శ్వేత భవనం ఎవరికీ ప్రవేశం లేకుండా దిగ్బంధనం వివిధ చేశారని వార్తా సంస్ధలు తెలిపాయి. పశ్చిమ పత్రికలు ఒక లాక్ డౌన్ పరిస్ధితి గురించే చెప్పగా, రష్యా టుడే పత్రిక 24 గంటల పరిధిలో రెండు సార్లు లాక్ డౌన్ ప్రకటించారని తెలిపింది.
శ్వేత భవనం రక్షణకు ప్రమాదం ఏర్పడిందని భావించినప్పుడు లాక్ డౌన్ ప్రకటిస్తారు. పరిసరాలలో ట్రాఫిక్ ను నిషేధిస్తారు. పాదాచారుల కదలికలను సైతం అడ్డుకుంటారు. భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తారు. ప్రమాద పరిస్ధితి లేదా ప్రమాదం అనుకున్న పరిస్ధితి క్లియర్ అయినాక లాక్ డౌన్ ఎత్తివేస్తారు.
వైట్ హౌస్ సమీప వీధిలో చోరీకి పాల్పడిన వ్యక్తి ఒకరు అక్కడి నుండి పారిపోతూ వైట్ హౌస్ గౌండ్స్ చుట్టూ ఉన్న ఫెన్సింగ్ దూకాడని దానితో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యారని తెలుస్తోంది.
ఫెన్సింగ్ దూకి లోపలి గ్రౌండ్ లో ప్రవేశించిన వ్యక్తికి తాను వైట్ హౌస్ కి చెందిన గ్రౌండ్ లోకి వస్తున్నట్లు తెలియదని భద్రతా దళాలను ఉటంకిస్తూ ఎన్‌బిసి వార్తా సంస్ధ తెలిపింది. వాషింగ్టన్ డి సి లో వైట్ హౌస్ సమీపంలో చోరీ చేసిన వ్యక్తికి వైట్ హౌస్ గ్రౌండ్ పరిమితులు తెలియకపోవడం ఆశ్చర్యకరం!
ఇంతకీ ఆ దొంగ చేసిన చోరీ: ఒక మహిళ పర్సు నుండి డబ్బు దొంగిలించడం. వైట్ హౌస్ లాక్ డౌన్ లో వివిధ కేటగిరీలు ఉంటాయి. ప్రస్తుతం ప్రకటించింది యెల్లో లాక్ డౌన్ అని తెలుస్తోంది.
సాయంత్రం గం 3:45 ని.ల ప్రాంతంలో దొంగ ఫెన్సింగ్ దూకాడని వెనువెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమై అతనిని పట్టుకున్నారని పత్రికలు తెలిపాయి. ఒక అర గంట పాటు కొనసాగిన లాక్ డౌన్ అనంతరం ఎత్తివేశారు.
రష్యా టుడే ప్రకారం మరో వ్యక్తి అమెరికా జెండా కప్పుకుని వైట్ హౌస్ గ్రౌండ్ లోకి చొరబడ్డాడని దానితో మరోసారి లాక్ డౌన్ అమలు చేశారని తెలిపింది. అతనిని అరెస్ట్ చేసి పోలీసులకు అప్పగించారని తెలిపింది.
2014లో ఓ వ్యక్తి కత్తితో సహా వైట్ హౌస్ గ్రౌండ్ దాటి వెళ్ళి సందర్శకుల లాంజ్ లో చొరబడ్డాడు. అక్కడ ఆయన కేకలు వేస్తూ ఇతరులపై దాడికి పాల్పడినంతవరకూ ఆయన కత్తితో వచ్చిన సంగతి కనిపెట్టలేదు. అతని వస్తువులు వెతికే క్రమంలో దూరంగా ఉన్న అతని కారులో తుపాకులు, తోమహాక్ (గొడ్డలి లాంటిది) ఉన్నట్లు కనుగొన్నారు.
ఈ ఘటన దరిమిలా వైట్ హౌస్ భద్రతా విభాగం అధిపతి రాజీనామా చేశారు.
అమెరికాలో వైట్ హౌస్ ను సందర్శించడానికి అనుమతి ఉంటుంది. అయితే అనేక వివిధ భద్రతా వలయాల వద్ద పరీక్షలకు గురి చేశాకనే లోపలికి అనుమతిస్తారు. అలాంటిది కత్తితో ప్రవేశించినా తెలుసుకోలేకపోవడం నిస్సందేహంగా వైఫల్యమే.
వైట్ హౌస్ లోపల టూర్ కు వెళ్లడానికి కూడా ప్రజలకు అనుమతి ఉంటుంది. తమ ప్రాంత కాంగ్రెస్ సభ్యుడికి దరఖాస్తు చేసుకుని తమ వివరాలు పొల్లు పోకుండా అందజేయాల్సి ఉంటుంది. కనీసం 21 రోజుల ముందు దరఖాస్తు చేసుకుంటే ఉచితంగానే వైట్ హౌస్ లోపలకు వెళ్ళి చూసి రావచ్చు.
ఇదే విధంగా రాష్ట్రపతి భవన్, ప్రధాన మంత్రి, ముఖ్య మంత్రి నివాసాల లోపలకి వెళ్ళి చూసే అవకాశం భారత ప్రజలకు ఉన్నదా?