ప్యారిస్ ఉగ్రవాద దాడుల మాటున నల్ల చట్టాలకు పదును పెట్టుకున్న అధ్యక్షుడు ఫ్రాంస్వా/ఫ్రాంషా ఒలాండ్ ఆ వెంటనే కార్మిక చట్టాలను నీరుగార్చే పనిలో పడ్డాడు. ఫ్రాన్స్ చరిత్రలో అత్యంత అప్రతిష్ట మూట గట్టుకున్న అధ్యక్షుడిగా ఇప్పటికే కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన ఫ్రాంస్వా ఒలాండ్ తాజాగా తాలపెట్టిన కార్మిక చట్టాల సంస్కరణలపై ప్రజల నుండి ప్రతిఘటనను ఎదుర్కొంటున్నాడు.
ఫ్రాన్స్ ప్రభుత్వ ప్రతిపాదించిన కార్మిక సంస్కరణలకు వ్యతిరేకంగా మార్చి రెండవ వారం నుండి ఫ్రాన్స్ నగరాలలో కార్మికులు, విద్యార్ధులు క్రమం తప్ప కుండా నిరసనలు నిర్వహిస్తున్నారు. పలు మార్లు, పలు నగరాలలో ఈ ప్రదర్శనలు హింసాత్మకంగా మారుతున్నాయి.
సంప్రదాయ కార్మిక సంఘాలు, విద్యార్ధి సంఘాలు ఆందోళనల తమ పరిమితిలో నియంత్రించడానికి ప్రయత్నిస్తుండగా పలువురు ఆందోళనకారులు వారి పరిధులను, పరిమితులను సైతం తిరస్కరిస్తూ ప్రభుత్వంపై ఆగ్రహాన్ని హింసాత్మక రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు. రాజ్య హింసకు అహింసాయుత ప్రతిఘటన సాధ్యం కాదని చాటుతున్నారు.
పోలీసులు ప్రదర్శకులపై సంప్రదాయ విరుద్ధమైన అణచివేత పద్ధతులకు పాల్పడుతుండగా ఆందోళనకారులు వారి అణచివేతను ప్రతిఘటించే క్రమంలో దహనాలకు, విధ్వంసాలకు పూనుకుంటున్నారు. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్, పెప్పర్ స్ప్రేలతో విరుచుకు పడుతున్న పోలీసులతో కార్మికులు, యువకులు, విద్యార్ధులు వీధి యుద్ధాలకు దిగుతున్నారు.
ఆందోళనకారులు రాళ్ళు, ప్లకార్డులనే ఆయుధాలుగా చేపట్టి పోలీసులతో తలపడుతున్నారు. అనేకమంది ప్రదర్శకులు, పోలీసులు గాయపడి ఆసుపత్రుల పాలవ్వగా పత్రికలు మాత్రం గాయపడిన పోలీసుల లెక్కలను మాత్రమే ప్రకటిస్తున్నాయి. ఆందోనకారులకు వ్యతిరేకంగా వార్తలు గుప్పిస్తూ ప్రజా వ్యతిరేక వైఖరిని చేపడుతున్నాయి.
ఫ్రాన్స్ ప్రధాన మంత్రి మాన్యుయెల్ వాల్స్ “బాధ్యతా రహిత మైనారిటీ గుంపులు కొందరు హింసకు పాల్పడుతున్నారు. వారిని చట్టం ముందు నిలబెడతాం” అని బెదిరింపులు జారీ చేస్తున్నాడు. ప్రదర్శకుల హింసను కార్మిక, విద్యార్ధి సంఘాల నేతలు ఖండించాలని పిలుపు ఇస్తున్నాడు. నిరుద్యోగాన్ని తగ్గించడానికే కార్మిక చట్టాలలో సవరణలు చేసేందుకు సంస్కరణలు తెస్తున్నామని నమ్మబలుకుతున్నాడు.
