భారత వ్యవసాయరంగంలో మార్పులపై ఒక నోట్ – పార్ట్ 15
–
చాప్టర్ VI
(14 వ భాగం తరువాత…..)
చర్చ
భారత వ్యవసాయంలో ఉత్పత్తి విధానాన్ని అర్ధం చేసుకోవాలంటే మనం భారత సామాజిక వ్యవస్ధలోని ఉత్పత్తి సంబంధం ప్రధాన ధోరణి ఏమిటో లేక ఏ ఉత్పత్తి సంబంధం ఆధిపత్యం వహిస్తున్నదో గుర్తించాలి. ‘వివిధ స్వచ్చమైన ఉత్పత్తి విధానాలు నిర్దిష్ట పద్ధతిలో ఒకదానిపై మరొకటి విస్తరించి ఉన్నసామాజిక ఏర్పాటు’గా భారత దేశ ఉత్పత్తి విధానాన్ని వివరించే చర్చలోకి ప్రస్తుతం మనం వెళ్ళడం లేదు. అత్యవసరవాదం (essentialism) మరియు నిర్మాణవాద అనంతర వాదం(Post-Structuralism) మధ్య చర్చ యొక్క తాత్విక వైఖరిపై విరివిగా చర్చ చేయాలి. ఇందులో ‘ఒక సంక్లిష్ట వ్యవస్ధలో నిర్ధారణలకు వచ్చే ధోరణి’గా విమర్శించబడిన ద్వి (బైనరీ) అంశ ఉనికి సమస్యను కలిపి చర్చించాలి.
[“వివిధ స్వచ్చమైన ఉత్పత్తి విధానాలు నిర్దిష్ట పద్ధతిలో ఒకదానిపై మరొకటి విస్తరించడం” అంటే.. బానిస, ఫ్యూడల్, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాలు స్పష్టంగా, స్వచ్ఛంగా లేకుండా ఒకదానితో ఒకటి మిళితం అయినట్లుగా ఉండడం. ఇండియాలో ఫ్యూడల్ సమాజం ప్రజాస్వామిక విప్లవం ద్వారా పెట్టుబడిదారీ సమాజంగా మారక మునుపే బ్రిటిష్ వలస పాలన ప్రవేశించి ఫ్యూడల్ పునాదులను కదల్చకుండా పెట్టుబడిదారీ ఉత్పత్తిని ప్రవేశపెట్టింది.
ఫలితంగా ఇండియాలోని ఫ్యూడల్ పునాదులు అర్ధ ఫ్యూడల్-వలస పునాదులుగా మారాయి. బ్రిటిష్ వాడు వెళ్లిపోయాక అర్ధ ఫ్యూడల్-అర్ధ వలస పునాదులుగా మారాయి. అంటే సగం భూస్వామ్య ఉత్పత్తి విధానం, సగం వలస ఉత్పత్తి విధానం! అటు పూర్తి భూస్వామ్యమూ కాదు, ఇటు పూర్తి వలసా కాదు. దీనినే అర్ధ వలస ఉత్పత్తి విధానంలో సామ్రాజ్యవాదం కోసమే ఉత్పత్తి జరుగుతుంది. అర్ధ భూస్వామ్యంలో భూస్వాములే సామ్రాజ్యవాదులకు సేవ చేసే పెట్టుబడిదారీ వర్గంగా కూడా ఉంటారు.
అత్యవసరవాదం (essentialism): ఒక అంశం (ఓ జంతువు లేదా ఒక ప్రజా సమూహం లేదా ఒక భౌతిక వస్తువు, ఒక సిద్ధాంతం) తన ఉనికి, గుర్తింపు, ప్రమేయం కలిగి ఉండాలంటే నిర్దిష్ట లక్షణాలను కలిగి ఉండడం అత్యవసరం అని చెప్పేది అత్యవసరవాదం. ఈ అవగాహనలో ఆయా అంశాలు ఎల్లప్పుడూ ఒకే విధంగా, మార్పు లేకుండా ఉంటాయి. మార్క్సిస్టు తత్వం ప్రకారం ప్రతి అంశం ఎల్లప్పుడూ మార్పులకు లోనవుతూ ఉంటుంది. నిర్దిష్ట గమన సూత్రాల ప్రకారం ఆయా మార్పులు జరుగుతాయి.
