సంతకం అయింది -ఇండియా; అబ్బే లేదు -రష్యా


S-400

అత్యాధునిక మిసైల్ రక్షణ వ్యవస్ధ S-400 అమ్మకం ఒప్పందానికి సంబంధించి బుధవారం కొద్ది నిమిషాల వ్యవధిలో పరస్పర విరుద్ధ ప్రకటనలు వెలువడ్డాయి. అమెరికా దగ్గర కూడా ఇంతవరకు సమాధానం లేని అత్యంత ఆధునిక మిసైల్ రక్షణ వ్యవస్ధగా పేరు పొందిన S-400 వ్యవస్ధలను తమకూ అమ్మాలని ఇండియా కోరుతోంది. ఈ ఒప్పందం అందినట్లే అంది దూరం జరుగుతోంది.

గత సంవత్సరం డిసెంబర్ నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి జరిపిన రష్యా పర్యటన ప్రధాన లక్ష్యం S-400 కొనుగోళ్ళు. అయితే ఎక్కడ తేడా వచ్చిందో స్పష్టంగా తెలియలేదు గానీ మోడి పర్యటన S-400 కొనుగోళ్లకు సంబంధించినంత వరకు విఫలం అయింది. S-400 లతో పాటు అకూల క్లాస్ అణు జలాంతర్గాములను కూడా ఇండియా కోరింది. ఆ విషయం లోనూ ప్రధాని మోడి రాయబారం విఫలం అయింది. అణు రియాక్టర్లు, హైడ్రో కార్బన్స్ మాత్రమే మోడి పర్యటన సాధించగలిగింది.

అయితే ఈ రోజు భారత రక్షణ శాఖ సహాయ మంత్రి రావ్ ఇందర్జీత్ సింగ్ ఈ అంశంపై అనూహ్యంగా ఓ ప్రకటన చేశారు. డిఫెన్స్ ఎగ్జిబిషన్ సందర్శించడానికి మాస్కోలో ఉన్న మంత్రి “S-400 మిసైల్ రక్షణ వ్యవస్ధ కొనుగోళ్ల కాంట్రాక్టుపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి” అని ప్రకటించారు. ఈ వార్తను రష్యా టుడే, ఇండియన్ డిఫెన్స్ న్యూస్ తదితర వార్తా సంస్ధలు విడుదల చేశాయి.

కానీ మరో అరగంట లోనే రష్యా అధికారుల నుండి విరుద్ధ ప్రకటన వెలువడింది. “అలాంటి కాంట్రాక్టుపైన ఇంతవరకూ సంతకాలు జరగలేదు” అని రష్యా ప్రభుత్వ టెక్నాలజీ కంపెనీ రోస్టెక్ (Rostec) అధిపతి సెర్గీ ఖెమేజోవ్ విలేఖరులకు తెలిపాడు. అయితే రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ నుండి ఇంతవరకు సమాచారం లేదని వార్తా సంస్ధలు తెలిపాయి. ప్రభుత్వాల స్ధాయిలో కాంట్రాక్టుపై సంతకం జరిగి, ఆ విషయం ఇంకా కంపెనీ వరకు చేరలేదా అన్నది రష్యా ప్రభుత్వం నుండే తెలియాల్సి ఉంది.

ప్రధాన మంత్రి వట్టి చేతులతో తిరిగి వచ్చిన అనంతరం వారం రోజుల క్రితం రష్యా అధికారికంగా ‘ఆఫర్’ ప్రకటించింది. దీని అర్ధం S-400 లు అమ్మడానికి తాము సిద్ధంగా ఉన్నామమని.

“S-400 వ్యవస్ధల సరఫరాకు సంబంధించి అంతర్-ప్రభుత్వ ఒప్పందం ముసాయిదా పత్రాన్ని ఫెడరల్ సర్వీస్ అధికారులు తయారు చేశారు. దానిని మా భాగస్వాములకు పంపించాము. వారి ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నాము” అని ఏప్రిల్ 18 తేదీన FSMPC (ఫెడరల్ సర్వీస్ ఫర్ మిలటరీ-టెక్నికల్ కోఆపరేహన్ అధికారులు చెప్పారని రష్యన్ వార్తా సంస్ధ టి‌ఏ‌ఏ‌ఎస్ నివేదించింది.

ఈ ఆఫర్ నే కాంట్రాక్టు కుదిరిపోవడంగా భారత రక్షణ సహాయ మంత్రి భావించారా అన్నది ఒక అనుమానం. కానీ కేంద్ర స్ధాయి మంత్రి అంత అమాయకత్వంతో ఉంటారా అన్నది మరో అనుమానం.

