భారత వ్యవసాయం ప్రస్తుత స్ధితిగతులు -10


Indian agri

భారత వ్యవసాయ రంగంలో మార్పులపై ఒక నోట్ – పార్ట్ 10

(9వ భాగం తరువాత…..)

చాప్టర్ V

భారత వ్యవసాయం ప్రస్తుత స్ధితిగతులు

జనవరి – డిసెంబర్ 2003 నాటి జాతీయ నమూనా సర్వే (నేషనల్ శాంపుల్ సర్వే – ఎన్‌ఎస్‌ఎస్) 59వ రౌండు నివేదిక ఇలా పేర్కొంది, “ఈ నివేదిక సాగు యాజమాన్యం (ఆపరేషనల్ హోల్డింగ్స్ – ఓ‌హెచ్) లోని భూముల మొత్తం విస్తీర్ణం మరియు సగటు విస్తీర్ణం లను పాఠకుల ముందు ఉంచుతుంది. గత 4 దశాబ్దాలలో ఆ భూముల పరిమాణాలు, ఆ పరిమాణాలలో వచ్చిన మార్పులను పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కౌలుదారీ సాగు విస్తృతి, రూపాల గురించి పరిశోధిస్తుంది. భూ వినియోగంపై ఆధారపడి సాగు విస్తీర్ణాన్ని అధ్యయనం చేస్తుంది. అలాగే పండించే పంటల రకాల ఆధారంగా నికర విత్తుబడి ఏరియా పంపిణీని అధ్యయనం చేస్తుంది (NSS Document 2002-03).

ఈ పత్రం కనుగొన్న అంశాలు ఇలా ఉన్నాయి.

(1) సాగు యాజమాన్యంలోని భూముల విస్తీర్ణం: (సొంత పట్టా భూములు, లీజు మరియు ఇతరత్రా స్వాధీనంలో ఉన్న భూములు – అనగా టెక్నో ఎకనమిక్ యూనిట్ యొక్క భౌతిక స్వాధీనంలో ఉన్న భూములు.

[టెక్నో అన్నది చట్టపరమైన సాంకేతికతను సూచిస్తుంది. ఎకనమిక్ అన్నది ఆర్ధిక లబ్ది పొందడాన్ని సూచిస్తుంది. ప్రతి భూమినీ చట్టం నిర్వచిస్తుంది, నిర్వచించాలి కూడా; పట్టా భూమి, ఆక్రమణ భూమి, అసైన్డ్ భూమి, బీడు భూమి, గ్రామ పోరంబోకు, ప్రభుత్వ భూమి, అటవీ భూమి… ఇలా. ఇవన్నీ టెక్నో ఎకనమిక్ యూనిట్ ల పరిధిలోకి రావు. ఆర్ధిక లబ్ది పొందుతూ చట్టం నిర్వచించిన ఏదో ఒక సక్రమ పద్ధతిలో ఒకరి/కొందరి యాజమాన్యంలో ఉన్న భూమిని టెక్నో ఎకనమిక్ యూనిట్ గా చెప్పవచ్చు. ఒక యూనిట్ ని ఒక ఆపరేషనల్ హోల్డింగ్ గా రచయిత పిలిచారు.  దీనిని తెలుగులో సింపుల్ గా కమతం అందాం. టెక్నో ఎకనమిక్ యూనిట్ అన్నా, ఓ‌హెచ్ అన్నా కమతం అన్నా ఒకటే అన్న అవగాహనతో ముందుకు సాగుదం -అను]

సగటులు ఇలా ఉన్నాయి.

1981-82  –>  1.67 హెక్టార్లు (1 హెక్టార్ = 2.47 ఎకరాలు)

1991-92  –>  1.35 హెక్టార్లు

2002-03  –>  1.06 హెక్టార్లు

(2) కమతాల సంఖ్యలో పెరుగుదల:

1960-61  –>  51 మిలియన్లు (5.1 కోట్లు)

2002-03  –>  101 మిలియన్లు (10.1 కోట్లు)

2002-03కు ఒక దశాబ్దం ముందు అంతకు ముందరి 3 దశాబ్దాలతో పోల్చితే కమతాల పెరుగుదల రేటు నెమ్మదించింది.

