[ఏప్రిల్ 26, 2016 తేదీన ది హిందూలో ప్రచురితం అయిన ఎడిటోరియల్ “A Desperate situation” కు యధాతధ అనువాదం]
*********
మితి మీరిన భారం, సిబ్బంది లేమిలతో కూడిన భారతీయ న్యాయ వ్యవస్ధలో భారీ సంఖ్యలో కేసులు పెండింగ్ లో ఉండడం అందరూ ఎరిగిన విషయం. ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సమక్షంలో ప్రధాన న్యాయమూర్తి టి ఎస్ ఠాకూర్ భావావేశంతో చేసిన విజ్ఞాపన ఈ సమస్యకు తీవ్రతను, తక్షణమే దృష్టి పెట్టవలసిన ఆవశ్యకతను సమకూర్చింది. గణాంకాలు దిగ్భ్రాంతికరమైనవి: దేశంలో వివిధ కోర్టులలో 3 కోట్ల కేసులు పెండింగ్ లో ఉండగా, న్యాయ సిబ్బంది సంఖ్య కేవలం 18,000 మంది మాత్రమే. సుప్రీం కోర్టులో 31 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాల ముందు ప్రస్తుతం ఉన్న పెండింగ్ కేసులు 60,260. హై కోర్టు న్యాయమూర్తుల స్ధానాలు 434 ఖాళీగా ఉండగా అందుబాటులో ఉన్న పరిమిత మౌలిక వసతులు, వనరుల సామర్ధ్యాన్ని 38.68 లక్షల కేసులు సాగతీస్తున్నాయి.
సమస్య కొత్తది కానప్పటికీ ప్రస్తుత సంక్షోభం న్యాయ వ్యవస్ధను కొన్ని యేళ్లుగా క్రుంగదీస్తోంది. కోర్టు ప్రక్రియల సందర్భంగా గానీ, న్యాయ మంత్రులు, న్యాయ మూర్తులు సమకూడే అధికారిక కార్యక్రమాల సందర్భంగా గానీ ఉన్నత స్ధాయి న్యాయ వ్యవస్ధ ప్రతినిధులు అడపా దడపా చేసే పరిశీలనలు, కొన్ని సానుభూతి చప్పుళ్లను, తాత్కాలిక స్పందనలను మాత్రమే రాబట్టగలుగుతున్నాయి. కానీ పేరుకు పోతున్న బకాయిలు, న్యాయ వనరుల తీవ్ర కొరత అనే జంట సమస్యల పరిష్కారానికి సంపూర్ణమైన, సుస్పష్టమైన చర్యలు ఏవీ అమలు కావడం లేదు. కనుక ప్రధాన న్యాయమూర్తి విజ్ఞాపనలో ప్రస్ఫుటంగా వ్యక్తం అయిన నిస్సహాయత పూర్తిగా అర్ధం చేసుకోదగినది.
నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్ మెంట్స్ కమిషన్ ఏర్పాటుపై నడిచిన దావా, రాజ్యాంగ సవరణనూ మరియు చట్టాన్నీ రెండింటినీ సుప్రీం కోర్టు కొట్టివేయడంతో ముగిసిన దృష్ట్యా కొన్ని నియామకాలలో ఆలస్యం జరిగి ఉండవచ్చు. కానీ ఉన్నత కోర్టులలో తాజా నియామకాలకు సంబంధించి, ‘మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్స్’ లో ఎలాంటి ప్రస్తావనా లేనందున అటు ప్రభుత్వం గానీ ఇటు కొలీజియం గానీ తమ తమ సిఫారసుల మధ్య ఉన్న విభేధాల, ఏమన్నా ఉన్నట్లయితే, వల్ల ఇక ఎంత మాత్రం వెనకడుగు వేయరాదు. అయితే, కేవలం కార్యనిర్వాహక అంగం వైపు నుండి జరుగుతున్న జాగులను మాత్రమే ఎత్తి చూపడం లేదు; కింది స్ధాయి న్యాయ వ్యవస్ధలో సిబ్బందిని పెంచడం లోనూ, పేద కక్షిదారులు మరియు విచారణా (అండర్ ట్రయల్) ఖైదీల పట్ల సహానుభూతి చూపడం లోనూ గుర్తించదగిన రీతిలో చొరవ లేకపోవడాన్ని కూడా ఆయన ఎత్తి చూపుతున్నారు; న్యాయం చేకూరడంలో జరిగే ఆలస్యం వల్ల ఎక్కువగా నష్టపోతున్నది వారే.
