(11వ భాగం తరువాత………)
భారత వ్యవసాయరంగంలో మార్పులపై ఒక నోట్ -పార్ట్ 12
–
వ్యవసాయ రాబడిలో మిగులు స్వాధీనం చేసుకునే సెక్షన్
రైతు కుటుంబాల్లో వినియోగ ఖర్చులకు పోను మిగులు సాధించే సెక్షన్ సంగతి చూద్దాం. పెద్ద సైజు కమతాల రైతుల నుండి అతి పెద్ద సైజు కమతాల భూస్వాముల వరకు వ్యవసాయంలో మిగులు సాధిస్తున్నారు. అనగా 10 హెక్టార్లు (25 ఎకరాలు) అంతకు మించి కమతాల రైతులు నికరంగా మిగులు సాధిస్తున్నారు.
అయితే 10 హె. కు పైన విస్తీర్ణం గల కమతాల రైతులందరూ ఒకే తరహా మిగులును పొందలేరు. వారిలో ఒక సెక్షన్ రైతులు పెద్ద కమతాలు ఉన్నప్పటికీ తమ మిగులును పెంచుకోవడానికి వివిధ మార్గాలు వెతుకుతూ ఉంటారు. కూలీల నుండి సాధ్యమైనంత ఎక్కువ మొత్తాన్ని గుంజుకోవడానికి ప్రయత్నిస్తారు. మార్కెట్ మార్కెట్ తీరు తెన్నులకు, మార్కెట్ ధరలకు అనుగుణంగా పంటలు మార్చుతుంటారు. పంట పండించడంలో ఉన్నంతలో మెరుగైన సాంకేతిక పద్ధతులను అవలంబించడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మార్కెట్ లో రుణాల వెంట వచ్చిపడే షరతుల పట్లా, ముడి సరుకులు & ఉత్పత్తుల ధరల పట్లా అసంతృప్తితో రగులుతూ ఉంటారు. తమ వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన ధరలు పొందడానికి వీరే తరచుగా ఆందోళనలకు దిగుతారు.
ఆ తర్వాత అతి పెద్ద, ఆధిపత్య భూస్వామ్య వర్గాలు! భూమి, కూలి, రుణాలు, ఉత్పత్తుల ధరలు… వీటన్నింటిపైనా ఆయా మార్కెట్లలో ఆధిపత్యం చెలాయిస్తారు. మార్కెట్లలో ధరలు పెరిగే వరకు ఉత్పత్తులను నిలవ చేసుకోగల శక్తిని కలిగి ఉంటారు. సబ్సిడీ రేట్లకు ప్రభుత్వ రంగం (formal sector) రుణాలు పొందగల పరపతి వీరికి ఉంటుంది. అడపా దడపా తమ రుణాలను రద్దు చేయించుకోగలరు. వ్యవసాయానికి సంబంధించిన అన్ని మార్కెట్లలో వారికి ప్రయోజనాలు ఉంటాయి. ఆ ప్రయోజనాల ద్వారా వచ్చిన పలుకుబడితో లాభాలను పెంచుకోగలరు. కూలీలకు తామే రుణాలు ఇస్తారు. రైతులకు తామే భూములు కౌలుకు ఇస్తారు. ప్రతి ఉప రంగంలో ప్రయోజనాలు ఉన్నందున కూలీలు, రైతుల నుండీ, మార్కెట్ పరిస్ధితుల నుండి గరిష్ట లాభాలు గుంజుకోగలరు. వాస్తవ కూలీ రేట్లకు తక్కువ చెల్లించడం, వాస్తవ వడ్డీ రేట్లకు మించి వసూలు చేయడం ద్వారా తమ లాభాలు పెంచుకుంటారు.
భారీ కమతాలు భూస్వాములు రైతులు, కూలీలపై ఆధారపడి మాత్రమే వ్యవసాయం చేస్తారు. వేతన కూలీల చేతుల్లో ఉత్పత్తి సాధనాలు ఉండవు. భూస్వాములు ఉత్పత్తి సాధనాలకు యజమానులు. కనుక భూస్వాములు కూలీల నుండి గరిష్ట విలువ గుంజుకోగల స్ధితిలో ఉంటారు.