జనాభా పెరగడం, ఉమ్మడి యాజమాన్యం దాదాపుగా అదృశ్యం కావడం.. ఈ కారణాలు కమతాల పెరుగుదలకు దోహదం చేశాయి. (ఇద్దరు లేదా అంతకు మించి ఎక్కువ మంది ఒకే కమతాన్ని సాగు చేస్తే అది ఉమ్మడి యాజమాన్యం.)

ఉమ్మడి యాజమాన్య కమతాలు

1960-61  –>  మొత్తం కమతాలలో 4 శాతం

1970-71  –>  మొత్తం కమతాలలో 0.6 శాతం

(3) కమతాల పరిమాణాత్మక పంపిణీ (ఆల్ ఇండియా – 2002-03
 
కమతం రకం ఖరీఫ్ రబీ కమతాల సంఖ్య
(మిలియన్లలో)
ఖరీఫ్ అంచనా

సన్నకారు కమతం (1 హె. కు తక్కువ)

69.7 % 70.0 % 70.99

చిన్న కమతం (1 – 2 హె)

16.3 % 15.9 % 16.59

సెమీ మధ్య తరహా (2 – 4 హె)

9.0 % 8.9 % 9.21

మధ్య తరహా (4 – 10 హె)

4.2 % 4.4 % 4.33

పెద్ద కమతం (10 హె. కు ఎక్కువ)

0.8 % 0.8 % 0.81

[పట్టికలో చూపిన సాతాలు మొత్తం కమతాల సంఖ్యలో శాతం.]

సన్నకారు కమతాల సంఖ్య 6 నుండి 7 శాతం వరకు పెరిగింది.

(4) పంజాబ్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాలలో భూమి కేంద్రీకరణ పెరిగింది.

కర్ణాటక, ఛత్తీస్ ఘర్ తో కూడిన మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్ధాన్ రాష్ట్రాలలో స్పష్టమైన ధోరణి అంటూ ఏమీ వ్యక్తం కాలేదు.

“రాష్ట్రాలు ఇప్పటివరకు 2.7 మిలియన్ హెక్టార్లు (67 లక్షల ఎకరాలకు సమానం) మిగులు భూములుగా ప్రకటించాయి. వీటిలో 2.3 మిలియన్ (85 శాతం) హెక్టార్లను స్వాధీనం చేసుకోగా, అందులో 1.9 మిలియన్ హెక్టార్లను 5.5 మిలియన్ కుటుంబాలకు పంపిణీ చేశారు” అని జాతీయ భూ సంస్కరణల కౌన్సిల్ జనవరి 2008లో పేర్కొంది. (జన్ సత్యాగ్రహ 2012 ఉటంకన)

[ఏక్తా పరిషత్ నాయకత్వంలో గ్వాలియర్ నుండి ఢిల్లీ వరకు మార్చ్ చేసే లక్ష్యంతో 2012లో జరిగిన ఉద్యమమే ‘జన్ సత్యాగ్రహ. ర్యాలీ ఆగ్రా చేరుకున్నాక ఏక్తా పరిషద్ నేతలు కేంద్రంతో ఒప్పందం కుదిరిందని చెప్పి మార్చ్ ని అక్కడితో నిలిపివేశారు. ఒప్పందంలో కుదిరిన అంశాలతో 6 నెలల్లో సమగ్ర భూ పంపిణీ చట్టం చేయవలసి ఉండగా అది జరగలేదు. -అను]

LBSNAA (Lal Bahadur Shastri National Academy of Administration – ప్రభుత్వ విధానాలు, పాలనలపై పరిశోధన, శిక్షణల నిమిత్తం ఏర్పాటయిన కేంద్ర ప్రభుత్వ సంస్ధ -అను) వేసిన అంచనా ప్రకారం సీలింగులో పోగా దేశం మొత్తం మీద మిగులు భూములు రమారమి 21 మిలియన్ హెక్టార్లు (5.2 కోట్ల ఎకరాలు) ఉంటాయని అంచనా వేసింది. (జన్ సత్యాగ్రహ)