నిర్మాణవాదం (structuralism) తర్వాత ఉనికిలోకి వచ్చిన వాదాన్ని నిర్మాణవాదానంతర వాదం అంటున్నారు. మానవ సంస్కృతిని ఒక పెద్ద వ్యవస్ధ లేదా నిర్మాణంతో సంబంధం కలిగి ఉండడంలో భాగంగా అర్ధం చేసుకోవాలని నిర్మాణవాదం చెబుతుంది. ఈ దృక్పధం నుండి మనుషులు చేసే, ఆలోచించే, భావించే, అనుభూతించే సమస్త అంశాల నిర్మాణాలను కనిపెట్టేందుకు కృషి చేస్తుంది.
మానవ జీవనం యొక్క దృగ్విషయాలు (phenomena) తమ తమ అంతస్సంబంధాల ద్వారా తప్ప స్పష్టతను పొందలేవని నిర్మాణవాదం భావిస్తుంది. ఈ సంబంధాలే నిర్మాణాన్ని ఏర్పరుస్తాయనీ పైకి వివిధ రూపాల్లో కనపడినప్పటికీ లోపల ఈ నిర్మాణమే స్ధిరంగా ఉంటుందని చెబుతుంది. 1950, 60లలో ఐరోపాలో ముఖ్యంగా ఫ్రాన్స్ లో వేళ్లూనిన నిర్మాణ వాదంను విమర్శిస్తూ Post-Structuralism అవతరించింది. ప్రతి అంశం లోనూ రెండు అంశాలుంటాయన్న మార్క్సిస్టు తాత్విక అంశాన్ని Structuralism కూడా బోధిస్తుంది కానీ అందులో వైరుధ్య దృక్పధం కనిపించదు.
ఈ వాదాలలోని కొన్ని అంశాలు మార్క్సిస్టు తాత్విక దృక్పధంలోని అంశాలను పోలి ఉంటాయి. కానీ అంతిమంగా అవి సమాజ మార్పు అనివార్యం అన్న అంశాన్ని తృణీకరిస్తాయి లేదా పట్టించుకోవు. ఈ తత్వ చింతనలు మానవ జీవనం ఆవల నర్తిస్తూ సిద్ధాంత చర్చల్లో మునిగి ఉండడం తప్ప ఆచరణలో ఉండలేవు. -అను]
ఉత్పాదక శక్తులు లేదా పంపిణీ సంబంధాలలోని మార్పుల యొక్క పరోక్ష సాక్షాలపై ఆధారపడి ఉత్పత్తి విధానాన్ని అర్ధం చేసుకోరాదు (నిర్ధారించరాదు). సామ్రాజ్యవాద యుగంలో, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం, పెట్టుబడిదారీ పూర్వ, పెట్టుబడిదారీయేతర ఉత్పత్తి విధానాల “పరస్పర చర్యల ద్వారా ఒక కొత్తది, సమ్మేళనంతో కూడిన ఉత్పత్తి విధానం ఉద్భవించవచ్చు” (Grundrisse: Karl Marx) అన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం “కేవలం భౌతిక ఉత్పత్తులను మాత్రమే కాకుండా భౌతిక ఉత్పత్తులను ఉత్పత్తి చేసే ఉత్పత్తి సంబంధాలను, తద్వారా సంబంధిత పంపిణీ సంబంధాలను కూడా నిరంతరాయంగా ఉత్పత్తి చేస్తూ ఉంటుంది.” (Capital Vol III, పేజీ 879)
కాబట్టి (ఉత్పత్తి విధానం నిర్ధారణలో) భౌతిక ఉత్పత్తుల ఉత్పత్తి ఒక్కటే నిర్ణాయక పాత్ర వహించదు. పెట్టుబడిదారీ వ్యవసాయంలో ఉత్పత్తులు సరుకులు గానూ ఆ సరుకు పెట్టుబడి యొక్క ఉత్పత్తి గానూ స్ధానం/లక్షణం కలిగి ఉంటాయి. ఇదే చలామణీ సంబంధం (circulation relation) గురించి వివరిస్తుంది. దీనిని ఉత్పత్తి సంబంధం (production relation) నుండి వేరు పరిచి చూడాలి. ఇవి రెండూ పరస్పరం సంబంధం కలిగినవే గానీ ఒకటి కాదు. ఉత్పత్తి, పంపిణీ, మారకం, వినియోగం… ఇవన్నీ ఒకటి కాదు. ఎలాగంటే…
