కార్పొరేట్ల లాభాలకే ఎగుమతి ఆధారిత వ్యవసాయం -14


Horticulture in India

(13వ భాగం తరువాత…..)

భారత వ్యవసాయరంగంలో మార్పులపై ఒక నోట్  :  పార్ట్ 14

ఎగుమతి ఆధారిత వ్యవసాయం మరియు పెట్టుబడి సంచయం

పాలకవర్గాలు భారత వ్యవసాయ రంగాన్ని ఎగుమతుల లక్ష్యంతో ఉత్పత్తి చేసే దిశకు మళ్లించడంపై దృష్టి పెట్టారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇండియాను ‘ప్రపంచం యొక్క నూతన ధాన్యాగారం’గా అభివర్ణించాడు. సునిల్ మిట్టల్ (భారతి) లాంటి కార్పొరేట్ ధనికులకు వేల ఎకరాలు కట్టబెడుతున్నారు. ఏ‌పి ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి వారు కాంట్రాక్టు వ్యవసాయం పైన ఆశలు రేకెత్తిస్తున్నారు. భారత వ్యవసాయరంగం అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మార్చడం ద్వారా అవకాశాలు సమకూరేది నిజమే గానీ ఆ అవకాశాలు విదేశీ స్వదేశీ కార్పొరేట్ రంగానికే తప్ప భారతీయ రైతులకు అందుబాటులో ఉండవు.

ఎగుమతుల రంగంలో కూడా భారత వ్యవసాయ మార్కెట్లలో అసమానతలు నెలకొని ఉన్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నప్పుడు సరఫరా మార్గాలను స్వాధీనంలో ఉంచుకున్న కార్పొరేట్లే ఇండియా ఉత్పత్తులను సేకరిస్తారు. దరిమిలా ఇలా సమకూరే లాభాలలో సింహ భాగం కార్పొరేట్ల వశం అవుతోంది. అంతర్జాతీయ ధరలు పెరిగితే దిగుమతులు పెరిగి దేశీయ ధరలను కుదించివేస్తున్నాయి. ఈ తగ్గుదల భారం మాత్రం రైతుల మీదికి మళ్లించబడుతోంది.

ఇలాంటి అనుభవం బ్రిటిష్ ఇండియాలోనూ రైతులకు ఉన్నది. నేడు అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లలో మూడో ప్రపంచ దేశాల ఎగుమతిదారులు కూడా ఇదే అనుభవం ఎదుర్కొంటున్నారు. ఇటీవలి వరకు మూడో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు వ్యవసాయ ఉత్పత్తిదారుల కోసం కొన్ని చర్యలు తీసుకునేవారు. భారీ మొత్తంలో ఆహార ధాన్యాల సేకరణ, స్ధిరీకరణ నిధుల ఏర్పాటు, ఆయా సరుకుల (కొకోవా, కాఫీ, చక్కెర, రబ్బర్ మొ.వి) ఎగుమతి దేశాలు శక్తివంతమైన కూటమిగా ఏర్పడడం మొ.వి అటువంటి చర్యలలో కొన్ని. ఇప్పుడు ఈ చర్యలు మృగ్యం అయ్యాయి.

దానితో మూడో ప్రపంచ వ్యవసాయ ఎగుమతి దారులు మధ్యకాలికంగా, ఉనికిలో ఉన్న ధరలను కాపాడుకోవడం అటుంచి ఎటువంటి లాభాలనూ పొందలేని స్ధితిలో ఉన్నారు. పైగా రైతులు విదేశీ మార్కెట్లలో అధిక డిమాండ్ పలికే, ఉన్నత ఆదాయవర్గాలకు మాత్రమే అందుబాటులో ఉండే హార్టికల్చర్, మాంసం, రొయ్యలు తదితర అధిక విలువ ఆహార ఉత్పత్తుల మీదికి దృష్టి మళ్లిస్తున్నారు. ఫలితంగా ఆహార ధాన్యాలపైన ఆధారపడి బతికే రైతుల జీవనాధారం మరింత కుచించుకుపోతున్నది.