(5) మొత్తం కౌలు భూముల్లో 47 శాతం పైగా మొదటి 3 కేటగిరీల (పెద్ద, మధ్య, సెమీ మధ్య) ఆధీనంలో ఉన్నాయి. ఇవి మొత్తం కమతాలలో (ఆపరేషనల్ హోల్డింగ్స్) 14 శాతం వాటాను కలిగి ఉన్నాయి. [అనగా 2 హెక్టార్లకు పైగా విస్తీర్ణం కలిగిన కమతాలు, కౌలుసాగు భూమిలో 47 శాతం ఆక్రమించాయి. మిగిలిన 53 శాతం కౌలు సాగు భూములు 2 హెక్టార్ల లోపు విస్తీర్ణం కలిగిన కమతాలు. -అను]

1 హెక్టార్ పైగా పరిమాణం కలిగిన కమతాలు (మొదటి 4 కేటగిరీలు) కౌలు సాగు భూముల్లో 70 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఇవి మొత్తం కమతాలలో 30 శాతం వాటా కలిగి ఉన్నాయి. 1 హెక్టార్ పైన విస్తీర్ణం కలిగిన కమతాలలో 10 శాతం కౌలుసాగులో ఉన్నందున మొత్తం కమతాలలోని 7 శాతం కమతాల యజమానులు 70 శాతం కౌలు భూముల్ని నియంత్రిస్తున్నారు.

(6) 1960-61 నుండి సాగు విస్తీర్ణం తగ్గుతోంది. ఆ యేడు మొత్తం సాగు విస్తీర్ణం 133 మిలియన్ హెక్టార్లు (32.85 కోట్ల ఎకరాలు) ఉండగా అది 1970-71 నాటికి 126 మిలియన్ హెక్టార్లకు (31.12 కోట్ల ఎకరాలు) పడిపోయింది. ఈ తగ్గుదల 5.8 శాతం.

1980-81 నాటికి మరో 5.6 శాతం పడిపోయి 118.6 మిలియన్ హెక్టార్లకు (29.29 కోట్ల ఎకరాలు) పడిపోయింది. 48వ రౌండ్ సర్వే (1991-92) లో సాగు విస్తీర్ణం 125 మిలియన్లకు చేరినట్లు తేలింది. ఈ పెరుగుదల 37వ రౌండ్ పై అనుమానాలు రేపింది.

కానీ ప్రస్తుత రౌండ్ (2003) లో సాగు విస్తీర్ణం 107.65 మిలియన్ హెక్టార్లకు (26.59 కోట్ల ఎకరాలు) పడిపోయినట్లు తేలింది. 42 సంవత్సరాల కాలంలో 18.5 శాతం సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. అనగా రమారమి ఒక్కో దశాబ్దానికి 5 శాతం చొప్పున సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది.

సాగు విస్తీర్ణం:

1960-61  –>  133 మిలియన్ హెక్టార్లు

2002-03  –>  108 మిలియన్ హెక్టార్లు

(7) 1960 సర్వేలో తప్ప మొత్తం 5 రకాల కమతాలలోనూ గత 5 సర్వేలలో (60-61, 70-71, 81-82, 91-92, 02-03) కౌలుదారుల సాగులోని కమతాల సంఖ్య తగ్గుతున్నట్లు నమోదైంది. 1960-61లో కౌలు కమతాలు మొత్తం కమతాలలో 20 శాతం ఉండగా 2002-03లో 10 శాతానికి తగ్గాయి.

అయితే పెద్ద కమతాలు ఇందుకు మినహాయింపు. 1960-61లో పెద్ద కమతాలలో కౌలు కమతాల సంఖ్య 9.5 శాతం ఉండగా 2002-03 నాటికి అది 13.8 శాతానికి పెరిగింది.

కౌలు కమతాల తగ్గుదల వాస్తవమేనా? కాదని పరిశోధకులు వెల్లడించారు. ఎకనమిక్ అండ్ పోలిటికల్ వీక్లీ వారపత్రిక మార్చి 8, 2008 తేదీ సంచికలో ‘Does Land Still Matters?” అనే పత్రంలో డి బందోపాధ్యాయ ఇలా వెల్లడించారు.

