
Corporatisation
(12వ భాగం తరువాయి……………..)
భారత వ్యవసాయరంగంలో మార్పులపై ఒక నోట్ : పార్ట్ 13
వ్యవసాయ రుణం, వడ్డీ చెల్లింపులు, వాణిజ్యీకరణ
రుణాలు, వడ్డీల వాస్తవ పరిమాణం
రైతుల స్ధితి గతులను ఋణ భారం, వడ్డీ చెల్లింపుల భారీతనం కూడా వెల్లడి చేస్తుంది. SASF గణాంకాల ప్రకారం రైతు కుటుంబాల్లో 49 శాతం ఋణ పీడితులు. కొన్ని రాష్ట్రాల్లో ఇది మరీ అధికం. ఉదాహరణకి ఆంధ్ర ప్రదేశ్ రైతు కుటుంబాల్లో 82 శాతం ఋణ భారం మోస్తున్నారు. కేరళలో 64%, పంజాబ్ లో 65%, తమిళనాడులో 75% రైతు కుటుంబాలు ఋణ భారం మోస్తున్నాయి.
ఇది చూడగానే ‘రైతులకు ఋణ లభ్యత బాగానే ఉన్నది. ఇది మంచిదే కదా’ అనేవారున్నారు. అయితే ముందు పాఠాల్లో చూసినట్లుగా విస్తారమైన మెజారిటీ రైతు కుటుంబాలు లోటులో ఉన్నాయి. ఫలితంగా వాళ్ళు అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉన్న ఆస్తులను కోల్పోతున్నారు.
వ్యవసాయ రుణాలపై వడ్డీ చెల్లింపులు ఎంత భారీగా ఉన్నాయి? రైతు కుటుంబాలు తలసరి రు 12,585 రుణాన్ని మోస్తున్నారని SASF గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 57.7 శాతం వాటా సంస్ధాగత రుణాలది కాగా 30.9 శాతం వడ్డీ రుణదాతలు, వ్యాపారులది. మిగిలిన 11.4 శాతం ఇతర వనరుల నుండి సమకూరుతోంది.
రైతు కుటుంబాలు ఎన్ని ఉన్నాయన్నది కూడా SASF అంచనా వేసింది. దాని ప్రకారం భారతీయ రైతుల మొత్తం అప్పు రు 1.12 ట్రిలియన్లు (రు 1.12 లక్షల కోట్లు). AIDIS (All India Debt and Investment Survey) నివేదికల ప్రకారం గ్రామీణ సంస్ధాగత రుణాలపై కొన్ని సంస్ధలు 12% – 15% వరకు, మరి కొన్ని 15% – 20% వరకు వడ్డీలు వసూలు చేస్తున్నాయి. సరాసరి 15 శాతం వడ్డీగా పరిగణిద్దాం.
సంస్ధాగతేతర రుణాలలో 40 శాతం వరకు 30 శాతం పైగా వడ్డీలు వసూలు చేస్తున్నాయి. ఈ కేటగిరీలో ఇతర స్లాబ్ ల వివరాలు ఏవీ AIDIS నివేదికలు ఇవ్వలేదు. పత్రికల రిపోర్టుల ప్రకారం సంవత్సరానికి 150% వరకూ వడ్డీలు వసూలు చేస్తున్న సంస్ధాగతేతర రుణాలున్నాయి. కనుక సంస్ధాగతేతర రుణాలపై సగటున 24 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారని ఎటువంటి శషభిషలు లేకుండా భావించవచ్చు. ఈ రేటు ప్రకారం రైతుల రుణాలపై వడ్డీ చెల్లింపులు రు 200 బిలియన్లు (రు 20 వేల కోట్లు) ఉంటాయి.
అయితే SASF గణాంకాలు రైతుల ఋణ భారాన్ని గురించిన వాస్తవ వివరాలను ప్రతిబింబించవని, ముఖ్యంగా సంస్ధాగతేతర ఋణ పీడనను తక్కువగా అంచనా వేసాయని ఇతర వనరుల ద్వారా మనకు తెలుస్తున్నది. బహుశా సర్వేలో పాల్గొన్న రైతులు తాము వడ్డీ ఋణదాతలు, వ్యాపారులు మొ.న వారికి ఏ మేరకు అప్పు పడింది చెప్పడానికి సిగ్గు పడి ఉండవచ్చు, లేదా భయపడి ఉండవచ్చు. అనేక ఇతర అధ్యయనాలు సంస్ధాగత రుణాల కంటే సంస్ధాగతేతర రుణాలు రెట్టింపు ఉన్నాయని తెలిపాయి.