రెండు దశాబ్దాల క్రితం ‘డబల్యూ‌టి‌ఓ వ్యవసాయ ఒప్పందం’ మేరకు భారత వ్యవసాయ రంగంలో రైతుల ప్రయోజనాలను కాపాడే సుంకాలను, సుంకాలు కానీ ఆటంకాలను (non-tariff barriers) పాలకులు తొలగించివేశారు. అప్పటి నుండే భారత వ్యవసాయం ఎగుమతి లక్ష్యంవైపు మళ్లే ప్రక్రియ మొదలయింది. దాని ఫలితాలు సుస్పష్టంగా ఉన్నాయి. ఈ కాలంలో భారత వ్యవసాయరంగం సామర్ధ్యం తీవ్రంగా క్షీణించింది. నూనె విత్తనాలు, వంటనూనెలకు సంబంధించి ఇండియా దాదాపు స్వయం సమృద్ధంగా ఉండేది. వంట నూనెలు, నూనె విత్తనాల దిగుమతులపై ఆంక్షలు, సుంకాలు ఎత్తివేయడంతో సగం మార్కెట్ దిగుమతులపై ఆధారపడే స్ధితికి చేరుకుంది.

అమెరికాలో పత్తి పంటకు విపరీతమైన సబ్సిడీలు చెల్లిస్తారు. సబ్సిడీలే ఆయుధంగా అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశించే అమెరికా పత్తి ఇండియాలో సైతం పత్తి ధరలను దిగ్గోసింది. దానితో ఏ‌పి, విదర్భ (మహారాష్ట్ర) లలో పత్తి రైతులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అనగా ఎగుమతుల ద్వారా అంతర్జాతీయ ఎగుమతి మార్కెట్ లో వాటా సంపాదించడం అటుంచి భారత రైతులు దేశీయ మార్కెట్ లోనూ ఒక వాటా కోల్పోయారు. వ్యవసాయ ఎగుమతుల కంటే వేగంగా దిగుమతులు పెరిగాయి. ఎంతగా అంటే దిగుమతులతో ఎగుమతుల నిష్పత్తి WTO ఒప్పందం ముందు కంటే సగానికి పడిపోయింది.

గ్లోబల్ మార్కెట్ లో భాగంగా మారిపోయేందుకు భారత ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలలో నయా ఉదారవాద విధానాలు విడదీయరాణి అత్యవసర భాగం. (బడ్జెట్) వ్యయంలో కోత పెట్టుకోవడం నయా-ఉదార విధానాల ప్రధాన వ్యక్తీకరణగా ప్రతిఫలిస్తున్నది. ప్రభుత్వాలు భారత ఆహార సంస్ధ (ఎఫ్‌సి‌ఐ) ను ఒక్కొక్క మెట్టుగా నాశనం చేస్తున్నాయి. ఎఫ్‌సి‌ఐ గిడ్డంగుల్లో ఆహార ధ్యాన్యాలు ఎండకు ఎండి వానకు తడిసి పనికిరాకపోయినా ఫర్వాలేదు గానీ ప్రజా పంపిణీలో మాత్రం ప్రవేశించకుండా చూస్తున్నాయి. వ్యయం తగ్గింపుకు ఒక క్రమ పద్ధతిని భారత పాలకులు పాటిస్తున్నారు.