ఈ పరిస్ధితి సిబ్బందిని, వనరులను పెద్ద మొత్తంలో చొప్పించడంలో ఉత్సాహాన్ని, లక్ష్య శుద్ధిని డిమాండ్ చేస్తోంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విస్తారంగా తోడ్పడవలసి ఉంటుంది. ఆధునిక సమాజంలో మిలియన్ ప్రజలకు ఒక జడ్జి చొప్పున అవసరం అవుతారని ఒక ప్రమాణంగా చెప్పబడుతోంది. అయితే రెండు సంవత్సరాల క్రితం లా కమిషన్ వెలువరించిన 245వ నివేదికలో న్యాయమూర్తుల అవసరాన్ని నిర్ధారించడానికి ఒక మిలియన్ కు ఒక జడ్జి అన్న ప్రమాణం (అధికారిక గణాంకాల ప్రకారం ఇండియాలో 2013లో మిలియన్ ప్రజలకు 16.8 మంది జడ్జిలు ఉన్నారు) పాటించడం ఆచరణ సాధ్యం కాదని నొక్కి చెప్పింది.
అందుకు బదులుగా కేసులను పరిష్కారం చేసే రేటు ప్రకారం న్యాయమూర్తుల అవసరాన్ని నిర్ధారించే పద్ధతిని ప్రతిపాదించింది. ఈ పద్ధతిలో కేసుల పరిష్కారాల విశ్లేషణ ఆధారంగా నిర్దిష్ట సంఖ్యలో కేసుల పరిష్కారానికి న్యాయవ్యవస్ధ లోని వివిధ స్ధాయిలలో ఎంత మంది జడ్జిలు అవసరం అవుతారో నిర్ధారిస్తారు. ఆచరణ సాధ్యమైన పరిష్కారాలను కనుగొనడానికి కేంద్రం, న్యాయ వ్యవస్ధలు పరస్పరం సహకరించుకోవాలి: వివిధ కాలాల వారీగా జడ్జిల అవసరాలపై చేసే సమీక్షల ఆధారంగా, పదవీ విరమణ చేసిన వారిని తాత్కాలిక న్యాయ మూర్తులుగా తీసుకోవడంతో సహా మరింత మంది న్యాయమూర్తులను నియమించడం, వారి పదవీ విరమణ వయసు పెంచడం, న్యాయ వనరులను మరింత ప్రభావశీలంగా వినియోగించడం చేయాలి.
*********
[యూపిఏ ఏలుబడిలో న్యాయ వ్యవస్ధకూ, కేంద్ర ప్రభుత్వానికి మధ్య అనేకమార్లు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ ఘర్షణ ప్రధానంగా ప్రజా వ్యతిరేక ఆర్ధిక సంస్కరణల అమలుకు సంబంధించినదే కావడం గమనార్హం. పశ్చిమ దేశాలు, ప్రపంచ బ్యాంకు-ఐఎంఎఫ్ ల ఒత్తిడి మేరకు ఆర్ధిక సంస్కరణలను తీవ్రం చేసిన కొద్దీ రాజకీయ నాయకత్వం, బ్యూరోక్రసీ భారీ అవినీతికి పాల్పడడమూ పెరిగింది. పెట్టుబడి తన దోపిడీ టెంటకీల్స్ విస్తరించేకొద్దీ తన అవసరం కోసం పాలనా వ్యవస్ధలో అవినీతిని ప్రోత్సహించడం దానికి కారణం. రాజకీయ నేతలు, బ్యూరోక్రట్ల అవినీతి నగ్నంగా పచ్చిగా వెల్లడి అవుతున్న నేపధ్యంలో ప్రజలు వ్యవస్ధ పైనే నమ్మకం పోగొట్టుకునే క్రమం వేగం పుంజుకుంది. దానితో ఆ నమ్మకాన్ని తిరిగి కూడగట్టడానికి కాగ్ లాంటి వ్యవస్ధలు, న్యాయ వ్యవస్ధ కృషి చేయడం ప్రారంభించాయి.
