రష్యా ఎత్తులను పసిగట్టలేకపోతున్నాం -అమెరికా


US Confetti corporation

ప్రపంచం లోని వివిధ యుద్ధ క్షేత్రాలలో అమెరికా మద్దతు ఉన్న పక్షాలు వరుస ఓటములు ఎదుర్కొంటున్న నేపధ్యంలో అమెరికా మిలట్రీ అధికారులు నిస్పృహకు లోనవుతున్నారని వారి ప్రకటనలు సూచిస్తున్నాయి. రష్యాయే ఇప్పుడు తమకు ప్రధాన శత్రువు అని ప్రకటించెంతవరకూ వారు వెళ్తున్నారు.

“సెప్టెంబర్ 11, 2001 తర్వాత అమెరికా గూఢచార విభాగం ఎదుర్కొంటున్న అత్యంత పెద్ద వైఫల్యం మాస్కో ఎత్తులను ముందుగా పసిగట్టలేకపోవడం. ఈ వైఫల్యం ఫలితంగా క్రిమియాపై రష్యా దాడిని ముందుగా పసిగట్టలేకపోయాము. సిరియాలో రష్యా మిలటరీ బలగాల ప్రవేశాన్ని కూడా ముందుగా ఊహించలేకపోయాము” అని అమెరికా సెనేట్ ఇంటలిజెన్స్ కమిటీ అధిపతి డెవిన్ నూనెజ్ సి‌ఎన్‌ఎన్ వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు.

సెప్టెంబర్ 11, 2001 నాటి టెర్రరిస్టు దాడిని అమెరికా గూఢచారులు ముందుగా పసిగట్టలేదని డెవిన్ చెబుతున్నాడు. ఇది వాస్తవ విరుద్ధమని ‘గ్లోబల్ రీసర్చ్’ లాంటి అనేక పరిశోధనా సంస్ధలు, స్వతంత్ర విలేఖరులు సోదాహరణంగా, ససాక్షారంగా వెల్లడి చేశారు.

అలాగే క్రిమియాపైన రష్యా దాడి చేసిందని చెప్పడం కూడా వాస్తవ విరుద్ధం. నిజానికి క్రిమియాను కలుపుకోవడం ద్వారా అమెరికా దుందుడుకు యుద్ధోన్మాదం తమ సరిహద్దులకు చేరకుండా రష్యా నిరోధించగలిగింది. తద్వారా మూడో ప్రపంచ యుద్ధం ముందుకు జరగకుండా అడ్డుకున్నది.

పైగా క్రిమియా ఒకప్పుడు రష్యాలో అంతర్భాగం. సోవియట్ రష్యాలో భాగంగా ఉన్న ఉక్రెయిన్ కు అప్పటి రష్యా అధ్యక్షుడు కృశ్చెవ్ నేతృత్వం లోని సోవియట్ ప్రభుత్వం క్రిమియాను ఉక్రెయిన్ లో భాగం చేసింది. అంతే తప్ప క్రిమియాపై దాడి చేసి ఆక్రమించిందన్న పశ్చిమ ప్రచారం సొంత ప్రయోజనాలకు మాత్రమే ఉద్దేశించినది.

అమెరికాకు చెందిన అనేకమంది ప్రభుత్వాధికారులు, మిలట్రీ జనరల్స్ ప్రస్తుతం రష్యా ఫోబియాతో సతమతం అవుతున్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే వారి జబ్బు పుటినోఫోబియా. పుటిన్, అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్య ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోగలడని వారు ఎన్నడూ ఊహించలేదు.

అడ్డు వచ్చిన దానినల్లా నాశనం చేస్తూ వెళ్తున్న అమెరికా ఆంబోతును పెద్దగా శ్రమ పడకుండా, పెద్దగా ఖర్చు కూడా పెట్టకుండా సిరియా, ఉక్రెయిన్ లలో ఎదురోడ్డి నిలువరించడమే అమెరికా దృష్టిలో పుటిన్ చేసిన, చేస్తున్న తప్పు. చివరికి మిలట్రీ బలగాల డైరెక్టర్ కూడా “రష్యా మాకు ప్రధాన శత్రువు (threat)” అని చెప్పడం బట్టి పుటినోఫోబియా తీవ్రత ఏ స్ధాయిలో ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.

