
Uttarakhand highcourt
నైనిటాల్ హై కోర్టు కేంద్ర ప్రభుత్వానికి గడ్డి పెట్టింది. బహుశా అరాయించుకోలేనంత గడ్డి! అరగకపోయినా విసర్జించ వీలు కాని గడ్డి! ఒక్క రోజు కాదు, గత రెండు మూడు రోజులుగా గడ్డి పెడుతూనే ఉంది. హఠం వేసినట్లు కేంద్ర ప్రభుత్వ లాయర్లు వెర్రిమొర్రి వాదనలు చేసే కొద్దీ గడ్డి పరిమాణం పెరుగుతూ వచ్చింది.
హై కోర్టు నిజానికి తన తుది తీర్పును రిజర్వ్ లో పెట్టుకుని తర్వాత ప్రకటిద్దాం అనుకుంది. కానీ అరుణాచల్ ప్రదేశ్ లో చేసినట్లుగానే సొంత పార్టీ ప్రభుత్వాన్ని ప్రతిష్టించడానికి కేంద్రం కుట్రలు చేస్తున్నదని పిటిషనర్ (హరీష్ రావత్) తరపు లాయర్లు చెప్పడంతో ఈ రోజే (గురువారం, ఏప్రిల్ 21) తీర్పు ప్రకటించేసింది. అనగా కేంద్రం కుట్రలు చేస్తోందన్న పిటిషనర్ వాదనని కోర్టు నమ్మింది.
మార్చి నెల 18 తేదీన రాష్ట్ర బడ్జెట్ చర్చ ముగిసినప్పటి నుండి బిజేపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం కుట్రలు మొదలయ్యాయి. బడ్జెట్ ఆమోదానికి ట్రెజరీ బెంచి సభను కోరగా బిజేపి ఎంఎల్‌ఏలు డివిజన్ కోరారు. అనగా బడ్జెట్ ని ఆమోదించేవారు ఎంతమందో, తిరస్కరించేవారు ఎంతమందో తలలు లెక్కబెట్టి తేల్చాలని కోరారు.
అప్పటికే 9 మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఏ లు బిజేపి సభ్యులవైపుకు వెళ్ళిపోయారు, తమది కూడా అదే డిమాండ్ అన్నట్లుగా! 9 మంది ఎంఎల్‌ఏలను తమవైపు వచ్చేట్లు బిజేపి ముందే మాట్లాడి పెట్టుకుందన్నమాట! ఓటింగు జరిగితే ప్రభుత్వం మైనారిటీలో ఉందని రుజువు అవుతుంది.
అప్పుడు నైతికంగా చూస్తే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. సభా నియమాలు అలాగని ఏమీ చెప్పవు. కాకపోతే అవిశ్వాస తీర్మానం పెట్టవలసిన అవసరం ప్రతిపక్షానికి వస్తుంది. తీర్మానం నెగ్గితే రాజీనామా చేయక తప్పదు. అది పార్లమెంటరీ డెమోక్రసీ నియమం.
బడ్జెట్ లోని పలు అంశాలు ఆమోదం పొందినప్పటికీ అంతిమ దశలో డివిజన్ కోరడం సభా నియమాలకు విరుద్ధం అని కాంగ్రెస్ వాదన. చూస్తే ఇందులో ఏదో పాయింట్ ఉన్నట్లే కనిపిస్తోంది. కానీ సభా నియమాలని ఈ పార్టీలు ఎప్పుడు పట్టిచ్చుకుని చచ్చాయి గనక, ఇప్పుడు కొత్తగా బాధపడిపోవడానికి!
అయితే సభాపతి బడ్జెట్ మూజువాణి ఓటుతో ఆమోదం పొందిందని ప్రకటించేశారు. మూజువాణి ఓటు చట్ట విరుద్ధమూ కాదు, సభా నియమాల విరుద్ధమూ కాదు. కనుక స్పీకర్ చేసిన ‘ఆమోద ప్రకటన’ ను చట్టబద్ధంగా తప్పు పట్టలేనిది.
కానీ నైతికంగా తప్పు పట్టవచ్చు. కానయితే అసలు కాంగ్రెస్ టికెట్ తో గెలిచిన ఎంఎల్‌ఏ లను అధికారం కోసం తమ వైపు తిప్పుకోవడం కూడా బిజేపి పాల్పడిన నైతిక విరుద్ధ చర్య. కనుక నైతిక విలువల వాదనలోకి వెల్లడమే దండగ. అదొక వృధా ప్రయాస!
