
Fertilizer scheme
భారత వ్యవసాయ రంగంలో మార్పులపై ఒక నోట్ : పార్ట్ 9
8వ భాగం తర్వాత….
“‘దారిద్ర్య నిర్మూలనా చర్య’గా బిపిన్ చంద్ర పేర్కొన్న హరిత విప్లవాన్ని USAID (United States Assistance for International Development) కి చెందిన చీఫ్ ఎకనమిస్టు జాన్ డి మిల్లర్ “ప్రధానంగా ఒక ఎరువుల పధకం” గా అభివర్ణించాడు. “ఈ విప్లవాన్ని ప్రోత్సహించడంలో ఎరువుల కంపెనీలు, వాటి ధార్మిక సంస్ధలు (ఫౌండేషన్లు) మొదటి నుండి చురుకుగా వ్యవహరించాయి” అని మూని (ఫ్యాట్ రాయ్ మూని కెనడా దేశస్ధుడు, అంతర్జాతీయ సామాజికవేత్త, బయోటెక్నాలజీ ప్రభావాలపైనా, బయోడైవర్సిటీలపైనా పలు పుస్తకాలు వెలువరించిన రచయిత -అను) పేర్కొన్నాడు.
రాక్ ఫెల్లర్, ఫోర్డ్, కెల్లాగ్ ఫౌండేషన్లు హరిత విప్లవాన్ని ప్రమోట్ చేయడంలో చురుకైన పాత్ర పోషించాయి. హెచ్‌వైవి (హై యీల్డింగ్ వెరైటీస్) విత్తనాల పంపిణీ విత్తన జన్యు నియంత్రణలో కూడా ఈ ఫౌండేషన్లు చురుకుగా పాల్గొంటున్నాయి. విత్తన పరిశ్రమ అభివృద్ధిపై వ్యాఖ్యానిస్తూ ఎఫ్‌ఏఓ (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్) నివేదిక ఇలా పేర్కొంది. “విత్తన పరిశ్రమ సొంతగా అభివృద్ధి చెందడం సాధ్యం కాదు. మంచి విత్తనాల వినియోగదారులు ఎరువులు, పురుగు మందులు, యంత్రాలు, నీళ్ళు… ఇవన్నీ కూడా వాడి తీరాలి… ఇతర వ్యవసాయ ముడి సరుకులు (ఎరువులు, పురుగు మందులు, యంత్రాలు మొ.వి) వచ్చే మార్గాల ద్వారానే విత్తనాల మార్కెటింగ్ కూడా తరచుగా జరుగుతుంది.” (Imperialism’s tightening grip on Indian Agriculture -Sunit Kumar Ghosh, 1998, P 29)
హరిత విప్లవం పూర్వరంగం గురించి పరిశీలించాలి. 1958లో భారత దేశం లోని ఫోర్డ్ ఫౌండేషన్ విభాగం సమర్పించిన ఎన్స్ మింగర్ ప్రతిపాదనలను అప్పటి నెహ్రూ ప్రభుత్వం ఆమోదించింది. భారత దేశ ఆహార సంక్షోభం గురింఛీ, సంక్షోభ నివారణకు తీసుకోవలసిన చర్యల గురించి ఫోర్డ్ ఫౌండేషన్ తన నివేదిక ఇచ్చింది. మెరుగైన విత్తనాలు వాడాలనీ, రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులు వినియోగించాలని ఆ నివేదిక సిఫారసు చేసింది. వాస్తవానికి ఆ సమయానికి అమెరికాకు చెందిన బడా వ్యవసాయ రసాయన కంపెనీలు తమ ఎరువులు, పురుగు మందులను కొనుగోలు చేసే మార్కెట్ల కోసం వెతుకుతున్నాయి. నీటిపారుదల వసతి ఉన్న పొలాల్లో హైబ్రిడ్ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వినియోగించాలనీ విద్యుత్తు, యంత్రాలను పెద్ద ఎత్తున ప్రవేశపెట్టాలని ప్రపంచ బ్యాంకు సైతం పలు సిఫారసులు చేసింది.
భారత ప్రభుత్వం కోరిన సహాయం విడుదల చేయాలంటే తాము తయారు చేసిన సంస్కరణల ప్యాకేజీని అమలు చేయాలని ప్రపంచ బ్యాంకు ఆనాడే షరతు విధించింది. ఈ విధమైన సంస్కరణల అనుకూల వైఖరి ద్వారా మూడో ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఆకలి, పోషకాహార లోపం సమస్యలను పరిష్కరించుకోవచ్చని 1960లలో వ్యవసాయ రసాయన కంపెనీలు కూడా భారీగా ప్రచారం చేశాయి. 1964లో ప్రపంచ బ్యాంకు, బెర్నాల్డ్ బెల్ నాయకత్వంలో ఒక బృందాన్ని ఇండియాకు పంపింది. ఈ బృందం రాకతో భారత దేశ ‘హరిత విప్లవం’లో ప్రపంచ బ్యాంకు జోక్యం మొదలయింది. భారత కరెన్సీ విలువను తగ్గించాలని, వాణిజ్య నియంత్రణలను సరళీకరించాలని, వ్యవసాయంలో రసాయనాలు మరియు పెట్టుబడులను భారీమొత్తంలో వినియోగించడంపై దృష్టి కేంద్రీకరించాలనీ బెల్ బృందం సిఫారసు చేసింది.