“ఒక నిర్దిష్ట ఉత్పత్తి ఒక నిర్దిష్ట వినియోగం, పంపిణీ, మారకం లతో పాటుగా ఈ వివిధ కదలికల మధ్య ఏర్పడే నిర్దిష్ట సంబంధాలనూ నిర్ణయిస్తుంది. అయితే తన ఒకవైపు (పాక్షిక) రూపంలో ఉత్పత్తి దానికదే ఇతర కదలికల ద్వారా నిర్ధారించబడుతుంది. ఉదాహరణకి మార్కెట్ -మారక రంగం- విస్తరిస్తే అప్పుడు ఉత్పత్తి పరిమాణం పెరిగి అది (మార్కెట్) వివిధ శాఖలుగా మరింత లోతుగా విభజనకు గురవుతుంది. పంపిణీలో వచ్చే ఒక మార్పు ఉత్పత్తిలో మార్పులకు దోహదం చేస్తుంది. ఉదా: పెట్టుబడి కేంద్రీకరణ, పట్టణం మరియు గ్రామాల మధ్య జనాభా భిన్న రీతుల్లో పంపిణీకి గురి కావడం మొ.వి. అంతిమంగా వినియోగం అవసరాలు ఉత్పత్తిని నిర్ధారిస్తాయి. వివిధ కదలికల (ఉత్పత్తి, పంపిణీ, మారకం, వినియోగం) మధ్య పరస్పరం చర్యలు జరుపుతాయి. ప్రతి సేంద్రియ (organic) అంశంలోనూ ఇది జరుగుతుంది. (Grundrisse: Marxist Internet Archive)
“వలయం (circuit) యొక్క మూడు సూత్రాలు” గురించి కేపిటల్ వాల్యూం II, చాప్టర్ IV లో చర్చిస్తూ కారల్ మార్క్స్ ఇలా చెప్పారు “M-MP ప్రక్రియ పూర్తయిన వెంటనే సరుకులు (MP) సరుకులుగా ఉనికిని కోల్పోయి పారిశ్రామిక పెట్టుబడి యొక్క క్రియాత్మక రూపాలలో ఒకటైన ఉత్పాదక పెట్టుబడి (P) గా ఉనికిలో ఉంటుంది. తద్వారా వాటి పుట్టుక స్ధానం (origin) రూపుమాసిపోతుంది. ఇక నుండి అవి పారిశ్రామిక పెట్టుబడి రూపాలుగా మాత్రమే ఉనికిని కలిగి ఉంటాయి. అయితే, ఆ సరుకులను ప్రతిక్షేపించాలంటే (replace) వాటిని పునరుత్పత్తి చేయవలసిందే అన్నది ఇప్పటికీ వాస్తవమే. ఈ మేరకు పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం తన సొంత అభివృద్ధి దశకు ఆవల ఉనికిని కలిగిన ఉత్పత్తి విధానంపై షరతుగా ఆధారపడి ఉంటుంది.” (కేపిటల్ II, పేజీ 113)
పంపిణీ ఫలితంగా మాత్రమే ఉత్పత్తి పంపిణీ తన ఉనికిని చాటుతుందనీ ఇది ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా ఇమిడి ఉంటుందని కారల్ మార్క్స్ Grundrisse లో చెప్పారు. కనుక వ్యవసాయంలో పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్ని “వాటి అంతర్గత పంపిణీని విస్మరిస్తూ పరిశీలించడం అంటే అదొక ఖాళీ సంగ్రహమే (సారాంశం లేనిదానిని సంగ్రహించడం) అవుతుంది.” (Grundrisse: Marxist Internet Archive)