ఏవియేషన్, ప్రజా రవాణా రంగాల్లో కార్మికుల సమ్మెలు, ఆందోళనల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని పత్రికలు తెలిపాయి. పాఠశాల (ఇక్కడి ఇంటర్ స్ధాయి) విద్యార్ధులు కూడా పెద్ద సంఖ్యలో ఆందోళనల్లో పాల్గొంటున్నారు. మే డే రోజున మరిన్ని ఆందోళనలు నిర్వహించేందుకు యూనియన్లు సమాయత్తం అవుతున్నాయి. కార్మిక సంస్కరణల చట్టాన్ని మే 3 తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నందున ఆ రోజు మరింత విస్తృతంగా ఆందోళన చేస్తామని విద్యార్ధి, కార్మిక యూనియన్లు ప్రకటించాయి. ఇప్పటికే నంటేజ్, లియోన్, మార్సేయిల్లే, తౌలౌస్ మొ.న నగరాలలో విడతలు విడతలుగా విద్యార్ధులు, కార్మికులు ఆందోళనలు నిర్వహించారు.
మార్చి 9, 30, ఏప్రిల్ 5, 9, 28 తేదీలలో ఫ్రాన్స్ లోని వివిధ నగరాల్లో సమ్మెలు, ప్రదర్శనలు, హర్తాళ్ లు జరిగాయి. ఆందోళనల సందర్భంగా విద్యార్ధులు, యువకులు ‘నువి డూబు’ (Nuit Debout ఫ్రెంచి ఉచ్ఛారణ) పేరుతో సరికొత్త ఉద్యమానికి తెర లేపారు. దీని అర్ధం ‘రాత్రంతా మేల్కొని ఉండండి’ (Up all night) అని అర్ధం. అనేక నగరాల్లో యువకులు నగర కూడళ్ళకు చేరుకుని నినాదాలతో హోరెత్తించారు.
ఈ ఉద్యమాలను ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం లేదు. సివిల్ పోలీసులను, అల్లర్ల నిరోధక పోలీసులను, మిలట్రీ పోలీసులను దింపి వారిని చెదరగొట్టడానికి, తరిమి కొట్టడానికి కృషి చేసింది. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్, పెప్పర్ స్ప్రే లను ప్రయోగించింది. అరెస్టులకు దిగింది. దానితో అనేక చోట్ల ప్రజలు ప్రతిఘటనకు పూనుకున్నారు. చేతికి అందిన వస్తువులను పోలీసులపైకి రువ్వారు. లగ్జరీ కార్లను తగలబెట్టారు. షాపుల అద్దాలు పగలగొట్టారు. రాళ్ళు రువ్వారు.
కార్మిక, విద్యార్ధి సంఘాల ప్రకారం ఇప్పటి వరకు దేశ వ్యాపితంగా 1.2 మిలియన్ల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనల్లో పాల్గొన్నారు. హోమ్ శాఖ మాత్రం ఈ సంఖ్య 0.40 మిలియన్లు మాత్రమే అని చెబుతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 120 మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేసి జైళ్ళలో నిర్బంధించారు. జైళ్ళలో నిర్బంధించిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని యూనియన్లు విద్యార్ధి సంఘాలు ఆరోపిస్తున్నాయి. అనధికారికంగా నిర్బంధించి అరెస్టు చూపని వారిని ప్రభుత్వ గణాంకాలు ప్రకటించడం లేదని ఆరోపించారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడి పదవీ కాలం మరో సంవత్సరం పాటు కొనసాగనుంది. పదవీ కాలం చివరి దశలో ప్రజలకు ఆగ్రహం కలిగించే చట్టాలు తేవడం పట్ల అధికారిక సోషలిస్టు పార్టీ ఎంపిలు కొందరు అసంతృప్తిగా ఉన్నారు. తాము పెట్టుబడులు పెట్టి జిడిపి వృద్ధికి దోహదం చేయాలంటే కార్మిక చట్టాల కోరలు పీక వలసిందేనని ఫ్రాన్స్ సూపర్ ధనిక వర్గాలు, బహుళజాతి కంపెనీలు హెచ్చరికలు జారీ చేయడంతో వారిని సంతృప్తిపరిచేందుకు అధ్యక్షుడు ఒలాండ్ ప్రజలకు వ్యతిరేకంగా నిలబడేందుకే నిశ్చయించుకున్నాడు.
సంస్కరణల లక్ష్యం
ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో సోవియట్ సోషలిస్టు రష్యా ప్రజలకు కల్పించిన ఆర్ధిక, రాజకీయ, సామాజిక హక్కులు పెను భూతంగా మారిన నేపధ్యంలో పశ్చిమ దేశాలు తమను తాము సంక్షేమ రాజ్యాలుగా ప్రకటించుకుని కార్మిక వర్గానికి వివిధ సంక్షేమ పధకాలు అమలు చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఆ సోషలిస్టు వ్యవస్ధ లేకపోవడంతో తమ సంక్షేమ ముసుగు తొలగించుకునే వీలు కలిగింది. వరుస ఆర్ధిక సంక్షోభాలు ముఖ్యంగా 2008-09 ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం, 2010 ఐరోపా ఋణ సంక్షోభం సంక్షేమ పధకాలు ఎత్తివేయవలసిన అవసరాన్ని వేగిరం చేశాయి.