“కాంగ్రెస్ దృష్టిలో మాస్కో ప్రవర్తనను ముందుగా అంచనా వేయడంలో వైట్ హౌస్ తీవ్రంగా విఫలం అయింది” అని డెవిన్ నూనెజ్ సి‌ఎన్‌ఎన్ ఇంటర్వ్యూలో చెప్పాడు. “రష్యా పధకాలు, ఉద్దేశాలను ముందుగా పసిగట్టడంలో విఫలం కావడమే సెప్టెంబర్ 11, 2001 అనంతరం అమెరికా గూఢచార సంస్ధల అతి పెద్ద వైఫల్యం” అని నూనెజ్ వ్యాఖ్యానించాడు.

“జార్జియాపై రష్యా దాడి చేశాక వాషింగ్టన్ ప్రధానంగా రాయబార దౌత్యంపై నమ్మకం పెట్టుకుంది. కానీ క్రిమియా సంఘటన తర్వాత ఐనా వాళ్ళు ఎర్ర గీత గీయవలసి ఉండింది. వెంటనే నాటోలో అమెరికా మిత్రులను బలీయం చేసుకోవలసి ఉండాల్సింది” అని నూనెజ్ చెప్పాడు.

నూనెజ్ చెబుతున్న జార్జియా దాడి 2008 నాటిది. 1991లో సోవియట్ రష్యా నుండి విడివడి జార్జియా స్వతంత్రం ప్రకటించుకున్నాక సౌత్ ఒస్సెటియా, అబ్ఖాజియా జాతి ప్రాంతాలు జార్జియా నుండి స్వతంత్రం కోసం పోరాడాయి. వారి పోరాటానికి రష్యా మద్దతు ఇచ్చింది.

అప్పటి నుండి ఈ రెండు ప్రాంతాలు జార్జియా కింద నామమాత్రంగా ఉంటూనే స్వతంత్ర రాజ్యాలుగా ఉనికిలో ఉన్నాయి. ఈ పరిస్ధితి ఇష్టం లేని జార్జియా 2008లో సౌత్ ఒస్సెటియా, అబ్ఖాజియా ప్రాంతాలపై పూర్తి స్ధాయి దాడికి తెగబడింది. జార్జియా సైన్యాలు రెండు ప్రాంతాలను ఆక్రమించుకున్నాయి.

సోవియట్ రష్యా రాజ్యాంగంలో లెనిన్ ప్రవేశపెట్టిన జాతుల స్వయం నిర్ణయాధికార హక్కు ప్రకారం రష్యా నుండి విడివడిన జార్జియా అదే హక్కు ఒస్సెటియా, అబ్ఖాజియా జాతులకు నిరాకరించింది. అంతే కాకుండా అమెరికా, ఐరోపాల ప్రభావంలో ఉన్న జార్జియా వల్ల పశ్చిమ రాజ్యాల ప్రమాదాన్ని పొరుగునే ఎదుర్కోవలసిన పరిస్ధితికి రష్యా నెట్టబడింది.

ఈ నేపధ్యంలో ఒస్సెటియా, అబ్ఖాజియాల ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు రష్యా, జార్జియాపై యుద్ధం ప్రకటించింది. నాలుగు రోజుల పాటు సాగిన తీవ్ర యుద్ధం అనంతరం జార్జియా సైన్యాలు ఓటమి చెంది వెనుదిరిగాయి. ఫ్రాన్స్ మధ్యవర్తిత్వంలో రష్యా-జార్జియాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆ విధంగా యుద్ధం ముగిసింది. సౌత్ ఒస్సెటియా, అబ్ఖాజియాలో స్వతంత్ర రిపబ్లిక్కులుగా అవతరించాయి.