1966లో న్యూయార్క్ టైమ్స్ పత్రిక హరిత విప్లవాన్ని ఇలా విశ్లేషించింది. “వాటిని (తోలు బొమ్మలను నియంత్రించే) దారాలు అనండి లేదా ‘షరతులు అనండి లేదా ఇంకే పేరుతోనైనా పిలవండి. ప్రపంచ బ్యాంకు ద్వారా అమెరికా తన సహాయంతో పాటుగా విధించిన నిబంధనలను అంగీకరించడం మినహా ఇండియాకు మరోదారి లేదు. ఎందుకంటే ఇండియాకు సహాయం చేసే మరో తావంటూ లేదు మరి” (Ibid, P 31)
ఫెలిక్స్ గ్రీనే (చైనా, వియత్నాంలపై పుస్తకాలు, సినిమాలు వెలువరించిన రచయిత, సామ్రాజ్యవాద వ్యతిరేకి -అను) ఇలా పేర్కొన్నారు, “ఈ సమయానికి అమెరికాకు చెందిన అనేక చమురు కంపెనీలు ఇండియాలో ఎరువుల కర్మాగారాలను నెలకొల్పడానికి చర్చలు జరుపుతున్నాయి. ఎరువుల పంపిణీ మరియు అమ్మకాలను తమ చేతల్లో ఉంచుకోవాలని ఇండియా అభిలషిస్తోంది. ఇది చమురు కంపెనీల ప్రయోజనాలకు అనుగుణంగా లేదు. ఓ పక్క లెక్కలేనంత మంది భారత ప్రజలు ఆకలితో మలమల మాడుతుండగా భారత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి లొంగదీసుకోవడానికీ తద్వారా తమ షరతులకు ఒప్పుకునేలా చేయడానికీ వీలుగా ఇండియాకు జరిగే ఆహార ఎగుమతులను అమెరికా చమురు కంపెనీలు నిలిపివేయించాయి.” ఈ నేపధ్యంలో భారత దేశంలో పెట్టుబడులపై కేంద్రీకరించబడిన, హెచ్‌వైవి విత్తనాలు మరియు వ్యవసాయ రసాయనాల ఆధారిత విప్లవం పంజాబ్, హర్యానాలలో ప్రారంభం అయింది.
హరిత విప్లవం పంజాబ్ లోనే ఎందుకు విజయవంతం అయింది? ఇది తరచుగా ఎదురయ్యే ప్రశ్న. కమతాల పరిమాణం కంటే కమతాలపై యాజమాన్యమే దీనికి ప్రధాన కారణమని వివిధ ఆర్ధికవేత్తలు తమ సమాధానంగా చెప్పారు. హమీద్ (1981), పార్ధ సారధి & ప్రసాద్ (1978), భాదురి (1973) ల అధ్యయనాలు దీనికే మద్దతు వచ్చాయి. అయితే వ్యాస్ (1979) అధ్యయనం వాటితో విభేదించింది. హెచ్‌వైవి విత్తనాల వినియోగం భూముల సొంతదారులు, కౌలుదారులు ఇరువురిలోనూ సమానంగా ఉన్నదని వ్యాస్ అధ్యయనం చూపింది. నిజానికి పంజాబ్ లో సన్నకారు మరియు చిన్న రైతులలో సొంత భూములు కలిగిన రైతుల నిష్పత్తి చాలా తక్కువ శాతమే ఉన్నది (Ibid, P 30).
మధ్య మరియు పెద్ద పరిమాణం లోని కమతాల సంగతి తీసుకున్నా సొంత యాజమాన్యంలో సాగు చేసిన భూముల నిష్పత్తి తక్కువే. ఇండియాలో హరిత విప్లవానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళి లోతుగా పరిశీలిస్తే గనక పంజాబ్ లో విద్యుత్తు, నీటి పారుదల, రవాణా, సమాచార సౌకర్యాలు, విద్య, రుణాల అందుబాటు మొ.న మౌలిక సౌకర్యాలకు సంబంధించిన సూచిక 1966 నుండి 1996 వరకు స్ధిరంగా అధిక స్ధాయిలో కొనసాగిన సంగతి గమనించగలము. ఈ మౌలిక వసతుల సూచికయే పంజాబ్ ను అగ్ర పీఠిన నిలిపింది (Green Revolution in Punjab, India: The Economics of Technological Change; Journal of Punjab Studies, Vol 12, No. 02, 2005)
హరిత విప్లవం వాస్తవంగా ఎంత పచ్చనిది? హరిత విప్లవ కాలంలోనూ, దానికి ముందు కాలం లోనూ వివిధ రకాల పంటల ఉత్పత్తుల వృద్ధి రేట్లను కింద పట్టికలో చూడవచ్చు.
గోధుమ | వరి | అన్ని తృణ ధాన్యాలు |
పప్పులు | అన్ని రకాల ఆహారాలు కలిపి | అన్ని రకాల పంటలు | |
1950-65 | 4.0 | 3.3 | 3.2 | 1.2 | 2.9 | 3.0 |
1968-85 | 5.5 | 2.4 | 2.9 | 0.7 | 2.6 | 2.6 |
పెట్టుబడీదారీ వ్యవస్థలో ప్రతీదీ పెట్టుబడిదారుల లాబార్జనకు గురికాకుండా ఉండదన్నమాట!
That’s a good observation!
పెట్టుబడి మనిషి వినియోగించగల ప్రతి వస్తువునీ సరుకు (commodity) లోకి మార్చుతుందని కారల్ మార్క్స్ చెప్పినది మళ్ళీ మళ్ళీ రుజువు అవుతున్న సత్యం. సరుకులోకి మార్చడం లాభార్జనా దృష్టితోనే జరుగుతుంది.