SASF లేదా AIDISలు ప్రకటించిన లెక్కలు నిజమే అయితే వ్యవసాయదారులు తమ వ్యవసాయాన్ని ఎలా కొనసాగించగలిగారన్న అనుమానం వస్తుంది. మెజారిటీ రైతులు లోటులో ఉన్నారని SASF గణాంకాలే చెప్పాయి. బ్యాంకులు, కో ఆపరేటివ్ లు జారీ చేసిన రుణాల మొత్తం రైతుల పెట్టుబడి అవసరాల్లో కొంత భాగాన్నే తీర్చుతోందని కూడా SASF నివేదిక తెలిపింది. ఉదాహరణకి SASF సర్వే జరిగిన సంవత్సరంలో వ్యవసాయ ముడి సరుకుల అవసరంలో 15 శాతం మాత్రమే సంస్ధాగత రుణాలు తీర్చాయి. అనగా మిగిలిన అవసరాన్ని సంస్ధాగతేతర రుణాలు తీర్చినట్లేనని అర్ధం అవుతోంది.
ఈ నేపధ్యంలో 2 హెక్టార్ల లోపు కమతాల రైతులకు UPA ప్రభుత్వం ప్రకటించిన సంస్ధాగత ఋణ మాఫీ పధకం రైతుల సమస్యలోని భారీ భాగాన్ని తీర్చలేదు. సంస్ధాగతేతర రుణాలు, సంస్ధాగత రుణాల కంటే రెట్టింపు ఉన్న సంగతిని పరిగణిస్తే తలసరి రైతు కుటుంబ ఋణ భారం రు 22,000 ప్రాంతంలో ఉంటుంది. ఆ లెక్కన మొత్తం రైతుల రుణం రు 1.95 ట్రిలియన్లకు (రు 1.95 లక్షల కోట్లు) చేరుతుంది. సగటు వడ్డీ 21 శాతం అనుకుంటే ఈ రేటు ప్రకారం వడ్డీ చెల్లింపులు రు 410 బిలియన్లు (రు 41 వేల కోట్లు) అవుతాయి. ఇది 2002-03 వ్యవసాయ జిడిపిలో 10 శాతానికి సమానం.

‘Why didn’t we think of doing this before?’
ఈ వడ్డీ చెల్లింపులను వ్యవసాయంలో పెట్టుబడులతో పోల్చి చూద్దాం. 2002-03 లో వ్యవసాయంలో స్ధూల పెట్టుబడి రు 335.08 బిలియన్లు (రు 33,508 కోట్లు) కాగా నికర పెట్టుబడి -అనగా ఆస్తుల నికర అరుగుదల- రు 78.74 బిలియన్లు (రు 7,874 కోట్లు). కనుక వ్యవసాయంలో వడ్డీ చెల్లింపులు స్ధూల పెట్టుబడి కంటే ఎక్కువగానూ, నికర పెట్టుబడి కంటే 5 రెట్లకు అధికంగానూ ఉన్నది. ఇది కూడా ఎక్కడికక్కడ సగటును తగ్గించుకుంటూ వస్తేనే. దీనినిబట్టి రైతుల రాబడి వారి నుండి జారిపోవడంలో వడ్డీ చెల్లింపులు అత్యధిక భాగం వహిస్తున్నదని, తద్వారా వ్యవసాయరంగంలో అంతర్గతంగా పెట్టుబడి పోగుబడకుండా నిరోధిస్తున్నదని స్పష్టం అవుతున్నది.
ఇవి నిజానికి చాలా అసంపూర్ణ లెక్కలు. పూర్తి వివరాలు అందుబాటులో ఉండి, జాగ్రత్తగా అధ్యయనం చేసినట్లయితే ఈ లెక్కలు చాలా తక్కువ అంచనాలని తెలుస్తుంది. అటువంటి అధ్యయనాలు ప్రభుత్వాలు చేయవు. రైతు సంఘాలు పూనుకుని రైతులను ఒప్పించి వివరాలు సేకరించగలిగితే ఉపయోగం ఉంటుంది.
ముఖ్యంగా ఋణ దాతయే ఋణ గ్రహీతకు ముడి సరుకులు సరఫరా చేసి, అతని/ఆమె ఉత్పత్తులు కొనుగోలు చేసి, తన భూములనే కౌలుకు ఇచ్చి సాగు చేయిస్తుంటే వాస్తవ వడ్డీ రేటు సాధారణ రేటు కంటే అత్యధిక మొత్తంలో ఉన్నట్లు తేలుతుంది. లోతైన అధ్యయనం లేకుండా ఇలాంటి వివరాలు పట్టుకోవడం కష్టం. వడ్డీ దారుడికి అతి పెద్ద లాభం ఎప్పుడు వస్తుందంటే అప్పులు, వడ్డీలు చెల్లించలేక రైతు తన భూమిని వదులుకున్నప్పుడు!
