“భారత రాజకీయ నాయకులు, మంత్రులు, బ్యూరోక్రాట్ అధికారుల అవినీతికీ, అత్యాశకూ నిలువెత్తు గుర్తుగా నిలిచిన ఆదర్శ హౌసింగ్ సొసైటీ టవర్ ని కూల దోయండి” అని ముంబై హై కోర్టు శుక్రవారం (ఏప్రిల్ 29) తీర్పు ప్రకటించింది.
“ఈ అవినీతిలో భాగం పంచుకున్న నేతలు, అధికారులు అందరి పైనా, అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు క్రిమినల్ కేసులు నమోదు చేయాలి” అని హై కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
ఆదర్శ హౌసింగ్ సొసైటీ భవన నిర్మాణం ‘అనాధికారికం, చట్ట విరుద్ధం’ కనుక దానిని కూల్చివేయాలని కేంద్ర అడవులు, పర్యావరణ మంత్రిత్వ శాఖ 2010లో ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను అమలు చేయరాదని కోరుతూ ఆదర్శ సౌసైటీ కోర్టును ఆశ్రయించింది. దరిమిలా కోర్టు విచారించి శుక్రవారం తీర్పు వెలువరించింది.
విచారణ సందర్భంగా 2011 మార్చిలో కేంద్ర ప్రభుత్వం తన ‘కూల్చివేత’ ఆదేశాలను పునరుద్ఘాటిస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. అలాగే ‘ప్రజా ఉద్యమ జాతీయ సంఘటన’ (ఎన్‌ఏపిఎం – నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్) పిటిషన్ విచారణలో ఇంప్లీడ్ అయింది.
“ఎన్‌ఏపిఎం జోక్యమే లేనట్లయితే పిటిషనర్లు (ఆదర్శ్ సొసైటీ) పాల్పడిన తీవ్ర ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చి ఉండేవి కావు” అని తీర్పు సందర్భంగా హై కోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించడం విశేషం. ఈ మేరకు తమ వ్యాఖ్యలను వారు తీర్పులో సైతం పొందుపరిచారు.
ఆదర్శ్ సౌసైటీ అపార్ట్ మెంట్ ఫ్లాట్ లను వాస్తవానికి మరణించిన సైనికుల కుటుంబాలకు ఉద్దేశించారు. సైన్యం ఆధీనంలో ఉన్న కోలాబా ఏరియాలోని భూముల్లో ఆదర్శ్ సౌసైటీ నిర్మాణం తలపెట్టారు. అసలు నిర్మాణ పధకం ప్రకారం 6 అంతస్ధుల భవనాన్ని నిర్మించాల్సి ఉండగా 31 అంతస్ధులను నిర్మించారు.
భవన నిర్మాణ విస్తరణకు ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాన్ని 5 రెట్లు విస్తరించారు. అందుకోసం పొరుగు భూములను సైతం ఆక్రమించారు. ఈ ప్రాంతం ముంబై నగరం అరేబియా సముద్ర తీరాన ఉండడంతో ఇందులో అపార్ట్ మెంటుల కోసం అనేకమంది రాజకీయ నాయకులు, అధికారులు, సెలబ్రిటీలు పోటీలు పడ్డారు.
ఫలితంగా అపార్ట్ మెంటు వాస్తవ లబ్దిదారులకు అందకుందా పోయింది. ఒక్కో అపార్ట్ మెంట్ ధర రు. 4 కోట్లకు పైగా పలికింది. అనేకమంది మంత్రులు, సివిల్స్, పోలీసు అధికారులు, ఆర్మీ మాజీ ఉన్నతాధికారులు అక్రమంగా బినామీ పేర్లతో అపార్ట్ మెంట్లు సంపాదించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కుటుంబ సభ్యులు ముగ్గురికి అపార్ట్ మెంట్లు ఉన్న సంగతి వెల్లడి కావడంతో ఆయన రాజీనామా చేయవలసి వచ్చింది. ఇతర ముఖ్యమంత్రులను కూడా విచారణ అధికారులు వివిధ సందర్భాలలో విచారణ చేశారు.
నిజానికి ఆదర్శ్ సౌసైటీ భవనం కేవలం టిప్ ఆఫ్ ద ఐస్ బర్గ్ మాత్రమే అన్నది అందరికీ తెలిసిన విషయమే. యేటా వందల, వేల కోట్ల అక్రమ ధనం ముంబై భూములు కేంద్రంగా చేతులు మారుతూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ అక్రమార్కులతో రాజకీయ నాయకులు, మంత్రులు, అధికారులు, సెలబ్రిటీలు కుమ్మక్కు కావడం సర్వ సాధారణం.
ముంబై నగరం నానాటికీ విస్తరిస్తూ పోవడం, అందుబాటులో ఉన్న భూ విస్తీర్ణం పరిమితంగానే ఉండడంతో అక్రమ సంపాదనా పరులకు, నల్లడబ్బు నిల్వలకు రియల్ ఎస్టేట్ ఒక ఉపకరణం అయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల ధనాన్ని చట్టం కంట పడకుండా దాచుకోగల వసతి ఏర్పడింది.
