వ్యవసాయంలో పెట్టుబడిదారీ విధానం: కమతాలవారీ అసమానతలు -11


Indian agri holdings

(10వ భాగం తరువాత………)

భారత వ్యవసాయ రంగంలో మార్పులపై ఒక నోట్ – పార్ట్ 11

ఉత్పత్తి మరియు ఉత్పాదక శక్తులలో ప్రాంతాలవారీ మరియు కమతాల వారీ అసమానతలు

ప్రాంతీయ అసమానతలు ఇతర అంశాలతో సమానంగా పరిగణించాలి. 1960ల మధ్య నుండి పంజాబ్, హర్యానా ఉత్తర ప్రదేశ్ లు స్ధిరంగా అధిక వృద్ధి రేటును నమోదు చేశాయి. మరోవైపు తూర్పు ప్రాంతాలైన ఒరిస్సా, బీహార్, పశ్చిమ బెంగాల్ లు నిరాశానకంగా ఉత్పత్తి సాధించాయి. ఇటీవల కాలంలో దక్షిణాది రాష్ట్రాల, ఆంధ్ర ప్రదేశ్ మినహా, పరిస్ధితి కూడా సంతృప్తికరంగా లేదు. మధ్య భారత ప్రాంతం ఉత్పత్తి వృద్ధిలో అత్యధిక స్ధాయిలో నిలకడలేనితనాన్ని ప్రదర్శించింది.

జిల్లాలవారీ విశ్లేషణ దిగ్భ్రాంతికరమైన ఫలితాలను ఇస్తాయి. ఉదాహరణకి 1962-65 నుండి 1980-83 కాలంలో ఉత్పత్తి పెరుగుదలలోని 60 శాతం కేవలం 56 జిల్లాల (మొత్తం సాగు భూమిలో పాతిక శాతం మాత్రమే ఇక్కడ ఉన్నది) నుండే సమకూరింది. మరో చివర చూస్తే మొత్తం సాగు భూమిలో సగం భాగం కలిగి ఉన్న 151 జిల్లాల నుండి ఉత్పత్తి పెరుగుదలలో 20 శాతం మాత్రమే సమకూరింది. 7 శాతం సాగు భూమి కలిగి ఉన్న 25 జిల్లాలు మొత్తం వృద్ధికి ప్రతికూల (నెగిటివ్) వృద్ధిని జత చేశాయి. అత్యధిక ఉత్పాదకత కలిగిన జిల్లాలు ప్రధానంగా పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ లలో కేంద్రీకృతమై ఉన్నాయి. కొద్ది సంఖ్యలో ఇలాంటి జిల్లాలు గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ లలో ఉన్నాయి. (The Nature of Agriculture Development in India –Prof G S Bhalla)

అఖిల భారత స్ధాయిలో 100 రైతు కుటుంబాల ఆధీనంలోని సగటు వ్యవసాయక ఉత్పాదక ఆస్తుల సంఖ్య
పశు సంపద -ఆవులు, ఎద్దులు, దూడలు
బర్రెలు

గొర్రెలు, మేకలు (పందులు, కుందేళ్ళతో కలిపి)

కోళ్ళు, బాతులు

చిన్న తరహా ఉత్పత్తి సాధనాలు (కొడవలి, గొడ్డలి, చాఫ్ కటర్, చాపర్, చెలక పార)

ట్రాక్టర్లు

129

68

83

107

633

3

Source: NSS Report No. 496

10 హెక్టార్లు (25 ఎకరాలు), అంతకు పైబడి విస్తీర్ణం గల కమతాలు గల ప్రతి 100 ఉన్నత కుటుంబాలు 38 ట్రాక్టర్లు కలిగి ఉన్నారు. 4 హె (దాదాపు 10 ఎకరాలు) నుండి 10 హె వరకు విస్తీర్ణం గల మధ్య తరహా కమతాల కుటుంబాలు ప్రతి వందకు 18 ట్రాక్టర్లు కలిగి ఉన్నాయి.  0.4 హె (1 ఎకరం) నుండి 1 హెక్టార్ (2.47 ఎ) వరకు విస్తీర్ణం గల కమతాల చిన్న రైతు కుటుంబాలు ప్రతి 100 కు ఒక ట్రాక్టర్ మాత్రమే కలిగి ఉన్నారు.