“ఎన్‌ఎస్‌ఎస్ పేర్కొన్న ‘6 నుండి 7 శాతం తగ్గుదల’ అన్నది తక్కువ అంచనాగా సాధారణంగా అందరూ అంగీకరిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో కౌలు సాగు చట్ట విరుద్ధం. అందువల్ల సర్వేలలో రైతులు తాము కౌలుకు సాగు చేస్తున్నామన్న నిజాన్ని చెప్పరు. నిజానికి కౌలు సాగు కమతాలు మొత్తం కమతాలలో 15 నుండి 35 శాతం వరకు ఉన్నాయని అనేక సూక్ష్మ అధ్యయనాలు వెల్లడి చేశాయి. ఇవన్నీ చెప్పకుండా దాచిపెట్టిన కౌలు కమతాలు. దాచి పెట్టిన కౌలు కాంట్రాక్టులలో అత్యంత దోపిడీమారి షరతులు, నిబంధనలు అమలవుతున్నాయి.”

కౌలు నిబంధనలు – సాగు విస్తీర్ణం

(8) కౌలు నిబంధనలు: మొత్తం 7 విధాలుగా రైతులు కౌలు సాగు చేస్తున్నారు.

1. స్ధిర మొత్తంలో సొమ్ము

2. దిగుబడిలో స్ధిర వాటా  

3. దిగుబడిలో వాటా

4. సర్వీస్ కాంట్రాక్టు

5. దిగుబడిలో వాటాతో పాటు మరో ఇతర నిబంధన

6. పొలాన్ని అప్పుకింద తనఖా పెట్టి సాగు చేయడం

7. నిర్దిష్ట నిబంధన లేకుండా బంధువుల భూమి సాగు చేయడం

కౌలు రకాల మధ్య కౌలు భూముల విభజన ఇలా ఉన్నది:

పంట దిగుబడిలో వాటా ఇచ్చే ప్రాతిపదికన జరిగే కౌలు సాగు కింద అత్యధికంగా 40 శాతం సాగు అవుతోంది. ఈ వాటా అన్ని తరగతుల్లో దాదాపు ఒకే మొత్తంలో ఉన్నది.

స్ధిర మొత్తంలో డబ్బు చెల్లించే ప్రాతిపదికన జరిగే కౌలు సాగు కింద 29.52 శాతం సాగు అవుతుండగా దిగుబడిలో స్ధిర వాటా ఇచ్చుకునే తరహా కౌలుసాగు కింద 20 శాతం సాగు అవుతోంది. ఇతర రకాల (4 నుండి 7 వరకు) కౌలు సాగు కింద విస్తీర్ణం 1991-92 నుండి తగ్గిపోతూ వస్తోంది. అలా తగ్గిన భాగం మొదటి 3 రకాల కౌలుసాగుకు మళ్లుతూ వస్తోంది.

(a) 0.04 హెక్టార్ల నుండి 2 హెక్టార్ల వరకు విస్తీర్ణం కలిగిన కౌలు కమతాలలో ‘దిగుబడిలో వాటా’ (3వ రకం) ప్రాతిపదికన కౌలు సాగు అత్యధికంగా (52 శాతం పైన) జరుగుతోంది.

(b) 0.04 హెక్టార్లకు తక్కువ విస్తీర్ణం గల కౌలు కమతాలలో స్ధిర మొత్తంలో డబ్బు చెల్లించే (1వ రకం) ప్రాతిపదికన ఎక్కువ కౌలు సాగు -29.52%- జరుగుతోంది. మొత్తం కౌలు విస్తీర్ణంలో 0.04 హె. కు లోపు కమతాల వాటా 0.1 శాతం మాత్రమే. 2 నుండి 10 హెక్టార్ల విస్తీర్ణం గల కౌలు కమతాల లోనూ స్ధిర మొత్తం చెల్లించే రకం కౌలు సాగు ఎక్కువగా జరుగుతోంది. (2.0-4.0 హె –> 37.1%; 4.0-10.0 హె –> 50.8%)

కమతాల సైజు పెరిగే కొద్దీ వాటిలో స్ధిర మొత్తంలో కౌలు చెల్లించే పద్ధతిలోని సాగు విస్తీర్ణం పెరుగుతోంది. కింది పట్టికలో ఆ సంగతి గమనించవచ్చు.