కనుక “బడ్జెట్ బిల్లు రాజ్యాంగబద్ధంగా ఆమోదం పొందింది” అని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన చట్ట బద్ధంగా తప్పు కాదు.

Harish Rawat
బడ్జెట్ ఆమోదం అయిపోయింది కనక ప్రభుత్వ బలానికి వచ్చిన ప్రమాదం లేదు. కానీ గవర్నర్ కేంద్రం/బిజేపి మనిషి కదా. అలాగే స్పీకర్ కాంగ్రెస్ మనిషి. ఇక చూడాలి నాటకం. ఆ వారం పది రోజుల్లో కాంగ్రెస్, బిజేపి నేతల ప్రకటనలు చూస్తే “ఔరా మన రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య విలువల కోసం ఎంత తీవ్రంగా తపన పడుతున్నాయో కదా. అసలు ఇవి కదా నిఖార్సయిన పార్టీలు” అనిపిస్తుంది.
“ప్రజాస్వామ్యాన్ని నిలువునా మర్డర్ చేశారు” అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తారు. “ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేయడం ఇప్పుడే ఏమిటి? బడ్జెట్ పై మూజువాణి ఓటుతో ఆమోద ముద్ర వేసినప్పటి నుండే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేయడం మొదలు పెట్టింది అప్పటి నుండి రోజూ మర్డర్ చేస్తూనే ఉన్నారు” అని బిజేపి నేతలు ఆరోపిస్తారు.
దీనెమ్మ ప్రజాస్వామ్యం! ఎన్ని ప్రాణాలు ఉండాల దీనికి! బిజేపి మర్డర్ చేసింది. మళ్ళీ కాంగ్రెస్ మర్డర్ చేసింది. ఒక రోజు కాదు, ప్రతి రోజూను. ప్రతి రోజూ మర్డర్ చేస్తున్నా మళ్ళీ మళ్ళీ లేచి కూర్చునే ప్రజాస్వామ్యానికి ఖచ్చితంగా గుడి కట్టి తీరాలి. ఒకటేమి ఖర్మ, శానా కట్టాలి.
భారత్ మాతాకీ జై అనకపోతే దేశ ద్రోహం అన్నవాళ్లు ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేసినందుకు దేశ ద్రోహులని ఎందుకు అనలేదో? బహుశా తాము కూడా దేశ ద్రోహులం అయిపోతామని భయం వల్ల కావచ్చు!
ఇంతకీ ఆల్రెడీ చచ్చిన ప్రజాస్వామ్యాన్నే మళ్ళీ మళ్ళీ మర్డర్ చేస్తున్నట్లా? లేక చచ్చి లేచి చచ్చి లే…. లేస్తున్న ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ మళ్ళీ మర్డర్ చేస్తున్నట్లా? ఏదైతేనేం, ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేయడంలో కాంగ్రెస్, బిజేపి లు రెండూ పీకలకంటా మునిగి ఉన్నాయని జనం తెలుసుకోవాల్సిన సంగతి.
ప్రజాస్వామ్యాన్ని కాపడ్డానికి కాంగ్రెస్, బిజేపిలు రాష్ట్ర గవర్నర్ ని కలిశారు. ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతినీ కలిశారు. పత్రికలకు ప్రకటనలు ఇచ్చారు. నువ్వు ఛీ అంటే నువ్వు డబుల్ ఛీ అని తిట్టుకున్నారు. శిబిరాలు నడిపి హోటళ్లను మేపారు. ఎంఎల్‌ఏలతో టూర్లు వేసుకున్నారు.
ఆ విధంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో ఒకరికొకరు పోటీ పడుతున్న తరుణంలో గవర్నర్ ఆదేశాలు వెలువడ్డాయి. మార్చి 28 తేదీన రావత్ ప్రభుత్వం విశ్వాసం రుజువు చేసుకోవాలని ఆయన ఆదేశించారు. కేంద్రం మనిషి గనక సభ పొందిక (బలం) మారకూడదని హెచ్చరించారు. ఫిరాయింపు చట్టం కింద కాంగ్రెస్ రెబెల్స్ సభ్యత్వం రద్దు చేస్తే ఆట మళ్ళీ ‘అడ్వాంటేజ్ కాంగ్రెస్’ అవుతుంది కదా మరి!