[ఎలాగంటే, కూలీ ఒక రోజు శ్రమలోని విలువను రెండు భాగాలుగా భూస్వామికి ఇస్తాడు. ఒక భాగం, తమకు చెల్లించబడిన వేతన కూలీని పునరుత్పత్తి చేయడం ద్వారా ఇస్తాడు. రెండవ భాగం తాను ఏ ఉత్పత్తి సాధానాలపైనేతే పని చేస్తాడో వాటి యజమానికి పని చేయడం ద్వారా ఇస్తాడు.
పెద్ద, భారీ కమతం య్జమాని తన రాబడిలో ముడి సరుకుల ఖర్చులు, ఉత్పత్తి సాధనాల అరుగుదల నిమిత్తం ఒక భాగం తీసేస్తాడు. కూలీల జీవిక (వేతనం) కోసం మరొక భాగం తీసి పక్కన పెడతాడు. మిగిలిన భాగమే మిగులు లేదా అదనపు విలువ.
ఇప్పుడు కూలీలు ఒక రోజు శ్రమకు తమకు చెల్లించబడిన వేతనాన్ని పైన చెప్పినట్లు రెండు భాగాలుగా ఉత్పత్తి చేసి ఇస్తాడు. ఒకటి: తనకు వేతనంగా చెల్లించిన మొత్తాన్ని పునరుత్పత్తి చేసి ఇస్తాడు. రెండు: భూమి ఇతర ఉత్పత్తి సాధనాల యజమానికి మిగిలిన శ్రమను చెల్లిస్తాడు. (మార్క్సిస్టు అవగాహన కోసం ఇది ఊహించాలి. వాస్తవ ఆచరణలో ఇది తెలిసి జరగదు.)
ఉత్పత్తి సాధనాల యజమాని కోసం పని చేసే శ్రమకాలానికి, వేతనం పునరుత్పత్తి కోసం పని చేసే శ్రమ కాలానికీ గల నిష్పత్తిని మార్క్సిస్టు పరిభాషలో ‘అదనపు విలువ రేటు’ (Rate of Surplus Value) అంటారు. SASF గణాంకాలు ఈ అవగాహనకు తగినట్లుగా ఉండవు. అయినప్పటికీ అందుబాటులో ఉన్న గణాంకాలను మన అవగాహనకు అనుగుణంగా మలుచుకోవడం, పక్కాగా కాకపోయినా, సాధ్యపడుతుంది. గణాంకాలను మార్చకుండానే దీనిని సాధ్యం చేసుకోవాలి, మరో మార్గం లేదు. Aspects of Indian Economy 44-46 నుండి -అను]
SASF గణాంకాల ప్రకారం 10 హెక్టార్లకు పైబడిన కమతం కలిగిన రైతు కుటుంబం సంపాదిస్తున్న మిగులు రు 84,600/-. వ్యవసాయ కూలీలకు మొత్తంగా చెల్లించేది రు 16,800/.
కనుక మిగులు (అదనపు విలువ) రేటు = 84600/16800 = రమారమి 5
[రోజుకు 10 గంటల పాటు శ్రమించే కూలీ సగటున గం. 1: 40 ని. లలో తన వేతనాన్ని పునరుత్పత్తి చేసి ఇవ్వగలడు. మిగిలిన గం. 8:20 ని. ల పాటు చేసే శ్రమ విలువ అంతా భూస్వామికి అదనపు విలువగా సమకూరుతుంది. ఉత్పత్తి సాధనాలు (భూమి, ఎరువులు, పురుగు మందులు, ట్రాక్టర్లు లాంటి యంత్రాలు, విత్తనాలు మొ.వి) యజమానిగా భూస్వామి ఈ భాగాన్ని స్వంతం చేసుకుంటాడు.