కౌలు కమతం
పరిమాణం
(హెక్టార్లలో)
స్ధిర సొమ్ము రకం
కౌలుసాగు వాటా
(శాతంలలో)
0.04 – 0.5 17.2
0.5 – 1.0 19.7
1.0 – 2.0 22.9
2.0 – 4.0 37.1
4.0 – 10.0 50.8

అలాగే గత నాలుగు రౌండ్ల ఎన్‌ఎస్‌ఎస్ సర్వేల లోనూ స్ధిర మొత్తం సొమ్ము కౌలుగా చెల్లించే రకం కింద కౌలు సాగు విస్తీర్ణం ఇతర రకాల కౌలు సాగు కంటే ఎక్కువగా ఉన్నది. ప్రతి సర్వేలోను ఇది దాదాపు 40 శాతం వద్ద రికార్డ్ అయింది.  కింది పట్టికలో మూడవ వరుస చూడండి:

NSSO 2002-03 -59th round

(ఎన్‌ఎస్‌ఎస్‌ఓ నివేదిక నుండి నేరుగా స్క్రీన్ షాట్ తీసిన ఇమేజ్ ఇది -అను)

(c) పెద్ద కమతాలకు వచ్చే సరిగి దిగుబడిలో స్ధిర వాటాను కౌలుగా ఇచ్చుకోవడం ఎక్కువగా జరుగుతోంది. 10 హెక్టార్లకు ఎక్కువ పరిమాణం గల కౌలు కమతాలలో 36 శాతం ఈ తరహాలో సాగు అవుతోంది. తరువాతి వాటా స్ధిర మొత్తంది -29.5%- కాగా ఆ తర్వాత స్ధానం దిగుబడిలో ఎంతో కొంత వాటా (5వ రకం) ఇచ్చుకునే రకం కౌలు సాగు -26.7%- కలిగి ఉన్నది.

కౌలు నిబంధనలు ఏవీ రికార్డు చేయకుండా కౌలు సాగు జరుగుతున్న కమతాలలో 0.04 హెక్టార్లకు (రమారమి 10 సెంట్ల లోపు) తక్కువ సైజు కమతాలు ఎక్కువ వాటా -21 %- కలిగి ఉన్నాయి. ఇతర అన్ని రకాల కమతాల లోనూ ఈ వాటా 8 శాతం కంటే తక్కువ ఉన్నది.

(d) 1991-92 సర్వేలో ఏ నిబంధన కింద కౌలు సాగు జరుగుతున్నదో రికార్డు కానీ కమతాల వాటా మొత్తం కౌలు కమతాలలో 16 శాతంగా ఉన్నది. వాటిని కూడా కలుపుకుంటే చివరి 4 రకాల కౌలు కమతాల వాటా మొత్తం కౌలు కమతాలలో 32 శాతం.

(8) పంజాబ్ లో స్ధిరమొత్తంలో సొమ్మును కౌలుగా చెల్లించే రకం కౌలు భూమి విస్తీర్ణం (కమతాలు కావు) మొత్తం కౌలు విస్తీర్ణంలో 79 శాతం వాటా కలిగి ఉన్నది. ఇది హర్యానాలో 71 శాతం.

పంట దిగుబడిలో వాటా చెల్లించే రకం కౌలు విస్తీర్ణం ఒరిస్సాలో 73 శాతం ఉండగా జార్ఖండ్ తో కలిసిన బీహార్ లో 67 శాతం ఉన్నది. ఇది అస్సాంలో 55 శాతం, ఉత్తరాంచల్ తో కూడిన ఉత్తర ప్రదేశ్ లో 53 శాతం, పశ్చిమ బెంగాల్, మధ్య ప్రదేశ్ (చిత్తిస్ ఘర్ తో సహా), రాజస్ధాన్, మహారాష్ట్రలలో 35 నుండి 40 శాతం వరకు ఉన్నది. అనగా కౌలు విస్తీర్ణంలో అత్యధిక భాగం పంట దిగుబడిలో వాటా ఇచ్చుకునే రకం కింద సాగు అవుతోంది.

(9) గుజరాత్, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ లలో స్ధిర మొత్తంలో డబ్బు చెల్లించే రకం కింద ఎక్కువగా కౌలు సాగు జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల వరకు చూస్తే కౌలు విస్తీర్ణంలో ఈ రకం కౌలు సాగు 60 శాతం వాటా కలిగి ఉన్నది.

