“ఈ రకంగా మీరు (బిసిసిఐ) నీళ్లని ఎలా వృధా చేయగలరు? జనం ముఖ్యమా లేక మీ ఐపిఎల్ మ్యాచ్ లు ముఖ్యమా? ఇంత అజాగ్రత్తగా ఎలా ఉండగలరు? నీళ్లని ఈ రకంగా ఎవరు వృధా చేస్తారు? ఇది నేరపూరిత వృధా. మహా రాష్ట్రలో పరిస్ధితి ఎలా ఉన్నదో మీకు తెలుసు. నీళ్ళు సమృద్ధిగా దొరికే మరే ఇతర రాష్ట్రానికైనా మీరు ఐపిఎల్ మ్యాచ్ లను తరలించడం ఆదర్శవంతం అవుతుంది.”
జస్టిస్ వి ఎం కనడే, జస్టిస్ ఎం ఎస్ కార్నిక్ లతో కూడిన ముంబై హై కోర్టు డివిజన్ బెంచి చేసిన వ్యాఖ్యలివి. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు లను ఉద్దేశిస్తూ న్యాయ మూర్తులు ఈ వ్యాఖ్యలు చేశారు.
9వ విడత ఐపిఎల్ మ్యాచ్ లు త్వరలో జరగబోతున్నాయి. వాటి కోసం మహారాష్ట్రలో మూడు స్టేడియంలను సిద్ధం చేస్తున్నారు. పెద్ద ఎత్తున నీటిని ట్యాంకర్లతో తెప్పించి గ్రౌండులను తడిపేస్తున్నారు.
మరో పక్క రాష్ట్రంలో ప్రజలు నీరు లేక అల్లాడుతున్నారు. మరాఠ్వాడా, బుందేల్ ఖండ్ ప్రాంతాల్లో కనీ వినీ ఎరగని రీతిలో నీటి కరువు నెలకొని ఉంది. పశువులు వేల సంఖ్యలో నీరు లేక చనిపోతున్నాయి. ‘పంటలు ఎండిపోతున్నాయి’ అని సింపుల్ గా చెప్పలేని దుర్భర పరిస్ధితిని రైతులు చవి చూస్తున్నారు. తాగడానికి సరే, కనీస వాడకానికీ కూడా లేక కటకటలాడుతున్నా రు. పెద్ద సంఖ్యలో వలస పోతున్నారు. లాతూర్ లాంటి చోట్ల ఆసుపత్రులలో డాక్టర్లు తగిన నీరు లేక సర్జరీలు నిలిపేశారు.
ఇలాంటి నేపధ్యంలో 60 లక్షల లీటర్ల నీళ్ళు తగలబెట్టి ఐపిఎల్ మ్యాచ్ లు నిర్వహించాలా అన్న ప్రశ్న కాస్త తిన్నగా ఆలోచించే ఎవరికైనా వస్తుంది. కానీ ఐపిఎల్ మిల్లులో ఉత్పత్తి అవుతున్న వందల కోట్ల డబ్బు రాశులకు అలవాటు పడిపోయిన బిసిసిఐ మారాజులకు ఆ ప్రశ్నే రాలేదు. రాకపోగా వితండ వాదనలు మొదలు పెట్టారు.
“ఐపిఎల్ మ్యాచ్ లు ఆపడం వల్ల మహారాష్ట్ర నీటి కరువు తీరుతుంది అంటే ఈ క్షణంలో ఆపేస్తాం. కానీ తీరదు కదా. మేం వాడే నీరు తాగడానికి ఉపయోగించేది కాదు. మునిసిపాలిటీకి డబ్బు కట్టి నీళ్ళు తెప్పిస్తున్నాం” అని ఐపిఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా చానెళ్లకు చెబుతున్నారు.
అసలు నీటి కరువు అంటూ ఏర్పడ్డాక తాగు నీరు, తాగలేని నీరు అన్న తేడాలతో నీరు మనగలుగుతుందా? తిండి లేనివాడు ఏ కాస్త తిండి దొరికినా చాలు అనుకుంటాడు గానీ బిర్యానీ తినాలని లక్ష్యంగా పెట్టుకుంటాడా?
ఈ రోజు వివిధ పట్టణాల్లో జనం తాగే నీళ్ళు, వాడుతున్న నీళ్ళు తాగగలిగినవీ, వాడగలిగినవీ అనేనా వీళ్ళు చెప్పదలిచింది? పట్టణాలకు వచ్చే నీరు మహా మురికి నీరు. ముఖ్యంగా వేసవి కాలాల్లో నానారకాల కాలుష్యాలను నింపుకుని వస్తాయి. వాటిని ట్రీట్ మెంట్ యంత్రాలతో సాధ్యమైనంత శుభ్రం చేసి పంపులకు వదులుతారు. అంతే తప్ప ఈ రోజుల్లో తాగు నీరు, తాగలేని నీరు అంటూ లేవు.