ఎస్-400 వ్యవస్ధలను సంపాదించడం ఇండియాకు అత్యవసరం అయింది. పాకిస్తాన్ కు మరో విడతగా 8 వరకు F-16 యుద్ధ విమానాలు సరఫరా చేసేందుకు అంగీకరిస్తున్నట్లు గత ఫిబ్రవరిలో అమెరికా ప్రకటించింది. ఈ ఒప్పందాన్ని అడ్డుకోవడానికి ఇండియా సంవత్సర కాలం నుండి తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. జోక్ ఏమిటంటే ఉగ్రవాదాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి పాకిస్తాన్ కి ఎఫ్-16 యుద్ధాలు కావాలిట. ఉగ్రవాదానికి జన్మనిచ్చి పెంచి పోషించే అమెరికా, మరో దేశానికి, అందునా పాకిస్తాన్ కి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు సర్టిఫికేట్ ఇవ్వడం!

వాస్తవం ఏమిటంటే ఎఫ్-16 యుద్ధ విమానాల తయారీ కంపెనీ లాక్ హీడ్ మార్టిన్ అమెరికా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. తన యుద్ధ విమానాలు మరిన్ని పాకిస్తాన్ కు అమ్మడానికి అనుమతి ఇవ్వాలని వైట్ హౌస్ పై రెండు, మూడేళ్లుగా ఒత్తిడి తెచ్చి సఫలం అయింది. ఒప్పందాన్ని ఇప్పటికే అమెరికా కాంగ్రెస్ కు నోటిఫై చేయడం కూడా జరిగిపోయింది. ఒప్పందాన్ని కాంగ్రెస్ అడ్డుకోవచ్చు గానీ, ఆ తిరస్కరణను వీటో చేసే అధికారం వైట్ హౌస్ (అధ్యక్షుడు) కి ఉంటుంది. కనుక ఎఫ్-16 ఫైటర్ జెట్ ల అమ్మకం ఒక డన్ డీల్.

ఈ నేపధ్యంలో ఎస్-400 మిసైల్ రక్షణ వ్యవస్ధల కొనుగోలుకు ఇండియా ప్రయత్నాలు తీవ్రం చేసినట్లు కనిపిస్తోంది. బహుశా ఆ ప్రయత్నాల వల్లనే రష్యా నుండి ఫార్మల్ గా ఆఫర్ వచ్చి ఉంటుంది.

ఎస్-400 వ్యవస్ధలు ప్రస్తుతం ప్రపంచం లోనే అత్యంత ఆధునికమైనవిగా పేరు సంపాదించాయి. వీటిని ఎంపిక చేసుకున్న రాజ్యాలకు మాత్రమే రష్యా అమ్మజూపుతుంది. ఎస్-300 వ్యవస్ధలను ఇప్పటికే ఇరాన్ కొనుగోలు చేసింది. పలు వ్యవస్ధలు ఇరాన్ కు చేరాయి కూడా.

ఎస్-400 ల సుపీరియారిటీ ఏమిటో సిరియా యుద్ధం సందర్భంగా కూడా ప్రపంచానికి తెలిసి వచ్చింది. గత సంవత్సరం ఆగస్టులో సిరియాలో టెర్రరిస్టు సంస్ధ ఇసిస్ పై యుద్ధానికి రష్యా స్వయంగా రంగం లోకి దిగిన సంగతి విదితమే. రష్యా వైమానిక దాడుల ఫలితంగా సిరియాలో ఇసిస్ పురోగమనానికి బ్రేకులు పడ్డాయి. ఇసిస్ శ్రేణులు కకావికలం అయ్యాయి. దానితో సిరియా బలగాలు ఇసిస్ పై పైచేయి సాధించడం సాధ్యపడింది.

సిరియా ఆక్రమిత ప్రాంతాల నుండి ఇసిస్ తవ్వి తీసిన చమురును అతి తక్కువ ధరలకు కొనుగోలు చేయడం ద్వారా టర్కీ బాగా లబ్ది పొందింది. ఈ చమురు సరఫరా మార్గాలను కూడా రష్యా వైమానిక దాడులు బంద్ చేశాయి. దానితో టర్కీ ఆగ్రహం పట్టలేకపోయింది. రష్యా యుద్ధ విమానాన్ని ఒకటి కూల్చివేసింది. ఆ విమానం తమ గగనతలం లోకి ప్రవేశించిందని, హెచ్చరించినా వినలేదని బొంకింది. కానీ రష్యా విమానం సిరియా భూభాగంలోనే కూలిపోవడంతో టర్కీ బొంకు స్పష్టంగా తెలిసి వచ్చింది. పైగా విమానం నుండి బైటికి దూకి ప్యారాచూట్ ద్వారా ల్యాండ్ అయిన రష్యా సైనికుడిని ఇసిస్ బలగాలు పట్టుకుని చంపేశాయి.

