అజ్ఞానం, మూఢత్వం వారి స్వాభావిక లక్షణం!


Kanhaiya in Nagapur

Kanhaiya in Nagapur

ఐరోపాలో పారిశ్రామిక విప్లవ క్రమాన్ని ఆటంకపరిచేందుకు చర్చి అధికార వ్యవస్ధ చేయని ప్రయత్నం లేదు. కోపర్నికస్ లాంటి వారిని జీవిత పర్యంతం వేధించారు. చర్చి ఒత్తిడికి లొంగి ఒక దశలో కోపర్నికస్ తన గ్రహ సిద్ధాంతాలను తాత్కాలికంగానే అయినా తప్పు అని చెప్పాల్సి వచ్చింది.

మరో గ్రహ శాస్త్రవేత్త బ్రూనోను నగరం కూడలిలో స్తంభానికి కట్టేసి తగలబెట్టిన చరిత్ర కేధలిక్ క్రైస్తవ మత మూఢుల సొంతం! వాస్తవాలపై కాకుండా మతపరమైన ఊహలకు, ఫ్యాంటసీలపై ఆధారపడిన చర్చి నమ్మకాలు శాస్త్రవేత్తల ఆవిష్కరణలు సహజంగానే బైబిల్ సిద్ధాంతాలకు విరుద్ధంగా వెలువడ్డాయి.

అనగా బైబిల్ లో అవాస్తవాలు ఉన్నాయని రుజువయ్యే పరిస్ధితి! మత నమ్మకాలను అడ్డు పెట్టుకుని దోపిడీ పాలన సాగిస్తున్న రాచరికానికీ, చర్చికీ భయం పట్టుకుంది. ప్రజల మూఢ నమ్మకాలే పెట్టని కోటగా అరాచకాలు చేసే ఫ్యూడల్ రాచరిక పాలకులకు అందుకే శాస్త్రవేత్తలు శత్రువులు అయ్యారు. వెంటాడారు, వేటాడారు, చిత్ర హింసలకు గురి చేశారు. తప్పుడు కేసులు మోపి జైళ్ళలో పెట్టారు. చివరికి అనాగరికమైన మరణ శిక్షలు అమలు చేశారు.

ప్రస్తుతం భారత దేశంలో పరిస్ధితి నానాటికీ అదే విధంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. పూర్తి మెజారిటీతో అధికారం చేపట్టిన ఆర్‌ఎస్‌ఎస్ తన అజెండాను ఏ మాత్రం దాచుకోకుండా అమలు చే(యి)స్తోంది. ఫలితంగా హిందూ మతంలోని మూఢ విలువలు రెట్టించిన ఉత్సాహంతో సామాజిక, రాజకీయ రంగాలను దున్నేస్తున్నాయి. మనిషిలో సహజంగా, inherent గా ఉండే హేతుబద్ధతను కమ్మివేస్తోంది.

అత్యంత స్వేచ్చాపూరిత ప్రజాస్వామిక భావాలను వ్యక్తం చేసిన కన్హయ్యా కుమార్ ఇప్పుడు హిందూత్వ శక్తులకు ప్రధాన, ఆకర్షణీయమైన లక్ష్యం అయ్యాడు. హిందూత్వ నీడలోని ఆధిపత్య శక్తులను ఆకర్షించడానికి చిన్నా చితకా గ్రూపులు కూడా తయారై విద్వేషాన్ని వెళ్లగక్కడంలో పోటీ పడుతున్నారు. ఇలాంటి చిన్నా చితకా గ్రూపుల్ని పోషించడం, వారి చేత కావలసిన అరాచకాలన్నీ చేయించడం, ఆనక వారికీ తమకూ సంబంధం లేదని చెప్పడం హిందూత్వ రాజకీయాల అమ్ముల పొదిలో ఓ తూణీరం!

ముంబైకి చెందిన వీర్ సేన అనే హిందు మితవాద సంస్ధకు ఓ భయం పట్టుకుంది. జవహర్ లాల్ యూనివర్సిటీ విద్యార్ధి సంఘం అధ్యక్షుడు కన్హయ్యా కుమార్ కోర్సు పూర్తి చేసుకుని ప్రాక్టీస్ పెట్టాక తన వద్దకు వచ్చే రోగుల ఎలా చూస్తాడో అని వారి ప్రశ్న! అవును, మరి Ph D కోర్టు పూర్తయ్యాక కన్హయ్యా కుమార్, డాక్టర్ కన్హయ్యా కుమార్ అవుతారు కదా!