మహా ఉంటే ఉప్పు నీళ్ళు, సవ్వ నీళ్ళు, మంచి నీళ్ళు ఉంటాయంతే. ఉప్పు నీళ్ళు ఉప్పు తయారీకి తప్ప ఎందుకు పనికిరావు. ఇంట్లో వాడకానికి కూడా పనికిరావు. స్టేడియంలలో గ్రౌండ్ లకి అయితే అసలే పనికిరావు. అందమైన, పచ్చనైనా గడ్డితో మిలమిలలాడే స్టేడియం గ్రౌండ్ లకి ఉప్పు నీరు శత్రువు.
ముంబై, నాగపూర్ ల నుండి నీటిని మరాఠ్వాడాకు తరలించడం పైపుల ద్వారా (అందుకు తగిన పైపులు అర్జెంటుగా వేయలేము గనక) సాధ్యం కాకపోవచ్చు గానీ ట్యాంకర్లతో తరలించడం సాధ్యమే కదా. ఇప్పుడు ఐపిఎల్ మ్యాచ్ లకి వేలాది ట్యాంకర్లతోనే నీటిని తరలిస్తున్నారు. అవే ట్యాంకులను మరాఠ్వాడా గ్రామాలకు తరలించడం శుభ్రంగా సాధ్యమే.
బిసిసిఐ ప్రపంచం లోనే అత్యంత ధనికవంతమైన క్రికెట్ బోర్డు అని పేరు. అట్టాంటి బిసిసిఐ తలచుకుంటే గ్రామాలకు ఈ వేసవి సాగినన్నాళ్లు నీళ్ళ ట్యాంకర్లు తరలించడం పెద్ద లెక్కలోనిది కాదు.
“ఈ క్లిష్ట సమయంలో రాజకీయ పార్టీలన్నీ ఏకం కావాలి” అని రాజీవ్ శుక్లా నిన్న ఛానెళ్ల సాక్షిగా పిలుపు ఇచ్చాడు. అంటే ఏమిటి అర్ధం? రాజకీయ నాయకులు నిండా మునిగి ఉన్న ఐపిఎల్ వ్యవహారాల్లో కోర్టులు అనవసరంగా తల దూర్చుతున్నాయనీ, ఈ జోక్యాన్ని ఎదుర్కోవాలని, కోర్టుల చొరబాటును అడ్డుకోవాలని పిలుపు ఇస్తున్నారాయన!
నిన్న మొన్ననే బిసిసిఐ వ్యవహారాల్లో సుప్రీం కోర్టు తలదూర్చింది. జస్టిస్ లోధా కమిటీ సిఫారసులను అమలు చేయలేమని చెప్పిన బిసిసిఐ కి నిండా తలంటింది. దేశంలో క్రికెట్ అభివృద్ధికి బిసిసిఐ అసలు ఏమీ చేయలేదని తూర్పారబట్టింది. క్రికెట్ బోర్డుల్లో కూర్చుని ఉన్న మొఖాలు చూసి డబ్బులు పంచుతున్నారని ఆక్షేపించింది. క్రికెట్ అభివృద్ధికోసం బోర్డు కాకుండా ‘పరస్పరం సహకరించుకునే ఒక సొసైటీ’ని మాత్రమే నడుపుతున్నారని తప్పు పట్టింది. గుజరాత్ కి 66 కోట్లు ఇస్తూ ఈశాన్య రాష్ట్రాలకు 25 లక్షలే ఇవ్వడం ఏమిటని ప్రశ్నించింది.
ఈ రోజు ఐపిఎల్ వంతు వచ్చింది. ఇలాగే వదిలేస్తే కోర్టులు ఇంకా ఏం చేస్తాయో అని రాజీవ్ శుక్లాకు బెంగ పట్టుకుంది. రాజకీయ పార్టీలు తమ తమ రాజకీయాలకు అతీతంగా ఏకం కావాలని ఆయన పిలుపు ఇవ్వడం అందుకే.
ఇంతకీ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఏకం కావాలని పిలుపు ఇస్తున్న ఈ పెద్దాయన దేశ ద్రోహానికి, జాతీయ వ్యతిరేకతా నేరానికీ పాల్పడినట్లేనా?!