వ్యవసాయ ఉత్పత్తిదారులకు వ్యాపార షరతులు దినం దినం దిగజారుతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుండడం వలన వ్యవసాయ ఉత్పత్తులకు సైతం డిమాండ్ పడిపోతోంది. అయినప్పటికీ పీడిత రైతులకు (peasants) వ్యవసాయం తప్ప మరో దారి లేదు. ఇలాంటి నిస్సహాయ పరిస్ధితుల్లో పరాన్న భుక్త వర్గాలు రైతులను మరింతగా పీడిస్తున్నారు. చివరికి వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టి ఆర్జించడం కంటే రైతులకు అప్పులిచ్చి పీడించడమే ఎక్కువ ఆకర్షణీయంగా (లాభాల పరంగా) మారిపోయింది.
వాణిజ్యీకరణ ఋణ దాస్యాన్ని తీవ్రం చేస్తుంది
వాణిజ్యీకరణ పెరిగడం రైతులకు లాభకరం అని ప్రధాన స్రవంతి పత్రికలు నిర్ధారించేశాయి. ఆ అవగాహనతోనే అవి రైతుల స్ధితిగతులపై చర్చలు చేస్తాయి. నిజానికి వ్యవసాయ రంగాన్ని మరింతగా మార్కెట్ ప్రయోజనాల వైపుకు నేట్టడమే ప్రభుత్వ విధానాల ప్రకటిత లక్ష్యం. అయితే, 1990ల నుండి తీవ్రమైన రైతుల ఆత్మహత్యలు అధిక స్ధాయిలో వాణిజ్యీకరణ జరిగిన రాష్ట్రాలలో కేంద్రీకృతం కావడం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ముఖ్యంగా వాణిజ్య పంటలు పండించే రైతులలో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి.
రైతుల దిగుబడిలో ఏ మేరకు అమ్మకాలలోకి వెళ్తున్నదో SASF గణాంకాల నుండి తెలుసుకోవచ్చు. ఇది వాణిజ్యీకరణ విస్తృతిని తెలియజేస్తుంది. వివిధ రాష్ట్రాలలో ఋణ పీడిత రైతుల శాతం లెక్కలు కూడా SASF గణాంకాలు ఇచ్చాయి. దిగుబడిలో అమ్మకాల భాగం పెరిగిన కొద్దీ రైతుల ఋణ భారం పెరుగుతుండడం ఈ గణాంకాల నుండి గ్రహించగలం.
తమ వినియోగ ఖర్చులకు సరిపడా వ్యవసాయ ఆదాయం లేనందు వల్లనే రైతులపై ఋణ భారం పేరుకుపోతున్నదని ముందు భాగాల్లో చూశాం. కనుక మార్కెటీకరణ పెరగడం అన్నది రైతుల స్ధితిగతుల మెరుగుపరిచి మిగులు పోగేసుకోవడానికి దారి తీయడానికి బదులుగా వారు అప్పుల ఊబిలో కూరుకుని పోయేందుకే దారి తీస్తున్నది.
మరోవైపు వివిధ రాష్ట్రాల్లో రైతుల ఋణ భారానికీ ఆయా రాష్ట్రాల నికర వ్యవసాయ జిడిపి లకూ సంబంధం ఉండడం లేదు. అనగా వ్యవసాయ రంగం అభివృద్ధి ఎక్కువగా ఉన్నా, తక్కువ ఉన్నా రైతుల ఋణ భారంపై దాని ప్రభావం ఏమీ లేదు. దానికి బదులుగా వాణిజ్యీకరణ తీవ్రతతో ఋణ భారం కట్టివేయబడి ఉంటోంది. సాపేక్షికంగా సంపన్నవంతమైన పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలతో పాటు వ్యవసాయం వెనుకబడి ఉన్న కర్ణాటక, మహారాష్ట్రాలలో సైతం వాణిజ్యీకరణ అధికంగా ఉన్నది.
భారీ మొత్తంలో ఆత్మహత్యలు జరుగుతున్నట్లుగా పత్రికలు రిపోర్ట్ చేస్తున్న -ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, గుజరాత్- రాష్ట్రాలలో దిగుబడిలో అమ్మకంలోకి వెళ్తున్న భాగం అధికంగా ఉన్నది. దిగుబడిలో అమ్మకాలకు వెళ్తున్న భాగానికి సంబంధించి అఖిల భారత సగటు రాష్ట్రానికి 57 శాతం ఉండగా ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాలలో 69 నుండి 81 శాతం వరకు ఉన్నది.