దీని అర్ధం సంక్షేమ పధకాల రద్దు ఆర్ధిక సంక్షోభ సమస్యను పరిష్కారం చేస్తుందని కాదు. ఆర్ధిక సంక్షోభాల దరిమిలా ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. దరిమిలా కొనుగోళ్ళు తగ్గడంతో కంపెనీల లాభాలు తగ్గిపోయాయి. లాభాలు తగ్గితే కంపెనీలు ఉత్పత్తి ప్రక్రియలలో కోత పెడతాయి. అనగా ఉత్పత్తి/జిడిపి తగ్గిపోతుంది. జిడిపి తగ్గుదల ప్రభుత్వాల అసమర్ధతగా కూడా పెట్టుబడిదారీ వ్యవస్ధ పరిగణిస్తుంది. ఈ పరిస్ధితుల్లో కంపెనీలు లాభాలు పెంచుకోవాలంటే మిగిలిన ఏకైక మార్గం కార్మికవర్గ ఆదాయాలను తగ్గించి ఆ మొత్తాన్ని కంపెనీల యాజమాన్యాలకు అనగా ధనిక వర్గాలకు మళ్లించడం.
ఋణ సంక్షోభం సాకు చూపుతూ జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ ల నుండి గ్రీసు, పోర్చుగల్, స్పెయిన్ లతో పాటు తూర్పు యూరప్ రాజ్యాల వరకు అమలు చేస్తున్న పొదుపు విధానాల ప్రధాన లక్ష్యం కార్మికవర్గం ఆదాయాలను తగ్గించి పెట్టుబడిదారీ వర్గానికి తరలించడమే. పొదుపు విధానాలు అంటే కోతలు, రద్దులు. కార్మికుల పెన్షన్, బోనస్ సదుపాయాలలో కోత లేదా రద్దు, వేతనాల కోత, ప్రభుత్వ ఉపాధి తగ్గింపు, ప్రభుత్వ సేవలను ప్రైవేటు బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పడం… ఇవన్నీ పొదుపు విధానాల పేరుతో కార్మికవర్గంపై బలవంతంగా అమలు చేస్తున్నారు.
ఈ విధానాల వల్ల ఐరోపా రాజ్యాల జిడిపిలు బాగా పడిపోయినప్పటికీ, కొన్ని చోట్ల స్తంభించడం, మరికొన్ని చోట్ల కుచించుకుపోవడం జరిగినప్పటికీ బహుళజాతి కంపెనీలు మాత్రం లాభాలను ప్రకటిస్తూనే ఉన్నాయి. జిడిపి తగ్గడం అంటే కంపెనీల ఉత్పత్తి తగ్గడం. ఉత్పత్తి తగ్గినా లాభాలు ఎందుకు తగ్గడం లేదు? ఎందుకంటే ఆ మేరకు కార్మికుల ఆదాయాలను తగ్గించేసి ఆ మొత్తాన్ని కంపెనీల లాభాల కిందికి తరలించడం వలన. లాభాలు కొనసాగుతుంటే షేర్ విలువలు సైతం పెరుగుతూ షేర్ మార్కెట్లు ఎప్పటిలా పెరుగుతూ పోతాయి.
అయితే పొదుపు విధానాల ఫలితంగా కార్మికవర్గంలో అసంతృప్తి పేరుకు పోయింది. పైపెచ్చు సంక్షేమ రాజ్య వ్యవస్ధలో భాగంగా ప్రవేశ పెట్టిన కార్మిక చట్టాలు మరిన్ని కోతలకు, రద్దులకు ప్రతిబంధకంగా మారాయి. యూనియన్ హక్కులు, ఉమ్మడి బేరసారాల హక్కులు, ప్రభుత్వ విద్య-ఉపాధి హక్కులు, పెన్షన్-బోనస్ హక్కులు… మొ.న హక్కుల చట్టాలు కార్మికవర్గ ఆదాయంలో కోత పెత్తకుండా అడ్డు పడుతున్నాయి. ఈ ఆటంకం తొలగించుకునేందుకు ఉద్దేశించినవే కార్మిక చట్టాల సంస్కరణలు (Labour Law Reforms).