ఈ క్రమంలో బహుళజాతి కార్పొరేట్ కంపెనీలకు సైతం ముంబై రియల్ ఎస్టేట్, భవన నిర్మాణం ఆకర్షణీయం అయింది. అనగా స్వదేశీ భూ బకాశారులతో పాటుగా విదేశీ బహుళజాతి కంపెనీలకు కూడా ముంబై రియల్ ఎస్టేట్ రంగం, ముఖ్యంగా సముద్రం ఒడ్డున ఉన్న భూములలో భారీ పెట్టుబడులు దాచి పెడుతున్నాయి.
ఈ నేపధ్యంలో ఆదర్శ్ సొసైటీ భవనాన్ని కూల్చివేయాలన్న హై కోర్టు ఆదేశాలు అమలు కావడం సాధ్యమా అన్న ప్రశ్న ఉదయించక మానదు. తమ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసేందుకు 3 నెలల సమయాన్ని హై కోర్టు పిటిషన్ దారులకు ఇచ్చింది.
కోర్టు తీర్పు విషయాన్ని తాము ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని, వీలైనంత సహాయం చేస్తామన్న హామీ తమకు లభించిందని కూడా సొసైటీ ప్రతినిధులు చెబుతున్నందున సొసైటీ భవనం కూల్చివేతపై అనుమానాలు బలపడుతున్నాయి.
తమ వ్యాపారాలలోకి, అక్రమ ద్రవ్య కార్యకలాపాల లోకి కోర్టులు మితి మీరి చొరబడుతున్నాయని రాజకీయ నాయకులు భావిస్తున్నారు. కావాలంటే మీరూ వాటా తీసుకోండి అన్నది వారి అప్రకటిత ఉద్దేశ్యం. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు అన్నీ ఒకటి కావాలని ఇటీవల ఐపిఎల్ విచారణ సందర్భంగా కాంగ్రెస్, బిజేపి నేతలు పిలుపు ఇచ్చిన సంగతి గుర్తు చేసుకోవడం సముచితం కాగలదు.
అంత పెద్ద టవర్ ని కూల్చడం కూడా తప్పు కాదా? అక్రమాలు ఉంటే ప్రభుత్వమే స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వ కార్య కలాపాలకే వినియోగించేలా చేయకూడదా?
అశోక్ గారూ.
అంత డబ్బు పెట్టి కట్టింది కూల్చడం ఏమిటి, అనా మీ ప్రశ్న?
ఆ భవనం సిఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా కట్టినది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలు సరదాగా చేసినవి కావు. సముద్ర తీరం కోతకు గురి కాకుండా, పర్యావరణం దెబ్బ తినకుండా ఉండేందుకు చేసినవి.
సముద్రం ఒడ్డున వివిధ రకాల జీవులు ఆవాసం ఉంటాయి. సముద్ర జీవులు కూడా ఒడ్డుకు వస్తూ పోతూ ఉంటాయి. తద్వారా పర్యావరణ సమతుల్యానికి దోహదం చేస్తాయి. అలాంటి చోట్ల మనుషుల తాకిడి ఎక్కువైతే పర్యావరణం దెబ్బ తింటుంది.
ఆధునిక భవనాలలో వివిధ సౌకర్యాలు (ఏసి, ఫ్రిజ్, ఆధునిక టివి మొ.వి) ఈ సౌకర్యాలు పర్యావరణాన్ని దెబ్బ తీస్తాయి. భవన నివాసులు వినియోగించే కార్లు తదితర వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు సముద్ర తీరంలోని చిన్న, సూక్ష్మ జీవులకు హానికరం. ధనికులు గనక వారి కోసం ప్రత్యేక సెల్ టవర్, ప్రత్యేక రోడ్లు, షాపులు, ఆట స్ధలాలు వెంట వచ్చేస్తాయి. ఇవన్నీ సముద్ర తీర పర్యావరణంలో హానికరంగా జోక్యం చేసుకుంటాయి.
అక్రమంగా కట్టడాలు కట్టడం ఆ తర్వాత రెగ్యులరైజ్ అయ్యేలా ప్రభావితం చేయడం పట్టణాలు, నగరాల్లో ధనిక వర్గాలు చేసే పని. అక్కడి నిర్మాణ నిబంధనలు (కొన్ని) కూడా పర్యావరణాన్ని కాపాడేవే. ఇరుకుగా కడితే జన సాంద్రత పెరుగుతుంది. సాంద్రత పెరుగుదల CO2 ని పెంచుతుంది. ఇది ఇళ్ళల్లో ఉష్ణోగ్రతని పెంచుతుంది. వేడి తగ్గడం కోసం ఏసిలు పెరుగుతాయి. అనగా కర్బన ఉద్గారాలు పెరుగుతాయి. అంతిమంగా పర్యావరణానికి హాని కారం.
పర్యావరణానికి హానికరం అంటే అందులో నివసించే మనుషులకే ప్రమాదం. అందువలన ఆ భవనాన్ని కూల్చాలి.
ఆ ఒక్క భవనం కూల్చితే పర్యావరణం నిలుస్తుందా అని అడగరని ఆశిస్తాను. సుప్రీం కోర్టు కూడా ఇదే తీర్పు ఇస్తే భవిష్యత్ లో ఈ తీర్పు precedent అవుతుంది.