ఈ ఘటనతో రష్యా తీవ్రంగా ఆగ్రహించింది. సిరియాలో తన వైమానిక స్ధావరం రక్షణకు చర్యలు తీవ్రం చేసింది. ఎస్-400 మిసైల్ రక్షణ వ్యవస్ధలను తెచ్చి సిరియాలో మోహరించింది. ఈ మోహరింపుతో అప్పటి వరకు సిరియా గగనతలంలో ఎగురుతున్న అమెరికా యుద్ధ విమానాలన్నీ ముందు జాగ్రత్తగా కిందికి దిగిపోయాయి. ఇసిస్ పై పోరాటం చేసే పేరుతో అమెరికా విమానాలు సిరియాపై చేరాయి. అయితే ఇసిస్ వ్యతిరేకంగా చేసినట్లు అమెరికా చెప్పిన దాడులవల్ల ఇసిస్ కు ఎక్కడ ఏ విధంగా నష్టం కలిగిందో సమాచారం ఎక్కడా లేదు. పారిపోతున్న ఇసిస్ బలగాలకు సహాయం చేసేందుకే అమెరికా శ్రమించిందన్న సంగతి రహస్యం ఏమీ కాదు.

ఎస్-400 వ్యవస్ధలు ఏమి చేస్తాయి? శత్రు విమానాలు లేదా ఇతర వాహనాలు ప్రయోగించే మిసైళ్లను ఈ వ్యవస్ధ గాలిలోనే అడ్డుకుని నిర్వీర్యం చేస్తుంది. అటు దీర్ఘ దూరాల లక్ష్యాలతో పాటు స్వల్ప దూర లక్ష్యాలను కూడా ఎస్-400 లు ఛేదిస్తాయి. వీటితో పోటీ చేయగల వ్యవస్ధలు ప్రపంచంలో మరే దేశానికీ లేకపోవడం ఎస్-400 లు ఆకర్షణీయం అయ్యాయి. పైగా అదే తరహా వ్యవస్ధలు అమెరికా, ఐరోపాలు అత్యధిక ధరలకు అమ్ముతాయి. అధిక ధరలతో పాటు పనికిమాలిన షరతులు విధిస్తాయి. మన మెడ పైన ఎక్కి కూర్చుంటాయి. రష్యాతో ఆ సమస్యలు ఉండవని ఇండియాకు అనుభవపూర్వకంగా తెలిసిన విషయం.

ఇటీవల ఇండియా సగర్వంగా ప్రదర్శించిన ఐ‌ఎన్‌ఎస్-విక్రమాదిత్య నిజానికి రష్యా సరఫరా చేసిన విమాన వాహక నౌకయే. తన బలగాల నుండి తొలగించిన విమాన వాహక నౌకను అదనపు వసతులు, సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చి సరికొత్త శక్తులతో తయారు చేసి ఇండియాకు అందించారు.

ఎస్-400 విమానాల కోసం చైనా కూడా తీవ్రంగా ప్రయత్నించి సఫలం అయింది. ఇండియాకు తిరస్కరిస్తూ చైనాకు సరఫరా చేయడం అప్పట్లో పలు వ్యాఖ్యానాలకు, వార్తలకు దారి తీసింది. కానీ రష్యా కష్టాల్లో ఉన్నప్పుడూ ఆ దేశాన్ని ఆదుకున్న ఒకే ఒక్క దేశం చైనా.

ఉక్రెయిన్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అక్రమంగా కూల్చినది కాకుండా అమెరికా అదే ఉక్రెయిన్ ని సాకుగా చూపిస్తూ రష్యాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ఆంక్షలు అమలు చేసింది. చమురు ధరలు నాలుగో వంతుకు పడిపోయేలా ప్రభావితం చేసి రష్యా ఆర్ధిక వ్యవస్ధకు తీరని నష్టాన్ని తెచ్చింది. ఈ పరిస్ధితుల్లో రష్యా నుండి చమురు, సహజవాయువు దిగుమతికి భారీ కాంట్రాక్టుపై చైనా ఒప్పందం చేసుకుంది.

సిరియాలో రష్యాకు మద్దతుగా తన యుద్ధ నౌకలను మధ్యధరా సముద్రంలో మోహరించింది. సిరియాలో పశ్చిమ రాజ్యాల జోక్యాన్ని వ్యతిరేకించినప్పటికీ ఇండియా  ఈ విధంగా, ఈ స్ధాయిలో రష్యాకు మద్దతు ఇవ్వలేకపోయింది. అమెరికా విధించిన రష్యా వ్యతిరేక షరతులను పాటించింది కూడాను. ఈ నేపధ్యంలో చైనాకు అందుబాటులోకి వచ్చిన ఎస్-400 కాంట్రాక్టు ఇండియాకు ఇంకా అందుబాటులోకి రాలేదు.

ఇంతకీ ఎస్-400 మిసైల్ రక్షణ వ్యవస్ధల సరఫరా ఒప్పందం ఇరు దేశాల మధ్య కుదిరినట్లేనా? రష్యా అధికారికంగా ‘ఆఫర్’ పంపింది కనుక మునుముందు ఒప్పందం సాకారం అవుతుందని భావించవచ్చా? ఇండియాకు సంబంధించి అనేక డిఫెన్స్ కాంట్రాక్ట్ లు చర్చల మధ్యలోనే ముగిసిపోతున్న నేపధ్యంలో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s