విశ్వాస తీర్మానం రోజు దగ్గర పడుతుండగా కాంగ్రెస్ మనిషి స్పీకర్ భయపడినంతా చేసేశారు. కాంగ్రెస్ నుండి బిజేపి వైపు దూకిన 9 మంది ఎంఎల్‌ఏల సభ్యత్వాన్ని రద్దు చేసేశారు. దానితో ఇండిపెండెంట్ లతో కలుపుకుని కాంగ్రెస్ బలం పెరిగింది. ఇక విశ్వాసం రుజువు కావడమే తరువాయి.
రెండు రోజుల్లో ఫ్లోర్ టెస్ట్ అనగా శనివారం సాయంత్రం కేంద్ర కేబినెట్ అర్జెంట్ గా సమావేశం అయింది. ఉత్తరఖండ్ గవర్నర్ నివేదికను చర్చిస్తున్నట్లు పత్రికలకు లీకులు అందాయి. సమావేశం ముగిసింది. నిర్ణయం ఏమిటో వెంటనే చెప్పలేదు. కానీ జరిగిన నిర్ణయం ఏమిటో పత్రికలకు, పరిశీలకులకు అర్ధం అయిపోయింది.
వాళ్ళకు అర్ధం అయిందే నిజం అయింది. ఉత్తరఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించినట్లుగా సభను సుషుప్తావస్ధలో ఉంచుతున్నట్లు తర్వాత రోజు గానీ తెలియలేదు. మళ్ళీ హాహాకారాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ హాహాకారాలు ఒకరం అయితే స్టింగ్ వీడియో హాహాకారాలు బిజేపివి.
రెండు రోజులయ్యాక రావత్ హైకోర్టు తలుపు తట్టారు. ప్రభుత్వం ఏర్పాటు విషయం గనక కోర్టు వెంటనే వాదనలు వినడం మొదలు పెట్టింది. వాదనలు జరుగుతున్న క్రమంలోనే కేంద్రం చర్యలను కోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. చీఫ్ జస్టిస్ కే ఎం జోసెఫ్, జస్టిస్ వి కే బిష్ట్ ల బెంచి వాదనలు విన్నది.
“67 మంది సభ్యుల సభలో 35 మంది బడ్జెట్ బిల్లుపైన డివిజన్ కోరితే దానిని స్పీకర్ ఆమోదించకుండా బడ్జెట్ మూజువాణి ఓటుతో పాస్ అయిందని ప్రకటించి తప్పు చేశారు. రాజ్యాంగ నియమాలు గల్లంతయ్యాయి. అందుకే రాష్ట్రపతి పాలన విధించవలసి వచ్చింది” అని కేంద్రం తరపు అడ్వకేట్ జనరల్ వాదించారు.
“బడ్జెట్ పాస్ అయిందా కాలేదా అన్న ఒక్క అంశం పైన ఆధారపడి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వాన్ని మీరు ఎలా సస్పెండ్ చేస్తారు? అది కూడా మరో సం కాలం ప్రభుత్వానికి ఉండగా! రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా కేంద్రం ప్రజాస్వామ్యం మూలాలనే క్షయింపజేసింది” అని చీఫ్ జస్టిస్ సోమవారం వాదనల సందర్భంగా కేంద్రాన్ని తప్పు పట్టారు.
“గవర్నర్ నిష్పక్షపాతి. ఆయన కేంద్రం ఏజెంటు కాదు. విశ్వాస పరీక్షలో బలం రుజువు చేసుకోవాలన్న గవర్నర్ ఆదేశాలను కేంద్రం గౌరవించి ఉండాల్సింది” అని కోర్టు స్పష్టం చేసింది.
“ముఖ్యమంత్రి రావత్ హార్స్ ట్రేడింగ్ (ఎంఎల్‌ఏల కొనుగోళ్ళు) లో నిమగ్నం అయ్యారు. కొనుగోలు ద్వారా మెజారిటీ సాధించే ప్రయత్నం చేశారు” అని కేంద్రం లాయర్ ముకుల్ రోహత్గి వాదించారు. “అయితే మాత్రం. ఆర్టికల్ 356 ప్రయోగించి రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్ధను కూల్చే బదులుగా ఫ్లోర్ టెస్ట్ జరిపి ఉండాల్సింది కదా” అని ఛీఫ్ జస్టిస్ ప్రశ్నించారు.
