[గమనిక: A Note on Transition in Indian Agriculture శీర్షికన బెంగాల్ కు చెందిన అమితాబ్ చక్రవర్తి ఒక చిన్న పుస్తకాన్ని రచించారు. భారత దేశంలో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి విధానంలో వస్తున్న మార్పుల గురించి మార్క్సిస్టు-లెనినిస్టు దృక్పధంతో చర్చించడానికి ఈ పుస్తకం ప్రయత్నిస్తుంది. పుస్తకాన్ని తెలుగులో అనువదించే కృషిలో భాగంగా ఇప్పటి వరకు 8 భాగాలు బ్లాగ్ లో ప్రచురించాను. 7వ భాగం మార్చి 27, 2014 తేదీన ప్రచురించాను. అనంతరం వివిధ కారణాల రీత్యా అనువాదం సాగలేదు. ఆ అనువాదాన్ని తిరిగి కొనసాగిస్తున్నాను. మొదటి 7 భాగాలకు లంకెలు ఈ భాగం చివర ఇస్తున్నాను. -విశేఖర్]
*********
భారత వ్యవసాయ రంగంలో మార్పులుపై ఒక నోట్ : పార్ట్ 8
చాప్టర్ IV
1947 అనంతర భారత దేశంలో వ్యవసాయ సంబంధాలు
1947లో అధికార మార్పిడి జరిగినాక 1949 తర్వాత కాలంలో ఇండియాలో ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్, మద్రాస్, అస్సాం మొ.న రాష్ట్రాలలో జమీందారీ రద్దు చట్టాలను తెచ్చారు. 1956 నాటికి దాదాపు అన్ని రాష్ట్రాల లోనూ జమీందారీ పద్ధతిని రద్దు చేస్తూ చట్టాలు వచ్చాయి. కానీ వాస్తవ పరిస్ధితి చట్టాలకు భిన్నంగా జరిగింది. జమీందారీ రద్దు ఫలితంగా కౌలుదారుల సంఖ్య భాగా తగ్గిపోయిందని చెప్పారు. 1951-52 లో కౌలు సాగుదారులు 42 శాతం ఉండగా 1960ల ప్రారంభం నాటికి 20-25 శాతానికి పడిపోయిందని లెక్కలు చెప్పారు. (India after Independence -IaI, Bipan Chandra Et Al, Bengali edition, Aug 2006, P 449)
ఈ చర్యలు ఆస్తి సంబంధాలలో ఎలాంటి మార్పులు తీసుకురాలేకపోయాయని గున్నర్ మిర్దాల్ తన పుస్తకం “ఆసియా నాటకం” (ఆసియన్ డ్రామా) లో వివరించారు. రైతుల పేరుతో చలామణి అయినవారికి ‘రద్దు’ అంటే కేవలం వారి ఆదాయాల వనరులో మార్పు మాత్రమే, ముఖ్యంగా పెద్ద ఆదాయాల వారికి -కొద్ది మందికి మాత్రమే కమతాల పరిమాణం తగ్గింది.
‘భారత దేశంలో భూ సంస్కరణలు’ (Land Reforms in India) పుస్తకంలో హెచ్ డి మాలవీయ, తరిమెల నాగిరెడ్డిని ఉటంకించినట్లుగా “సిర్ మరియు ఖుడ్ కష్త్ భూములను (ఉత్తర భారతంలో కౌలు తరహా భూములు) సొంతం చేసుకునే హక్కు ప్రవేశపెట్టడంతో జమీందార్లు అప్పటికే భూములను ఆక్రమించుకున్న కౌలు రైతులను కూడా పెద్ద సంఖ్యలో ఖాళీ చేయించి అవి కూడా తమవే అనీ సొంతగా సాగు చేస్తున్నామని చాటడం మొదలు పెట్టారు.” (తాకట్టులో భారత దేశం, ఆంగ్లం పేజీ 452) పైన పేర్కొన్నట్లుగా కౌలుదారుల సంఖ్య తగ్గిపోవడానికి ఇది ముఖ్యమైన కారణం.
“ఎవరైతే కనీసంగా శారీరక శ్రమ చేసి, పొలం సాగులో పాల్గొంటారో వారు మాత్రమే ‘వ్యక్తిగత సాగు’ హక్కు కింద భూములు పొందడానికి అర్హులు అవుతారని 1949లో కాంగ్రెస్ నియమించిన వ్యవసాయ సంస్కరణల కమిటీ అయిన కుమరప్ప కమిటీ సిఫారసు చేసింది. అయితే ఉత్తర ప్రదేశ్, బీహార్, మద్రాస్ మొదలైన రాష్ట్రాల్లో సరిగ్గా ఇందుకు విరుద్ధంగా జరిగింది. జమీందార్లు ‘వ్యక్తిగతంగా సాగు చేస్తున్నామని’ చెబుతూ ఎలాంటి పరిమితి లేకుండా భూములను స్వాధీనంలో ఉంచుకున్నారు.