నిర్దిష్ట పంటల సాగుబడి పెంచడమా లేక తగ్గించడమా అన్నది నిర్ణయించుకోవడానికి అవసరమైన ధరల కదలికల సంకేతా లు రైతులందరికీ అందుతున్నాయని భావించినా కూడా ఆ సంకేతాలను సైతం మార్కెట్ శక్తులు ప్రభావితం చేస్తున్నాయి. ఎందుకంటే మార్కెట్ లో పెద్ద వ్యాపారులదే ఆధిపత్యం కనుక. ఇప్పుడు కార్పొరేట్ రంగం అంతకంతకూ ఎక్కువగా మార్కెట్ పై నియంత్రణను పెంచుకుంటోంది. ఫలితంగా ధరల సంకేతాలు పెద్ద వ్యాపారులు, కార్పొరేట్ రంగాల ప్రయోజనాలకు అనుగుణంగా వెలువడుతున్నాయి.
వ్యవసాయ ధరలలో ఎప్పుడన్నా పెరుగుదల సంభవిస్తే అది పూర్తిగా రిటైల్ స్ధాయికి మళ్లించబడుతుంది. ఉదాహరణకి గోధుమ పంట నుండి రైతులకు అధిక ధర దక్కితే అది వినియోగదారులపై మరింత హెచ్చు ధరలకు వడ్డింపుగా తరలించబడుతుంది. కానీ రిటైల్ ధరల్లో పెరుగుదలను పూర్తిగా రైతుల స్ధాయికి మళ్లించడం జరగదు. ఉదాహరణకి ఉల్లి పంట దిగుబడి తగ్గినప్పుడు ఉల్లి ధరలు పెరుగుతాయన్నది వినియోగదారుల అనుభవం. ఈ పెరుగుదల రైతులకు చేరడం చాలా తక్కువ.
పైగా రిటైల్ ధరలు తగ్గితే మాత్రం ఆ తగ్గుదల పూర్తిగా రైతులకు బదలాయించబడుతుంది. ఉదాహరణకు వంట నూనెలను చౌక ధరలకు విదేశాల నుండి దిగుమతి చేసుకున్నప్పుడు దేశంలో నూనె విత్తనాల దిగుబడి ధరలు అమాంతం పడిపోతాయి. ఈ తగ్గుదల తప్పనిసరిగా రైతుల మీదికి తోసేస్తారు. సంక్షోభం ఏర్పడితే రైతులే ఆ భారాన్ని మోయవలసి వస్తుంది. ఎప్పుడన్నా గాలి వాటు లాభాలు వచ్చినప్పుడు మాత్రం అవి రైతులకు చేరక ముందే వ్యాపారులు స్వాయత్తం చేసుకుంటున్నారు.
బ్రిటిష్ పాలనలోనూ ఇదే తరహా పద్ధతి అమలు చేయబడింది. మార్కెట్ అవసరాలకు అనువుగా వ్యవసాయం చేసేలా రైతులను బలవంతం చేశారు. రైతులకు తమకంటూ పెట్టుబడిని పోగేయనూ లేకపోయారు; సామర్ధ్యానికి మించి సాగుదారు లతో నిండిపోయిన వ్యవసాయరంగాన్ని వీడనూలేకపోయారు. రైతుల నిస్సహాయ పరిస్ధితుల రీత్యా భూమి, రుణాలు, ముడి సరుకులు & ఉత్పత్తుల మార్కెట్ లపై నియంత్రణ కలిగిన ఆధిపత్య వర్గాలు ఉత్పాదకతా శక్తుల విస్తరణకు తోడ్పడకుండా నే మిగులును సొంతం చేసుకున్నారు.