[దీని అర్ధం వ్యవసాయం రంగంలో ఉనికిలో ఉన్న ఉత్పత్తి విధానంలో అంతర్గతంగా ఉన్న పంపిణీ విధానాన్ని పట్టించుకోకుండా అది ఫలానా ఉత్పత్తి విధానంగా నిర్ధారించడం సరైన పరిశీలన కాదు అని. ప్రస్తుత సందర్భానికి అన్వయించుకుని చెప్పుకుంటే అంతర్గత వ్యవసాయరంగంలో పంపిణీ అర్ధవలస, అర్ధ భూస్వామ్య పునాదిపై ఆధారపడి ఉండగానే దాని ఫలితమైన ఉత్పత్తి పంపిణీ పెట్టుబడిదారీ పద్ధతిలో జరగడం సాధ్యమే. అందువలన పైకి కనపడే పెట్టుబడిదారీ పంపిణీని చూసి ఉత్పత్తి విధానాన్ని పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంగా చెప్పడం సరైన పరిశీలన కాదు. -అను)
ఇవి మార్క్సిస్టు అవగాహన లోని ముఖ్యమైన అంశాలు. వీటిని తప్పనిసరిగా గమనంలో ఉంచుకోవాలి.
కేపిటల్ గ్రంధంలో కారల్ మార్క్స్ వివరించినట్లుగా వ్యవసాయరంగం పెట్టుబడిదారీ విధానంలోకి మార్పు చెందడానికి ప్రాధమిక సంచయం (primitive accumulation) షరతుగా ఉంటుంది. ప్రాధమిక సంచయం ఐరోపాలో మూడు విధాలుగా జరిగింది. 1. వలస దోపిడీ, 2. అంతర్జాతీయ రుణాలు, 3. స్వదేశంలోని రైతాంగంపై తీవ్ర స్ధాయి దోపిడీ అమలు చేయడం.
- Ryotwari system
తర్వాత దశలో వలసలలో రెండు పద్ధతులు ప్రధానంగా అవతరించాయి.
1) వారి మొత్తం ఉత్పాదకతను క్రమంగా తగ్గిస్తూ పోవడం ద్వారా రైతాంగానికి అందుబాటు అవకాశాలను తగ్గించడానికి ప్రయత్నించడం. (G Arrighi: Journal of Development Studies – 1967, 1970)
2) అర్ధ భూస్వామ్య భూమి ఆస్తి విధానాన్ని స్ధాపించి ఆ చట్రంలో రైతాంగాన్ని ఒక భాగంగా మార్చడం. ఈ వ్యూహాలలో ఆర్ధికంగా, కోశాగార (బడ్జెట్) విధానాల పరంగా, రాజకీయంగా, చట్టాల ద్వారా బలవంతం చేయడం నిర్ణయాత్మక అంశాలుగా ప్రయోగించారు.
వలస ప్రపంచంలో అర్ధ భూస్వామ్య భూమి ఆస్తి విధానం నెలకొల్పడం ద్వారా పశ్చిమ దేశాలలోని పెట్టుబడిదారీ విధానం, తమ సామ్రాజ్యవాద సంచయ ప్రక్రియకు నేరుగా సేవ చేసే వెనుకబాటు ఉత్పత్తి విధానాన్ని (తమ వలస దేశాలలో) గ్యారంటీ చేసుకుంది.
వలసల నుండి పెట్టుబడిని తరలించుకు వెళ్ళడం, పెట్టుబడీకరణ జరగకుండా భారీ ఎత్తున చర్యలు చేపట్టడం, మదుపు (investment) ప్రక్రియలలో ముఖ్యంగా వాణిజ్యం మరియు మనీ లెండింగ్ (డబ్బు ఋణ సేవ) లలో ఉత్పాదకత రహిత రూపాల ఆధిపత్యం కొనసాగేలా చేయడం, వలస దేశాలను దిగుమతులతో నింపివేయడం, ప్రాధమిక సరుకుల రంగంలో సంచయం యొక్క నిలకడలేమి స్వభావం… ఇవన్నీ భారత వ్యవసాయరంగంలో ప్రాధమిక సంచయం జరగడానికి ఆటంకాలుగా పని చేశాయి.