నీటిపారుదల విస్తీర్ణం, ఎరువుల (NPK) వినియోగం, మరియు విద్యుత్ వినియోగం లలో పెరుగుదల

Growth in irr area etc

(Source: Ailing Agricultural Productivity in Economically Fragile Region of India: An Analysis of Synergy Between Public Investment & Farmers Capacity -Ranjit Kumar Indian Institute of Soil Sciences, June 2010)

భారత దేశ గ్రామాల్లో 63 శాతం కుటుంబాలకు భూమి ప్రధాన ఆస్తిగా ఉన్నది. ఇళ్ళు ఎక్కడో దూరాన 24 శాతంతో రెండో స్ధానంలో ఉండగా పశువులు, పౌల్ట్రీ, వ్యవసాయ యంత్రాలు ఆస్తులుగా చాలా తక్కువగా ఉన్నాయి. వీటి స్ధానం గత కొన్ని దశాబ్దాలుగా తగ్గిపోతున్నది.

వ్యవసాయం ద్వారా సంపాదన

వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఎన్‌ఎస్‌ఎస్ నిర్వహించిన రైతుల పరిస్ధితి మదింపు సర్వే (Situation Assessment Survey of Farmers -SASF)  నివేదికలో కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.

(1) వినియోగ ఖర్చులకు సరిపోని సంపాదన

సగటు రైతు కుటుంబానికి వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం ఆ కుటుంబం మొత్తం వినియోగ ఖర్చులలో 35 శాతం మాత్రమే సరిపోతున్నది.

వ్యవసాయంపై పెట్టే ఖర్చులు,  వ్యవసాయ సాధనాల అరుగుదల లను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ ఆదాయం మరింత తగ్గిపోతుంది.

వినియోగ ఖర్చు ఎక్కువా అంటే అదీ కాదు. సగటు కుటుంబం వినియోగ ఖర్చు నెలకు రు 503/- మాత్రమే అనగా రోజుకు రు 17/- లు.

(2) అఖిల భారత స్ధాయిలో

2 హెక్టార్లు, అంతకు తక్కువ విస్తీర్ణం కమతాలు కలిగిన రైతు కుటుంబాలన్నీ (సర్వే చేసిన రైతు కుటుంబాలలో 88 శాతం) లోటు ఆదాయం పొందుతున్నాయి.

2 నుండి 4 హెక్టార్ల (5 – 10 ఎకరాలు) విస్తీర్ణం కమతాల రైతు కుటుంబాల ఆదాయం ఆ కుటుంబాల ఖర్చులకు సరిపోతుంది.

4 హెక్టార్లకు పైబడిన విస్తీర్ణం కమతాల కుటుంబాల ఆదాయం వారి ఖర్చులు పోను మిగులు సాధ్య పడుతోంది.

ఉత్పత్తి సాధనాలు – జీవన సాధనాలు – మిగులు

(I) సామాన్య రైతు కుటుంబాల ఉత్పత్తిని మూడు భాగాలుగా -ఉత్పత్తి సాధనాలు, జీవన సాధనాలు, మిగులు- విభజిస్తే వారి జీవన స్ధితిగతులపై హేతుబద్ధమైన అవగాహనకు రాగలం.

రైతులు ఉత్పత్తి సాధనాలపై క్రమం తప్పకుండా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, నీటి పారుదల, విద్యుత్.. ఇవన్నీ ఉత్పత్తి సాధనాలే. వీటితో పాటు పని ముట్ల అరుగుదలకు కొంత వెచ్చించాలి. పని ముట్లు అరిగిపోయే కొలది వాటిని బాగు చేయడానికి, పాడయ్యాక కొత్తవి కొనడానికి ఆదాయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఇవి లేకుండా రైతుల ఉత్పాదక శక్తి ఉత్పత్తికి వీలుగా తయారు కాదు.

పరిశ్రమల్లోనైతే వేతనాలు కార్మికులకు జీవన సాధనాలు. వ్యవసాయంలో వినియోగ ఖర్చులే అనగా వ్యవసాయ ఆదాయమే జీవన సాధనం. ఇది లేకుండా చిన్న, సన్నకారు రైతులు గానీ, కూలీలు గానీ పునరుత్పత్తి చేయగల స్ధితిలో ఉండలేరు.

ఈ రెండింటి ఖర్చు వ్యవసాయ ఉత్పత్తుల నుండే రైతులు, కూలీలు పొందాలి. అలా అయితేనే వారు పునరుత్పత్తి చేయగలరు. ఈ రెండింటిని కలిపి సాధారణ ఉత్పత్తి (simple production) అంటారు. ఉత్పత్తి ఆదాయం అరిగిపోయిన ఉత్పత్తి సాధనాలకు, జీవన సాధనాలకు సరిపోవడం సాధారణ ఉత్పత్తి.