ఇసిస్ ఉగ్రదాడులే అవకాశంగా…!
ప్రైవేటు బహుళజాతి కంపెనీలకు అనువుగా కార్మిక చట్టాలను సవరించడానికి తగిన వాతావరణాన్ని ప్యారిస్ టెర్రరిస్టు దాడులు కల్పించాయి. ఒక వైపు విదేశాలలో సామ్రాజ్యవాద ఆధిపత్య పూర్వక జోక్యందారీ విధానాలు అమలు చేయడం, మరో వైపు స్వదేశంలో కంపెనీల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న వివిధ చట్టాలను నీరు గార్చడం… ఈ జంట లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు ఉగ్రవాద దాడులు అవకాశం కల్పించాయి.
మామూలు రోజుల్లోనైతే పొదుపు విధానాలు, ప్రజా వ్యతిరేక సంస్కరణ విధానాలు ప్రజల్లో ప్రతిఘటనను పెంచుతాయి. ప్రభుత్వాలను ప్రజలు ప్రశ్నిస్తారు, ప్రతిఘటిస్తారు. విదేశాలలో జోక్యం చేసుకుంటూ సొంత సైనికులను బలి పెట్టడాన్ని వ్యతిరేకిస్తారు. అనగా విదేశీ గడ్డపై సైనికులు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్ధితి ఆయా సామ్రాజ్యవాద దేశాల సామ్రాజ్యవాద లక్ష్యాలకు వ్యతిరేకంగా ప్రజలను తయారు చేస్తుంది.
ఇలాంటి పరిస్ధితి నుండి ప్రభుత్వాలను, వాటిని పోషించే కంపెనీలను ఉగ్రవాదం బైటపడేస్తుంది. ఒక గీతను చెరపకుండా చిన్న గీతగా మార్చాలంటే ఏమిటి దారి? దాని పక్క పెద్ద గీతను గీయడమే. కనుక సామ్రాజ్యవాద జోక్యందారీ లక్ష్యం కలిగిన విదేశీ విధానాలు, ప్రజల ఆదాయాన్ని కత్తిరించి కంపెనీలకు కట్టబెట్టే ఆర్ధిక, కార్మిక విధానాల ముందు మరో పెద్ద భూతాన్ని ప్రజల ముందు నిలబెట్టాలి. అలా పుట్టినదే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఉరఫ్ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లేవంత్ ఉరఫ్ ఇస్లామిక్ స్టేట్ (ISIS/ISIL/IS)!
ఇప్పుడు పశ్చిమ రాజ్యాల ప్రజల ముంగిట ఇసిస్ ఓ పెను భూతం. అమెరికా, ఐరోపాల విలేఖరులను, పౌరులను పట్టుకెళ్లి జిహాదీ జాన్ లు బహిరంగంగా, కెమెరా ముందు తలకాయలు కోసేయడం కంటే మించిన తక్షణ ప్రమాదం ఇంకేం ఉంటుంది? అటువంటి తక్షణ, పెను భూతాన్ని పట్టుకుని నిర్జించాలంటే ఏదో ఒకటి చేయాల్సిందే అని ప్రజలు భావించాలి. ఇసిస్ పేరుతో చేసే ఏ చట్టాన్నైనా వారు అంగీకరించాలి.
ప్యారిస్, బ్రసెల్స్ (బెల్జియం రాజధాని, ఈయూ సంస్ధలకు కేంద్రం) లలో ఉగ్రవాద దాడులకు పాల్పడిన దుండగులు వాస్తవానికి ఫ్రెంచి, బెల్జియన్ భద్రతా బలగాలకు సుపరిచితులే అన్న సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అప్పటికి కొద్ది సంవత్సరాలుగా వారు ప్రభుత్వ గూఢచార, భద్రతా బలగాల నిఘాలో ఉన్న వ్యక్తులు ఉన్నట్లుంది గూఢచార వర్గాల కన్నుగప్పి భారీ ఉగ్రవాద దాడులకు పాల్పడడం సాధ్యం అవుతుందా? సాధ్యం కాదన్నది స్పష్టమే.
