ఎల్ నినో కారణమో మరింకేం గాడిద కారణమో జనానికి అనవసరం. వారికి తెలిసింది వర్షాలు పడకపోవడమే. వర్షారాధార వ్యవసాయం సాగకపోవడమే.
భారత దేశంలో వ్యవసాయం సాగకపోతే 75 శాతం జనం ప్రభావితులవుతారు. వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేసినట్లుగా ఖరీఫ్ వానలు (నైరుతి ఋతుపవనాలు) శీతకన్ను వేయడంతో అనేక రాష్ట్రాలు దుర్భిక్షంతో సతమతం అవుతున్నాయి. అందులో తెలుగు రాష్ట్రాలు రెండూ ఉన్నాయి.
గొప్పకు పోయి, హిందూత్వ స్ఫూర్తితో మన రాష్ట్రాల పాలకులు నదీ జలాలని పుష్కర మాతకు సమర్పించుకున్నారు. ఒకరినొకరు పోటీలు పడి ఆర్భాటంగా పుష్కరాలు జరిపి నీళ్లని కాజేశారు. ఇప్పుడు పంటలకి, ఇళ్ల వాడకానికీ లేక జనాన్ని పస్తు పెట్టారు.
కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు కరువు పరిస్ధితి పట్ల నిమ్మకు నీరెత్తినట్లే ఉన్నాయి. కేంద్ర పాలకులు విదేశీ పర్యటనలతో సరి పెడుతూ జనం సంగతి గాలికి వదిలేశారు. కరువు ప్రాంతాల కోసమైనా విడుదల చేయాల్సిన ఉపాధి హామీ నిధులు కూడా విడుదల చేయడం లేదు.
36 వేల కోట్లు ఉపాధి హామీ పధకం కోసం కేటాయించినట్లు గత యేడు బడ్జెట్ లో ఆర్భాటంగా ప్రకటించుకున్న మోడి ప్రభుత్వం వాస్తవం 3 వేల కోట్లు మాత్రమే విడుదల చేసిందని ఈ రోజు ఈనాడు వార్త ద్వారా తెలుస్తున్నది. ఆ వార్త మీరూ చూడండి!
[బొమ్మపై క్లిక్ చేస్తే పెద్ద సైజులో చూడవచ్చు.]
అదీ సంగతి! మోడి-జైట్లీ ప్రభుత్వం ప్రకటించే కేటాయింపులు జనాన్ని చేరతాయన్న గ్యారంటీ లేనే లేదు. జనంలో అసంతృప్తి ఏర్పడక ఏం చేస్తుంది మరి! ఆ అసంతృప్తిని మళ్లించేందుకే భారత మాత, హిందూ జాతీయత తదితర వివాదాలను ఆశ్రయిస్తున్నారు.
ఈ సంగతి హిందూత్వ శ్రేణులకు పట్టదా అని ప్రశ్నించడం న్యాయమే కదా.
30 కోట్ల మందికి కాకపోయినా 3 కోట్ల మందికి ఉపాధిహామీ పథకాన్ని 100 రోజులకు కాకపోయినా 46 రోజులకే వర్తింప జేసినా ఖర్చుం ఎంత అవుతుంది? 3వేల కోట్ల రూపాయలే విడుదల చేస్తే ఎలా సరిపోయాయో అర్థం కావడం లేదు.