ఈ మిగులు/అదనపు విలువ రేటు ప్రాంతాలను బట్టి మారుతుంది. అధిక ఉత్పాదకతా భూముల్లో ఇతర భూముల కంటే అదనపు విలువ రేటు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి పంజాబ్ లో ఇది 6 కాగా ఒరిస్సా, బీహార్ లలో సగటున 0.5 గా ఉన్నది.
మరో సంగతి ఏమిటంటే పంజాబ్ లాంటి చోట్ల కూలీలు అందుబాటులో ఉన్నప్పటికీ, బీహార్ లాంటి రాష్ట్రాల నుండి కూలీలను రప్పిస్తారు. వారు తక్కువ కూలీకే పని చేస్తారు. ఆ విధంగా అధిక కూలీ వేతనానికి విరుగుడు మందు వేస్తున్నారు. తద్వారా తమ మిగులు రేటు తగ్గకుండా చూసుకుంటున్నారు. Aspects of Indian Economy 44-46 నుండి -అను]

Usury
మిగులులో ఎంత భాగం మేరకు ఉత్పాదక ఆస్తులపై పెట్టుబడిగా మారుతోంది?
SASF గణాంకాల ప్రకారం 10 హెక్టార్లకు పైబడిన కమతాలలో సగటున 10.5 శాతం మాత్రమే ఉత్పాదక శక్తులపై పెట్టుబడిగా మారుతోంది. పంజాబ్ లాంటి చోట్ల 22.3 శాతం వరకూ ఉత్పాదక పెట్టుబడిలోకి వస్తోంది. కానీ ఇది కూడా చిన్న మొత్తమే. మిగిలిన మొత్తం అనగా వ్యవసాయ మిగులులోని అత్యధిక భాగం (77.7 శాతం నుండి 89.5 శాతం వరకు) వ్యవసాయ ఉత్పాదక శక్తిగా మారడం లేదు.
వ్యవసాయేతర వర్గాల చేత మిగులు సంగ్రహణ
వ్యవసాయంలో లేకుండానే వ్యవసాయ మిగులును స్వాయత్తం చేసుకునే వర్గాల గురించి SASF గణాంకాలు ప్రత్యక్షంగా ఏమీ చెప్పవు. కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే వారి ఉనికి వివిధ రూపాల్లో ఉన్నట్లు చూడగలం.
వడ్డీ వ్యాపారులు (Usurer Traders): వ్యవసాయ ముడి సరుకులకు, వినియోగ ఖర్చుల అవసరాలకు వీళ్ళు రైతులకు అప్పులు ఇస్తారు. వీళ్ళు తాము అప్పులు ఇచ్చే రైతుల నుండి ఉత్పత్తిని కూడా కొనుగోలు చేయడం సర్వ సాధారణం. వారు ఇచ్చే అప్పులు ఉత్పత్తుల కొనుగోళ్లను లాభసాటిగా మార్చుతాయి.
ఋణ మార్కెట్, వ్యవసాయ ముడి సరుకులు (inputs) మరియు ఉత్పత్తుల (outputs) మార్కెట్లు అన్నంటిలో వీరి వ్యాపార కార్యకలాపాలు నడుస్తుంటాయి. అందువలన వారు ప్రతి మార్కెట్ లోనూ ఇతరుల కంటే అధిక మొత్తాన్ని మిగులుగా రాబట్టగల స్ధితిలో ఉంటారు.
[ఉదాహరణకి ముడి సరుకులను అరువు కింద మార్కెట్ రేట్ల కంటే ఎక్కువకు అంటగడతారు. ఇలాంటి సందర్భాల్లో రైతులు తమకు అవసరమైన సరుకులను స్వేచ్ఛగా కొనుగోలు చేయలేరు. తరచుగా అరువు వ్యాపారి ఇచ్చే సరుకునే కొనాల్సి వస్తుంది. వినాశకర పురుగుమందులు అని తమ అనుభవంలో తెలిసి వచ్చినప్పటికీ మళ్ళీ మళ్ళీ రైతులు వాటినే కొనడానికి కారణం ఇదే.
