“తగినంత నీటిని జల్లే వ్యూహం పని చేసింది, విఐపి చాపర్ వల్ల అస్సలు దుమ్మే రేగలేదు!”
–
ఓ పక్క నీతులు వల్లించడం, మరో పక్క అవే నీతుల్ని అడ్డంగా, తడబాటు లేకుండా ఉల్లంఘించడం!
దళితుల అభ్యున్నతే లక్ష్యం అంటారు. ఆ దళితులపైనే పార్లమెంటులో విష ప్రసంగాలు గుప్పిస్తారు. దళితుల ఆహార అలవాట్లను నేరంగా మార్చుతూ చట్టాలు చేస్తారు. రోహిత్ లను జాతీయ వ్యతిరేకులుగా ముద్ర వేస్తారు.
ముస్లిం మతం అహింసకు నిలయం అని ప్రసంగం చేస్తారు. అదే ముస్లింలను ఉగ్రవాదులకు ప్రతిరూపంగా సాధ్యమైన అన్ని వేదికలపైనా ప్రచారం చేస్తారు. అఖ్లక్ లపై దాడి చేసి నిలువునా చంపి పాతరేస్తారు.
ప్రతి ఒక్క నీటి చుక్కను సక్రమంగా వినియోగించుకుందాం అని ఈ రోజు ప్రధాని తన ‘మన్ కీ బాత్’ లో బోధించారు.
మరో వైపు ఆయన పార్టీ ప్రభుత్వమే మహారాష్ట్రలో ఏకంగా 10 లక్షల లీటర్ల నీటిని వృధా చేసింది.
రాష్ట్ర వ్యవసాయ మంత్రి ఏక్ నాధ్ ఖడ్సే నీటి కరువుతో అలమటిస్తున్న లాతూర్ జిల్లాను ఆశ్చర్యచకితంగా (surprise visit) సందర్శించదలిచారు. రాష్ట్ర ప్రభుత్వంలో నెంబర్ 2 గా చెప్పే ఖడ్సే అనుకున్నదే తడవుగా ఆయన సందర్శించే గ్రామంలో హెలిపాడ్ నిర్మాణం మొదలు పెట్టారు.
హెలిపాడ్ నిర్మాణం కోసం 10 వేల లీటర్ల నీటిని వినియోగించారన్న వార్త తెలియడంతో కొన్ని పత్రికలు, చానెళ్లు గగ్గోలు పెట్టాయి. వారి ఆందోళనను ఖడ్సే కొట్టిపారేశాడు. హెలిపాడ్ కోసం ట్రీట్ చెయ్యని నీటిని వాడారు తప్ప తాగు నీరు కాదని (తాగు నీటిని కూడా వాడదామనే?) సమర్ధించుకున్నాడు.
కానీ విమర్శకులు ఆయన వివరణ సరికాదని వెల్లడి చేశారు. హెలిపాడ్ కోసం ట్యాంకర్లలో నీళ్ళు తెచ్చి పోసారని ఏప్రిల్ 14 మధ్యాహ్నం నుండి 15 తేదీ ఉదయం 10 గం.ల వరకు ట్యాంకర్లు వస్తూనే ఉన్నాయని వాళ్ళు చెప్పారు.
లాతూర్ లో నీళ్ళు లేక జనం మురికి నీటిని వాడక తప్పడం లేదు. కొన్ని చోట్ల మురుగు నీటిని కూడా వాడుతున్నారు. అలాంటి చోట్ల అన్ ట్రీటెడ్ వాటర్ అనేది ఒకటి ఉంటుందా? ఏ నీరైనా ట్రీట్ చేసి జనానికి సరఫరా చేయడం మానుకుని నీటిని విలాసాలకు ఖర్చు చేయడమే కాకుండా జనాన్ని అవమానిస్తూ సమర్ధనలు ఇవ్వడం క్షమార్హం కాని నేరం.
ఇలాంటి నేరాలకు అతీతంగా మారిన నేతల పాలనలో మనం ఉన్నాం. నీతులు వల్లించడం ఒక కార్యక్రమమే గానీ వాటిని అమలు చేయడం కార్యక్రమం కానే కాదు.