సౌత్ ఒస్సెటియా, అబ్ఖాజియాలు స్వతంత్ర రాజ్యాలుగా మారడం తమ వైఫల్యంగా అమెరికా ఇప్పుడు చెబుతోంది. అమెరికా లక్ష్యం తన నేతృత్వం లోని మిలట్రీ గూండా సంస్ధ అయిన నాటోను రష్యా సరిహద్దుల వరకు విస్తరించడం. తద్వారా రష్యా, చైనాలను సైనికంగా చుట్టుముట్టడం. ఈ సామ్రాజ్యవాద ఆధిపత్య లక్ష్యానికి ఏ విధంగా ఎదురు దెబ్బ తగిలినా అది వైఫల్యంగా, ప్రపంచ శాంతికి భంగంగా అమెరికా భావిస్తుంది.

[క్రింది ఇమేజ్ లు తప్పక చూడండి. క్లిక్ చేస్తే పెద్ద సైజులో చూడవచ్చు. ఇమేజ్ ల ద్వారా వ్యాసం లోని అంశాలు మరింత స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు.]

జార్జియా, ఒస్సెటియా, అబ్ఖాజియాలు మధ్య ప్రాచ్యం ప్రాంతానికి సమీపంలో ఉన్నాయి. భౌగోళిక రాజకీయ దృష్టిలో చూస్తే ఇది కీలకమైన ప్రాంతం. క్రిమియా, సౌత్ ఒస్సెటియా, అబ్ఖాజియాలు అమెరికా తదితర పశ్చిమ రాజ్యాల ఏలుబడిలోకి వచ్చినట్లయితే రష్యాకు అమెరికా నుండి పెను ముప్పు తప్పదు.

ఆధిపత్యం కోసం తహతహ లాడే అమెరికా రష్యాలో సైతం తమ కీలు బొమ్మ ప్రభుత్వం నిలపడానికి తద్వారా తమకు ఎదురు లేకుండా చేసుకోవడానికి 1990ల నుండే ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. పుతిన్ కు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో నిరసనలను ప్రోత్సహిస్తూ, ఫైనాన్స్ చేస్తూ పుతిన్ ను కూలదోయడానికి పన్నాగాలు పన్నింది. కానీ రష్యన్ ప్రజల మద్దతు వల్ల పుతిన్ వ్యతిరేక ఎత్తులు విఫలం అయ్యాయి.

తూర్పు యూరప్ రాజ్యాలను నాటో సభ్య దేశాలుగా మార్చబోమని అమెరికా, రష్యాకు గతంలో వాగ్దానం చేసింది. కానీ దానిని అమెరికా అడ్డంగా ఉల్లంఘించింది. అతి చిన్న రాజ్యాలైన బాల్టిక్ రిపబ్లిక్కులు -లాట్వియా, లిధువేనియా, ఎస్టొనియా- లను కూడా నాటో లోనూ, ఈ‌యూ లోనూ చేర్చుకుని రష్యా ముంగిట ప్రమాదాన్ని నిలిపింది. కనుక స్వయం రక్షణ కోసం చివరి నిమిషం లోనైనా రష్యా చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. నిజానికి నాటో విస్తరణ ద్వారా ప్రపంచ శాంతికి అమెరికాయే పెను ప్రమాదంగా మారింది. కనుక అమెరికాను నిలువరించడమే ప్రపంచ శాంతికి కృషి చేయడం కాగలదు. 

డెవిన్ నూనెజ్ నిస్పృహను ఈ నేపధ్యంలో అర్ధం చేసుకోవాలి. “ఆ తర్వాత మధ్యధరా సముద్రంలో, సిరియా వద్ద రష్యా కొత్త సైనిక స్ధావరం ఏర్పాటు చేసినప్పుడు కూడా మేము పూర్తిగా ఏమరుపాటులో ఉండిపోయాం. మేము దాన్ని గమనించనే లేదు. గూఢచార సంస్ధల తప్పులు కొనసాగుతూ పోయాయి” అని నూనెజ్ వాపోయాడు.