ఉత్పత్తి విలువ నుండి సాధారణ ఉత్పత్తి విలువను తీసివేయగా వచ్చేది మిగులు. ఈ మిగులు నుండే కౌలు చెల్లించాలి. ఈ మిగులు నుండే అప్పులు, అప్పులపై వడ్డీలు తీర్చాలి. ప్రత్యక్ష ఉత్పత్తిదారుల లేదా వ్యాపారుల లాభాలు ఈ మిగులులోనే కలిసి ఉంటాయి.

[వ్యవసాయ ఆదాయంలో మిగులు వినియోగ ఖర్చులకు వెళ్లవచ్చు లేదా ఉత్పత్తిని మరింత విస్తరించేందుకు వినియోగ పెట్టవచ్చు. ఉత్పత్తి విస్తరణకు వెళితే అది పెట్టుబడిగా మారడం అవుతుంది.

పరిశ్రమల విషయంలోనైతే కార్మికుడు ఉత్పత్తి సాధనాలతో వేరు చేయబడి ఉంటాడు. అతనికి/ఆమెకు వేతనాలు మాత్రమే లభిస్తాయి. మిగులులో అతనికి భాగం ఇవ్వరు.

భారత వ్యవసాయంలో భూస్వాములు మాత్రమే కాక భూములు కలిగిఉన్న రైతుల లోని వివిధ వర్గాలకు కూడా వ్యవసాయ మిగులు సొంతం చేసుకునే అవకాశం ఉన్నది. కనుక రైతుల లోని ఒక సెక్షన్ మిగులులోని కొంత భాగాన్ని వ్యవసాయ ఉత్పత్తి విస్తరణకు వెచ్చించవచ్చు. 

ఫ్యూడల్ యూరప్ లో మిగులులో సాధ్యమైనంత ఎక్కువ భాగాన్ని తమ కుటుంబాల కోసం సొంతం చేసుకునేందుకు రైతులు అనేక పోరాటాలు చేశారు. ఈ క్రమంలో వారిలో కొద్దిమంది చిన్న తరహా ఉత్పత్తిలోనే కొంత ఉత్పత్తిని పోగు చేయగలిగారు. తద్వారా సాపేక్షికంగా ధనిక రైతులుగా అవతరించారు. వారే వ్యవసాయ పెట్టుబడిదారీ విధానంలో మూలాంశాలు అయ్యారు.

పెట్టుబడి పోగుబడే కొద్దీ భూస్వామి అయినా రైతు అయినా మరింత భూమిని సాగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తాడు. మరింతమంది కూలీలను వినియోగిస్తాడు. లేదా ఉన్న భూమిలోనే ఉత్పాదకత పెంచేందుకు మెరుగైన ఉత్పత్తి సాధానాలను వినియోగిస్తాడు. ఎలా చేసినా మరింత పెట్టుబడి పోగుబడుతుంది.

అనంతరం మళ్ళీ ఆ పెట్టుబడిని వినియోగించి మరింత భూమిని మరింతమంది కూలీలలను వినియోగించడమో లేదా ఉత్పాదకతను మరింత పెంచుకోవడమో చేస్తాడు. తద్వారా మరింత మిగులుకు కృషి చేస్తాడు. ఈ విధంగా పునరుత్పత్తి విస్తరణ వలయం (cycle of expanded reproduction) సాధ్యపడుతుంది. –అను]

(II) SASF గణాంకాల ప్రకారం అఖిల భారత స్ధాయిలో 0.01 హెక్టార్ల (2.5 సెంట్లు) కమతం కలిగిన రైతుల వినియోగ ఖర్చు (జీవన సాధనం) ఒక కుటుంబానికి ఒక నెలకు రు 2,297 ఉన్నట్లు తేలింది. వారికి నిజానికి వ్యవసాయ ఆదాయం ఉండదు. ప్రధానంగా కూలీ ద్వారానే జీవనం పొందుతారు.

కనుక ఒక రైతు కుటుంబం తన మిగులు నుండి పెట్టే కనీస వినియోగ ఖర్చు రు 2,297/- కి ఎక్కువగా ఉంటుంది. 

అఖిల భారత స్ధాయిలో 2 నుండి 4 హెక్టార్ల కమతాల రైతులు నికరంగా నెలకు 2,685/- రాబడి పొందుతున్నారు. కనుక ఆ లోపు కమతాల కుటుంబాలన్నీ నెలకు రు 2.685/- లేదా ఆ లోపు రాబడి పొందుతున్నట్లు గ్రహించవచ్చు.