ఒక్క ప్యారిస్, బ్రసేల్స్ ఉగ్రవాద దాడులు మాత్రమే కాదు. పశ్చిమ దేశాలలో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా వారు అప్పటికే ఆ దాడులు జరిగిన ప్రదేశాన్ని బట్టి సిఐఏ, ఎన్‌ఎస్‌ఏ, ఎంఐ6, జిసిహెచ్‌క్యూ, ఎస్‌ఐఎస్ డిజిఎస్‌ఈ మొ.న గూఢచార సంస్ధల నిఘాలో ఉన్నవారేనని తెలిసి వస్తుంది. వివిధ ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకోవడానికి బ్రిటిష్, అమెరికన్ నిఘా సంస్ధలు ప్రయత్నించడం ఎందుకో ఇది తెలియజేస్తుంది.
ఇవన్నీ నియంత్రిత ఉగ్రవాద దాడులు. ఈ దాడులు జరిగిన కొద్ది నిమిషాల్లోనే, మహా అయితే గంటలలోనే ఏ ఉగ్రవాద సంస్ధ దాడులకు బాధ్యులో తెలిసిపోతుంది. దాడి చేసిన ఉగ్రవాదుల ఫోటోలు కూడా గంటలలోపే చానెళ్లలో, పత్రికల్లో, వెబ్ సైట్లలో ప్రత్యక్షం అవుతాయి. చాలా సార్లు వాళ్ళు రోజుల వ్యవధిలోనే పట్టుబడిపోతారు.
వారి ఫేస్ బుక్ ఖాతాలు, ట్విట్టర్ ఖాతాలు కూడా అప్పుడే తెలిసినట్లు వెల్లడి అవుతాయి. ఆ ఖాతాల్లో వాళ్ళు నెలల తరబడి ఉగ్రవాదాన్ని ప్రభోధించినట్లు వెల్లడి అవుతుంది. అసలు ఇంటర్నెట్ లో గానీ, ప్రపంచంలో గానీ ఎక్కడ చీమ చిటుక్కు మన్నా పసిగట్టే గూఢచార సామాగ్రి, సాఫ్ట్ వేర్ సామాగ్రి దగ్గర పెట్టుకున్న అమెరికా, ఐరోపా రాజ్యాలు నెలల తరబడి, సం.ల తరబడి సామాజిక వెబ్ సైట్లలో ఉగ్రవాదం బోధిస్తుంటే కనిపెట్టకుండానే ఉన్నాయా?
ఇలాంటి నియంత్రిత ఉగ్రవాద దాడుల ద్వారా పశ్చిమ రాజ్యాలు తమ నియంత్రణలోనే ఉండగల పెను భూతాన్ని తమ తమ ప్రజల ముందు నిలబెట్టాయి. ఈ భూతాలు తమకంటూ సొంత ప్రయోజనాలు ఉండకూడదు. సొంత నడక నడవకుండా నియంత్రించాలి. అలాగే తమకు అవసరం అనుకున్నప్పుడు, అవసరం అయిన చోట, అవసరం అయిన మొత్తంలో ఉగ్రవాద దాడులకు పాల్పడాలి. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, పశ్చిమ ప్రభుత్వాలకు మధ్య వైరుధ్యాలు తలెత్తడం సహజమే. అటువంటి సమయాల్లో ఆ ప్రభుత్వాలు ఉగ్రవాదంపై చిత్తశుద్ధితో పోరాడుతున్నట్లు కనిపిస్తాయి.
ప్యారిస్ దాడులు జరిగిన రెండు రోజులకే ఫ్రాన్స్ యుద్ధ విమానాలు సిరియాపై బాంబు దాడులు చేశాయి. ఆ దాడుల్లో ఇసిస్ బలగాలను నష్టపరిచామని ఫ్రాన్స్ చెప్పింది. కానీ ఆ నష్టం ఎక్కడ, ఎలా చేశారో చెప్పినవారు లేరు. అలాగే దాడులకు కొద్ది వారాల లోనే ఫ్రెంచి ప్రభుత్వం కార్మిక చట్టాలకు సవరణ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఆ విధంగా ఫ్రాన్స్ ప్రభుత్వం ప్యారిస్ దాడులను జోక్యందారీ విదేశీ విధానానికి, ప్రజా వ్యతిరేక కార్మిక చట్టాలకు అనుకూల వాతావరణం ఏర్పరచుకుంది. లేదా ఏర్పరుచుకున్నామని భావించింది.