ఒకటి: లక్ష్యిత ప్రజా పంపిణీ వ్యవస్ధ (Targetde PDS) పేరుతో రేషనింగ్ నుండి మెజారిటీ వినియోగదారులను తప్పించాయి. ఫలితంగా కెలోరీల వినియోగం (intake) పడిపోయింది. రెండు: ముఖ్యంగా గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిన ఫలితంగా ఎఫ్‌సి‌ఐ వద్ద పేరుకుపోయిన భారీ ఆహార నిల్వలను అత్యధిక సబ్సిడీ ధరలకు/అతి తక్కువ ధరలకు బహుళజాతి వ్యవసాయ కంపెనీల లాభాలకు అనువుగా ఎగుమతి చేశారు. ఈ ఎగుమతుల ద్వారా 200-2004 కాలంలో కంపెనీలు భారీ లాభాలు ఆర్జించాయి.

మూడు: రైతుల నుండి నేరుగా సేకరించడానికి స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీలను అనుమతించారు. కొన్ని చోట్ల ప్రైవేటు వ్యవసాయ మార్కెట్లు సైతం వెలిశాయి. నాలుగు: అనేక యేళ్ళ పాటు సేకరణ ధరలను పెంచకుండా స్తంభింపజేశారు. దానితో ఆహార ధ్యాన్యాల ఉత్పత్తి పడిపోయింది; ఉత్పత్తిదారులు కార్పొరేట్ కొనుగోలుదారులను ఆశ్రయించారు. ఇదంతా వ్యవసాయరంగానికి ప్రభుత్వ వ్యయం కత్తిరించడంతో సాగు విస్తరణ స్తంభించిన నేపధ్యంలో జరిగిపోయింది. వ్యవసాయ విస్తరణ వ్యవస్ధ దాదాపు కూలిపోయిందని ప్రభుత్వాలే అంగీకరించాయి.

ఈ లోగా హార్టికల్చరల్ ఉత్పత్తి పెరిగింది. ఈ పెరుగుదల నిర్ధిస్థ వ్యవసాయ విస్తీర్ణం ఉత్పాదకత పెరగడం ద్వారా కాకుండా ఆహార ధాన్యాల భూములను లాక్కోవడం ద్వారా మాత్రమే సాధ్యమయింది. 1993-2003 కాలంలో పండ్ల సగటు దిగుబడి రేటు (ఒక హెక్టార్ కు ఎన్ని టన్నులు) సంవత్సరానికి 1.6 శాతం చొప్పున పడిపోయింది. కూరగాయల దిగుబడి వార్షిక ప్రాతిపదికన 1 శాతానికి తక్కువ నమోదు అయింది. కానీ హార్టి కల్చర్ కింద సాగు అయిన భూ విస్తీర్ణం భారీగా పెరిగింది. 1990-2004 మధ్య కాలంలో 7.27 మిలియన్ హెక్టార్ల భూమి హార్టీ కల్చర్ కింద అదనంగా చేరింది. ఈ భూమి ఆహార ధాన్యాల పంటల నుండి వైదొలగినదే. పట్టిక చూడండి:

Change in Cropping Patern in India, 1990-2004

పంట పెరుగుదల (మిలియన్ హెక్టార్లలో)

తృణ ధాన్యాలు (Cereals)

-5.50

పప్పు ధాన్యాలు (Pulses)

-2.19

ఆహార ధాన్యాలు (Foodgrains)

-7.68

హార్టి కల్చర్

+7.27

Source: Can Horticulture Be a success Story for India? –Surabhi Mittal; ICRIER Working Paper no. 197 

హార్టికల్చర్ దిగుబడి రేటు ఈ విధంగా తక్కువగా ఉన్నప్పటికీ భూములు తక్కువ విలువ కలిగిన ఆహార ధాన్యాల నుండి అధిక విలువ కలిగిన హార్టి కల్చర్ కిందికి మారిన నేపధ్యంలో దానిని వ్యవసాయ జి‌డి‌పి వృద్ధి రేటు పెరుగుదలగా ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి. అదే ఊపుతో వ్యవసాయ సంక్షోభాన్ని విజయవంతంగా పరిష్కరించుకున్నామని కూడా చాటుతున్నాయి. వాస్తవం అందుకు విరుద్ధం. ఆహార ధాన్యాల నుండి హార్టీ కల్చర్ వైపుకు భూములు మారిన నేపధ్యంలో దేశంలో ఆహార భద్రత మరింతగా క్షీణిస్తుంది. హార్టీ కల్చర్ పంటలకు కూడా నిలకడతో కూడిన ఆదాయాలకు గ్యారంటీ లేకపోయింది.