ఇది కూడా పాలకులకు సుతరామూ ఇష్టం లేకపోయింది. న్యాయ వ్యవస్ధ యధాతధ స్ధితిని కొనసాగించేందుకు కృషి చేయడం వల్ల ఎదురవుతున్న ఆంటంకాలను కూడా సహించే స్ధితిలో వారు లేరు. ఫలితంగా వారు న్యాయ వ్యవస్ధను, కాగ్ నూ శత్రువులుగా చూడడం మొదలు పెట్టారు. న్యాయ, కాగ్ వ్యవస్ధలపై తీవ్ర స్ధాయి దాడి చేసేందుకు కూడా వారు వెనుదీయలేదు. ఒకవైపు విదేశీ బహుళజాతి కంపెనీల నుండి వస్తున్న తీవ్ర ఒత్తిడి, మరోవైపు ప్రజల ప్రతిఘటన వల్ల చేయవలసి వచ్చిన అటవీ హక్కుల చట్టం, పంచాయితీ చట్టం, ఆహారభద్రతా చట్టం, 1/70 చట్టం లను అమలు చేయాలని ప్రజల నుండి పెరుగుతున్న ప్రతిఘటనా యూపిఏ పాలకులను ఆ విధంగా న్యాయ, కాగ్ వ్యవస్ధలకు శత్రువుగా మార్చింది.
ఈ నేపధ్యంలో అధికారం చేపట్టిన నరేంద్ర మోడి యూపిఏ ఎదుర్కొన్నట్లుగా తాను కూడా పై చట్టాల రీత్యా, ప్రజల ప్రతిఘటన రీత్యా, సంస్కరణలు వేగంగా అమలు చేస్తామన్న హామీ అమలుపై తీవ్ర పరిమితి విధించబడుతుందనీ, న్యాయ వ్యవస్ధ నుండి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందనీ ఒక అవగాహనతో ఉన్నారు. ఆ ఎరుకతోనే అధికారంలోకి రాగానే ఆయన తీసుకున్న చర్యలలో ఒకటి -నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్ మెంట్స్ కమిషన్ (ఎన్జేఏసి)- ను నియమించడం. ఈ కమిషన్ ద్వారా న్యాయ వ్యవస్ధపై రాజకీయ-బ్యూరోక్రాట్ వ్యవస్ధ పట్టు పెంచడానికి మోడి లక్ష్యంగా పెట్టుకున్నారని పరిశీలకులకు ఇట్టే అర్ధం అయింది.
శాసన వ్యవస్ధ (పార్లమెంటు)-కార్యనిర్వాహక వ్యవస్ధ (బ్యూరోక్రసీ)-న్యాయ వ్యవస్ధ ఈ మూడింటి మధ్య అధికారం సమపాళ్లలో ఉండాలని రాజ్యాంగం పేర్కొనగా వాస్తవంలో అధికారం భారీ మొత్తంలో రాజకీయ వ్యవస్ధ వైపుకు వంగిపోయింది. యధాతధ వ్యవస్ధ కొనసాగింపులో ప్రజల నమ్మకాన్ని పెంచే ఉద్దేశ్యంతో న్యాయ వ్యవస్ధ ప్రదర్శించిన చురుకుదనం ఈ మొగ్గును కాస్త తగ్గించే ప్రయత్నం చేసింది. దానిని తీవ్ర ప్రమాదంగా నరేంద్ర మోడి గుర్తించిన ఫలితమే ఎన్జేఏసి ని నియమించడం. ఈ కమిషన్ తమకు అనుకూల నిర్ణయం చేసే విధంగా రాజ్యాంగాన్ని సైతం మోడి ప్రభుత్వం సవరించింది. అయితే ఈ కమిషన్ నియామకాన్ని, రాజ్యాంగ సవరణను సమీక్షించిన సుప్రీం కోర్టు, రాజ్యాంగం ప్రబోధించిన సమతూకాన్ని దెబ్బ తీస్తుందన్న కారణంతో రద్దు చేసింది. ఆర్టికల్ లో ప్రస్తావించిన కేంద్రం-జ్యూడీషియరీ విభేధాల ప్రస్తావన నేపధ్యం ఇదీ.