సంస్కరణలు
కార్మిక సంస్కరణల చట్టంలో ఒలాండ్ ప్రభుత్వం చూపుతున్న ముఖ్య సంస్కరణ ఇసిస్ కు సంబంధించినది. ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొనే ఫ్రెంచి పౌరుల పౌరసత్వాన్ని రద్దు చేయాలని చట్టంలో ప్రతిపాదించింది. కానీ వారిని దేశం నుండి బహిష్కరిస్తారా లేదా అన్నది ఊహలకు వదిలేసింది. అనగా దేశంలో పౌరులు, పౌరులు కానీ వాళ్ళు ఉండవచ్చన్న అవగాహనను చొప్పించే ప్రయత్నం చేసింది. ఈ ప్రతిపాదనపై హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఇది జాతి విద్వేషాన్ని పెంపొందిస్తుందని చెబుతూ ఆందోళన వ్యక్తం చేశాయి.
పలు రంగాల ప్రముఖులు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఉపసంహరిస్తున్నట్లు అధ్యక్షుడు ప్రకటించాడు. ప్రతిపాదన ఆ తర్వాత ఉపసంహరణ ద్వారా ఫ్రెంచి ప్రభుత్వం ఇచ్చిన సందేశం ఏమిటన్నది స్పష్టమే. కార్మిక సంస్కరణల చట్టంలో ఇసిస్ దాడుల చర్చను లేవనెత్తడం, సంస్కరణ చర్యలకు ఉగ్రవాద వ్యతిరేక ముద్ర తేవడం ప్రభుత్వం లక్ష్యం. ముందు వివరించినట్లు ఇసిస్ ఉగ్రవాదం రిఫరెన్స్ గా తీసుకునే ప్రతి చర్యకూ ఆమోదం సాధించడం తేలిక అని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
కార్మిక చట్టాల సవరణలు లేదా సంస్కరణలకు ప్రధాన లక్ష్యంగా ఫ్రెంచి ప్రభుత్వం చెబుతున్న కారణం వింటే హాశ్చర్యపడిపోతాం. ఈ చట్టాల ద్వారా ప్రమాదకరంగా పెరిగిన నిరుద్యోగాన్ని తగ్గించడమే తమ లక్ష్యం అని ప్రభుత్వం చెబుతోంది. కొద్దో గొప్పో కార్మికులకు అనుకూలంగా ఉన్న చట్టాలను వ్యతిరేకంగా మలిచి ఉపాధి ఎలా పెంచుతారన్నది ఒక మిస్టరీ! ‘నిన్ను బతికించడానికి నీ గొంతు కోస్తాను’ అని ఎవరైనా చెబితే నమ్మగలమా? నమ్మాల్సిందే అని ఫ్రాన్స్ నుండి భారత ప్రభుత్వం వరకు చెబుతాయి.
ఫ్రాన్స్ లో ప్రస్తుతం నిరుద్యోగం 10 శాతం దాటింది. యువకులలో నిరుద్యోగం 25 శాతం మించి పోయింది. కార్మిక సంస్కరణల ద్వారా ఈ నిరుద్యోగాన్ని తగ్గిస్తామని చెబితే ఎలా నమ్మడం?
ఉదాహరణకి కార్మికులను, ఉద్యోగులను లే-ఆఫ్ చేయడానికి (ఉద్యోగాల నుండి తొలగించడానికి) నిబంధనలు సరళతరం చేయడం ప్రతిపాదిత చట్టంలో ఒక అంశం. ఈ బిల్లు చట్టం అయితే కంపెనీలు తేలికగా, ఎటువంటి షరతుల బాదరబందీ లేకుండా ఉద్యోగులను తొలగించగలుగుతాయి. వ్యాపారం పెద్దగా లేని సమయంలో ఉన్న పళాన ఉద్యోగుల్నీ తీసేయవచ్చు. విదేశాల్లో వ్యాపారాలు లేనప్పుడు కూడా దేశంలో ఉద్యోగుల్ని తొలగించవచ్చు.