కమతాల పరిమాణం – కుటుంబాల ఉపాధి:

(10) 0.5 హెక్టార్ల (1 ఎకరం) కంటే ఎక్కువ పరిమాణం గల కమతాల వయోజన కుటుంబాలలో (adult households) 64 నుండి 69 శాతం వరకు వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారు. వారిలో 3 నుండి 4 శాతం వరకు మాత్రమే వ్యవసాయేతర ఉపాధిపై ఆధారపడి ఉన్నారు. మరోవైపు 0.04, అంతకు తక్కువ సైజు కమతాలు కలిగిన వయోజన కుటుంబాలలో 16 నుండి 18 శాతం వరకు వ్యవాసాయేతర ఉపాధి పొందుతున్నారు (వయోజనులు అంటే 15 సం. & అంతకు మించి వయసు).

అఖిల భారత స్ధాయిలో 0.04 హె నుండి 0.5 హె వరకు కమతాలు కలిగిన కుటుంబాలు 23.6 శాతం ఉన్నాయి. వారిలో 61 శాతం వ్యవసాయం పైనా, 7 శాతం వ్యవసాయేతర ఉపాధి పైనా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

(11) అఖిల భారత స్ధాయిలో అన్ని రకాల కమతాల కుటుంబాలలోనూ 55 శాతం వ్యవసాయంపై ఆధారపడి ఉపాధి పొందుతుండగా వ్యవసాయేతర ఉపాధిపై 12 శాతం ఆధారపడి ఉన్నారు. 33 శాతం కుటుంబాలు నిరుద్యోగులుగానూ, కూలీలుగానూ జీవనం సాగిస్తున్నారు.

(12) వివిధ రకాల పంటల నికర విట్టుబడి విస్తీర్ణం:

తృణ ధాన్యాలు = 63.69 %; పప్పులు = 5.84%; నూనె విత్తనాలు = 9.04 %; చెరకు = 3.24 %; కూరగాయలు = 1.25 %; పండ్ల తోటలు = 1.76 %; ప్లాంటేషన్లు = 2.12 %; నార పంటలు = 4.36 %; పశు గ్రాసం = 2.12 %

ఎన్‌ఎస్‌ఎస్ గణాంకాలతో పాటుగా ఇతర గణాంకాలను కూడా కొన్ని పరిగణనలోకి తీసుకోవాలి.

(1) వ్యవసాయంలో ఉత్పత్తుల విలువ నుండి ముడి సరుకుల విలువను తీసివేసి మిగిలిదానిని వ్యవసాయ స్ధూల జాతీయోత్పత్తి (వ్యవసాయ జి‌డి‌పి) గా పరిగణిస్తారు.

1980 – 95 కాలంలో వ్యవసాయ జి‌డి‌పి వృద్ధి రేటు – 3.3 %

1995 – 2004-05 కాలంలో వ్యవసాయ జి‌డిపి వృద్ధి రేటు – 2 %

(2) ఉత్పాదక పునాదిలో క్షీణత (వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెలువరించిన గణాంకాలు)

(a) 1990-91 లో  నికర విత్తుబడి విస్తీర్ణం = 143 మిలియన్ హెక్టార్లు (35.32 కోట్ల ఎకరాలు)

2003-04 లో నికర విత్తుబడి విస్తీర్ణం = 140.9 మిలియన్ హెక్టార్లు (34.80 కోట్ల ఎకరాలు)

(b) నీటి పారుదల విస్తీర్ణంలో క్షీణత

1999-2000  –>  57.1 మిలియన్ హెక్టార్లు (14.10 కోట్ల ఎకరాలు)

2003-2004  –>  55.1 మిలియన్ హెక్టార్లు (13.61 కోట్ల ఎకరాలు)

పంటల తీవ్రత కూడా క్రమంగా తగ్గుతోంది. (ఒక కమతంలో సంవత్సరానికి ఎన్ని పంటలు వేస్తారు అన్న అంశాన్ని పంటల తీవ్రత -క్రాపింగ్ ఇంటెన్సిటీ- అంటారు -అను)

(3) వ్యవసాయ ఉత్పత్తి వృద్ధి స్తంభించినప్పటికీ ఆ రంగంలో పని చేసేవారి సంఖ్య పెరుగుతోంది.