న్యాయస్ధానాలను ఆశ్రయించడం ద్వారా, పాలక వ్యవస్ధలను ప్రయోగించడం ద్వారా జమీందార్లు మార్పులను ప్రతిఘటించారు. వాస్తవ కౌలు సాగుదారుల్లో 82 శాతం మందికి భద్రత లేదని 1961 గణాంకాల ద్వారా రుజువు అయింది. చిన్న రైతులను కాపాడేందుకు చేసిన చట్టాలన్నింటినీ రెవిన్యూ అధికారుల అండతో భూస్వాములు పూర్తిగా వినియోగించుకున్నారని 1973లో ప్లానింగ్ కమిషన్ సభ్యుడు పి ఎస్ అప్పి ఒక నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు.
భూమి సాగు చేస్తున్న కౌలు రైతు గరిష్టంగా ఎంత కౌలు చెల్లించవచ్చో నిర్దేశించే సంస్కరణ కూడా ఇండియాలోని వివిధ రాష్ట్రాల్లో ఉనికిలో ఉన్నది. సాగుదారు నుండి వసూలు చేసే కౌలుపై పరిమితి విధించేందుకు దీనిని ఉద్దేశించారు.
ఒకటవ మరియు రెండవ ప్రణాళికల్లో మొత్తం పంట ఉత్పత్తిలో 20 – 25 శాతం కౌలు ఉండవచ్చని నిర్ణయించారు. పంజాబ్, హర్యానా, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఇది 33.3 నుండి 40 శాతం వరకు ఉన్నది. కానీ ఆచరణలో మాత్రం అన్ని రాష్ట్రాల్లోనూ పంట ఉత్పత్తి మార్కెట్ ధరలో 50 శాతం కౌలుగా వసూలు చేయడం కొనసాగింది. పైగా పంట పండించడానికి అయ్యే ఖర్చునంతా కౌలుదారే భరించాలి. 60ల తర్వాత హరిత విప్లవం భూములు, కౌలు రేట్లను పెంచివేసింది. పంజాబులోనైతే కౌలు 70 శాతం వరకు పెరిగిపోయింది. (India mortgaged, TN, P 452)
కాంగ్రెస్ పార్టీ 1947 నుండి 1950 వరకు జరిపిన ఏఐసిసి సమావేశాల్లో భూపరిమితి చట్టం (ల్యాండ్ సీలింగ్ యాక్ట్) పై చర్చలు జరిపింది. ఈ సందర్భంగా పార్టీలో అంతర్గతంగా తీవ్ర విబేధాలు తలెత్తాయి. విభేధాలు చివరికి ఎన్ జి రంగా నేతృత్వంలో ఒక గ్రూపు ‘స్వతంత్ర పార్టీ’గా వేరు కుంపటి పెట్టుకునే వరకూ దారి తీసింది.
భూపరిమితి చట్టం కుటుంబ ప్రాతిపదికన కాకుండా వ్యక్తుల ప్రాతిపదికన తయారు చేసుకున్నారు. దానితో భూస్వామ్య కుటుంబాలు తమ కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో పెద్ద మొత్తంలో భూములు అట్టే పెట్టుకోగలిగారు. సరాసరి ఒక్కో సభ్యునికి 6 నుండి 7 శాతం చూప్పున అదనపు భూములు (చట్టబద్ధంగా) మిగుల్చుకోగలిగారు. ఈ పరిమితి కూడా అన్ని చోట్లా ఒకే విధంగా లేదు. భూముల లక్షణాల ప్రాతిపదికన ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పరిమితి పెట్టుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ పరిమితి 27 నుండి 312 ఎకరాల వరకు ఉండగా అస్సాంలో 50 ఎకరాలు, పశ్చిమ బెంగాల్ లో 25 ఎకరాల వరకు పరిమితి విధించారు.