హార్వర్డ్ ఆర్ధికవేత్త ఫిలిప్ అఘియోన్ ఫ్రాన్స్ కార్మిక సంస్కరణలపై వ్యాఖ్యానిస్తూ న్యూయార్క్స్ టైమ్స్ పత్రికకు ఇలా చెప్పాడు “ఇవి లే-ఆఫ్ ప్రక్రియలను సులభతరం చేస్తాయి. అంతు లేని న్యాయ ప్రక్రియలను పాటించాల్సిన అవసరం ఉండదు. జడ్జిల చేతుల్లోని విచక్షణాధికారాలు తగ్గిపోతాయి. ప్రస్తుతం భారీ మొత్తాల్ని చెల్లించాల్సి వస్తోంది.” (NYTimes మార్చి 10)
ప్రస్తుతం ఉద్యోగులని, కార్మికులను విధుల నుండి తొలగించాలంటే అనేక నియమ నిబంధనలను కంపెనీలు పాటించాలి. అనేక నెలల ముందుగా నోటీసు ఇవ్వడం, తొలగింపు అలవెన్స్ చెల్లించడం జరగాలి. నియమ నిబంధనలు పాటించని తొలగింపుకు వ్యతిరేకంగా కోర్టులకు వెళ్ళే హక్కు ఉద్యోగులకు ఉన్నది. వ్యాపారాలు లేనప్పుడు కంపెనీ నడవకపోయినా తగ్గించిన వేతనం చెల్లించవలసి ఉంటుంది. ఇవన్నీ పాటించనవసరం లేని వెసులుబాటును తాజా ప్రతిపాదిత చట్టం కంపెనీలకు కల్పిస్తుంది. ఈ సంస్కరణ ద్వారా ఉపాధి పెరగడం ఎలా సాధ్యం? నిరుద్యోగం ఎలా తగ్గుతుంది?
స్వల్పకాలిక ఉపాధిపై సర్ చార్జి విధించాలని ప్రతిపాదిత చట్టం యోచిస్తోంది. కంపెనీలు స్వల్ప కాల కాంట్రాక్టు మీద ఉద్యోగులను తీసుకుంటే ఆ కంపెనీ పై సర్ చార్జి విధిస్తారట. దీని ద్వారా కంపెనీలు శాశ్వత కాంట్రాక్టు ప్రాతిపదికన ఉపాధి కల్పించేలా ఒత్తిడి చేయడం లక్ష్యం అని చెబుతున్నారు. ఇది పైకి బాగా కనిపిస్తున్నప్పటికీ వాస్తవంలో ఉన్న ఉపాధిని కూడా రద్దు చేస్తుంది. అనేక కంపెనీల్లో షార్ట్-టర్మ్ కాంట్రాక్టులో ఉద్యోగులు పని చేస్తున్నారు. నిర్దిష్ట కాలం గడిచాక వారిని పర్మినెంట్ చేయాలని ప్రస్తుత చట్టాలు చెబుతున్నాయి. తాజా సవరణ/సంస్కరణ వల్ల శాశ్వతంగా కాంట్రాక్టు ఉద్యోగులుగా స్వల్ప వేతనాలకు పని చేయవలసి వస్తుంది. కంపెనీలు శాశ్వత ఉపాధి ఎవరికీ ఇవ్వకుండానే కాంట్రాక్టు ప్రాతిపదికన స్వల్ప మొత్తాలు చెల్లించి లాభాలు ఆర్జిస్తాయి.
ప్రతిపాదిత చట్టంలో మరో నిబంధన ఉన్న ఉద్యోగుల పని గంటలను పెంచడం. 35 గంటల వారం పని దినాలు అమలు చేయడం ద్వారా అదనపు భారాన్ని ఉన్న ఉద్యోగులపై మోపాలని భావిస్తున్నారు. ఫ్రాన్స్ లో 35 గంటలకు మించి కార్మికుడిని పని చేయించడం అంటే ఒక పెద్ద పాపం చేసినట్లే. అయినప్పటికీ సవరణ తెచ్చేందుకు ప్రభుత్వం వెనుదీయడం లేదు. వారానికి 48 పని గంటలు, 60 గంటలు, అవసరం ఐతే రోజుకు 12 గంటల వరకు కూడా పని చేయించే అవకాశాన్ని కొత్త చట్టంలో చేర్చారు. మెజారిటీ కార్మికులు సంస్కరణలకు అనుకూలం అనీ కాకపోతే సంస్కరణలు తెస్తున్న పద్ధతే అధ్యంతరకరం అనీ భావిస్తున్నట్లు కార్పొరేట్ మీడియా చెప్పుకుంటోంది.