ఈ విధంగా మిగులును స్వాయత్తం చేసుకున్న వ్యవసాయ ఆధిపత్యం వర్గాలు దానిని విలాసాల వినియోగాలకు, వడ్డీ దోపిడీలకు, కొత్త భూకమతాల స్వాధీనానికీ తరలిస్తున్నారు. వ్యాపారం/దిగుబడి నిల్వ చేయడం/ధరల స్పెక్యులేషన్లకు పాల్పడుతున్నారు. ఇతర రకాల వ్యాపారాలకు తరలిస్తున్నారు. ఉదాహరణకి నిర్మాణ కాంట్రాక్టులు, కూలీల సరఫరా కాంట్రాక్టులు, ట్రక్కులు/బస్సు రవాణా, సినిమా ధియేటర్లు, హోటళ్లు, ఇంజనీరింగ్/మెడికల్ కాలేజీలు, వివాహ భవనాలు మొ.వి. నేర కార్యకలాపాలకు తరలిస్తున్నారు. సామాజిక ఆర్ధిక శక్తిని మరింతగా స్ధిరపరుచుకోవడానికి వీలుగా ఎన్నికలలో ఖర్చు పెడుతున్నారు. గమనార్హం ఏమిటంటే గ్రామీణ ఆధిపత్య వర్గాల చేతుల్లోని మిగులు పెట్టుబడి (అదనపు విలువ) చిన్న తరహా పరిశ్రమలకు తరలిపోవడంలో కూడా విఫలం అవుతోంది. దానితో దేశంలో ఎక్కడ చూసినా చిన్న తరహా పరిశ్రమ నిధులు లేక అల్లాడుతోంది.
కార్పొరేట్ల ప్రవేశం
ఇటువంటి నేపధ్యం లోనే స్వదేశీ, విదేశీ కార్పొరేట్లు వ్యవసాయ రంగంలో ప్రవేశించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. కార్పొరేట్ల ప్రవేశం వ్యవసాయంలో పెట్టుబడి పోగుబడే ప్రక్రియను వేగవంతం చేస్తుందా? వ్యవసాయరంగం పరిణామం చెందడానికి కార్పొరేట్లు దోహదం చేస్తాయా? సమాధానం ‘లేదు’ అనే.
మొదటిగా: ముందు చూసినట్లుగా వ్యవసాయంలో మిగులు అత్యల్పం. కార్పొరేట్ల కార్యకలాపాలు విస్తారంగా ఉంటాయి కనుక వారి లాభాల అంచనాలు భారీగా ఉంటాయి. కనుక అవి వ్యవసాయంలో అధిక లాభాలు సమకూర్చే నిర్దిష్ట కార్యకలాపాల పైననే దృష్టి కేంద్రీకరించ వలసి ఉంటుంది. వ్యవసాయంలోని ప్రమాదకర మరియు లాభరహిత కార్యకాలాపాలను ఇతరుల పైకి నెట్టవలసి ఉంటుంది.
కార్పొరేట్లు ప్రధానంగా మార్కెట్ లో సంపన్న వర్గాల అవసరాలని, సంఘటిత రిటైలింగ్ ద్వారా, తీర్చుతాయి. సంపన్న వర్గాల మార్కెట్ ను విస్తరించుకునే క్రమంలో కార్పొరేట్లు ఆచరణలో సాధారణ ప్రజా సమూహాల వినియోగాన్ని తగ్గించేస్తాయి. మెక్సికోలో జరిగింది అదే. మెక్సికన్ల ప్రధాన ఆహారం కార్న్ తొర్టిల్లా -మొక్కజొన్న చపాతీ (మన గోధుమ చపాతీల వంటివి). అక్కడ ఇప్పుడు మొక్కజొన్న మార్కెటింగు మరియు ప్రాసెసింగ్ కార్యాలాపాలన్నీ బహుళజాతి కార్పొరేట్ల గుత్త స్వామ్యం నియంత్రణలో ఉన్నాయి. ఫలితంగా పొలాల వద్ద రైతులకు తక్కువ ధరలు మాత్రమే అందుతుండగా, వినియోగదారులకు మాత్రం మొక్కజొన్న అధిక ధరలకు అందుబాటులో ఉంటోంది.
కార్పొరేట్ వ్యవసాయానికి ఉన్న మార్కెట్ పరిమితుల దృష్ట్యా పంట పొలాల్లో ఒక భాగం మాత్రమే కార్పొరేట్ అవసరాలకు మళ్లించబడుతుంది. దీని వల్ల కార్పొరేట్లు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి మారుతూ పోయే అవకాశం కలిగి ఉంటాయి. ఆ క్రమంలో భూగర్భ జలాలు లాంటి సహజ వనరులను హరించివేస్తూ పోతాయి. దానితో ఉత్పత్తుల సరఫరాదారులు కార్పొరేట్ల నుండి సానుకూలమైన షరతులు పొందలేని స్ధితికి నెట్టబడతారు.