ఇది కూడా అబద్ధమే. రష్యాకు ఎప్పటి నుండో మధ్యధరా సముద్రంలో సిరియా ఒడ్డున సైనిక స్ధావరం ఉన్నది. రష్యాకు తన సరిహద్దులకు ఆవల ఉన్న ఒకే ఒక్క సైనిక స్ధావరం ఇది. సిరియాలో అమెరికా తరపున వినాశనం సృష్టిస్తున్న ఇసిస్, ఆల్ నూస్రా, ఫ్రీ సిరియన్ ఆర్మీల హింసాత్మక దురాగతాలను చూసినట్లయితే రష్యా సైనిక స్ధావరం ఎంత అవసరమో తెలుస్తుంది.

సిరియా కిరాయి తిరుగుబాటు నేపధ్యంలో మధ్యధరా సముద్రంలో బలాబలాల సమతూకం నెలకొనాలన్నా, అమెరికాను నిలువరించాలన్నా రష్యా సైనిక స్ధావరం తప్పనిసరి అవసరం.

ఈ రోజు ఇసిస్ టెర్రరిస్టులు సిరియాలో వరుస ఓటములు ఎదుర్కొంటూ బలహీన పడుతున్నదంటే దానికి ప్రధాన కారణం రష్యాయే. గత సంవత్సరం అక్టోబర్ నుండి రష్యా వాయు బలగాలు, గూఢచార బలగాలు, పరిమిత సైనిక బలగాలు, ఆయుధ సాయం అందిస్తున్న ఫలితంగా సిరియా సెక్యులర్ పాలకుడు బషర్ అస్సాద్ ఇసిస్ పై పై చేయి సాధించాడు. వరుసగా విజయాలు సాధిస్తున్నాడు. పిలిచారు గదాని రష్యా సైన్యాలు సిరియాలో తిష్ట వేయలేదు. యుద్ధ గమనాన్ని సిరియా ప్రభుత్వం వైపుకు తిప్పిన అనంతరం రష్యా బలగాల ఉపసంహరణను పుతిన్ ప్రకటించాడు.

“ఈ వైఫల్యాల వెనుక ప్రధాన దొషులు వైట్ హౌస్, కాంగ్రెస్, వాషింగ్టన్ మిత్రులే. ఎందుకంటే అనేక యేళ్లుగా పుతిన్ ను వీరు తక్కువ అంచనా వేశారు” అని డెవిన్ నూనెజ్ నిర్ధారించాడు. నూనెజ్ ఉద్దేశ్యం వేరు అయినప్పటికీ పుతిన్ ను తక్కువ అంచనా వేయడం మాత్రం నిజమే. ప్రపంచంలో అశాంతి నెలకొనడం వెనుక ప్రధాన దొషులు వైట్ హౌస్, కాంగ్రెస్, వాషింగ్టన్ మిత్రులు అని చెప్పడం కూడా వాస్తవమే.

2 thoughts on “రష్యా ఎత్తులను పసిగట్టలేకపోతున్నాం -అమెరికా

  1. ఇల అమెరికా అధికారులు తమ వైఫల్యాలను బహిరంగంగా ప్రకటించుకోవడంలో ఉద్దేశాలు ఏమై ఉంటాయి? తమ వ్యూహకర్తలు మేల్కోవాలని బహిరంగంగా ప్రకటించడంలో ఉద్దేశాలు ఏమై ఉంటాయి? ఊరకనే శత్రువును పొగిడే పని పెట్టుకోరుకదా!

  2. its taking time to digest the news analysis, please give in parts such information with the sequence of issues, period wise, along with maps for easy understanding like you are giving in agriculture sector. i didnt study the agricultural sector issues so far. but i will.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s