SASF నిర్వచనం ప్రకారం 2-4 హె, అంతకు లోపు కమతాల రైతు కుటుంబాలు మొత్తం రైతు కుటుంబాలలో 86 శాతం ఉన్నారు. SASF సర్వే ఉత్పత్తి సాధానాల అరుగుదల, రుణాలపై వడ్డీ చెల్లింపులను పరిగణనలోకి తీసుకోలేదు. అవి కూడా పరిగణిస్తే నికర రాబడి నెలకు రు 2,685 కంటే తక్కువే ఉంటుంది. ఫలితంగా నికర రాబడి, జీవన సాధన మొత్తం ల మధ్య ఉండగల తేడా హరించుకుపోతుంది. దరిమిలా 2-4 కమతాల రైతులకు కూడా మిగులు అనేది ఉండడం లేదు. కొందరి రాబడి ఈ స్ధాయికి ఎక్కువా, మరి కొందరికి తక్కువా ఉండవచ్చు. కానీ అఖిలభారత స్ధాయిలో సగటు పరిస్ధితి ఇలాగే ఉన్నది.

వర్షపాతం లేకనో ఇతర కారణాల వల్లనో పంటలు పండని సందర్భాలు ఉంటాయి. అసలు రు 2,685/- స్ధాయినే అలాంటి కరువు సాగు రాబడిగా తీసుకున్నా పై పరిస్ధితిలో మార్పు ఉండబోదు.

తగిన వర్షపాతం, మంచి పంటలు పండిన యేడు దీనికంటే 20 శాతం అధిక రాబడి ఉందనుకుందాం. అనగా సాధారణ సాగు రాబడి రు 3,222/-. 2 హెక్టార్లకు తక్కువ కమతాల రైతుల రాబడి ఎలాగూ వారి జీవనోపాధికి సరిపోదు. ఇప్పుడు 2-4 హెక్టార్ల కమతాల రైతుల వద్ద కాస్త మిగులు ఉన్నట్లు. కానీ ఈ కాస్త మిగులు తిరిగి వ్యవసాయంలో పెట్టుబడికి సరిపోదు. మహా అయితే కాస్త అధిక మొత్తాన్ని వినియోగ ఖర్చుల కింద రైతు కుటుంబం చేర్చగలదు తప్పితే తిరిగి వ్యవసాయ పెట్టుబడిగా వినియోగించలేదు. అంత చిన్న మొత్తం పునరుత్పత్తి పెట్టుబడిగా పనికిరాదు.

వాస్తవానికి ఒక సగటు భారత దేశ కుటుంబం జీవనోపాధికి సరిపడగల మొత్తం నెలకు రు 3,685/- అని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 2-4 హె కమతాల రైతు కుటుంబం సాధారణ రాబడి (రు 3,222/-) దీని కంటే తక్కువే!

పంటకు ముందు ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, పంట తర్వాత దళారీ వ్యాపారులతోనూ నిండి ఉన్న భారత వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్ధ గుప్పిట గిజగిజలాడుతున్న రైతు కుటుంబాలు వ్యవసాయ మిగులు చవి చూడడం అసాధ్యంగా మారింది.

(III) భారత వ్యవసాయ భూముల విస్తీర్ణంలో 1/3 వంతుపై ఆధారపడి బతుకుతున్న రైతులు తమ కుటుంబాల జీవికకు అవసరమైన మొత్తంలో (అనగా కనీస వినియోగ ఖర్చులకు అవసరమైన మొత్తంలో) కొంత భాగాన్ని మాత్రమే వ్యవసాయం నుండి పొందుతున్నారు.

(IV) మరొక 1/4 వంతు వ్యవసాయ భూమిపై ఆధారపడ్డ రైతులు వినియోగ ఖర్చుల మొత్తానికి సమీపంలో రాబడిని పొందుతున్నారు.

(i) ఇది ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయాన్ని లెక్కలోకి తీసుకున్నప్పుడు మాత్రమే.

(ii) మొత్తం మీద రైతుల్లో అత్యధికులు ఇతర ఆదాయ వనరులను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ కూడా తమ కనీస వినియోగ ఖర్చులకు సరిపడా సంపాదించలేకపోతున్నారు.

కాబట్టి పెట్టుబడిగా పోగేయడానికి రైతుల చేతుల్లో మిగులు అన్నదే సమకూరడం లేదు. దరిమిలా ‘విస్తరించబడిన పునరుత్పత్తి వలయం’ లోకి ప్రవేశించే అవకాశమే వారికి లేదు.

(……………సశేషం)

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s