టి ఎస్ ఠాకూర్ తడి కళ్ళతో విజ్ఞాపన చేసిన అనంతరం ప్రధాని మోడి చేసిన ప్రసంగం, ఆయన చూపిన హావ భావాలు ప్రజాస్వామ్య పరిశీలకులకు ఒక లాంటి విరక్తిని కలిగించకపోతే ఆశ్చర్యమే. చీఫ్ జస్టిస్ లేవనెత్తిన సమస్యను నామమాత్రపు ప్రస్తావనతో పక్కకు నెట్టివేసిన ప్రధాని, ‘న్యాయమూర్తులు దీర్ఘకాలం పాటు సెలవుపై వెళ్లడాన్ని’ ప్రస్తావిస్తూ కొంటె నవ్వులు రువ్వారు. మీరు సెలవుపై వెళ్ళడం మానితే పెండింగ్ కేసులు ఉండబోవు అని ఆయన పరోక్షంగా ఎత్తిపొడిచారు. రాజకీయ నాయకుడికి ఇలాంటి అపహాస్యపూరిత, ఖండిత, శత్రుపూరిత వైఖరి నప్పుతుందేమో గానీ, 120 కోట్ల ప్రజానీకానికి నేతృత్వం వహించే ప్రభుత్వ నేతకు ఎంత మాత్రం నప్పదన్నది స్పష్టమే.
గత రెండు సం.ల కాలంలోనే ఇలాంటి వైఖరులను డజన్ల కొద్దీ సంఘటనలలో ప్రధాని వ్యక్తం చేసిన దృష్ట్యా తాజా వ్యక్తీకరణ పెద్దగా ఆశ్చర్యకరం కాకపోవచ్చు గానీ కనీసం రాజ్యాంగ స్ధాయి ప్రకారం తనకు సమాన స్ధాయిలో ఉండే సుప్రీం కోర్టు సమున్నత న్యాయమూర్తికి సైతం అదే తరహా ప్రతిస్పందనను, అదీ ఉన్నత న్యాయమూర్తులు, ముఖ్య మంత్రులు అందరూ కొలువు తీరిన నిండు సభలో, చవి చూపడం తీవ్రంగా ఖండించవలసిన విషయం.సభానంతరం తమ సెలవు కాలం మూడు వారాలు మాత్రమేననీ, తాము కులు, మనాలీలలో విశ్రాంతికి వెళ్ళడం లేదనీ, సెలవు కాలాన్ని కూడా ప్రధాన తీర్పులు రాయడానికే వెచ్చిస్తామని చీఫ్ జస్టిస్ మరోసారి విలేఖరులకు వివరణ ఇవ్వవలసి వచ్చింది.
ఏతావాతా తేలేది ఏమిటంటే నరేంద్ర మోడి సైతం న్యాయ వ్యవస్ధతో శత్రువైఖరితోనే ఉన్నారు. పాటియాలా హౌస్ కోర్టులో సుప్రీం ఆదేశాలను కాలదన్నుతూ హిందూత్వ లాయర్లు కిష్కింధ కాండ సాగించినప్పుడే స్పష్టమైన ఈ విషయం చీఫ్ జస్టిస్ కు ఇచ్చిన సమాధానంతో మరింత రుజువయింది.
కనీసం ఈ అంశాలైనా మోడీపై భ్రమలు పెట్టుకున్నవారి కళ్ళు తెరిపిస్తాయని ఆశించవచ్చా? –విశేఖర్]