ఇందులో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి: కన్హయ్యా కుమార్ జే‌ఎన్‌యూలో డాక్టర్ కోర్సు చదువు తున్నారు. రెండు: ఆయన డాక్టర్ గా మారి యూనివర్సిటీ నుండి సమాజంలోకి వచ్చాక రోగులను సరిగ్గా పరీక్షించలేడు. ఎందుకంటే ఆయన హిందూత్వ వ్యతిరేకి గనుక. నాగపూర్ నుండి వెలువడే ఆదేశాలను పాటించేది లేదని బహిరంగంగా చాటారు కనక. తమ ఆరాధ్య దైవం మోడీకి బహిరంగ సవాలు విసిరాడు గనక.

“జే‌ఎన్‌యూలో ఆయన (కన్హయ్య కుమార్ Ph D కోర్సు చదువుతున్నాడని మనకు తెలుసు. కానీ ఆయన దేశాన్ని ముక్కలు చేస్తానని బెదిరిస్తున్నాడు. అలాంటి వ్యక్తి డాక్టర్ అయ్యాక తన వద్దకు వచ్చే రోగులకు ఎలా సేవలు అందించగలడు?” అని వీర్ సేన నేత నిరంజన్ పాల్ ప్రశ్నించాడు.

‘దేశాన్ని ముక్కలు చేస్తాం’ అన్న నినాదం కన్హయ్య ఇచ్చినట్లుగా సాక్షాలు లేవని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హై కోర్టుకు తమ పోలీసుల ద్వారా చెప్పింది. అనేక పత్రికలు, ఛానెళ్లు నినాదాలు ఇచ్చింది బైటివాళ్లు అని చెప్పాయి. కానీ ఆ సంగతి వీర్ సేనకు ఇంకా తెలియకుండా పోయింది.

వీర్ సేన నేత గారి వీర ఆజ్ఞానాన్ని విలేఖరులు వెంటనే ఎత్తి చూపారు. ఆయన మెడిసిన్ చదవడం లేదనీ, సాహిత్యం అంశంగా డాక్టరేట్ చేస్తున్నారని ఎరుకపరిచే ప్రయత్నం చేశారు. కానీ మన వీర సేనుడు వాస్తవాలను, జ్ఞానాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేడు.

“అయితేనేం? ఎలా చూసినా ఆయన డాక్టర్ కావడం ఖాయమే కదా! రోగులు ఆయన వద్దకు వెళ్తారు కదా!” అని తన ఆజ్ఞానాన్ని రెట్టింపు స్వరంగా ప్రదర్శించాడు. మెడిసిన్ చదివిన వారు మాత్రమే కాకుండా వివిధ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య, శాస్త్రబద్ధ అంశాలలో పరిశోధన పూర్తి చేసి ధీసిస్ తయారు చేసిన వారి పేర్ల ముందు కూడా డాక్టర్ అని రాస్తారన్న సంగతి మన వీర సేనులకు తెలియదు.

తెలియకపోతే పోవచ్చు. అదేమంత తప్పు కాదు. జ్ఞానం అనేది ఒకరు తెలుసుకున్నాకనే ఆ వ్యక్తి జ్ఞాని అవుతాడు కనుక. కానీ జ్ఞానాన్ని, అది కూడా చాలా సామాన్యమైన జ్ఞానాన్ని కూడా చూసేందుకు, గ్రహించేందుకు నిరాకరిస్తున్న వీర సేనుడిని ఏమని పిలవాలి?

కన్హయ్యా కుమార్ ఏప్రిల్ 23 తేదీన ముంబై సందర్శిస్తున్నారు. అక్కడ ఆయన ఒక సభను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. ఆయనను ముంబై రానిచ్చేది లేదని హిందూత్వ గుంపులు పంతం పట్టాయి. వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అనేక పేర్లతో వెలిసిన గ్రూపులు బెదిరిస్తున్నాయి.

