతులతో (ఇండియాలో తయారీ చేయాలి) పునరుద్ధరించింది.

ఒక సంగతి స్పష్టంగా గుర్తించాలి. పైకి ఎన్ని నీతి కబుర్లు చెప్పినా వేల కోట్ల డబ్బు చెల్లింపులు ఇమిడి ఉండే డిఫెన్స్ కాంట్రాక్టులలో ముడుపులు చెల్లించడం తప్పనిసరిగా జరిగి తీరుతుంది. కాకపోతే ఆ ముడుపుల చెల్లింపు వివాదాస్పదం కాకుండా చూసుకోవడంలో సంబంధిత పాలకులు విజయవంతం అయ్యారా లేక విఫలం అయ్యారా అన్నదే చర్చ గానీ ముడుపులు చెల్లించారా లేదా అన్నది చర్చ కానే కాదు.

డిఫెన్స్ కంపెనీలు చిన్నా చితకా కంపెనీలు కావు. భారీ బహుళజాతి కంపెనీలు. డిఫెన్స్ పరికరాల తయారీయే భారీ ప్రక్రియలతో కూడుకుని ఉంటుంది. ఒక కాంట్రాక్టు పరిపూర్తి చేయడానికి యేళ్ళ తరబడి సమయం పడుతుంది. డిఫెన్స్ కొనుగోళ్ల కోసం బడ్జెట్ లో ఇండియా యేటా లక్షల కోట్లను కేటాయిస్తుంది. కేటాయింపులు పోను రుణాలు కూడా తీసుకుంటూ ఉంటారు.

భారీతనం వల్ల ఒక్కోసారి ఒకటి రెండు కంపెనీలు కలిపి ఉమ్మడిగా కాంట్రాక్టును తీసుకుంటాయి. మూడు నాలుగు దేశాలు ఒక కన్సార్టియంగా ఏర్పడి ఫైటర్ జెట్ విమానాలు, మిసైల్ రక్షణ వ్యవస్ధలు లాంటివి నిర్మిస్తూ ఉంటాయి కూడా.

డిఫెన్స్ కాంట్రాక్టుల కోసం బహుళజాతి కంపెనీల మధ్య పోటీ కూడా భారీగానే ఉంటుంది. అమెరికా, ఐరోపా ప్రభుత్వాలు డిఫెన్స్ కంపెనీలకు పెద్ద మొత్తంలో సబ్సిడీ మద్దతు కూడా సమకూర్చుతాయి. తద్వారా ధరలు తగ్గించి తమ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ లో సమర్ధవంతంగా పోటీ పడేందుకు చర్యలు తీసుకుంటాయి. ఈ పోటీ వలన కొనుగోలుదారు దేశాల మంత్రులు, అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు ముట్ట జెప్పడానికి డిఫెన్స్ కంపెనీలు ముందుకు వస్తాయి. ముడుపులు లేని డిఫెన్స్ కాంట్రాక్ట్ అనేది ఉండనే ఉండదు. ఈ సంగతి అనేకమంది రిటైర్డ్ నేవీ, ఆర్మీ, వాయు బలగాల అధిపతులు దఫాదఫాలుగా తేల్చి చెప్పారు.

కనుక అగస్టా వెస్ట్ ల్యాండ్ తో తాజాగా కుదుర్చుకున్న ఒప్పందంలో ముడుపుల చెల్లింపు జరిగిందా లేదా అని ఎవరైనా ప్రశ్నిస్తే అది అమాయకత్వం అవుతుంది. వి‌వి‌ఐ‌పి ఛాపర్ ఒప్పందం విషయమూ అంతే. సోనియాకు ముడుపులు ముట్టాయా లేదా అన్న ప్రశ్న అర్ధ రహితం. ముడుపులను అడ్డుకుంటే రాజకీయాలను శాసించే స్ధానంలో వారు ఉండలేరు.    

ఫిన్ మెక్కానికా – అగస్టా వెస్ట్ ల్యాండ్ కంపెనీతో పూర్తిగా సంబంధాలు తెంచుకోవడం భారత ప్రభుత్వానికి అది యూ‌పి‌ఏ ఐనా, ఎన్‌డి‌ఏ ఐనా లేదా కాంగ్రెస్ ఐనా, బి‌జే‌పి ఐనా సాధ్యం కాదు. ఒక కంపెనీతో సంబంధం తెంచుకుంటే ఆ ప్రభావం ఇతర కాంట్రాక్టులపై పడి తీరుతుంది. ఒక కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం అంటే మార్కెట్ లో పోటీదారులను తగ్గించుకోవడమే అవుతుంది. పోటీదారులు తగ్గితే సరుకు ధర పెరుగుతుంది. మరింత డబ్బు వెచ్చించాల్సి వస్తుంది.