“బడ్జెట్ బిల్లు పైన ఓటింగు జరపడానికి మించిన ఫ్లోర్ టెస్ట్ ఏమి ఉంటుంది! ఓట్ల డివిజన్ ని స్పీకర్ అనుమతించినట్లయితే రావత్ ప్రభుత్వం మార్చి 18 తేదీనే పడిపోయి ఉండేది. స్పీకర్ మెజారిటీని తిరస్కరించారు. అదే పేద్ధ రాజ్యాంగ పాపం. మార్చి 18 తేదీనే మెజారిటీ కోల్పోయిన రావత్ బాధ్యతగా రాజీనామా చేయవలసి ఉంది” అని ముకుల్ రోహత్గీ గుండెలు బాదుకున్నారు.
కానీ హై కోర్టు బెంచి గుండెలు బాదుకోలేదు. “బడ్జెట్ బిల్లు ఓడిపోతే ప్రభుత్వం రాజీనామా చేయడం బాధ్యత. కానీ వాళ్ళు రాజీనామా చేయకపోతే ప్రతిపక్షాలు అవిశ్వాసం తీర్మానం అన్నా ప్రవేశపెడతారు. లేదా బలం నిరూపించుకోమని ముఖ్యమంత్రిని అన్నా కోరుతారు. అప్పుడు కూడా ఫ్లోర్ టెస్ట్ జరగవలసిందే కదా” అని హై కోర్టు రిటార్ట్ ఇచ్చింది.
“అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు రాజీనామా చేయవు. వాళ్ళు దళసరి చర్మాన్ని అభివృద్ధి చేసుకున్నారు. వాళ్ళు రాజీనామా చేయకపోతే అప్పుడది రాష్ట్రపతి చూడవలసిన సమస్య కాదు” అని కోర్టు స్పష్టం చేసింది. అప్పటికీ రోహత్గీ విడవ లేదు. “రాష్ట్రపతి పాలన, అసెంబ్లీ సుషుప్తావస్ధ శాశ్వతంగా ఉండబోవు. రెండు నెలలే కొనసాగుతుంది. అది తాత్కాలిక స్తంభన. ఆ తర్వాత పార్లమెంటు సమస్యను చర్చిస్తుంది. దాని తర్వాత ఫ్లోర్ టెస్ట్ జరుగుతుంది. (రెండు నెలల తర్వాత) కాంగ్రెస్ మళ్ళీ అధికారం లోకి రావచ్చు” అని వాదించారు.
దానిక్ చీఫ్ జస్టిస్ తీవ్ర అభ్యంతరం చెప్పారు. “మీరు అలజడిని (chaos) ప్రవేశపెడుతున్నారు… ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రభుత్వం నుండి మీరు అధికారాన్ని రెండు నెలలపాటు లాక్కుంటున్నారు” అని తప్పు పట్టారు.
ముఖ్యమంత్రి రావత్ ఎంఎల్‌ఏ ల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని స్టింగ్ ఆపరేషన్ ద్వారా వెల్లడి అయిన సంగతిని కేంద్రం లాయర్ ప్రస్తావించగా దానికీ కోర్టు సమాధానం ఇచ్చింది. “ప్రభుత్వాలలో జరుగుతున్న అవినీతిని కూడా రాష్ట్రపతి పట్టించుకున్నట్లయితే ఏ ప్రభుత్వమూ 5 నిమిషాలకు మించి నిలవదు” అని చీవాట్లు వేశారు.
రాష్ట్రపతి నిర్ణయాన్ని కోర్టులు సమీక్షించవచ్చా అన్న ప్రశ్న వాదనల్లో తలెత్తింది. ‘వచ్చు’ అని బెంచి స్పష్టం చేసింది. “న్యాయ సమీక్ష చేసే అధికారం కోర్టు చేతుల్లో ఉన్నది. అది రాష్ట్రపతి చేతుల్లో లేదు. పూర్వం రోజుల్లో రాష్ట్రపతి నిర్ణయంలో కోర్టులు జోక్యం చేసుకునేవి కావు. కానీ (ఈ రోజుల్లో) సమీక్షకు వీలు కాని సంపూర్ణ అధికారం అంటూ ఏమీ లేదు.
“రాష్ట్రపతి అద్భుతమైన వ్యక్తే కావచ్చు. కానీ ఆయనా ఘోరమైన తప్పిదం చేయవచ్చు. అలాగే జడ్జిలు కూడా న్యాయ సమీక్షకు నిలబడవలసిందే. ఈ విషయంలో కాంగ్రెస్ కి అంత గొప్ప చరిత్ర ఏమీ లేదు. (ఏ పార్టీ అయినా సరే..) వాళ్ళు బుకాయిస్తే మీది బుకాయింపు అనడానికి మేము వెనకాడబోము” అని చీఫ్ జస్టిస్ కాంగ్రెస్ ని కూడా కలిపి ఏకేశారు.