వ్యవసాయరంగం సాగుదారులతో పరిమితికి మించి నిండిపోయినందున అది అధిక వడ్డీ వ్యాపారులకు మల్లేనే కార్పొరేట్లకు అనుకూలంగా పని చేస్తుంది. రైతులను మరింత దిగజార్చే పరిస్ధితిలో కార్పొరేట్లు ఉంటాయి. నిజానికి తమ తరపున పని చేసే అధిక వడ్డీ వ్యాపారులు ద్వారా కార్పొరేట్లు దోపిడీ తీవ్రం చేయగలరు. ఇటువంటి ఉదాహరణలు ఇప్పటికే దేశంలో ఉన్నాయి కూడా. జూట్ మిల్లులు, సుగర్ మిల్లులు శతాబ్ద కాలంగా అర్ధ-భూస్వామ్య సంబంధాల పునాదిగానే కాంట్రాక్టు వ్యవసాయాన్ని నిర్వహిస్తున్నాయి.
ఇప్పటికే నీటి పారుదల మరియు రోడ్డు రవాణా సౌకర్యాలు తగినంతగా ఉన్న ప్రాంతాల్లోనే కార్పొరేట్లు తమ కార్యకలాపాలు కేంద్రీకరిస్తాయి. ఉదాహరణకి రిలయన్స్, భారతి (వాల్-మార్ట్), పెప్సీకో, ఐటిసి లు అతి పెద్ద పెట్టుబడులు ప్రకటించింది పంజాబ్ లోనే. ఈ ధోరణి వ్యవసాయంలో ఇప్పటికే ఉన్న అభివృద్ధి అసమానతలను మరింత తీవ్రం చేస్తుంది. మౌలిక వసతులపై కార్పొరేట్లు పెట్టుబడులు పెట్టవచ్చు గానీ అవి తమ అవసరాలకే పరిమితం అవుతుంది తప్ప భారత వ్యవసాయ రంగం అభివృద్ధికి మాత్రం కాబోదు.
ఇంకా చెప్పాలంటే కార్పొరేట్ల అవసరాలకు అనుగుణంగా మౌలిక నిర్మాణాలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలను కూడా రంగంలోకి దించుతున్నారు. ఉచితంగా గానీ లేదా అత్యంత తక్కువ ధరలకు గానీ కంపెనీలకు భూములు కట్టబెట్టిస్తున్నారు. కంపెనీలకు పన్నుల నుండి మినహాయింపులు, రాయితీలు కూడా రాష్ట్రాల చేత ఇప్పిస్తున్నారు. ఆ విధంగా కార్పొరేట్ల మిగులు హెచ్చుదలకు అదనపు వనరుగా ప్రభుత్వ సబ్సిడీలు అవతరించాయి. కార్పొరేట్ కార్యకలాపాలకు అనుగుణంగా వ్యవసాయ రుణాలు జారీ చేసేందుకు బ్యాంకులకు ఆదేశాలు అందుతున్నాయి.
తన ఆధిపత్య స్ధానం రీత్యా కార్పొరేట్ కొనుగోలుదారు అననుకూలలతలను పూర్తిగా సాగుదారు మీదికి మళ్లించగల స్ధితిలో ఉంటాడు. సరఫరాదారులు, కొనుగోలుదారుల శక్తుల మధ్య ఉన్న అంతరాల వల్ల కార్పొరేట్ – సాగుదారు సంబంధం ఒన్-వే ట్రాఫిక్ లాంటిది. పరిమిత ప్రభుత్వ సేకరణను సైతం ఉపసంహరిస్తున్నందున కార్పొరేట్ సాగు నియంత్రణకు ఎన్ని చట్టాలు తెచ్చినా ఆచరణలో సానుకూల నియమాలు రూపొందించుకోకుండా కొనుగోలుదారులను (కార్పొరేట్లను) అడ్డుకోలేవు. కాంట్రాక్టు రీత్యానే సరఫరాదారు ఒకే కొనుగోలుదారు కార్పొరేట్ కు బంధితుడు అవుతాడు. ఎప్పుడన్నా మార్కెట్ ధరలు పెరిగితే తన ఉత్పత్తిని మరో కొనుగోలుదారుకు అమ్ముకునేందుకు రైతుపై చట్టబద్ధంగానే నిషేధం అమలవుతుంది.