కనుక డిఫెన్స్ కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టె పనిని ప్రభుత్వాలు పూనుకోవు. అగస్టా వెస్ట్ లాండ్ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టే ప్రక్రియను తామే ప్రారంభించామని కాంగ్రెస్ చెబుతున్నది అవాస్తవం. ప్రాస్పెక్టివ్ ప్రాతిపదికన కొన్ని కాంట్రాక్టులపై నిబంధనలు విధించడం మాత్రమే జరిగింది. అయితే నేవీ యుటిలిటీ హెలికాప్టర్ కోసం మోడి ప్రభుత్వం ఈ నిబంధనలు కూడా సడలించిన మాట వాస్తవమే. (ద వైర్, 27/04/2016)

ఫిన్ మెక్కానికాకు చెందిన వివిధ అనుబంధ కంపెనీలతో భారత ప్రభుత్వం అనేక డిఫెన్స్ పరికరాల సరఫరాకు ఒప్పందాలు చేసుకుంది. వివిధ ఒప్పందాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఆ ఒప్పందాలను చూస్తే ఫిన్ మెక్కానికాను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం ఎన్‌డి‌ఏ కు గానీ, యూ‌పి‌ఏ కు గానీ సాధ్యం కాదని తెలుస్తుంది.

ఉదాహరణకి కొన్ని ఒప్పందాలు: ఫ్రాన్స్ కంపెనీ దస్సాల్ట్ ఏవియేషన్ కంపెనీ నుండి రాఫెల్ జెట్ ఫైటర్ల కొనుగోలు. ఈ జెట్ ల తయారీలో ఫిన్ మెకానికా భాగస్వామ్యం ఉన్నది. దేశీయ తయారీ విమాన వాహక నౌక కోసం ‘Selex – ES’ (ఫిన్ మెకానికా అనుబంధ) కంపెనీ తయారు చేసే వాయు నిఘా రాడార్ల కొనుగోలు; మరో అనుబంధ కంపెనీ WASS నుండి సబ్ మెరైన్ టార్పెడోలను ఆధునీకరించే టెక్నాలజీ కొనుగోలు; నేవీ కోసం అగస్టా వెస్ట్ ల్యాండ్ అనుబంధ (భాగస్వామ్యం) NH90 ఇండస్ట్రీస్ నుండి మల్టీ-రోల్ హెలికాప్టర్ల కొనుగోలు; ఫిన్ మెకానికాతో కలిసి నిఘా సమాచార సేకరణ విమానాల ఉమ్మడి అభివృద్ధి; మధ్య తరహా C-27J ఎయిర్ లిఫ్టర్ విమానాల ఉమ్మడి అభివృద్ధి; టాటా సన్స్ తో కలిసి AW 119 హెలికాప్టర్ల తయారీ; ఫిన్ మెకానికా అనుబంధ ఒటో మెలరా నుండి 76 mm నావల్ తుపాకుల సరఫరా; ఫిన్ మెకానికా అనుబంధ కంపెనీల నుండి రైల్వేల అవసరాలకు ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిగ్నలింగ్ టెక్నాలజీ సరఫరా.

ఇవి కొన్ని కీలక ఒప్పందాలు మాత్రమే. ఫిన్ మెకానికా కంపెనీ ప్రపంచంలో ఆధునిక టెక్నాలజీతో డిఫెన్స్ పరికరాలు తయారు చేసే ముఖ్య కంపెనీలలో  ఒకటి. అలాంటి కంపెనీతో సంబంధాలు తెంచుకోవాలనో, లేదా తెంచుకుంటామనో పాలక పార్టీలు చేస్తున్న యాగీ అంతా ఒట్టి ఓటి చప్పుళ్ళు మాత్రమే. పత్రికలు, చానెళ్ల ముందు సారం లేని ఆరోపణలు గుప్పిస్తున్న కాంగ్రెస్, బి‌జే‌పి లలో ఏ పార్టీకీ ఫిన్ మెకానికాతో సంబంధాలు తెంచుకునే దమ్ము లేదు. ఆ వంకతో ఆవలి పక్షాన్ని అప్రతిష్టపాలు చేసి రాజకీయంగా పై చేయి సాధించడానికి మాత్రమే ఇరు పార్టీలు కృషి చేస్తున్నాయి. తద్వారా ప్రజలను వెర్రి వాజమ్మలు చేస్తున్నాయి.

అయితే దేశంలో ప్రతిపక్ష నేతను ఇరికించడానికి విదేశీ ప్రభుత్వంతో ఒక రహస్య ఒప్పందానికి వచ్చారని సాక్షాత్తు ప్రధాన మంత్రిపైనే ఆరోపణ రావడం మాత్రం తీవ్రమైన విషయమే. రాజకీయంగా తేల్చుకునే బదులు ప్రతిపక్షానికి వ్యతిరేకంగా విదేశీ ప్రభుత్వంతో కుమ్మక్కు కావడం సహించరాని విషయం. ప్రజాస్వామ్య వ్యవస్ధలో ప్రతిపక్షం పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకంగా ఒకరు పూనుకుని వివరించవలసిన అవసరం లేదు. ప్రతిపక్షానికి రాజ్యాంగబద్ధంగానే ఒక పాత్ర అప్పగించబడింది. ఆ పాత్రను పోషించకుండా అడ్డుకునేందుకు విదేశీ ప్రభుత్వంతో కుమ్మక్కు కావడం కనీ వినీ ఎరుగనిది. ఇందులో నిజా నిజాలు తేల్చి ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత పత్రికలపై ఉన్నది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s