గురువారం (ఈ రోజు) వాదనల సందర్భంగా కాంగ్రెస్ నేత రావత్ తరపు లాయర్ అయిన అభిషేక్ సింగ్ మను సంఘ్వి తమ పార్టీ భయాలను లేవనెత్తారు. కోర్టు తన అంతిమ తీర్పు ఇచ్చే లోపు కేంద్రం రాష్ట్రపతి పాలన ఎత్తివేసి బిజేపి ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని చెప్పారు.
ఇదే భయాన్ని సింఘ్వి గతంలో కూడా వ్యక్తం చేశారు. అయితే కోర్టు “కేంద్రం అలా చేయదని ఆశిస్తున్నాం” అని కోర్టు వ్యాఖ్యానించింది. సోమవారం ఇదే అంశాన్ని సింఘ్వి ప్రస్తావించగా “ఆర్టికల్ 356 ని ఎత్తివేయడం ద్వారా మమ్మల్ని కేంద్రం మమ్మల్ని రెచ్చగొట్టకుండా ఉంటుందనే ఆశిస్తున్నాం” అని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు.
మంగళవారం వాదనల సందర్భంగా కోర్టును తప్పుదారి పట్టించడానికి కేంద్రం ప్రయత్నించింది. అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా “మార్చి 18 తేదీన 35 ఎంఎల్‌ఏలు, కాంగ్రెస్ ఎంఎల్‌ఏ లతో కలిసి అప్రాప్రియేషన్ బిల్లు (బడ్జెట్ బిల్లు) పై డివిజన్ ఓటింగ్ కోరారు. ఈ సంఖ్య (35) లో వివాదాస్పదం ఏమీ లేదు” అని కోర్టుకు చెప్పారు.
“9 మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఏ లతో కలిసి 35 మంది ఎంఎల్‌ఏ లు డివిజన్ అడిగారని కేంద్రం చెబుతోంది. కానీ కేంద్రానికి గవర్నర్ పంపిన నివేదికలో 9 మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఏలు ఎని ఎక్కడా పేర్కొనలేదు. గవర్నర్ గారే తన నివేదికలో 35 మంది ఎంఎల్‌ఏ లు డివిజన్ ఓటు కోరారన్న సంతృప్తిని వ్యక్తం చేయకపోతే యూనియన్ (కేంద్ర) కేబినెట్ ఆ అంకె ఎలా చెప్పగలిగింది?” అని ప్రశ్నించింది.
బిజేపి ఎంఎల్‌ఏ భీమ్ లాల్ ఆర్య పైన బిజేపి ఫిర్యాదు చేసిందని ఆ ఫిర్యాదు పైన చర్య తీసుకోని స్పీకర్ 9 మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఏ ల పైన మాత్రం ఆగమేఘాలపైన చర్య తీసుకున్నారని కోర్టుకు కొన్ని రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. ఆ సంగతి మంగళవారం ప్రస్తావించిన సింఘ్వి ఆర్యపైన బిజేపి ఏప్రిల్ 5 తేదీన ఫిర్యాదు చేసిందని అప్పటికి రాష్ట్రపతి పాలన విధించినందున స్పీకర్ చర్య తీసుకునే ప్రసక్తి ఎక్కడిదని కోర్టుకు తెలిపారు.
దానితో బెంచి కేంద్రం లాయర్ ని ఆరా తీసింది. ఆర్య పైన బిజేపి ఫిర్యాదు చేసింది రాష్ట్రపతి పాలనకు ముందా తర్వాతా వివరణ ఇవ్వమని కోరింది. కోర్టు ప్రశ్నకు తడబడిన లాయర్ ఒక రోజు సమయం ఇస్తే చెబుతానని బదులిచ్చాడు. అయితే బెంచి అందుకు తిరస్కరించింది. “కోర్టును తప్పుదారి పట్టించేందుకు కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగా ప్రయత్నించింది” అని నమోదు చేసుకుంది. “ఇది ఘోరమైన తప్పిదం. ఇటువంటిది మళ్ళీ జరగకూడదని మాత్రమే మేము మీకు చెప్పగలం” అని ఆగ్రహం ప్రకటించింది.