కనుక ఈ అంశాలను బట్టి తెలుస్తున్నదేమిటి? ఏమిటంటే, వ్యవసాయరంగంలో కార్పొరేట్ల ప్రవేశం పెరిగేకొలదీ ప్రత్యక్ష ఉత్పత్తిదారులకు లేదా రైతులకు మిగులు కూడబెట్టుకోగల శక్తి మరింతగా క్షీణిస్తూ పోతుంది. వ్యవసాయంలో మొత్తంగానే ఉత్పాదక శక్తులు క్షీణిస్తాయి. వానిజ్యీకరణ పెరుగుదల, అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్ధతో మారకంలో ప్రవేశించడం.. ఈ అంశాల నుండి లాభం పొందడం అన్నది భారతీయ వ్యవసాయం మరియు భారతీయ ఆర్ధిక వ్యవస్ధలలో ఉత్పత్తి సంబంధాల స్వభావంపైనే ఆధారపడి ఉంటుందన్న సంగతి ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాలి.

భారతీయ ఆర్ధిక చిత్రపటంలో పరిశ్రమలు అతి తక్కువ ఉపాధిని మాత్రమే కల్పిస్తాయి; కనుక విస్తారమైన నిరుద్యోగ, పాక్షిక నిరుద్యోగ సైన్యం వ్యవసాయంలోకి దాని సామర్ధ్యానికి మించి వెళ్ళక తప్పని పరిస్ధితి. పరిమిత మార్కెట్ అవకాశాల మధ్య ఉత్పాదక శక్తులు స్తంభించిపోయినప్పటికీ శక్తివంతమైన పరాన్నభుక్త వర్గాలు సామాజిక, ఆర్ధిక అధికారాల ద్వారా వర్ధిల్లుతున్నాయి.

పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం అభివృద్ధి చెందిన దేశాలలో అప్పటికే ప్రత్యక్ష ఉత్పత్తిదారులు మిగులు పోగేసుకోగల మరియు ఉత్పత్తిని విస్తరించగల మార్గంలో ముందుకు వెళ్ళి ఉన్నారు. ఇండియా లాంటి దేశాలలో ప్రత్యక్ష ఉత్పత్తిదారుల పరిస్ధితి ఇది కాదు. కనుక అంతర్జాతీయ మార్కెట్ తో అనుసంధానం వలన దేశీయ ఉత్పత్తిదారులు విదేశీ మార్కెట్లలో లాభం పొందవచ్చని పైకి అనిపించినా వాస్తవంలో ఆ అనుసంధానం పెట్టుబడిదారీ వ్యవస్ధలలో వలే ఉత్పాదక శక్తులను ఉద్దీపింపజేయలేవు.

పైగా అంతర్జాతీయ మార్కెట్ తో అనుసంధానం అన్నది పెట్టుబడి సంచయాన్ని నిరోధిస్తున్న పరాన్నభుక్త వర్గాల ద్వారానే జరుగుతుంది. కనుక మధ్యంతర/దళారీ వర్గాల ద్వారా జరిగే అనుసంధానం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడి భారత రైతులను మరింతగా అణచివేస్తూ అధిక లాభాలను ఆర్జిస్తుంది. అదే సమయంలో వ్యవసాయం నుండి మిగులును హరించివేస్తుంది. పెట్టుబడి సంచయం జరిగే మార్గాలను మూసివేస్తుంది. అనగా ఉత్పాదక శక్తులను అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది. ఇక వ్యవసాయంలో పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ప్రవేశించే మార్గం ఏదీ?

(……………..సశేషం)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s