పంటను అమ్ముకునేటప్పుడు కూడా రైతులు స్వేచ్ఛగా వ్యవహరించలేరు. ఋణదాతలే వారి ఉత్పత్తులను మార్కెట్ కంటే తక్కువ రేట్లకు కొనుగోలు చేస్తారు. ఆ విధంగా రైతులపై ముందే షరతులు విధిస్తారు.
పోనీ రుణాల వడ్డీ రేట్లన్నా వారు చెప్పిన మొత్తం వరకే వసూలు చేస్తారా అంటే అదీ లేదు. వివిధ మోసపూరిత పద్ధతుల ద్వారా చెప్పిన రేటు కంటే ఎక్కువ వడ్డీ రాబడతారు. ఆ చెప్పిన రేటు బ్యాంకులు లాంటి ఫార్మల్ సెక్టార్ రుణాల రేట్ల కంటే చాలా అధికంగా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు.
రైతుల ఆత్మహత్యలకు తక్షణ, ప్రధాన కారణం వీరే అయినప్పటికీ వడ్డీ షావుకార్ల దోపిడీ కార్యకలాపాలను పత్రికలు గుర్తించవు, ప్రశ్నించవు, వెలుగులోకి తేవు.
రుణాల వసూలుకు వడ్డీ దోపిడీదారులు తీవ్ర ఒత్తిడి తెస్తారు. నలుగురిలో అవమానం చేస్తారు. ఇంటి సామానులు లాక్కుంటారు. కిడ్నాప్ లు చేస్తారు. గూండాలతో భౌతిక దాడులు చేయిస్తారు. పొలాలు సైతం జప్తు చేస్తారు. (తమిళనాడులో ఇటీవల -ఏప్రిల్ 2016- ప్రభుత్వ బ్యాంకు ఒకటి ట్రాక్టర్ ని జప్తు చేశారని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.) గ్రామ, జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో పెత్తనం చేసేవారే భూస్వాములుగా వ్యవసాయ మిగులును నియంత్రిస్తున్నారు. దానితో రైతులకు ఆత్మహత్య తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు.
మహారాష్ట్ర, విదర్భలో కాంగ్రెస్ ఎంఎల్‌ఏ దిలీప్ సదానంద్ ఇవన్నీ ఒక చోట చేరిన మంచి ఉదాహరణ. ఆయన సోదరుల్లో ఒకరు ఖామ్ గావ్ నగర పరిషత్ పార్టీ నేత. మరొకరు ఖామ్ గావ్ జనతా కమర్షియల్ బ్యాంక్ ఛైర్మన్. అక్రమ వడ్డీ వ్యాపారం, భూముల బలవంతపు ఆక్రమణ, కిడ్నాపింగ్, భౌతిక దాడులు, చిత్రహింసలు… అన్నింటికీ ఈ కుటుంబం పేరు గడించింది. గత 40 యేళ్లలో రైతులు వారిపై అనేక కేసులు పెట్టారు. రైతులు చేసిన మొత్తం-వడ్డీ లకు రెట్టింపు చెల్లించినా వాళ్ళు పొలం పత్రాలు ఇవ్వరు. భూముల్ని బలవంతంగా స్వాధీనం చేసుకుంటారు.
జిల్లా కలెక్టర్ ఛైర్మన్ గా ఏర్పాటయిన అక్రమ వడ్డీ నిరోధక కమిషన్ మే 2006లో ఓ రైతు ఫిర్యాదు (భూమి అక్రమ స్వాధీనం) మేరకు దిలీప్ తండ్రిపైన ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాడు. ఆ ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలని నమోదు చేసిన కొన్ని గంటల్లోనే ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఒత్తిడి రావడంతో అది రద్దైపోయింది. ఆ తర్వాత కూడా వాళ్ళు కిడ్నాప్, హత్యలను కొనసాగించారు. వెలుగులోకి రాణి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో. Aspects of Indian Economy 44-46 నుండి -అను]
మైక్రో ఫైనాన్స్ ఇనిస్టిట్యూట్స్ (MFI): ఇవి దేశంలో విరివిగా వెలిశాయి. వడ్డీ వ్యాపారుల కార్యకలాపాలకు వీటికీ తేడా లేదు. ఇవి చాలా రొటీన్ గా 24 నుండి 36 శాతం వరకూ వడ్డీలు వసూలు చేస్తున్నాయి. ఈ రేటు రైతు ఉత్పాదకత వృద్ధి చెందడానికి ఏ విధంగానూ ఉపయోగపడదు.