రాష్ట్రపతి పాలన విధించడంలో కేంద్రం హడావుడి పడిందని కోర్టు తప్పు పట్టింది. “హడావుడి నిర్ణయాలన్నీ అర్ధరహితం కాకపోవచ్చు గానీ రాష్ట్రపతి పాలన విధించిన సమయాన్ని బట్టి మార్చి 27, 28 తేదీల్లో ఉత్తరఖండ్ అసెంబ్లీలో ఏమి జరగబోతున్నదో కేంద్రం ముందుగానే ఒక అంచనాకు వచ్చిందని అర్ధం అవుతోంది” అని వ్యాఖ్యానించింది.
తీర్పును రిజర్వ్ చేస్తామని బెంచి భావిస్తున్న నేపధ్యంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేయవచ్చన్న భయాన్ని సింఘ్వి మరొకసారి వ్యక్తం చేశారు. బెంచి సభ్యులు ప్రభుత్వ లాయర్లను వివరణ అడిగారు. ‘ఆర్టికల్ 356 ఎత్తివేస్తారా?’ అని ఆరా తీశారు. దానికి కేంద్ర ప్రభుత్వ లాయర్లు అందరూ ఏమీ బదులివ్వలేదు. దానితో కోర్టుకు అర్ధం అయింది, రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తారని, తీర్పు రిజర్వ్ చేసిన పరిస్ధితిని తమకు అనుకూలంగా వినియోగించుకునే అవకాశాన్ని కేంద్రం ఎట్టి పరిస్ధితుల్లో వదులుకోదని.
“ఈ కేసులో కేంద్రం చర్యలు మాకు తీవ్ర బాధను కలిగించాయి. నిస్పాక్షికంగా ఉండవలసిన కేంద్ర ప్రభుత్వం ఒక ప్రైవేటు పార్టీ వలె వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ప్రవర్తించడం చాలా బాధాకరం. కోర్టులతో ఆటాడుకోవచ్చని మీరు ఎలా భావిస్తారు? ఆర్టికల్ 356 ని ఎత్తివేసి తమ ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే… అది న్యాయాన్ని పరిహసించడం తప్ప ఇంకేమిటి?” అని చీఫ్ జస్టిస్ వ్యాఖానించారు.
అంతిమంగా ఉత్తరఖండ్ లో రాష్ట్రపతి పాలన విధింపును రద్దు చేస్తూ బెంచి తీర్పు వెలువరించింది. గతంలో సుప్రీం కోర్టు చేసిన చట్టానికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరించిందని తీర్మానించింది. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం చేపడుతుందని తెలిపింది. ఏప్రిల్ 29 తేదీన సభలో విశ్వాస పరీక్ష జరగాలని ఆదేశించింది. తనకు సభలో మెజారిటీ ఉందన్న ముఖ్యమంత్రి రావత్ ప్రకటనను రుజువు చేసుకోవాలని కోరింది.
బిజేపి తదుపరి చర్య ఏమిటన్నది ఇంకా తెలియలేదు. ఆర్ధిక మంత్రి జైట్లీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తో సమావేశమయ్యారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ తెలిపింది. హై కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళతామని ఓ బిజేపి నాయకుడు అన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 29 పరీక్షలో రావత్ విశ్వాసం కోల్పోతారని ఉత్తర ఖండ్ బిజేపి నేత కైలాస్ విజయ వర్గీయ వ్యాఖ్యానించారు. అయితే 9 మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఏ ల సస్పెన్షన్ రద్దయినట్లా కాదా అన్నది తెలియలేదు. తీర్పులో స్పీకర్ చర్యలను కూడా కోర్టు తప్పు పట్టినందున కాంగ్రెస్ రెబెల్స్ కూడా ఓటింగులో ఉంటారని భావించవచ్చు. అదే జరిగితే రావత్ ప్రభుత్వం కూలిపోవడం ఇక ఫార్మాలిటీ మాత్రమే, ఈ లోపు రెబెల్స్ విధేయతలు మారితే తప్ప!
మేడిపండు ప్రజాస్వామ్యనాటకం బహుబాగుగా ఉన్నది.కార్యనిర్వహనశాఖ,న్యాయశాఖ ఈ నాటకాన్ని రక్తికట్టించి తదుపరి దశని ఆసక్తి కలిగించేలా చేశాయి.ఆధునిక భారతావనిలో ఇంతకంటే గొప్పనాటకం ఏముంటుంది?