గమనించదగిన విషయం ఏమిటంటే 1961 నాటికల్లా దాదాపు రాష్ట్రాలన్నీ భూపరిమితి చట్టాలు చేసినప్పటికీ బీహార్, మైసూర్, కేరళ, ఒరిస్సా, రాజస్ధాన్ మొ.న రాష్ట్రాలు 1970 వరకు ఒక్క ఎకరం కూడా మిగులు భూమిగా ప్రకటించలేదు. ఒక్క జమ్ము & కాశ్మీర్ రాష్ట్రం మాత్రమే భూపరిమితి చట్టాన్ని వాస్తవంగా పూర్తిగా అమలు చేసిన ఖ్యాతి దక్కించుకుంది. (IaI 1947-2000, Bipan Chandra Et Al, P 464)
1970 చివరి నాటికి దేశం మొత్తం మీద 24 లక్షల ఎకరాలు మాత్రమే మిగులు భూమిగా ప్రకటించారు. అందులో కూడా సగం మాత్రమే పునః పంపిణీ చేశారు. ఇది దేశంలోని మొత్తం వ్యవసాయ యోగ్యమైన భూమిలో 0.32 శాతం మాత్రమే.
1972లో భూపరిమితి చట్టంలో కొన్ని మార్పులు చేశారు. బహుళ పంటల భూములు, నీటి పారుదల వసతి కలిగిన భూములు 10 నుండి 18 ఎకరాల వరకు ఉండవచ్చని పరిమితి పెట్టారు. ఒకే పంట పండే భూములకు 27 ఎకరాలు, మెట్ట భూములకు 54 ఎకరాలు పరిమితి విధించారు. కుటుంబం అంటే 5 గురు సభ్యులు ఉన్నది అని పరిమితి పెట్టారు. కానీ 5 గురు కంటే మించి సభ్యులు ఉంటే గనక వారికి అదనపు కోటా ఇవ్వడం మర్చిపోలేదు. అదనపు సభ్యులను కలుపుకుంటే అటువంటి కుటుంబం మొత్తం మీద 5గురు సభ్యుల కుటుంబానికి ఇచ్చిన పరిమితికి రెట్టింపు కంటే ఎక్కువ భూమి ఉండకూడదని పేర్కొన్నారు. అనగా భూపరిమితి చట్టం మేరకు ఓ కుటుంబానికి 100 ఎకరాలకు హక్కు వస్తే అదనంగా ఒక్క సభ్యుడు ఉన్నా 200 ఎకరాలు ఉంచుకోవచ్చన్నమాట!

Bipan Chandra
తాజా వ్యవసాయ గణాంకాల లోకి వెళ్ళే ముందు చరిత్రకారుడు, సామాజిక శాస్త్రవేత్త అయిన బిపన్ చంద్ర ఏమి చెప్పారో ఒకసారి చూద్దాం:
“ప్రజాస్వామ్యంలో అత్యంత నిష్ట దరిద్రుడుకి కూడా ఓటు హక్కు ఉంటుంది. కనుక నెమ్మదిగానే అయినా స్ధిరంగా గ్రామాల్లో ఉన్నత కులాల పైన (వారి రాజకీయ ప్రయోజనాల రీత్యా) ఒత్తిడి పెరిగింది. తద్వారా కింది తరగతికి చెందిన రైతులకు కూడా అవకాశాలు దక్కాయి. ఈ విధంగా మొత్తం రైతాంగం యొక్క నికర ఆస్తి భారీగా వృద్ధి చెందింది” (Ibid, P 487)
ఆయన ఇంకా ఇలా చెప్పారు, “స్వతంత్ర భారతం తన వ్యవసాయ వ్యవస్ధ నుండి ప్రధాన భూస్వామ్య లక్షణాలను నిర్మూలించడంలో మొత్తం మీద విజయవంతం అయింది. తద్వారా వలస కాలం నుండి వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ నిర్మాణాలను, రైతుస్వామ్య ఆధారిత పెట్టుబడిదారీ అభివృద్ధి దిశగా తీసుకెళ్లగల ప్రగతి పధంపై ప్రయాణాన్ని ప్రారంభించ గలిగింది. (Ibid, P 489)
ఇలాంటి పత్రాలు ఎన్ని రాసుకున్నప్పటికీ అధికారికంగా (వాస్తవంగా కాదు) పంపిణీ చేసిన భూములు, మొత్తం సాగు భూముల్లో 2 శాతం మాత్రమే ఉండడం చేదు నిజం.