మరోవైపు కార్పొరేట్ సంస్ధలు తనకు గల అన్ని అవకాశాలను భద్రంగా కాపాడుకుంటాయి. ఎప్పుడూ అవసరానికి మించి సరఫరాదారులు ఉండేలా చూసుకుంటుంది. తద్వారా తన ఇష్టారీతిలో సరఫరాదారులను మార్చగలడు. పైగా తాను కొనుగోలు చేసే సరుకు ఎలా ఉండాలో ప్రమాణాలను తానే నిర్ణయించగలడు. తన ప్రమాణాలకు తగినట్లు సరులు లేకపోయినా లేదా, తన ప్రమాణాలకు తగినట్లుగా సరుకు లేదని తాను చెప్పినా దానిని అంగీకరించక తప్పని పరిస్ధితి రైతుకు ఏర్పడుతుంది. కొనుగోళ్లకు నిరాకరించబడుతుంది. కార్పొరేట్లకు మార్కెట్ పై కలిగి ఉండే నియంత్రణ వలన మరో కొనుగోలుదారుకు కూడా పడిపోయిన ధరలకే అప్పగించాల్సి వస్తుంది. లేదా సరుకులు పారబోసుకోవాల్సిందే.
విదేశీ మరియు సంపన్నుల మార్కెట్ లో డిమాండ్ ఉండే విలక్షణ సరుకుల విషయంలో కొనుగోలుకు ఒక కార్పొరేట్ నిరాకరిస్తే మరొకరి వద్దకు వెళ్ళే అవకాశం ఉండదు. ఎందుకంటే దానికి అవసరమైన ప్రత్యేక రవాణా వసతి, కోల్డ్ స్టోరేజి సౌకర్యం అందుబాటులో ఉండవు.
కార్పొరేట్ల సాగు ముడిసరుకులపై (inputs) అధికంగా ఆధారపడినది, మధ్య కాలికంగా నేల ఉత్పాదకతను క్షీణింపజేసేది అయితే దిగజారిన విలువతో పొలాన్ని మిగుల్చుకునే సరఫరాదారు అంతిమ నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కార్పొరేట్ ఏ విధంగానూ నష్టపోడు.
భారత సమాజానికి ఉన్న మౌలిక లక్షణం వల్లనే కార్పొరేట్ కొనుగోలుదారులు ఈ తరహా ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారు. ఈ వ్యవసాయ సమాజం ఉత్పత్తిదారులతో పరిమితికి మించి నిండి ఉండగా మార్కెట్ అవకాశాలు మాత్రం కుచించుకుపోయి ఉంటాయి. కార్పొరేట్లకు మార్కెట్ విస్తారంగా ఉన్నా (భారీ పంట దిగుబడులు అవసరం అయ్యేవిధంగా) లేక నిరుద్యోగులు, పాక్షిక ఉపాధిపరుల సంఖ్య ఇంత భారీ మొత్తంలో అందుబాటులోకి రాకపోయినా తమ సొంత షరతుల ప్రకారం కొనుగోళ్ళు జరపడానికి కార్పొరేట్లకు కష్ట సాధ్యం అయి ఉండేది.

Commodity Futures -Farmers can’t cope with
ఇండియాలో కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్ అభివృద్ధి అయితే రైతులకు లాభకరం అని ప్రభుత్వం, విదేశీ ద్రవ్య పెట్టుబడిదారులు ప్రచారం చేస్తున్నారు. ఉదాహరణకి 6 నెలల కాల అవధి కలిగిన సరుకుల ఫ్యూచర్ మార్కెట్లలో ధరల ప్రాతిపదికన రైతులు పంటలు పండించడం (అనగా 6 నెలల్లో ఫలానా పంట దిగుబడి అందిస్తానని రైతు ముందుగానే కార్పొరేట్ తో కాంట్రాక్టు కుదుర్చుకుంటాడు. ఆ కాంట్రాక్టులను కమోడిటీ ఫ్యూచర్ మార్కెట్లో షేర్ల తరహాలోనే అమ్మకాలకు-కొనుగోళ్లకు పెడతారు. 6 నెలలే కానవసరం లేదు. పంటను బట్టి నిర్ధిష్ట కాల వ్యవధి) ప్రారంభిస్తే రైతులకు లాభం అని వారు చెబుతున్నారు.
ఇది కూడా రైతుకు నష్టకరంగానే పరిణమిస్తుంది. ఎందుకంటే ఒకటి: వారి ఉత్పత్తుల ధర కాంట్రాక్టులో స్ధిరంగా బంధించబడి ఉంటుంది. కనుక ధరల్లో వచ్చే మార్పుల నుండి లాభపడే స్ధితిలో ఉండలేరు. రెండు: అమెరికాలో చూసినా కమోడిటీ ఫ్యూచర్ మార్కెట్ లలో రేట్ల ప్రకారం ఏ పంట పండించాలో నిర్ణయించుకునే రైతులు బహు తక్కువ. భారత రైతులు అమాయకులు, నిరక్షరాస్యులు, ఫ్యూచర్ మార్కెట్ మాయాజాలంపై అవగాహన లేనివారు. పైగా నిస్సహాయులు. కనుక మెజారిటీ రైతులు ఫ్యూచర్ మార్కెట్ నుండి లాభపడగలరని అంచనా వేయడం వాస్తవాలకు పచ్చి విరుద్ధం.