ఉద్యోగులకు కంపెనీలు చెల్లించవలసిన నష్టపరిహారం మొత్తంపై పరిమితి విధించేందుకు చట్టం యోచిస్తోంది. ఉద్యోగిని తొలగించినప్పుడు చట్టం ప్రకారం చెల్లించాల్సిన పరిహారంపై పరిమితి విధించడం ద్వారా యధేచ్ఛగా తొలగించగల అవకాశం కంపెనీలకు లభిస్తుంది. సదరు ఉద్యోగి ట్రిబ్యూనల్ ను ఆశ్రయించినప్పటికీ ట్రిబ్యూనల్ విధించే పరిహారంపైన కూడా పరిమితి విధించనున్నారు. అనగా చట్టం రక్షణ సైతం ఉద్యోగికి లేదు. ప్రైవేటు కంపెనీలలో ట్రిబ్యునల్ వ్యవస్ధ నామమాత్రం అయింది. ఈ ధోరణిని ప్రభుత్వ కంపెనీలకు విస్తరించేందుకు సంస్కరణ ద్వారా ఏర్పాటు చేస్తున్నారు.
ఒకరంగంలో యూనియన్లు పొరాడి కంపెనీలతో ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందం ఆ రంగం లోని కంపెనీలు అన్నింటికి వర్తించే అవకాశం ప్రస్తుత చట్టాలు కల్పిస్తున్నాయి. యూనియన్ల కింద సమీకృతులైన కార్మికుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఈ నిబంధన వలన సంఘాలు లేని చిన్న, మధ్య తరహా కంపెనీలు కూడా యూనియన్ల ఒప్పందం మేరకు వేతనాలు చెల్లించాలి. సంస్కరణ పేరుతో దీనిని తొలగిస్తున్నారు. అనగా యూనియన్ల బేరసారాల హక్కులను కుదిస్తున్నారు.
ఈ సంస్కరణలు నిదుద్యోగాన్ని తగ్గించడం అటుంచి మరింత పెంచుతాయి. ఉపాధి అవకాశాలను కుదించివేస్తాయి. వేతనాల స్ధాయిలో కోత పెడతాయి. అనగా సగటు వేతనాన్ని తగ్గించివేస్తాయి. నిరుద్యోగ సైన్యాన్ని సృష్టిస్తాయి. తద్వారా పని కోసం కార్మికుల మధ్య పోటీ పెరుగుతుంది. దరిమిలా చౌక వేతనాలకు పని చేసే విధంగా కార్మికవర్గంపై ఒత్తిడి పెరుగుతుంది. చౌక వేతనాల కోసం ఇండియా, చైనాలకు పరుగెత్తే అవసరాన్ని కంపెనీలకు తప్పిస్తుంది.
ఈ సంస్కరణల పట్ల కంపెనీలు కూడా సంతృప్తిగా లేవు. ఇవి చాలా తక్కువ, నామమాత్రం అని అవి ప్రకటించాయి. కార్మికుల ఆందోళనల వల్ల కొన్ని ప్రతిపాదనల నుండి అధ్యక్షుడు వెనక్కి తగ్గాడని అసంతృప్తి ప్రకటించాయి. కంపెనీల అభిలాష ఏ స్ధాయిలో ఉన్నాయో దీనిని బట్టి ఊహించవచ్చు.
ఈ విధానాలకు సానుకూల ఫలితం కూడా లేకపోలేదు. అయితే అది దీర్ఘకాలిక వ్యూహానికి సంబంధించినది. కనాకష్టంగా మారుతున్న పరిస్ధితులు పెట్టుబడిదారీ వ్యవస్ధలో సరికొత్త ప్రోలెటేరియన్ కార్మిక వర్గాన్ని సృష్టిస్తుంది. యూనియన్ లలో నెలకొన్న బ్యూరోక్రసీ, ఆర్ధిక వాదం సమీప భవిష్యత్తులో కాకపోయినా, బలహీన పడుతుంది. రాజకీయ లక్ష్యం వైపు దృష్టి సారించేలా చేస్తుంది. కామ్రేడ్ కారల్ మార్క్స్ చెప్పినట్లు పెట్టుబడిదారీ విధానం తన గొయ్యి తానే తవ్వుకుంటోంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఫ్రెంచి కార్మికవర్గం ఆర్ధికవాదంలోనూ, లేబర్ బ్యూరోక్రసీ నీడలోనూ మగ్గుతోంది.