[మైక్రో ఫైనాన్స్ కంపెనీలు కూడా వడ్డీ వ్యాపారులకు మల్లేనే వేధింపులు, బెదిరింపులు, బహిరంగ అవమానాలకు పాల్పడుతున్నాయి. ఇలాంటి అర్ధ భూస్వామ్య దోపిడీ వల్ల ఒక దశలో ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో 200 మంది వరకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవడంతో అడ్డదిడ్డమైన ఉధృతి తగ్గింది గానీ మారు రూపాల్లో కొనసాగుతూనే ఉంది. Aspects of Indian Economy 44-46 నుండి -అను]
ఈ విధమైన ఒత్తిడులతో రైతులు తమ ప్రైవేటు అప్పులు తీర్చడానికి త్వరపడుతుంటారు. ఒక అధికారిక అధ్యయనం (ఇంటర్ మినిస్టీరియల్ టాస్క్ ఫోర్స్ ఆన్ అగ్రికల్చర్) ప్రకారం దాదాపు చిన్న తరహా రైతుల ఉత్పత్తుల (పంట దిగుబడుల) అమ్మకాలన్నీ గత్యంతరం లేని పరిస్ధితుల్లో సాగిస్తున్నవే కావడంతో మార్కెట్ ధరల కంటే 10 నుండి 15 శాతం వరకు తక్కువకు అమ్ముకుంటున్నారు.
వ్యవసాయ ధరలు & ఖర్చులపై కమిషన్ (Commission on Agricultural Cost & Price) ఒక నివేదికను వెలువరిస్తూ అనేక వ్యవసాయ మార్కెట్ లలో రికార్డ్ అయిన ధరలు, ప్రభుత్వాలు ప్రకటించిన కనీస గిట్టుబాటు ధరల (ఎంఎస్‌పి -మినిమమ్ సపోర్ట్ ప్రైస్) కంటే ఎంత తక్కువగా ఉన్నాయో చూపింది. కనుక రైతులకు వారి ఋణ దాతలు చెల్లించే ధర ఏ మాత్రం ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.
ఈ విషయంలో రాష్ట్రానికీ రాష్ట్రానికీ మధ్యా, ప్రాంతానికీ ప్రాంతానికీ మధ్యా తేడాలు ఉన్నాయి. స్ధూలంగా చెప్పాలంటే:
(a) వ్యవసాయం తక్కువ స్ధాయిలో వాణిజ్యీకరణ చెందిన ప్రాంతాల్లో భూమిపై వ్యవసాయ కౌలు & వినియోగ ఖర్చులకు ఇచ్చే అప్పులపై రుణాలు, ప్రత్యక్ష ఉత్పత్తిదారుల నుండి మిగులు గుంజుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
(b) అధిక స్ధాయిలో వానిజ్యీకరణ జరిగిన ప్రాంతాల్లో ముడి సరుకులు మరియు ఉత్పత్తుల వాణిజ్యంతో బంధించబడిన వడ్డీ దోపిడీ, మిగులు గుంజుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
ఈ రెండు స్ధాయిలు కాకుండా వివిధ మధ్య స్ధాయిలు ఉండవచ్చు. లేదా వివిధ పద్ధతుల కాంబినేషన్ ను ప్రయోగించడం అమలులో ఉండవచ్చు. ఏ పద్ధతిలోనైనా పరాన్నభుక్త వర్గాలు ప్రత్యక్ష వ్యవసాయ ఉత్పత్తిదారుల నుండి మిగులు గుంజుకోవడానికే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ ఉత్పాదక శక్తులను విస్తరించడంలో వారికి ఎలాంటి ప్రయోజనమూ లేదు.
(…………………సశేషం)