మొగలుల ఇండియాలో వ్యవసాయ ఉత్పత్తి పంపిణీని మరియు రైతులు తమ శ్రామిక శక్తి, కుటుంబ అవసరాలకు సరిపడే ఉత్పత్తికి పోను పెట్టుబడిదారీ పూర్వ / ఫ్యూడల్ ప్రభువులకు మిగిల్చి ఇచ్చిన మిగులు ఉత్పత్తినీ పరిశీలించినట్లయితే అత్యధిక రేటులో ఫ్యూడల్ దోపిడీ సాగించడం వల్లనే ఫ్యూడల్ దోపిడీ మనగలిగిందని, అది ఉత్పత్తి విధానం సాధారణ భౌగోళిక వాతావరణంలో పెట్టుబడిదారీ విధానంగా మారకుండా అడ్డు పడిందని అర్ధం అవుతుంది. పెట్టుబడి సంచయం వ్యవసాయ ఉత్పత్తి స్ధాయి ద్వారా మాత్రమే కాకుండా దోపిడీ విధానం మరియు వ్యవసాయ మిగులు ఉత్పత్తి యొక్క అంతిమ పంపిణీల ద్వారా కూడా నిర్ణయించబడుతుంది.
పైగా, మార్క్స్ చెప్పినట్లుగా వ్యవసాయరంగంలో ఉత్పత్తి సాధనాలపై ఉమ్మడి యాజమాన్యం, సామాజికార్ధిక అభివృద్ధి ప్రక్రియలు పశ్చిమ యూరప్ తో పోల్చితే విభిన్నంగా ఉండినాయి. కనుక ఆకాలంలో ప్రైవేటు ఆస్తి సంబంధాలు పరిపక్వ దశకు చేరుకోకుండా రాజ్య ఆస్తి రూపం (భూములన్నీ రాజ్యం ఆస్తిగా ఉండడం), పిండ దశలోనే ఉన్న ప్రైవేటు ఆస్తి రూపం.. ప్రధాన అడ్డంకులుగా పని చేశాయి. ఓ వైపు భూమి, భూకమతాలు రాజ్యం ఆస్తిగా ఉండడం మరో వైపు వ్యక్తిగత కౌలు వసూలు దారులు.. ఈ రెండింటి మధ్య వైరుధ్యం కొట్టవచ్చినట్లు వ్యక్తం అయింది. సంపూర్ణ భూమి అద్దె (absolute volume of rent) మొత్తాన్ని పెంచుకోవడానికి జరిగిన ప్రయత్నాలను కులీన వర్గాలు, భూముల సొంతదారులు ప్రతిఘటించారు.
భారత వ్యవసాయంలో భూమి శిస్తు తదితర రూపాలలో వసూలు చేయబడిన అధిక (సాపేక్షికంగా) ఉత్పత్తి మిగులు రేటు శిస్తు రైతుల చేతుల్లోని వ్యవసాయ ఉత్పత్తిని సరుకుగా మార్చడానికి దోహదపడింది. కానీ వ్యవసాయ ఉత్పత్తి, వాణీజ్యకరణ చెందడం సాధ్యం కాలేదు. ఎందుకంటే మిగులు ఉత్పత్తి కౌలు, అధిక వడ్డీలుగా స్వాయత్తం అయిపోవడంతో అది ఉత్పత్తి సాధనాల కొనుగోలుకు పోను మిగులు ఉత్పత్తిగా మార్కెట్ లో మారకంలోకి వెళ్ళడం, అనంతరం విస్తరించబడిన పునరుత్పత్తిలోకి ప్రవేశించడం జరగలేదు.