మూడు: కమోడిటీ మార్కెట్లు, వేర్ హౌస్ ల రసీదుల నిర్మాణమే మొత్తంగా ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులపై ఆధారపడి ఉంటుంది. ప్రమాణాలు లేని ఉత్పత్తులకు ధర రాదు. భారత వ్యవసాయ ఉత్పత్తి చూస్తేనేమో మెజారిటీ ప్రమాణాలు తూగవు. మార్కెట్ ప్రమాణాలతో సరి తూగాలంటే ఖరీదైన ముడి సరుకులు, పరికరాలు ఉపయోగించాలి. విదేశీ మార్కెట్ల కోసం అయితే గనక సానిటరీ / ఫైటో సానిటరీ ధృవ పత్రాలు (సర్టిఫికెట్స్) పొందాల్సి ఉంటుంది. కార్పొరేట్లు సర్టిఫికేషన్ వ్యవహారం చూసుకున్నా అందుకు అయ్యే ఖర్చు మాత్రం చివరికి ఉత్పత్తిదారు/సరఫరాదారు పైనే మోపుతారు. ఇలాంటి భారాలను చిన్న, మధ్య కమతాల రైతులు మోయలేరు.
మార్కెట్ ధరతో పాటు ఇతర అంశాలను బట్టి కూడా భారత రైతులు పంటలు ఎంచుకుంటారు. పంటను గురించి తెలిసి ఉండాలి. స్ధానిక పరిస్ధితులకు తగినదో కాదో చూడాలి. నీటిపారుదల అందుబాటులో ఉండేదీ లేనిదీ చూడాలి. విత్తనాల లభ్యత, నిర్ధిష్ట పంటకు మార్కెట్ వసతి, పెట్టుబడి పరిమాణం, అననుకూలతల తీవ్రత, తన కుటుంబ జీవన అవసరాలు, అంతిమంగా ఖర్చులకూ, వినియోగానికీ రుణాలు సరఫరా చేసే వ్యాపారుల (వీరే తరచుగా ఉత్పత్తి కొనుగోలు వ్యాపారి అయి ఉంటారు) నియమ నిబంధనలు… ఇవన్నీ భారత రైతు పరిగణనలోకి తీసుకోని గాని సాగులోకి దిగడు.
సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ రైతులకు అద్భుత శక్తులు అందుబాటులోకి తెచ్చాయని ఒకటే ఊదరగొడుతున్నారు. వీటి వల్ల ఏ మార్కెట్ లో అధిక ధర లభిస్తున్నదో ఒక రైతు తెలుసుకోగలడే గానీ అతని రాబడి మొత్తాన్ని పెంచడం అంటూ జరగదు కదా. ఒకవేళ రైతులందరూ సమాచార సాంకేతికతను వినియోగిస్తున్నారని భావిద్దాం. అప్పుడైనా రైతులంతా అధిక ధర పలికే మార్కెట్ కు గుంపులుగా చేరతారు. దానితో అక్కడ కూడా ధర పడిపోయి కూర్చుంటుంది. ఒక మార్కెట్ కి భారీ సంఖ్యలో రైతులు సరుకు తరలించాక ఇతర మార్కెట్ లో ధర పెరుగుతుంది కదా. అప్పుడా రైతుకు ఏది దారి?
(…………సశేషం)
మెక్సికోలో కర్పోరేట్ల ప్రవేశంవలన పొలాల వద్ద రైతులకు తక్కువ ధరలు మాత్రమే అందుతుండగా, వినియోగదారులకు మాత్రం మొక్కజొన్న అధిక ధరలకు అందుబాటులో ఉంటోంది.
భారత్ లో దళారీల వలన పొలాల వద్ద రైతులకు తక్కువ ధరలు మాత్రమే అందుతుండగా, వినియోగదారులకు మాత్రం ఆహారపంటలు అధిక ధరలకు అందుబాటులో ఉంటోంది.
పెట్టుబడీదారీ దేశాలలో,అర్ధభూస్వామ్య దేశాలలో రైతుల జీవితాలను ప్రభావితం చేసేవి(ప్రధానంగా) ఇవేనా?
వ్యవసాయంలో కార్పోరేట్ సంస్థల ప్రవేశం – పరిణామాలు బాగా విశ్లేషించారు . అన్నట్లు మీ బ్లాగు శోధినిలో ఉంది.