శ్రామికుల తలసరి నికర విలువ చేర్పు పెరుగుదల 1993-94 నుండి 2003-04 వరకు సాగిన దశాబ్ద కాలంలో దాదాపు స్తంభించిపోయింది.

2000 – 05 కాలంలో వ్యవసాయ కూలీ ఆదాయం సైతం స్తంభించిపోయింది.

వ్యవసాయంలో ఉపాధి రోజుల తగ్గుదల వ్యవసాయ కూలీవేతనాల పెరుగుదలను రద్దు చేస్తోంది.

(4) అత్యున్నత స్ధాయిలోని 5.2 శాతం గ్రామీణ కుటుంబాల స్వాధీనంలో 42.8 శాతం వ్యవసాయ భూములు ఉన్నాయి.

అత్యున్నత స్ధాయిలోని 9.5 శాతం గ్రామీణ కుటుంబాల స్వాధీనంలో 56.6 శాతం వ్యవసాయ భూములు ఉన్నాయి. మిగిలిన 90.5 గ్రామీణ కుటుంబాల స్వాధీనంలో ఉన్నది కేవలం 43.4 శాతం భూములు మాత్రమే.

43.4 శాతం గ్రామీణ కుటుంబాల్లోనూ 41.6 శాతం గ్రామీణ కుటుంబాల స్వాధీనంలో నివాస భూమి తప్ప మరొక భూమి లేదు. 10 శాతం కుటుంబాలకు నివాస భూమి కూడా లేదు. (49వ రౌండ్ ఎన్‌ఎస్‌ఎస్ నివేదిక మరియు EPW వ్యాసం: Ownership holdings of land in rural India -March 8, 2008 Issue)

ఆదాయాలు పడిపోతున్నప్పటికీ వ్యవసాయంపై ఆధారపడే శ్రామికుల సంఖ్య పెరుగుతోంది: రైతులు భూములకు కట్టివేయబడి ఉన్నారు.

(a) 1993-94లో వ్యవసాయ శ్రామికుల సంఖ్య – 191 మిలియన్లు

2004-05లో వ్యవసాయ శ్రామికుల సంఖ్య – 257 మిలియన్లు

(b) గత మూడు దశాబ్దాలలో వ్యవసాయ శ్రామికుల్లో వేతన శ్రామికుల భాగం స్తంభనలో ఉన్నది.

(c) వ్యవసాయ శ్రామికులలో వ్యవసాయదారుల భాగం 64.2 శాతం. ఇది 1983 కంటే ఎక్కువ.

శ్రామికుల్లో వ్యవసాయదారుల భాగం పెరగడానికి కారణం ఏమిటి? వాణిజ్యం వ్యవసాయ లాభదాయకతకు అనుగుణంగా లేకపోవడంతో వ్యవసాయదారులు తమ పొలాల్లో పనులకు వేతన శ్రామికులను కూలికి తెచ్చుకోవడానికి బదులుగా తమ కుటుంబ సభ్యులనే పనిలోకి దించుతున్నారు. వ్యవసాయదారుల సంఖ్య పెరిగడానికి ఇది కారణం కావచ్చు.

దేశంలో చిన్న తరహా వ్యవసాయం అత్యధికంగా నడుస్తోంది: ఎన్‌ఎస్‌ఎస్ 59వ రౌండ్ లో భాగంగా జరిగిన  ఎస్‌ఏ‌ఎస్ (సిచ్యుయేషన్ అసెస్మెంట్ సర్వే) గణాంకాల ప్రకారం 2 హెక్టార్లు కంటే తక్కువ విస్తీర్ణం గల కమతాల రైతుల సంఖ్య మొత్తం వ్యవసాయదారుల్లో 90.4 శాతం ఉన్నారు. కానీ మొత్తం వ్యవసాయదారుల ఆదాయంలో వారి వాటా 68.4 శాతం మాత్రమే. మిగిలిన మధ్య మరియు పెద్ద కమతాల రైతు కుటుంబాల సంఖ్య మొత్తం రైతు కుటుంబాలలో 9.6 శాతం ఉండగా వ్యవసాయ ఆదాయంలో వారి వాటా 31.6 శాతం.

(………….సశేషం)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s