దేశంలో గత 5 దశాబ్దాలలో (చట్టాలు చేసిన 60ల నుండి) భూ పరిమితి చట్టాలను అమలు చేసిన ఫలితంగా 74.3 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేశామని చెప్పారు. అందులోనూ 43.4 లక్షల ఎకరాలను 50 లక్షల లబ్దిదారులకు పంచి పెట్టామని చెప్పారు. దేశంలో సాగు లాయకీ భూముల మొత్తం విస్తీర్ణం 81.263 కోట్ల (812.63 మిలియన్లు) ఎకరాలు. ఇందులో పంచిన భూముల నిష్పత్తి 1 శాతం కంటే తక్కువే కావడం గమనించవచ్చు. వ్యవసాయ యోగ్యమైన భూములతో పోల్చితే పంచిన భూమి నిష్పత్తి 2 శాతం వరకు ఉంటుంది. (D Bandopadhyay: Does Land Still Matter, EPW, 8 Mar 2008)
ప్రభుత్వం కాకుండా వినోదా భావే నాయకత్వం లోని భూదాన్ ఉద్యమం 40 లక్షల ఎకరాల భూములు సేకరించింది. వీటిలో అత్యధికం వ్యవసాయానికి పనికిరాని భూములూ, కోర్టు వివాదాల్లో ఉన్న భూములూను. ఈ ఉద్యమం పరిస్ధితి చివరికి ఎలా తయారయిందంటే “భూదాన్ ఉద్యమం ఒక వైఫల్యం” అని నిర్ధారిస్తూ 1999లో బీహార్ ప్రభుత్వం నోటీసు ఇచ్చింది. కడకు భూదాన్ కమిటీని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
“ఫార్మింగ్ & ప్రోగ్రెస్” శీర్షికన జనవరి 3, 1970 తేదీన ఎకనామిక్ టైమ్స్ పత్రిక రాసిన సంపాదకీయంలో ఇలా పేర్కొంది. “భూ పరిమితి చట్టం ఏమి చెబుతున్నప్పటికీ 1955-56, 1967-68 మధ్య కాలంలో బడా రైతుల యాజమాన్యం లోని భూమి 9.5 శాతం మేర పెరిగింది. 20 నుండి 25 ఎకరాల వరకు ఉన్న కమతాలు 4 శాతం పెరిగగా 100 నుండి 150 ఎకరాల వరకు ఉన్న కమతాలు సంఖ్య ఏకంగా 40 శాతం పెరిగాయి.”
‘తాకట్టులో భారతదేశం’ పుస్తకంలో ‘ఫ్యూడలిజం – భూ సంస్కరణలు’ అనే పాఠం వివిధ రాష్ట్రాలలో భూములు సొంతం చేసుకోవడానికి భూస్వాములు వివిధ రాష్ట్రాలలో అవలంబించిన అనేక పద్ధతులను వివరంగా చర్చించింది. వ్యవసాయ కూలీల సంఖ్య కూడా పెరుగుతున్నప్పటికీ దానిని స్వేచ్చా వేతన శ్రమతో సమానం చేయలేము. అదే సమయంలో ‘వ్యవసాయంలో పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ప్రవేశించింది’ అని చెప్పడానికి వేతన శ్రమ ‘అవసరమే’ (necessary) గానీ ‘సరిపోయినది’ (sufficient) కాదని మరువరాదు.
1947 అనంతర వ్యవసాయ సంస్కరణల ఆరాధకులు (బిపన్ చంద్ర) పై పేరాలలో పేర్కొన్న అంశాలతో పాటుగా హరిత విప్లవం గురించి కూడా చెప్పారు. హరిత విప్లవాన్ని ‘దారిద్రానికి వ్యతిరేకంగా సాగిన యుద్ధం’గా ఆయన ప్రశంసించారు. “ఈ పరిస్ధితిలో దారిద్ర్య నిర్మూలనా చర్యగా మరియు జాతీయ వృద్ధి విస్తరించే అస్త్రంగా హరిత విప్లవం బ్రహ్మాండమైన పాత్ర పోషించిన సంగతి విస్తారంగా గుర్తించబడింది.” (IaI, P 500)
(………………..సశేషం)
ఆసక్తి ఉన్నవారు గత 7 భాగాల కోసం కింది లంకెలు చూడగలరు.
భారత వ్యవసాయ రంగంలో మార్పులు – ఒక నోట్
పంపిణీ, పెట్టుబడిదారీ పూర్వ అధిక-వడ్డీ మరియు వర్తక పెట్టుబడులు
వ్యవసాయ సమస్యపై కారల్ కాట్ స్కీ, లెనిన్
పెట్టుబడిదారీ పూర్వ ఉత్పత్తి విధానాలు – భారత దేశం
బ్రిటిష్ ఇండియా ఆదాయం రెండొంతులు దోపిడికే
మీజీ పునరుద్ధరణ: జపాన్ పెట్టుబడిదారీ అభివృద్ధికి నాంది
భూ సంస్కరణలు – జపాన్ పెట్టుబడిదారీ అభివృద్ధి