పెట్టుబడిదారీ వ్యవసాయ ఉత్పత్తి విధానం అభివృద్ధి చెందకుండా ఆటంకపరిచిన మరో ముఖ్య కారణం ఏమిటంటే రుణాల కింద నలిగిపోయిన రైతుల చేతుల నుండి భూములు మనీ లెండర్ (డబ్బు రుణదాతలు) చేతుల్లోకి వెళ్లకుండా భూ యజమాన్య కులాలు అడ్డుకున్నాయి. బ్రిటిష్ వలసవాదులు ఇండియాను ఆక్రమించినప్పుడు వణిజ కులాలు, ఋణ దాత కులాల కింద భూములు దాదాపు లేవని చెప్పవచ్చు.
సంక్లిష్టమైన మిలిటరీ, పోలీసు పాలనా వ్యవస్ధ ద్వారా బ్రిటిష్ పెట్టుబడిదారీ వ్యవస్ధ, సాపేక్షికంగా వెనుకబడిన పెట్టుబడిదారీ పూర్వ వ్యవస్ధలో జోక్యం చేసుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన శాశ్వత సెటిల్మెంటు పద్ధతి ఫ్యూడల్ మిలటరీ అనుచరవర్గాన్ని రద్దు చేయలేదు. ఇది (రద్దు చేయడం) వ్యవసాయంలో ప్రాధమిక పెట్టుబడిదారీ సంచయానికి ముఖ్యమైన షరతు. రైత్వారీ ప్రాంతాల్లో గ్రామీణ కులీన వర్గాలు స్వతంత్ర యాజమాన్యానికి అవకాశం ఇచ్చాయి. కానీ అధిక, అదనపు భూమి శిస్తుల వల్ల భూమి యజమానులు ఋణ దాతలకు పెద్ద మొత్తంలో అప్పులు పడవలసి వచ్చింది.
జపాన్ సంస్కరణల ద్వారా జరిగినట్లుగా స్ధిర మొత్తాలలో డబ్బు చెల్లింపులతో కూడిన దీర్ఘ కాలిక లీజులు, వ్యవసాయ ధరలు నిలకడగా పెరగడం లాంటి పెట్టుబడిదారీ రైతు ఉద్భవించడానికి కావలసిన షరతులు కూడా ఇక్కడ చోటు చేసుకోలేదు.
గ్రామీణ భారతంలో అటు శాశ్వత సెటిలెంట్లలో, ఇటు రైత్వారీ సంస్కరణల ప్రాంతాల లోనూ ఔత్సాహిక పారిశ్రామిక శక్తులు అభివృద్ధి చెందకుండా బ్రిటిష్ భూమి శిస్తు వ్యవస్ధ అడ్డుకుంది. దానితో ఈ ప్రాంతాల్లో ఉన్నత స్ధాయి వర్గం భూములు సబ్ లీజుకు ఇవ్వడం, డబ్బు అప్పులుగా ఇవ్వడం, వాణిజ్యంలోకి దిగడం ప్రారంభించారు. అనుత్పాదక పద్ధతులలో లాభం పొందడం అన్నది వ్యవసాయ ఉత్పత్తి వాణిజ్యీకరణ వైపుగా ఒత్తిడి చేసి పెంచింది గాని తగినంత భారీ మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తి వాణిజ్యీకరణ చెందడానికి దారి తీయలేదు.
(…………సశేషం)
respected sir
please elaborate about structuralism
thanking you
లోక్ నాధ్ గారూ 5, 6 పేరాల్లో నిర్మాణవాదం గురించి రాశాను. దాని గురించి అంతకు మించి వివరించడం అనువాదం పరిధిలో లేదు. అంత అవసరమూ లేదు. ధనికవర్గాల తాత్వికులు ప్రస్తుతం post-structuralism, post-modernism లలో తల మునకలై ఉన్నారు. ఇవి ప్రజల ప్రయోజనాలు పట్టించుకోవు. సందర్భం (తాత్విక చర్చ) వచ్చినపుడు వీలైతే వివరంగా చూద్దాం.
thankyou vishakerji