వివిధ హిందూత్వ సంస్ధలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ హెచ్చరికలు, బెదిరింపులు జారీ చేశారు. తమను తాము దేశభక్త, హిందూ సంస్ధలుగా చెప్పుకుంటూ వాళ్ళు పత్రిక విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. కన్హయ్య ముంబై వస్తే ఆయన మళ్ళీ సరైన రూపంతో వెనక్కి వెళ్లలేడని ప్రకటించారు.

“ఇది చర్య కాదు, ప్రతి చర్య. జాతీయ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులను ఖచ్చితంగా అడ్డుకోవాలి. (కన్హయ్యను అడ్డుకోవడానికి) మా శక్తి పరిధిలో ఏం చేయాలో అంతా చేస్తాము” అని స్వరాజ్య హిందు సేన జాతీయ అధ్యక్షుడు సుశీల్ తివారీ బెదిరించాడు.

ఈ చర్య-ప్రతి చర్య సిద్ధాంతం సైన్స్. న్యూటన్ సూత్రాల్లో ఒకటి. ఈ సూత్రాన్నే ప్రధాని నరేంద్ర మోడి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా వల్లించారు. హిందూత్వ మూకలు విచ్చలవిడిగా సాగిస్తున్న మారణ హోమాన్ని వెనకేసుకు వస్తూ సబర్మతి ఎక్స్ ప్రెస్ దహనానికి ప్రతీకారంగా హిందువులు సాగిస్తున్న ప్రతి చర్య అని ప్రకటించారు. అదే సూత్రాన్ని ఇప్పుడు స్వరాజ్య హిందూ సేన ప్రకటిస్తోంది. ఈ గొప్ప స్వరాజ్య దేశభక్తులు భారత ప్రజల జాతీయోద్యమ ‘ప్రతి చర్య’లో పాల్గొనక పోగా దూరంగా ఉండాలని బోధించిన సంగతన్నా తెలుసునో లేదో!

“కన్హయ్య ముంబై నగరంలో ప్రవేశించకుండా నిషేధించాలి. ఆయన ఇక్కడికి వస్తే నగర వాతావరణాన్ని పాడు చేస్తాడు. మా ఉద్దేశంలో ఆయన ఇండియాలో నివశించడానికి అనుమతించ కూడదు” అని హిందు గోవంశ్ రక్షా సమితి నేత వైభవ్ రౌత్ ప్రకటించాడు. తమ మతోన్మాద ఛాందసవాద ప్రేలాపనలకు అనుకూలంగా ఉన్న ముంబై వాతావరణం కన్హయ్య ప్రసంగం వల్ల వ్యతిరేకంగా మారుతుందని లేదా పలచబడుతుందని వారి భయం అన్నమాట! ఆసక్తికరంగా, ఆకట్టుకునేలా సాగే కన్హయ్యా ప్రసంగాలు వాళ్ళకు బాగానే బెదురు పుట్టిస్తున్నాయి.

కరువు, దుర్భిక్షం, తీవ్ర నీటి సమస్య లతో సతమతం అవుతున్న మహారాష్ట్రలో ప్రభుత్వ వ్యతిరేకత నానాటికీ ప్రబలి పోతోంది. వారి దృష్టి మళ్లించడానికి ముఖ్యమంత్రి ఫద్నవీస్ ఇప్పటికే తీవ్రవాద పొజిషిన్ తీసుకుని ప్రకటనలు గుప్పిస్తున్నాడు. కన్హయ్య ప్రభృతులు దేశద్రోహులనీ పాకిస్తాన్ వెళ్లిపోవాలనీ భావోద్వేగాలు రెచ్చగొడుతున్నాడు. దానికి కొనసాగింపుగానే ఈ చిల్లర గ్రూపుల బెదిరింపు ప్రకటనలు వెలువడ్డాయి.

కానీ ఆ బెదిరింపుల్లోనయినా కూసింత సామాన్య జ్ఞానం కూడా ప్రదర్శించ లేనంత ఆజ్ఞాన తిమిరాంధులు ఈ హిందూ మూఢ (అ)స్వరాజ్య దేశభక్తులు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s